కథ

ఎట్లా బతకబోతాడో

                                                                                                                జి.ఉమామహేశ్వర్

ఎట్లా బతకబోతాడో బిడ్డ, అనుకునే దాన్ని, వీడు చిన్నగున్నప్పుడు. ఏమో లేమ్మా, ఇప్పటికొక  ఇంటివాడైనాడు. ఎట్లో ఒకట్లా గడచి పోతాయి రోజులు…”.

పెళ్ళైన కొత్తలో అత్త,  ఇలా మాట్లాడుతుంటే ‘ఏంటీ,  ఈమనిషికేమైనా సమస్యా?’ అని  కొందరనుకున్నారు.

మళ్ళీ ఆమే ‘ఎవరినీ నొప్పించడమ్మా , ఏం జరిగినా  మనసులోనే నలుచుకుంటాడు గానీ ఎవ్వరినీ పల్లెత్తి ఒక్క మాట అనడు’ అని కూడా చెప్పేది. అందరూ నా అదృష్టానికి మురిశారు. బహుశా, కొత్తల్లో నేను కూడా! ఆ తరువాత్తరువాత కదా ఈయన గారి నిర్వాకం అర్థమైంది !

సాయంత్రం కిషోర్ గారితో మాట్లాడినప్పటినుండి ఏవేవో పాత విషయాలన్నీ గుర్తొస్తున్నాయి. ఈయన ఎక్కడ సరిగా వుంటాడు? ఇంట్లో అంతే, చుట్టుపక్కల వాళ్ళతో అంతే, ఆఫీసులో అంతే. అవున్లే, అంతా మనలోనే వుంటుందంటారు కదా, ఇదేనేమో. మనం బాగుంటే, పరిసరాలూ మనకనుకూలంగానే వుంటాయి. మనదృష్టి లోపాన్ని సరిచేసుకోకుండా , చుట్టూ చీకటిని తిడుతూ కూర్చుంటే ఎట్లా ?

భోజనాల తరువాత వంటిల్లంతా సర్దుతుంటే వంశీ వచ్చాడు.

“అమ్మా, ఏదైనా కథ చెప్పవా ?”  – ఎనిమిదేళ్లు వచ్చినా సమయం, సందర్భం తెలీదు వీడికి.

“నేంచేస్తున్న పనేంటి , నువ్వడుగుతున్న కతేంటి ? కొంచమైన బుర్రుందిరా ?”

గట్టిగా గదమాయిస్తున్నానో లేదో – అదిగో, అప్పుడే పిలుపు.

“ఒరే వంశీ,ఇటురా, నేం చెప్తా గద , అమ్మను విసిగించకు.”

ఇదే నాకు ఒళ్ళుమండేది . అంటే, ఇప్పుడు నేను వాడి దృష్టిలో విలన్ . ‘నాన్న చాలా మంచోడు. అమ్మే ఎప్పుడు తిడుతుంటుంది’ – అనే ఇంప్రెషన్ ఏర్పరుస్తాడు. ఇదేమి ప్లాన్ చేసి చేయడు, కాకపోతే పర్యవసానం ఆలోచించకుండా , లౌక్యం లేకుండా చేసే పనులు. తన పాటికి తను ఆఫీసు పని లో మునిగినవాడు, వంటింట్లో నేను తిట్టే తిట్లు ఎందుకు వినిపించుకోవాలి? ఉహూ, పిల్లలను కసరగూడదు. గట్టిగా అరవకూడదు. దేవుడికైనా దెబ్బే గురువంటారు కదా, అలాంటిది ఇద్దరి పిల్లలమీద ఒక్కటి, ఒక్కటంటే ఒక్క దెబ్బ వేసిన పాపానపోలేదు. దెబ్బల్లేక పిల్లలు ఎక్కడ పాడైపోతారోనని నా భయం నాది.

“అదొక చిన్ని రాజ్యం. దానికో రాజున్నాడు. రాజుకు సహాయ పడటానికి అతని కింద చాలామంది వుంటారు కదా?” తీరికగా కథ ప్రారంభించినట్టున్నాడు.

‘రాత్రి పది దాటింది ,  రేప్పొద్దున స్కూలు కెళ్ళాలి , నోర్మూసుకొని కళ్లుమూసుకొని పడుకో, నిద్ర దానంతటదే వస్తుంది’ అని గట్టిగా గదమాయిస్తే వాడు బల్లిలా బెడ్డు కరుచుకొని పడుకోడా? ఊహూ! అలా చేస్తే అందరిలా అయిపోడు.

రేపటి టిఫిన్ గురించి ఆలోచిస్తుంటే చప్పున గుర్తుకొచ్చింది, బీరకాయలు తరిగిపెట్టుకోవాలని. అంట్లన్నీ పనావిడకి వేసి పెరుగు ఫ్రిడ్జ్ లో పెట్టి బీరకాయలు తీసుకొని హాల్లోకొచ్చాను. పిల్లల రూమ్ లో శృతి ఏదో చదువుతోంది.  బెడ్రూం లో  మంచం మీద తండ్రి , కొడుకు కథలో మునిగి పోయారు.

అలా కూర్చున్నానో ,లేదో, ఫోన్ మోగింది – సాయిలత. దాని మొగుడు దుబాయి లో వుంటాడు. పిల్లా, అది హైదరాబాద్ లో వుంటారు. మొగుడు , ఆర్నెల్లకో , సంవత్సరానికో ఒకసారి వస్తాడు. దానికి తీరిక దొరికినప్పుడల్లా కబుర్లు చెపుతుంటుంది. నాకెలా కుదురుతుంది?

కూతురి బర్త్ డే , వచ్చే శనివారం, తప్పకుండా  రమ్మని చెప్పింది. నాలుగు మాటలు మాట్లాడి తిరిగి బీరకాయలు ముందేసుకున్నాను. బీరకాయలతో పాటు బీరకాయపీచు లాంటి విషయాలు గుర్తుకొస్తున్నాయి. ఈయన తిక్క ఎక్కడ మొదలై ఎక్కడ తేలుతుందో అని భయమేస్తుంది.

