Featured కాలమ్స్

అంబేడ్కరిజమే బహుజన సాహిత్య దృక్పథం

-జి. లక్ష్మి నరసయ్య

బహుజన సాహిత్యానికి తాత్విక దృక్పథం అంబేడ్కరిజం బహుజన వాదానికి మార్క్సిజం, గాంధీయిజంలతో ఏమాత్రం సంబంధం లేదు. బుద్ధ, ఫూలే, పెరియార్‌ అంబేడ్కర్‌ల ఆచరణ – సిద్ధాంతాల వెలుగులో రూపొందిన తాత్వికతే దీనికి పునాది. అభ్యుదయ సాహిత్యం, విప్లవ సాహిత్యంలతో పోలిస్తే బహుజన సాహిత్యం మౌలికంగా భిన్నమయింది. అభ్యుదయ విప్లవ సాహిత్యాలు వర్గపోరాటాల నుంచీ, వాటిని నడిపే మార్క్సిస్టు సిద్ధాంతాల నుంచీ పుట్టుకొస్తే, బహుజన సాహిత్యం కుల నిర్మూలన పోరాటాల నుంచి వాటిని నడిపే అంబేడ్కరిస్టు దృక్పథం నుంచీ రూపొందింది. భారతదేశంలో తొలినాళ్లనుంచీ కులవ్యవస్థతో పీడిత కులాలు జరుపుతూ వస్తోన్న తాత్విక సామాజిక పోరాటాల ఊపిరిగా బహుజన సాహిత్యం ఉద్భవించింది.

‘ధనమేరా అన్నిటికీ మూలం’ అనే అభ్యుదయ, విప్లవ సాహిత్యాల అవగాహనను బహుజన సాహిత్యవాదం తప్పు పడుతుంది. భారతదేశంలో అన్ని సమస్యలకూ కులమే మూలంగా వేళ్లూనుకుని ఉన్నదని, ధనాన్నీ దాని తాలూకూ అసమానత్వ అన్యాయ రాజకీయాలు కూడా నడిపేది ఇక్కడి కులసంబంధాలేనని బహుజన సాహిత్యం స్పష్టం చేస్తుంది. సంపద, అధికారం, గౌరవం, స్వేచ్ఛా, చట్టం, రాజకీయాలూ, పౌరనీతి, విలువలూ అన్నీ కులాల హోదాల ప్రకారం మనుషులకు అంటగట్టిన కారణంగా అగ్రకులాలు అన్ని రంగాలలోనూ ఆధిపత్యాన్ని కలిగివుండే పరిస్థితి, కింది కులాలు అన్నిటికీ ఆధారపడే దుస్థితి వచ్చిందని చెప్పే అంబేడ్కరిస్టు చూపే బహుజన సాహిత్య దృక్పథం. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలూ, మైనారిటీలు కుల వ్యవస్థ కారణంగా అన్ని రకాల దోపిడీకి గురవుతూ ఆత్మగౌరవానికీ మానవ దర్పానికీ నోచుకోని జీవితాన్ని గడుపుతున్న వాస్తవాన్ని ఈ సాహిత్యం చిత్రిస్తుంది. నువ్వు ఏ దారిలో నడిచినా, ఆ దారికి అడ్డుగా నిలిచే కులసర్పాన్ని కూల్చకుండా అభివృద్దీ, విముక్తీ లేదని పలికిన అంబేడ్కర్‌ బోధనని ప్రాణప్రద ఆలోచనగా బహుజన సాహిత్యం స్వీకరిస్తుంది. కులం కొంతమందికి తరగని పెట్టుబడిగా, పెరిగే దిగుబడిగా, అధిక సంఖ్యాకులకు దరిద్ర సాధనంగా, వంగినంగిగా బతకాల్సిన దైన్యంగా పరిణమించడంలోని మతలబునీ, మిస్టరీని బహుజన సాహిత్యం అధ్యయనం చేస్తుంది. ముసుగులో జరిగే మోసాన్ని ఛేదిస్తుంది.

