కథ

కనపడకుండా కథలో కనిపించే ప్రధానపాత్ర -టి. చంద్రశేఖర రెడ్డి

టి. చంద్రశేఖర రెడ్డి

 

            ప్రతి కథలో కొన్ని పాత్రలు. అందులో ఒకటో అంతకు మించో కొన్ని ప్రధానపాత్రలు. వాటికి తోడుగా కొన్ని సహాయపాత్రలు. కథలో ఇన్ని ప్రధానపాత్రలుండాలని, ఇన్ని సహాయపాత్రలుండాలన్న నిబంధన ఏదీ ఉన్నట్లు కనపడదు. అయితే ఒకటి మాత్రం వాస్తవం. కథ విస్తృతి తక్కువ కనుక, కథలో ప్రధానపాత్రల/సహాయపాత్రల సంఖ్య నవలలకన్నా తక్కువ ఉండటానికి అవకాశం ఎక్కువ.

ఏ పాత్ర అయినా కథాగమనానికి ఎంతో కొంత తోడ్పడాలి. కథతో పాటు మారేవి, ఆ మార్పుతో పాటు కథని ముగింపు వైపుకు నెట్టేవి ప్రధాన పాత్రలు. ఆ మార్పుకి దోహదించేది సహాయపాత్రలు. ఈ ప్రక్రియ అంతా విజయవంతంగా పూర్తి కావాలంటే కథాంశానికి అనుబంధించి కథలో పాత్రలన్నీ కథలో అంతర్భాగం కావాలి. వేటి పని అవి చేయాలి. అపుడే ప్రతి పాత్ర ఉనికికీ ఒక సార్థకత.

పైన చెప్పిన సార్థకత కలిగించాలంటే కథకుడికి పాత్రల ‘సృష్టి’ మీదనే కాకుండా, వాటి ‘స్థితి’ మీద కూడా అవసరమైనంత శ్రద్ధ పెట్టటానికి వెసులుబాటు ఉండాలి. కథలో ఎన్ని తక్కువ పాత్రలు ఉంటే ఆ వెసులుబాటు అంత ఎక్కువగా కలుగుతుంది. దాంతో కథనం బిగువుగా ఉండటానికి వీలు ఏర్పడుతుంది.

కొన్ని పాత్రలు కథల్లో నేరుగా ప్రత్యక్షమవుతాయి. అవి కలిసి మెలిసి తిరుగుతాయి. పరస్పరం మాట్లాడుకుంటాయి. దాంతో వాటి స్వరూపస్వభావాలు పాఠకులకు అర్థమవుతాయి. పాత్రలు ఎంత బాగా అర్థమయితే కథ పాఠకుడికి అంత బాగా చేరినట్లు. పాత్రపోషణ అంత సమగ్రంగా జరిగినట్లు.

అయితే దీనికి విరుద్ధంగా కొన్ని కథల్లో కొన్ని పాత్రల పేర్లు మాత్రమే మనకు కనపడతాయి. ఈ పేర్లున్న పాత్రలు కథకి సంబంధించి ఏ పనీ చేయవు. ఒక్క మాట కూడా మాట్లాడవు. కథలో పాత్రల సంఖ్య అనవసరంగా పెంచటానికి, పాఠకుడి జ్ఞాపకశక్తికి పరీక్ష పెట్టటం తప్ప, వీటి వల్ల ప్రయోజనం ఏమీ ఉండదు. పేరుతో పరిచయం చేయబడిన  ప్రతి పాత్రా కథలో ఏం చేసింది? కథాగమనానికి ఎలా తోడ్పడింది అనే ప్రశ్నలు వేసుకుని, తాను రాసిన కథని వెలుగులోకి తేవటానికి ముందు ఆ ప్రశ్నలకి కథకుడు సరైన జవాబులు వెతుక్కుంటే అలా పేర్లు పెట్టి వదిలేసిన పాత్రల్ని తనంతట తానే గుర్తించొచ్చు. పేరుకి మాత్రం కనపడి, ఆ తర్వాత కనపడకుండా పోయిన ఆ పాత్రలను తన కథలో ఉంచాలా వద్దా అనేది పునఃపరిశీలించుకోవచ్చు. వాటిని నిర్దాక్షిణ్యంగా తొలగించనూ వచ్చు. వీలైతే ఆ పాత్రతో ఒక మాట మాట్లాడించో, ఒక పని చేయించో ఆ పాత్రకి ఒక అర్థం కల్పించవచ్చు. దురదృష్టవశాత్తూ కొన్ని కథలు పాఠకుల ముందుకు రావటానికి ముందు ఈ అగ్నిపరీక్షకి గురై నెగ్గినట్లనిపించదు.

