Featured కాలమ్స్

ఆధిపత్య కులాధార మతసాహిత్య ఫాసిజం

– డా. జిలుకర శ్రీనివాస్‌

ఆధిపత్యం, అధికారం, దోపిడీ కొనసాగించాలనుకొనే వర్గం నేరుగా ఆ పనికి దిగదు. ఆ లక్ష్యాన్ని నెరవేర్చుకోవడానికి అవసరమైన సామాజిక మానసికస్థితి (సోషల్‌ సైకాలజీ)ని ముందుగా అది నిర్మించుకుoటుంది. తను పాలించే జాతుల గత, వర్తమానాలను తెలివిగా పక్కకు పెడుతూ, తన చరిత్రను మాత్రమే మొత్తం సమూహా చరిత్రగా అది లిఖిత రూపంలోకి తీసుకొస్తుంది. మౌఖిక రూపంలో అనేక కథనాలను అది ప్రవేశపెడుతుంది. అంతేకాదు, అనేకానేక గుర్తులను, ప్రతీకలను, సంకేతాలను,సంజ్ఞలను అది పాలిత సమాజం యొక్క మానసిక జ్ఞాపకసంచుల్లో కూరుతుంది. జ్ఞాపకాల సంచుల్లో అనేక యేళ్లపాటు అవి మగ్గిపోయి, అవే నిజమైన జ్ఞానవిశేషాలుగా ఒప్పుకొని, వాటినే నిరంతరం మననం చేసుకొనే ఒక ఆచారంగా మారిపోతుంది. అందుకే, చరిత్రను ఎవరు నిర్మిస్తున్నారన్నదే ముఖ్యం. ఏ వర్గం దాన్ని తయారు చేస్తుందన్నది అర్థమైతే,దాని స్వభావం తేలిగ్గా బోధపడుతుంది.

ఒక దేశ సాహిత్య సాంస్కృతిక రాజకీయ చరిత్రను నిర్మించే ఉపకరణాలను ఎంపిక చేసుకునేటప్పుడే పాలక వర్గం చాలా నేర్పుగా వ్యవహరిస్తోంది. తన వైభవాన్ని మాత్రమే చాటి చెప్పే ఆకరాలను అది పాలిత సమాజానికి తెలియ చేస్తుంది. పాలితుల చరిత్రను, వైభవాన్ని తెలియ చేసే ఆకరాలు లభ్యమైనప్పుడు,వాటిని నిర్లక్ష్యం చేయటం, గుర్తించ నిరాకరించటమో లేదా ఆ ఆకరాలను ధ్వంసం చేసి ఎవరికీ తెలియకుండా చేయటమో చేస్తుంది. ఒకవేళ అన్ని ఒడిదొడుకులను తట్టుకొని ఒక ఆకరమేదైనా నిబడితే, దానికి ఎలాంటి అధికార గుర్తింపునూ ప్రాముఖ్యతనూ లేకుండా చేసి, తన పాలితుల చేతే దాన్ని హేళన చేసే ఎత్తుగడను అది అమలు చేస్తోంటుంది. ఇది అన్ని కాలాల్లో, అన్ని స్థలాల్లో జరిగిన, జరుగుతున్న ఒక ప్రాసెస్‌. దీన్ని పొలిటికల్ ప్రాసెస్ అందాం. ఈ పొలిటికల్‌ ప్రాసెస్‌ను ధిక్కరిస్తో పాలితజాతులు తమ ఉనికిలోకీ, తమ చారిత్రక వారసత్వంలోకీ, తమ ప్రపంచాన్ని పునర్ నిర్మించుకొనే ఒక క్రియాశీల కార్యంలోకి ప్రవేశించినప్పుడు, పాలక జాతులు చారిత్రకఆధిపత్యాన్ని నిర్మించుకోవడానికి అనుసరించిన వైధానిక పద్ధతుల మీద, ప్రక్రియ మీద, ఆకరాల మౌలికత మీద నిశిత ప్రశ్నలను సంధిస్తాయి. అలాంటి ఒక ఉద్విగ్న సందర్భం వచ్చినప్పుడు పాలక జాతులు కలవరపడుతాయి. అప్పటిదాకా ఏవి చరిత్ర నిర్మాణానికి ప్రమాణాలుగా, ఆకరాలుగా భావించారో అవి అపహాస్యం పాలవుతాయి. కొత్త ప్రమేయం, ప్రవర్తన సంధించే సారభూత సవాళ్లకు పాలక జాతులు సమాధానం చెప్పలేని స్థితిలో, పాలిత జాతులు తమ నిజమైన చరిత్రను వ్యక్తీకరించుకుంటాయి. బ్రిటీషువాళ్ల నుంచి అగ్రకులాలు స్వేచ్ఛను కోరుకున్నప్పుడు, తమిళనాడు నుంచి ఆంధ్ర వేర్పడాలనుకున్నప్పుడు, తెలంగాణ రాష్ట్రం ప్రత్యేకంగా ఏర్పడాలని భావించినప్పుడు తమ ప్రత్యేక చరిత్రను,వారసత్వాన్ని బలంగా ప్రకటించుకున్నాయి. అయితే, భౌగోళిక స్వేచ్ఛకోసం జరిగిన సంఘర్షణను భావాల మధ్య సంవాదాలకు దారితీశాయి. కానీ, ఆ భావాలేవీ ఆధిపత్య భావజాలాన్ని సంపూర్ణంగా ధిక్కరించేవిగానూ లేదా పూరకంగానూ గానీ రాలేదు. పైగా ఆధిపత్య భావాల్లో అవి సంలీనం చెందాయి. ఇది సహజమైన విషయం.

