ములాఖాత్

అగ్నిగుండంలా వుంది ఉత్తరాంధ్ర!                     

ఉత్తరాంధ్ర సాహిత్యం, ఉద్యమాలు, ప్రస్తుతం పరిస్థితి, అస్తిత్వ ఉద్యమాలు తదితర అంశాలపై ప్రముఖ కథకుడు అట్టాడ అప్పల్నాయుడుతో అడుగు సంపాదకులు దుప్పల రవికుమార్ ముఖాముఖి…

-సామాజిక జీవితం సంఘర్షణా చలనాలను వాస్తవీకరించడంలో విశ్లేషణాత్మక తత్వం మీ రచనల్లో వుందంటారు. మరీ ముఖ్యంగా మీ కధల్లో వుందంటారు. అదెలా సాధ్యం?

జవాబు:  నా తొలినాటి కధల్లో మీరన్న విశ్లేషణాత్మక తత్వం వుండదు. ‘పోడుాపోరు’ కధల రచనల కాలానికి నేను కేవలం విప్లవపార్టీ (నక్సల్బరీ, శ్రీకాకుళాల పోరాటాన్ని నిర్మించీ,నడిపిన) రాజకీయాలనూ,పోరాటస్ఫూర్తినీ సాహిత్యీకరించడమే యేకైక లక్ష్యంగా భావించేవాడిని. అసలు నేను సాహిత్యంలోకి రావడమే – శ్రీకాకుళ పోరాట వీరోచిత సంఘటనలను సాహిత్యీకరించడానికే వచ్చేను. అప్పటిదాకా సాహిత్యీకరించిన భూషణంగారు రచన ఆపేసాక, గింజులాటగా వుండేది నాకు.ఎన్నెన్నో వీరగాధలు నేను విన్నవీ,తెలుసుకున్నవీ…మా పరిసరాల్లో జరిగినవీ లోలోపల కదలాడేవి. పూర్తికాల విప్లవరాజకీయ కార్యాచరణ నుంచి పార్ట్‌ టైమర్‌గా మారినపుడూ, పెళ్లి చేసుకున్నాక, బతుకుతెరువు కోసం శ్రీకాకుళం నుండి వచ్చే ‘నాగావలి’అనే వారపత్రికలో సబ్‌ఎడిటర్‌గా చేరేను.ఆ పత్రిక సంపాదకులు మాజీనక్సలైట్‌ దుప్పల క్రిష్ణమూర్తిగారు. సబ్‌ఎడిటర్‌గా రాయడం అవసరమై యేవేవో రాసేవాణ్ని. క్రిష్ణమూర్తిగారు మాజీ అయినా గతాన్ని మరచిపోలేదు,శ్రీకాకుళపోరాట చరిత్ర కొంతభాగం పత్రికలో రాసేరు. ఆతనితో సంభాషణల వలన నేను కధారచనకు దిగే ప్రేరణ వచ్చింది. నిజానికి అప్పటికి నేను మంచి చదువరిని. ఎమెస్కో,డిటెక్టివ్‌, యితరప్రచురణల నవలలూ, కధలూ చదివివున్నాను.