Featured కథ

ఆశల సుగంధం

                                                                                                                                           -వి. శాంతి ప్రబోధ
నిండా పదిహేడేళ్ళు లేని పిల్ల ఎంత పరిణతితో మాట్లాడింది తన జాతికి తోటమాలిలా ..
ప్రవహించే నదిలా సాగిపోయింది ఆ ప్రసంగం. జ్ఞాపకమై వదలడం లేదు ..
చీకటి వెలుగులు పరుచుకున్న ఆకాశంలో చీకటి పోయి వచ్చే వెన్నెల కావాలి ఆమె జీవితం . రేపటి ఆశల సుగంధాలు వెదజల్లే ఇలాంటి కూతురు ఒక్కరుంటే చాలు .
పాయింటెడ్ హై హీల్స్ టకటకలాడిస్తూన్న యువతి తనని దాటిపోతుంటే కళ్ళార్పకుండా చూస్తున్న గంగాసుధకేసి అభినందనగా, వాత్సల్యంగా తదేకంగా చూస్తూ అనుకుంది మృదుల.ఇంత సాధారణంగా, అమాయకంగా కనిపించే సుధకి తోటివారి పట్ల ఉన్న దృక్పథం తనకి ఉందా .?.ఆ హృదయ స్పందనలు తనకున్నాయా .. అని తనను తాను ప్రశ్నించుకుంది. తరచి చూసుకుంది మృదుల .

ఎక్కడ నాలుగు రాళ్ల జీతం ఎక్కువిస్తే అటు పరుగెత్తే సగటు జీవి తను. కానీ సుధ అలా కాదు. ఇంత చిన్న వయసులో ఆమె ఆలోచనలు తనకంటే చాలా ఎత్తుగా వృక్షంలా వ్యాపిస్తున్నట్లుగా అగుపిస్తున్నది .. జపాన్ తీసుకెళ్లాలని తెలిసిన రోజు ఈ మట్టి మనిషితో నెలరోజులు నెగ్గుకురాగలనా.. అని దిగులుపడింది ఈ అమ్మాయి గురించే … ఎంత తప్పుగా ఆలోచించింది .. మట్టి సువాసనని అందులో దాగిన మణిమాణిక్యాల వెలుగుని గుర్తించలేని ఈ అల్పజీవి అంచనాని ఆమె ఎప్పుడూ తారుమారు చేస్తూనే ఉంది.

ఆ విషయం ప్లాన్ ఇంటర్నేషనల్ జపాన్ వారు ఏర్పాటు చేసిన నాగసాకి, క్యోటో , టోక్యో సభలతో పాటు ఈ నెలరోజుల్లో చాలా సందర్భాల్లో చాలా సార్లే నిరూపించుకుంది గంగాసుధ. ఎంత అద్భుతమైన ప్రసంగం ఆమెది. అన్ని అవకాశాలు ఉండి కార్పొరేట్ స్కూల్ లో చదివే తన పిల్లలు ఇంత గొప్పగా మాట్లాడగలరా.. ఊహు ..ఇంత అనుభవం ఉన్న నేను మాట్లాడగలనా ..? లేదేమో.. .?! అనుకుంది మృదుల .
ఎదుటివారిని మంత్ర ముగ్ధులను చేస్తూ సరళమైన ఇంగ్లీషులో అనర్గళంగా సాగిన ఆమె ప్రసంగం మృదుల చెవుల్లో మారుమ్రోగుతూ ..

.**** ***

‘ అందరికీ నమస్కారం.
మీరందరూ నా దేశంలో ఆడపిల్లల స్థితిగతులు ఎలా ఉంటాయో తెలుసుకోవాలనుకుంటున్నారని నాకు తెలుసు. నా స్థితిగతులే నా దేశంలో నాలాంటి అధికసంఖ్యాక ఆడపిల్లలవి కూడా .
అందుకే ముందుగా నేను నా సామాజిక నేపథ్యం లోంచి ఏ విధంగా మీ ముందుకు రాగలిగానో చెప్పాలనుకుంటున్నాను. అయితే, నేను అందుకున్న అవకాశాలు నా దేశంలో నా అక్కాచెల్లెళ్లు అందరికీ లేవనేది మాత్రం కాదనలేని వాస్తవం.

మీ దేశంలో మా దేశంలో ఉన్నట్లు కులాలు ఉన్నాయో లేదో నాకు తెలియదు . మా దేశంలో ఉన్న కుల వ్యవస్థలో అట్టడుగున ఉన్న గోసంగి కులంలో పుట్టాను నేను. మా తాత ముత్తాతలు చేసినట్టుగానే మా నాన్న కూడా తంబూర పట్టుకొని జగదేక వీరుని కథ , కంబోజరాజు కథ , రామాయణ మహాబారత కథలు చెప్తూ జనాన్ని సంతోష పెడతాడు. వారు వేసిన భిక్షతోనే మా బతుకు. మా అమ్మ ఈత చీపుర్లు, ఈత చాపలు అల్లుతూ భిక్షాటన చేస్తుంది. చాపలు అమ్ముతుంది . వాళ్ళ వెనకే మేమూ. ప్లాస్టిక్ చాపలు, చీపుర్లు వచ్చాక ఈత చాపల, చీపుర్ల వాడకం తగ్గి బతుకు మరీ భారం అయింది .

మాకు ఒక ఊరు, ఒక ఇల్లు అంటూ నిన్నమొన్నటి దాకా లేవు. తినడానికి తిండి , ఉండడానికి గూడు , కట్టుకోడానికి బట్ట ఏవీ సరిగ్గా ఉండవు. కనీస అవసరాలు తీరవు.

కానీ..మీకు తెలుసా .. జానపద కళల్ని , మరుగుపడిన మానవ సంస్కృతిని కాపాడేది మేమే . అంటే , మా కుటుంబాలే…

మా తెలంగాణాలో మా కుటుంబాలు ఏ గ్రామానికి వెళ్ళినా కనిపిస్తాయి. బుర్రమీసాలు , భుజాలవరకూ పెంచిన రింగుల జుట్టు , రంగు రంగుల దుస్తులు , ముఖానికి రాసుకున్న పసుపు , నిలువు నామాల మధ్యలో రూపాయి బిల్లంత బొట్టు , మెడకు ,మోచేతులకు, కాళ్ళకు రవుతెండి కడియాలు , నడుం చుట్టూ , కాళ్ళకు ఘ్ఘల్లు ఘ్ఘల్లున మోగే గజ్జెలతో ఉండే మా వాళ్ళని ఎవరైనా ఇట్టే గుర్తుపట్టేస్తారు.

