ములాఖాత్

చాలామందికి నేను కరక్కాయ అయినందుకు గర్విస్తున్నా

చాలామందికి నేను కరక్కాయ అయినందుకు గర్విస్తున్నా
​-డా.సుంకిరెడ్డి నారాయణరెడ్డి
ఇంటర్వ్యూ : స్కైబాబ

ప్రముఖ కవి, విమర్శకుడు, సాహితీ చరిత్రకారుడు- ఉద్యమకారుడు, గొప్ప ఎడిటర్, దార్శనికుడు, అస్తిత్వ ఉద్యమాల మద్దతుదారు.. తెలంగాణ చరిత్ర, ముంగిలి తెలంగాణ సాహిత్య చరిత్ర రచయిత, శ్రీకాకుళ సాహితి, నీలగిరి సాహితి వ్యవస్థాపకుడు, జముకు పత్రిక, బహువచనం సంపాదకుడు. మత్తడి, 1969 తెలంగాణ కవిత్వం సహ సంపాదకుడు.. మరెన్నో సంస్థల స్థాపనలో, సంకలనాలు వెలువడడంలో చోదకశక్తి డా.సుంకిరెడ్డి నారాయణరెడ్డి. ఈ మధ్యే తన నాలుగు దశాబ్దాల సాహిత్య సమాలోచన సదస్సు
జరుపుకున్న ఆయన కొత్త కవిత్వ పుస్తకం ‘తావు’, తెలంగాణ దీర్ఘ కవిత ‘దాలి’ రీప్రింట్ వెలువరించారు. సాహిత్యం కోసం అహర్నిశలు తపించే సుంకిరెడ్డితో స్కైబాబ జరిపిన ‘ఆఫ్ ది రికార్డ్’ (ఇంటర్వ్యూ).

1. కవిత్వాన్ని అద్భుతంగా ఎడిట్ చేస్తారు మీరు. బహుశా అంత దార్శనికత, సహనం నేనెవరిలోనూ చూడలేదు. అదెలా అబ్బింది? అందుకు ఎలాంటి సాధన అవసరమైంది?
– ఎం.ఫిల్ లో ఉండగా అనుకుంట- నోరి నర్సింహశాస్త్రిది ఒక వ్యాసం చదివిన. సాహిత్యంలో ఎవరు నిలబడతరు? ఎవరు కనుమరుగు అవుతరు? అనేది ఆ వ్యాస సారాంశం. అప్పటినుంచి ఒక కవితను గాని.. ఒక పుస్తకాన్ని గాని అలా చూడడం అలవాటు చేసుకున్న. సాధన చేసిన. కవితను గాని, కథను గాని ఏ రచన నయినా రెండు అంశాల దృక్కోణం నుంచి చూస్త. ఆ రచన నాటి సామాజిక చలనంలో ఏ అంశాన్ని పట్టుకున్నది? అది అనేకమంది ప్రాతినిధ్య అంశంగా ఉన్నదా? రెండు- ఆ రచనలోని అభివ్యక్తి సమకాలిక అభివ్యక్తికి ఏ విధంగా భిన్నంగా ఉన్నది? కొత్తగా ఏమున్నది? ఈ రెండింటి సమన్వయంతో ఆ రచనను అంచనా కడత.అది కాల ప్రవాహంలో నిలబడతదా? కొట్టుక పోతదా ? అని చూస్త. దీనికి విస్తృత అధ్యయనం ప్రథమ సోపానం. దీనికి ఒక శిఖరాగ్రం మీద నిలబడి నిర్మమకారంగా ఆబ్జెక్టివ్ గా సాహిత్య పరిణామంలోని లోతుల్ని చూసే దార్శనికత అవసరం.
ఉస్మానియా యూనివర్సిటీ రైటర్స్ సర్కిల్ నుండి కవితా సంకలనం తేవాలని ప్రకటన ఇచ్చినం. కొన్ని మంచి కవితలు, ఎక్కువ భాగం బలహీనమైన కవితలు వచ్చినవి. వీటితో సంకలనం వేస్తె కాలం గడిచే కొద్దీ అది ప్రాధాన్యత కోల్పోతుందని అర్ధమయింది. అందుకని ’70-’80 దశాబ్ది కవితా సంకలనం తేవాలని నిర్ణయానికొచ్చిన. అట్లా ’70-’80 ఈ తరం యుద్ధ కవిత వచ్చింది. అప్పట్నుంచి నేను వేసిన, నా ఆధ్వర్యంలో ఏ పుస్తకమూ విఫలం కాలేదు. నేను ఎడిట్ చేసిన కవితలు కాల పరీక్షకు నిలబడినవి.

2. మీ కవిత్వంలో సూటిదనం ఎక్కువ. అందువల్ల డ్రైనెస్ చోటుచేసుకునే అవకాశముంది కదా…
– ఇప్పటి వరకు వందల కవిత్వ నిర్వచనాలు వచ్చినవి. ఏదీ సర్వసమగ్రం కాదు. నా కవిత్వంలో అనేక నిర్మాణ పద్ధతులున్నవి. సూటిదనం కూడ ఒక నిర్మాణ పధ్ధతి. ‘కవిత్వం శాశ్వత ప్రతిపక్షం’ ‘గ్రంధాలయ సింహాలకు పంజాలుండవు’… ఇట్లాంటి ఏ ఆచ్ఛాదనలు లేని వాచ్యంకాని ప్రజ్వలనాలు.
గురజాడ ‘దేశభక్తి’, శ్రీశ్రీ ‘దేశ చరిత్రలు’ చెరబండరాజు ‘వందేమాతరం’ కవితలు సూటిదనం ఉన్న కవితలు. పైకి చూస్తే ఉత్త స్టేట్ మెంట్స్ లా అనిపించే కవితలు. కవిత్వాంశ కనిపించని కవితలు. కానీ కవిత్వాంశ అంటే ఆనాటి ఒక మానవోద్వేగం పదాల వెనుక, పాదాల వెనుక ఉంటుంది. అప్పటి context లో ఉంటుంది. వీటిలో డ్రైనెస్ ఉందని ఎవరూ అనలేరు. కవిత్వ రహస్యం అర్ధంకాని వారు మాత్రమే అలా అనగలరు.

3. కవిత్వంలో తత్వాన్ని చెప్పడానికి ఎక్కువ ఇష్టపడతారు కదా..
– కవిత్వం ప్రధానంగా హృదయ సంబంధి. మానవ హృదయ దర్పణం మీద పేరుకపోయిన దుమ్ము ధూళిని తొలగించే హృదయ క్షాళని కవిత్వం. కొన్ని సందర్భాల్లో కవిత్వం మేధో క్షాళని కూడ. అలాంటప్పుడు కవి అనుభూతి మార్గంలో కాకుండా మరో మార్గంలో ఘనీభవించిన మేధస్సును ఛేదించాల్సి ఉంటుంది. అలాంటి సందర్భంలో కవి తాత్వికుడవుతాడు. సార్వజనీన అనుభవాన్ని మాత్రమే కాకుండా సార్వజనీన ఆలోచనను ప్రతిబింబిస్తాడు. అలాంటి సందర్భంలో నా కవిత్వం తాత్విక రూపం ధరించింది. అది డ్రైనెస్‌ కాదు. అదొక కవితా రూపం. అది వేమన మార్గం.