పెళ్ళైన రెండేళ్లలోపే శృతి పుట్టడంతో, దాని పుట్టినరోజు పెద్ద ఆడంబరంగా జరుపుకోలేదు. వంశీ చిన్నవాడు, కనీసం వీడి బర్త్ డే అయినా ఘనంగా హోటల్ లో చేద్దాం అని పోరు పెడితే, ససేమిరా అన్నాడు. రెట్టించిన కోపంతో ఎందుకని అడిగాను-(ఈయన డబ్బు మిగలబెట్టే రకమని పెళ్ళైన కొత్తల్లోనే గ్రహించాను). అందరి ఇళ్లకు  వెళ్ళి , తిని రావడమేనా ? మనమూ ఖర్చు పెట్టాలి కదా! అని దబాయించి అడిగాను. అంత రెట్టించినా , ఎంతో నిగ్రహంతో బుద్దుడిలా  ఉపన్యాసం ఇచ్చాడు. పిలచిన వాళ్ళ ఇంటికి వెళ్ళడం ధర్మమట. వెళ్లకపోవడం అవమానించడమట. మనకు వాళ్ళు పెడితే మనం తిరిగి వాళ్ళకే పెట్టాల్సిన అవసరం లేదట. ఇంకొకరికి పెట్టొచ్చట.

ఇవన్నీ గాలి కబుర్లని కొట్టి పడేసి- ‘ఐతే ఆ  ఇంకొకరికే  పెడదాము, చెప్పండన్నాను’

మా ఇంటికి రెండు వీధులవతల ఒక అనాథ శరణాలయం వుందట. అక్కడ దాదాపు అరవై డెబ్బై మంది పిల్లలు న్నారట. అక్కడ జరుపుకుంటే బాగుంటుంది కదా , వాళ్ళకి ఒక పూట భోజనం పెట్టినట్లు ఉంటుంది కదా! దానితో పాటూ , సాయంత్రం బాబుతో వాడి ఈడు వాళ్ళ మధ్య మన ఇంట్లోనే కేక్ కట్ చేద్దాం ” అన్నాడు. నాకు రుచించ లేదు. హోటల్ లో జరపాల్సిన ఫంక్షన్ని ఇలా మార్చడం నాకు కోపం తెప్పించినా, సరే, ఇది ఒక డిఫరెంట్ ఐడియానేకదా! అనుకున్నాను. ఫోన్ చేసి అమ్మవాళ్ళకు చెబితే వాళ్ళు కూడా ‘మంచిదేగా’ అన్నారు. నేనూ ఓకే అన్నాను. ఆ తరువాత, మా కిట్టి గ్యాంగ్ ముందు ఈ విషయాన్ని కవర్ చేసుకోవడానికి ఎంత కష్టపడ్డానో వీళ్లకేం  తెలుసు? అప్పటికే సరోజ,కృష్ణవేణి చాటుగా ఎగతాళిగా మాట్లాడుకున్నారని సునీత చెప్పింది. అయినా పోన్లే అని  నాకు నేనే సర్దిచెప్పుకుని ఒప్పుకున్నాను.

రెండు పెద్ద కేకులతో, కాటరింగ్ కి ఇచ్చి చేయించిన వంటలతో , మధ్యాహ్నం రెండు గంటలు ఆ అనాథాశ్రమంలో గడిపి వచ్చాము. నిజం చెప్పొద్దూ , నాక్కూడా కొంచెం  గర్వంగా, తృప్తిగా  అనిపించిన మాట వాస్తవమే. పిల్లలంతా లైన్లు లైన్లు గా నిలబడి చాలా అలవాటైన పద్దతిలో బర్త్ డే పాటలు పాడి, వీడికి శుభాకాంక్షలు చెప్పి, క్రమశిక్షణగా కూర్చుని సంతృప్తిగా భోంచేశారు. అంతా బాగానే జరిగింది. అమ్మ నన్ను దెప్పి పొడిచింది కూడా!మంచి పని చేస్తుంటే ఎందుకట్లా కోపగించుకుని కంప్లయింట్ చేస్తావు?అని. అందరమూ ఇంటికి వచ్చిన తరువాత సాయంత్రం ఇంటి దగ్గర ‘కేక్ కటింగ్’ ఏర్పాట్లు చేయకుండా ఒక్కడే వెనుక తూగుటుయ్యాల్లో కూర్చుని ఏదో ఆలోచిస్తున్నాడు. నేను తనదగ్గరికెళ్లి “బాగా జరిగిందండి. అమ్మకూడ మెచ్చుకుంది. ఇకనుండి ప్రతి సంవత్సరం అక్కడగూడా చేద్దాం ”అన్నాను ఎంకరేజింగ్ గా. మామూలు మొగుళ్లైతే ‘ఎంత మంచిదానవే’  అని తిరిగి ఒక మాటైనా అంటారు కదా!

“లేదమ్మాయ్, చాలు. ఏదైనా చేయాలనుకుంటే వాళ్ళ ఆఫీసులో డబ్బులిద్దాం. అంతే గాని, ఈ హడావుడి, హంగామా వద్దు” అన్నాడు. నిజం చెప్పొద్దూ, నా కోపం నషాళానికంటింది.

ప్రతిదానికీ ఎడ్డెమంటే తెడ్డెమనడమేనా ?

చిరాగ్గా మొహం పెట్టి “నాకు నచ్చింది కాబట్టే వద్దంటున్నారు కదా!” అన్నాను వ్యంగ్యంగా.

