వ్యాసం

అసలు సిసలు మగాడు?- అర్జున్ రెడ్డి

సింగరాజు రమాదేవి

 

గేమ్ చేంజర్ ఇన్ ద ఇండస్ట్రీ గా పోస్టర్లు వేయించుకుని సంచలన విజయం సాధించిన సినిమా అర్జున్ రెడ్డి.యువతను విపరీతంగా ఆకట్టుకున్న ఈ సినిమా లో అంత కొత్తదనం , గొప్పతనం ఏమున్నాయో చూద్దాం.

నరసింహనాయుడు, ఇంద్రసేనారెడ్డి వంటి తొడగొట్టి, మీసం మెలేసి, గొడ్డళ్ళు, కత్తులతో విలన్లను నరికే హీరో కాడు ఈ రెడ్డి! ఇతడొక డాక్టర్!కాలేజీ టాపర్, చేయి తిరిగిన సర్జన్.కానీ ఒకటే బలహీనత! విపరీతమైన కోపం!అదుపు లేని భావోద్వేగాలు! కోపం వచ్చిందంటే , ముందూ వెనుకా ఆలోచించకుండా కొట్లాట కు దిగుతాడు. ఎంతటి హింస కైనా వెనుకాడడు.

 

అలా అని ఇతడి కోపం ఏదో అన్యాయమైన వ్యవస్థ మీదో, అవినీతిపరుల మీదో, రౌడీల మీదో అనుకుంటే పొరపాటే!అతని కోపం తన అహాన్ని గాయపర్చిన వారిపైనా… తనదీ అనుకున్న దాన్ని తనకు కాకుండా చేసిన వారి పైనా మాత్రమే.తన పంధా తప్పని చెప్పిన ఎవరైనా స్నేహితులైనా, ప్రియురాలైనా, అన్న ,తండ్రి ఇలా ఎవరైనా సరే, అతని కోపం ముందు అందరూ తక్కువే!

 

మణిరత్నం, పూరీ జగన్నాధ్ తదితరుల సినిమాలు చూస్తూ పెరిగినట్టున్నాడు. కాలేజీలో కొత్త గా చేరిన జూనియర్ అమ్మాయిని చూడగానే ప్రేమ లో పడిపోయి కాలేజీలో అన్ని క్లాసుల్లో ,ఈ పిల్ల నాది, వేరెవ్వరు ఆమెపై ఆసక్తి చూపరాదు అని చాటింపు వేయిస్తాడు. పైగా ఏ ఇద్దరు అందమైన ఆడవాళ్ళు స్నేహంగా ఉండలేరు అనే గొప్ప ’సత్యాన్ని’ చెపుతూ, ఒక లావు అమ్మాయిని పిలిచి ఇదిగో ఈ పిల్ల నీ ఫ్రెండ్ ఐతే ఏ ప్రాబ్లెం ఉండదు, అంటూ ఇక నుంచి ఈమే నీ ఫ్రెండ్,బెంచ్ మేట్, రూమ్మేట్ అని అన్నీ తనే నిర్ణయించేస్తాడు.

 

అదే సీన్ లో లావుపాటి అమ్మాయిల గూర్చి ఫ్యాట్ చిక్స్ అని టెడ్డి బేర్స్ అని వెకిలి వ్యాఖ్యలు చేసిన అతను మరొ సీన్లో , తన ఫ్రెండ్ కి  కాబోయే భర్త, ఎయిర్ హోస్టెస్ గూర్చి హెయిరీ అండ్ ఆయిలీ గా( వంటి మీద రోమాలతో, జిడ్డుగా)ఉన్నారని వ్యాఖ్య చేస్తే, అరె! వీడేంట్రా? అమ్మాయిల్ని ఇలా ఆబ్జెక్టిఫై( వస్తువుల్లా భావించి అవమానిస్తున్నాడు) చేసి మాట్లాడుతున్నాడు అంటూ ఒరేయ్.. ఇలాంటి వాడితో మన ఫ్రెండ్ పెళ్ళి ఏంటి …వద్దు అంటాడు.ఇదేమి ద్వంద్వ నీతి అర్జున్ రెడ్డీ?