4. కొందరు పనిగట్టుకొని మిమ్మల్ని కవిగా కాక కార్యకర్తగా ప్రచారం చేస్తూ వచ్చారని అంటారు, మీ దృష్టికి వచ్చిందా? మీరేమంటారు?
– నా అభిప్రాయాలను, దృక్పథాన్నీ (పోస్ట్‌మోడర్నిజం, అస్తిత్వవాదాల మద్దతును) అంగీకరించని వారు దానిని సూటిగా వ్యతిరేకించే లెజిటమసీ లేనివారు ఇలాంటి దుష్ప్రచారం చేసి ఉంటారు. గురజాడ ఆధునికతను అంగీకరించలేని సాంప్రదాయకులు ఆయన దృక్పథాన్ని వ్యతిరేకించే ధైర్యం లేక దొడ్డిదారిలో ఆయనను తగ్గించడానికి ఆయనను అకవి అన్నట్టే ఇది కూడా. అలాంటి దురుద్దేశ పూర్వక ప్రచారాన్ని లేశమాత్రమూ ఖాతరు చేయను.
నేను మార్క్సిజం పరిమితుల్ని ఎత్తి చూపినందుకు, తోవ ఎక్కడ అని ప్రశ్నించినందుకు, పోస్ట్‌మోడర్నిజం గురించి మ్లాట్లాడినందుకు, అస్తిత్వ వాదాలను సమర్ధించినందుకు -వాటిని నేరుగా ఎదుర్కోలేక – ఆ విధంగా ప్రచారం చేసి ఉంటారు.
ఒక ప్రముఖ ‘విప్లవ కవి’ నల్లగొండలో నా సమక్షంలోనే నాకు తాకాలనే ‘పోస్ట్‌ మోడర్నిజం’ తిట్టుపదం కావాలని శాపనార్థం పెట్టిండు.
ఒక ప్రముఖ సంఘనేత, ఆ సంఘ సభ్యుడొకరు మా యింటికి వచ్చినందుకు ఆయనకు పెద్ద ఉత్తరం రాసిండు. పోస్ట్‌ మోడర్నిజం, బహువచనం అంటున్న వ్యక్తి ఇంటికి ఎలా వెళ్ళావని. అన్ని సాహిత్య సభలకు హాజరయ్యే ఒక రాయని రచయిత ‘తోవ ఎక్కడ’ అని హేళన చేసిండు. కూచిమంచి జగ్గకవితో పోల్చి అపహాస్యం చేసిండు. జ్వాలాముఖి నాకు పెద్ద ఉత్తరం రాసిండు నీ తోవ సరికాదని. చలసాని ప్రసాద్‌ ‘పొక్కిలి’ మీద రివ్యూ చేయించిండు కాని ‘మత్తడి’ని రివ్యూ చేయించలేదు ఆ కోపంతోనే.
తెలంగాణ ఉద్యమ సమయంలో కూడ ఆ ధోరణి కొనసాగింది. అట్లా రెండు దశాబ్దాల పాటు నన్ను వేదనకు గురి చేసిండ్రు. కుంగిన. లేచిన. ‘దాలి’ ‘ముంగిలి’ ‘తెలంగాణ చరిత్ర’ ‘తావు’ అందుకు ప్రబల నిదర్శనాలు.
సాహిత్యంలో హత్యా రాజకీయాలు చెల్లవు.

5. కథకన్నా మీరు కవిత్వాన్ని ఎక్కువ ప్రేమిస్తారు, కథపట్ల, కథకుల పట్ల చిన్నచూపున్నట్లుంది?
– నిజమే. అట్లా అని కథ పట్ల చిన్నచూపు లేదు. ఏ ప్రక్రియ ప్రయోజనం, పరిధి ఆ ప్రక్రియకుంటుంది. అన్ని ప్రక్రియల్లో కవిత్వం ఉన్నతమైనదని నేను నమ్ముత.
ఒకసారి అజంతా, పతంజలి, నేను మరికొందరం ఒక పార్టీలో కూర్చున్నం. పతంజలి అజంతాను ఏదో హెకిల్‌ చేయబోయిండు. అప్పుడు అజంతా అన్నడు- ‘నువ్వు రెండు వేల పేజీల్లో చెప్పిందాన్ని నేను రెండు లైన్లలో చెప్తా’నని సవాలు విసిరిండు -ఇందులో కొంత అతిశయోక్తి, అహంభావం ఉన్నప్పటికీ అది సత్యం. వందల సంవత్సరాల జీవిత సారాన్ని ఒక సామెత, పలుకుబడి, జాతీయం అభివ్యక్తం చేసినట్లు అతిసంక్షిప్తంగా అతి సూటిగా అభివ్యక్తం చేయగల సామర్ధ్యం ఈ ప్రక్రియకున్నది.
”ముల్లు గుచ్చుకున్న పాదమే గొంతు విప్పాలె
అరిటాకే ముల్లు గురించి తీర్పు చెప్పాలె” లాంటి సారభూత వాక్యాలు అందుకు నిదర్శనం.
వ్యాస, వాల్మీకిల నుండి వేమన, గురజాడ, శ్రీశ్రీ, సినారెల వరకు కవులకుండే గ్లామర్‌ ఆ కారణంగానే.

