Featured కాలమ్స్

అంబేద్కర్ ఆలోచనలకు అద్దం పట్టిన నవల ‘జెగ్గని యిద్దె ‘

                                                                                                                          వ్వాళ భాష, విద్య, కులం , మతం కేంద్రంగా అకడెమిక్‌ సర్కిల్స్‌లోనూ, మీడియాలోనూ ఎడతెరిపి లేకుండా చర్చులు జరుగుతున్నయి. అక్కడక్కడా రచ్చ గూడా అయితున్నది. ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్‌ వరకు తెలుగును బోధనాభాషగా చేస్తామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. వచ్చే ప్రపంచ తెలుగు మహాసభల్లో దానికి సంబంధించిన విధాన పరమైన ప్రకటన కూడా చేస్తారని చెబుతున్నారు. అయితే తెలంగాణ కల సాకారమై మూడున్నరేండ్లు కావొస్తున్న కోస్తాకు చెందిన ‘రెండున్నర జిల్లాల రెండున్నర కులాల’ తెలుగే ఇంకా రాజ్యమేలుతోంది. పాఠ్యపుస్తకాల్లోనూ, ప్రభుత్వ రాత కోతల్లోనూ ఈ భాషదే ఆధిపత్యంగా ఉన్నది.  సినిమాల్లోనూ, టీవీల్లోనూ అక్కడక్కడా తెలంగాణ భాష తళుక్కుమని మెరుస్తుంది. ప్రజాదరణ పొందుతుంది. అయినప్పటికీ ప్రభుత్వం, దాని విధాన నిర్ణేతలు మాత్రం ‘తెంగాణ భాష’ను స్వీకరించడానికి ప్రజలు సన్నద్ధంగా లేరనే సాకులు లీకుల ద్వారా చెబుతున్నరు

భాష భ్రష్టుపడుతున్నట్లే విద్య కూడా అదే దారిలో ఉన్నది. విద్యార్థులు ఇష్టపడి సదువుకునేట్టు కాకుండా కష్టపడి చదువుకునే దుస్థితి నెలకొన్నది. కార్పో‘రేట్‌’ రేటింగ్‌ విద్యకు పిల్లలు బలవుతున్నరు. ఈ చదువు మాకొద్దంటూ బలవన్మరణాలకు పాల్పడుతున్నరు.  మార్కుల గొంతు కోత పోటీల్లో అసువులు బాస్తున్నరు. అయినప్పటికీ ఆశావహ దారులు అక్కడక్కడ కనబడుతున్నాయి. అట్టడుగు వర్ణాల వారందరికీ విద్య అదీ నాణ్యమైన ఆంగ్ల విద్య అందాలనీ ఒకవైపు కంచె ఐలయ్య మరోవైపు ‘స్వెరోస్‌’ ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌లు తమ బాధ్యతగా ప్రచారం చేస్తున్నారు. విధులు నిర్వహిస్తున్నారు. ఇక్కడే ఇంకో తేడా కూడా గమనించాలి. కార్పోరేట్‌ కాలేజీల్లో ఆధిపత్యకులాల వాండ్లు మెజారిటీగా ఉంటే సోషల్‌ వెల్ఫేర్‌ పాఠశాలలు, కాలేజీల్లో విద్యార్థులంరూ కింది కులాల వాళ్ళు కావడం విశేషం. ఇంకొంచెం ముందుకుపోయి విశ్లేషించుకుంటే కార్పోరేట్‌ విద్య బ్రాహ్మణీయ, గాంధేయ విలువలతో నడుస్తూ ఉన్నది. అందుకే సంస్కృతం ఈ కళాశాలల్లో పరిఢవిల్లుతున్నది. తద్వారా అది బోధించే బ్రాహ్మణ సామాజిక వర్గానికి ఉద్యోగాలు దొరుకుతున్నాయి. అదే సాంఘిక సంక్షేమ పాఠశాలల్లో విద్య అంబేద్కర్‌ ఆలోచనా, దృక్పథంతో నడుస్తున్నది. అయితే ఇవేవి ఈనాడు తెలుగు సాహిత్యంలో కథలుగా, నవలలుగా రికార్డు కావడం లేదు. ఏ జీవితమైనా సాహిత్యంలో రికార్డయితేనే దానికి శాశ్వతత్వం వస్తుంది. అట్లా తెలుగు సాహిత్యంలో శాశ్వత స్థానం దక్కించుకున్న దళిత నవల ‘జెగ్గని యిద్దె’.

