కితాబ్ వ్యాసం

ఆత్మఛాయ

-కె. శివారెడ్డి

 

 

అప్పుడప్పుడనుకుంటా- మోసం చేస్తున్నానా- ముందుమాట పేరుతో మోసం చేస్తున్నానా- అని, నన్ను నేను మోసం చేసుకోకుండా ఇతరుల్ని ఏ రూపేణయినా, మోసం చేయగలనా అని. నేనిందులో మునగకుండా మాట్లాడుతున్నానా అని చెక్‌ చేసుకుంటాను. ఒక్కోసారి అన్నీ మర్చిపోతాను- కవి ఎవరో ఏ ప్రాంతంవాడో, ఏ వాదం వాడో- ఎట్టా వుంటాడో- అన్నీ మర్చిపోతాను. నా ముందున్న కవిత్వంలో మునిగాక- యీపక్క మునిగి ఆ పక్క తేలాక- మళ్లా ఆ పక్క మునిగి ఈ పక్క తేలాక- ఎవరితను నన్నొక నీటిపిట్టను చేసి కవిత్వంలో మునకలేయిస్తున్నాడు- నిన్న పొందని అనుభవం నేనివాళ పొందు తున్నాను- యిందులో ఆనందం లేదా?- గింజుకుంటాను, తన్నుకు లాడతాను- నాలుగు మాటలు మాట్టాడటానికి- మనసు మారు మూలల్లోంచి మాట్లాడటానికి. వీళ్ల రుణమెట్లా తీర్చుకోగలను. ఏమాత్రం తీరికలేని ఈ జీవితంలో యింత ధ్యానం- యింత ధ్యానసుఖం ప్రసాదిస్తున్నారు- ఒక్కో కవి ఒక్కో మొక్క తెచ్చి నాటుతాడు- నాలో మసలి నన్ను అన్నివైపుల నుంచి చుట్టుముట్టి అనుభవం పుట్టలా పెరుగుతుంది.

 

యిన్నాళ్ల సాధన నుంచి, అధ్యయనం నుంచి ఏం పొందాను? అధ్యయన సాధనాలు చూయించిన మార్గమేమిటి?

 

ఇతడు నా చుట్టూ వున్న ప్రపంచం గురించి, మనుషుల గురించి, వారి జీవితం గురించి, అనుభవాల గురించి, దుఃఖానుభవాల గురించి, ప్రకృతి అనుభవాల గురించి తను కేంద్రంగా పాడుతున్నాడు గదా- అతని పాట మన పాట ఎలా అవుతుంది? అతని పాటని మన తనువు సారంగి మీద పలికిస్తున్నాడు. నవనాడుల తంత్రులన్నీ చలించి, చలించి పోతున్నాయి. సర్వ ప్రకృతీ, సర్వ మానవప్రవృత్తీ అందులో ధ్వనిస్తే- అది నాకందితే- నేనందుకున్నదాన్ని మీకు చెప్పటానికి ప్రయత్నిస్తే- ప్రశ్నలు, సందేహాలు పక్కనబెట్టి మునగటానికి సిద్ధమయి-

 

అంతే- రవి వీరెల్లి కవిత్వమనే వరికంకి బాగా పండి నా ముందు వంగి, బంగారు రంగు కాంతులీనుతూ- గాలికి అల్లల్లాడుతుంటే ఆ క్షణాన్ని పట్టుకుంటానికి ప్రయత్నం- కాసేపు నాలో వున్న తార్కికుణ్ణి పక్కనబెడతా.

 

“గుడ్డిగా గీతలు గీసుకుంటూ       

ముందుకెళ్లే జీవితానికి     

సుద్దబలపంలా      

అరిగిపోవటమే తెలుసు.