6. మీరు కవులను తప్ప కథకులను ప్రోత్సహించలేదు, కారణం?
– నా తొలినాటి సాహిత్య జీవితం విప్లవోద్యమంతో విప్లవ కవిత్వంతో ముడిపడి ఉన్నది. అప్పుడు నాకు పరిచయమైన వారంతా- సిధారెడ్డి, గుడిహాళం, శివారెడ్డి, నగ్నముని- కవులే. ఉద్యమం immediate link కవిత్వమే (పాటతోపాటు). గోడల మీది నినాదాల్లా కవిత్వంలో పెల్లుబుకాలని అందరం ఆరాటపడేవాళ్లం… నేను ప్రత్యక్షంగా పరోక్షంగా నిర్వహించిన ఉస్మానియా యూనివర్సిటీ రైటర్స్‌ సర్కిల్‌ (1978-83)లో ప్రధానంగా ఉన్న సిధారెడ్డి, సలంద్ర, గుడిహాళం, నాళేశ్వరం, కందుకూరి శ్రీరాములు, జింబో, ఎస్వీ, వారాల ఆనంద్‌, ఎస్వీ, గుంటూరు ఏసుపాదం, జయప్రభ, లక్నారెడ్డి, ఎన్‌ ఆర్‌ బోధనం, కె.ఎన్‌.చారి, సారా -ఇట్లా చాలామంది కవులే. అప్పటి ఉద్యమం, ఉద్విగ్నత, ఆవేదన (ఆ ఆవేదన ఎంత బలంగా ఉండేదంటే- ఆ తర్వాత APPSC లో నేను లెక్చరర్‌గా సెలెక్ట్‌ అయినప్పుడు ఈ ఉద్యోగం ఒక పేదవాడికి వచ్చి ఉంటే బాగుండేది కదా అని అనిపించినంత బలంగా ఉండేది). కోపం, కసి, ఆగ్రహం కవిత్వంలోనే వ్యక్తమయినవి. ఆ సామూహిక స్వరంలో నేను కవిత్వంలోనే లీనమైన. ఆ వాతావరణమే తర్వాత కొనసాగింది.
అట్లా అని కథ తక్కువ కాదు. అప్పటికి ప్రసిద్ధమైన కథలన్నిటిని చదివిన. కాని అప్పటి యవ్వనావేశం కవిత్వంతో మమేకమైనట్టు కథతో కాలేదు. బహుశా ఆ ఒరవడితో ఆ ఓరియంటేషన్‌తో ఉస్మానియా రైటర్స్‌ సర్కిల్‌లోగాని, శ్రీకాకుళ సాహితిలోగాని, నీలగిరి సాహితిలోగాని కవుల్నే ఎంకరేజ్‌ చేసిన. అట్లా అని కథల పట్ల అప్పటికీ ఇప్పటికీ తక్కువ అభిప్రాయం లేదు. ఏ ప్రక్రియ గొప్పదనం, అవసరం, ఆవశ్యకత ఆ ప్రక్రియదే.

7. ముంగిలి రాసేదాకా మీరు కవిగానే ప్రసిద్ధులు. ముంగిలి, తెలంగాణ చరిత్ర, తెలంగాణ సాహిత్య చరిత్ర రాయడం ద్వారా చరిత్రకారులుగా, సాహిత్య చరిత్రకారులుగా ఎక్కువ గుర్తింపు వచ్చింది. మీకు ఏ గుర్తింపు మీద మక్కువ ఎక్కువ?
– ‘ముంగిలి’, ‘తెలంగాణ చరిత్ర’ రచన కేవలం నా చాయిస్‌ కాదు. కాలం డిమాండ్‌. ఉద్యమం డిమాండ్‌.
నా స్వభావంలోని బాధ్యతా తత్వ వ్యక్తీకరణ.. నా నిబద్ధతా వ్యక్తీకరణ.. అవి రెండూ తెలంగాణ అస్తిత్వ నిర్మాణంలో ఉద్యమంలో తమ వంతు పాత్రను నిర్వహించినవి. కె.సి.ఆర్‌ ‘ముంగిలి’ని ప్రశంసించడం, ‘తెలంగాణ చరిత్ర’ను ఆవిష్కరించడం అందుకు ఒక నిదర్శనం. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత కూడ వాటి పాత్ర కొనసాగుతున్నది. లక్షల మంది విద్యార్థులు వాటిని ఫాలో అవుతున్నరు. ఈ గుర్తింపు నాకు గర్వకారణమే.
అయినా నేను కవిత్వంతోనే ఎక్కువ తాదాత్మ్యం చెందుత. ‘దాలి’, ‘తావు’ అందుకు ప్రబల నిదర్శనాలు. కవిత్వం నా ప్రాథమ్యం (priority). కవిత్వంతోనే మొదలైన. కవిత్వంలోనే అస్తమించాలని కోరుకుంట.

8. మీరు కవిత్వం రాసే సమయంలో సాహిత్య ఉద్యమ కారుడిగానే ఎక్కువగా పనిచేశారు. మీలోని కవికి కార్యకర్తకు ఘర్షణ జరిగిన సందర్భాలున్నాయా? మీలోని కవిని ఉద్యమకారుడు డామినేట్ చేసేవాడా? ఉద్యమ కార్యాచరణ వల్ల కవి సమయాన్ని ఏమైనా నష్టపోయారా?
– చాలా సందర్భాల్లో ఘర్షణ పడిన. ఇప్పుడు వెన్కకు తిరిగి చూసుకుంటె తెలిసింది- నాలో రెండు విభిన్న పార్శ్వాలు ఉన్నవి. మా అమ్మ అంశ కవిత్వం. మా నాయిన అంశ ఆలోచనాధార, ధర్మ నిరతి, బాధ్యతా తత్వం, నిజాయితీ, నిష్పాక్షికత (ఆయన బతికి ఉన్నంతవరకు ఏ పంచాయితీ అయినా ఊరుదాటి పోలేదు. పోలీసు స్టేషన్‌కు వెళ్లలేదు. ఆయన పరిధిలో లేని నక్సలైట్ కేసులు, హత్య కేసులు తప్ప. ప్రతి పంచాయితీలో ఇరువర్గాలవారు ఆయననే పెద్దమనిషిగా కోరుకునేవారు).
నా ఇచ్ఛ ప్రకారం ప్రాథమ్య అంశం కవిత్వమే అయినా నా ఇచ్ఛతో ప్రమేయం లేని ‘బాధ్యతా’ వ్యక్తిత్వం బలంగా పనిచేసింది. దానికి దోహదం చేసినవి మార్క్సిజం మొదలగు సిద్ధాంతాలు. అందువల్ల 1978 నుంచి 1998 వరకు సంస్థల నిర్మాణం, నిర్వహణ, కొత్త కవులకు ప్రోత్సాహం భావజాల ప్రచారం- వీటిలోపడి కవిత్వ సమయాన్ని కోల్పోయిన మాట వాస్తవమే. అలా కాకుండా ఉంటె ఇంకా ఎక్కువ కవితా సంకలనాలను వేసి ఉండేవాడిని కావచ్చు. అయినా నో రిగ్రెట్స్. ఇన్ని పనుల్లో ఉండి కూడ కవిత్వాన్ని neglect చేయలేదు. చాలామంది కంటె update గా ఉన్న. బలమైన కవిత్వం రాసిన.

9. మీరంటే చాలామందికి కరక్కాయ, ఎందుకని?
– వాళ్ళు కోరుకున్న మూసలో నేను ఒదగలేదని స్వతంత్ర వ్యక్తిత్వాన్ని అంగీకరించని ఆ ”చాలా మందికి” కినుక. కరక్కాయ అయినందుకు గర్విస్తున్న. అక్కడే నా సొంత వ్యక్తిత్వముంది. సొంత పంథా ఉంది. వ్యక్తిగత జీవితంలోనూ సాహిత్య జీవితంలోనూ నన్ను అవహేళన చేసిన వారందరినీ దాటుకొని వచ్చిన.