గనక కధ రాయగలననుకొని పోరాటగాధ కాకుండా, గ్రామాల్లో సేవాకులాల మీద జరిగే దౌర్జన్యమ్మీద ఓ కధ ‘పువ్వుల కొరడా’ రాసి సృజనకు పంపించేను. వారు ముద్రించేరు. అప్పుడు నమ్మకం కలిగి పోరాటగాధలు… వరుసగా కొన్ని రాసేను. సృజన, అరుణతారలల్లో ప్రచురణయ్యేయి. ఆ క్రమంలోనే నేను 1978 అనుకుంటాను, తిరుపతి మహా సభల్లో విరసంలో చేరేను. విరసం కూడా నేను రాయాల్సినవి పోరాట కధలే అన్న ప్రేరణే కలిగించింది. అంచేత పదేళ్లు నేను అవే కధలు రాసేను.1988లో పోడుాపోరు సంపుటి తీసుకొచ్చేను. ఆ సంపుటికి మంచి రెస్పాన్స్‌ వచ్చింది. జైళ్లల్లోనున్న నక్సలైట్‌ ఖైదీలు ఉత్తరాలు రాసేరు పుస్తకాల కోసం. విప్లవ రచయితగా ముద్రపడిపోయింది ఆ సంపుటితో! నిజానికి యిక్కడ విప్లవమేమీ లేదు.స్తబ్దతకు గురయ్యింది. విప్లవపార్టీ నేను కధారచన ఆరంభించిన నాటికే చీలిపోయింది. అయినా చీలిన అన్నీ యేదోమేరకు కార్యక్రమాలు చేస్తుండేవి. ఈ దశలో భూషణంగారు మళ్లీ రాత ఆరంభించేరు. ‘కొత్తగాలి…  కొన్ని కధలు’ ‘ఇంటర్వ్యూ,ఇంటర్వ్యూ తర్వాత’ అనే కధలు రాసేరు. అవి చీలినపార్టీల వైఖరిమీద ప్రశ్నలేసాయి. ఇవన్నీ  నాలో ప్రశ్నలు లేపగా యేది రాయాలన్నా సంకోచం కలిగేది. ఆగిపోయేను. ఓసారెపుడో కాళీపట్నం రామారావుగారు  కలసినపుడు చాలా విషయాలు కదిలేయి. నేను ఆగిపోవడాన్ని గమనించేరు. కారణం తెలుసుకున్నారు. అప్పుడో సలహా యిచ్చేరు. జీవితం అనేకాంశాల కలయికతో వుంటుంది. కేవలం వర్గపోరాటాంశమే రాసే నువ్వు మిగిలిన అంశాల వేపు దృష్టి పెట్టు అన్నారు. వర్గేతర అంశాలు కధనం చేసేటపుడు కొన్నాళ్లు కలం పేరుతో రాయమన్నారు. అలా నేను  వరీనియా (మా అమ్మాయి పేరు) కలం పేరుతో బెల్లం, విత్తనాలు, భూదేవితోడు వంటి కధలు రాసేను, ఆంధ్రజ్యోతి వారపత్రికలో వచ్చేయి.ఆ కాలంలోనే విప్లవరచయితలనే గాక యితర రచయితలను చదవడం ఆరంభించేను. సోవియట్‌ సాహిత్యంతో సహా. ముఖ్యంగా కాళీపట్నం కధల్ని మళ్లీమళ్లీ చదవడంతో… కధావస్తువుకి సంబంధించిన చరిత్ర గురించి  ఎరుక కలిగింది. దాంతో నా రచనా విధానం మారింది. అలా తొలిసారి మారిన రచనావిధానంలో వచ్చిన కధ ‘ప్రత్యామ్నాయం’. ఆ తర్వాత ‘మమకారం’, ఓ తోట కధ, క్షతగాత్రగానం…యిలా విశ్లేషణాత్మకత చోటుచేసుకుందని అన్పిస్తోంది.

