కథ

కాటుక కళ్ళు

                                                                          -రెహనా

బారాత్ ఆగయీ….బారాత్ ఆగయీ….

హౌవ్…?

అరె ఠేరో జీ…దూలేసాబ్ కిదర్ హై…దేఖనే దో…

అదే వో దేఖో…ఫూలోంకే సైరో మె…

అబ్ అయ్ సాంచ్ ఖడతే…కుచ్ అంపడ్ లేతే భీ…

నఫీ…నఫీ…తుమ్హారె దుల్హ ఆగయే…

తెల్లని మల్లె మొగ్గకు ఎర్రని చుడీదార్ వేసినట్లు ఉంది నఫీసా ఖాతూన్. ఆల్చిప్పల్లాంటి కళ్ళకు కాటుక , చిట్టి పెదాలకు ఎర్రటి లిప్ స్టిక్. చేతుల నిండా పండిన మెహందీ. గాలికి తూగుతున్న ఉంగరాల జుట్టును గట్టిగా పట్టుకుని జడేస్తున్నారెవరో.

“ఆ…థోడా…ధీరే…దర్ద్ హో రహా హై…” నెప్పిని తట్టుకోలేక వెనక్కి జడ దగ్గర చేతులు పెట్టి అంది నఫీసా.

ఆ పెద్దావిడ మాత్రం ఇవన్నీ మామూలే అన్నట్లు తన పని తాను కానిచ్చేస్తూనే ఉంది. నఫీసా చిన్నక్క ఫర్హానా వచ్చి ఇంట్లో ప్రత్యేకంగా తయారు చేసిన దుల్హన్ కా జోడా మోడల్ గోట్ ల మధ్య లాడ్ బజార్ లో కొన్న గాజులు, నుదుటి పై టీకా, మెడలో నెక్లేసు, ఉంగరాలు , పట్టీలు గట్రా అలంకరించింది. జడకు మల్లెల మూర చుట్టి ఆ పైన రెండు మూడు గులాబీలు గుచ్చింది.  బంగారు  రంగు చెమ్కీలు, మెరుపుల డిజైన్లతో ఉన్న ఎర్రటి ఘుంఘోట్ కప్పి గదిలో ఓ మూలన నులక మంచం పై కూర్చోబెట్టారు నఫీసాను.

“మా షాల్లా…నజర్ నా లగే…పెళ్ళి కూతురు ఎంత అందంగా ఉందో”

” ఆ…ఎక్కువ అందంగా ఉన్నా ప్రమాదమే. మొగుడ్ని లెక్క చేయరు. అయినా అందం ఉంటే సరిపోయిందా …పద్ధతీ పాడు ఉండొద్దు…”

మెటికలు విరుస్తూ అంది సన్నగా పొడగ్గా ఉన్న నఫీసా  ఆడపడుచు.  పెళ్లి కొడుకు తరపు వారు వచ్చి… వారు చేయాల్సిన రసమ్ రివాజులు పూర్తి చేశారు. మౌల్వీ సాబ్ మూడు సార్లు ఖుబూల్ హై …అనిపించారు. పెద్దల సమక్షంలో పెళ్లి అంగీకార సంతకాలు పెళ్ళి కొడుకు, పెళ్ళి కూతురు నించి తీసుకున్నారు.  అధికారికంగా నఫీసా ఖాతూన్ వాహెద్ అలీఖాన్ కు భార్య అయ్యింది.

నఫీసాకు పదేళ్ళ వయస్సప్పుడు తండ్రి అనారోగ్యంతో మంచం పట్టి రెండు నెలల తర్వాత బంధ విముక్తుడయ్యాడు. అప్పటి నుంచి ఇంటి బరువంతా తల్లి గౌసియా బేగం మీదే పడింది. నఫీసా చదువు మాని గోట్ ల తయారీలో తల్లికి సాయంగా ఉండాల్సి వచ్చింది.

“ఛోటే దాదీకో బులావో…నయే జోడేకు నజర్ నికాల్తే…”

పెళ్లి కొడుకు తల్లి కేకేసింది. కొత్త జంటకు దిష్టి తీసిన తర్వాత కుడి కాలు వేసింది నఫీసా. అంతా కొత్త కొత్తగా ఉంది ఆమెకు. ఎవరెవరో వస్తున్నారు తొంగి తొంగి చూస్తున్నారు. గందరగోళం, ఆందోళన, భయాన్ని ఘుంగోట్ మాటున దాచుకునే ప్రయత్నం చేస్తోంది.

