కథ

చెల్లె లేనోడు 

– స్కైబాబ
చెల్లెను అడిగిన- ‘..నీ మీద ఒక కథ అనుకున్న రా.. కథంత మనసుల రెడీ అయ్యింది.. రాయమంటవా?’ అని..
చెల్లె నాకై ఒకసారి చూసి సోంచాయించుకుంట ఉండిపొయ్యింది. జవాబు చెప్పలేదు. నేను రెట్టించలేదు.
మల్లా కొన్ని నెలలకు మరో సందర్భంల మల్లా అడిగిన. ‘..ఏం చెప్పకపోతివేం రా..’ అని.
‘..ఎక్కడ ఈయన కంట్ల పడతదొ.. ఏం గడ్‌బడ్‌ చేస్తడొ నని సోంచాయిస్తున్న బాబ్భాయ్‌!’ అన్నది. ఊరుకున్న. కాని ఎప్పటికైనా ఆ కథ రాయాలనే మనసుల అనుకున్న.
అదే కథ.. పాయింట్ అదే.. కాని ఇప్పుడు ముగింపు మారిపోయింది. కథనం మొత్తంగనె మారిపొయింది. రాయలేక.. రాయకుంట ఉండలేక నన్ను అతలాకుతలం చేస్తున్నది!
***
‘హలో బాబ్భాయ్‌! ఘర్‌ మేచ్‌ హైనా? బిజీ ఏం లేవుగా?’ అని అడిగిండు మా తమ్ముడు షోని మా ఊరి నుంచి ఫోన్‌ చేసి.
‘ఆఁ.. ఇంట్లనె ఉన్నరా.. మీరందరు ఎట్లున్నరు? పిల్లలు మంచిగున్నరా?’ అడిగిన.
నాలుగు మాటల తర్వాత నేను నిమ్మలంగనె, ఫ్రీగనె ఉన్ననని సమజైనంక చెప్పిండు తమ్ముడు- ‘ఛోటే ఆపా ఈ మధ్య కొద్దిగ ఎట్లెట్లనో చేస్తుందన్నా..!’ అని.
‘అవునా..! ఎట్ల చేస్తున్నది?!’
‘అప్పట్కప్పుడె మర్చిపోతున్నది.. పైసలున్నా పైసలెట్ల అని పరేశాన్‌ చేస్తున్నది.. అర్ధరాత్రే లేషి స్కూల్‌కు తయారవుతున్నదన్నా..!’
నా గుండెల్లో రాయి పడ్డది. రకరకాలుగ పోయింది మనసు.
‘ఎప్పట్నుంచి చేస్తున్నదిరా ఇట్లా?’
‘కొన్నాళ్ల నుంచి చేస్తున్నట్లుంది. ఈ మధ్య ఎక్కువైంది.’
‘మరి నాకు చెప్పలేదేందిరా..’
‘అమ్మ నాక్కూడ చెప్పలేదు బాబ్భాయ్‌..! ఈ మధ్యనే నాకు సమజైంది.’
‘సరేలే.. డిప్రెషన్‌కి లోనైనట్లుంది. ఏం పరేషాన్‌ కాకురి. ఏం కాదు. మంచిగైపోతది. మరి హైదరాబాద్‌ తీసుకొస్తరా- నల్కొండల్నె చూపెడదామా..?’
‘నీ ఇష్టమన్నా.. అక్కడ చూపెడదామంటే తీసుకొస్త..’
అయాల నేను కుదురగ యాడ ఉండలేకపొయ్‌న.. యాడ తిరుగుతున్నా ఏం చేస్తున్నా చెల్లె ఆలోచనే. అయ్యో! ఎంత స్ట్రాంగ్‌ ఉండె మా చెల్లె.. డిప్రెషన్‌లకు ఎల్లిపోవడమేంది.. అనుకుంటుంటే.. ఎన్నెన్ని ఆలోచనలో మనసుల సుడి తిరిగినై. 
‘అక్కడె తప్పు జరిగిపోయింది..!’ అనుకోకుంటనె ఈ మాట నాలో నేను అనుకున్నా- బయటికే వచ్చేసింది..!
అయాల నిద్దర పట్టలేదు నాకు.
     ***
రెండొ రోజె చెల్లెను తీసుకొచ్చిన్రు హైద్రాబాద్‌కు. గతంల ఒక దోస్తును తీస్కపొయి సూపెట్టిన సైకియాట్రిస్ట్‌ దగ్గరికె చెల్లెను తీస్కపొయ్‌న. ఫ్రెండ్‌ కారేదొ అడుక్కుని చెల్లెను, చెల్లె పిల్లలిద్దర్ని తీస్కొని వచ్చిండు షోని. వాని బార్య నాజియా, పిల్లలు, మా అమ్మ గుడ వచ్చిన్రు తోడు.