 

కాలానికేమో  కనిపించినంత మేరా

మలిపేసుకుంటూ పోవటమే తెలుసు

 

కాలాన్ని మరిపించి మాయచేసి   

కాసేపు వెనక్కి నడచి      

ఆ మలిగిపోయిన మరకల కింద   

కనీ కనిపించని అచ్చులను యిష్టంగా తడిమే నాకు     

ముందుకెళ్లటమంటే  వెనక్కి నడవటం కూడా”- (ముందుకీ వెనక్కీ)

 

ఈ కవిత పేరు ‘ముందుకీ వెనక్కీ’. కవిత్వమొక లోలకపు యాత్ర. జీవితం గానిది కవిత్వమెలా అవుతుంది?

 

ఏం మాట్టాడుతున్నాడు- దేన్ని గురించి మాట్టాడుతున్నాడు. అంతరార్థాలు లేవా- ఏ తత్వం పలుకుతున్నాడు. ఏ దశలో ఏ మానసిక స్థితిలో వుండి మాట్టాడుతున్నాడు.

 

అమెరికాలో ఉద్యోగిస్తున్న ఒక అనుభవశీలి- వాటికి దూరంగా 15 ఫిబ్రవరి 2014లో పలికిన పలుకులివి.

 

ఒక్క క్షణం ఆగి, ఈ స్థితి పొందటానికి అమెరికా వెళ్లాలా- వెళ్లినవాడే పొందాలా? యిక్కడుండి- ఈ భరతమేదిని మీద యాత్రిస్తూ వున్నవాడికిది అనుభవం లోకి రాదా?

 

ఎన్నెన్ని చారిత్రక, సామాజిక సందర్భాలలో ఎప్పుడో ఒకప్పుడు ఎవడయినా యిలా పలకాడా? మలిగిపోయిన మరకలన్నాడు, కనీ కనిపించని అచ్చులన్నాడు. మరకలేమిటి? ముద్రలేమిటి? ఏ తార్కితత్వ జ్ఞానం పొందుతున్నాడీ కవి. పైపైన కదపటం లేదు- గడ్డివామిలో లోనెక్కడో వున్న జనపకట్టలా ఒక మాగిన వాసన. కట్ట, అది మొలిచి, ఆ జనుం తడి నేలలో మొలిచి, పెరిగి పెద్దదయి పూత పూసి- మందగాలులకి ఊగి కోతకొచ్చినప్పుడు కోసి, ఎండేసి కట్టలు కట్టి- వామిలో గడ్డిమోపుల మధ్య శయనింప చేస్తే- గడ్డి దూసినప్పుడు జనపకట్ట బయటపడి తన గత జీవితాన్నంతా గుర్తుకు తెచ్చుకుంటూ ఆవు నోటికందుతుంది. తిని, ఆవు నెమరు వేస్తున్నప్పుడు ఒక విచిత్రమయిన గతకాలపు వాసనేదో నల్దిక్కులా ప్రసరిస్తే-

 

“నడుమొంగిన నిద్రగన్నేరు కొమ్మకింద   

ఎప్పుడోగానీ రాలే ఆ ఒక్క పువ్వు కోసం 

కదలకుండా ఎదురుచూస్తున్న కోనేటి మెట్టులా  

పిలుపుకు పడిగాపులు కాస్తూ    

ఎన్నాళ్లు?

 

ఎన్నో దేహాల్ని పవిత్రం చేసి

పచ్చగా నవ్వుతున్న కాలం కోనేట్లోకి     

పాత జ్ఞాపకంగా మిగిలిన రూపాయిబిళ్లను గిరాటేశా-

 

పాటై చిగురించిన జీవితపు కొమ్మలోంచి  

పండుటాకుల్లా ఒక్కొక్కటే రాలిపడే చరణాల్ని

 

శ్రుతి చేసుకుంటూ  

తోలు బుర్ర నిండా ఒంటరితనాన్ని ఊదుకుని     

విడిది పడవ వదలివెళ్లాలిక

 