“అల్లుడు గారు ఏం చెబితే అది చెయ్యి.  కాదు, కూడదు అనకూడదు…” పదే పదే అమ్మ చెవిలో పోసిన ఉపదేశాలు  నఫీసాను వదలకుండా ఉన్నాయి.

“అబ్బాయికి కాస్త వయసెక్కువ కాని…మంచి వళ్లు ఉన్న వాడే “…పెద్దమ్మ ఎవరితోనే అన్న మాటలు గుర్తుకు వచ్చాయి.

నఫీసాకు ముగ్గురు అక్కలు, ఇద్దరన్నలు, ఒక చెల్లి. పెద్దవాళ్ళందరి పెళ్లిళ్ళు అయిపోయాయి. ఒక అన్న దుబాయ్ లో ఫిట్టర్ ఉద్యోగం, మరో అన్న రసూల్ పురాలో బట్టల దుకాణంలో సేల్స్ మ్యాన్ గా పని చేస్తున్నాడు. పెళ్ళి కొడుకు యమెన్ లో ఓ ప్రైవేటు కంపెనీలో  ఎలక్ట్రీషియన్ గా చేస్తున్నాడు.

“లైట్ ఉంచాలా…తీసేయాలా…”

“… ..” ఆమె తనలోకి  మరింతగా ముడుచుకు పోయింది.

ఒక్క క్షణం చూసి తానే లైట్లు ఆపేశాడు పెళ్లికొడుకు.

“ఇంత అందంగా ఉన్నావ్…మీ ఇంటి చుట్టు పక్కల ఎవరూ నిన్ను ప్రేమించలేదా..?”

ఎక్కడెక్కడో తిరుగుతున్న చేతులు జుగుప్స కలిగిస్తున్నా…ఏం చేయాలో తెలీక గందరగోళ పడుతోంది లోలోపల.

“ఛీ…లేదండీ…”

“నిజం చెప్పు పర్వాలేదు …నేనేమీ అననులే. ”

” నిజంగానే చెబుతున్నానండీ. మేం చాలా పద్ధతిగా పెరిగాం…”

“నీ నిజమెంతో ఐదు నిమిషాల్లో తేలిపోతుంది చూడు. రక్తం వస్తే నువ్వు చెప్పింది నిజం, రాకపోతే నా అనుమానం నిజం. సరేనా…”

వివాహ బంధం పేరుతో జరిగిన ఆ అత్యాచారానికి  నఫీసా విలవిల్లాడింది. కాసేపటి తర్వాత అతను దిగ్గున లేచి లైట్ వేశాడు. సిగ్గుతో, నెప్పితో చితికిపోతున్న ఆమెను ఏ మాత్రం పట్టించుకోకుండా ఆత్రంగా మరకల కోసం చూశాడు. అతని ఆత్మ శాంతించింది. తృప్తిగా కళ్ళు మూసుకుని గురకపట్టి నిద్రపోయాడు. అలా నఫీసా కొత్త జీవితం ప్రారంభం అయ్యింది. అదే తర్వాత అలవాటయ్యింది.

నఫీసా వయస్సు పదహారు, వాహెద్ వయస్సు నలభై ఆరు. మొదటి భార్య కాల్పులో, రెండో భార్య అనారోగ్యంతో చనిపోతే నలుగురు పిల్లల తండ్రి మూడో సారి పెళ్లి కొడుకు అయ్యాడు. కట్నం అక్కరలేదు అనే వెసులుబాటు, గల్ఫ్ దేశాల్లో ఉద్యోగం , తన ఇంట ఉన్న పేదరికం తండ్రి వయస్సులో ఉన్న వ్యక్తితో కూతురు పెళ్లి జరిపించాలే చేశాయి గౌసియా బేగం చేత. నఫీసాకు తనకు జరిగిన అన్యాయం గురించి ఆలోచించే వయస్సు గాని, అవగాహన కాని లేవు. తనకూ పెళ్ళైంది, భర్త ఉన్నాడు. సంసారం ఇలానే ఉంటుంది అన్నంత వరకు తనకు తెలుసు. ఊహ వచ్చినప్పటి నుంచి తాను చూసిన లోకం ఇలానే ఉండటం వల్లనేమో నఫీసా పెద్దగా బాధపడింది లేదు.