-మొదటినుంచీ మీ కధల్లో ఉత్తరాంధ్ర వుందనీ, విప్లవం పై సునిశిత విమర్శా వుందనీ అంటారు. ఒక విప్లవ కధకుడిగా దీన్నెట్లా వివరిస్తారు?

జవాబు: బహుశా మీ ప్రశ్న ఉత్తరాంధ్ర అస్తిత్వం గురించి అయుంటాది. లేదు, నా మొదటి కధల్లో ఉత్తరాంధ్ర  (మీరనుకునే) అస్తిత్వం లేదు. పైన చెప్పిన జవాబు దీనికీ వర్తిస్తుంది.  కొన్ని కధల్లో విప్లవం పై సునిశిత విమర్శ వుంది. బహుశా అది నా జీవనానుభవంలోంచి యేర్పడ్డ భావన. నా సాహిత్యజీవితం దాదాపు 40 యేళ్లు.1978?లో విరసంలో చేరేను. 1998 చివరిలో విరసం నుంచి బయటకూ, తర్వాత కొన్నాళ్లకు జనసాహితీ…దాంట్లోంచి కొద్దినాళ్లకే బయటకూ వచ్చేసినా సాహిత్యరంగాన్ని వదల్లేదు.శ్రీకాకుళసాహితి,ఉత్తరాంధ్రరచయితలు,కళాకారుల వేదిక నా కార్యరంగాలుగా వున్నాయి. నా విప్లవ రాజకీయ జీవితం (పూర్తికాల,పార్ట్‌టైం)20 యేళ్లు. 1977లో పార్టీలో చేరేను. 1997 చివరిలో పార్టీనుంచి బయటకు వచ్చేను.అంటే ఇరవైయేళ్లకాలం విప్లవజీవితంలోంచి బయటనున్నాను.విప్లవోద్యమమ్మీద వ్యతిరేకతతో కాదు. విప్లవపార్టీలనేవేవి వున్నాయో వాటిలో కొన్నింటితో తీవ్రమయిన ఘర్షణ పడ్డాను. వ్యక్తిగతంగా కొన్ని యిబ్బందులనుభవించేను. కానీ యివేవీ నేను విప్లవోద్యమంనుంచి దూరం పోవడానికి కారణాలు కావు.

విప్లవోద్యమం మళ్లీమళ్లీ చేసిన తప్పులే చేస్తోందనీ,మారిన సమాజాన్ని అర్ధం చేసుకోవటంలేదనీ,గ్రామాల్లో ఒకనాటి వర్గాలు మారేయనీ, కొత్తసమస్యలచ్చేయనీ,కొత్తనినాదాలూ,కొత్తశక్తులూ అవసరమనీ…దాదాపుగా యిలాంటి కొన్ని అభిప్రాయాల్తో పార్టీల్లో చర్చించేను. 1998లో ‘వాళ్లు’ కధ రాసేను. ఈ కధ రాసిన నాటికి విప్లవపార్టీనిర్మాణంలోంచి బయటికి నా పాదాలు అడుగులు వేస్తున్నవి. తర్వాత ‘యఙ్ఞం తర్వాత’ కధ, ఆ తర్వాత ‘ఒక పొట్టివాడు,కొందరుపొడవు వాళ్లు’ కధ రాసేను.ఈ మూడు కధల్లో విప్లవోద్యమమ్మీద నాకేవయితే ప్రశ్నలున్నవో,యే మార్పులయితే నేను కోరుకున్నానో వాట్ని ప్రతిఫలించేను. అయితే నా కధల్తో విప్లవపార్టీల కార్యాచరణ మారిపోతుందనో, మారిపోవాలనో నా భావన కాదు,కనీసం చర్చ జరుగుతుందనుకున్నాను. ‘వాళ్లు’ కధ అరుణతారలో వచ్చిన యేడాది తర్వాత  గ్రూపు తగాదాల కారణంగా ఆ కధమీద, రాసిన నామీద అసమంజస లేఖ అచ్చయ్యింది. మిగిలిన రెండు కధలూ ప్రజాసాహితి ప్రచురించింది. వీళ్లు కూడా గ్రూపు రాజకీయాల కారణంగా నా రచనను విశ్లేషిస్తున్నామన్న పేరుతో వ్యక్తిగత విశ్లేషణ చేసేరు. ఇప్పటికీ నేను విప్లవం మాత్రమే దేశాన్ని విముక్తి చేస్తుందని భావిస్తాను. విప్లవపార్టీల నిర్మాణాలకు దూరంగా వున్నానుగానీ అవి చేపట్టే ప్రజాపోరాటాల పట్ల సంఘీభావంతో వున్నాను.

 

..ఓ తోట కధ లోని జగన్నాధం నాయుడి కొడుకే, పందెం తోట కధలోని దాలినాయుడి కోడలు వరలక్ష్మిగా మారిందన్పిస్తుంది. అంతేనా?ఉత్తరాంధ్రలో వున్న కొద్దిపాటి పోరాటం కూడా నిస్సహాయంగా మారిందనడానికి సంకేతమనుకుంటా…మీరేమంటారు?