ఎన్నో విధాలుగా నూతన పోకడలకు దారులు వేసిన నవల ‘జెగ్గని యిద్దె’. గాంధేయ భావజాలంతో అంబేద్కర్‌ ఆలోచనలను అమల్లోకి తీసుకొచ్చిన నవల ఇది. దీని రచయిత ఒక చేనేత కార్మిక కుటుంబంలో పుట్టిన ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు. ఆయనే లోక మహరి. ఈ నవలో హీరో ఒక మాల కులస్తుడు. పేరు జెగ్గడు. తర్వాత జగదీష్‌గా మారిండు. 11 యేండ్ల వయసులో ఊర్లో దొర ‘గోజలు’ కాసుకుంటున్న జెగ్గడు అందరూ చదువుకోవాలె అనే చాటింపు వింటడు. దాంతో చదువుపై ఆసక్తిని పెంచుకొని తల్లిదండ్రులను బవంతంగానైనా ఒప్పించి బడిబాట పడుతాడు.

మొదట ‘కిరస్తాని’ పంతులు దగ్గర చదువుకోవడానికి ప్రయత్నించినా చివరికి ప్రభుత్వ బడికి పోతాడు. అక్కడ కొత్తగా వచ్చిన ప్రధానోపాధ్యాయులు పురుషోత్తమాచార్యులనే బ్రాహ్మణ గాంధేయవాది తోడ్పాటుతో ఉన్నత విద్యలు అభ్యసిస్తాడు. చివరికి సికింద్రాబాద్‌లో ఎం.ఎ, ఎల్‌ఎల్‌బీ చదివి కులాంతర వివాహం చేసుకొని తనలాగా విద్యకు దూరమైన వారి అభ్యున్నతికి పాటుపడతాడు.

అయితే ఈ నవలలో జెగ్గడు కాస్త జగదీష్‌గా మారే వరకు రచయితే చెప్పుకొన్నట్లుగా ‘పచ్చి పల్లెటూరి భాష’ అంటే నికార్సయిన నిజామాబాద్‌ భాషను వాడినాడు. తర్వాత నవలా నాయకుడు జగదీష్‌గా మారిన తర్వాత పుస్తక భాషలో రాసిండు. అంటే సగం భాష నిజామాబాద్‌ `తెంగాణ భాషలో, మిగతాది పత్రికాభాషలో / పుస్తక భాషలో రాసినాడు. ఈ నవలలోని భాష, నుడికారాలు పక్కా మాస్‌ తెంగాణ భాషలో ఉన్నాయి.

ఈ నవలలోని చాలా పదాలు నిఘంటువులోకి ఎక్కలేదని రచయిత తన ‘తొలిపలుకు’లో చెప్పుకున్నాడు. అంబట్లాల, గోజలు, బట్టాబాతా, పిస్స, కాల్మొక్త, నాల్గొద్దులు, ‘పంది కొక్కు తన కిందికే తోడుకున్నట్లు’, ‘సంతానానికి మొదటి గురువే స్త్రీ’, ‘న్యాల్క బుగోరుతుంది’, ‘చేసిన రెక్కలు శాగబార్తయి, చెయ్యనియి బూజుపడ్తయి’, ‘బక్కల్ను కడుపు నిండా మేపుకరా’, ‘ఒగన్ని జంపితెగాని ఐద్గుడు గాడట’, ‘తగువు జెప్పు మారాజంటే తల్లీ పిల్ల నాదేనన్నడట’, ‘మేమెంత? తొడిగితె కాలుకు, ఇడిస్తె పంచకు’ ఇట్లా అనేక పదాలు, సామెతలను ఈ నవల నిండా జోడించి దానికి నిండుతనాన్ని తీసుకొచ్చిండు.                                                                                                                                                                                                                                                ఈ నవల  తెలంగాణ నుంచి సంస్కరణ భావాలతో రాసిన నవలల్లో అగ్రగామి. ఆంధ్రలో ఉన్నవ క్ష్మినారాయణ ‘మాలపల్లి’ రాస్తే అది జాతీయ స్థాయిలోనూ గుర్తింపు పొందింది. ఆ నవలకు ఏమాత్రం తీసిపోని విధంగా 70 పేజీల్లో ఒక తెలంగాణ దళితుణ్ణి తొలిసారిగా నాయకునిగా నిలబెట్టిన నవల. తెలంగాణలో కేవలం ఏడెనిమిది శాతం అక్షరాస్యులున్న కాలంలో దళితులు కూడా చదువుకోవాలనే తపనతో, వారికీ ఉన్నత/ఆనందమైన జీవితం అందుబాటులోకి రావాలని కల గన్నాడు.