10. సంస్థలు పెట్టడంలో, కవిత్వం ఎడిట్ చేయడంలో, కవులను ప్రోత్సహించడంలో మీరు ఎంతో సహనాన్ని చూపిస్తారు. ఎలా సాధ్యం? అదే సందర్భంలో మీ సహనం పేరు కోసమేననే విమర్శ కూడా ఉంది. ఏమంటారు?
– సహనం కొంత నా స్వభావంలో ఉన్నది. తెచ్చిపెట్టుకున్నది కాదు. కొంత కల్టివేట్ చేసుకున్నది. నా రంగు కారణంగా, రూపం కారణంగా నన్ను బాధించిన సందర్భాలెన్నో. అట్లా ఇతరుల్ని బాధ పెట్టకూడదన్న భావన నా సహనం వెనుకున్న కారణం. ఈ సందర్బంగా రెండు ఉదాహరణల్ని చెప్త- 1. స్కై గురించి నాగేందర్ ఒకసారి గొడవపడుతూ నువ్వు కవివే కాదన్నడు. నేను నాగేందర్ ను మందలించిన. ఎట్లా నిర్ణయిస్తవని. 2. వేముల ఎల్లయ్య కవిత తెస్తే అందరూ పారిపోయేవారు. అది తప్పు అని వారికి వివరించి చెప్పేవాణ్ణి.
నేను నమ్మినదాన్ని సాధ్యమయినంతవరకు విస్తృతం చేయాలనుకుంట. ఇగోయిష్టుగా వ్యవహరించేవాడికే పెద్ద పీట (కనీసం పైకయినా) వేస్తారు. సహనంగా ఉండే వాడికి చిన్న పీట వేస్తారు. ఒక్కోసారి ఏ పీటా వేయరు. అది తెలిసి కూడ, అనుభవించి కూడ సహనంగానే ఉంట.
కవిత్వం ఎడిట్ చేయడం కవుల్ని ప్రోత్సహించడంలో చూపే సహనం పేరు కోసమెట్లానో నాకు అర్ధం కాలేదు ? అందువల్ల నాకు పేరు ఎట్లా వస్తది? ఆ కవులకొస్తది. ఆ సమయాన్ని నా సొంత రచనకు వెచ్చిస్తే నాకు పేరొస్తది.
సంస్థల్ని నిర్వహించడంలో చూపే సహనం పేరు కోసమే నన్నదీ తప్పే. సంస్థలు నిర్వహించడం నాకు వెన్నతో పెట్టిన విద్య. అయినా నేను సంస్థల్ని నిర్వహించడం వదిలేసి చాలా ఏళ్ళయింది. పేరు కోసమే అయితే కొనసాగించే వాడిని కదా?

11. కుటుంబం ఏ మేరకు సాహిత్యానికి అడ్డమొస్తుంది? మీ విషయంలో?
– సొంత వ్యక్తిత్వం లేనివాళ్ళకు, సమస్యల్ని తట్టుకోలేని వాళ్లకు కుటుంబం అడ్డు వచ్చేది నిజమే. మనం దేనికి ప్రయారిటీ ఇస్తే జీవితంలో అదే ప్రధాన అంశం అవుతది. నేను కుటుంబాన్ని అడ్డు రాకుండా మౌల్డ్‌ చేసుకున్న. అందుకే నా కుటుంబం నాకెప్పుడూ అడ్డు రాలేదు. అయినా నా భార్యా పిల్లలు అప్పుడప్పుడు దెప్పిపొడుస్తుంటరు, మా కంటే నీకు సాహిత్యమే ఎక్కువని. బాలెన్స్‌ చేసుకోవాలె.

12. కొందరు పనిగట్టుకొని మిమ్మల్ని కవిగా గాక కార్యకర్తగా ప్రచారం చేస్తూ వచ్చారు. మీరు విప్లవ పంథాను విమర్శకు పెట్టడం, అస్తిత్వ వాదాలకు మద్దతు పలకడమే అందుకు కారణమా?
– వాళ్ళ నీడ వెంట నడవనందుకు అక్కసుతో అన్నమాట అది. అట్లా అన్న వాళ్లే తరువాత నెత్తిమీద పెట్టుకున్నరు. అట్లా అనడానికి మరో కారణం మీ ప్రశ్నలో అన్నట్టు విప్లవ పంథాను విమర్శకు పెట్టడం, అస్తిత్వ వాదాలకు మద్దతు పలకడమే కారణం.

13. తొలుత మీరు విప్లవవాది. తర్వాత అందులోని తప్పుల్ని ఎత్తిచూపారు. ఆ తర్వాత అస్తిత్వవాదాలకు వెన్నుదన్నయ్యారు. ఈ పరిణామ క్రమంలో మీరు పడ్డ సంఘర్షణ గురించి చెప్తారా?
– ‘సాహిత్య పరిణామంలో కొన్ని సంధి దశలున్నవి. అలాంటి సంధి దశ అప్పటి పరిణామం. నిర్దిష్టంగా విప్లవ సాహిత్య యుగం స్థానంలో అస్తిత్వ వాద యుగం మొదలవుతున్న దశ అది. ఆ దశలో కొత్తవాటిని విమర్శించి అడ్డుకునేవాళ్లుంటరు. విశ్లేషించి ఆహ్వానించే వాళ్లుంటరు. పాతదాన్ని కొనసాగించే వాళ్లుంటరు. దానిని negate చేసే వాళ్లుంటరు. ఆ దశలో ఎంతో సంఘర్షణకు లోనైన. ఏది సరైంది? ఏది సత్యం? సందేహాలు, సంశయాలు. తేల్చుకోలేకపోయిన కొన్నాళ్లు. తుదకు ‘తోవ ఎక్కడ’ అని ప్రశ్నించి ఘర్షించి (ఈ పరిణామాన్ని ఆ సంకలనంలోని కొన్ని కవితలు కళ్లకు కడతయి) కొత్తవాటి వైపు నిలబడిన.

14. పై పరిణామ క్రమంలో మీ గతంలోని సృజనను విమర్శనాత్మకంగా చూసుకుంటే ఎలా అనిపిస్తుంది?
– ఈ పరిణామక్రమంలో సామాజిక చలనాన్ని పట్టుకోవడంలో దాన్ని అభివ్యక్తం చేసే కవితా శిల్పంలో పరిణతిని సాధించిన.

15. ఈ క్రమంలో మీ సహచరుల్నెంతోమందిని కోల్పోయారు.. ఎందరినో దాటుకొని వచ్చారు. అందుకు బాధ పడ్డ సందర్భాలున్నాయా?
– ఈ మానసిక స్థితిని నా ‘ఒంటరి’ అనే కవిత చిత్రిక పట్టింది. కోల్పోయినందుకు బాధగా ఉన్నా ఎందరినో దాటుకొని వచ్చినందుకు విస్తృతమైనందుకు సంతోషంగా ఉంది.