జవా… కాదండీ. బహుశా నా కధల ప్రయాణానికి లంకేదో వుండొచ్చుగానీ మీరన్నట్టు ఆ రెండు కధల్లోని పాత్రలూ ఒకటిగావు,వేర్వేరు. నిజానికి ‘ఓ తోట కధ’ … శ్రీకాకుళం పట్టణంలో చోటుచేసుకున్న పరిణామాలను చెప్పడానికి  రాసేను. దానికి ప్రేరణేమంటే – మేము ‘వంశధార కధలు’ సంకలనం కోసం శ్రీకాకుళంలో చందాల కోసం మిత్రులంతిరుగుతున్నపుడు…కబుర్లలో – అంధవరపు వరం కాంగ్రేస్‌పార్టీ వీడి తెలుగుదేశంలో చేరడం గురించి ఊసులచ్చేయి.  తాతల తరం నుండీ కాంగ్రేస్‌ కుటుంబంలోని వరం యెలా మారేడని ప్రశ్నిస్తే – స్తలం సార్‌ అన్నాడొకాయన! ఏ స్తలం…యిపుడు యేదయితే వరం రెసిడెన్సీ అనున్నదో…ఆ స్తలం. అది అప్పటికి ఖాళీ స్తలం. పట్నం పెరిగే క్రమంలో స్తలాల విలువలు పెరగడం, వాటిని ఖాజేయడానికి చేసే రాజకీయం ఊసుల్లో కదిలేయి. అప్పుడు మరికొన్ని విషయాలు సేకరించేను. టౌన్‌హాల్‌, బందిలీపురం, వగయిరా స్తలాలూ,పట్నంలోని కులాలూ,వ్యాపారాలూ,రాజకీయాలూ…ఆ నేపధ్యంతో ‘ఓ తోటకధ’ రాసేను.

‘పందెంతోట ‘ చిదిగిపోయిన ఓ పెద్ద రైతు కుటుంబ స్త్రీ కధ అది. ఆమె నాకు బంధువు. ఆమె పెళ్లినాటి సంపద యెలా పోయిందో విశ్లేషించుకు రాసిన కధ అది. పోరాటాల సంబంధమే లేవీ కధల్లో!

మీ కధలన్నీ ఒక పెద్ద కొనసాగింపులో భాగాలుగా అన్పిస్తాయి. క్షతగాత్రగానం  … బతికిచెడిన దేశంగా మారింది. ఓతోట కధ…పందెపుతోట గా మారింది. వాళ్లు  కధలో విప్లవోద్యమం మీద చేసిన కామెంట్‌ ఒక పొట్టివాడు..కొందరు పొడవువాళ్లు కధలో బలంగా మారింది. మీరేమంటారు?

జవాబు… ఈ ప్రశ్నల్లో విప్లవోద్యమానికి సంబంధించిన వాటికి పైన యిచ్చిన జవాబులో వివరణ వుంది.  క్షతగాత్రగానం కధ…వ్యవసాయ సంక్షోభాన్ని చెప్పడానికీ, బతికిచెడిన దేశం కధ…సంక్షోభ ఫలితాన్ని చెప్పడానికీ రాసిన కధ!

 

..అస్తిత్వవాదాన్ని ఉత్తరాంధ్ర ప్రత్యామ్నాయ అభివృధ్ది కొరకైనా అంగీకరించినట్లేనా? మీ కధా ప్రయాణం అదే చెబుతోంది కదా?