పెళ్లైన నెల రోజులకు భర్తతో కలిసి యెమన్ విమానం ఎక్కింది.

“ఇంటికి వచ్చింది ఎవరు ?” ఇంట్లోకి అడుగు పెడుతూనే  అడిగాడు వాహెద్. అతనికి ఎలా తెలిసి పోయిందా అని ఆశ్చర్యపోయింది నఫీసా. కిరోసిన్ స్టౌవ్ పై  ఉడుకుతున్న కూరను గరిటెతో తిప్పుతూ…

” ఆయన పేరు కరీముల్లా అన్నారు. మీకు బాగా తెలుసంట కదా. మనం వచ్చామని తెలిసి చూట్టానికి వచ్చారంట. ”

“….ఎంత సేపున్నాడు…?” లాల్చీ తీసి కొక్కానికి తగిలిస్తూ అడిగాడు.

“చాయ్ చేస్తాను ఉండమంటే …మరోసారి వస్తాను అని వెళ్లిపోయారు.మీకు ఫోన్ చేశారంట కదా.  వదిన గారు రేపు శుక్రం వారం మనిద్దర్ని వాళ్ళింటికి భోజనానికి పిలవమన్నారంట.” భర్తకు లేని పోని అనుమానం ఎక్కడ వస్తుందో అనే భయం కొద్దీ వదిన పదాన్ని నొక్కి చెప్పింది నఫీసా.

“మొగుడు లేనప్పుడు మరో మగాడు వస్తే ఇంట్లోకి పిలిచి టీలు, టిఫిన్ లు అంటూ మర్యాద చేస్తావా…?గుమ్మం దగ్గరే ఆయన లేరని చెప్పలేవా…?” ఎర్రగా రుసరుస లాడుతూ అన్నాడు వాహెద్.

మరో మాట మాట్లాడే ధైర్యం లేక మనసులోనే తిట్టుకుంటూ నేల చూపులు చూస్తూ ఉండిపోయింది.

చనువు కొద్దీ కరీముల్లా  కుటుంబం ఆ తర్వాత రెండు , మూడు సార్లు రాకపోకలు సాగించింది. కరీముల్లా వయస్సు పాతిక్కి కాస్త అటూ ఇటూగా ఉంటుంది. రెండేళ్ళ వయస్సున్న కొడుకు, భార్యతో యెమన్‌లోనే కాపురం  ఉంటున్నాడు. నఫీసా అక్కడ అడుగు పెట్టనంత వరకు కరీముల్లా అంటే వాహెద్ అలీఖాన్ కు అభిమానమే. కరీం బేటా అని నోరారా పిలిచే వాడు. కాని ఇప్పుడెందుకో నఫీసా అందం పై కరీం కళ్లు పడ్డాయేమోనని అనుమానం. కరీమే కాదు వయస్సులో ఉన్న ఏ అబ్బాయిని చూసినా  భయం. తన పెళ్లాం కూడా వయస్సులో ఉన్న మగాడితో సుఖాన్ని కోరుకుంటుందేమోనన్న భయం. షుగర్, బీపీ మాత్రలు వేసుకుంటూ ఎంత కాలం మొగుడిగా ఆధిపత్యం చెలాయించగలను అన్న భయం.  దీని ఫలితం మరో రూపంలో నఫీసా ముందుకు వచ్చింది.

……………

“ఉన్ కో నౌకరీసే నికాల్ దియే కతే అమ్మీ. ఇద్దరికీ ఖర్చు ఎక్కువ అవుతుంది కదా. ఉద్యోగం వచ్చిన తర్వాత మళ్లీ వద్దువు కాని అంత వరకు మీ ఇంటి దగ్గర ఉండు  అని ఫ్లైట్ ఎక్కించేశారు. నాక్కూడ మీ అందరి మీద బెంగగా ఉండేది. ”

“వెళ్లిన తర్వాత అల్లుడు గారు ఫోన్ చేసి చెప్పటమే కాని నువ్వు ఒక్కసారి కూడా మాట్లాడలేదేం తల్లీ…ఎలా ఉన్నావో, ఏమిటో అని మా అందరికి భయంగా ఉండేది.  ఆ అల్లాకు దువా చేసుకుంటూ ఉండేవాళ్ళం. ”