ఈ పరిణామం జ్ఞానరంగంలోని అన్ని శాఖలకూ వర్తిస్తోంది. ఈ అవగాహనతో తెలుగు సాహిత్య వ్యవస్థను పరిశీలించాలి. ఇక్కడ తెలుగు సాహిత్యం అంటే ఒక భాషా సాహిత్యంగా మాత్రమే నేను భావించటం లేదు. తెలుగు ప్రాంతంగా చెప్పబడుతున్న వాటిలో నివశిస్తోన్న ప్రజా సాహిత్య చరిత్రను ప్రస్తావిస్తున్నా. ఈ ప్రాంత ప్రజల చరిత్రను నిర్మాణం చేయటంలోనే పాలక వర్గం వూహించలేనన్ని కుట్రలకు పాల్పడ్డది. ఈ ప్రాంత సాహిత్య,సాంస్కృతిక చరిత్ర (హిస్టోరియోగ్రఫి)ని తయారు చేయడానికి తెలుగు, సంస్కృత భాషను మాత్రమే ప్రమాణంగా తీసుకోవడం ఒక కుట్ర. మొత్తం చరిత్రను హిందూ (బ్రాహ్మణ) చరిత్రగా చాటిచెప్పటం. తెలుగు బ్రాహ్మణీయ హిందూ చరిత్రను అధికారికంగా ప్రతిష్టించడానికి పాలకవర్గ మేధోకృషి ఎంత దాష్టీకానికి పాల్పడాలో అంత కన్నా ఎక్కువే పాల్పడ్డది.