16. మీరు అస్తిత్వ ఉద్యమాలకు మద్దతుగా ఎందరినో ప్రోత్సహించారు. మీ విలువైన సమయాన్ని వెచ్చించారు. అలా చేయలేక పోయిన మీ సహచరులూ సమకాలీకులూ ఉన్నారు. ఈ విషయంలో మీ ఫీలింగ్‌?
– చరిత్ర మనకు కొన్ని అవకాశాల్నిస్తది. ఆ అవకాశాల్ని సకాలంలో అందుకున్నందుకు నాకు చాలా సంతృప్తిగ ఉన్నది. ఆ విలువ ముందు నేను వెచ్చించిన సమయం విలువ చాలా చిన్నది. అలా చేయలేకపోయిన వారి గురించి నేను చెప్పడం సబబు కాదు. కాలం చెప్తుంది.

17. కవిత్వంలో ఆవేశం పాలెక్కువ అంటారు కదా.. కొంత మెచ్యూరిటీ వచ్చాక మీ కవితను మీరు చూసుకుంటే ఇప్పుడయితే దాన్ని మరోలా రాసేవాణ్ణి కదా అనిపించిన సందర్భాలున్నాయా?
– కొన్ని కవితలు ultimate. అవి అంతే. కొన్ని కవితల విషయంలో అనిపించింది. కవికి ఎప్పుడూ అలా అనిపించాలె కూడా. అప్పుడే కవి నిరంతర సాధనలో ఉంటడు.

18. ఈ తరం యుద్ధ కవిత గురించి చెప్పండి? ఆ సంకలనానికి అందరికన్నా మీరు ఎక్కువ శ్రమించారని చెప్తారు?
– దశాబ్ది కవితా సంకలనాల్లో అది మొదటిది. ఆ రకంగా దశాబ్ది కవితా సంకలనాలకు అది ట్రెండ్‌ సెట్టర్‌. ఆలోచనలో, దానిని పుస్తక రూపంలో తేవడంలో ప్రధాన కృషి నాదే. దాంట్లో సందేహమేదీ లేదు. ఆధారాలు వివరాలతో సహా చెప్పగలను.

19. ‘బహువచనం’ దళిత బహుజన కవితా సంకలనం విషయంలో అందులోని కవులు కొంతమంది ఆరోపణలు చేశారు. మీ వల్ల ఏమైనా పొరపాటు జరిగిందని భావిస్తున్నారా?
– ఆ ఆరోపణల్లో ఈషణ్మాత్రమూ నిజం లేదు. వాళ్ళు అపార్ధం చేసుకున్నరు (దానికి కారణాలు అనేకం). వాళ్ళలో చాలామంది ఆ తరువాత నాతో స్నేహంగా ఉండటం అందుకొక నిదర్శనం. నేను ‘బహువచన’ కవుల్ని చూసి గర్వపడుత.
కాకతీయ యూనివర్సిటీ తెలుగు శాఖ సిలబస్‌ నిర్ణయంలో ఎంతో ముందంజలో ఉంది. కానీ దళిత కవిత్వం సిలబస్‌లో ఆంధ్ర కవులనే పెట్టింది. ‘బహువచనం’ ‘మేమే’ ‘మొగి’ సంకలనాల్లోని కవులను ఎందుకు పెట్టలేదని అడగడం ఈ సందర్భంగా అవసరం.

20. అస్తిత్వ ఉద్యమాలు బలంగా నడుస్తున్న కాలంలో తెలంగాణ వాదం ముందుకు వచ్చి అగ్రవర్ణాలు (బ్రాహ్మణులు, రెడ్లు), విప్లవవాదులంతా అందులో చేరి అస్తిత్వ వాదాలు వెనుక పట్టుపట్టేలా చేశారు. మీరేమంటారు?
– ఇది సరైన పరిశీలన కాదనుకుంట. తెలంగాణ ఉద్యమంలో అగ్రవర్ణాలతో పాటు దళిత బహుజన గిరిజన ముస్లిం మైనారిటీ – అన్ని వర్గాలు స్వచ్ఛందంగా పనిచేసినవి. అస్తిత్వ ఉద్యమాల్ని పరాస్తం చేయటానికి తెలంగాణ ఉద్యమం రాలేదు. కానీ తెలంగాణ ఉద్యమం వల్ల విప్లవోద్యమం, అస్తిత్వ ఉద్యమాలు బలహీన పడిన మాట నిజం. ఈ ఉద్యమాల్లోని కొందరికి తెలంగాణ ఉద్యమం వల్ల vent దొరకడం ఒక కారణం కావొచ్చు. ఇంకా కారణాల్ని అన్వేషించాలె.

21. సంస్థలు నడపడం వదిలేశాకే ఎక్కువగా రాశానన్నారు, నిజమేనా?
– నిజమే, సాహిత్య వారసత్వాన్ని ఒక తరానికి అందించాలనే సదుద్దేశంతో నేను సంస్థల్ని స్ధాపించిన, నడిపించిన. దాదాపు రెండు దశాబ్దాల్లో చాలా కాలం వాటి కోసం వెచ్చించిన. అందుకు నాకు ఎలాంటి regrets లేవు. ఒక అనుభవంతో వాటిని వదిలేసిన. ఆ తరువాతే అంటే 1998 తర్వాత నా పుస్తకాలు ఎక్కువ సంఖ్యలో వచ్చినవి. నల్లవలస, మత్తడి, గనుమ, ముంగిలి, తెలంగాణ చరిత్ర, దాలి, తావు, అనేక వ్యాసాలు, 1969-73 తెలంగాణ ఉద్యమ కవిత్వం, సురవరం వ్యాసాలు మొ. అందుకు నిదర్శనం.

22. కవిని అత్యున్నతుడిగా భావిస్తారు మీరు, అన్ని అంశాలు కవిత్వంలో ఒదగవు కదా..
– అందుకే ముందే చెప్పిన. ఏ ప్రక్రియ ప్రయోజనం, పరిధి ఆ ప్రక్రియదే అని. కథ, నవల, నాటకం, సినిమా ఆయా కాలాల నాటి మానవ జీవిత సూక్ష్మవివరాలతో సహా మన కళ్ళ ముందు నిలబెడతవి. కాని మానవ ఉద్వేగాల్ని సూటిగా గుండె నుంచి గుండెకు తక్షణం ప్రసారం చేసే మాధ్యమం మాత్రం కవిత్వమే.

