Featured వ్యాసం

ఎందుకోసం ఈ ర‌గ‌డ‌…??

విజ‌య‌వాడ బుక్ ఫెయిర్‌లో మిత్రుడు స్కైబాబ స‌భ‌ను అడ్డుకొని వేధించ‌డం స‌బ‌బు కాదు.
రెండు తెలుగు రాష్ట్రాలు ప్రాంతాలుగా విడిపోయినా గ‌డిచిన మూడున్న‌రేళ్లుగా అన్న‌ద‌మ్ముల్లానే క‌లిసున్నాయి.
కానీ స్కైబాబ స‌భ‌ను అడ్డుకున్న తీరు విచారం క‌లిగిస్తున్న‌ది. దీన్ని క‌వులు, ర‌చ‌యిత‌లుగా మేం ఖండిస్తున్నాం.
ఇది ప్ర‌జాస్వామ్య స్పూర్తికి విరుద్ధం. ఒక ర‌చ‌యిత రాసిన ర‌చ‌న‌ల ప‌ట్ల అభ్యంత‌ర‌ముంటే, అది ఎట్లా త‌ప్పో నిరూపిస్తూ రాయాలి. చ‌రిత్ర‌లో రికార్డు చేయాలి. అంతేత‌ప్ప‌ భౌతిక దాడుల‌కు దిగ‌డం, స‌భ జ‌రుగ‌కుండా అడ్డుకోవ‌డం దేనిని సూచిస్త‌ది.
వారు స‌భ‌ను అడ్డుకోవ‌డానికి చెబుతున్న కార‌ణాల‌ను ప‌రిశీలిద్ధాం.
1.“క్విట్ తెలంగాణ” అనే పుస్త‌కంలో ఆంధ్రా వారిని తిడుతూ బూతులు తిట్టిన వారిని ఎట్లా పిలుస్తారు. అట్లా రాసిన వారు ఎట్లా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు వ‌స్తారు?
-నిజానికి ఇది ఉద్య‌మ స‌మ‌యంలో రాసిన పుస్త‌కం. 12వంద‌ల మంది బిడ్డలు బ‌లిదానాలు చేసుకున్నా స‌రే, నాటి కిరణ్‌ కుమార్‌ రెడ్డి స‌ర్కార్ తెలంగాణను రాకుండా అడ్డుకోవ‌డానికి కుట్ర‌లు చేసింది. ఈ దుర్మార్గం క‌వులు, ర‌చ‌యిత‌లు, మేధావుల‌నే కాదు, యావ‌త్ తెలంగాణ స‌మాజాన్ని నిద్ర‌పోనివ్వ‌లేదు.
ఆ స‌మ‌యంలో “ఉద్య‌మావేశం”తో రాసిన క‌విత్వాన్ని మ‌ళ్లీ మ‌ళ్లీ గుర్తు చేయ‌డం దేని కోస‌మో ఆలోచించాలి. ఇలా త‌వ్వుకోవ‌డం అన‌వస‌ర‌పు గొడ‌వ‌ల‌కు, రాగ‌ద్వేషాల‌కు దారితీస్తుంది త‌ప్ప‌, ప్ర‌యోజ‌నం శూన్యం.
ఈ విష‌యంలో… తెలంగాణ క‌వులుగా మేం తెలంగాణఉద్య‌మ‌ స‌మ‌యంలోనే ఒక క్లారిటీ ఇచ్చాం.

“మేం ఆంధ్రా స‌ర్కారుకు వ్య‌తిరేకం త‌ప్ప‌, ఆంధ్ర ప్ర‌జ‌ల‌కు కాదు”. 