ఈ ప్రాదేశిక సాహిత్య చరిత్రకు తెలుగు మాత్రమే ప్రామాణికమా?ఈ ప్రాదేశిక ప్రజలు వేల యేండ్లు మాట్లాడి, రాసి, చదివి, పాడిన ఇతర భాషల్లోని ఆకరాలను ప్రామాణికంగా ఎందుకు తీసుకోలేదు? ప్రధాన ఆకరాలుగా కాకున్నా ద్వితీయ శ్రేణి ఆకరాలుగానైనా ఏ కారణం వల్ల వాటిని స్వీకరించలేదు? వేల యేళ్ల చరిత్ర గల ఈ ప్రాదేశిక వారసత్వం తెలుగు అనే అతి చిన్న వయస్సు గల భాషకే ఎందుకు పరిమితం చేయబడ్డది? వలస పాలన కాలంలో తెలుగు సాహిత్య చరిత్ర నిర్మాణ కృషి మొదలైందని చరిత్రకారుల నిర్ణయం. సిపి బ్రౌన్‌ ఆధ్వర్యంలో అనేకమంది బ్రాహ్మణ పండితులు వేలాది తాళపత్ర గ్రంథాలను సేకరించారు. వాళ్ల కులం వల్ల, ఆచారాల వల్ల  శూద్ర, అతిశూద్ర జాతుల వద్ద వుండే తాళపత్రాలను సేకరించగలిగారా? శూద్ర,అతిశూద్ర, గిరిజన, ఆదివాసీల దగ్గర వున్న గ్రంథాలను సేకరించి వుంటే, వాటికి సంబంధించిన రికార్డులేమైనా వున్నాయా? ప్రాచీన తాళపత్ర భాండాగారంలో ముక్కిమూలుగుతున్న వాటిలో బ్రాహ్మణేతరులు రాసినవెన్ని వున్నాయి? ఒక కుమ్మరి మొల్ల, పోతులూరి వీరబ్రహ్మం,వేమారెడ్డిలాంటి ఒకరిద్దరి గురించి తప్ప బ్రాహ్మణేతర కులాల కవులు రాసిన కావ్యాలేవీ లేవా? తెలుగు సాహిత్య చరిత్రను నిర్మించే పేరుతో కేవలం బ్రాహ్మణుల రచనలను మాత్రమే ఎందుకు ఎంపిక చేసుకున్నారు? గ్రంథ పాఠ్యాల పరిష్కారంలో వుండే సంక్లిష్టతను, సమస్యను అధిగమించి చరిత్ర రచన చేసిన వాళ్లకు ఇతర కులాల రచనలెందుకు కనిపించలేదు? అవి అసలే లేవా? లేకపోతే ఎందుకు లేవు? సేకరించిన ప్రాంతాల్లో ఎన్ని బ్రాహ్మణేతర కులాల యిండ్లను వాళ్లు  విచారించారు?మరో అడుగు ముందుకేసి అడగాల్సినవి యింకా వున్నవి.  తెలంగాణ, ఆంధ్ర, రాయసీమ ప్రాంతాల్లో ఉర్దూ, పార్శీ భాషలున్నాయి. నైజాం పాలనలో పర్షియన్‌, ఉర్దూ రాజభాషలు. ఆ భాషల్లో ఎంతోమంది అద్భుతమైన కావ్యాలు రాశారు. వాటిని ఈ ప్రాదేశిక సాహిత్య చరిత్ర నిర్మాణానికి ఎందుకు స్వీకరించలేదు? అలాగే, క్రైస్తవ రచనలను ఎందుకు ఉపేక్షించారు. ఉర్దూ, పార్శీ, దక్కనీ ఉర్దూలో రాస్తే సాహిత్యం కాదా? బౌద్ధం, జైనం గురించి రాసిన కావ్యాలు సాహిత్య చట్రంలోకి రావా? అసలు బౌద్ధులు, జైనులు, ముస్లింలు,సిక్కులు, క్రైస్తవులు రాసినవి సాహిత్య చరిత్ర నిర్మాణానికి ఎందుకు  పనికిరాకుండా పోయాయి? సాహిత్య చరిత్ర నిర్మాణం మతాతీతంగా జరగాలనే శుద్ధచారిత్రకవాదులు  కూడా వున్నారు. వాళ్ల వాదన నిజమే అనుకుందాం. మరి, కాశ్మీర శైవం, శైవం, వైష్ణం, ద్వైతం, అద్వైతం, విశిష్టాద్వైతం వంటి ఉపశాఖలను కూడా విస్మరించకుండా ఎన్నో కావ్యాలను వెలికితీసి లోకానికి చాటారు కదా? ఇది మతవాద దృక్పథం అంటే సమాధానం ఏం చెప్తారు?