23. ఏ సంస్థ ఏర్పాటు, ఏ సంస్థ నడపడం మీకు ఎక్కువ సంతృప్తినిచ్చింది. ఈ క్రమంలో మీకు నచ్చిన సాహిత్యకారులు.. కార్యకర్తలు.. ఉద్యమకారులు?
– నేను (”నేను” అనేది స్వాతిశయం. ఎంతో మంది సహకారం ఉంటే తప్ప ఏ సంస్థా నడవదు. అనేక objective force లను సమన్వయ పరిచే ఒక subjective force మాత్రమే ”నేను”) ‘నడిపించి’న సంస్థల్లో ఉస్మానియా యూనివర్సిటీ రైటర్స్‌ సర్కిల్‌, శ్రీకాకుళ సాహితి, నీలగిరి సాహితి ముఖ్యమైనవి. ఈ మూడు నాకు తృప్తినిచ్చినవే. ఎక్కువ సంతృప్తినిచ్చినది ‘నీలగిరి సాహితి’. ఉస్మానియా రైటర్స్‌ సర్కిల్‌ లో అప్పటికే ప్రసిద్ధులైన వారు (నందిని సిధారెడ్డి, గుడిహాళం రఘునాధం, నాళేశ్వరం శంకరం, సలంద్ర, కందుకూరి శ్రీరాములు, జింబో, వారాల ఆనంద్, కె.ముత్యం, లక్నారెడ్డి, బోధనం నర్సిరెడ్డి, ఎస్వీ, కిషోర్, మర్రి విజయరావు, స్వామి, … వివిధ దశల్లో సభ్యులు) కాక దీని కాంట్రిబ్యూషన్‌గా వచ్చిన వాళ్ళు గుంటూరు ఏసుపాదం, కె.నరసింహాచారి. వీళ్ళిద్దరూ నాకు ప్రేమపాత్రులు. చారి లవ్‌లీ మాన్‌, ఏసుపాదం గొప్ప కవి. శ్రీకాకుళ సాహితిలో మహోన్నత వ్యక్తి బివిఎ రామారావు నాయుడు. స్వలాభాపేక్ష లేని నిష్కల్మష హృదయుడు. అట్టాడ అప్పల్నాయుడు గొప్ప కథా రచయిత. నేనిష్టపడే రచయిత. ఛాయారాజ్‌, బిఎన్‌.స్వామి, బి.పి.శాస్త్రి, రెడ్డి శాస్త్రి, కెవిఎన్‌.ఆచార్య అప్పటికే స్థిరపడిన రచయితలూ; ఆ సంస్థ కాంట్రిబ్యూషన్‌లో ఒకరు పిఎస్‌.నాగరాజు సున్నిత పుష్పం. ఇప్పుడు రాటుదేలి ప్రజాసాహితి సంపాదకుల్లో ఒకడయ్యిండు.
చివరగా నీలగిరి సాహితి. అస్తిత్వ వాద సాహిత్యానికి తెలంగాణలో ఇది తొలిమెట్టు. దళిత, బహుజన (బి.సి), ముస్లిం మైనారిటీ, తెలంగాణ (జలసాధన ఉద్యమాన్ని దృష్టిలో పెట్టుకుని) వాదాలకు ఇది తొలి మజిలీ. బోధనం నర్సిరెడ్డి, పగడాల నాగేందర్‌, స్కైబాబ, ఎం.వెంకట్, అంబటి వెంకన్న, వేముల ఎల్లయ్య, చిత్రం ప్రసాద్‌, కె.వెంకట్, సయ్యద్‌ గఫార్‌, గౌస్‌ మొహియుద్దీన్‌, అలీ ఈ సంస్థ వెలుగులు. వీళ్ళు ఈ సంస్థ ప్రొడక్షన్‌ అంటె కొందరు కస్సుమంటరు. అయినా వీళ్లందరూ ఒక్కొక రకంగా నాకు ప్రేమ పాత్రులే. కొందరు నన్ను దాటుకుని పోయిన ఉద్దండులు. రాష్ట్రవ్యాప్త ప్రసిద్ధులు. ఆయా వాదాల్లో ట్రెండ్‌సెట్టర్స్‌. అందుకే ఈ సంస్థ నాకు అత్యంత సంతృప్తినిచ్చింది.

24. కవిత్వం చాన్నాళ్ళుగా చప్పగా వస్తుండడానికి కారణం?
తెలంగాణ 1920ల నుంచి 2014వరకు నిరంతర ఉద్యమాల గడ్డ. ఇప్పుడు ఏ ఉద్యమం చలనశీలంగాలేదు గనుక అట్లా అనిపిస్తుండవచ్చు.
చాన్నాళ్ళుగా అంటె తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం నుంచి అని నీ ఉద్దేశం కావచ్చు. నిజమే తెలంగాణ వచ్చింతర్వాత చాలా మంది కవులకు ఏం రాయాలో అర్ధంకాని పరిస్థితి వచ్చింది. ఒక శూన్య స్థితి ఏర్పడింది. స్వాతంత్య్రానంతర భారతదేశ స్థితి ఇది. అయితే ఇది ఉపరితల అంశం. కాని సమాజంలో ఘర్షణ ఉంటుంది కదా? (ఘర్షణ surphace కాకపోవచ్చు) దానిని కవులు పట్టుకోవటం లేదా? సర్ఫేస్‌ అయిన అంశాల్ని మాత్రమే పట్టుకొని రాయడం మన కవులకు అలవాటయ్యింది. పాత కవులు కొందరు setback అయి ఉండొచ్చు. లక్ష్యం సాధించాల్సిన ఉద్యమాలు ఉన్నవి. అవి రెజ్యువనేట్ కావాలె. కొత్త కవులు తయారు కావాలె.

25. కవుల్లో అవకాశవాదానికి చోటుండకూడదు. కాని ఇప్పటి కవుల్లో ఎక్కువమంది చపలచిత్తులుగా కనిపిస్తున్నారు. ఎందుకని?
– అవకాశవాద కవులు ఇప్పుడే కాదు ఎల్లకాలం ఉంటారు. కొందరి అవకాశవాదాన్ని అందరికీ అంటగట్టకూడదు. అయినా అవకాశవాద కవుల కవిత్వంలోని డొల్లతనం తెలుస్తూనే ఉంటుంది. వాళ్ళెప్పుడూ ట్రెండ్‌సెట్టర్స్‌ కాలేరు.
సమాజ అంతరాత్మ నిజమైన కవులు, ఆలోచనాపరులు (తాత్వికులు, మేధావులు). వాళ్ళు నిరంతర నిఘానేత్రాలు. దిశా నిర్దేశకులు. వాళ్ల సంఖ్య ఎప్పుడూ స్వల్పమే. invent చేయాలె. ఆవిష్కరించుకోవాలె.

26. తెలంగాణ వచ్చింతర్వాత తెలంగాణ కవులు చాలామంది డైల్యూట్ అయిపోయారు. ఏమంటారు?
– తెలంగాణ వచ్చింతర్వాత తెలంగాణ కవులు డైల్యూట్ అయ్యిండ్రు అనే పశ్న్రలో ఆంధ్రా కవులు ఫామ్‌లోనే ఉన్నారు, తెలంగాన కవులు మాత్రమే డైల్యూట్ అయ్యిండ్రు అనే అంతరార్ధం కూడ ఉంది. ఆంధ్రలో కవిత్వమే కాదు సాహిత్యమే అంతరించి రెండు దశాబ్దాలకు పైనే అయ్యింది. కవిత్వం మిగిలింది తెలంగాణలో మాత్రమే. కథ మిగిలింది రాయలసీమలో, ఉత్తరాంధ్రలో, తెలంగాణలో మాత్రమే.
నీ ప్రశ్నలోని వాచ్యార్ధం మాత్రమే తీసుకుంటే- తెలంగాణలో కవులు డైల్యూట్ అయ్యింది కొంత నిజమే. వేదికలనాశ్రయించిన కవులు మాత్రమే డైల్యూట్ అయ్యిండ్రు. వాళ్ళు ఎప్పుడూ surphase లో పుట్టి సర్ఫేస్‌లోనే అంతరించే కవులు మాత్రమే. ఈ పరిమితుల్ని అధిగమించే కవులు ఏమీ డైల్యూట్ కాలేదు. వాళ్ళు దృఢంగా ఉన్నారు- వాళ్ళు కొద్దిమందే కావచ్చు- ఉంటారు. ఏమీ ఆందోళన చెందాల్సిన పనిలేదు.

