Featured కితాబ్ వ్యాసం

కల (కళ) తన నేతన్న

 -జి.వెంకట కృష్ణ
‘పడుగు పేకలు’ గా సంకలనం చేసిన చేనేత కథల పుస్తకమిది. వేల సంవత్సరాల చరిత్రవున్న భారతీయ నైపుణ్యాన్ని, ఒక సమూహం తన కుల వృత్తిగా ప్రదర్శిస్తున్న కళకు పట్టిన దుర్గతిని అక్షరాలుగా ఒడిసి పట్టుకున్న ప్రయత్నమిది. రాయలసీమకు చెందిన పరిశోధకుడు మీద కుర్తి ఓబులేసు ఈ కథలను సేకరించగా, సంగిశెట్టి శ్రీనివాస్, వెల్డండి శ్రీధర్ లు అమూల్య సంపాదకీయ వ్యాసాలతో, తెలుగులో వృత్తికులాల సాహిత్యానికి ఆదర్శంగా నిలిచే కథా సంపద ఇది.
ఈ పుస్తకం లోని మొదటి కథ కుటీర లక్ష్మి (కనపర్తి వరలక్ష్మమ్మ) 1924 నాటిది. మొదటి అయిదు కథలూ 1947కు ముందు నాటివి. తక్కిన 52 కథలు స్వతంత్ర భారతావనిలో చేనేత బతుకు చిత్రాలు. వచ్చిన స్వాతంత్ర్యానికి చేదు సాక్ష్యాలు మొత్తం 58 కథలలో ఒకటి రెండు మినహాయిస్తే అన్నీ కాలానికి అతీతంగా చేనేత జీవిత దుర్భరతను వర్ణించినవే. 
 
సింధులోయ నాగరికత నాటికే వస్త్ర కళ ఉందనీ అప్పటివారు 34వ నెంబరు నూలు ఇంచికి అరవై పోగుల పడుగు, ఇరవై పోగుల పేకతో వున్న బట్ట నేసినారని తెలుస్తోంది. బౌద్ధ జాతక కథల్లో చేనేత వృత్తి కుటుంబాన్ని పోషించడానికి అనుకూలమైనదనే భరోసా ఒక ఘట్టంలో వ్యక్తమవుతుంది. భారత దేశంలో తయారైన వస్త్రాలు వ్యాపార రీత్యా 17వ శతాబ్ది దాకా బంగారంతో సమానమైనవని చారిత్రక ఆధారాలున్నాయి. దేశ విదేశాలతో వర్తక వాణిజ్యాలు చేనేత వల్లనే జరిగి రాజ్యాలు సంపదతో విలసిల్లినాయి. ఇదంతా యూరప్ లో పారిశ్రామిక విప్లవం వచ్ఛేదాకా భారతీయ వస్త్ర పరిశ్రమ, నేత కార్మికులూ వైభవంగా బతికినారని చెప్పడానికి ఆస్కారం కల్పిస్తోంది.
 