తెలుగు సాహిత్య చరిరత అంతా బ్రాహ్మణికల్ ఎథ్నోరిలీజియస్‌ హిస్టోరియోగ్రఫీలో అంతర్భాగం. ఈ వైధానం వల్ల జరిగిన అనర్థం అంతా యింతా కాదు. బ్రాహ్మణికల్‌ ఎథ్నిక్‌ ఫండమెంటలిజం ముదిరి లిటరరీ ఫాసిజం అవతారమెత్తింది. ఫలితంగా ఈ ప్రాదేశిక ప్రజలు ఎంతో కోల్పోయారు. తమ ప్రాక్తన చారిత్రక జ్ఞానానికీ,ప్రాక్తన భాషకూ దూరమయ్యారు. బ్రాహ్మణికల్‌ ఎథ్నో ఫాసిజం శాశ్వతంగా పాలితులను భావబానిసత్వంలో వుంచడానికి వ్యూహం పన్నింది. అందుకే, తెలుగు భాషను ఒక్కదాన్ని మాత్రమే సాహిత్య, సాంస్కృతిక వారసత్వ ఆకరంగా స్వీకరించింది. సరే, ఆ నిర్ణయానికైనా అది కట్టుబడి వుందా అంటే అదీ లేదు. సంస్కృత భాషను సకల భాషలకు తల్లిని చేసి,తెలుగును అప్రధానం చేసింది. సంస్కృతంలో వున్న కావ్యాల కన్నా, రచన కన్న వేల రెట్లు పాళీ భాషలో వున్నాయి. ప్రాకృత భాషలో వున్న వ్యాకరణ గ్రంథాలను ప్రస్తావించటం తప్ప అందులోని కావ్య సారస్యాన్ని నేలపాలు చేశారు.

సనాతన వైదిక (హిందూ) చరిత్రను తొలి సాహిత్యంగా నిబెట్టాలన్న సంకల్పం కోసం మహాభారత ఆంధ్రీకరణను తొలి ఆకరంగా స్వీకరించింది. తెలుగు సాహిత్య చరిత్రను తద్వారా వేయియేళ్ల చిన్నదానిగా మార్చేశారు. ఈ ప్రాంతంలో ప్రాక్తన కాలం నుంచీ మానవుడున్నాడు. చరిత్రపూర్వ యుగంలోని వేలాది సంవత్సరాల క్రితమే ఈ నైసర్గికవాతావరణంలో ఆదిమానవుడు మొదలుకొని బృహత్‌ శిలాయుగం కాలం నాటికి మానవ జాతులు జీవించాయి. ఒక నాగరికత ఆ క్రమంలోనే యిక్కడ రూపొందింది. ఆ చరిత్రపూర్వ యుగాన్ని కాస్త పక్కకు పెట్టినా, రెండువేల యేళ్ల క్రితమే యిక్కడ పట్టణాలు, రాజ్యాలు  ఏర్పడ్డాయి. జంబూద్వీపాన్ని ఏలిన చక్రవర్తులకు సామంతులుగా, తర్వాత సమాంతర పాలకులుగా కూడా ఎదిగిన రాజులున్నారు. బుద్ధుడు మొదలుకొని ఆచార్య నాగార్జునుడి కాలం  నాటికి ఎంతో జ్ఞానం ఎల్లలు దాటి ఇక్కణ్ణించే విశ్వవ్యాప్తమైంది. పాళీ, ప్రాకృతం, పైశాచీ, మగధిలాంటి ఎన్నో భాషలు ఈ దేశంలో మాట్లాడారు. పాళి, ప్రాకృత, పైశాచీ, మగధి భాష ఆధారాలు మన ప్రాంతంలో కూడా దొరికాయి. ఈ ప్రాంత సాంస్కృతిక, సాహిత్య చరిత్రను నిర్మించేవాళ్లు ఈ భాషలను ఎందుకు తిరస్కరించారు? ఈ భాషల్లో వచ్చిన గ్రంథాలను ఎందుకు చరిత్ర నిర్మాణానికి ఉపయోగించలేదు. పక్కనే ఉన్న తమిళాన్నీ, కన్నడాన్నీ ప్రస్తావించే చరిత్రకారులు నాగార్జున కొండ మీద సృజించబడ్డ పాళిగ్రంథాలను ఎందుకు ఈ ప్రాంత తొలి గ్రంధాలుగా పేర్కొనలేదు? తొలక్కాపియం కన్న ప్రాక్తనమైన సుహృల్లేఖ, శిష్యలేఖలను ఈ ప్రాంత తొలి గ్రంథాలుగా అంగీకరించక పోవడానికి కారణం బౌద్ధవ్యతిరేక దృక్పథం అంటే అహేతుకమవుతుందా? జైన మత సాహిత్యంలోని అనేక రచనలు మనకెందుకు తెలియలేదు? తాళపత్రాలు సేకరించేవాళ్లకు జైనగ్రంథాలు కనిపించలేదంటే ఎలా నమ్మగలం? తెలుగు సాహిత్యాన్ని బ్రాహ్మణీయ ఆధిపత్యానికి లంకెవేసి, ఇతర మత సాహిత్యాన్ని భూస్థాపితం చేసి ఇక్కడ వ్యవస్థీకృతం చేయాలనుకున్నది హిందూ ఫాసిజాన్నే కదా?