సలపరించే ఆలోచనల్ని బుక్క పోసి        భావాల నొప్పిని పుక్కిలిస్తూ

నా నీలోంచి   ఉవ్వెత్తున ఎగసే ప్రేమకెరటాల్ని ఈదుకుంటూ

 

కాట గలిసిన దిక్కుల్ని ఒక్కటి చేయటం కోసం   

తన నీడకు తానే నిప్పంటించుకుని తరలి వెళ్లే సూర్యునిలా     

లోలోన ఘనీభవించినచైతన్యంలోకి

తపస్సుకు   

బయల్దేరాలిక”-(బయల్దేరాలిక)

 

అక్టోబరు 2013లో రాసిన కవిత.

 

 

ఒక అంతర్యానం గురించి మాట్లాడుతున్నాడా- జీవితం మొత్తాన్ని మననం చేసుకుంటున్నాడా- నెమరు వేసుకుంటున్నాడా?

 

వ్యవస్థాగత దుర్మార్గాల మధ్య బతికే వాడికీ స్థితి సాధ్యమా- రెండు కాళ్లు ఒక దగ్గర పెట్టే తీరిక లేనివాళ్లకు- పొలం గట్టుమీదో, మోటబాయి దగ్గరో కూర్చున్నప్పుడు దిగంతాల్లోకి చూస్తూ- ఈ అనుభవం వాళ్ల అనుభవంగా మారుతుందా?

 

‘జ్ఞాపకం రూపాయబిళ్ల’ అన్నాడు. ‘భావాల నొప్పి’ అన్నాడు. ఎక్కడో లోలోపల మెలితిరిగిపోతూ తన యాతనని, మానసిక ఒంటరితనాన్ని- తన నీడకు తానే- తన గతానికి బహుశ తానే నిప్పంటించుకుని బయల్దేరాలంటున్నాడు.

 

‘కప్పతల్లి’ అనే కవిత ఈ సంపుటిలోని బలమయిన కవితల్లో ఒకటి. వర్షాల్లేనప్పుడు కప్పని ఊరేగిస్తే వర్షం కురుస్తుందనే నమ్మకం ఆధారంగా రాసిన వండర్‌ఫుల్‌ పోయెమ్‌. ఈ కవితని ఎలా పాక్‌ చేశాడో ఆశ్చర్యం కలుగుతుంది. ఒక లెవెల్‌లోగాదు అనేక లెవెల్స్‌లో కవిత అర్థాన్ని, అనుభవాన్ని వెదజల్లుతుంది.

 

ఖాళీతనాన్ని మోయలేని తపుకు

వీపు కంటుకుపోయిన కడుపు

ఆకలి పాటందుకున్నాయి-

కలలన్నీ పోగేసి పోసిన మండె మొలకెత్తాలంటే

ఎన్ని కడవల కన్నీళ్లతో తడపాలో-

 

 

గుండెల్ని నిలువునా చీల్చుకెళ్లిన గోదారికి

ఏ వూరి తరి ఎన్ని నెర్రెలు నేరిస్తేనేం

 

ఒక కవిత మనం చూడనిదాన్ని మనకి దృశ్యమానం చేయాలి. కవితాసాంద్రత తగ్గకుండా- అర్థస్ఫూర్తుల్ని వెదజల్లుతూ కొనసాగాలి. ఎక్కడో ఒక గాయం తాలూకు తడి, దుఃఖం అలా ప్రవహించాలి. ఒక ప్రాంతపు ఆర్తిని మనముందు ఏతామేయాలి.

 

పొద్దుగాలనంగా ఊరేగింపుకెళ్ళిన కప్పతల్లి

పొద్దుగుంకినా

యిల్లు చేరకపాయ”- (కప్పతల్లి)

 

పొద్దుననంగా యిల్లొదిలి వెళ్లిన పిల్లాడు, సాయంత్రం యిల్లు చేరకపోతే యెలా వుంటుంది.