రచయితది గాంధేయవాద దృక్పథమే అయినప్పటికీ అంబేద్కర్‌ ఆలోచనను నవలలో నిక్షిప్తం చేసిండు. గాంధేయవాద దృక్పథం ఎందుకన్నానంటే ‘జెగ్గడి’కి చదువు చెప్పించి, జగదీష్‌గా మార్చింది సంస్కరణ భావాలు గల బ్రాహ్మణ కుటుంబం నుంచి వచ్చిన పురుషోత్తమాచార్యు. ‘జెగ్గడి’ని తన ఇంట్లోనే ఉంచుకొని విద్యాబుద్ధులు చెప్పిస్తాడు. పురుషోత్తమాచార్యు కేవలం 25 యేండ్ల వయసులోనే ఈ సంస్కరణకు పూనుకున్నాడు. దీనికి ఆయన భార్య కూడా సహకరిస్తుంది. నిజానికి ఇలా ఒక మాల పిల్లవాణ్ణి ఇంట్లో ఉంచుకొని చదివిస్తున్నందుకే కొంతమంది కుట్రపన్ని ఆయణ్ణి ఆ ఊరి నుంచి తబాదలా చేయిస్తారు. బదిలీపై వెళుతున్న ప్రధానోపాధ్యాయుడు పురుషోత్తమాచార్యు తన వీడుకోలు సభలో మాట్లాడిన మాటల ద్వారా లోక మహరి తన గాంధేయవాద దృక్పథాన్ని వివరించిండు.

అందులో ఇలా ఉన్నది. ‘‘మానవులందరొకే జాతికి జెందినవారైనా ఉదరపోషణకు అనేక వృత్తులవంభిస్తారు. అంతమాత్రాన జాతులెట్లు వేరగును? దేశం వృద్ధిగావాలంటే జాతుల  గ్లంతులు విడిచిపెట్టి. ఐక్యపడాలి. అంతటి విద్యావంతుడు, వ్రత నిష్టాగరిష్ఠుడు, భారతీయుడు నైన మన గాంధీ మహాత్ముడు అనేక దేశాలు దిరిగి, ఆ దేశా అభివృద్ధికి కారణం, ఐకమత్యం, జాతి మతభేద రహితం, ఉన్న విద్యయే యని దెలిసికొని మన దేశాభివృద్ధి నవరోధిస్తున్న ఈ భేద భావాల్ని దొలగించ దీక్షా కంకణ బద్ధుడై, పలుపాట్లు పడి. అనేక మారులు చెరసాలా సుఖమనుభవించి, విదేశాల వారి చేతిలో జిక్కుపడియున్న మన మాతృభూమికి ‘‘అహింస’’ యను సాధనచే విమోచన మిప్పించినాడు. మాల  మాదిగలకు ‘‘హరిజను’’లను ముద్దు పేరిడి, వారి అభివృద్ధికై పలు పాట్లనుభవించి, వారి పల్లె యందే తన నిరాడంబర కుటీరాన్నేర్పరచుకొని యా ‘అహింస’ యను చక్కని మంత్రాన్ని భారతీయుందరకుపదేశించి మన కొరకై తన ప్రాణాల్ని సైతం దారబోసిన యా అమరజీవి, మార్గదర్శియునైన ‘బాపూజీ’ యాదేశాన్నప్పుడే మరచినారా? అట్లయిన వారి యాత్మ శాంతిని బొందుతాదా? ‘‘మానవ సేవయే మాధవ సేవ’’ యను నీతిని మరువరాదు. ఇప్పుడు శిశు విద్యకన్న వయోజన విద్యయే ముఖ్యం అందుకై మీరు మీ శక్తి కొలది విద్యావ్యాప్తికై పాటుబడండి. కేవలం ప్రభుత్వం పైనే ఆధారపడక పాఠశాలాభివృద్ధికై పాటు బడండి. వయోజన పాఠశాలను గూడా ఏర్పరచి బీద విద్యార్థుకు పలుకలు, పుస్తకాలు ఇప్పించి ప్రోత్సాహపరచండి. మీరందరైక్యంగా మీ గ్రామాన్ని మాత్రం అభివృద్ధి పరచండి. దేశ సౌభాగ్యమనే తటాకానికి గ్రామాలే సెలయేళ్ళు. ఈశ్వరుడు మీ సంకల్పాన్ని నెరవేర్యుగాక ‘‘జై హింద్‌’’ అని తన ప్రసంగాన్ని ముగిస్తాడు.