ప్రాదేశిక రాజకీయాలు మరింత నిర్ధిష్టతను పొంది తెలంగాణ సాహిత్య చరిత్ర తయారీకి ప్రేరణిచ్చాయి. చివరికి తెలంగాణ సాహిత్య చరిత్రను కూడా తెలుగు భాషకు మాత్రమే పరిమితం చేయటం దేనికి నిదర్శనం. బ్రాహ్మణికల్‌ రిలీజియస్‌ ఎథ్నో మెథాడాజీ ప్రభావం నుంచి తెలంగాణ సాహిత్య చరిత్రకారులు బయటపడలేదని నిరూపిస్తోందిది. తెలంగాణ సంస్క్రుతి బౌద్ధ, జైన, వీరశైవ, పర్షియన్‌, ఇస్లామిక్‌ సూఫీ మత సంస్కృతుల సమ్మిశ్రమం. ఈ కంపోజిట్‌ నేచర్‌ను గుర్తించి గౌరవించాలి. కానీ, చరిత్ర రచన చేసేవాళ్ల భావదారిద్య్రం ఈ విశిష్ఠతను నిరాకరించేలా చేసింది.

ప్రత్యామ్నాయ సాంస్కృతిక వ్యవస్థను నిర్మించాలని ఆశించే ఉద్యమాలు తొలి సాహిత్య చరిత్రలోని లొసుగులను గుర్తించాలి. బ్రాహ్మణేతర వైదిక సాహిత్య ఆధిపత్యంతో నిండిపోయిన ఈ చరిత్రను తోసిపుచ్చి నిజమైన వాస్తవిక చరిత్రను తయారు చేసుకోవాలి. ప్రాచీన తాళపత్ర గ్రంథాల్లో ఉపేక్షించబడినవీ, నిరాదరించబడినవీ, నిశ్శబ్దంగా హత్య కావించబడినవీ ఏవైనా ఉండొచ్చు. వాటిని వెలికి తీయాలి. మద్రాసు, లండన్‌లోని ఆర్కియాజికల్‌ లైబ్రరీల్లో పరిశోధించి కొత్తగా చరిత్రను లిఖించుకోవాలి. రాహుల్‌ సాంకృత్యాయన్‌ లాంటి పరిశోధకులు సేకరించిన పాళీ, ప్రాకృత, పైశాచీ గ్రంథాలను పరిశీలించి తెలంగాణ, ఆంధ్ర స్థలాలలో పుట్టి, ప్రపంచవ్యాప్తమైన రచనలను విస్తృతంగా వ్యాప్తిలోకి తేవాలి. ఇంత బృహద్కార్యం తలకెత్తుకొనే పరిశోధకులు దొరికితే భవిష్యత్తు మరింత అందంగా మారిపోతది.

15 thoughts on “ఆధిపత్య కులాధార మతసాహిత్య ఫాసిజం

 1. మహోన్నతమైన జ్ఞానబాఢాగారం ఈవ్యాసం. వ్యాసకర్త మరిన్ని వ్యాఖ్యానాలు చేసి సాహితీ చరిత్రకు నూతనవొరవళ్ళసొబగులు దిద్ది మార్గదర్శనం చేయాలని మనసారాకోరుకుంటున్నాను.