 

తను ప్రేమించిన అమ్మాయి కాలిలో గాజు గుచ్చుకుంటే, విలవిల్లాడిపోయి, వీల్ చెయిర్ తెప్పిస్తా అన్న అతను, బరువైన బ్యాగ్ తగిలించుకున్నందుకే ఆమె భుజం కందిపోయిందని నొచ్చుకున్న అతను… తీరా అమ్మాయి తండ్రి తనని అవమానిస్తే, ఆ పిల్ల కాళ్ళావేళ్ళా పడుతున్నా వినకుండా, లాగి ఒక్క చెంప దెబ్బ కొట్టి,నీకు ఆరు గంటలు టైమ్ ఇస్తున్నా…ఎవరు కావాలో తేల్చుకో.. అని హెచ్చరించి వెళ్ళిపోతాడు. ఇదేమి ప్రేమ అర్జున్ రెడ్డీ?

ఒక డాక్టర్ గా ఆడవాళ్ళ ఋతుసంబంధ బాధల గూర్చి సానుభూతి తో బోధపరిచే ఈ రెడ్డిమారాజుకి ఒక ఆడపిల్ల ఇంటిని , కన్నవాళ్ళని ఉన్నపళంగా వదిలేసి రావటం ఎంత కష్టమో మాత్రం తెలీదు! అన్నీ తెలిసిన గ్నాని అర్జున్ రెడ్డికి ఇదేమి అగ్నానమో!

 

అసలు ఏ సందర్భంలో కూడా ఆ అమ్మాయిని నేను నీకు ఇష్టమేనా అని అడిగిన పాపాన పోడు!

 

ప్రేమలో విఫలమైన ఈ బంజారా హిల్ల్స్ కొత్త తరం రెడ్డి… ఆ బాధ మర్చిపోవటానికి అతి పాత మార్గాన్ని ఎంచుకుంటాడు. దేవదాసు లాగా  గడ్డం పెంచుకుని,మందు కొట్టడం! కుక్కని పెంచుకోవటం!కొత్తదనం కోసం కాబోలు మద్యంతో పాటు మాదక ద్రవ్యాలు కూడా వాడుతూ.. కాస్త శారీరక సాంత్వన కోసం అమ్మాయిలను పిలిపించుకుంటాడు.

 

ఇక అతని గొప్పదనం ఏమిట్రా అంటే ఇలా తాగుతూ, డ్రగ్స్ వాడుతూనే మూడొందల పైన ఆపరేషన్లు అతి సునాయసంగా చేసి పారేస్తాడు.సిగరెట్లు తాగినా, మందు కొట్టినా, ఆఖరికి ఒళ్ళు తెలీని స్థితిలో దుస్తుల్లోనే మూత్ర విసర్జన చేసుకున్నా ఎక్కడా గ్లామర్ తగ్గకుండా చూసుకుంటాడు. గడ్డం ఉంచినా, తీసేసినా.. ఎప్పుడూ మందు కొడుతుంటాడని తెలిసినా, అతని చుట్టూ ఉన్న ఆడవారంతా… నర్సులైనా , డాక్టర్లైనా ఆఖరికి పేషంట్లైనా, అతని అందానికి, మగతనానికి, పడిపోయి అతని వంక ఆశగా చూస్తూ, అతనితో సంబంధం కోసం తహతహలాడుతూ ఉంటారు. అతనూ సందర్భానుసారంగా వారిని వాడుకుంటూ ఉంటాడు.

 

ఇంతటి సంచలనాత్మక చిత్రంలో హీరోయిన్ పాత్ర ఎట్టిదయ్యా అంటే ఆమె నోరు విప్పి ఎక్కువ మాట్లాడదు. పెళ్ళి కాని అమ్మాయి పబ్లిక్ ప్రాపర్టీ అనుకుంటారో ఏమో ప్రతి వాళ్ళూ ఆమెని తమ ఆస్తిగా భావించి ఇంకోళ్ళ జోక్యం సహించలేరు. హీరో మొదటి సీన్లోనే.. ఈమె నాది .. అంటాడు. ఆ అమ్మాయిని కలవటానికి వాళ్ళ కాలనీకి వస్తే, ఆ కాలనీ అబ్బాయిలూ అదే ఫీలవుతారు.నువ్వెవడ్రా అంటూ హీరోని బెదిరిస్తారు. ఇక అక్క నా స్నేహితుడు అని పరిచయం చేయగానే ఇంటర్ చదివే ఆమె తమ్ముడు కూడా హర్ట్ అయి హీరోని కొట్టడానికి ఫ్రెండ్సుని పిలుచుకొస్తాడు. ఇక తండ్రి సరేసరి, మా కులం తప్ప వేరేవాడికి ఇచ్చి చెయ్యను అని చెప్పి హీరోని చెంప దెబ్బ కొట్టి తరిమేస్తాడు.