కాబ‌ట్టి క్విట్ తెలంగాణ క‌విత్వంలోని బూతులైనా నినాదాలైనా, డిమాండ్‌లైనా, హెచ్చ‌రిక‌లైనా తెలంగాణ‌ను దోచుకున్న ఆంధ్ర వ‌ల‌స‌వాద అగ్ర‌వ‌ర్ణ పెట్టుబ‌డిదారుల‌కే త‌ప్ప‌, సామాన్య ప్ర‌జ‌ల‌కు కాదు.
2. ఆంధ్ర‌జ్యోతి సంపాద‌కులు కె.శ్రీ‌నివాస్‌ను ఎట్లా పిలుస్తారు..?
ఆంధ్రా మూలాల‌ను క‌లిగిన ఎడిట‌ర్లు లేరా..? అని విజ‌య‌వాడ బుక్ ఫెయిర్ నిర‌స‌న కారులు అడుగుతున్నారు.
– ఇది వారి స‌భ్య‌త‌కే వ‌దిలేస్తున్నాం. నిజ‌మే కె.శ్రీ‌నివాస్‌గారు తెలంగాణ ఉద్య‌మ‌ కాలంలో ఉద్య‌మానికి మ‌ద్ధ‌తుగా నిల‌బ‌డ్డారు, విలువైన ర‌చ‌న‌లు చేశారు. ఒక మేధావిగా త‌నవంతు పాత్ర‌ను పోషించారు. వారు తెలంగాణకే కాదు, దేశంలో ఏ ప్రాంతానికైనా, ఏ స‌మూహానికైనా అన్యాయం జ‌రిగినా బాధితుల ప‌క్షాన నిలిచే ప్ర‌జాస్వామ్య‌వాది.  తెలంగాణ‌లో పుట్టినంత మాత్రాన ఆంధ్రాకు పిల‌వ‌ద్ద‌న‌డం ఏం తెలుగు సంస్కార‌మో మిత్రులు ఆలోచించాలి.
3.ఇక నేను విజ‌య‌వాడ‌లో నా మిత్రుడు వేంప‌ల్లె ష‌రీఫ్ క‌థ‌ల పుస్త‌క ఆవిష్క‌ర‌ణ‌ స‌భ‌లో మాట్లాడుతూ “ఆంధ్రాలో సాహిత్య‌మే లేదు” అన్నాన‌ని మిత్రులు మ‌రో ఆరోప‌ణ‌ చేస్తున్నారు.
ఇది ఎంత‌మాత్ర‌మూ స‌బ‌బు కాదు. ఒక‌వేళ నేను అట్లా మాట్లాడి ఉన్న ఆధారాలు ఏమైనా ఉంటే నిరూపించండి. లేదా ఆ స‌భ‌లో ఉన్న సాహిత్య పెద్ద‌లు పి.స‌త్య‌వ‌తి, ఖాద‌ర్‌మోహియుద్ధీన్‌, నండూరి రాజ‌గోపాల్ (చినుకు పత్రిక సంపాద‌కులు), నూక‌తోటి ర‌వికుమార్‌, ప్ర‌జాశ‌క్తి ల‌క్ష్మ‌య్య‌ వంటి వారిని చెప్ప‌మ‌నండి. లేకుంటే ఆ స‌భ పెట్టిన ర‌చ‌యిత వేంప‌ల్లె ష‌రీఫ్‌నే చెప్ప‌మ‌నండి.  నేను ఒక అంబేద్క‌రైట్‌గా కులానికి సంబంధించిన చ‌ర్చ‌మాత్ర‌మే చేశాను త‌ప్ప‌, ప్రాంతీయ‌భేధాల జోలికిపోలేదు.
ప్ర‌స్తుతం జ‌రుగుతున్న బుక్ ఫెయిర్‌కు ప‌సునూరి ర‌వీందర్‌ను కూడా పిల‌వ‌ద్దు. పిలిచినా రావొద్దు అన‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తున్న‌ది.
నేనేం వ‌స్తా అని, న‌న్ను పిల‌వండి అని అడ‌గ‌లేదు. బుక్ ఫెయిర్‌లో భాగంగా ఒక‌రోజు యువ‌పుర‌స్కార గ్ర‌హీత‌లంద‌రినీ పిలిస్తే, యువ‌త‌కు ప్రోత్సాహం ఉంటుంద‌ని ఆహ్వానించారు. పిలిచిన‌వారి ప‌ట్ల నాకు గౌర‌వం ఉండ‌డం వ‌ల్ల వ‌స్తాన‌ని చెప్పాను. అంతే త‌ప్ప మ‌ళ్లీ ఆంధ్రా పెట్టుబ‌డిదారుల‌ను బూతులు తిట్ట‌డానికి వ‌స్తాన‌ని నేను చెప్ప‌లేదు.
ఒక ప‌ని చేయ‌డం వ‌ల్ల భ‌విష్య‌త్‌లో ఏం జ‌రుగుతోందో ఆలోచించాలి.
అలా ముందుచూపు లేక‌పోతే న‌ష్ట‌మే త‌ప్ప‌, మేలు జ‌రుగ‌దు.
“రాష్ట్రాలు వేరైనా మ‌న ర‌క్త‌సంబంధ‌మొక్క‌టే”న‌ని తెలంగాణ వ‌చ్చిన త‌రువాత ఆంధ్రాలో నేను పాల్గొన్న అనేక స‌భ‌ల్లో స‌మావేశాల్లో చెప్పాను. ఇక ముందు కూడా చెబుతాను.
కాబ‌ట్టి ఎప్పుడో రాసిన రాత‌ల్ని తీసుకొని ప‌దే ప‌దే ర‌చ్చ‌ చేయ‌డం వ‌ల్ల ప్రాంతీయ బేధాలు రెచ్చ‌గొట్ట‌బ‌డ‌తాయి. అది అంత మంచిది కాద‌ని నా అభిప్రాయం. ఈ గొడ‌వ‌ను ఇంత‌టితో వ‌దిలేయండి.
అన్న‌ద‌మ్ముల్లా క‌లిసుందాం, ఆత్మీయ‌త‌ల్ని పంచుకుందాం!!
-డా.ప‌సునూరి ర‌వీంద‌ర్‌