దీనికి ఉదాహరణగా నిలబడ్డదగ్గ కథ ఒకటి ఈ మధ్యన నేను చదివాను. ఈ కథలో అక్కా, చెల్లెలూ ప్రధాన పాత్రలు. అక్క భర్త, చెల్లెలి భర్తా కూడా కథలో పాత్రలు. ఈ నాలుగు పాత్రలకూ పేర్లుంటాయి. అవి కథ మొదట్లోనే మనకు తెలుస్తాయి. చిత్రంగా కథ మొత్తం మీద అక్క భర్త ఎక్కడా ఒక మాట మాట్లాడడు. కథకి సంబంధించిన వర్తమానంలో ఏ పనీ చేయడు. కథలో ఒక చోట బావని ఉద్దేశించి మరదలు మాట్లాడుతుంది. ఆ మాటకు కూడా అతడి బదులు, ఆమె అక్క జవాబిస్తుంది. కనీసం, మరదలు మాటలకు బావ ద్వారా కథకుడు జవాబిప్పించి ఉంటే,  కథలో ఆ పాత్రకు కొంచెమన్నా సార్థకత ఏర్పడేది. అలా జరగలేదు. దాంతో బావ పాత్ర,  ‘నామ’ మాత్రమయింది.

కొన్ని కథల్లో ఒకటో రెండో పాత్రల ప్రస్తావన మిగిలిన పాత్రల ద్వారా జరుగుతుంది. ఆ ప్రస్తావన వాటి పేరు మీద జరుగుతుంది. పేర్ల ద్వారా పాఠకులకు పరిచయమైన ఈ పాత్రలు కథలో నేరుగా ప్రత్యక్షం కావు. ఇలాటివన్నీ కనపడకుండా కనిపించే పాత్రలు. ఇవి ఎక్కువగా మాట్లాడవు. ఒకటో అరో పనులు చేస్తాయి. అవి ఏం మాట్లాడాయో, ఏం చేశాయో మిగిలిన పాత్రల ద్వారా మనకు తెలుస్తుంది. పై చెప్పిన కథలో; తల్లిదండ్రులకు బెంగళూరు-ఊటీ చూపెడతానన్న కూతురు, బట్టలు సరిగా పిండి ఆరెయ్యమన్న కిందింటి స్త్రీ, లిఫ్ట్ లో మా పనిమనిషిని కూడా రానివ్వమని అడిగిన నాలుగో ఫ్లోర్లో మహిళ, అభ్యంతరం చెప్పిన లేడీస్ ప్రెసిడెంట్; ఈ కోవకు చెందిన వాళ్లు.

అలాగని కనపడకుండా కనిపించే పాత్రలు; ప్రతి కథలోనూ  ఒక సంభాషణకో, ఒక పనికో పరిమితం కావు. కొన్ని కథల్లో అలాంటి పాత్రల ప్రస్తావన కథ పొడుగూతా ఉంటుంది. కథలో కనపడే ప్రధానపాత్రల వర్తమాన జీవితంలో ఈ రకమైన పాత్రలు కీలక పాత్ర వహిస్తాయి. ఒక్కోసారి కథాంశం సైతం వాటికి సంబంధించినదవుతుంది. దాంతో కథ అలా కనపడకుండా కనిపించే పాత్ర చుట్టూ కేంద్రీకృతమవుతుంది.