జవా…లేదు,నేను అస్తిత్వవాదిని కాను. చాలామంది తిరకాసుపడుతున్నారు. నిజానికి అస్తిత్వమని యేదయితే అంటారో…అది వివక్ష అన్న దానికి వాదమిచ్చిన పేరు. స్త్రీలపై వివక్ష,మైనారిటీలపై వివక్ష,దళితులపై వివక్ష, వెనకబడ్డ ప్రాంతాలపై వివక్ష…యివే వివక్షలు పోవడానికి అస్తిత్వవాద ఉద్యమాలంటున్నారు. వామపక్షాలు యీ వివక్షలను అశ్రధ్ద కాదు నిర్లక్ష్యం చేయడం వలన( యిపుడూ గమనించేము, ఔను అస్తిత్వసమస్యలున్నవంటున్నాయేగానీ, అస్తిత్వవాదులు కోరుకునే ఉద్యమాల నిర్మాణం వామపక్షాలు చేయడంలేదు. ఇదొక అంశం వదిలేయండి.) ఆయా వివక్షలకు గురయిన వాళ్లూ, ప్రాంతాలూ వాటిపై పోరాడేయి. పోరాటాలు అప్పటిదాకా చేయనందుకు వామపక్షాల్ని శంకించేయి. (ఇప్పటికీ చేయనందుకనండి). అన్ని వివక్షలపైనా మార్క్సిస్టులు పోరాడాలని, అవి మాత్రమే వివక్షలను నిర్మూలించగలవనీ…అస్తిత్వవాద  ఉద్యమాలకు వాటికవిగా నిర్మూలించగలిగే శక్తీ,సిధ్దాంతమూ లేవనీ నేను భావిస్తాను. మార్క్సిస్టులు అస్తిత్వసమస్యల మీదపోరాడగూడదనో,పోరాడితే అస్తిత్వవాదులయిపోతారనో… యెందుకనుకుంటున్నారో నాకర్దం గావడంలేదు. నా సాహిత్య ప్రయాణాన్నీ, నా రాజకీయప్రయాణాన్నీ యెందుకిలా అస్తిత్వ పరిమితిలోకి కుదించి భావిస్తున్నారో అర్ధంగావటంలేదు. తెలంగాణా అస్తిత్వ(ప్రత్యేకరాష్ట్రమంటే అస్తిత్వ పోరాటమేకదా?)పోరాటాన్ని…విరసమూ,మావోయిస్టులూ సపోర్టు చేస్తే, వారిని అస్తిత్వవాదులనలేదు. నేను ఉత్తరాంధ్ర ప్రత్యేక ప్రణాళికగురించీ,అభివృధ్దిగురించీ, ఉత్తరాంధ్రమీద రెక్కలు చాచినకమ్మ,రెడ్ల,పరప్రాంత,పరదేశ పెట్టుబడుల వ్యతిరేకత గురించీ మాటాడుతున్నందుకూ,రాస్తున్నందుకూ అస్తిత్వవాదినంటున్నారు. నా ‘షా’ కధే…నేను అస్తిత్వవాదినా, మార్క్సిస్టునా తెల్పుతుంది. కధ గురించి నాకు మాటాడ్డం యిష్టంలేకగానీ…అందులో స్ధానికుడైన ధనికరైతు కూడా… ఎర్రజెండాలు పట్టిన,ఎలుగెత్తిన జనంతో కలుస్తాడు. పరప్రాంతదోపిడీని అడ్డుకోవడం దాకా ఎర్రజెండాతో కలుస్తాడు. తప్పదు వాడికి. ఎర్రజెండాకూ తప్పదు. సామ్రాజ్యవాదశక్తులకు వ్యతిరేకంగా  దేశీయబూర్జువా ( కలిసే వాళ్లని)లను కలుపుకు రావాలన్నది మార్క్సిస్టు ధీరీ.

ఉత్తరాంధ్రా స్ధానికసహజ వనరుల సంరక్షణ,కార్పొరేట్‌కంపెనీల (సామ్రాజ్యవాదపెట్టుబడి)వ్యతిరేక పోరాటం…ఈవేళ్టి ఉత్తరాంధ్ర అవసరం. ఈ అవసరాన్ని అస్తిత్వ ఉద్యమాలు మాత్రమే నెరవేర్చలేవు. ఉత్తరాంధ్ర యీ అస్తిత్వాన్ని సంరక్షించుకోకుండా వర్గపోరాటమో,విప్లవోద్యమమో మార్క్సిస్టులకూ సాధ్యం కాదు. స్ధానిక అస్తిత్వసంరక్షణతో…సామ్రాజ్యవాద వ్యతిరేక ఉద్యమాన్ని లింక్‌ చేయడాన్ని నేను కోరుకుంటున్నాను. నా సాహిత్యం,నేనూ కోరేదదే!