 

నాకేదయితే స్ఫురించిందో ఆ స్ఫురణ కలిగించిన ఎరుకతో నేనే అనుభవానికి లోనయ్యానో పాఠకులందరూ అదే స్థాయిలో ఆవేదనని అందుకుంటారన్న హామీ ఏమీలేదు.

 

మీ కవిత్వ ఓరియంటేషన్‌ని బట్టీ, ఒక ఘటనకీ, సమాజానికీ      ఉన్న సంబంధాన్ని బట్టీ దాన్ని అనలైజ్‌ చేసుకుని, అన్వయించుకుని ఆనందించే శక్తిని బట్టి వుంటుంది. ఒక వాస్తవాన్ని చెబుతున్నాడు, ఒక సామాజిక వాస్తవాన్ని ఒక ప్రాంతపు దయనీయమయిన జీవన వాస్తవికతని కళ్లకు కడుతున్నాడు. కవిత ఎలివేట్‌ అవటానికి అది ఎవోక్‌ చేసే భావోద్రేకాల మీద ఆధారపడి- అదంతే ప్రతి కవితనీ ప్రతిపదార్థ తాత్పర్యంతో విప్పిచెప్పటం కష్టం. పాఠకుణ్ణి ఇన్‌వాల్వ్‌ చేయటానికి కవి ఎన్నుకున్న మార్గం ముఖ్యమౌతుంది.

 

ఈ కవి ఎటువంటి, ఏ సార్ట్‌ పోయెట్‌ అని నేనప్పుడాలోచించను. ఏ శక్తి నన్నందులో ఇన్‌వాల్వ్‌ చేస్తుంది. Its imaginative strength or culture of the ఏ శక్తి నన్ను పుస్తకం మొదటి నుంచి, చివరి పేజీ వరకు లాక్కెళుతుంది, కొత్త రక్తాన్ని ఎక్కిస్తుంది. యిది నా సంస్కారానికి, కవిత్వ సంస్కారానికి సంబంధించి, కవి కవిత్వం సంస్కారానికి సంబంధించిన ప్రశ్న. ఎక్కడో ఏ పాయింట్‌ వద్దో ఈ రెండు సంస్కారాలు కలవకపోతే- ఉన్మీలనం జరగదు. ఉన్మీలనం లేకుండా (పాత మాట వాడానా?) రసాస్వాదన జరుగునా! రసాస్వాదనంటే ఏమీ లేదు; ఆ భౌతిక మానసిక స్థితిలో మనం ఐక్యం అవటం. నేను చాలా స్పష్టంగా మాట్లాడుతున్నా- కానీ కొంత అస్పష్టత వుంది. నేనేది అందిద్దా మనుకున్నానో అది అంత సులభంగా అందేది కాదు.

 

కవిత్వం అంటే అందీఅందనట్టు వుంటూ ఆనందాన్ని, అనుభవాన్ని ప్రసాదిస్తుంది.

 

“కంటి పాత్రలోకి

ఎన్ని దృశ్యాల్ని వొంపినా

ఎదురుచూపు తప్ప

ఏమీ మిగుల్చుకోదు

బికినీ వేసుకుని ఓరగా చూస్తూ

వేడి వేడి పగళ్ల ఇసుకతిన్నెల మీంచి

చప్పున అలా శీతాకాలం అలల్లోకి మాయమయ్యే

వేసవిలా-

కన్నూ… కాలమూ… ఎప్పుడూ వెలితికుండలే

కవిత్వంలా”- (వెలితికుండ)

 

కవిత ఒక దృశ్యవర్ణనతోనే ముగియదు. దాన్నుంచి ఒక జీవన తాత్వికతని చేదుకోవటం వల్ల దానికొక సార్వజనీనత అబ్బుతుంది. అబ్బురపరుస్తుంది.