ఈ దేశమూ, దాని సంపదా శ్రామికులదని మార్క్సిస్టు సాహిత్యం అంటుంటే, – కాదు బహుజనలదని బహుజన సాహిత్యం స్పష్టం చేస్తుంది. ఇక్కడ శ్రామికులంతా బహుజనులేనని, ఉత్పతులను సృష్టించే పీడిత కులాలే దేశానికి పునాది అని ఈ సాహిత్యం వాదిస్తుంది. కొద్దిసంఖ్యలో ఉన్న అగ్రకుల శ్రామికులు సాటి బహుజన కులాల శ్రామికులను వివక్షతో చూస్తూ హిందూ అహంకారంతో అణిచివేత ధోరణితో వ్యవహరించే వాస్తవాన్ని బహుజన రచయితలు ఎత్తి చూపుతారు. ‘కులానికి పేదకాదు’ అనే వాళ్ల అహాన్ని ఎండగడతారు.

భారత చరిత్రలో కులవ్యవస్థ మీద తిరగబడిన బుద్ధిజాన్నీ, చార్వాకాన్నీ, లోకాయతాన్నీ, భక్తివాద కవిత్వాన్నీ సొంతం చేసుకుని – తమ సాహిత్య మూలాల్ని ఆ ఉద్యమాలకు చెందినవిగా ప్రకటిస్తారు బహుజన సాహితీవేత్తలు. ఆ తరువాత ఫూలే, లోకాండే, పెరియార్‌, నారాయణ గురు, అంబేడ్కర్‌, కాన్షీరామ్‌లు చేసిన పీడితకుల ఉద్యమాలనీ, అభివృద్ధి చేసిన ఆలోచనల సమాహారాన్ని బహుజనవాదంగా గుర్తించి, ఆ దృష్టినుంచి సాహిత్యాన్ని సృష్టిస్తారు.

ముందే చెప్పుకున్నట్టు బహుజన సాహిత్యంకు దానికి స్ఫూర్తినిచ్చే బహుజన వాదానికీ అంబేడ్కరిజం తాత్విక పునాది. అంబేడ్కరిజం, కులవ్యవస్థనుంచీ, అది నెరపే  అన్నిరకాల దోపిడీలనుంచీ, అమానవ ఆత్మగౌరవ లేమినుంచీ బహుజనులను విముక్తి చేసే శాస్త్రం, శస్త్రం. తనకంటే ముందునుంచీ తనదాకా నడుస్తూ వచ్చిన పీడితకుల పోరాటాల, సిద్ధాంతాల సారాన్ని బహుజన విమోచన శాస్త్రంగా అభివృద్ధి చేసి దానిని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లింది బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ కనుక ఆయన పేరుతో ఈ మొత్తం క్రమాన్నీ, అధ్యయన పద్ధతినీ అంబేడ్కరిజం అని పిలుచుకుంటున్నాం.

అంబేడ్కరిజంలో బహుజన విమోచనకు రెండు దారులున్నాయి. ఒకటి మానసిక విమోచన, రెండు రాజకీయ విమోచన. హిందూ మానసికత నుంచీ దాన్ని కాపాడే ధర్మశాస్త్రాలు, పురాణాలూ, స్మృతులూ, వేదాలూ బోధించిన కుల విలువల్నుంచీ పీడితకులాల మనసుల్ని – అగ్ర కులాల మనసుల్ని కూడా – విముక్తి చేయడమే మానసిక విమోచన. పీడిత కులస్తుల్ని తక్కువ తరహా మనుషులుగా, బానిసలుగా, అసంపూర్ణ మానవులుగా చిత్రించే హిందూవాద సంస్కృతి సకల రూపాలనుంచీ బయటపడటానికి బుద్ధిజాన్ని స్వీకరించడాన్నే మార్గంగా అంబేడ్కర్‌ బోధించాడు. ఆయన తన అనుచరులతో కలిసి బుద్ధిజాన్ని స్వీకరించాడు. పీడిత కులస్తులు రాజ్యాధికారానికి రావడం ద్వారా రాజకీయ విముక్తి లభిస్తుందనీ తద్వారా కులవ్యవస్థను కుల నిర్మూలన దిశ వైపు అంచెలంచెలుగా నడిపించుకునే క్రమ పరిణామానికి అవకాశం ఉంటుందని ఆయన నొక్కిచెప్పాడు. “Political power is the key for social progress” అని ఎలుగెత్తి చాటాడు. ఈ క్రమంలో ఆయన మూడు రాజకీయ పార్టీలను నిర్మించాడు.