ఉత్తరాంధ్ర సాహిత్యం పట్ల వివక్ష యేమయినా కొనసాగుతోందా?  

జవా… అన్ని అంశాల పట్లా వివక్ష వున్నట్లే ఉత్తరాంధ్ర సాహిత్యం పట్ల గూడా వివక్ష వుందీ,కొనసాగుతోంది.అసలు కొన్నాళ్లు ఉత్తరాంధ్ర సాహిత్యం అనే విభజనే చేసేవారు కాదు. కోస్తాంధ్రా సాహిత్యం అనేవారు. కోస్తా రచయితల పేర్లూ, ఉత్తరాంధ్రలోని గురజాడ,రావి,కారా,బలివాడ వంటి ప్రసిధ్దులతో ఆగిపోయేవారు విమర్శకులు.ఇపుడిపుడే ఉత్తరాంధ్ర సాహిత్య చర్చ చేస్తున్నారు. ఇపుడిపుడు  చర్చ చేస్తున్న వారికి యెలా వుందంటే – ఉత్తరాంధ్ర సాహిత్యమంటే విధ్వంస గురించీ, దళితసమస్యల గురించీ, వాకపల్లి గురించీ, సోంపేట గురించీ, చావులు గురించీ, పోరాటాల గురించీ, అన్యాయాల గురించీ,అక్రమాల గురించీ వార్తా రిపోర్టింగని అసహనం వ్యక్తం చేస్తున్నారు. నిజానికి యీ సమస్యలమీద,అన్యాయాలమీద, అక్రమాల మీద మీడియా అసలు రిపోర్టింగే చేయాల్సినంతకాదుకదా,కనీసస్ధాయిలో చేయడంలేదు. సరికదాకొన్ని చోట్ల కార్పొరేట్ల కొమ్ముకాస్తోంది.సోంపేటలో ప్రజలు కోపగించి మీడియా వాళ్లమీద దాడి చేసారిందుకే! ఇక ,ఇక్కడి సాహిత్యం కూడా ఆ అసహన విమర్శకుడు పేర్కొన్న స్ధాయిలో రాలేదు. కానీ ఉత్తరాంధ్ర పట్ల గల వివక్షే,సాహిత్యం పట్ల కూడా చూపుతోంది. సాహిత్యఅకాడమీ సలహామండలి సభ్యులుగా అన్ని ప్రాంతాలనుంచీ తీసుకున్నారుగానీ, ఉత్తరాంధ్రనుంచి యెవర్నీ తీసుకోలేదు. ఒకప్పుడు చాగంటి తులసి వుండేవారు.ఒకవేళ సలహామండలికి తీసుకున్నా ఉత్తరాంధ్రలో వలస వచ్చి స్ధిరపడిన వాళ్లనో, ఉత్తరాంధ్రలోని అగ్రవర్ణాల వారినో తీసుకుంటారు తప్పా, విరివిగా రాస్తోన్న బహుజనుల నుంచి తీసుకోరు. అసలు ఉత్తరాంధ్రసాహిత్యమ్మీద వివక్షకు కారణం…ఉత్తరాంధ్ర సాహిత్యకారులిపుడు బహుజనులు కావడం.

 

… ఉత్తరాంధ్రలో ఇంతదాకా అస్తిత్వఉద్యమాల ఊసే ఉండకపోవడానికి కారణాలేమిటి?