ఉదాహరణకి, పి. సత్యవతి గారి ‘పిల్లాడొస్తాడా’ కథలో, విజయ కొడుకు పాత్ర. అతడు కథలో ఎక్కడా నేరుగా ప్రత్యక్షం కాడు. ఒక రాత్రంతా ఇంటికి రాడు. తాను ఇంటికి ఎందుకు రాలేకపోయాడో, అసలెప్పుడొస్తాడో తల్లికి చెప్పడు. ఇంటికి రాని కొడుకు గురించి, ఏమైపోయాడో తెలియక తల్లడిల్లిన తల్లి ఆందోళనా, ఆమెకి ధైర్యం చెప్పటానికి అమ్మమ్మ పడ్డ తాపత్రయమూ మాత్రమే కథ నిండా కనపడుతుంది. దాంతో కథకి కేంద్రబిందువు అతడే అవుతాడు. అతడు రాకపోవటానికి కారణాలను ఊహించే క్రమంలో తల్లి ఆరాటాన్నే కాకుండా; వర్తమాన సామాజికపరిస్థితులనూ, నేటి తరం యువకుల ప్రవర్తనాధోరణిని సైతం కథ చిత్రిస్తుంది. కొడుకు చివరకు ఇంటికి వచ్చిందీ లేనిదీ కథ మనకు చెప్పదు.  ఫలితంగా కథ చదవటం పూర్తయినతర్వాత తల్లి పాత్రా, అమ్మమ్మ పాత్రా మనను వీడిపోతాయి. కొడుకు పాత్ర గురించి ఆలోచనలు మాత్రం మనని విడనాడవు. వీటన్నింటివల్లా కథలో కనపడకుండానే కథ నిండా కనిపించిన కొడుకు పాత్ర మిగతా పాత్రలన్నిటి కన్నా ప్రధానమైనదని మనకు అనిపిస్తుంది.

మరో ఉదాహరణ వేంపల్లి షరీఫ్ గారి కథ ‘అమ్మ బొమ్మ’ లో ప్రముఖ చిత్రకారుడు బాపు పాత్ర. ఈ కథలో ఒక అతడూ, అతడి భార్యా ప్రధానపాత్రలు. ఆ అతడి కొడుకూ, పక్కింటి పింకీ సహాయ పాత్రలు. ఆ అతడు పుస్తకాల దుకాణంలో ఒక తెలుగు వర్ణమాల పుస్తకం చూస్తాడు. ఆ పుస్తకంలో బొమ్మలు గీసింది బాపు గారు. అందులో అ-అంటే అమ్మ బదులు అ-అంటే అరటి అని రాసి ఉంటుంది. అ-అంటే అందాల అమ్మ బొమ్మ బదులు అరటి బొమ్మ బాపు గారు ఎందుకు గీశారు అన్న ప్రశ్న ఆ అతడిలో కలుగుతుంది. దానికి ఒక ఆ అతడు సమాధానం వెతకటం మొదలు పెడతాడు. ఈ విషయం మీద ఆ అతడు తన భార్యతో కూడా చర్చిస్తాడు. కథంతా ఆ అతడి అన్వేషణ, అభిప్రాయప్రకటన చుట్టూ తిరుగుతుంది. ఈ ప్రక్రియలో బాపు గారి ప్రస్తావన కథలో అనేక చోట్ల వస్తుంది. కాని, బాపు గారు కథలో ఎక్కడా ప్రత్యక్షం కారు. కథలో తాను కనపడకుండానే కథంతా తాను నిండి ఉన్న అనుభూతి కలిగిస్తారు. పాఠకులకు అడుగడుగునా తానే ప్రధానపాత్ర అనిపించేంతగా దృశ్యమానం అవుతారు.

ఇంకో ఉదాహరణ యాళ్ల అచ్యుతరామయ్య గారి మూడో మనిషి కథలో మూడో మనిషి. ఈ కథలో ప్రధానపాత్రలు శివ, అతడి భార్య జాహ్నవి. శివ కథనం ప్రకారం; శివకీ, జాహ్నవికీ మధ్య ఒక మూడో మనిషి ప్రతిరోజూ రాత్రి ప్రవేశిస్తుంటాడు. పడక గదిలో లైట్ వెలుగుతున్నంతసేపూ ఆ మూడో మనిషి శివకి కనిపించడు. లైట్ ఆర్పగానే శివకీ, జాహ్నవికీ మధ్యలో దూరిపోతాడు. వాళ్లిద్దరి సాంసారిక జీవితానికి ఆటంకంగా మారిపోతాడు. స్నేహితుడు జనార్దన్ సలహాతో ఆ మూడో మనిషిని శివ ఫోటో కూడా తీయగలుగుతాడు. అతడి రూపు రేఖలు చూసి ఆశ్చర్యపోయి, ఆ తర్వాత రోజు ఉదయం, తమిద్దరి మధ్యా ఒక మూడో మనిషి ప్రవేశిస్తున్న విషయాన్ని జాహ్నవి దగ్గర ప్రస్తావిస్తాడు. ఆమె ఏ మాత్రం ఆశ్చర్యపోదు. ఆ విషయం తనకు ముందే తెలుసు అన్నట్లు మాట్లాడుతుంది.