ఈ నవల రాసేనాటికి గాంధి చనిపోయి ఐదారేండ్లు మాత్రమే అయ్యింది. దాంతో ఆయన ప్రభావం ఆనాటి సమాజంపై ఇంకా తాజాగానే ఉండిరదని చెప్పవచ్చు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయమేంటంటే గాంధి అంతగా ప్రచారంలో పెట్టని విద్య ద్వారా దళితుల్లో చైతన్యం తీసుకురావడానికి రచయిత పూనుకున్నాడు. అంతేగాక నవలలో బీడీలు తాగడానికి వ్యతిరేకంగా పెద్ద లెక్చర్‌ ఇస్తాడు. దాని వల్ల ప్రజలు ఎట్లా అనారోగ్యం పాలవుతున్నారో జెప్పడమే గాకుండా, వయోజన విద్య, గ్రంథాలయోద్యమం, పత్రికలు తదితర సాంస్కృతిక అభ్యుదయ విషయాలను కూడా నవలాకారుడు ప్రజల్లో చైతన్యం కలిగించే విధంగా చెప్పిండు. దయ్యాలు, భూతాలు అంతా ఉత్తదే అనే విషయాన్ని కూడా అర్థమయ్యేటట్టు జెప్పిండు.                                                                                                                                                                                                                                                అంబేద్కర్‌ బతికున్న కాలంలోనే ఆయన ప్రచారం చేసిన కులాంతర వివాహాలకు కొనసాగింపుగా ఈ నవలలోని హీరో జగదీష్‌ ఆంధ్రా (గుంటూరు) నుంచి వచ్చి సికింద్రాబాద్‌లో సెటిలయిన నాయుళ్ళ అమ్మాయి వసంతను వివాహమాడతాడు. తనకు ఉద్యోగం చేయడం ఇష్టంలేదు, అంతేగాకుండా జీవితం మొత్తం ప్రజాసేవకే వినియోగించాలని భావిస్తున్న అతనికి తగ్గట్టుగానే తాను ట్యూషన్లు చెప్పే అమ్మాయి భార్యగా దొరుకుతుంది. ఇందుకు ఆ అమ్మాయి అన్నయ్య, ఆనాటి నిజాం ప్రభుత్వంలో ఉద్యోగి అయిన కృష్ణానాయుడు ఒప్పుకుంటాడు. అంబేద్కర్‌ మాదిరిగా చదువుపై దృష్టిని కేంద్రీకరించి ‘జెగ్గడు’ విద్యావంతుడౌతాడు. ఎక్కడో మారుమూల ప్రాంతంలో దొర కృష్ణారెడ్డి ‘గోజలు’ కాసుకుంటూ బతికే 11 యేండ్ల మాల పిల్లవాడు ఒక దశాబ్ద కాలంలోనే ఎం.ఎ, ఎల్‌ఎల్‌బి చదవడం చూస్తూంటే ఇదంతా అంబేద్కర్‌ ఆలోచనా ధోరణికి చాలా దగ్గరగా ఉన్నట్టుగా అర్థమయితది.                                                                                                                                                                                                 