నా చిరాకుని,ఎగతాళిని ఏమాత్రం పట్టించుకోకుండా తనదైన ధోరణిలో గాల్లోకి చూస్తూ ఊగుతున్న ఉయ్యాల ఆపి- “నాకు ఆ పిల్లలని చూస్తే చాలా బాధేసింది. వాళ్ళలో సహజంగా ఉండాల్సిన బాల్యపు ఉత్సాహం ఉందా అసలు? రొటీన్ గా లైన్లో నిల్చుని, స్టీరియో టైప్ లో పాడి.. ఏంటో , ఎలా చెప్పాలో తెలియట్లేదు. నాకైతే మన కొత్తతరపు ఆడంబరం చూపించుకొన్నట్లుగా అనిపించింది . వాళ్ళ వార్డన్ చెప్పాడు- ‘కనీసం నెలకు ఐదారు పార్టీలైనా ఇక్కడ జరుగుతాయి సార్! ఏదో వచ్చినవాళ్లకు , ఎంతో కొంత పుణ్యం సంపాదించుకొన్నామన్న తృప్తి”. అంటుంటే నాకు కడుపులో తిప్పినట్లైంది. మనం పెట్టే నాలుగు ముద్దలు తిన్న పాపానికి , మనం చేసే పాపాలను స్వీకరించి ప్రత్యామ్నాయంగా , మన దోసిళ్లలో పుణ్యాన్ని నింపేవాళ్లలా కనిపించారా పసివాళ్లు. పాపం, అసలే తల్లితండ్రులు లేని పిల్లలు. వాళ్ళ దగ్గరకెళ్ళి , మనబ్బాయిని , వాడి తల్లితండ్రులుగా మనం వాణ్ని ఇంత మురిపెంగా చూసుకుంటున్నాము అని ప్రదర్శన ఇచ్చి వాళ్ళ పసిమనసుల్ని గాయపరిచామా అనిపించింది”. అన్నాడు.

నాకు భూమి కదిలి పోయినట్లు అనిపించింది.

ఏంటీ మనిషి? నలుగురితో పాటు నడిస్తే మన జీవితం గూడా సుఖంగా గడచిపోతుంది. ప్రపంచమంతా అలానే నడుస్తోంది కదా? ఎవరికైనా ఏమైనా కష్టాలొచ్చాయా ? ఈ అపార్ట్మెంట్లో నూటిరవై ఇళ్లున్నాయి. అందరూ బాగానే ఉన్నారు కదా? నాకే ఎందుకిలా? ఇలా అభిప్రాయాలు మార్చుకుంటూ వెళితే కోపం రాదా? అదే మాట అంటే-    “ఏ అభిప్రాయం స్థిరమైనది కాదు కదా! మనల్ని మనం తెలుసుకొనే క్రమంలో అవి మారుతుంటాయి” అన్నాడు.

అప్పట్నిచి నేను కూడా నా అభిప్రాయాలు ఆయనకనుగుణంగా మార్చుకోకూడదనుకున్నాను.

“అమా, రేపేమ్ టిఫిన్?” రేపటి టిఫిన్ గురించి  ఈ రోజే ఎంక్వయిరీ చేస్తోంది శృతి.

“చపాతీ, బీరకాయ కూర” చెప్పాను.

“చపాతికి ఆలు చేయొచ్చుకద” అని గునుస్తోంది.

“నేనేం వంటలక్కను కాను- మీకొక్కొక్కరికి  ఒక్కో రకం చేసి పెట్టటానికి. మూసుకుని పెట్టింది తిని వెళ్ళండి”. గొంతులో  తీవ్రత చూసి ఏమనుకుందో ఏమో, మెల్లగా జారుకుంది.

ఇది పెద్దదవుతున్నట్టుంది, విషయాలు చప్పున అర్థమవుతున్నట్లున్నాయి.

పిల్లల ఇస్త్రీ గుడ్డలు అల్మరాలో పెడదామని బెడ్రూమ్ లోకెళ్లాను.

ఇద్దరూ కథలో లీనమై పోయారు. ఆయన వాడి కళ్లలోకి చూస్తూ కథను అభినయించి చెబుతుంటే , వాడు కళ్ళు పెద్దవి చేసి ఆసక్తిగా చూస్తూ చెవులు రిక్కించి వింటున్నాడు.

“  అప్పుడు రాజు అన్నాడు – ‘నా రాజ్యంలో న్యాయం ఎవరికైనా ఒకటే. యువరాజు భటుడి కొడుకుని గాయపరిచాడని రుజువైనందువల్ల , యువరాజుకి వారం రోజుల కారాగార శిక్ష విధిస్తున్నాను’ అని తీర్పు ఇచ్చాడు. అట్లాంటి రాజన్నమాట. ప్రజలంటే అంత గౌరవం , అభిమానం చూపించేవాడు……”

ఇదిగో, ఇలాంటి చాదస్తాలే నాకు నచ్చవు.

రాజు కొడుక్కి ఎక్కడైనా జైలు శిక్ష పడుతుందా ? ఒక మంత్రి కొడుకు అమ్మాయిల హాస్టల్ కెళ్ళి గొడవ చేశాడు. ఇంకో మంత్రి కొడుకు బండి ఆపి , ఓ అమ్మాయిని ఏడిపించాడు. వాళ్ళందరికీ ఏ శిక్షలు పడ్డాయి? మంత్రులు , రాజూ  అన్నాక ఆ మాత్రం చేస్తారు. వాళ్ళకి అలా చేసే అధికారం ఉంది. లేకపోతే ఈ పాటికి  ప్రెస్సో , కోర్టులో వాళ్ళని  నిలదీసి ఉండేవి కదా !

ఈ మాత్రమైనా తెలీని భర్తతో నెట్టుకురావడం ఎంత గగనమో అనుభవిస్తేగానీ తెలియదు.