భుజాన కావడిని వేసుకొని, చేతిలో దివిటీ లాంటి కందిలీ దీపాన్ని వెలిగించుకొని ఎడమ చేత గంట ఊపుతూ… తెల్లవారు జామున వాడ వాడ తిరుగుతూ… బిచ్చమెత్తుతారు మా నాన్న .. మా తాత . ప్రతీ ఇంటినుండి- బిచ్చం వేసిన తర్వాతనే ఇంకొక ఇంటికి కదులుతారు. బిచ్చం వేసిన ఇల్లు సిరిసంపదలతో తుల తూగాలని ఆశీర్వదిస్తూ… తమ జోలెలో ఉన్న పెద్ద శంఖాన్ని తీసి, దానిని ఊదుతూ విజయభేరిని తలపింప చేస్తారు. ఆలా గ్రామాల్లోని ప్రతి ఇంటికి వెళ్లి, తమ తంబూర నాదంతోనో పాటలతోనో ఇంటిల్లిపాదిని నిద్ర నుండి లేపుతారు . వాళ్ళు వేసిన బిచ్చంతోనే జీవితం కొనసాగిస్తారు . మేమున్న ఊళ్లోనే కాదు భార్యా బిడ్డల్ని వదిలి దూరప్రాంతాలకు వెళ్లి బిచ్చం అడుక్కుని కూడా వస్తుంటారు.

చౌరస్తాలలో , నలుగురూ కూడిన చోట్ల మావాళ్ళు పద్యాలు ఆలపించి వారి మన్నన పొందుతారు . వారు సంతోషంగా ఇచ్చిన కానుకలతో , ఇనాములతో తృప్తి పడిపోవడం మాకు అలవాటు . కానీ ఇప్పుడు నట్టింట్లోకి టెలివిజన్ వచ్చి తిష్ట వేసింది కదా .. నాలుగురోడ్ల కూడలిలోనో , కచేరీ కాడో నలుగురూ కలసి కూర్చోవడం తగ్గిపోయింది .

మా వాళ్ళు భిక్షాటన చేసే దేశ దిమ్మరులు కదా .. మాది అంటరాని జాతి అంటారు కదా .. అందుకేనేమో .. మాకు ఆరడుగుల భూమి జాగలు లేవు .. కనీసం తలదాచుకోవడానికి ముత్తెమంత ఇల్లు కూడా లేదు .. అందుకే, మేమంటే అందరికీ చిన్న చూపే. ఊరికి ఆమడ దూరంలోనే.. చెట్లకిందే మా నివాసం. మూడు కట్టెల ఎలవారం గుడారాలను లేదా చిన్న చిన్న గుడిసెలను వేసుకొని తాత్కాలికంగా మకాం పెడుతుంటాం.

వందల ఏళ్ళ చరిత్ర మా కులానికి ఉంది. అయినా మాకు స్థిర నివాసం లేదు. చదువూ సంధ్యలు లేవు. బిచ్చమెత్తుకుని సంపాదించినదంతా తినడానికి , తాగడానికి, ఇంకా ఇతర వృధా ఖర్చులకు అయిపోతుంది.

అంతేగాక, ఏ చిన్న గొడవ వచ్చినా వాటిని పెద్దవి చేసుకొని పంచాయితీలు పెట్టుకోవడం మా వాళ్ళకలవాటు. తీర్మానం చేసిన పెద్ద మనుషులకు కొంత డబ్బు ఇవ్వడమే కాక, ఆ రోజు పంచాయితీ చేయడానికి వచ్చిన వారందరికీ తినటానికి, తాగడానికి ఖర్చు చేసే పద్దతి మాలో ఉంది. ఈ ఖర్చుఅంతా తప్పు చేసిన వారిపై పడుతుంది. విశేషం ఏమిటంటే పంచాయితీ ఒక్క పైసా లేకుండా జమానతు రూపంలో చీపురు పుల్లల లాంటివి పెడతారు. అగ్గిపుల్లలను, తుమ్మముండ్లను ఇంకా ఇతరత్రా అక్కడ ఆ సమయంలో ఏ వస్తువు దొరికితే ఆ వస్తువును తమ వైపున నిలబడిన పెద్ద మనిషి చేతిలో పెడతారు. ఒక పుల్ల ఖరీదు వంద రూపాయలు, పది చీపురు పుల్లల ఖరీదు 1000 రూపాయలుగా చెలామణి అవుతాయి. ఒక్కొ క్కరు వేయి రూపాయల జమానతు ఇవ్వాలంటే పది పుల్లలను బయానా పెడతారు. మా వాళ్ళు మాట మీద నిలబడతారు. పదిమంది ఎట్లా నిర్ణయం చేస్తే ఆ విధంగా మసులు కుంటారు. తప్పు చేసిన వ్యక్తి వేయి రూపాయలు సమర్పించుకోవాలి. ఆ వేయి రూపాయలు ఇవ్వటానికి వాయిదాల పద్ధతి కూడా ఉంటుంది. దీనిని దండుగ అంటారు. దండుగ వేయించిన అవతలి వ్యక్తి హీరోగా చెలామణి అవుతాడు. సంతోష పడతాడు. ఈ దండుగ పెట్టించటం వల్ల హీరోకు వ్యక్తిగతంగా ఒరిగే ప్రయోజనం ఏమీ ఉండదు. అవతల వ్యక్తి చేత దండుగ పెట్టించాను అనే డాంబికం తప్ప. ఈ దండుగ రూపాయలు పంచాయితీ పెద్దమనుషులకు చేరతాయి. వాటిని దాదాపు సగం వరకు తినడానికి తాగడానికి మాత్రమే ఖర్చు చేస్తారు. ఇంకా సగం మరోసారి అవసరానికి వాడుకుంటారు. ఈ దండుగ రూపాయలు ఖర్చు చేయించటానికి ఆడవాళ్లు కూడా ఉత్సుకతను కనపరుస్తా రు.