కనపర్తి వరలక్ష్మమ్మగారి కథలో జీవితం విషాదామవడానికి కారణం యూరోపియన్ పరిణామాలే. మొదటి ప్రపంచ యుద్ధం వాళ్ళ ఇంగ్లండులోని మాంచెష్టర్ లంకాశైర్ వస్త్ర పరిశ్రమ ఉత్పత్తులైన రంగులూ ముడిబట్టల ధరలు విపరీతంగా పెరగడం, వాటిని దిగుమతి చేసుకుని ఇక్కడ మెరుగైన సరుకుగా మార్చి ఎగుమతి చేసి లాభాలార్జిస్తున్న సంపన్నులైన వెంకటస్వామి వ్యాపారం దెబ్బతిని కుటుంబాన్ని పతనం చేస్తుంది. స్వాతంత్ర్య పూర్వ అయిదు కథల్లో రెండు స్వాతంత్ర్యోద్యమ ప్రచార కథలైతే, రెండు సాంశిక అంశాలను చిత్రించినవి. వరలక్ష్మమ్మ గారిదొకటే అంతర్జాతీయ పరిణామాల మధ్య చేనేత బతుకును చిత్రించింది. అయిదు కథలూ సమస్యల గురించి మాట్లాడినవే. కుటీరాలక్ష్మి కథ బలవన్మరణాలు చిత్రిస్తే, దామెర్ల కాంతారావు భగ్నప్రేమ (1932) ఆత్మహత్య చేసుకునే ఇల్లాలిని చిత్రిస్తుంది. ఆమె ఆత్మహత్యకు కారణం భర్త నిరాదరణ. భర్తకు కోపం రావడానికి పనికొస్తే ఆ కారణం. వెరసి చేనేత వృత్తిగానీ సామాజిక పరిస్థితులు గానీ సంతోషకరంగా లేవని స్వాతంత్ర్య కాలానికే రూఢీ అవుతున్నాయని ఈ కథలు చెబుతాయి.
స్వాతంత్య్రం వచ్చినప్పటినుంచీ 1990ల వరకూ వచ్చిన కథల్లో కూడా చేనేత దైన్యాలే చిత్రితమైనా, అందులో మెల్లగా చేనేత కార్మికుల జీవితం నుండీ మాయమైపోవడం (చేనేత చిత్రం – మునిపల్లె రాజు 1994) దారిద్య్రంతో ఆకలి మరణానికి (పరమాన్నం – సతీష్ చందర్ 1991) గురికావడం. అప్పటి సామాజిక ఉద్యమాల ప్రభావంతో రహస్య జీవితంలోకి (నాదే – సాహు 1994) వెళ్లడం కనిపిస్తుంది. అట్లా చేనేత వృత్తి జీవితానికి మనిషికి మధ్య దూరం పెంచుతున్నట్టు అక్కడక్కడా దాన్ని ప్రతిఘటించాలనే ఆకాంక్ష ఉన్నట్టు ఈ దశ కథల్లో సాక్ష్యం దొరుకుతుంది.
ఇక 1994 నుంచి 2015 దాక మన సౌలభ్యం కోసం మూడవ దశగా వర్గీకరించుకుంటే, ఈ 42 కథలలో ఒకట్రెండు కథలు మినహాయిస్తూ ప్రతి కథా చేనేత ఆత్మహత్య చుట్టూ తిరుగుతూ దైన్యపు పరాకాష్టను రికార్డ్ చేసిందే. చేనేత బతుకంటే ఒక అంతులేని వ్యథగా, దుర్భర దారిద్ర్యంగా, ఎలాంటి సంతోషం ఇవ్వలేనిదిగా, మగ్గంగుంట బందిఖానాగా, సజీవ సమాధిగా చిత్రించబడింది. ప్రతి కథకూ జీవితం లాగానే పరిష్కారం ఆత్మహత్యగా మిగిలిందని కఠిన వాస్తవాన్ని చిత్రించాయి. చేనేత జీవితానికి ఆత్మహత్య పర్యాయపదమా అన్నంతగా వివరించాయి. దీనికి దారి తీసిన కారణాలను కూడా ఆయా రచయితలూ వాచ్యంగా చాలాసార్లు శిల్పాన్ని పక్కనబెట్టి వివరించారు. ఒక పాత్రతో మాట్లాడించడం, లేదా కథకుడి స్వయంగా చెప్పడం ద్వారా ప్రభుత్వమూ, వాటి విధానాలూ కారణమని స్పష్టంగా చెప్పారు. యూరోపియన్ పరిణామాల ప్రభావంతో ప్రారంభమైన విషాదం, దేశానికి స్వాతంత్ర్యమొచ్చినా ప్రభుత్వ విధానాన్ని మాన్పలేదని, తద్వారా అది మరింత కఠినంగా మారి కళామయమైన వృత్తి కాస్తా సమాజానికి సంస్కృతినిచ్చిన వృత్తి కాస్తా ఆత్మహత్యలతో కునారిల్లిందని ఈ కథలన్నీ అక్షరబద్దం చేసాయి.
 
తెలుగులో కులవృత్తికి సంబంధించిన కథల సంపుటులుగానీ, సంకలనాలు గానీ చాల అరుదుగా వచ్చాయి. 
కర్నూలు నుండి 2000లల్లో వచ్చిన పల్లె మంగలి కథలు మొదటి ప్రయత్నం మాత్రమే. చాకలి, మంగలి కులాల కథలు వైయక్తికంగా రచయితలూ రాసి పుస్తకంగా తెచ్చినవి కన్పిస్తాయి గాని, మరే ఇతర కుల ఇతివృత్తాలతో కథా సంపుటాలూ సంకలనాలూ వచ్చినట్టు లేదు. ఇట్లా ఒక కులవృత్తికి సంబంధించిన జీవితాన్ని సమగ్రంగా పుస్తక రూపంలోకి రావడం మాత్రం ఆ పడుగు పేకలతోనే. 
ఇందులోకి సేకరింపబడకుండా ఒకటి రెండు కథలు బయటే మిగిలి ఉండవచ్చు గాక. ఈ పుస్తకం చేనేత బతుకు సమగ్రతను ఒక శతాబ్ది కాలానికి ఒడిసి పట్టుకుందని చెప్పక తప్పదు. చేనేత కుల సమూహపు సాంఘిక, ఆర్ధిక వ్యవస్థలను సూక్ష్మ స్థాయినుండి స్థూల చిత్రం దాకా ఇది పరిశీలించింది, చిత్రించింది. శతాబ్ది కాలానికి ప్రతి పరిణామాన్ని ఏదో ఒక స్థాయిలో పట్టుకోగలిగినందువల్ల వర్తమాన చరిత్రను సమగ్రంగా వివరించడానికి వనరుగా నిలబడింది.  
 