చెల్లెను సూడంగనె కండ్లల్ల నీళ్లు దునికినయ్‌ నాకు. ఎవల కంట్ల పడకుంట చూస్కున్న. మా చెల్లె నన్ను సూషి ఎప్పట్లెక్కనె సలామ్‌ చేసి ‘కైసె హై బాబ్భాయ్‌?’ అనడిగింది. మునుపటంత హుషారు లేదు. దగ్గరికి తీస్కొని తల నిమిరి, ‘ఎందుకు రా.. ఎక్కువ ఆలోచిస్తున్నవా.. ఏదన్న ఉంటె మాకు చెప్పొద్దా..’ అన్న.
‘అట్లేం లేదు గని పిల్లల పరేశానే ఎక్కువైంది బాబ్భాయ్‌..! ఆయనేమో పట్టించుకోడు గదా.. అన్ని నేనే చూస్కోవాలంటె అటు బడి ఇటు ఇల్లు ఈ పిల్లలు.. దాంతొనె ఇయన్ని…’ అని చెప్పుకుపోతనె ఉన్నది ఆగకుంట.
నా సహచరి షాహీన్, ‘క్యా యాస్మీన్‌! కైసె హై?’ అని పలకరించింది.. ఆమెతోని గుడ అయ్యే చెప్పబట్టింది.
క్లినిక్‌ లకు పోయి కూసున్నం. నీకు ఏమనిపిస్తున్నదొ అయన్నీ ఉన్నది ఉన్నట్లు డాక్టర్‌కు చెప్పేయాలని చెల్లెకు చెప్పిన. సరె నన్నది. జరసేపు ఐనంక డాక్టర్‌ పిలిషిండు. చెల్లెను తీస్కొని మా అమ్మతో పాటు ఎల్లినం. ఏమైందో క్లుప్తంగా చెప్పమని నన్ను అడిగిండు డాక్టర్‌- నేను కొద్దిగ వివరించి చెప్పిన- ‘తను మా చెల్లె సర్‌! గవర్నమెంట్ టీచర్‌. భర్త గ్రేడ్‌ వన్‌ కాంట్రాక్టర్‌. రోజు తాగుతడు. ఎక్కువసార్లు గొడవ పడుతడు. ఇద్దరు పిల్లలు. పెద్ద పిలగాడు ఫిఫ్త్‌. బిడ్డ థర్డ్‌. భర్తతో గొడవలు భరించలేక స్కూల్‌ కుడ దూరమయితుందని మా వూర్లనె మా ఇంటి పక్కనె ఇల్లు కట్టుకొని ఉంటున్నది. భర్త అప్పుడప్పుడొచ్చినా ఏదో గొడవ జరుగుతనె ఉంటది. మరి ఈ పరేషాన్లతోనొ ఏమో.. ఈ మద్య ఎప్పట్దప్పుడె మర్షి పోవడం, అర్ధరాత్రె లేషి బడికి తయారవుతుండడం, పెద్దనోట్లు రద్దయినయ్‌ కదా.. మరి మనకు పైసలెట్లా అని పరేషాన్‌ కావడం, తమ్ముడితోని ఊకె ఆ ముచ్చటె మాట్లాడ్డం చేస్తున్నది సార్‌!’
మా అమ్మ అందుకొని, ‘ఈమె బిడ్డకు ఈ మద్యల జొరమొచ్చి ఉండె. వాళ్ల స్కూల్ల ఎవలొ సారు వాళ్ల కొడుక్కు బాలేకుంటె నాలుగు లక్షలు కర్చయినయని చెప్పిండంట. మరి నా బిడ్డకు గుడ అన్ని పైసలయితయేమొ.. అన్ని పైసలు నా కాడ లెవ్వు గదా అని పరేషానయితుంది సార్‌!’ అన్నది.
డాక్టర్‌కు విషయం సమజై, మమ్మల్ని వారించి, మా చెల్లెను ఉద్దేశించి, ‘పేరేంటమ్మా?’ అనడిగిండు. ‘యాస్మీన్‌’ అని చెప్పింది. డాక్టర్‌ చిట్టీ మీద పేరు రాసుకొని మల్ల చెల్లె దిక్కు సూషి ‘చెప్పమ్మా! ఏమనిపిస్తున్నది నీకు..?’ అని అడిగిండు.