జవా…  ప్రధానంగా వామపక్ష ఉద్యమాల్లో యీ నేల మునిగి వుండడమే కారణం. నిజానికి తొలినాళ్లలో అప్పటికి వామపక్షం యీ నేల చేరని రోజుల్లో గౌతు లచ్చన్న వంటి వాళ్లు…జమీందారీ వ్యతిరేక, దళిత వివక్షవ్యతిరేక,ప్రాంతీయ సమస్యలపై ఉద్యమాలు నడిపేరు.జాతీయోద్యమం వీట్ని మింగేసింది. వచ్చిన స్వాతంత్య్రం లచ్చన్న వంటి వారిని కరప్ట్‌ చేసింది. స్తానిక ప్రజాప్రాతినిధ్యాన్ని…యెక్కడి వాడో అయిన రంగా గారికి తొలిసారిగా అప్పగించేడు లచ్చన్న. ఇవ్వాళ స్తానిక ప్రజాప్రాతినిధ్య స్తానాల్లో యితరేతర ప్రాంతాల వాళ్లు యెక్కువయ్యేరు. లచ్చన్న కాలం నాటి నాయకులూ,లచ్చన్నా నిబధ్దులై కొనసాగి వుంటే, లేదా తర్వాత చేరిన వామపక్షం యిక్కడి నాయకత్వాన్ని యెదగనిచ్చినా యెలా వుండి వుండునో? ఇంతో,అంతో నాయకులుగా యెదగాల్సిన మార్పు పద్మనాభం,బెందాళం గవరయ్య, వెంపటాపు,తామాడ,పంచాది  వంటి వాళ్లు శ్రీకాకుళపోరాటంలో అమరులు గావటం…అస్తిత్వఉద్యమాలు లేకపోవడానికి కారణాలు గావచ్చు.

ప్రశ్న… ఉత్తరాంద్ర రచయితలు విప్లవ భావజాలంలో ఉండడం వల్లే అస్తిత్వ ఉద్యమాలను అంటరానివిగా చూసారా?

జవా… ఉత్తరాంధ్రలో రచయితల్లో యే రాజకీయాభిప్రాయాలూ,విశ్వాసాలూ లేనివారే యెక్కువ. రావిశాస్త్రి,కారా,భూషణం,చాయరాజు,నేనూ…యిలా కొద్దిమందే విప్లవభావజాల రచయితలం. ఉండడానికి విరసం,జనసాహితీ సంస్ధలున్నాయిగానీ ఉత్తరాంధ్రలో వాటి సభ్యత్వమెంత? వాటి ప్రభావమెంత? అస్తిత్వ ఉద్యమాల్లో… దళిత,స్త్రీవాదం వచ్చినపుడు యీ ప్రాంత విప్లవరచయితలకు వ్యతిరేకతేమీ లేదు. బమ్మిడి జగదీశ్వరరావు స్త్రీవాద కధలు రాసేడు, నేను రాసేను, ఛాయరాజ్‌ కవిత్వం రాసేడు. జనరల్‌గా ఆ సంస్ధల మీద ఒక సంశయముంది గనక అంటరానివిగా చూసారనుకుంటున్నారు.  ఉత్తరాంధ్రలో అంటరానిదిగా మేము చూడలేదు. కాకాపోతే…తీవ్రంగా సాహిత్యసృజన జరగలేదు. ఇపుడు ప్రాంతీయ  అస్తిత్వమ్మీద గూడా లేదుగదా. ఇక్కడి పిడికెడు మంది రచయితలకే రాజకీయ స్పృహ వుంది. గనక లోటుగా కన్పిస్తుంది. మేమయితే శ్రీకాకుళసాహితి తరపున దళిత కధ కోసం ప్రయత్నించేం. స్త్రీల నుంచి కమలకుమారి గారిని ఎంతో ప్రోత్సహించేం. అలాగే ప్రాంతీయ అస్తిత్వమని  కోయిన్‌ చేయకముందరే ‘నాగావలికధలు,వంశధారకధలు,జంఝావతి,వేగావతి’ యిలా ప్రాంతీయజీవనమ్మీద కధాసంకలనాలు తెచ్చేం!

 

-మీరిపుడు విప్లవవాదా?అస్తిత్వవాదా? అయితే ఎందుకు?

జవా….పైన వీటికి జవాబులు చెప్పేను.

 

విప్లవవాదుల్లో మీరు గమనించిన పోజిటివ్‌,నెగిటివ్‌ అంశాలేంటి? అస్తిత్వవాదుల్లో యేమిటి?