27. కవిత్వం శాశ్వత ప్రతిపక్షం అన్నారు మీరే. అందుకు కట్టుబడి ఉన్నట్లు లేరు?
– మంచి ప్రశ్న. మనల్ని మనం చెక్‌ చేసుకోవడానికి ఉపకరించే ప్రశ్న. ”కవిత్వం శాశ్వత ప్రతిపక్షం” అనే కవిత్వ ప్రకటనను చాలామంది సరిగ్గా అర్ధం చేసుకోలేదు. బైరెడ్డి కృష్ణారెడ్డి సరిగ్గా గ్రహించిండు. ”ప్రతిపక్షం” అంటె అసెంబ్లీలోనో బయటనో రాజకీయ పార్టీల రూపంలోని ప్రతిపక్షం కాదు. వాళ్ళ మాటల్లో సత్యాసత్యాలుంటవి. రాజకీయ మైలేజీ దాగి ఉంటుంది. సత్యం మాత్రమే పలికే సమాజ అంతరాత్మ ఈ ప్రతిపక్షం. సామాజిక, నైతిక విలువల స్వరం ఈ ప్రతిపక్షం. ఈ విలువల నుంచి నా నలభయ్యేళ్ళ సాహిత్య జీవితంలో పక్కకు జరుగలేదని గట్టిగ చెప్పగలను.
వ్యక్తిగత జీవితంలో నా బిడ్డ పెళ్ళి సందర్భంలో మాత్రం 33 ఏళ్ళ క్రితం నేను ఆచరించిన దానికి భిన్నంగా వెనక్కి వెళ్ళాల్సి వచ్చింది. ఇది నాపోరాట బలహీనతా? ఇన్నేండ్లుగా సమాజం మారకపోవడమా?

28. కవికి ముసలితనం వస్తున్నకొద్దీ అవకాశ వాదం పెరుగుతుందా?
కొందరి విషయంలో అది నిజమే. కీర్తి దాహం, పదవీ మోహం వీటికి దూరంగా ఉండి మానసిక వృద్ధాప్యాన్ని దరిజేరనివ్వని కవులకు అది వర్తించదు.
విచిత్రంగా వయసు పై బడినవారు కొందరు చట్రానికి అతీతంగా వ్యవహరిస్తరు. బాధ్యతలనుంచి బంధాల నుంచి తప్పుకున్నందువల్ల కావచ్చు. తిరుగుబాటు దారులు ప్రధానంగా 30 ఏళ్ళలోపు వారే అయినట్టు, 60పై బడిన వారు పశ్చాత్త తప్తులు. చట్రాన్ని సమర్ధించే 30-60 ఏళ్ళ వయసు వాళ్లలోనే అవకాశవాదం ఎక్కువ.

29. తెలంగాణలో ఇక మిగిలిన సబ్జెక్ట్‌ బహుజనవాదమే కదా.. బహుజనవాదం ఎందుకు బలోపేతం కావడం లేదంటారు?
– తెలంగాణలో ఇక మిగిలిన సబ్జెక్ట్‌ బహుజన వాదమే అని ఎలా అనగలం? విముక్తం కాని అన్ని అస్తిత్వాల సబ్జెక్ట్‌ ఉండనే ఉంటుంది. తాత్వికంగా లేదా సైద్ధాంతికంగా నైతికంగా, సామాజికంగా ఎవరూ వ్యతిరేకించలేని స్థితి వచ్చినపుడు, అంటె సామాజిక సమ్మతి లభించినపుడు (ఒకప్పుడు వామపక్షవాదులు, సంప్రదాయవాదులు వీటిని వ్యతిరేకించిండ్రు. ఇప్పుడు వ్యతిరేకించడంలేదు) ఆయా కోణాలలో ఘర్షణ లేనప్పుడు, అప్పుడు అక్కడ ఒక శూన్యత ఏర్పడుతుంది. ఆచరణాత్మకంగా అస్తిత్వాలు లక్ష్యం అమలయ్యేంతవరకు సబ్జెక్ట్‌ ఉండనే ఉంటుంది. ఇది అన్ని అస్తిత్వవాదాలకూ వర్తిస్తుంది.
నీ ప్రశ్నను బట్టి అన్ని అస్తిత్వ వాదాల సమస్యలు పరిష్కృతమైనవి బహుజనవాద (B.C) సమస్య మాత్రమే పరిష్కృతం కాలేదు అనే అర్ధం వస్తుంది. కాని ఏ అస్తిత్వ సమస్యా సంపూర్ణంగా పరిష్కృతం కాలేదు. కాకపోతే సాహిత్యపరంగా చెప్పటానికి కొత్తదేమీలేని పరిస్థితి వచ్చి ఉండవచ్చు. కాని సామజికంగా అలాంటి స్థితి రాలేదు. ప్రజాస్వామీకీకరణ ప్రక్రియ పూర్తి కాలేదు.

బహుజనవాదం ఎందుకు బలోపేతం కావడం లేదనే ప్రశ్న నా పరిధిలోనిది కాదు. ఆయా సమూహాలు లోతుగా చర్చించాల్సిన ప్రశ్న.
30. తెలంగాణ చరిత్ర రచనలో ఎలాంటి అనుభూతికి లోనయ్యారు? చరిత్ర రాస్తారని ఊహించి ఉండరు కదా?
– ”తెలంగాణ చరిత్ర” రాస్తానని గాని, రాయగలనని గాని ఎప్పుడూ అనుకోలేదు. ”మత్తడి”ని సంకలనం చేసే సమయంలో ”ముంగిలి”ని రాసే క్రమంలో తెలంగాణ చరిత్రకు జరిగిన అన్యాయం నన్ను వేదనకు గురిచేసింది. ఆ క్రమంలోనే లగడపాటి, చంద్రబాబు, ఆంజనేయరెడ్డి, దగ్గుపాటి, ఎబికె ప్రసాద్‌ లాంటి అనేకమంది చరిత్రను వక్రీకరించి తెలంగాణ ఉద్యమానికి, అస్తిత్వానికి చారిత్రక పునాది లేదని తెలుగువారంతా అనాదిగా ఒక్కటేనని వాదించినపుడు, వాళ్ళకు సమాధానంగా నేను స్వంతంగానూ (మనతెలంగాణ-2006) సంగిశెట్టితో కలిసి రాసినపుడూ చారిత్రికంగా తెలంగాణ అస్తిత్వాన్ని నిరూపించాల్సిన పరిస్థితి ఏర్పడిందని అర్ధమయింది. అట్లా రాసినందుకు వేలాది మంది (ఒక్క యూట్యూబ్‌లోనే 47 వేలమంది చూసిండ్రు) కొందరి పక్రారం లక్షల మంది నాకు అభిమానులయ్యిండ్రు. మిత్రుల అంచనా ప్రకారం ఈ పుస్తకం 50 వేల ప్రతులు అమ్ముడు పోయింది. 2013 హైద్రాబాద్‌ బుక్‌ ఫేర్‌లో సెకండ్‌ బెస్ట్‌ సేల్‌. ఈ పరిస్థితి నాకు గొప్ప ఆనందాన్నిచ్చింది. ఒక మంచి పని చేసినందుకు చాలా తృప్తిగా ఉంది. ఆ గుర్తింపు నా ”కవి” గుర్తింపును దాటి పోయినా లక్షల మందికి తెలంగాణ అస్తిత్వ గర్వాన్ని అందించినందుకు ఆత్మవిశ్వాసాన్ని అందించినందుకు మహదానందంగా కించిత్తు గర్వంగా కూడ ఫీలయిన.