‘ఏం లేదు సార్‌! మా సారు ఏం పట్టించుకోడు. అన్ని నేనే పట్టించుకోవడం.. పిల్లల గురించి ఆలోచించడం.. స్కూల్ కు పోయి రావడం.. చేతిల ఎక్కువ పైసలు గుడ లేవు.. ఎట్ల అని పరేషానైతుంట…’ అని చెప్పుకుపోతున్నది.
‘ఎప్పట్నుంచి ఇట్లా అవుతుంది యాస్మీన్‌?’
‘మా బిడ్డకు జ్వరం వచ్చింది సర్‌. అది తగ్గుత లేదు. మళ్లి మళ్లి వస్తున్నది.. అప్పట్నుంచి ఇంక భయమేస్తున్నది సర్‌..’
‘మీరు కాసేపు బైట కూర్చోండి’ అని నన్ను, అమ్మను ఉద్దేశించి అన్నడు డాక్టర్‌. మేము బైటికొచ్చినం. కాసేపటి తర్వాత మల్లీ పిలిపించిండు.
‘ఎక్కువ ఆలోచించకండి యాస్మీన్‌! నేను టాబ్లెట్స్ రాస్తాను. వాడండి. కాస్త నిద్ర వస్తుంది. అమ్మాయికి జ్వరమే కదా.. తగ్గిపోతుంది. మీరు అర్ధరాత్రే లేవడం వల్ల మీ నిద్ర, పిల్లల నిద్ర గూడ చెడిపోతుంది కదా..?’
‘అవును సార్‌!’
‘మల్లి 20 రోజులకు రండి. ఎలా ఉందో చెప్పాలి నాకు’
‘సరే సార్‌!’ అన్నది.
‘బైటికి పదండి, నేను వస్తున్న’ అని అమ్మను, చెల్లెను పంపించి, ‘ఏంటి సార్‌ పరిస్థితి?’ అని డాక్టర్‌ను అడిగిన. ‘ఏం లేదు, డిప్రెషనే! తగ్గిపోతుంది’ అన్నడు డాక్టర్‌ నింపాదిగ. హమ్మయ్య అనిపించి డాక్టర్‌కి థాంక్స్‌ చెప్పి బైటికొచ్చిన.
నాకు ఒక విషయంల ఆశ్చర్యంగ అనిపించింది. మామూలుగా డిప్రెషన్‌కు గురైన వాళ్లు డాక్టర్‌ అడిగినప్పుడు అన్నీ చెప్పుకుంట ఏడ్చేస్తరు. నేనొక దగ్గరి బంధువును తీస్కెల్లినప్పుడు ఇద్దరు డాక్టర్ల దగ్గరా ఏడ్చింది. ఒక దోస్తును తీసుకుపోయినప్పుడు అతను అర్ధగంటలో రెండుసార్లు ఏడ్చిండు. మరి చెల్లె ఏడ్వలేదు.. ఎందుకని!? సరేలే, మొదటి నుంచి స్ట్రాంగ్‌ కదా.. అదికాక డిప్రెషన్లో చాలా రకాలుంటయ్‌ కదా అనిపించింది మల్ల..
డాక్టర్‌కు 400,  టాబ్లెట్లకు 600ల చిల్లరా కలిపి వెయ్యి పైన ఐనయ్‌. తమ్మున్ని అడిగిన. ‘పైసలున్నై కదరా, చెల్లె దగ్గరా?’ అని. ‘ఉన్నై.. మరి ఇస్తదొ లేదో..’ అంటుంటె ఆడి మొఖంల నవ్వు తొంగి చూసింది. నా దగ్గర కుడ లెవ్వు. చెల్లె టీచర్‌ జాబ్‌ కాబట్టి ఇప్పించొచ్చు. కానీ టీచర్‌లు ఎక్కువమందికున్నట్లె చెల్లెకు గుడ బాగ పీసుతనం అలవాటైంది. పైస పైసకు ఆలోచిస్తుంటది. వెయ్యి రూపాలు అవుతున్నయని మేము అనుకుంటుంటె గుడ పైసలు తీస్తలేదు. ఇగ నేనే చొరవగ ‘ఏదీ హ్యాండ్‌ బ్యాగ్‌ ఇవ్వరా..’ అని తీస్కోబోతుంటె ‘పైసలెక్కువ లేవు బాబ్భాయ్‌!’ అంటున్నది. బ్యాగ్‌ తీస్కొని అన్ని అరలు వెతికి చూసిన. పైసలున్నై. వెయ్యి తీసి కౌంటర్‌ల ఇచ్చిన. మిగతావి సర్దిపెట్టి బ్యాగ్‌ చెల్లెకు ఇచ్చేసిన. చెల్లె మొఖంల కాస్త ఆందోళన!