90ల తర్వాత కథలలో పునరావృత్తి కనిపించినా అది చేనేత కుల సమూహపు దైన్యతా/ పరాధీనతలోని గాఢతను సూచిస్తుంది. చాలావరకు కథలన్నీ చిన్నపెద్దా రచయితలూ అన్ని సామాజిక వర్గాల వారు రాసినట్టు కన్పిస్తున్నాయి. కాబట్టి, చేనేత దురవస్థ సమాజంలోని అన్ని వర్గాల/కులాల మేధోజీవులను కలవరపరిచందని తెలుస్తోంది. సూద్ర కులాలలో అంతో ఇంతో ప్రావీణ్యం రీత్యా, జనావసరాల రీత్యా, సమాజం గౌరవంగా బతకడానికి దోహదం చేసే కులపు విషాదం మేధావులను అక్షరబద్దం చేయడానికి పురికొల్పినట్లుంది.
90ల తర్వాత అస్తిత్వ ఉద్యమాల ప్రభావం వల్ల అనేక సమూహాలు ఎవరి బతుకుల్ని వాళ్ళే రికార్డ్ చేయడం మొదలుపెట్టినప్పటికీ, చేనేత బతుకులు మాత్రం చాలా ముందునుండీ అస్తిత్వగానం చేస్తున్నట్టు ఈ పుస్తకం నిరూపిస్తోంది. అయితే 90ల తర్వాత ఈ చేనేత బతుకు వ్యక్తీకరణ ముమ్మరమైంది.
 