ఆడ మగ తారతమ్యం లేకుండా తెల్లకల్లు, నల్లకల్లు, సారాయి, గుడుంబాలను తనివితీరా సేవించటం వారసత్వంగా వస్తున్న మా సంస్కృతిలో భాగం. మా నాన్న కూడా చాలా సార్లు దండుగ కట్టాడు. కొన్నిసార్లు దండుగ వేయించాడు.

ఇక ఆడవాళ్ళ విషయానికి వస్తే మా ఇళ్ళలో ఆడవాళ్ళకి విలువే ఉండదు. ఈతాకు తెచ్చి చాపలు అల్లుకుంటూ బొచ్చె పట్టుకుని అడుక్కోవడమే మా ఇళ్ళలో ఆడవాళ్ళకి తెలిసిన విద్య . తాగివచ్చి తన్నే మొగుళ్ళని భరించడం లేదంటే గొడవపడి కొట్టుకోవడం మా అమ్మలకి సర్వసాధారణం. వాళ్ళని అట్లా చూసి అదే పిల్లలూ నేర్చుకోవడం జరుగుతూ ఉంది.

ఇప్పుడు రేడియోలు , టివి లు , సినిమాలు మా మారుమూల పల్లెల్లోకి వచ్చేశాయ్. జానపద కళలకు ఆదరణ తగ్గింది. ఈతాకు చాపలను ప్లాస్టిక్ చాపలు ఆక్రమించాయి. బతుకుదెరువు కష్టమయింది. రోజువారీ కూలీలుగా మారిపోతున్నారు మా వాళ్ళు . స్థిర నివాసం లేనందువల్ల ప్రభుత్వ అభివృద్ధి పథకాలు ఏవీ మా దరిచేరవు. ఆ విషయం ఇప్పుడిప్పుడే గ్రహింపు కోస్తున్నాం. ఓటర్ల లిస్టులో మా పేర్లు ఉండవు. స్థిర నివాసం కోసం , మాకో చిరునామా కోసంమాలో ఆరాటం మొదలైంది. కానీ మా పెద్దలు పిల్లలని చదివించాలని అనుకోరు. పిల్లకు చదువుకోమని చెప్పరు. అసలు అలాంటి ఆలోచనే మా వాళ్ళకు రాదు . కారణం వారికి చదువు లేకపోవడం , దాని విలువ తెలియకపోవడం .

ఇలాంటి సామాజిక నేపథ్యపు చీకటి చారికల్లోంచి వచ్చిన నేను కూడా మా వాళ్ళందరి లాగే మొదట బడిమెట్లు ఎక్కలేదు. నాన్న తెచ్చిన ఈత కమ్మలు చీరేప్పుడు అమ్మకి సాయం చేయడం , చిన్న తమ్ముడిని చంకన వేసుకుని చెల్లీనీ, పెద్ద తమ్ముడిని చేత పట్టుకుని వీధులు పట్టుకుని తిరగడం లేదా అడుక్కోవడం చేసేదాన్ని. ఊళ్ళో తిండి దొరక్కపోతే తిండి కోసం మా చెల్లిని , తమ్ముడిని తీసుకుని అంగన్వాడి బడి దగ్గర కూర్చునే దాన్ని. అక్కడ వాళ్ళు నాక్కూడా అప్పుడప్పుడూ తిండి పెట్టేవాళ్ళు . కొన్నాళ్ల తర్వాత చెల్లిని చిన్న బడికిలో వేయమన్నారు. మా నాన్న వేయలేదు. తమ్ముల్లిద్దరిని అంగన్వాడిలో కూర్చోబెట్టి నేనూ చెల్లీ అక్కడే ఉండే వాళ్ళం. అట్లాగే ఆ టీచర్ చెప్పే విషయాలు కొన్ని నేర్చుకున్నాను.

ఓ రోజు బడి నుండి సార్లు మా యింటికి వచ్చి మా అమ్మను ఒప్పించి చెల్లిని బడిలో వేయించారు. తిండి ఇబ్బంది లేకుండా దొరుకుతది కదా అని అమ్మ పంపింది. అప్పుడు నాన్న ఇంటి దగ్గర లేదు. తంబూర పట్టుకొని పడమటి దిక్కు ముంబాయికి పోయాడు. కొన్ని రోజులకు తమ్ముళ్ళను చిన్న బడిలో వేసిన తర్వాత నేనూ వాళ్ళతో పాటే బడికి పోయేదాన్ని. బడిలో పేరు లేదు కానీ క్రమం తప్పకుండా వెళ్ళేదాన్ని. అంతలో మా మకాం వేరే ఊరికి మారింది. అక్కడ సునీతా మేడం బడిలో పేరేక్కిస్తానని నాన్నని చాలా సార్లు అడిగింది. నాన్న ఒప్పుకోలేదు. అమ్మ పొతే పోనీలే ఒకపూట తిండి అయినా కడుపునిండా తింటారని నాన్నని ఒప్పించింది. అట్లా బడిలో నా పేరెక్కింది.

ఆ రోజు అందరిలాగా నేనూ బడికిపోతున్నాన్న సంతోషం నన్ను నిలవనీయలేదు. చింత చెట్టు కింద నిలబడి నేనూ బడికిపోతున్నానోచ్ అని గట్టిగా అరిచా . ఎగిరి గెంతులువేశా . మా గుడిసె చుట్టపక్కల గుడిసేల్లోంచి బయటికి వచ్చిన వాళ్ళు ఏయ్ పోరి .. పిస్స గిన లేసిందా ..అట్లోర్రుతున్నవ్, దుంకుతున్నవ్ అని తిడుతూ అన్న మాటలు, చూపులు నాకింకా గుర్తున్నాయి. ఓ ఇరవై రోజులు బడికి వెళ్ళానో లేదో .. నా ఆశల్ని ఆవిరి చేస్తూ బడి బందు పెట్టమని నాన్న ఆజ్ఞ.. అమ్మకి ఆరోగ్యం అస్సలు బాగోలేదు. ఆపరేషన్ చెయ్యాలట. అమ్మ హాస్పిటల్ లో ఉంది . నేను ఇంటి దగ్గర చెల్లెలు తమ్ముళ్ళతో .. వారి బాధ్యత మోస్తూ ..