బయటికొచ్చినం. ‘మా ఇంటి కొచ్చి రేపు పోదురి లేరి. కారు ఇవ్వాల్నే ఇవ్వాల్ననే ఇబ్బందేం లేదు కదా..’ అని అడిగిన తమ్మున్ని.
తర్జన భర్జన తర్వాత తమ్ముడి పిల్లలు మా ఇంటికి పోవాల్నిందే నని ఏడుపు మొఖం పెట్టేసరికి మొత్తానికి ఆ రాత్రికి మా ఇంటికి వస్తానికి ఓకే అయ్యిన్రు. నేను, షాహీన్ బండి మీద, వాళ్లు కార్ల మా ఇంటి కొచ్చినం.
ఆ రాత్రి మా చెల్లెకు నేను షానా ధైర్యం చెప్పిన- ‘మేమంతా ఉన్నం నీకు. పరేషాన్‌ కావొద్దురా. ఏమన్న ఉంటె అమ్మకో, తమ్ముడికొ, మరదలికో, నాకో చెప్పు. చెప్పకుంట మనసుల పెట్టుకోకు…’ ఇట్లా ఎన్నో.. తమ్ముడు, మా అమ్మ, షాహీన్ గుడ తనకు ఎన్నో రకాలుగా ధైర్యం చెప్పిన్రు.
వస్తూ వస్తూ అనార్‌ పండ్లు తెచ్చి ఉంటిమి. అవి తింటే మంచిది అని ఎవరో చెప్పిన్రంట. ఒలిచి ఇస్తె ఒక పండుకు పండు దబదబ తినేసింది చెల్లె. జల్ది బాగైపోవాలె నని మన్సుల పడ్డది చెల్లెకు. మంచిదే కదా అనుకున్న.
అందరం తిని పడుకున్నం. నాకు తన ఆలోచనలతోనె షాన సేప దాంక నిద్ర పట్టలె. 
మజ్జె రాత్రి ఏదొ చిన్న సప్పుడైతె లేషి మెల్లగ ముందు రూంల కొచ్చి చూసిన. బెడ్‌ మీద లేదు చెల్లె. పక్క రూంల తిరుగుతున్నది. ‘షన్నూ! ఏందిరా..?! నిద్ర వస్తలేదా?’ అని అడిగిన. ‘ఆఁ.. మెలకువొచ్చింది. బాత్రూం పోయిన’ అని వచ్చి తన మంచం మీద కూసున్నది. ‘చలి ఎక్కువుంది గదా.. తలకు కట్టుకున్నది తీసేసినవేంది. కట్టుకొని పడుకో.. ఏం ఆలోచించకుండా పడుకోరా’ అన్న. అది వెతుక్కొని కట్టుకొని పక్క మీద ఒరిగింది.
మల్ల నాకు నిద్దర పట్టాలె..
     ***
చెల్లె క్లవర్‌. సెవెంత్‌ క్లాస్‌ ఫస్టు క్లాసులో పాసయ్యింది. నల్గొండలోని గవర్నమెంట్ గర్ల్స్‌ హైస్కూల్‌లో చదివేది. ఒక ప్రైవేట్ స్కూల్‌ యజమాని బాగ తెలిసి ఉండె నాకు.  దాంతో చెల్లెను ఎనిమిదో తరగతి జంప్‌ చేయించి తొమ్మిదిలో వేయించిన.