వ్యవసాయ రంగం తర్వాత ఎక్కువమందికి ఉపాధి కల్పించింది చేనేత రంగమే. అయితే వ్యవసాయం లోని భూమి ఇచ్ఛే భరోసా, మగ్గం, గుంత ఇవ్వలేకపోయాయి. అందుకేనేమో, వ్యవసాయ రంగంలో రైతు ఆత్మహత్యల కంటే ఎంతో ముందుగానే చేనేత ఆత్మహత్యలు మొదలయ్యాయి. రైతుల కెట్ల అయితే వృత్తి బదలాయింపులు, ప్రత్యామ్నాయ మార్గాలూ ఉండవో, చేనేత కార్మికుడికి అంతే. అది బతుకు ఇరుకు చేస్తుందనీ బతుకును బలవన్మరణం వైపు నడిపిస్తుందని ఈ సంకలనంలోని చాలా కథలు వివరిస్తాయి. ఆ మేరకు ఈ సమూహపు కష్టానికి వ్యవస్థ సరియైన పరిష్కారాలు వెతక లేదని ఈ కథలు వెల్లడిస్తాయి.
ఈ సంకలనంలోని చాలా కథలు వలసలని చిత్రించిన కథలు. మగ్గం వద్దనుకుంటే చేనేత వ్యక్తికీ ఊర్లో మట్టి పనీ, చేల్దారు పని మాత్రమే ప్రత్యామ్నాయం. చేనేత సమూహానికి రకరకాలుగా భూమిని దూరం చేసింది హిందూ వ్యవస్థ. చేతిలో పని తప్పితే ఏ ఇతర ఆదాయమార్గాలు లేవని ఈ సంకలనంలోని ప్రతి కథ చెపుతుంది. ఇలాంటి స్థితిలో వూర్లో బతుకు తెరువు లేక, నేసిన బట్టలకు గిరాకీ లేక, యింటి ఖర్చులూ పిల్లల పెళ్ళిళ్ళూ అప్పుల పాలు జేయగా అనివార్యంగా ఇంటి పెద్దో, పెద్ద కొడుకో వృత్తినే నమ్ముకుని, మెరుగైన కూలి కోసం వలస బాట పట్టడం కన్పిస్తుంది. అది పల్లె నుండి దగ్గరున్న పట్నానికి సాధారణంగా జరుగుతుంది. అయితే, చేనేత కార్మికులు అసాధారణంగా భివండీ, సూరత్, నాగపూర్, ముంబయి, సోలాపూర్, 
అహమ్మదాబాద్ల దాకా వెళ్లి అగచాట్లు పడ్డారని ఈ కథలు వివరిస్తాయి. వలస వెళ్లిన చోట్ల దుర్భర పరిస్థితులు చివరకు బతుకును హరించివేసిన నిష్టుర సత్యాలని చెప్తాయి.
ఈ సంకలనంలోని అనేక కథలు తెలంగాణ / ఆంధ్ర / రాయలసీమ ప్రాంతాలలో జరిగిన ఎన్నో  బలవన్మరణాలను వాస్తవికంగా కథనం చేసాయి.
2000ల తర్వాత వచ్చిన కథల్లో ఆత్మహత్యల నేపథ్యం, కుటుంబ పరిస్థితులని చెబుతూనే రాజకీయ నాయకుల, ప్రభుత్వ విధానాల నిర్వాకాలనూ, కపటత్వాన్నీ వివరిస్తాయి. అక్కడక్కడా మూగ రోదనలు చిన్నపాటి ప్రతిఘటన లవడమూ కనిపిస్తుంది. బతికిన స్థలం నుండీ వలసపోవడమూ, జీవితం నుండి శాశ్వతంగా మరలిపోవడం జరిగినంతగా, వేరే ఉపాధుల్లోకి వెళ్ళడానికి ప్రయత్నించడం గానీ, తీవ్రంగా ప్రతిఘటించడం గానీ, లేకపోవడాన్ని కూడా ఈ కథలు సూచిస్తాయి.
వృత్తి బదలాయింపులూ, వృత్తిలో సృజనాత్మక క్రియాశీలత లేకపోవడానికి దారితీసే పరిస్థితుల్ని కూడా ఈ కథలు అన్యాపదేశంగా చిత్రించాయి. చేనేత కార్మికుల పిల్లల్ని చదివించు కోలేకపోవడమనేది ప్రతి కథలోనూ కనిపిస్తుంది. చదువు ఉంటే తప్ప వృత్తిలో నైపుణ్యమైనా, వేరే వృత్తి ఎంచుకోవడానికి అవసరమయ్యే స్థితినైనా అందిపుచ్చుకోలేదు. చదువులేదు కాబట్టి బండగా అదే వృత్తిలో కూరుకు పోవడమనే విష వలయంలో చేనేత బతుకుల్ని వ్యవస్థ దించిందని ప్రతి కథా వివరిస్తుంది.
సమాజం విధించిన విషవలయాన్ని ఛేదించి, చేనేతలు చేస్తున్న వలసలు భివండీకి, సూరత్ కూ కాకుండా అమెరికాకు జరగాలనీ అక్కడ కూడా ఎదో బతుకుతెరువు డిజిటల్ కూలీలుగా గాకుండా కంపెనీలు స్థాపించి ఇక్కడినుండి నిరుద్యోగుల్ని తీసుకెళ్లి ఉపాధి కల్పించాలని కూడా ఒక గొప్ప ఆశను ప్రకటించే కథ ఈ సంకలనంలో ఉంది. 
బి.ఎస్. రాములు గారి ‘బతుకు పయనం’, వలసలు అభివృద్ధివైపు జాగాలనీ పాత మైండ్ సెట్ మార్చుకోవాలని అప్పుడే సంకెళ్ళనుండీ బయటపెడతామని చెప్పే కథ.
 
చేనేత కులంలో చదువుల ఆవశ్యకతను, ఆ చదివిన వాళ్లకు నాయకులుగా, నాయకురాళ్లుగా ఎదిగి సమూహాన్ని అభివృద్ధివైపు నడిపించాలనే ఆకాంక్ష ఈ సంపుటిలోని ‘అరుణోదయం’, ‘అంధకారాన్ని ఆవలివైపు’, దిశమార్చిన చదువు’ లాంటి కథల్లో కనిపిస్తుంది. ‘అరుణోదయం’ కథలోని అరుణ ఒక టీచర్ వల్ల చదువుల్లో ఎదిగి, ఐ.ఏ.ఎస్ అధికారి అయి చేనేత కులానికి అండగా నిలబడ్డం ఉంది. ‘అంధకారానికి ఆవలివైపు’ కథా, ‘దిశ మార్చిన చదువు’ కథా చేనేతల్లో నుండే పారిశ్రామికవేత్తలు రావాల్సిన అవసరాన్ని వివరిస్తాయి. కుల వృత్తిని ఆధునికీకరించాలని ఆశిస్తాయి. ‘అంధకారానికి ఆవలివైపు’ కథ ఇంకొంత ముందుకుపోయి అలాంటి పారిశ్రామికవేత్తలు రాజకీయాల్లో కొచ్చి కుల అభ్యున్నతికి పాటుపడాలని చెపుతుంది. ఇంతదాకా కుల సమూహాన్ని చీడపురుగుల్లా పీడించిన మధ్య దళారీలను ఏరి పారేయడం అలాంటి ఆదర్శ నాయకుల వల్లనే సాధ్యమవుతుందని కూడా ఈ కథ చెబుతుంది.
 