కథంతా ఈ మూడో మనిషి చుట్టూ తిరుగుతుంది. ఆ మూడో మనిషి తన జీవితంలో కూడా ఉన్నాడా, తనతో పాటు ఇంకెందరి జీవితాల్లో సైతం ప్రవేశిస్తున్నాడో అన్న అనుమానం శివ స్నేహితుడైన జనార్దన్ మనసులో కలిగిస్తుంది. కథలో ఆ మూడో మనిషి నిజానికి ఎవరు? అతడి రూపం ఏవిటి? అతడి రూపురేఖలు ఎందుకలా ఉన్నాయి? అతడు శివకీ-జాహ్నవికీ మధ్య అనుదినం ఎందుకు ప్రవేశిస్తున్నాడు? అనేది  కథ ముగింపులో పాఠకులకు తెలుస్తుంది. ఈ రూపేణా కథలో మూడో మనిషి కూడా ఒక ప్రధానపాత్ర అవుతుంది.

ఇంకో రకం అదృశ్యపాత్ర పి.వి.సునీల్ కుమార్ గారి కథ ‘థూ…’ ద్వారా మనకు పరిచయమవుతుంది. కథని  రచయిత ప్రథమపురుషలో ప్రారంభిస్తారు. ఆ తర్వాత కథని బహుళ ఉత్తమపురుష ధోరణిలో నడిపిస్తారు. కథ మొదట్లోనే, కథలో ఒక ప్రధానపాత్ర ఏం చేసిందో క్లుప్తంగా చెప్పి రచయిత తప్పుకుంటారు. మిగిలిన కథని చెప్పే  బాధ్యతని రచయిత తన కథలో రెండు ప్రధాన పాత్రలకు అప్పగిస్తారు. ఆ రెండు ప్రధానపాత్రల్లో మొదటిది బసివిరెడ్డినాయుడు. రెండోది కుంటి జోసప్పు. వాళ్లిద్దరూ కథకు జోసప్పు ఇచ్చిన ముగింపుకు ముందు ఏం జరిగింది అనేది ఎవరి దృక్పథంలో వాళ్లు చెపుతారు. వాళ్లిద్దరి కథనం ఇతివృత్తానికి సంబంధించిన పూర్వాపరాలను చర్చిస్తుంది. సమాంతరంగా కథాంశం రాజు అనే పాత్ర చుట్టూ కేంద్రీకృతమవుతుంది. దాంతో కథలో మనకు కనపడకపోయినా, రాజు గురించి ప్రధానపాత్రల ద్వారా విన్నదాన్ని బట్టి అతడు కూడా ప్రధాన పాత్ర అన్న అభిప్రాయం కలుగుతుంది.

మరో రకం కనిపించకుండా కనిపించే పాత్ర వి. ప్రతిమ గారి కథ విత్తనం ద్వారా మనకు పరిచయమవుతుంది. తెలుగులో వస్తున్న కొన్ని  కథలకు భిన్నంగా ఈ కథ-మధ్యమ పురుష-కథనధోరణిలో చెప్పబడింది. పైన ఉదహరించిన కథల్లా, కథలో ఒక ప్రధానపాత్ర ఉత్తమపురుషలో కానీ, బయటినుంచి రచయిత్రి కానీ ప్రథమ పురుషలో కథని వినిపించరు. కథ బయట మనకు తెలియని మరెవరో ఉంటారు. కథలో సంఘటనలన్నిటికీ ప్రత్యక్షసాక్షిలా ప్రధానపాత్రను నువ్వు అని సంబోధిస్తూ మొత్తం కథని మనకి వినిపిస్తారు. ఉత్తమపురుషలో నడిచిన కథని చెప్పేది కథలో ఒక ప్రధానపాత్ర. ఆ పాత్ర లేకపోతే, అది చెప్పకపోతే కథే లేదు. అదే కొలమానం విత్తనం కథలో ‘నువ్వు’ అంటూ కనపడకుండా ఉండి కథని వినిపించిన వ్యక్తికి  వర్తింపచేస్తే, ఆ వ్యక్తి కూడా ప్రధానపాత్రే అనుకోవాల్సి వస్తుంది.