పెళ్లైన కొత్తలో పనిమనిషి రాక పోతే “దీనికి రోజురోజుకి డుమ్మా లెక్కువైపోయాయి’ అన్నాను. అంతే , అదేదో నేరం చేసినట్లు ‘ఎందుకమ్మాయ్  అలా నోరు పారేసుకుంటావ్?  పనిమనిషిని పనామె అనొచ్చు, లేదా పేరుతో పిలవొచ్చుగా , ‘అది’ , ‘ఇది’ అని మాట్లాడక పోతే అన్నాడు.

అప్పట్లో నాకది షాక్.

ఆటోవాడ్ని పిలవరా అంటే తప్పు – వాచ్ మాన్  గాడి పెళ్ళాం అంటే తప్పు. మా అపార్ట్ మెంట్ లో  , కారో స్కూటరో టైముకు తుడవకపోతే కేకలు పెట్టి , వాణ్ణి తిట్టి మరీ పనిజేయించుకునే వాళ్ళే ఎక్కువ. ఇలాంటి చేత కాని,  బతకలేని, మెతక మనిషి భర్తగా వుంటే, ఎన్ని తిప్పలుంటాయో, నలుగురి ముందు ఎంత గిల్టీ గా ఫీలవ్వ వలసి వస్తుందో ఎవరికి తెలుసు ?

శృతి వాళ్ళ స్కూల్ డేకి వెళ్లినప్పుడు తలకొట్టేసినట్టయింది. కానీ ఆయనకి వీసమెత్తయినా అవమానమనిపించలేదు. లోపమెక్కడుందో అర్థం కాదు. ఆ రోజు ముఖ్య అతిధిగా వచ్చిన ఒక ఐ‌పి‌ఎస్ ఆఫీసర్ పిల్లలకు పట్టుదల గురించి చెబుతూ మహారాష్ట్రలో ఎవరో మహిళ తన భర్త వైద్య చికిత్స కోసం 65 సంవత్సరాల వయసులో కొన్ని కిలో మీటర్ల దూరం పరుగెత్తి ఐదు వేల రూపాయల బహుమతి గెల్చుకుంది. చూసారా , పట్టుదల వుంటే వయసు, వేషం అడ్డు కానే కాదని ఆమె రుజువు చేసింది” అని చెబితే ఆడిటోరియమ్ అంతా చప్పట్లతో మార్మోగి పోయింది. చప్పట్లు కొడుతూ పక్కనే ఈయన వైపు చూశాను. మొహమంతా గంటు పెట్టుకుని,ఏదో జరగరాని మహాపచారం జరిగినట్టు తల పక్కకి విదిలిస్తూ కనబడ్డాడు. కొద్దిసేపటికి పిల్లల పేరెంట్స్ నుండి ఎవరైనా మాట్లాడమని అడిగితే, ఇద్దరు , ముగ్గురు పేరెంట్స్ , కార్యక్రమాలు చాలా బాగున్నాయని , ప్రత్యేకించి ఎస్పీ గారు చాలా స్ఫూర్తిదాయకంగా మాట్లాడారని ప్రశంసలు కురిపించారు. ఎప్పుడెళ్ళాడో , ఏమో, వేదిక మీద మైక్ పట్టుకుని ప్రత్యక్షమయ్యాడు. నిజం చెప్పొద్దూ , నేను కూడా అలా చొరవ తీసుకున్నందుకు సంతోషించాను. ఇలా మేనేజ్ మెంట్ కి దగ్గరవడం శృతికి కూడా ప్లస్ అవుతుంది కదా అని కూడా అనుకున్నాను. తీరా చూస్తే ఈయన ఏం మాట్లాడాడు? ‘ఎస్పీగారు చెప్పిన ఉదాహరణకి తను బాధపడుతున్నానని చెప్పాడు. అరవయ్యేళ్ళ వయసులో కేవలం ఐదు వేల రూపాయల కోసం ఒక మహిళ పరిగెట్టాల్సి రావడం మనం సిగ్గుపడాల్సిన విషయమని చెప్పాడు. దాన్ని గొప్పగా చెప్పుకోవాల్సి రావడం అంతకన్నా దౌర్భాగ్యమన్నాడు. వృద్దుల్ని పట్టించుకోకుండా , వాళ్ళకు సరైన ఆరోగ్య సదుపాయాలు కల్పించలేని స్థితిలో ఒక సమాజంగా , వ్యవస్థగా , ప్రభుత్వంగా మనం ఫెయిల్ అయ్యామన్నాడు.  ఇంకా ఏమేమనేవాడో గానీ, నిర్వాహకులు మైక్ లాక్కుని కిందకు పొమ్మని నెట్టినంత పని చేశారు.

కిందకొచ్చాక నా పక్కన కూర్చుంటుంటే అందరూ మా వైపు వింత పశువుల్ని చూసినట్టు చూస్తుంటే తల ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కాలేదు. అప్పటికీ ఏమన్నాడు – ‘విమర్శను సహించలేని మనుషులు , అంతా స్టేజ్ డ్రామా’ అంటూ కాలేజీ వాళ్ళను తప్పుపట్టడం మొదలు పెట్టాడు.

ఎస్పీ గారిని పొగిడితే , ఆయన షేక్ హాండ్ ఇచ్చేవారు. ఇంటికొచ్చాక నలుగురితో చెప్పుకున్నా అందం చందం. ఇలాంటి విషయాలు ఎవరితో చెప్పుకోగలం?

అన్నయ్య వున్నాడు- చెప్పుకోవడానికి. పెళ్ళైన కొత్తలో వాడికి ఏకరువు పెట్టుకుంటే- “లేదే, మీ ఆయన మరీ  అంతా చెడ్డోడేమీ కాదు- అంటూ సమర్థించబోయాడు. పైగా –

“చూడవే , మీ ఆయనకు ఎలాంటి అలవాట్లు లేవు. బాగానే చదువుకున్నాడు . ఓ మోస్తరుగానే సంపాదిస్తున్నాడు. అంతో ఇంతో సరదాలు సంతోషాలు ఉన్నాయి. ఆయన్ని మిగతా వాళ్లలాగా వుండమంటే ఎలా?  అందరూ ఒక్కలా ఉండరు కదా. పోనీ , గట్టిగా చెబుదామంటే ఏం చెప్పాలి ? మందు కొట్టడం తప్పమ్మాయి, అట్లా అని కొట్టకపోవడం ఒక లాంటి సరదా లేని తనం. అందుకని మందుకొట్టమని చెప్పలేం కదా! ఇదీ అలాంటిదే” అంటూ ఏదో వాగేసి వెళ్లిపోయాడు.