5 thoughts on “ఎందుకోసం ఈ ర‌గ‌డ‌…??

  1. రవీందర్, నువ్వు చెప్పింది అక్షర సత్యం – నీతో పూర్తిగా ఏకీభవిస్తున్నాను.

  2. భావజాలపు దివాళాకోరుతనం (Ideological Bankruptcy)
    ———————————————————————————
    1. స్కైబాబా మీద దాడిని ఖండిస్తున్నాం. ఇది ప్రజాస్వామ్యంపై దాడి.

    (* అసలు దాడి కాదు కదా, తిట్టు కూడా లేదు. జరిగింది నిరసన. ఇరువేపులా నినాదాల పోటీ. మీ దగ్గరే స్పష్టంగా వీడియోలున్నాయి )

    2. అయితే తూచ్ ! స్టేజ్ దౌర్జన్యంగా ఆక్రమించి పుస్తకావిష్కరణను అడ్దగించి భావప్రకటనాస్వేచ్ఛకి భంగం కలిగించారు.

    (*మళ్ళీ అబద్ధం. వేదికమీద ఆంధ్రులు మా తెలుగుతల్లి ఆలపిస్తారు. అది ఈ రాష్ట్రగీతం. ఎవరూ దాన్ని అడ్దగించకూడదు. తర్వాత పుస్తకావిష్కరణ చేసుకోమని చక్కగా మీడియా ముందే లైవ్ లో చెప్పారు)

    3. ఆ..ఇది తొండి . ఓకే. మరే..దాడి అంటే భౌతికదాడి కాదన్నమాట. అప్పుం అప్పుం..అంటే..అంటే నిరసన తెలిపితే కూడా దాడే. మమ్మల్ని బూతులు తిట్టారు. దాదాపు …ఆల్మోస్ట్.. కొట్టినంత పని చేశారు.. ఇదిగో ఫోటోలు చూడండి.

    (*ఫోటోల్లో బూతులు, దౌర్జన్యం కనబడవుగానీ వీడియోలు చూద్దాం పదండి)

    4. ఆ..ఆ..మళ్ళీ తొండి. మేం ఒప్పుకోం. ఆ వీడియోల్ని మేం ఒప్పుకోం. మా ఫోటోలే సాక్ష్యం. అసలు ఫ్రెంచ్ తత్త్వవేత్త ఓల్టైర్ ఏమన్నాడంటే…

    (* కొంచెం మెదడు వాడు. ఆ తాత్వికతని మీరు నిజంగా నమ్మితే మీ ప్రాణాలు అడ్దు పెట్టయినా సరే స్కైబాబా ముందు మా అభిప్రాయాల్ని వ్యక్తం చేసేలా మద్దతు ఇవ్వాల్సింది. Btw, అసలు ఆ మాట అన్నది ఓల్టైర్ కాదు. అది అతనికి ఆపాదించబడింది)

  3. ఇప్పుడు చెప్పుకుని ప్రయోజనం లేదు కాని ప్రాంతీయతత్వం ఎప్పటికయినా హానికరమయినదే. మానవ మూల్యాలు అంతమయిన చోటనే మనిషిని విభజించే తత్వాలు పుడతాయి. ఈ యధార్ధాన్ని ఎంత త్వరగా గ్రహిస్తే అంత మంచిది. మిత్రులు స్కైబాబా కు జరిగిన అన్యాయాన్ని నిర్ద్వంద్వంగా ఖండించ వలసిందే, సాహితీ ప్రియులు జరిగింది మరచి ఏకమవుతారని ఆశిస్తున్నాను.

  4. సాహిత్యాభిమానిగా స్కైబాబాపై దాడిని ఖండిస్తున్నాను

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


   Type Comments in Indian languages (Press Ctrl+g to toggle between English and Hindi OR just Click on the letter)