పిల్లాడొస్తాడా, బాపు బొమ్మ, థూ… కథల్లో కొడుకు, బాపు గారు, రాజు కథలో ఉన్నట్లనిపిస్తారు. కథ వాళ్లకి సంబంధించినది అనిపిస్తుంది. కథ బయట కూడా వాళ్లు ఉంటారు.  కథకు సంబంధించినంతవరకు మాత్రమే వాళ్లు కనిపించకుండా కనపడే పాత్రలు. కథ బయట అవి కనిపించే పాత్రలు.

మూడో మనిషి కథలో మూడో మనిషి కథలో ఉన్నట్లనిపిస్తాడు. కథాంశం కూడా అతడికి సంబంధించినది. కథంతా అతని గురించి మనకు వినపడుతుంది. కథ బయట కూడా అతడు ఉన్నట్లనిపిస్తాడు. కాని, కళ్లకి కనిపించడు. మన చుట్టూ వ్యాపించి ఉన్న గాలిలా తన ప్రభావంతో తన ఉనికిని మనకు తెలియపరుస్తాడు.

విత్తనం కథ వినిపించిన వ్యక్తి కథలో ఉన్నట్లనిపించదు. భౌతికంగా కథ బయట ఉన్నట్లు భ్రమ కలుగుతుంది.

ఈ కారణాల వల్ల నా దృష్టిలో ఈ అయిదు కూడా ప్రధానపాత్రలే. కనపడకుండా కనిపించిన పాత్రలు. ప్రధానపాత్ర అనిపించుకోవటానికి కథలో నేరుగా ప్రత్యక్షం కావాల్సిన అవసరం లేదని నిరూపించిన పాత్రలు.

బాపు బొమ్మ-కథ ఉత్తమపురుషలో చెప్పబడింది. పిల్లాడొస్తాడా, మూడో మనిషి-కథనం ప్రథమపురుషలో నడిచింది. థూ… కథ, మొదట ప్రథమపురుషలోనూ తర్వాత బహుళ ఉత్తమపురుషలోనూ కథని వినిపిస్తుంది. విత్తనం-మధ్యమ పురుష కథనధోరణిని అనుసరిస్తుంది. మూడు విభిన్నధోరణుల్లో రాయబడ్డ ఈ అయిదు కథలూ, వాటి కథనంలో వైవిధ్యం ఉన్నా కనపడకుండా కనిపించే ఒక పాత్రను ప్రధానపాత్రగా చూపగలిగాయి. అలా చూపించగలగటానికి కథలో ఉండి, ఉన్నట్లుగా ప్రవర్తించే పాత్రలు; లేకుండా ఉన్నట్లనిపించేలా కొన్ని పాత్రలని మన ముందు ఎంత ప్రభావవంతంగా నిలుపుతాయనేది ముఖ్యమనీ, కథనధోరణి దానికి ఆటంకం కాదనీ రుజువు చేశాయి.

ఈ వ్యాసంలో చూపించిన; కనపడకుండా కనిపించే ప్రధానపాత్రల లాంటివి మిగిలిన తెలుగు కథల్లో సైతం ఉంటాయి. కథని చదివే పాఠకులు, అలాంటి వాటిని గుర్తించటానికి కూడా ప్రయత్నిస్తూ కథని చదివితే; కథలో సాధారణంగా కనపడని ఒక కొత్త కోణం మనకి కనపడుతుంది.  కథాపఠనం మరింత ఆసక్తికరంగా కొనసాగుతుంది.

-o)O(o-

2 thoughts on “కనపడకుండా కథలో కనిపించే ప్రధానపాత్ర -టి. చంద్రశేఖర రెడ్డి

  1. చంద్రశేఖర రెడ్డి గారు, వ్యాసం చాలా బాగా వచ్చింది. ఆల్ ది బెస్ట్!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


   Type Comments in Indian languages (Press Ctrl+g to toggle between English and Hindi OR just Click on the letter)