ఫోన్ బీప్ బీప్ మని మెసేజ్ వచ్చిన చప్పుడు చేసింది.

కిషోర్ గారు. తను చెప్పిన విషయాలు ఆయనతో మాట్లాడవద్దని, పరోక్షంగానే ఆయనను హెచ్చరించమని సూచన. ఈ రోజు సాయంత్రం కిషోర్ గారు చెప్పిన విషయాలు గుర్తొచ్చాయి. అసలే నా కోపం, చిరాకు నాకుంటే ఆయన మరింత ఆజ్యం పోసి పోయారు.

కూర్చుంటుండగానే “ఇదిగో నమ్మా , మీ ఆయన మరీ సత్య కాలపు  మనిషిలా ఉంటే కష్టం తల్లీ ”, అని ఉపోద్ఘాతమిచ్చి నా వైపు చూస్తూ – ఈ రోజు మా ఆఫీసులో ఒక రివ్యూ మీటింగ్ జరుగుతోంది. బాస్ పాటికి ఆయనేదో హితోక్తులు చెబుతున్నాడు – మన పాటికి మనం ఒక చెవి అటు పారేసి మన పని మనం చేసుకోవాలా? ఆయనేదో మాటల్లో “ఇది తూర్పు-ఇక్కడనుండి ఒక కిలోమీటర్ దూరంలో  అంటూ తన కొత్త ప్లానొకటి చెపుతున్నాడు. మేం నలుగురం వింటున్నాము. జిల్లాలనుండి వచ్చిన అసిస్టెంట్ డైరెక్టర్లు కూడా ఆ హాల్లో వున్నారు.

ఇంతలో అటెండరు మాకు కాఫీలు పట్టుకొచ్చాడు. అతగాడు, బాస్ మాటలు వింటూ, సాధారణంగా మాట్లాడనివాడు- తెలిసి చెప్పకపోతే ఎలా అనుకున్నాడో ఏమో , “ సార్, తూరుపు ఇటు గద సార్,  అంటూ వ్యతిరేక దిశ చూపించాడు”- మా అందరి ముందు వాడలా  అనడం ఆయనకి చిన్నతనం అనిపించింది.

‘నాకు తెలుసు, మైండ్ యువర్ జాబ్ ’ అంటూ గదిమేసరికి వాడు భయపడి పరుగులాంటి నడకతో పారిపోయాడు. న్యాయంగా అయితే అక్కడితో కథ అయిపోవాలి. కానీ అవ్వలేదు , ఎందుకంటే , ఇదిగో ఈ మర్యాదరామన్న లేచి “నో సర్, హి ఈజ్ రైట్. అతను చెప్పింది రైటే . తూర్పు ఇటే ” అంటూ సవరించబోయాడు.

పెద్దవాణ్ని, నీకు వరసకి బాబాయ్ ని , మీ శ్రేయోభిలాషిని , చెబితే ఏమనుకోరని చెబుతున్నానుగాని , మనకెందుకమ్మా , తూర్పు ఎటైతే ? కార్పొరేట్ ఆఫీసులో, ప్రభుత్వ కార్యాలయాల్లో , బాస్ ఏది చెబితే అదే రైట్. మనం, ఆఫ్టరాల్ మిడిల్ క్లాస్ గాళ్ళము,    మనమెవరం  అది కాదని చెప్పడానికి? అదీ ఆయన సబార్డినేట్స్ ముందు. అంత పెద్ద ఆఫీసర్ని కాదని , బంట్రోతుగాన్ని సపోర్ట్ చేశాడు.

అదేమంటే వాడు చెప్పింది నిజం కదా, తెలిసినప్పుడు ఎందుకు చెప్పకూడదంటాడు. బంట్రోతును సపోర్ట్ చేస్తే ఏమొస్తుంది? టైమ్ బాగలేకపోతే మెమో వస్తుంది. అదే బాస్ ని సపోర్ట్ చేస్తే ఇంక్రిమెంట్ వస్తుంది. కాలం కలిసొస్తే ప్రమోషనొస్తుంది. కాకపోతే కొంచెం ఓర్చుకోవాలి- ఏది తూర్పో, ఏది పడమరో బాస్ కి ఈరోజు కాక పోతే రేపైనా తెలుస్తుంది. అప్పుడు పిలిచి ఏమయ్యా, ఈ మాత్రం తెలీదా? అంటూ కేకలేస్తాడు.

మనల్ని తిడితే ఆయనకి టెన్షన్ రిలీఫ్. మనదేమ్ పోయింది ? ఆ మాటలేమన్నా గుచ్చుకుంటాయా? ఉఫ్ మని ఊదుకుంటే పోతాయి. నేనేదో చెప్పబోతే , అది తప్పైనప్పుడు దాన్ని ఖండించే బాధ్యత మనదే కదా!” అంటాడు.

“ఇదమ్మా వరస, నేనొక్కటి మాత్రం చెప్పగలను- ఆయన బాగా చదువుకున్నాడు. చాలా తెలివిగలవాడు. చాలా విషయాలు తెలిసినవాడు. కాదనను. కానీ అవన్నీ కూడు పెట్టవు. గూగుల్ని ఒక క్లిక్ కొడితే వందలాది విషయాలు లింకు లింకులుగా రాల్తాయి. ఆ విషయపరిజ్ఞానం వేరు, బతకడానికి కావలసిన జ్ఞానం వేరు” అని ఉపదేశం చేసి వెళ్లిపోయాడు.