అమ్మ ఇంటికి వచ్చేసరికి దాదాపు నెలరోజులయింది. ఏ పని చేసే స్థితిలో లేదు. ఆ పనంతా నా మీదే పడింది . ఇంట్లో పనంతా అయినంక బడికి పోతానన్నాను. అమ్మను దగ్గర ఉండి చూసుకొమ్మన్నాడు నాన్న. కొన్నాళ్ళకి అమ్మ కాస్త కోలుకుంది. అయినా నేను బడికి పోతానంటే అమ్మ నాన్న ఒప్పుకోలేదు. అంతలో నాందేడ్ లో ఉండే మా అత్తమ్మ అమ్మను చూడడానికి వచ్చింది. ఆమెకు మోకాళ్ళ నొప్పులట. నాన్నతో ఏమి మాట్లాడిందో ఏమో .. నన్ను తన కొడుక్కు పెళ్లి చేసుకుంట అని అందరికీ చెప్పింది. అది అమ్మకు నచ్చలేదు. ఇరవై ఏండ్ల పిల్లగాడికి తొమ్మిదేళ్ళ పిల్లనిస్తవా అని నాన్నతో కయ్యమాడింది. అదిగో అప్పుడు మా ఊర్లోకి సంస్కార్ వాళ్ళు వచ్చారు. నా పరిస్థితి తెలుసుకుని నాన్నని ఎట్లా ఒప్పించారో .. ఇప్పటికీ నాకు ఆశ్చర్యమే .. వాళ్ళు నన్ను తీసుకెళ్ళి వర్నిలోని సంస్కార్ ఆశ్రమ విద్యాలయంలో చేర్పిచ్చారు.

అక్కడే వేకువ వెలుగును, వెన్నెల చల్లదనాన్ని చవి చూశా. చీకటిని చెరిపేసే చదువుతో పాటు చాలా విషయాలు నేర్చుకున్నా. సంతోషాలు కురిసే రేపులు నావేనని ఈ సాయంత్రం మీ అందర్నీ చూశాక నాకు అర్ధమయింది.

మా గోసం కులం లోనే కాదు ఇప్పటికీ మా గ్రామాల్లో చాలా మంది ఆడపిల్లలు బడికి పోవడం లేదు. తమ ఆశల్ని , కలల్ని, కోరికల్ని తమలోనే అణిచేసుకుని ..
మా తెలివి తేటలు , శక్తి సామర్ధ్యాలు ఎందుకూ పనికి రాకుండా ..
అనారోగ్యకరమైన వాతావరణంలో ..పరిస్థితుల్లో ..ఇలా ఎన్నాళ్ళు ? ఎన్ని తరాలు ..?

నా వరకూ చూస్తే నా ముందటి తరాల్లో ఆడవాళ్లు , మగవాళ్ళు ఎవ్వరూ చదువుకోలేదని మీకు ఇంతకు ముందే చెప్పాను. చదువు విలువ మా వారికి తెలియజెప్పే ప్రయత్నంలో ఎంతో సంఘర్షణ చేస్తూ గుడ్డులో పిల్లల్లా మేం బయటికి వస్తున్నాం. ముందుకు పడే మా అడుగుల్ని వెనక్కి లాగే ప్రయత్నమూ జరుగుతూనే ఉంది. ముఖ్యంగా ఆడపిల్లల్ని.

నా విషయమే చూడండి .. మీ ఆహ్వానం మేరకు నేను ఇక్కడికి రావడానికి ఎన్ని అడ్డంకులు , సవాళ్ళు ఎదుర్కొన్నానో మీకు తెలియదు . నేనే కాదు నా కుటుంబము కూడా .. అందుకు నేను వారిని తప్పు పట్టడం లేదు . కారణం వారిది చాలా చిన్న ప్రపంచం. తమకు తెలిసిన పరిధిలోనే ఆలోచిస్తారు. మా వాళ్ళ తెలియనితనాన్ని , మూఢ నమ్మకాల్ని ఆసరాగా చేసుకుని మా అభివృద్దిని అడ్డుకునే ప్రయత్నాలూ , అవమానించే సందర్భాలూ, మా మనసుకు అయ్యే గాయాలూ తక్కువేం కాదని నా అనుభవం నాకు చెప్పింది.

ఇప్పుడు మేం ఉండే ఊళ్ళో పది దాటి కాలేజీకి వచ్చిన మొదటి అమ్మాయిని నేనే . డబ్బున్న వాళ్ళు , పెద్ద కులం వాళ్ళ ఆడపిల్లలకి , మగపిల్లలకి దక్కని అవకాశం నాకు వచ్చింది . అందుకే వాళ్ళకి కంటగింపు. ఎన్నెన్నో పుకార్లు షికార్లు చేయించారు .
మొదట మా అమ్మ నాన్న ఒప్పుకోలేదని చెప్పాగా .. అమ్మ నా పెళ్లి చేసేస్తానని పట్టుబట్టింది . చదువుకున్న ఆడపిల్ల కట్టుబాట్లు తెంచుకుని అదుపాజ్ఞలు దాటి బయటికి పోతుందని మా తల్లిదండ్రుల, మా కులపెద్దల భావన.

నిజంగానే అన్ని కట్టుబాట్లు తెంచుకుని మెలకువ కెరటంలా నేనిప్పుడు మీ ముందు ఉన్నా. నా దేశం తిరిగి వెళ్ళాక నా చదువు కొనసాగిస్తా. ఇన్నాళ్ళుగా మేం కోల్పోయిన ఉదయ కాంతిని, చిరునవ్వుల వెలుగుల్ని మా ముందు తరాలు కోల్పోకుండా చిరుదీపం వెలిగించడం నా బాధ్యతగా భావిస్తున్నా .