 

ఇక తన ఆస్తిగా భావిస్తున్న ఆ అమ్మాయికి హోలీ రోజు మొట్టమొదటగా తనే రంగు పూయాలని హీరో శపధం చేస్తాడు. ఆ మేరకు తన రాజ్యంలో సామంతులందరికీ చాటింపు కూడా వేయిస్తాడు. కానీ శత్రు రాజులు వచ్చి రంగు పూసేస్తారు. ఆ విషయం తెలుసుకున్న అర్జునమహారాజు ఆగ్రహోదగ్రుడై ఆమె దగ్గరకు వస్తాడు. అతని కోపం తెలుసు కనుక ఆమె తన స్నేహితుల సాయం తో ఏడ్చుకుంటూ ఆ కళంకాన్ని కడుక్కోటానికి ప్రయత్నిస్తూ ఉంటుంది.సినిమా అంతటిలో జాలి కలిగించే సన్నివేశం ఇదే! ఆ సన్నివేశం దేనికి ప్రతీక ! రంగులవరకేనా? ఆ అమ్మాయి శీలం గూర్చి కూడానా?

 

అసలు ఇదే జాలిగొల్పే దృశ్యం అంటే ఆ అమ్మాయి ఆఖరి సీన్లో, ’ పెళ్ళైనా కూడా నా భర్త ని నా చిటికెన వేలు కూడా ముట్టుకోనివ్వలేదు తెలుసా.. నా విడిచిన బట్టలు కూడా తాకే అవకాశం ఇవ్వలేదు’ అంటూ తనకు తానే పవిత్రతా పత్రం ఇచ్చుకునే సన్నివేశం మరీ జాలిగొల్పుతుంది.ఈ శీల నిరూపణ ఎవరినుద్దేశించి..హీరోనా, ప్రేక్షకులా?

 

ప్రతి సీన్లో  హీరో బూతులు మాట్లాడుతూ, సెక్స్ గురించి బహిరంగంగా చెపుతూ, సిగిరెట్లు తాగుతూ, మందు కొట్టటమే ఆధునికతో, విప్లవాత్మకమో అనిపించుకోదు.ప్రేయసి వదిలేసిన నాలుగు నెలలకే అన్ని విధాలుగా భ్రష్టు పట్టిపోవటం రెబెల్ చేస్తున్నాడు అనిపించుకోదు. ఇక పెళ్ళికి పిలవటానికి వచ్చిన స్నేహితుడిని… నీదొక ప్రేమ కథా అంటూ హేళన చేయటం , అన్ని కష్టాలలో తన వెన్నంటే ఉన్న దగ్గర స్నేహితుడ్ని, ” అరేయ్.. వీడు మౌలాలి లో క్లినిక్ పెట్టాడ్రా! ఎంత మంది వస్తార్రా రోజుకి ..ఇద్దరా.. ముగ్గురా?’ అని అవమానించటం,  ’ఈ అలవాట్లు ఏంట్రా’ అని కోప్పడిన తల్లిని.. “నా జీవితంలో ఇదొక ఫేజ్ .. ఇంక పిచ్చి ప్రశ్నలు వేయకు” అని కసురుకోవటం హీరోయిజమ్ అనిపించుకోదు. ఇంత చేసిన అర్జున్ రెడ్డికి నానమ్మ మరణంతో ఒక్కసారిగా జీవితం పట్ల..విపరీతమైన క్లారిటీ వచ్చేసి,అన్ని అలవాట్లు మానేసి… దుఖంలో ఉన్న తండ్రికి గీతోపదేశం కూడా చేస్తాడు. తండ్రి మెచ్చుకుని విదేశీ యాత్రకు పంపిస్తాడు.తరవాత హీరో హీరోయిన్ కలుసుకుంటారు.ఇదీ కథ!

 

 

మెడికల్ కౌన్సిల్ ముందు తప్పు ఒప్పుకుని వచ్చేయటం.. హీరోయిన్ కడుపుతో ఉందని చూసినా, దానివల్ల నా ప్రేమలో తేడా ఏమీ రాదని ఆమెను కలవటం ఈ రెండు పనులకు మాత్రం రెడ్డికి క్రెడిట్ ఇవ్వొచ్చు.