31. తెలంగాణ చరిత్ర కాపీ కొడుతూ ఎన్నో రచనలొచ్చాయి కదా… ఎలా ఫీలవుతున్నారు?
– ”ముంగిలి” ని కాపీ కొడుతూ చాలా రచనలు వచ్చినవి. అలాగే ”తెలంగాణ చరిత్ర”ను కాపీ కొడుతూ 30, 40 పుస్తకాలు వచ్చినవి. వాళ్లు సరిగ్గా ఎకనాలెడ్జ్‌ చేయనందుకు బాధగా ఉన్నప్పటికీ తెలంగాణ అస్తిత్వ రెపరెపలు లక్షల గుండెల్లో ప్రతిబింబించినందుకు ఖుషీగా ఉంది. ఈ అయిదారేండ్లలో నాకు ఫోన్‌ చేసి అభినందించిన వేలమంది అభిమానులకు శిరసు వంచి నమస్కరిస్తున్న.

32. ఈ దేశ ముస్లింలు ప్రమాదంలో ఉన్నారు కదా. బైటబడే మార్గాలేమైనా ఉన్నాయా?
– ఈ దేశ ముస్లింలు, ఆ మాట కొస్తే ప్రపంచంలోనే – ప్రమాదంలో ఉన్నరు. బాహిరంగా అమెరికా తదితరుల సామ్రాజ్యవాదం, ఆంతరంగికంగా హిందూ సామ్రాజ్యవాదం కారణంగా ముస్లిం ప్రజలు ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నారనేది అందరికీ తెలిసిన పచ్చినిజం. ఆనాడు ఆదిమ ప్రపంచీకరణ (అంటె ఆర్యీకరణ) పరిస్థితులే నేడున్నవి. అందుకు పరిష్కారం ఉగ్రవాద చర్యలు కావు. అవి సమస్యపట్ల ప్రపంచదృష్టిని నిలిపేందుకు మాత్రమే తోడ్పడతవి. అవి అంతిమ పరిష్కార మార్గాలు మాత్రం కావు. నిజానికిది ముస్లిం సమస్య మాత్రమే కాదు. అమెరికాది దేశాలు భావిస్తున్న ”వెనుకబడిన” వాళ్లందరి సమస్య. అందువల్ల ముస్లిం ప్రపంచం (ముస్లిం దేశాలు కాదు) అనేక బాధిత అస్తిత్వాలతో కలిసి (ఎందుకంటె సామ్రాజ్యదేశాల మధ్య ఒక వైపు పోటీ ఉన్నా వాటి మధ్య ఐక్యత కూడ ఉన్నది కాబట్టి) ఒక ప్రజాస్వామిక ఐక్య వేదికను రూపొందించుకోవాలె. తమలోని అప్రజాస్వామిక లక్షణాల్ని విసర్జించాలె.

33. చాలా ప్రోగ్రెసివ్‌గా కనిపించే అగ్రవర్ణస్తుల్లోనూ ఆ వర్ణ జాడ్యాలు పొంచి ఉంటున్నాయి, అందులోంచి బైటపడలేరా?
– ప్రపంచ పరిణామంతో పోల్చుకుంటె భారతదేశంలో అందులో భాగంగా తెలంగాణలో కొన్ని అసహజ దశలు (గెంతులు)న్నవి.
ఫ్యూడల్‌ సంస్కృతి, భావజాల దశ ముగియకముందే పెట్టుబడీదారీ ఆధునిక భావజాలం విలువలు ప్రవేశించినవి. ఆ దశ పూర్తి కాకుండానే మార్క్సిస్టు తదితర ప్రగతిశీల దృక్కోణాలు ప్రవేశించినవి. ఫ్యూడల్‌ అవశేషాలను వదలిపెట్టకుండానే అన్ని కులాల ప్రజలు ఈ కొత్త దశల్లోకి పయనించినారు. అందువల్లనే అగ్రవర్ణ ప్రగతిశీలురలోనే కాక మిగతా కులాల ప్రగతి శీలురలో కూడ ఆ అవశేషాలు మిగిలి ఉన్నవి. అందరూ తమమీద తాము పోరాటం చేయాల్సి ఉంది. తమతో తాము ఘర్షణ పడాల్సి ఉంది.

34. సాహిత్య సృజనలో సంతృప్తి పడుతున్నారా?
– సంతృప్తి అనేది రచయితకు మరణశాసనం. ఇంకా ఇంకా రాయాలె. స్వాతంత్య్రానంతరం తెలంగాణ గ్రామీణ సమాజంలో జరిగిన పరిణామాలను చిత్రీకరిస్తూ నవల రాయాలని దశాబ్ది కాలంగా అనుకుంటున్న. కవిత్వంలో ఒదగని అనేక అంశాలను కథలుగా రాయాలని కూడా చాలా కాలం నుంచి మనసులో ఉన్నది. ఇతర పనులు మీదేసుకోవడం వల్ల అవి ఆగిపోయినవి. ఇకముందు చేయాలె.
35. ఈ తరం కవులకు మీ సలహాలు, సూచనలు ?
– వస్తువరణంలో, అభివ్యక్తిలో కాలంతో పాటు నడవాలె. కాలంకన్నా ముందుండాలె.

6 thoughts on “చాలామందికి నేను కరక్కాయ అయినందుకు గర్విస్తున్నా

  1. This interview with Sunkireddy narayanareddy is highly enlightening.
    He is a seasoned literary personality and his opinions are worth knowing

  2. మంచి పరిశీలన …విశ్లేషణ … but ask more useful questions for the learners …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


   Type Comments in Indian languages (Press Ctrl+g to toggle between English and Hindi OR just Click on the letter)