చెమరించే కన్నుల వేదన ఆవేదన నిష్క్రమణ కోసం రేపటి మెరుపులకోసం నా ఆత్మవిశ్వాసం పెంచే నా దేశంలోని చదువుకున్న అమ్మలు , అక్కలతో పాటు బుల్లెట్ ట్రైన్ నడుపుతున్న జపాన్ మహిళలూ నాకెంతో స్ఫూర్తి నిచ్చారు. నేను చెక్కుకున్న నా లక్ష్య సాధనలో ఫిరంగిలా దూసుకుపోయే శక్తినిస్తున్న ప్రతి ఒక్కరికీ వందనాలు’ అంటూ సభికులకు నమస్కరిస్తూ ముగించింది.

**** ****

మృదుల ఆలోచనలకు అంతరాయం కలిగిస్తూ ‘దీదీ .. ‘ గట్టిగా గంగాసుధ గొంతు వినపడింది. ఏమిటన్నట్లుగా అటుచూసింది .
‘ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కంటే నారిట అంతర్జాతీయ విమానాశ్రయం పెద్దదా .. చిన్నదా ?’ నవ్వుతూ అమాయకపు చూపులతో ప్రశ్నించింది .
జవాబుకోసం చూడకుండా ఆ వెంటనే
‘వచ్చేటప్పుడు భయం భయంగా బిడియంగా మీ వెనక నడవడమే కానీ ఢిల్లీ విమానాశ్రయం ఎంతపెద్దదో గమనించనేలేదు . అక్కడ దిగినాక అంతా పరిశీలనగా గమనించాలి ‘ అంటున్నప్పుడు తన ఊరివాళ్ళు , తెలిసిన వాళ్ళు తెలియనివాళ్ళు చాలామంది అన్నమాటలు గుర్తొచ్చాయి సుధకి .

లోలోపలే నవ్వుకుంది వారి మాటలకు . వాళ్లంతా ఇప్పుడేమంటారో చూడాలి . ఒక వేళ వాళ్ళ మాటలు నమ్మి అమ్మానాన్న పంపించి ఉండకపోతే తనెంత గొప్ప అనుభవాల్ని కోల్పోయేది. తెలుసుకున్న జపాన్ మహిళల స్థితిగతులు గుర్తుచేసుకుంటూ అనుకుంది గంగాసుధ.

ఇక్కడి విషయాలన్నీ అనుభవాలన్నీ ముల్లెకట్టి బుర్రలో దాచిపెట్టాలి . వెళ్ళగానే చెల్లెలు , తమ్ముళ్ళు , ఫ్రండ్స్, చుట్టాలు ఊళ్ళో వాళ్ళు అందరూ … ఎన్నెన్ని ప్రశ్నలు వేస్తారో .. అప్పుడు విప్పాలి ఆ మూటని . నే చెప్పే విషయాలు వాళ్లకి అర్ధమవుతాయా.. వాళ్లకి అర్ధమయ్యే విధంగా ఎలా చెప్పాలో ఆలోచిస్తూ గ్లాసెస్ లోంచి రన్ వే పై నుండి పరుగులు పెడుతున్న విమానాన్ని చూస్తున్న సుధ మృదుల చూపుల్లో చిక్కి కొద్దిగా ఇబ్బందిగా కదిలింది

దేదీప్యమానంగా వెలిగిపోతున్నాయి విద్యుత్ దీపాలు . ఆ దీపకాంతులలో ప్రపంచాన్ని చూస్తున్న  ఆమె ‘ఎటు చూసినా విమానాలే .. ‘ కళ్ళలో ఆ దీపకాంతులు నింపుకుంటూ  మృదులకేసి తిరిగి

 ‘అచ్ఛు మా నిజామాబాద్ బస్టాండ్ లో బస్సులు ఆగినట్టే.. ఉహూ .. అంత కంటే చాలా చాలా ఎక్కువగా ఉన్నాయి విమానాలు . .. ఇవన్నీ ఎక్కడెక్కడి నుంచీ వచ్చి ఇక్కడ ఆగాయో …

ఆకాశంలో పిట్టల్లాగా విమానం ఎగురుతుంటే వీధుల్లో ఆడుకుంటూ అదుగో అదుగో అక్కడ పోతాంది మీదిమోటర్ అనుకుంటూ చంకలో తమ్ముడికి చూపుకుంటూ అది కనుమరుగయ్యేదాకా కళ్లప్పగించి చూసేదాన్ని నా చిన్నప్పుడు .. ఆ మీది మోటార్ ఎక్కుతానని కలలో కూడా అనుకోలేదు దీదీ.. అలాంటి నేనిక్కడ టోక్యో లో ..  ‘ నవ్వుతూ మృదుల చూపులను తప్పిస్తూ కృతజ్ఞతతో ఆమె చెయ్యి అందుకుని గట్టిగా నొక్కింది సుధ.  ఆ స్పర్శలో అంతులేని అభిమానం ,ఆత్మీయత , కృతజ్ఞత ఉన్నట్లుగా ఫీలవుతున్న మృదుల ఆలోచనలకు బ్రేక్ వేస్తూ

‘దీదీ .. దీదీ అటు చూడు ఎమిరేట్స్ , చైనా ఎయిర్ లైన్స్ ,లుఫ్తాన్సా , స్విస్ , బ్రిటిష్ ఎయిర్ వేస్ , ఫిలిప్పైన్స్ ఎయిర్ లైన్స్ ,కొరియన్ ఎయిర్, ఫెడెక్స్ , డెల్టా , జపాన్ ఎయిర్ లైన్స్ విమానాలు …

రకరకాల బస్సు డిపో బస్సుల్లాగే కదా …’ దూరంగా ఉన్న విమానాల పై రాసి ఉన్న అక్షరాల్ని చదువుతూ అడిగింది

‘ప్రపంచంలో ఉన్న రంగు రంగుల చర్మాల వారు , భాషల వారు , దేశాల వారు .. చిన్ని చిన్ని కళ్ళవారు , పొట్టి పొట్టి వారు, ఎతైన ఆజానుబాహులు .. అందరూ మనుషులే కానీ ఎన్ని రకాలు.. అంతా ఎవరి హడావిడిలో వాళ్ళు .. ఎవరి గమ్యం చేరడం కోసం వాళ్ళు ..చేతితో బాగ్ లు లాగుతోనో, మోస్తునో…’ సాలోచనగా చూస్తూ శీతల్