 

అయితే సినిమాలో వాస్తవికత లేదని కాదు, దర్శకత్వ ప్రతిభ లేదని కాదు..అన్నీ ఉన్నాయి. ముఖ్యంగా విజయ్ దేవరకొండ నటన చాలా బాగుంది.మిగతా అన్ని పాత్రల నటీనటులు అందరూ బాగా చేశారు! సంగీతం బాగుంది! కానీ ఒక పాత్ర అందునా హీరో పాత్ర ప్రయాణాన్ని చూపిస్తున్నప్పుడు.. అతను పతనం దిశగా అడుగులు వేస్తున్నప్పుడు.. దాన్ని అలాగే చూపించాలి. కానీ అతని ప్రతి తప్పుని ఆకర్షణీయంగా, అతని మగతనానికి ప్రతీకగా, యువతకు అనుసరించాలి అనిపించేలా ఉండకూడదు.

 

యువత సిగిరెట్లు, మందు వంటి హానికారక అలవాట్లు చేసుకోవటం, ప్రేమ వైఫల్యానికి, సహజ పరిణామంగా, అదొక ఫేజ్ గా , వారి హక్కుగా చిత్రీకరించటమే తప్పు! పెద్ద వాళ్ళు దాన్ని వ్యతిరేకిస్తే అది పెద్ద తరం ఛాదస్తాలకి, యువ తరం ఆశలకి మధ్య సంఘర్షణలా రంగు పులమటం ఇంకా తప్పు! ఉడుకు రక్తపు ఆవేశాన్ని ఆశయ సాధన దిశగా మళ్ళించాలి తప్ప పతనం వైపు కాదు. చిత్రం ఈ సందేశం ఇవ్వాలి అని నేను అనట్లేదు. సందేశాత్మక చిత్రాలు నాకూ ఇష్టం లేదు. కానీ చెడుకి సహజంగానే ఆకర్షించే శక్తి ఉంది. దానిని ఇంకా అందంగా ప్యాకింగ్ చేసి మార్కెటింగ్ చేయాల్సిన అవసరం లేదు!

 

ఆఖరుగా దురలవాట్లు అన్నీ మానుకున్న అర్జున్ రెడ్డి కోపాన్ని కూడా జయించాడా?  లేక అతనే చెప్పుకున్నట్టు “అది చాలా అవసరం! దట్స్ మీ” అన్నాడు కాబట్టి అలాగే ఉన్నాడా? ఏమో! సందీప్ రెడ్డిని అడగాలి!

 

*****************

 

4 thoughts on “అసలు సిసలు మగాడు?- అర్జున్ రెడ్డి

 1. కథ సో సో —
  విజయ నటన సినిమా కు ప్రాణం posindhi.
  ఏళ్ళ. తరబడి సీమాంధ్ర పెత్తనం లో తెలంగాణ నటులు ౧%
  60 ఏళ్ళ నటులు నేటికీ హీరో లు గా ?/ సిగ్గుచేటు
  వాళ్ళ. కన్నా గొప్పగా —విజయ నటన — వర్మ గారు కూడా మెచ్చు కున్నారు
  =====
  రెడ్డి

  1. తెలంగాణ విడిపోయిన తరువాత తెలుగు భాష
   మరింత సుసంపన్నమైంది.
   తెలంగాణ పదాలు ఇంకా అందంగా కనపడుతున్నాయి ఉభయ రాష్ట్రాల ప్రజలు హర్షిస్తున్నారు.
   అమీతుమీ, ఫిదా అర్జున్ 3 సినిమాల్లో అదే కనపడుతుంది.
   ఎన్నేళ్ళుగా ఆంధ్రా భాషను, అక్కడి యాసను , అక్కడి హీరో లను తెలంగాణ ప్రజలు ఎలా భరించారు?
   బహుశా ఇవే కారణాలు చీలికకకు ఆజ్యం పొసాయేమో?

 2. Arjunreddy meeku yeppatiki artham kaadhu.mee laanti Hippocrates ni , arjunreddy gayam chesthsdu.hurt chesthanu.

 3. * arjunreddy meeku yeppatiki artham kaadu.mee laanti hypocrites ni arjunreddy gayam chesthadu.hurt chesthadu.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


   Type Comments in Indian languages (Press Ctrl+g to toggle between English and Hindi OR just Click on the letter)