మానసిక, రాజకీయ విమోచన ఉద్యమాలను రెండింటినీ పక్కపక్కనే నడుపుతూ తన ఆచరణను కొనసాగించాడు అంబేడ్కర్‌. ఆయన చివరిదశలో బుద్ధిజంలోకి పరివర్తన చెందడం, రిపబ్లికన్‌ పార్టీ ఆఫ్‌ ఇండియాను స్థాపించడం చూస్తాం. ఆయన తరువాత మళ్లీ కాన్షీరామ్‌ సీన్‌లోకి వచ్చేంతవరకూ బహుజన ఉద్యమం అరకొరగానే జరిగింది. మధ్యలో వచ్చిన దళిత పాంథర్స్‌ మళ్లీ మార్క్సిజాన్ని పీడితకుల విముక్తి ఎజెండాలోకి తెచ్చి గందరగోళం సృష్టించారు. అంబేడ్కరిజంలోని రాజకీయ విమోచనను ముందుకు తీసుకెళ్లడం ద్వారా మానసిక విమోచననూ సాధించవచ్చని కాన్షీరాం బోధించాడు. రాజకీయ అధికారం పొందడం ద్వారా పీడిత కులాలు సాంఘిక హోదానీ, గౌరవాన్నీ పొందవచ్చని ఆయన స్పష్టం చేశాడు. ఈ క్రమంలో సామాజిక న్యాయాన్ని, సామాజిక నిర్మాణాన్ని, ‘సమాతా ములుక్‌’నూ ఏర్పాటు చేయవచ్చని చెప్పడమే కాకుండా ‘ఓట్లు మావీ సీట్లు మీవా?’ అనే రాజకీయ నినాదాన్ని బహుజనులకు ఆయుధంగా ఇచ్చాడు. ఆమేరకు ఉత్తరప్రదేశ్‌లో బహుజన రాజ్యాధికారాన్ని సాధించాడు.

బహుజన సాహిత్యకారులు పీడిత కులాల మానసిక, రాజకీయ విమోచన దృష్టినుంచి సాహిత్యాన్ని సృష్టించారు. తెలుగు బహుజన రచయితలు తమ కవిత్వం ద్వారా, కథల ద్వారా, నవలల ద్వారా పీడిత కుల జనం కులవ్యవస్థకు అనేక రకాలుగా బలవుతున్న తీరుతెన్నులను రాసి ఊరుకోలేదు. మానసిక, రాజకీయ విమోచన పోరాటాల ద్వారానే స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం విలువలు పునాదిగా కలిగిన ప్రజాస్వామ్య వ్యవస్థని పొందగలుగుతారని ఈ రచయితలు స్పష్టం చేశారు.

హిందూవాద సంస్కృతిని అన్ని వైపులనుంచీ దాడి చేశారు. హిందూ దేవుళ్లనీ, దేవతల్నీ పీడనకూ, దోపిడీకి నిదర్శనాలుగా చూపారు. రాక్షసులు తొలితరం బహుజన పోరాట యోధులని స్పష్టం చేశారు. విష్ణు, రాముడు, కృష్ణుడు, బ్రహ్మ, ఇంద్రుడు మొదలగు దేవతల క్రూరత్వాన్ని, విచ్చలవిడితనాన్ని, విలువల రాహిత్యాన్ని ఎండగట్టారు. చాతుర్‌ వర్ణ వ్యవస్థను – దానివెనుక ఉన్న కథనూ చీల్చి చెండాడారు.

”పంచముడి పంచకంలో తప్పని సరై / పంచభూతాలూ పవిత్రస్నానం చేస్తున్నాయి / నుదుటిమీద గీత దాటి / మేం కూతకొస్తున్నాం / ఇప్పుడు పుట్టుకొస్తున్నవి / బ్రహ్మ మొహంలోంచి పాదాలు” బ్రహ్మపాదాలనుంచి కింది కులస్తులు పుట్టారని హిందూ వేదాలు చెప్పిన అబద్దాన్ని తిప్పికొడుతూ అసలు బ్రహ్మ మొహంలోనుంచే పాదాలు పుట్టుకొస్తున్నాయంటున్నాడు బహుజన కవి.