అద్దంలా మెరిసిపోయే గచ్చుపై వరద ప్రవాహం కదిలిపోతున్నట్టుంది . వరదలొచ్చినప్పుడు ఎక్కడెక్కడి నీళ్ళో తమ ఊరి వాగులోకి కొట్టుకొచ్చి ప్రవహిస్తున్నట్టుగా ఉంది వీళ్ళను చూస్తుంటే .. తన ఊహకు తానే నవ్వుకుంటూ కళ్లింత చేసుకు చూస్తూ… పక్కనున్న శీతల్ కేసి చూసింది సుధ.
ఆమె కూడా జనాన్ని గమనిస్తూనే ..
తనూ.. నేననుకున్నట్లే అనుకుంటుందేమో ..సన్నని నవ్వు సుధ పెదవులపై.
ఆనకట్టలేని నదీ ప్రవాహంలా సాగుతున్న ఆలోచనలకు అంతరాయం కలిగిస్తూ లాండ్ అవుతున్న బ్రిటిష్ ఎయిర్వేస్ విమానం కనబడింది .
‘ఆకాశంలో ఎగిరే పిట్ట నెమ్మదిగా నేల వాలినట్టే ఉంది చూడు’ అంటూ శీతల్ ను చేత్తో తట్టబోయి మూతపడుతున్న ఆమె కళ్ళు చూసి మళ్ళీ జ్వరం వచ్చినట్టుందనుకుంది . మృదుల లాప్ టాప్ లో తలదూర్చి కనబడడంతో మళ్ళీ బయటికి చూడడం మొదలుపెట్టింది .

ఎరుపు పాంట్ , పసుపు రంగు జాకెట్ తో ఎయిర్ పోర్ట్ వర్కర్స్ .. అటూ ఇటూ తిరుగుతూ . ప్రయాణికుల్ని టర్మినల్ నుండి మరో చోటుకి చేరవేసే పసుపురంగు బస్సులు .. చుట్టూ కలియ జూస్తూ కొద్దిసేపు గడిపింది.

సెక్యూరిటీ చెక్ ముగించుకొని లాంజ్ లోకి వస్తున్న వాళ్ళని చూస్తూ మీకూ అవి నచ్చి ఉండవు అనుకుంది మనసులోనే . ఆడవాళ్ళు ఒళ్ళంతా మిషన్తో ముట్టుకుంటూ.. . ఈ అనుమానపు తనిఖీలు .. హూ .. ఏం బాగోలేదు .. ఆ మిషన్ లోంచి వస్తున్నాం..చాలదా ఏం? చిన్నప్పుడు పక్క గుడిసెలో ఉండే ముసలోడు పిలిచి పేలాలలడ్డు ఇచ్చి ఒళ్ళంతా తడిమిన వైనం గుర్తొచ్చి కంపరం ఒళ్ళంతా జరజరా పాకి అనీజీగా అటూ ఇటూ కదిలింది .

తనమనసులో కలిగే భావపరంపరని వెంటనే శీతల్ తో పంచుకోవడం నెల్లాళ్లుగా అలవాటయింది . ఇద్దరికీ మంచి స్నేహం కుదిరింది . శీతల్ మౌనంగా కళ్ళుమూసుకోవడం సుధకి చాలా వెలితిగా అనిపించింది .

‘ఏయ్ శీతల్ దీదీ .. ఎంతసేపు చొప్పకట్టెలెక్క ఉంటావ్ .. లే ‘ అంటూ పక్కన కూర్చున్న శీతల్ ని చిన్నగా గిచ్చింది సుధ.
‘ఏయ్ ఏమైందే ..’కెవ్వుమంది ఉలిక్కిపడ్డ శీతల్
ఏమైందని చూపులతోనే ప్రశ్నించింది మృదుల లాప్ టాప్ లోంచి దృష్టి మరల్చి ఆ ఇద్దరినీ చూస్తూ
చిన్నగా నాలుక కరుచుకుంటూ ఏమిలేదన్నట్టు అడ్డంగా తల ఊపింది గంగాసుధ

‘నా చేతిని గిచ్చి ఏమిలేదంటావేం’ ఎర్రగా కందిన తెల్లటి చర్మాన్ని రుద్దుకుంటూ రెట్టించింది శీతల్
‘నేను నేనేనా .. అని సందేహం వచ్చిందిలే .. ‘ శీతల్ కేసి ఓరగా చూసి నవ్వింది సుధ .
లాప్టాప్ లోంచి తలెత్తి ఒకసారి ఇద్దర్నీ చూసి చిన్నగా నవ్వుకుని మళ్ళీ మెయిల్స్ చూసుకుంటోంది మృదుల .
‘నువ్వు నువ్వే .. నేను కాదు లే ‘ అంటూ సుధ తొడ చర్మాన్ని మెలి తిప్పింది శీతల్
‘అబ్బా .. ‘ కెవ్వున అరిచి
‘శీతల్ దీదీ ..వదులు ప్లీజ్ .. ప్లీజ్ ‘ వెంటనే బతిమాలుతూ సుధ
ఒకరిద్దరు వీళ్ళవైపు ఓ చూపు విసురుకుంటూ పోతూ ..
సాగిన చర్మాన్ని మరో చేత్తో రుద్దుకుంటూ శీతల్ కేసి తిరిగి
‘నిజం శీతల్ దీదీ .. నేను నేనేనా.. ఎక్కడో మారు మూల గ్రామంలో పుట్టి గుడిసెల్లో ఉండే ఓ తెలంగాణ పోరి ఇట్లా విమానమెక్కి జపాన్ లో .. ఆశ్చర్యంగా లేదూ .. నెల క్రితం ఇందిరాగాంధీ ఎయిర్ పోర్టులో అడుగుపెట్టినప్పుడే గిచ్చి చూసుకున్నా. అయినా నాకు ఆ సందేహం మళ్ళీ మళ్ళీ వస్తూనే… ఇంకా ఆశ్చర్యంగానే …’ మనసులో మాట చెప్పింది సుధ .