 

“బుడి బుడి అడుగులేసే

చిట్టిపాపకు

విరామచిహ్నం

అమ్మ వొడి

ఆత్రంగా చుట్టేసుకునే

చీకటికి

చివరి ముద్దు

పొద్దు పొడుపు

 

 

గమ్యాన్ని తలుచుకోకుండా

ఏదీ మొదలవదు

ఆఖరికి

వేలెడంతలేని

వాక్యం కూడా”– (గమ్యం)

 

అసలీ కవి శక్తంతా అతను వస్తువును చూసే తీరులోనే వుంది. బహుశ వస్తువుకు కవిత్వరూపం ప్రసాదించేది చూపే- భిన్నంగా చూడకపోతే- భిన్నంగా ఊహించకపోతే- అది కొట్టొచ్చినట్టు పలకదు, కనపడదు. చూసే పద్ధతి ఏ వాదపు కవికయినా ముఖ్యమే. వస్తువు కవితగా మారి అది కవిత కాకపోతే మనల్ని ఆకట్టు కోదు, ఆలోచింపజేయదు.

 

‘సకినం’ అనే యింకొక కవిత. ‘సకినం’ తెలంగాణ ప్రాంతంలో కారపు తిను బండారం. వేరే ప్రాంతాల్లో చక్రాలు, చక్కిలాలు అంటారు. గుండ్రంగా వుంటాయి. ‘సకినం’ అనే శీర్షిక బెట్టి-

 

“సున్నాతోనే

ఏదయినా

మొదలయ్యేది

పసిపాపకు ముద్దు పెడుతున్నట్టు 

మొదట

ఓ సున్నా అయితే చుట్టు   

జపమాలను తిప్పినంత సున్నితంగా     

వేళ్లు కదిలిస్తూ      

ఇష్టంగా      

నీలో నువ్వే   రెండో చుట్టు తిరుగు

మొదటి వాక్యం రాశాక     

ఆవు వెనక లేగదూడలా   

రెండో వాక్యం దానికదే తోడొచ్చినట్టు-      

మూడో చుట్టు

నాలుగో చుట్టు       

ఇక మిగతావి నీ ఇష్టం      

చుట్టుకుంటూ, చుట్టుకుంటూ పోతేనే కదా 

చిక్కులు పోయి     

చివరంచు దొరికేది   

అన్నట్టు     

చెప్పడం మరిచా    

చేతి వేళ్లలో తడి ముఖ్యం సుమా  

కవిత్వం రాయటానికయినా

సకినం చుట్టటానికయినా”– (సకినం)

 

ఇదీ ‘సకినం’ కవిత. దేంతో దేన్ని లింకు చేసి చెబుతున్నాడు. అసలు వీరెల్లి తత్వంలోనే యిది వుంది. ఒకదాన్నుంచి మరోదాన్ని చేదుకునే లక్షణం. ఏ కొస ముట్టిస్తే పద్యం వెలుగుతుందో అతనికి తెలుసు. తననుకున్న, అనుభవించినదాన్ని యితరులకు ఎలా బట్వాడా చేస్తున్నాడనేది ముఖ్యం. వేటి, వేటి ఆధారంగా మెట్లెక్కి, అసలుదాన్ని అందుకున్నాడనేది ముఖ్యం. ఉపమలు, రూపకాలు, ఉత్ప్రేక్షలు- నదీచిత్రాలు, పరబంధాలు- ఇమేజ్‌లు- దృశ్యపరంపరలు- అలా అల్లుతాడు. కవితనలా జాగ్రత్తగా డీల్‌ చేసి, పాఠకుడితో సహా తనూ పండిపోతాడు.

 

“The lyric, especially the monody, was counter-posed against the epic. Whereas the speaker of the epic acted as the deputy of a public voice, a singer of talcs narrating the larger talc of the tribe, the speaker of the monody was a solitary voice speaking or singing on his or her own behalf.