“ఆ…ఆయన నన్ను మాట్లాడనిస్తేనా…?నేను కూర్చున్నా కోపమే, నించున్నా కోపమే.  నవ్వినా అనుమానమే, కాస్త తల దువ్వుకున్నా అనుమానమే. ఇంకెవరితో అయినా మాట్లాడితే ..ఇంకా ఆయన ముఖం చూడాలి. ఒక్కదాన్నే ఉండలేక పిచ్చి ఎక్కేదనుకో. కాస్త కరీం అన్నయ్య, వదిన వాళ్ళు వస్తేనే సంతోషంగా ఉండేది నాకు. సరేలే ఇలాగైనా మంచిదే కదా వచ్చేశాను.”

అప్పుడప్పుడు పాతబస్తీలోనే ఉన్న అత్తారింటికి  వెళ్లినా రమ్మని కాని,  కూర్చోమని కాని  అనే వారు కాదు. కాసేపు పిల్లలతో ఉండి తిరిగి పుట్టింటికి వచ్చేసేది నఫీసా. వచ్చిన కొత్తలో ఒకటి రెండు సార్లు ఫోన్ లో మాట్లాడింది వాహెద్ తో. తర్వాత ఎప్పుడు చేసిన ఫోన్ స్విచ్చిడ్ ఆఫ్ అనే వచ్చేది. ఆరు నెలలు గడిచాయి. చుట్టు పక్కల వారి ప్రశ్నలు మొదలయ్యాయి. కష్టమైనా, నష్టమైనా తిరిగి అతని దగ్గరకే వెళ్లి పోవలన్నా ఆత్రుత పెరిగింది నఫీసాలో. కరీముల్లా నెంబర్ కు ఫోన్ చేసి భర్తకు కంబురు పంపింది.

ఆ తర్వాత  ఒక రోజు రాత్రి ఎనిమిది గంటల వేళ నఫీసా వాళ అన్నయ్య కు  ఫోన్ చేశాడు వాహెద్. నఫీసాకు ప్రాణం లేచి వచ్చింది. భర్తకు కూడా తాను బాగా గుర్తుకు వచ్చి ఉంటాను అని సంబరపడిపోయింది.

“హలో…”

“హలో…సలాం వాలేకుమ్..ఎలా ఉన్నారు. ?” నఫీసా గొంతులో ఆనందం.

“……”

“హలో…వినిపిస్తోందా అండీ.?…నన్ను ఇక్కడే వదిలేశారు. ఎప్పుడు తీసుకువెళతారు..?”

“నువ్వింకా ఇక్కడికి రానవసరం లేదు. ”

“ఏం? ఎందుకు రానవసరం లేదు…?ఇంకా ఉద్యోగం దొరకలేదా?”

“నేను నిన్ను వదిలేయాలనుకుంటున్నాను. ”

”  మజాక్ చేస్తున్నారు కదా . “నిర్ఘాంతపోయినా సర్దుకుని అడిగింది.

” తలాఖ్…తలాఖ్…తలాఖ్…  ” ఫోన్ కట్ అయ్యింది.

తాను విన్నది ఏమిటో అర్ధం కాలేదు నఫీసాకు. అల్లుడు ఏం చెబుతున్నారో అని ఆమె వైపే ఆత్రంగా చూస్తున్నారు గౌసియా, నఫీసా అన్నయ్య.

“క్యా బోలే బేటా…” ఆందోళనగా అడిగింది గౌసియా బేగం.

ఒంటి గది రేకుల కప్పుకు వేళ్ళాడుతున్న ఫ్యాన్ నెమ్మదిగా తిరుగుతోంది. బయటంతా చీకటి. ఇరుకు సందులో జనాల మాటలు, అరుపులు, కేకలు, పిల్లల అల్లరి వినిపిస్తున్నాయి. గదిలో ఓ మూలన చిన్న రేకు డబ్బాలాంటి  బొగ్గుల కుంపటి పై ఉన్న ప్లేట్ నుంచి రాళ్ళను ఒక్కొక్కటిగా పట్టకారుతో పట్టి      గాజుల పై జాగ్రత్తగా అద్దుతోంది నఫీసా వదిన.