జవా… విప్లవవాదుల్లోని అంకితభావం పోజిటివ్‌. క్రమశిక్షణ భయంతో నిర్మాణాల్లోని ఆధిపత్యాన్ని ప్రశ్నించకపోవడం నెగిటివ్‌ అంశమ్‌.

అస్తిత్వవాదుల్లో  అస్తిత్వంపట్ల గల ఎరుక, పట్టుదల,క్రియాశీలత పోజిటివ్‌.వామపక్ష వ్యతిరేకత నెగిటివ్‌ అని నా భావన.

-తెలంగాణా రాజకీయ ఉద్యమం నుంచి ఉత్తరాంధ్ర నేర్చుకోవలసిన పాఠాలేంటి?

జవా…  ప్రతీ ఉద్యమమూ కొన్ని పాఠాలను నేర్పుతుంది. తెలంగాణా ఉద్యమం రాష్ట్రసాధన కోసం నడిపిన క్రియాశీల పోరాట రూపాలను మనం నేర్చుకోవాలి. సాధన తర్వాత గూడా ప్రజల పక్షం నిలవాల్సిన ,నిత్యప్రజా పక్షం వహించాల్సిన అవసరాన్ని వర్తమాన తెలంగాణా రాజ్యం బోధిస్తోంది.

 

ఉత్తరాంధ్ర ప్రస్తుత పరిస్థితి యేమిటి?

జవా…ఉత్తరాంధ్రలో అడవీ,సముద్రతీరం,సారవంతమైదాన సహజవనరులున్నాయి. ఖనిజాలున్నాయి. విలువయిన గనులున్నాయి. వీటి మీద కార్పొరేట్ల,పరప్రాంతీయుల కళ్లు పడ్డాయి. రాజ్యం వారికి దళారులుగా ప్రవర్తిస్తోంది.సహజవనరుల సంరక్షణ, వెనకబడ్డ ఉత్తరాంధ్ర అభివృధ్దికి ప్రత్యామ్నాయ ప్రణాళికా, విధ్వంసకరప్రాజెక్టు నిర్మాణాల వ్యతిరేక పోరాటాలూ యీవేళ్టి ఉత్తరాంధ్ర స్ధితి. ప్రజలు యెక్కడికక్కడ పోరాడుతున్నారు. పోరాటాలను నడిపే, అభివృధ్ది చేసే,విప్లవబాట వేపు మరల్చే వామపక్షశక్తులు చాలాచాలా బలహీనంగా వున్నాయి. అగ్నిగుండంలా వుంది ఉత్తరాంధ్ర!

 

 

3 thoughts on “అగ్నిగుండంలా వుంది ఉత్తరాంధ్ర!                     

 1. అట్టాడా,సార్ చాలా విషయాలు స్పష్టం చేశారు.మీరన్నట్టు ,సాంప్రదాయ మార్క్స్ సిస్టులు ముఖ్యంగా నాయకత్వాల్లో వున్నవాళ్ళు అగ్రవర్ణాల కి చెందిన వారు కాబట్టే అస్తిత్వ ఉద్యమాల ను పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేసారు.నిజానికి కమ్యూనిస్టు లకూ అట్టడుగు వర్గాల అస్తిత్వ ఉద్యమాల కీ వైరుధ్యం వుండకూడదు.కమ్యూనిస్టులు ఆపని చేసున్నింటే యీ రోజు వాళ్ళు బలంగా వుండిందురు.
  మంచి ముఖాముఖి.అడుగుకు అభినందనలు.

 2. కుల పట్టింపులు —గ్రూపులు —అగ్రవర్ణ ఆధిపత్యం —మై. వే ర్. ఫ్రీవే -ల తో విప్లవ వాదం
  సన్నగిల్లి పోయింది –
  అట్టాడా సర్ చక్కగా చెప్పారు సర్
  ============
  బుచ్చి రెడ్డి. గంగుల

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


   Type Comments in Indian languages (Press Ctrl+g to toggle between English and Hindi OR just Click on the letter)