The lyric poem thus opened up a space for personal feeling. It introduced a subjectivity and explored our capacity for human inwardness. The intimacy of lyric stood against the grandeur of epic, its exalted style and heroic themes, its collective nostalgia.

– From Introduction of the Best American Poetry 2016

by Edward Hirsch

 

రవి వీరెల్లి కవిత్వం చదువుతుంటే, వీరెల్లే కాదు చాలామంది ఆధునిక అత్యాధునిక ఆధునికాంతర కవుల్ని  చదువుతుంటే ఈ మాటలు వీళ్లని దృష్టిలో పెట్టుకు చెప్పినట్టే కనబడతాయి. అన్నిరకాల వాదాల కవిత్వం చదివిన తర్వాత కూడా- ఈ వాక్యాలు సత్యాలని, ఒక లిరికల్‌ ఆటిట్యూడ్‌ అన్నిరకాల కవిత్వాల్లోకి చొరబడిందని- ఆధునిక జీవన వ్యవస్థని వ్యక్తీకరించటానికి, బొమ్మ కట్టటానికి, ఒక సాన్నిహిత్య సంబంధం ఏర్పరచటానికీ ఈ లిరికల్‌ అప్రోచ్‌ అవసరమని.

 

తమని తాము గాఢంగా వ్యక్తీకరించుకునే క్రమంలో- తమ్ము తాము గాఢంగా బహిర్గతం చేసుకునే క్రమంలో ఆ శైలి సహజంగానే రూపొందిందని- ఎంత దగ్గరగా జరిగితే, చేరటానికి ఏది అవకాశమిస్తే దాన్నందుకుని కవితాచరణలో పెట్టటానికి నేటి కవి వెనుకాడటం లేదు. కవితకి ఒక గాఢతే కాదు- ఒక ఇంటిమేట్‌ టోన్‌, స్వరం ఇవ్వటానికి, పాఠకుడిలో నెలకొల్పటానికి సహజంగానే వ్యక్తీకరణాన్వేషణలో భాగంగానే యిది రూపొందిందని- ఒక ఆత్మీయముద్ర వేయటానికి, పాఠకుణ్ణి తనలోకి పీల్చుకుంటానికి యిదొక సాధనం. లిరిక్‌ పోయెమ్‌ని తెలుగులో ఎలా అనువాదం చేయాలో తెలియలేదు. ఎలా అనువదించినా అది పరిమితార్థంలోనే మిగిలిపోతుంది.

 

అనేక పొదల్తో, అనేక అంతరువులతో, సంక్లిష్టతలతో, సంకీర్ణ సంవేదనంతో నిండిపోయిన జీవితాన్ని ఒక ఆత్మీయస్పర్శ యిచ్చి చెప్పటానికీ విధానం పనికొస్తుందేమో. రకరకాల వాదాల కవిత్వం, రకరకాల నేపథ్యాలతో, ఘర్షణలతో వర్థిల్లుతున్న కవిత్వంలోకి యిది చొరబడిందా? లేదు యిదే అనువయిన, సాధ్యమయిన మార్గమా? అయితే ఇప్పుడు ఈ లిరికల్‌ ఎలిమెంట్‌, ఆటిట్యూడ్‌- పరిహరించలేనిదయ్యింది. మనం ఎదుర్కొంటున్న జీవితమే మనల్ని అటువైపు నెట్టిందేమో.

 

ఈ సమయంలో, సందర్భంలో భారతీయ భాషల్లోనే కాక ప్రపంచ భాషల న్నింటిలో వస్తున్న కవిత్వాన్ని పోల్చిచూసి అంచనా వేయవలసిన, ఒక నిర్ధారణకు రావలసిన అవసరముంది.