ఇంత ఆధునిక భావాలతో రాసిన నవల 1955లో దేవీదాసు రెడ్డి, యెల్లాగౌడు అనే లోక మహరి మిత్రుల పూనికతో అచ్చయింది. ఈ నవల అచ్చయి ఆరు దశాబ్దాలు దాటినా, 1985 నుంచి అంబేద్కర్‌ వాద దృక్పథంతో రచనలు, విమర్శలు వెలుగు చూస్తున్నా ఇంత వరకు రీ ప్రింట్‌ కాలేదు. ఏ విశ్వవిద్యాలయం కూడా దీన్ని పాఠ్యాంశంగా పెట్టలేదు. అయితే హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాయంలో ఆచార్య పిల్లలమర్రి రాములు దగ్గర ఒక విద్యార్థి మాత్రం ఎంఫిల్‌ చేసిండు. అలాగే ఇంకో మహిళ ఇటీవల మలహరి నవలల పైన పరిశోధన చేస్తున్నది. అయినప్పటికీ ఈ నవలలోని విషయాలేవీ ఇంతవరకూ వెలుగులోకి రాకపోవడానికి కారణాలేంటో అన్వేషించాలి. వాటిని అధిగమించాలి. నవల 1955లో తొలిసారిగా అచ్చయినప్పుడు మాడపాటి హనుమంతరావు, గడియారం రామకృష్ణశర్మలు తమ అభినందనలు, ఆశీస్సులు తెలిపిండ్రు. అయితే ఈ పుస్తకంలోని భాష ఎక్కువ మేరకు పక్కా తెంగాణ భాష కావడం, హీరో మాల కులస్తుడు కావడం బహుశా ఈ పుస్తకం రీప్రింట్‌ కాకపోవడానికీ, పాఠ్యాంశంగా ఏ విశ్వవిద్యాలయంలోనూ చోటు చేసుకోకపోవడానికి ప్రధాన కారణమయ్యుంటది. 1985లో కారంచేడు ఉద్యమం తర్వాత ఎంతో దళిత సాహిత్యం, పరిశోధన వెలుగు చూసింది. 1990ల తర్వాత ప్రత్యేక తెలంగాణ ఉద్యమం కూడా అనేక కొత్త విషయాలను, చరిత్రను ప్రపంచానికి తెలియజేసింది. లోక మలహరి గురించి గతంలో కందుకూరి రమేశ్‌బాబు ఒక వ్యాసం రాసిండు. ఆ తర్వాత 2012లో ఆచార్య జయధీర్‌ తిరుమలరావు ‘జగ్గని యిద్దె’లోని భాష గురించి ఒక వ్యాసం రాసిండు. ఇటీవల పరిశోధక మిత్రుడు కోడం కుమార్ ఒక వ్యాసం రాసిండు.  ఇవి మినహా ఎవ్వరు కూడా కొత్త జోడింపులు జేయలేదు.                                                                                                                                                  చేనేత కుటుంబంలో పుట్టిన లోకమహరి (1910-2010) వందేండ్లు బతికిండు. కొంత హిందూత్వ భావజాలంతో ఉన్నాడు. జగదీశ్వర భజన మండలిని నిర్వహించిండు. వేదాలను మొట్టమొదటి సారిగా తెలుగులోకి అనువదించిండు. అంతేగాకుండా ‘జీవన సంజీవని’ అనేపేరిట లోకమహరి తన ఆత్మకథను కూడా రాసుకున్నాడు. ఇవే గాకుండా ఈయన వందకు పైగా ఆధ్యాత్మిక గ్రంథాలు  రాసిండు.

మొత్తం తొగు సమాజంలోనే ఆధునిక, సంస్కరణ భావాతో ఒక దళితుడిని హీరోగా నిబెడుతూ, విద్య యొక్క అవసరాన్ని విడమర్చి చెబుతూ ‘జెగ్గని యిద్దె’ నవను రాసిండు. ఈయన మరో నవ ‘సంఘం’లో చేనేత వృత్తికార్మికుల దయనీయ జీవితాలను చెప్పిండు. ఆరు దశాబ్దాల క్రితమే తెలంగాణ దళిత జీవితాలను చిత్రికగట్టిన ఆయన నవలను వెలుగులోకి తేవడమే గాకుండా, ఆత్మకథను అచ్చువేయాల్సిన అవసరమున్నది. అదే ఆయనకు సరైన నివాళి.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


   Type Comments in Indian languages (Press Ctrl+g to toggle between English and Hindi OR just Click on the letter)