అవన్నీ గుర్తొచ్చి , మనసు పాడు చేసుకోవడం తప్ప ప్రయోజనమేముంది. ఇవన్నీ అడిగామా , మళ్ళీ అదో చర్చ. సత్యం, ధర్మం, సోక్రటీజు , గాంధీ, బాలగోపాల్… ఇలా తెల్లవార్లూ మాట్లాడి ఎన్ని సలహాలను, సూచనలను  తెల్లవార్చాడో !   కొందరి జీవితాలింతే – తాము మారరు, మారలేరు.

అన్నీ సర్దేసి , బయట తలుపు గడియపెట్టి, అన్ని లైట్లూ ఆఫ్ చేసి, బెడ్రూంకెళ్ళాను. వాడింకా కళ్ళల్లో ఒత్తులు వేసుకొని చూస్తున్నాడు. ఆయనగారికేదో ఫోన్ వచ్చినట్టుంది.

“అమ్మ! కథ చెప్పవా ?” గోము చేశాడు వంశీ.

“మీ నాన్న చెబుతున్నాడుగా ?”

“నాన్న ఫోన్ మాట్లాడుతున్నాడు. నువ్వు పూర్తి చేయి”. అన్నాడు.

అప్పటికే పదకొండవుతోంది కదా అని  “ఏం చెప్పారో చెప్పు- ఎంతవరకు వచ్చింది కథ” అడిగాను.

వాళ్ళ నాన్న చెప్పిన కథని , వాడి మాటల్లో చెప్పడం మొదలు పెట్టాడు-

“ఒకూర్లో ఒక రాజున్నాడు. అతనికి హెల్ప్ చేయడానికి మంత్రి, సైన్యాధిపతి ఇంకా చాలా మంది ఉన్నారు. రాజు చాలా మంచోడు. అందరూ పీపుల్ ని మంచిగా చూసుకొనే వాడంట. వాళ్ళ సైన్యాధిపతి కూడా బాగా ఫైటింగ్ చేసేవాడంట. తక్కువ మంది తోనే ఫైటింగ్ చేసి చాలా వార్స్ గెలిచేవాడంట. అయితే , ఒకసారి వాళ్ళ కింగ్ డమ్ లో  ఒకచోట చోరీలు , దోపిడీలు ఎక్కువయ్యాయంట. రాజు ఎవరిని  పంపిచ్చినా,వాళ్ళందరూ  ఓడిపోయి వెనక్కు  వస్తున్నారంట. రాజ్యం లో అందరూ వాళ్ళ కింగ్ ని తిట్టుకుంటున్నారంట. తమకు సేఫ్టీ ఇవ్వట్లేదని అనుకుంటున్నారంట . అప్పుడు రాజు , మారు వేషం లో పోయి ఆ వూర్లో విషయాలన్నీ కనుకున్నాడంట. వన్  వీక్ కెల్లా మంచిగా ప్లాన్ చేసి దొంగని పట్టుకున్నాడంట . ఆ దొంగ ముసుగేసుకొని వున్నాడంట. రాజు ఆ మాస్క్ లాగి చూస్తే – ఆ దొంగ, వాళ్ళ  సైన్యాధికారేనంట .

“ఇంతవరకు చెప్పాడు నాన్న” అన్నాడు వాడు, ఇంక నువ్వు చెప్పు అన్నట్లు.

ఈ కథ ద్వారా ఏం చెప్పదలచుకున్నాడో తెలియదు. సరే , ఏదైతే నాకేంటి ? ఏదో టైంపాస్ కథ అయుండొచ్చు. ఆలోచించాను. ఇందులో పెద్దగా ఆలోచించాల్సిన అవసరం ఏముంది ? రాజుండేది ప్రజలను రక్షించడానికే. దానికి విఘాతం కల్గించిన వాడెవడైనా ఉపేక్షించకూడదు. పైగా శత్రు శేషం, ఋణ శేషం ఉండకూడదని కదా పెద్దలు చెప్పారు. అందుకే ఎక్కువ టైమ్ తీసుకోకుండా కథలోకి దిగాను.

“ముసుగు తీసి చూస్తే ఏముంది ? సైన్యాధికారి. మూడు నెలలు పొరుగూరికి వెళ్తానని చెప్పి, ఇక్కడ రాజుకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నాడు కదా ? మరి, ఇది రాజ ద్రోహం కదా! తన ఉప్పు తింటూ, తనకు ద్రోహం తలపెట్టిన ఆ దుర్మార్గుణ్ణి ఒక్క వేటుతో నరికేసి శత్రు శేషం లేకుండా చేసుకున్నాడు.  ఆ మరుసటి రోజునుండి ఆ ప్రాంతంలో దొంగతనాలు లేవు, దోపిడీలు లేవు.రాజ్యం మళ్ళీ శాంతి భద్రతలతో వర్ధిల్లింది. ఆ తరువాత రాజు పాత సైన్యాధిపతికి ఏదో రోగమొచ్చి మరణించాడని ప్రకటించి కొత్త సైన్యాధిపతిని నియమించాడు.” అంటూ కథను   ముగించాను.

వాడు విన్నాడు. ఒక నిమిషం ఏదో ఆలోచించాడు. నోరు తెరచి ఏదో అడగబోతుంటే – “కథ చెప్పేది, నువ్వు పడుకోవడానికి కదా, మరింక నిద్ర పోవాలి” అని మర్యాదగా చెప్పాను.

“అది కాదమ్మా” – ఏదో అడగబోతుంటే ఆయన ఫోన్ సంభాషణ ముగించుకొని వాడి పక్కన పడుకుంటూ

“ఆఁ , కథ  ఎక్కడ ఆపామురా” హుషారుగా అడిగాడు.