 

ఇదంతా ఎందుకు చర్చింటమంటే వీరెల్లి కవిత్వం మొత్తం- ఆ లిరికల్‌ ఫ్లేవర్‌తో నిండి వుంది. ఒక సాధారణ విషయం చెప్పినా, ఒక ప్రకృతి దృశ్యాన్ని చూయించినా తన వ్యక్తిగత అనుభవాన్ని అనువదించినా- అన్నింటా ఒక అంతర్లయలో ఈ లిరికల్‌ సౌరభముంది. ఇది ఉండటం వల్ల ఈ కవిత్వం మనకి మరీ దగ్గరవుతుంది. మనం మాట్లాడినట్టే వుంటుంది. లిరిక్‌ పోయెట్రీ అంతటా ఒక రొమాంటిక్‌ స్ట్రెయిన్‌- జీర వుంటుంది.

 

దీనివల్ల యిది మరింత ఆస్వాదయోగ్యమయితే మంచిదే.

 

పుట్టిన కొండల్ని తలుచుకుంటూ 

ఏ లోయ పొత్తిళ్లలోనో సుళ్లు తిరుగుతూ   

కాసేపు అక్కడే నిలబడిపోయిన నదిలా   

ఓ క్షణం ఆగి వెనక్కొక్కసారి తిరిగి చూసుకుంటాను-(తిరుగుప్రయాణం లేని ప్రయాణం)

 

చినుకును ముట్టుకుంటే  

ఆకాశాన్ని ముద్దు పెట్టుకున్నట్టే   

ఆకును పట్టుకుంటే 

ఆరారు కాలాలని పిడికిట్లో బిగించినట్టే    

కంటి కిటికీ తెరిచి   

కాంతి కిరణాన్ని రారమ్మని పిలిస్తే 

ఏడేడు రంగులతో ఇల్లలుక్కున్నట్టే”- (దేహకాంతి)

 

యింత ‘దేహకాంతి’తో ఓ ‘పొద్దుపొడుపు’ని పోతపొయ్యటానికి నడుం కట్టిన రవి వీరెల్లి అంటున్నాడు-కన్నూ కాలమూఎప్పుడూ వెలితి కుండలే- కవిత్వంలా

 

”కవిత్వానికి ఊరికి ఏదో లంకె వుంది. బొడ్డుతాడు తెంపాక కూడా పిల్లాణ్ణి అమ్మనీ కలిపి వుంచే అదృశ్య దారంలాగా, ఊరు వదిలాక కూడా ఇంకా ఆ వూరుతో తెగని అదృశ్య బంధం నీడలా వెంటాడుతూనే” అంటున్నాడు వీరెల్లి ఇంట్రోలో.

 

ఒక వీరెల్లి అనేకాదు- అందరి కవుల అస్తిత్వాలు అక్కడే వున్నాయేమో!

 

విచిత్రం- అఫ్సర్‌ రాబోయే తన కవితాసంపుటికి ‘ఇంటివైపు’ అని పేరు పెట్టాడు. ఇది యాదృశ్చికం కాదు. ఆంతరిక ప్రపంచాలు అటూ ఇటూ కదిలి, ఊగి ఊగి కాస్త మూలాల వైపే మొగ్గుతాయేమో!

 

”శిశిరానికిచ్చిన మాటకోసం చెట్టు చెయ్యినే విడిచిన ఆకులా భూమ్మీదున్న భరోసాతో ఎప్పుడయినా నిర్భయంగానే నేలరాలొచ్చు”

 

అదీ రవి వీరెల్లి ఆత్మఛాయ.

 

1 మార్చి 2017, హైదరాబాద్‌

 

One thought on “ఆత్మఛాయ

  1. అద్భుతమైన విశ్లేషణ.ఇదీ శివారెడ్డి తత్వం.కవిఆత్మను వెల్లచేయడం.యిది చదివాక వీరెల్లి రవి గారి కవిత్వం సాంతం చదవాలనిపిస్తుంది.avait the book.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


   Type Comments in Indian languages (Press Ctrl+g to toggle between English and Hindi OR just Click on the letter)