  1. జీలుకర శ్రీనన్న రాసిన వ్యాసంలో లోతైన తవ్వకం జరిగింది మట్టి కప్పేయబద్ద అస్తిత్వ చెంద్రవంకల్ని మనం వెలికి తీయాలి అన్నా ఇది రాసినా దాటెక్కువ పదునెక్కువ అన్నా అబినందనలు ధన్యవాదాలు

 2. డా. జిలుకర శ్రీను అన్నకు ధన్యవాదాలు… ఇంత గొప్ప వ్యాసం రాసి నందుకు….

 3. ఆలోచనాత్మక పరిశోదనాత్మక వ్యాసం.పాఠకుల్లోఙ్ఞానం నింపేతొలి అడుగే చైతన్యవంతం.జైభీమ్ జిలుకర మహరాజ్ కి

 4. వాస్తవ చరిత్ర,సాహిత్యాన్ని ప్రస్తుత,భవిష్యత్తు తరాలవారికి అందించడంలో ఈదేశంలోని కుల,మతతత్వవాదులు చేసిన అన్యాయం అనంతమైనది.నిజమైన,ఉపయోగకరమైన సాహిత్యాన్ని,చరిత్రను ఇప్పటికైనా అందించేందుకు కృషి జరిగితే సంతోషం..హాట్సాఫ్ అన్న.

 5. ఆకరాలు,
  ప్రాక్తన,
  వైధానిక
  వంటి ముతక మాటలు ఎందుకు వాడారో తెలియదు.నాకైతే వీటిలో ఒక ముక్క అర్ధం కాలేదు.బహుశా వీటి అర్ధాలు మీరు ద్వేషించే బ్రాహ్మణికల్ ఎధ్నో ఫాసిజాన్ని రుదిన వారు కూర్చిన నిఘంటువులనే వెతుక్కోవాలి కాబోలు!ప్రాకృత భాషలోని సౌందర్యాన్ని వారెవరో ప్రస్తావించటమే తప్ప ఉపయోగించలేదు అని వాపోయే పెద్దమనిషి సరళంగా ఉండే మామూలు తెలుగు వాడకుండా ఈ గంభీరమైనట్టిదీ మరియూ గహనమైనట్టిదియునూ అయిన గ్రాంధికాన్ని ఎందుకు వాడుతున్నారు?

 6. Highly thought-provoking and deeply subaltern by nature, the article is a true revelation. Jilukara Srinivas is at his best.

 7. తవ్వకాలు ఎంత కాలమని సాగిస్తారు? ఎత్తిపోతలు తిట్టిపోతలు ఎన్ని రోజులనీ? నిర్మాణం కొనసాగిందంటే విచ్ఛిన్నకర శక్తులు డేరా లేపుకోక తప్పదు. పారి పోకా తప్పదు. రండి, నడుము బిగించి అడుగు ముందుకు వేద్దాము, కొత్త లోకాన్ని కట్టు కుందాము.

 8. శ్రీనివాస్ శుభాకాంక్షలు పేదవారిని చదువుకు దూరం చెయ్యడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నారో తేటతెల్లం చేయ్యాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రభూత్వాలు అందరికి విద్య అంటున్నారు. కానీ కనీస వసతులు లేకుండా కొత్త పాఠశాలలు ప్రారంభించాం అని పదే పదే డప్పు కొంటుకుంటున్నాయి. ప్రశ్నించే హక్కులు మన పెద్ధలు ఇచ్చారు. అందుకే లోతుగా పాతి పెట్టబడిన విషయాలను ఈ ఆధునిక సమాజానికి తెలియ జేస్తున్నందుకు ….

 9. మౌఖిక సాహిత్యం లిఖిత రూపంలోకి మారే క్రమంలో చాలా ఖాళీలు ఏర్పడ్డాయి తెలుగులో. దక్కన్ లో వివిధ మతాల ప్రాంతాల సంగమం ఏర్పడింది.. కాని భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు చారిత్రక తప్పిదంగా మారిపోయింది. ముఖ్యంగా మైనారిటి, బహుజన భాషలు బ్రతకలేక పోయాయి . ఇప్పటికయినా చరిత్ర నిర్మాణం పైనుంచి కాకుండా కింది నుంచి జరగాలి. …….good one

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


   Type Comments in Indian languages (Press Ctrl+g to toggle between English and Hindi OR just Click on the letter)