వాడు కూడా, నేను కథ ముగించానని చెప్పకుండా , నన్నొదిలేసి ఆయన వైపు తిరిగి బొజ్జ మీద చెయ్యేసి

“ రాజు ముసుగు తీసి చూస్తే , అక్కడ ఎవరున్నారు? అది వాళ్ళ సైన్యాధిపతే” ఆయన మాటల్ని అప్ప చెప్పాడు.

“ఆఁ , కరెక్ట్! సో, రాజు చూశాడు, ఎదురుగా సైన్యాధికారి !

అతనిలో కోపం కట్టలు తెంచుకుంది. తననింత అప్రతిష్ట పాల్జేస్తాడా , ఇంత నమ్మక ద్రోహం తలపెడతాడా ? అని కత్తి దూసి మళ్ళీ ఒక్క క్షణం ఆలోచనలో పడ్డాడు. ఆ క్షణం లోనే అతని మెదడు లో ఒక్కసారి ఎన్నో ఆలోచనలు వచ్చాయి. ఇరవైఏళ్ల నుంచి నాకు ఇంత సహాయం చేసినవాడు ఎందుకింత అపకారం తలపెట్టాడో? అబద్దమాడి, తప్పుడు ప్రచారం చేసి, ప్రజలను ఇన్ని ఇబ్బందులు పెట్టి , తనకు , తన పాలనకి అపఖ్యాతి తేవాలని ఎందుకు ప్రయత్నించాడో అనుకుని , దూసిన కత్తిని ఒర లో పెట్టుకొని సూటిగా చూస్తూ-

“ఎందుకు చేశావీ పని” అని అడిగాడు.

తన తల మీద కత్తి పడుతుందని నమ్మి, కళ్ళు మూసుకున్న సైన్యాధికారి, అలా జరగక పోగా, రాజు నోటి నుండి ఈ మాటలు విని ఆశ్చర్యపోయాడు. కళ్ళు తెరచి ఎదురుగా రాజు మొహంలోకి చూడలేక కళ్ళు మూసుకొని విచారంగా “మహారాజా , క్షమించమని అడగడానికి కూడా నాకు అర్హత లేదు. మీలాంటి వారి మీద ఈ ద్రోహం తలపెట్టడానికి ఒకే ఒక కారణం – వీరాధి వీరుడైన నా కొడుకుని రాజుగా చూడాలనుకోవడం. ఆ పుత్ర ప్రేమ నా కళ్ళు కప్పేసింది ’ అంటూ రోదించాడు.

అప్పుడు పక్కనే వున్న మంత్రి, రాజు ఒకరి మొహాలొకరు చూసుకున్నారు. మంత్రి అన్నాడు- సైన్యాధికారి తో

“ ఈ విషయం గురించే మహారాజుగారు నాతో చర్చించారు. మీ సేవలు గుర్తించి , మీ కుమారుడి పరాక్రమం గురించి తెలుసుకొని ఈ తూర్పు ప్రాంతానికంతా సామంత రాజుని చేయాలనుకున్నారు. మీరు ఊరి నుండి తిరిగి వచ్చిన తరువాత మీతో చర్చించి ఒక నిర్ణయానికి వద్దామనుకున్నాము. కానీ అవకాశాన్ని చేజేతులారా జార విడుచుకున్నారు సైన్యాధ్యక్షా ! మహారాజు గారు మీకు ప్రాణ భిక్ష పెట్టారు – మీరు కట్టుబట్టలతో ఈ రాజ్యం విడిచి వెళ్లిపోండి !’ అని తీర్పిచ్చి తిరిగి రాజ్యానికి వచ్చారు”-

ముగించి , వాడి వైపు తిరిగి ‘వింటున్నావా?’ అని అడిగాడు.

నాకు తెలుసు – ఈయన కథలన్నీ ఇలాగే వుంటాయి . నిజం చెప్పొద్దూ , నాకు ఈ ముగింపు వింటే కంపరం పుట్టేసింది. ఎంత వద్దనుకున్నా, నేనూ కథ విన్నాను. ఎవరైనా అలా శత్రువును వదిలేస్తారా? అంత ఔదార్యమా? అంతటి ద్రోహాన్ని, పథకం ప్రకారం స్వార్ధానికి తలపెట్టిన ద్రోహిని తల నరికి పోగులు పెట్టక క్షమా భిక్ష పెడతారట క్షమాభిక్ష!. అదే , ఈయన ఆలోచనలన్నీ ఇలాగే ఉంటాయి. అందుకే ఈయన చేసే ముగింపులు ఇలాగే  వుంటాయి. కోర్టులు ఎవరికైనా ఉరిశిక్ష ప్రకటించిన ప్రతిసారీ , ఏదో ప్రాణాలు పోయినవాడిలా , తనలో తనే గింజుకుంటూ వుంటాడు. అంతలేసి చదువుకున్న న్యాయమూర్తుల కంటే ఈయనకే ఎక్కువ తెలిసినట్టు “ఉరేస్తే వాళ్ళలో మార్పు ఎలా వస్తుంది. పశ్చాత్తాపం కలిగించేదే నిజమైన శిక్ష కదా!” అంటూ మాట్లాడుతుంటే ఎవరికైనా కోపంరాదా?

ఈ ఆలోచనలన్నీ కట్టిపెట్టి త్వరగా నిద్రపోతే పొద్దున్నే లేచి పనులయినా చేసుకోవచ్చు అనుకుని నా పాటికి నేను పడుకుందామనుకుని కళ్లు మూసుకున్నాను.

వంశీ వదలట్లేదు. ఆయన ఓపికా అంతే!