“ఇలా ఫోన్ లో తలాఖ్ చెబితే చెల్లదు చెల్లి. నువ్వేం బాధ పడకు. బావ గారు ఎందుకు అలా అన్నారో నేను నెమ్మదిగా కనుక్కుంటాను.” నఫీసా అన్నయ్య మాట పూర్తి కాక ముందే వాట్సప్ మెసేజ్ నోటిఫికేషన్ రింగ్ వచ్చింది.

ఓ కొత్త నెంబర్ నుంచి ఫోటో డౌన్ లోడ్ అయింది. వాహెద్ పంపించిన నిఖానామా ఫోటో అది. భయం, ఆందోళన, అవమానం , నిస్సత్తువకు  తల్లి ఏడుపు తోడయ్యి రాత్రి  అలానే తెల్లారింది. ఆ ఫోన్ పట్టుకుని తెలిసిన మౌల్వీ సాబ్ దగ్గరికి వెళ్లారు. విషయం చెప్పారు.

“మా చెల్లి చేసిన తప్పేంటో చెప్పకుండా, ఇలా ఉన్న పళంగా తలాఖ్ పంపిస్తే ఎలాగ మౌల్వీ సాబ్…? నలుగురిలో ఎలా తలెత్తుకుంటాం? ”

” నిజమే కాని…మరి ఆయన తలాఖ్ చెప్పేశారు అంటున్నారు కదా. ఇప్పుడు చేయటానికి ఏమీ లేదు మరి.   ”

“మీరే ఏదో ఒక దారి చూపించి ఆదుకోండి మౌల్వీ సాబ్. ఆడపిల్ల జీవితం నాశనం అయిపోతుంది. నేను ఐదు పూట్ల నమాజ్ చదువుతానే. మన మజహబ్ ఇలానే చెబుతోందా..? ఇంత అన్యాయం చేస్తుందా…?” దాదాపు కాళ్ళ మీద పడినంత పని చేశాడు నఫీసా అన్నయ్య.

“బేటా…ఒకసారి భర్త నాకీ భార్య వద్దు అని నిఖానామా పంపిన తర్వాత మేం కూడా చేయటానికి ఏమీ ఉండదు. మజహబ్ లో ఉన్నది ఎవరు పాటిస్తున్నారు ? తమకు అనుకూలమైన పంథాను ఎంచుకుంటున్నారు. వాట్సఅప్ లో ఫోటో పెట్టడం ఇంకా తేలిక కదా. కాగితాలు పోస్ట్ చేయటం కంటే . అన్యాయం అని నేను నమ్మినా….పరిష్కారం మాత్రం నా చేతిలో లేదు బేటా. మై కుచ్ నై కరసక్తా…వాస్తవాన్ని ఒప్పుకోవటం మినహా మీరు కూడా ఏమీ చేయలేరు. ”

నిండైన  నల్లటి బురఖా…తెల్లటి కాటుక కళ్ల్లలో ఉబికి వస్తున్న కన్నీళ్లు. సముద్రాలు, అఘాదాలు, లోయలు, తుఫాన్లు…అన్నీ ఆ ఆల్చిప్పల్లాంటి కళ్ళల్లో సుడులై తిరుగుతున్నాయి.

రెహనా

ఫోన్ నం.-94925 27352

4 thoughts on “కాటుక కళ్ళు

  1. ఎందరో అభాగీనుల జీవితాలు కళ్లకు కట్టినట్లుగా ఉంది

    1. ఇలాంటి పరిస్థితులు పాతబస్తీతోపాటు ఇతర ప్రాంతాల్లోనూ ఉన్నాయి
      రెహనగారు వాస్తవ పరిస్థితులకు అక్షరరూపం ఇచ్చారు. సంతోషం
      కాకపోతే ఈ కథ ఇప్పుడే రావడం….మోదీ తలాక్ బిల్లుకు మద్దతు ఇచ్చినట్లుగా ఉంది

  2. నఫీసా లు హైదరాబాద్ పాట బస్తీ లోనే కాదు ..ప్రస్తుతం గుంటూరు , విజయవాడ నగరాలలో కూడా కనబడటమే ..ఇంకా విషాదం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


   Type Comments in Indian languages (Press Ctrl+g to toggle between English and Hindi OR just Click on the letter)