స్వభావ రీత్యా వృత్తి కథ సంకలనం కావడమంటే ఆ సమూహపు ఆచార వ్యవహారాలు, సంస్కృతీ, చరిత్రా, చలనశీలతా స్వభావాలకూ పట్టుగొమ్మ కావడమే. అతిశయోక్తి అనుకోకుంటే ఈ ౫౮ కథలు చదవడమంటే చేనేత బతుకును కెలిడోస్కోప్ లో చూడడమే (విషాదం పాలు ఎక్కువ ఉన్నప్పటికీ). అందువల్ల ఈ సంకలనం, చేనేత జీవితాల వృత్తి పదకోశంగా, విజ్ఞాన సర్వస్వముగా, ఆ వృత్తి గురించి పరిశోధనకు ఉపయుక్తమయ్యే వనరుగా ఉంది. 
ఈ సంకలనం శీర్షిక ‘పడుగు పేకలు’ దగ్గరనుండీ జూకంటి జగన్నాధం గారి ‘వైపైని’ దాకా పాఠకుడు చదివి తెలుసుకోగలిగిన వృత్తి విషయపరిజ్ఞానం దాని ఆవరించివున్న కరుణతో సహా విజ్ఞానదాయకమే.
 
చేతివృత్తిని ఒక కలగా ఉన్నతీకరింపబడడం సాధ్యం చేసుకున్న సమూహం, ఉత్పత్తిని పెంచే నైపుణ్యంగా, దానికవసరమైన యాంత్రీకరణ వైపు ప్రయాణించడం భారతీయ సంప్రదాయ వ్యవస్థలో సాధ్యం కాలేదు. భారతదేశంలో బలంగా ఉండిన (సంస్కృతి రీత్యా) ఫ్యూడల్ వ్యవస్థ సమాజాన్ని ఆధునికంగా చైతన్యవంతంగా నడిపించడానికి అవకాశమూ లేదు. ఈ రుగ్మత అనేక సమూహాలను శిధిలం చేసినట్లే చేనేత సమూహాన్ని కృంగ దీసింది. సమాజం ఇఛ్చిన విధుల్ని నిర్వర్తించిన సమూహాలు, సమాజం నుండే జీవనాధార భద్రతలను మాత్రం అందుకోలేక పోయాయి. ఎంతోమందికి జీవనోపాధి కల్పించిన సమూహం, చేతిలో నైపుణ్యమున్న సమూహం భారతీయ వ్యవస్థలో నాటుకునిపోయి వున్నా జడ చైతన్యానికీ, హేతువును ఒంటబట్టించు కోని తనానికి, సరియై స్వయం అపరాధంతో, ప్రతిఘటన లేమితో బలి ఐయిందనీ, ఈ స్థితినుండి మార్పు రావాలని ఈ సంకలనంలోని ప్రతి కథా ఆకాంక్షిస్తోంది. 

3 thoughts on “కల (కళ) తన నేతన్న

  1. పడుగుపెకలు కథల్ని కాలానుగుణంగా విభజించి విశ్లేషించడం బావుంది. పరిశోధకులకు మార్గదర్శనం చేసే విమర్శ. అభినందనలు వెంకటకృష్ణ గారు. ధన్యవాదాలు కూడా…

  2. ధన్యవాదాలు శ్రీధర్.పడుగు-పేకలు పుస్తకం లో మీదీ , సంగిశెట్టి శ్రీనివాస్ గారిదీ మంచి వ్యాసాలు.చేనేత ప్రేమికులు చదవాల్సిన వి.

  3. మీకృషికి సలాం. పడుగుపేకల తీరున ప్రతీకులం/ ఉత్పత్తివర్గం తమ వృత్తి నేపధ్యాన్ని కధలద్వారా వివరిస్తే సమకాలీన సమాజపు మెదళ్ళకు చేరుతాయి. ఈతరహా సాహిత్యాన్ని డిగ్రీవరకు ఉపవాచకాలు (సప్లిమెంటరీ రీడర్)గా ప్రవేశపెడితే భావిజీవితాలలో సహానుభుతితో వర్తిస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


   Type Comments in Indian languages (Press Ctrl+g to toggle between English and Hindi OR just Click on the letter)