“అలా చేయకూడదు నాన్నా, పాపం ట్వంటీ ఇయర్స్ వాళ్ళ కంట్రీకి సేవ చేసిన తరువాత , అలా రాజ్యం వదలి పొమ్మంటే, పాపం కదా! అన్నాడు-

“అలా పాపం అనుకున్నాడు కాబట్టే , చంపకుండా వదిలేశాడు- అయితే శత్రుశేషం వుండకూడదు కదా, అందుకే శిక్షగా, రాజ్యం వదిలి పొమ్మన్నారు” అంటూ తన ముగింపుని సమర్ధించుకున్నాడు.

అయినా , వాడు పట్టు వదలకుండా ….

“అలా కాకుండా,  పాపం లే , రిపెంట్ అయ్యాడు కదా, అని వాళ్ళ అబ్బాయిని సామంతరాజుని చేసేస్తే- అప్పుడు అతను కూడా హ్యాపీగా వుంటాడు. వాళ్ళకి మళ్ళీ ఫ్రెండై పోతాడు కదా, అప్పుడు కూడా శత్రువు…  అదేదో  చెప్పావు , అది వుండదు కదా?”అన్నాడు.

ఒక్క సారి వాడి మాటలు వినగానే నా కళ్ళు బైర్లుకమ్మాయి. తల తిరిగిపోతోంది. భూమి కంపించినట్లైంది. పిడుగు పడినట్లు చెవులు గింగుర్లు కమ్మాయి. వాళ్ళ నాన్న ఏమన్నాడో వినబడలేదు గానీ , నా నోటినుండి అప్రయత్నంగానే

“వీడెట్లా బతకబోతాడో దేవుడా!” అనే మాటలు బయటకొచ్చాయి.

 

***

16 thoughts on “ఎట్లా బతకబోతాడో

 1. ఈ కథని చదివినప్పుడు నాకు వెబ్ పత్రికల అవసరం మరింత ఉందనిపించింది. ఇంత నిడివి ఉన్న కథలు ప్రింట్ మీడియాలో రావడం కష్టం. మంచి కథ. అనాధ శరణాలయాల్లో పుట్టినరోజులు జరుపుకోవడం అని విన్నప్పుడల్లా ..నాకూ అదే రకమైన భావన. ఎవరేట్లా పోతే మనకెందుకు ? మనం బాగున్నామా ..లేదా? మనం బాగుండటానికి ఏమి చేయాలి అనేవి కిశోర్ పాత్ర చెప్పింది మింగుడు పడకపోయినా అదే లోకం తీరు.
  ఎట్లా బతుకుతాడో ,ఎట్లా బతకబోతాడో అనే దిగులు ప్రశ్నలు వినిపించే ఇళ్ళు మరిన్ని ఉండాలని మనఃస్పూర్తిగా కోరుకుంటున్నాను . ఎప్పటిలాగానే మంచి కథ వ్రాసినందుకు అభినందనలు ఉమా మహేశ్వర్ గారూ ..

  1. మీ కామెంట్స్ కి కృతజ్ఞతలు వనజ గారూ!

 2. చాలా మంది తల్లితండ్రులు పిల్లల పెంపకంలో గ్రహించాలిసిన విషయాలు ఈకధలో ఉన్నాయి. తల్లి నేటి ఫాల్స ప్రెస్టేజ్ తో పిల్లల్ని పెంచుతున్న పేరెంట్స్ కు ప్రతినిధి. తండ్రి చాలా సరయిన వ్యక్తి. చాలా మంచికధండి

 3. చాలా డిఫరెంట్ క్యారక్టర్ ఆ భర్తది. భార్యల దృష్టిలో అలాంటి భర్తలు చేతకాని వాజమ్మలుగా పరిగణించ బడతారు. కానీ అందుకో గలిగితే ఆ భర్త స్థాయికి అందరూ ఎదగాలి. కనీసం మన వంతు ప్రయత్నం అన్నా చేయాలి. అనాధాశ్రయములో ఒక రోజు తిండి కి ఇచ్చేసి చేతులు దులుపు కోవడంతో సరిపోదు.
  మంచి కధ ఉమామహేశ్వర్ గారూ. అభినందనలు.

  1. మీ కామెంట్స్ కి ధన్యవాదాలు మేడమ్.

 4. ఆ భర్త లో నాకు ఉమా కనిపించాడు. బాగుంది ఉమా. అప్పుడు ఎప్పుడో చదివిన కలపాలి రాజేశ్వరి “నా బిడ్డ ను కాపాడండి ” కథ గుర్తుకు వచ్చింది. అభినందనలు ఉమా.

 5. “ఆ భర్త లో నాకు ఉమా కనిపించాడు” … నీ నోట్లో గుప్పెడు పంచదార బొయ్యా! గొరుసన్నా, ఎంత మంచి మాటన్నావు పరాయోళ్ల కధల హైదరాబాదు సిన్న ఉమా గురించి; ఈ కధ గురించీ.

 6. యిన్నేళ్ళ సాహచర్యం లో భార్య ను మార్చుకోలేక పోయాడే, నిజంగానే యెలా ఘర్షణలేకుండా బతుకుతున్నట్టూ…యీ కోణంలో యింకో పెద్ద కథ రాయొచ్చండీ ఉమా గారూ.
  అయితే ఈ కథ చాలా బాగుంది.అభినందనలు.

 7. అనాధాశ్రమంలో పిల్లల పుట్టిన రోజులు జరుపుతోవడం వారికేదో మేలు చేస్తున్నట్టు భావించడం , నిజంగా ఆ పసి హృదయాలను ఎంతగా బాధపెడుతన్నారో ఈ కథ ద్వారా కొంతమంది అయినా తెలుసుకుంటే మంచిది.వాశ్ళముందు సంబరాలు చేసుకొని వాళ్ళకు లేనిదాన్ని ఎత్తిచూపడం కంటే మిన్నకుండడమే ఉత్తమం . మంచి కథ వ్రాసారు సర్ .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


   Type Comments in Indian languages (Press Ctrl+g to toggle between English and Hindi OR just Click on the letter)