”దేవుడు ఒక కులానికో మతానికో / సంకేతమయినప్పుడు / నిజానికి – దేవుడికి మించిన హంతకుడే లేదు” అని మరో కవి అంటున్నాడు. ”రామా నువ్వు నా దేవుడికి కాదు” అని ప్రకటించడంలో మొత్తం హిందూవాదాన్నే తిప్పి కొట్టడం ఉంది.

ఇదే క్రమంలో రావణుడు, నరకాసురుడు, బలి, హిరణ్యకశిపుడు లాంటి పురాణ పాత్రలు బహుజనుల సృజనలో అజరామర హీరోలయ్యారు. ”ఏకలవ్యుడు దేవుళ్లకు కాకుండా / తల్లికే పుట్టాడు” అని పాండవుల పుట్టుకల్ని ఎండగట్టారు. రుషులూ, భక్తులు, వేదాలూ నిర్వర్తించిన సామాజిక అన్యాయాల్ని, బహుజన హననాన్ని వ్యక్తీకరించారు.

”వశిస్టుడి వంటిమీద ఇబూది గీతల్లా / సారలసారల పులులుంటాయి గదా / వేద మంత్రోచ్ఛాటనల్లా / సింహగర్జనలుంటాయి గదా / రసకందాన బడ్డ భక్తుల జేజేల్లా / గడిగడికీ హైనాలు మాటేసి ఉంటాయి కదా” అంటూ హిందూ పవిత్ర ప్రతిమల్ని, ప్రతీకల్ని చెడుకూ, క్రూరత్వానికీ సంకేతాలుగా చూపారు. ”భగవద్గీత కంటే కల్లుగీత మేలు” అని ప్రకటించారు. ”పవిత్ర గ్రంథాల మీదా, పాతివ్రత్య హర్మ్యాల మీదా / వీర్యస్ఖలనం చేసిపోదాం” అంటూ హిందూవాద సారాన్ని జుగుప్సతో దాడిచేశారు బహుజన రచయితలు.

ఇదేస్థాయిలో రాజ్యాధికార భావనని కూడా బహుజన సాహిత్యం వ్యక్తం చేసింది. కాన్షీరాం కులానికి రెండు అంచులున్నాయనీ అగ్రకులాలకు అధికారాన్నీ, పెత్తనాన్ని ఇచ్చిన కులవ్యవస్థే ఎన్నికల విధానం ద్వారా వారి ముడ్డికింద పీటల్ని లాగేస్తుందని చెప్పాడు. ఎనభై అయిదు శాతంగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు కలిసి రాజకీయ శక్తిగా ఏర్పడితే అనాథలు అధికారులయ్యే అవకాశం ఉందని స్పష్టం చేశాడు. బహుజన సాహిత్యవేత్తల్లో ఈ స్ఫూర్తి కనిపిస్తుంది. ప్రధానస్రవంతి రాజకీయాలుగా పిలవబడుతున్నవన్నీ అగ్రకుల రాజకీయాలేనని స్పష్టం చేస్తూ ఒక కవి ”రాచరిక కాలపు ఉచ్చల రొచ్చుల్లో / తడిసిన ఈ జండాల్నిండా / ఆర్య ముఖాలు” అంటాడు. ”ఎవడెవడి జండాగుడ్డలో / ఊరిమీద రాబందుల్లా ఎగురుతూ / ఒంటిమీద బుడ్డగోచీల్ని కూడా / తన్నుకెలుతున్నాయి” అంటాడు మరో కవి.