‘జపాన్ వెళ్ళడానికి నువ్వు సెలెక్ట్ అయ్యావని చెప్పినప్పుడు నేనూ అట్లాగే అనుకున్నా సుధా ..కలలాంటి నిజం.కళ్ళముందు కనిపించట్లా .. ‘ చెప్తున్న మాటలు ఆపి అలా సుధకేసి చూస్తూ ఉంది డిగ్రీ చివరి సంవత్సరంలో ఉన్న శీతల్ .
కొద్దీ క్షణాల తర్వాత ‘ఏయ్ అక్కడేమన్నా తోలుబొమ్మలాట ఆడుతున్నారా ఎవరైనా .. ? , అట్లా నవ్వుకుంటున్నావ్ ?’ తనలో తనే నవ్వుకుంటున్న సుధ కళ్ళముందు చేతులు పెట్టి ఊపుతూ ప్రశ్నించింది శీతల్ .
‘ అహహా .. హ్హా .. కాదు శీతల్ దీదీ .. , సంస్కార్ లేకపోతే.. నేను ఎప్పుడో పెళ్ళయిపోయి… పిల్లల ముడ్డి కడుక్కుంట ముక్కు చీదుకుంట మూతికడుక్కుంటా, మొగుడితో తన్నులు గుద్దులు తినుకుంటూ కయ్యమాడుకుంటూ ఉండేదాన్నేమో ..?! ఆ దృశ్యం ఊహించుకొని నవ్వుకున్నా.. నువ్వు చూశావు అంతే .. ‘ భుజాలు ఎగరేస్తూ శీతల్ చేయి చేతిలోకి తీసుకుంటూ చెప్పింది సుధ
‘నువ్వే కాదు, బహుశా నేనూ అంతేనేమో సుధా .. ఎప్పుడో రాజస్తాన్ లోని కుగ్రామం నుండి వచ్చి డిల్లీలో కూలిపనులు చేసుకుంటూ బతికే కుటుంబం మాది. నేను మాత్రం కలగన్నానా … ఇలా వస్తానని’ సుధ చూపుల్లో చూపు కలిపిన శీతల్
‘అవునక్కా .. ప్లాన్ ఇంటర్నేషనల్ వాళ్ళ సహాయంతో మా ఊళ్లలో సంస్కార్ చాలా కార్యక్రమాలు చేసింది. అట్లాగే నేను చదివిన బడిలోనూ ..
మేం ఆడుతూ పాడుతూ చేసిన అల్లరిముచ్చట్లు రేడియో కార్యక్రమాలు , సెలవుల్లో రాసిన పాటలు , నాటికలు , మేం నడిపే మామాట పత్రిక , తీసిన బంగారుబాల్యం వంటి లఘు చిత్రాలు .. ఎన్నెన్నో చేశాం.
అలసట – బోర్ అనే పదాలు మా డిక్షనరీలో లేకుండా గడిచిపోయాయి రోజులు . ఈ యాడాది పది పూర్తి చేసి కాలేజీలో చేరానా .. అక్కడ అసలు నచ్చలేదు. చదువు తప్ప వేరే కార్యక్రమాలే లేవు. చాలా దిగులేసేది. అలాంటి సమయంలో సంస్కార్ నుండి కబురు ఒకసారి వచ్చి వెళ్ళమని. ఆదివారం వెళ్ళానా .. దిల్లీలో కార్యక్రమానికి నువ్వు ఎంపిక అయ్యావ్ అని చెప్పారు. ఎగిరి గంతేశా . ఇద్దరు అమ్మాయిలు , ఇద్దరు అబ్బాయిలను ఢిల్లీ తీసుకెళ్లారు. మేమంతా సంస్కార్-ప్లాన్ కార్యక్రమాల్లో కమ్యునిటీ రేడియో కార్యక్రమాలు, డాక్యుమెంటరీలు తీసిన వాళ్ళమే. మా చిల్డ్రన్ క్లబ్స్ ద్వారా మా గ్రామాల్లో మాకు చేతనయిన కార్యక్రమాలు చేస్తున్న వాళ్ళమే.. ‘

‘హా .. అప్పుడే కదూ .. నిన్ను నేను మొదటి సారి చూసింది. ‘ సుధ మొహంలోకి పరిశీలనగా చూస్తూ అని ఒక్క క్షణం ఆగి ‘వాస్తవం చెప్పాలంటే .. మిమ్మల్ని చూసి ఇంత చిన్న చిన్న పిల్లలు వచ్చారే.. పల్లెటూరి వాళ్ళు . వీళ్ళకేం తెల్సు అని మేం చాలా జోక్స్ వేసుకున్నాం.. కానీ మీరు పిల్లలు కాదే బాబూ … చాలా ఆక్టివ్ ‘ ఆత్మీయంగా సుధ చేయి నొక్కుతూ శీతల్ .

‘ మా బాలసేవాసంఘాల్లో మా పనులు చూసి పిట్ట కొంచెం కూత ఘనం అన్నట్లున్నారు ఈ పిల్లలు అని మా ఊళ్ళలో చాలా మెచ్చుకుంటారు తెల్సా ‘ కించిత్ గర్వంగా చెప్పిన సుధ కళ్ళలో మెరుపు.

