Featured కాలమ్స్

కొత్త కెరటాలకు స్వాగతం

-సంగిశెట్టి శ్రీనివాస్

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత అన్ని రంగాల్లో మనదైన ముద్రను ప్రదర్శించుకుంటున్నాము.  విస్మరణకు, వివక్షకు గురైన వైతాళికులను స్మరించుకుంటున్నాము. సినిమా రంగంలోనూ ఈ సోయి కనిపిస్తున్నది.

తెలంగాణ రచనా ప్రతిభను సినిమా ద్వారా ప్రపంచానికి పరిచయం చేసిన వారిలో హరీంద్రనాథ్‌ చటోపాధ్యాయ ప్రముఖులు. ఏప్రిల్‌ 2, 1898 నాడు హైదరాబాద్‌లో జన్మించిండు. 92 ఏండ్లు బతికిండు. కవిగా, నాటక కర్తగా, సంగీతకారుడిగా, నటుడిగా ఈయన కళా రంగంలో రాణించారు. సరోజిని నాయుడు తమ్ముడిగా, విదేశాల్లో తిరుగుబాటు జెండా ఎగరేసిన మరో విప్లవకారుడు వీరేంద్రనాథ్‌ సోదరుడిగా ఆయన అందరికీ తెలుసు. అలాగే విజయవాడ నుంచి మొదటి పార్లమెంటు ఎన్నికల్లో (1951) లోక్‌సభ సభ్యుడిగా  కూడా ఎన్నికయిండు.

ఈయన నటించిన సాహిబ్‌ బీబి ఔర్‌ గులామ్‌, గర్బార్‌, ద హౌజ్‌ హ్డోర్‌, సాంజ్‌ ఔర్‌ సవేరా, తీన్‌ దేవియన్‌, పింజ్రేకే పంచీ, రాజ్‌, రాత్‌ ఔర్‌ దిన్‌, నౌనిహాల్‌ అనే హిందీ సినిమాల్లో, గోపి గైనె బాగ గైనె, సీమ బద్ధ. సోనార్‌ కెల్లా మొదలైన బెంగాలీ చిత్రాల్లో కూడా నటించాడు. 90 ఏండ్ల వయసులో 1988లో ‘మాలా మాల్‌’ సినిమాలో నటించిండు.

ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే తెలంగాణ సాహిత్యాన్ని హిందీ సినిమాకు పరిచయం చేసిన ఖ్యాతి హరీన్‌కు దక్కుతుంది. ఈయన తెలంగాణ మీద ఇంగ్లీషులో రాసిన కవిత్వాన్ని ఆరుద్ర తెలుగులోకి అనువదించిండు. ఆ తర్వాత మఖ్డూమ్  కూడా హిందీ సినిమాలకు పాటలు రాసిండు. ఇట్లా తెంగాణ/హైదరాబాద్‌ జీవితాన్ని హరీంద్రనాథ్ తెరకు పరిచయం చేసిండు. హరీంద్రనాథ్‌ దగ్గరి బంధువు పైడి జైరాజ్‌. ముత్యాల గోవిందరాజులు నాయుడు (సరోజిని నాయుడు భర్త) బంధువైన పైడి జైరాజ్‌ పేరిట ఇవ్వాళ హైదరాబాద్‌ నగరం నడిబొడ్డున ఒక ప్రివ్యూ థియేటర్‌ ఏర్పాటు జేసుకున్నాము.

హైదరాబాద్‌పై ఆంధ్రాధిపత్యము కొనసాగినన్ని రోజులు కనీసం పైడి జైరాజ్‌ స్మరణలో కూడా లేడు. వందేళ్ళ సినిమా సంబరాలు  చేసుకున్నా అందులో జైరాజ్‌కు ఎక్కడా తావు లేకుండే! సినిమా రంగంలో ఆంధ్రాధిపత్యానికి ఇదో మచ్చు తునక మాత్రమే!

ఇవ్వాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయింది. మనం ఎవ్వరినీ దేహీ అని అడగాల్సిన స్థితిలేదు. మన ప్రతిభను ప్రదర్శనకు పెట్టేందుకు వారం వారం సినీవారం పేరిట ఇక్కడ ఒక కార్యక్రమం చేపట్టడడం కచ్చితంగా స్థానిక ప్రతిభకు పట్టం కడుతుందని ఆశిస్తున్నాను.

ఆశ కాదు విశ్వాసం కూడా.  ఎందుకంటే ‘సినీవారం’లో తెలంగాణ కథపై ఉపన్యాసం ఇవ్వడానికి అక్కడికి వెళ్ళినపుడు ఔత్సాహికుల నుంచి వచ్చిన స్పందన ఈ విశ్వాసాన్ని కల్పించింది. ఇక్కడ భిన్న కోణాల్లో ఆవిష్కృతమైన తెలంగాణ కథ గురించి వివరంగా మాట్లాడాను. వివిధ ఉద్యమాలను ప్రతిఫలిస్తూ వచ్చిన కథలు, అందులోని వివిధ సామాజిక వర్గాలకు చెందిన జీవితాలను విడమర్చి చెప్పాను. సురవరం, కాళోజి, పి.వి.నరసింహారావు, వట్టికోట ఆళ్వారుస్వామి, గూడూరి సీతారామ్‌ ఇట్లా భిన్న జీవితాను రికార్డు చేసిన కథకులు, వారు రాసిన కథపై సుదీర్ఘంగా ప్రసంగించే అవకాశం నాకు దొరికింది. అంతేగాకుండా ఉపన్యాసం తర్వాత ఇంటరాక్షన్‌ చాలా కోణాను ఆవిష్కరించింది.

సినిమా వాళ్ళు వాటిని ఎలా స్వీకరిస్తారు, వాటికి స్క్రీన్‌ప్లే రాసుకునేప్పుడు కథల్లోని పాత్రలు ఎలాంటి ఆహార్యం ధరించేది అనే చిన్న చిన్న విషయాలు కూడా ఈ సందర్భంగా చర్చకు వచ్చాయి. . మొత్తం మీద  అనాటి హైదరాబాద్‌/ తెలంగాణ జీవితాన్ని వందకు పైగా వచ్చిన సినీ అభిమాను ముందుంచడం జరిగింది. ఇప్పుడిప్పుడే తెలంగాణ కథకు కూడా సినిమాల్లో మంచి అవకాశం దక్కుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


   Type Comments in Indian languages (Press Ctrl+g to toggle between English and Hindi OR just Click on the letter)