”ఇన్నాళ్లూ పవిత్రగ్రంథాల / ఇనుప జాడీల్లో / మీరు భద్రంగా దాచిన బహుజన ప్రభంజనం / వస్తుంది కాచుకోండి” అని ప్రకటించడం ద్వారా నేరుగా బహుజన రాజకీయ ఉద్యమాన్ని వ్యక్తం చెయ్యడమే. అధిక సంఖ్యాకులయిన బహుజనుల ధాటికి తక్కువమంది అయిన అగ్రకులాలు కకావికలమవుతారని రాస్తూ ”మట్టి మధించిన ఛండాలుల అరుపులకు / సంకెతక్కువ అగ్రకులమోల్లు / గద్దె దిగాలిప్పుడు” అనే నినాదం అగ్రకులాల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే స్థాయిలో ఉంది. బహుజన రాజ్యం వైపు దారి చూపిస్తూ, ”నల్లరాజ్యం వేపు / నా ప్రయాణం” అంటాడు మరో కవి. ముస్లిం మైనారిటీలు గొంతు కలిపి తాము మెజారిటీలో భాగమై రాజ్యాధికారం వైపు నడుస్తున్నామని ప్రకటించారు. ”ఇన్నాళ్లూ నన్ను గాయపరిచిన వేదాల సాక్షిగా / చరిత్ర సాక్షిగా / ఇకపై నేను మెజారిటీనని ప్రకటిస్తున్నాను / నేను మతానికి సాయిబునయినా / కులానికి దళితున్నని నిర్ధారిస్తున్నాను / Now I am marching to Delhi” ఆవు రాజకీయాల్ని తెరమీదికి తెచ్చిన హిందూవాదాన్ని దునుమాడుతూ ”బీఫ్‌ ఈజ్‌ ది సీక్రెట్‌ ఆఫ్‌ మై ఎనర్జీ అండ్‌ అవర్‌ ఎనర్జీ” అని ప్రకటించడంలోనూ బహుజన రాజకీయాలున్నాయి.

ఈ రకంగా బహుజన విమోచనను మానసిక, రాజకీయ మార్గాలనుంచి వ్యక్తం చేసిన బహుజన సాహిత్యం శిల్పపరంగా కూడా సాహిత్యంలో ఒక విప్లవం తీసుకొచ్చింది. తనదయిన భాషనీ, ప్రతిమల్నీ, ప్రతీకల్నీ, పురాణాల్నీ, మూర్తిమత్వాన్నీ నెలకొల్పింది. బహుజన కులవృత్తుల వాతావరణానికీ, పనిముట్లకీ, పదజాలానికీ పెద్దపీట వేసింది. రోజువారీ బహుజన నుడికారానికి సాహిత్య గౌరవాన్ని ఇచ్చింది. అగ్రకులాలు సృష్టించిన సాహిత్యాన్ని, దాని శిల్పాన్నీ నిరాకరించి తనదయిన అడుగు కులాల పాదముద్రల్తో సాహిత్యాన్ని అలికివేసింది బహుజన సాహిత్యం. వందల కవితా సంకలనాలూ, పాటల పుస్తకాలూ, కథలూ, నవలలూ, ఆత్మ చరిత్రలూ – అన్ని సాహిత్య ప్రక్రియల నుంచీ బహుజన వాదాన్ని సాహితీకరించింది. సాహిత్యాన్ని నిర్మించే కళా, సాంకేతిక నిర్మాణ పద్ధతుల్ని కూడా బహుజన సంస్కృతి నుంచి అభివృద్ధి చేసింది. బహుజన సంగీతం, వాద్య పరికరాలూ, పని స్థలాల్లో, పొలాల్లో బహుజనులు పాడుకునే పాటలూ, సామెతలూ, పుల్లవిరుపు మాటలూ, సరసాలూ, పండగలూ, పబ్బాలూ – సకల బహుజనత్వాన్నీ సాహిత్యంలోకి పట్టుకొచ్చింది బహుజన సాహిత్యం. ఇలా వస్తువులోనూ, శిల్పంలోనూ అంబేడ్కరిస్టు సారాన్ని ఇది చూపింది.

One thought on “అంబేడ్కరిజమే బహుజన సాహిత్య దృక్పథం

  1. అగ్ర కుల సాహిత్యాధిపత్యాన్ని తుత్తునియలు జేసేందుకు పనిముట్లకు సాన బెట్టి ఇచ్చిండ్రు. సంతోషం. ఫూలే ‘గులాం గిరి ‘, అంబేద్కర్ ‘కుల నిర్ములాన” పుస్తకాలు సాహిత్య విమర్షకు పునాదులుగా తీర్చిదిద్ది, ప్రచారం చేయాల్సిని అవసరం ఉన్నది. దానికి ఇలాంటి వ్యాసాలు కచ్చితంగా ఉపయోగ పడతాయి. మంచి వ్యాసం అందించారు. థాంక్ యూ సర్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


   Type Comments in Indian languages (Press Ctrl+g to toggle between English and Hindi OR just Click on the letter)