మెయిల్స్ చూడ్డంలో నిమగ్నమైన మృదుల కేసి తిరిగి ‘మృదులా దీదీ మా బాలసేవాసంఘాల్లో ఆక్టివ్ గా నాకంటే చురుగ్గా ఉన్న పిల్లలు చాలా మందే ఉన్నారు. వాళ్ళలో నన్నే ఎందుకు ఎంపిక చేశారని నాలో సందేహం .. మిమ్మల్ని అడిగితే ఏమనుకుంటారోనని ఇన్నాళ్లూ అడగలేదు… ‘ మృదుల కళ్ళలో కళ్ళు పెట్టి అడిగింది సుధ

తనదీ అదే సందేహం అన్నట్లుగా మృదుల సమాధానం కోసం ఆతృతగా చూస్తోంది శీతల్.
ఆ ఇద్దరి మొహాల్లోకి చూస్తూ ‘ మీగ్రామాల్లోను , ఆ తర్వాత మీ ప్రాజెక్ట్ ఏరియాలోనూ , ఆ తర్వాత మీ రాష్ట్రంలోనూ ఆ తర్వాత ధిల్లీ లోనూ జరిగిన వర్క్ షాప్స్ , మీరు చేసిన కార్యక్రమాలు ఎన్నో చూశాం . ధిల్లీ వర్క్ షాప్ లోనే మీ చివరి ఎంపిక జరిగింది. డిల్లీ వర్క్ షాప్ లో దాదాపు 40 మంది పైనే వచ్చారు కదా .. అందరూ చాలా చురుకైన వాళ్ళే .. అందులోంచి ఎంపిక చేయడం మాకు పెద్ద పరీక్షే అయింది . ఆ వర్క్ షాప్ లో మీ పార్టిసిపేషన్ , అంతకు ముందు మీరు చేసిన కార్యక్రమాలే కాకుండా మీ సామజిక , కుటుంబ నేపథ్యం కూడా మిమ్మల్ని ఎంపికయ్యేలా చేశాయి. దేశం మొత్తంలో నగర ప్రాంతం నుండి శీతల్ ని గ్రామీణ ప్రాంతం నుండి నువ్వు ఎంపికయ్యారు’ చేస్తున్న పనిని ఆపిన మృదుల వాళ్ళిద్దరినీ అభినందనపూర్వకంగా చూస్తూ చెప్పింది .
‘మా ఎంపిక తప్పు కాదని ఇద్దరూ నిరుపించుకున్నారు.. ‘ చిరునవ్వుతో మృదుల అంటున్న మాటలకి అడ్డుతగిలిన సుధ
‘ఓ ..మా వెనుక ఇంత తతంగం జరిగిందా …’ ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేసి .

దూరం నుండి వీళ్ళను చూసి నవ్వుతూ చేతులూపుతూ వచ్చింది డెబ్బై ఏళ్ల పై బడిన విదేశీ మహిళ. ఆవిడ ఎవరో ముగ్గురూ గుర్తించనేలేదు. ఆమె వస్తూనే గంగాసుధని కౌగలించుకుంటూ..

‘ నిన్ను అభినందించకుండా ఉండలేను. నీవు మైక్ పట్టుకోగానే ఈ పిల్ల ఏం మాట్లాడుతుందనుకున్నా. నేనే కాదు, బహుశా అక్కడున్న వాళ్ళంతా అదే అనుకోని ఉంటారు. కానీ మా అంచనాల్ని తారుమారు చేశావు . వందలమంది ముందు నిలబడి నీ చుట్టూ ఉన్న సమాజాన్ని, నీ బాల్యాన్ని , తల్లిదండ్రుల నిరక్షరాస్యత, అజ్ఞానం వల్ల మీరెంత కోల్పోతున్నారో కళ్ళకు కట్టినట్టు చెప్పావు .

 ఆ మాటల్లో ఎక్కడా దైన్యం , ఆత్మనూన్యతా కన్పించలేదు.  ఎవరి మీదా ఫిర్యాదు లేదు . నిందలేదు.   ఇంత చిన్న వయసులో జీవితం పట్ల నీ అవగాహన ఆశావహదృక్పథం నన్ను అబ్బురపరిచింది. నీ అభిమానిగా మార్చేసింది . నీడనిచ్చే చెట్టులాంటి నీమాటలు వింటుంటే అద్దం ముందు కొండ చిన్నదే .. ‘ ఉద్వేగంతో గలగలా మాట్లాడేస్తూ మరో హగ్ ఇచ్చింది. కోల్పోయినదేదో పొందిన అనుభూతి ఆమె మొహంలో ప్రతిఫలిస్తుండగా .

అనుకోని సంఘటనతో తెల్లమొహం వేసి చూస్తున్న గంగాసుధని చూసి ‘సారీ.. సారీ .. నిన్ను చూసిన ఆనందం మర్యాదలు మరచిపోయేలా చేసింది . నన్ను నేను పరిచయం చేసుకోనేలేదు. ‘ అంటూ పక్కనే ఉన్న మృదులతో చేయి కలిపింది . సారా విలియమ్స్ అంటూ కార్డు మృదుల చేతిలో పెట్టింది . ఇంటర్నేషనల్ ఫండింగ్ ఏజన్సీ కి పని చేస్తున్న తాను క్యోటో లో జరిగిన సదస్సులో పాల్గొన్నానని గంగాసుధ ప్రసంగం చాలా కదిలించిందని, భారతదేశపు కులవ్యవస్థలో అట్టడుగున ఉన్న కులాలు , మహిళల గురించి తనకు కొద్దిగా పరిచయమని క్రాఫ్ సవరించుకుంటూ చెప్పింది . గుడ్లప్పగించి చూస్తున్న శీతల్ కేసి తిరిగి నీ గొంతు చాలా బాగుందని మెచ్చుకుంది .బ్యాగేజ్ వేసేటప్పుడు దూరం నుండి చూశాననీ , వెంటనే పలకరించడం కుదరక వెతుక్కుంటూ వచ్చానని చెబుతూ హ్యాండ్ బ్యాగ్ లోంచి రెండు చాకోలెట్స్ తీసి సుధ , శీతల్ ల చేతిలో పెట్టింది . జపాన్ లో పనిచేసే కొడుకు దగ్గరకి వచ్చానని సింగపూర్ వెళ్తున్నానని చెప్పిందా విదేశీ వనిత .

అంతలో సింగపూర్ ఫ్లైట్ అనౌన్స్ మెంట్ రావడంతో త్వరలో మిమ్మల్ని కలుస్తా.. బై చెప్పి మృదుల ఇచ్చిన కార్డు అందుకుని వచ్చినంత వేగంగా ముందుకు కదిలింది సారా విలియమ్స్ .

ఆశ్చర్యంతో ముగ్గురూ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


   Type Comments in Indian languages (Press Ctrl+g to toggle between English and Hindi OR just Click on the letter)