కొన్నాళ్ల తరువాత నేను సాయంత్రం పూట నల్గొండలోని ఎన్‌జీ కాలేజి గ్రౌండ్‌లోంచి సైకిల్‌ మీద పోతున్న. అప్పుడు కొన్నాళ్ళు అమ్మ వాళ్ళు అక్కడ ఉన్నారు ఇల్లు కిరాయికి తీస్కొని.. చీకటి పడుతున్నది. ఎదురుగా మా చెల్లె వస్తున్నది నడుసుకుంట. నన్ను చూడలేదు. కనీ, ఏడ్చుకుంట నడుస్తున్నది. నేను సైకిల్‌ ఆపేసరికి నన్ను చూసి కండ్లు తుడుసుకున్నది. ‘ఏమైంది రా.. ఎందుకేడుస్తున్నవ్‌!?’ అని దగ్గరికి తీసుకొని అడిగిన. ‘ఏం లేదు బాబ్భాయ్‌! క్లాసులో వాళ్లంతా వేరుగా ఉన్నారు.. నేను వాళ్లలో కలిసిపోలేకపోతున్నా. వాళ్లు నన్ను కలుపుకుంటలేరు.. జోక్‌ చేస్తున్నరు. వాళ్లు చాలా ఫాస్ట్‌ ఉన్నరు. నాకు కష్టంగ ఉంది బాబ్భాయ్‌!’ అని ఏడ్వబట్టింది. నాకు కొద్దిసేపు ఏం  చెయ్యాల్నొ సమజ్‌ కాలె. సంభాళించుకొని, ‘అవునా.. మరి నాకెందుకు చెప్పలేదురా..’ అంటె సప్పుడు జెయ్యలేదు. ‘అట్ల నీకు ఇబ్బందిగా ఉంటే మార్చేద్దాం లేరా.. మల్ల నీ స్కూల్లోనే చదువుదువు.. సరేనా..’ అన్నా. ‘మల్ల వీళ్లు తీసుకుంటరా.. 8వ తరగతిలోనే చేరాల్సి ఉంటది’ అన్నది. ‘పరవాలేదు లే.. రేపే మార్చేద్దాం. రేపు నువ్వేం పోవద్దు. నేను టీసీ తీసుకొస్తా. నీ స్కూల్‌కు వెళ్లి చేరిపోదాం’ అన్న. ‘సరే’ అన్నది. కాస్త నిమ్మల పడ్డదో.. తర్వాత ఏమేం సంఘర్షణ పడ్డదో..
రెండో రోజు నేను వెళ్లి ఆ ప్రైవేట్ స్కూల్‌లో టీసీ తీసేసుకొని వచ్చి చెల్లెను తీసుకెళ్లి మల్లీ గవర్నమెంట్ స్కూల్లోనే ఎనిమిదో తరగతిలో చేర్చేసిన.
మల్ల ఎప్పట్లెక్కనె హుషారుగ బడికెల్లింది చెల్లె!
***
రెండోరోజు ఎల్లిపొయిన్రు. నాకు యాస్మీన్‌తోపాటు మరో ఇద్దరు చెల్లెండ్లు.  ఒక తమ్ముడు. ముగ్గురు చెల్లెండ్లల్ల యాస్మీన్‌ చిన్నది. తమ్ముడు లాస్ట్‌. ఫోన్లల్ల మాట్లాడుకొని రెండ్రోజులాగి అందరం కేశరాజుపల్లికి ఎల్లినం. అయాలంత అందరం కలిసి చెల్లెతో అవీ ఇవీ మాట్లాడుకుంట ఉన్నం. అమ్మ నాటు కోళ్లు కోయించి మంచిగ వండి పెట్టింది. అట్లా మంచి దావత్‌ చేసుకున్నం. చెల్లెకు అందరం దైర్యం చెప్పినం.
*
ఇట్లనె ఒకసారి అందరం కూడినప్పుడు దావత్‌ చేసుకుంటున్నం. కల్లు తెప్పించి ఉంటి. అమ్మ నాటు కోడి కోసింది. ఆవుకూర తలాయించింది. అందరు ఎవల బాధలు, సంతోషాలు అన్నీ చెప్పుకోవాల్నని నేను ప్రతిపాదన పెట్టిన. మా తమ్ముడు, మిగతా చెల్లెండ్లు చెప్పుకున్నరు. యాస్మీన్‌ మాత్రం ఏం చెప్పలె. నువ్వు చెప్పవేందిరా అంటే.. ‘ఏముంది చెప్పడానికి.. మీరంత బానే ఉన్నరు.. నా బతుకే ఇట్ల అయ్యింది..’ అనేసి ఏడ్సుకుంట లేషి ఎల్లిపొయింది. మేమందరం పరేషాన్‌గ ఉండిపొయినం. అమ్మను పోయి సూడమంటె అమ్మ లేషి యాస్మీన్‌ ఇంట్లకు పోయింది. తర్వాత ఇద్దరు చెల్లెన్డ్లు గుడ ఎల్లిన్రు.
అవాళ గుడ నాకు నిద్ర పట్టలేదు. చెల్లె బతుకు ఇట్లయిపాయె.. మేమందరం పైసలున్నా లేకున్నా ఒకరికొకరం తోడున్నం. ఆమెకు, ఆమె మనసుకు తోడు లేకుంటాయె.. అన్నీ విప్పి చెప్పుకునే తోడు ఒకటి ఉండాలి.. ఒంటరితనం ఎంతగనం బాధిస్తున్నదొ గదా అనిపించింది. ఎట్లా ఎట్లా అని మనసు ఒకటే నుజ్జయింది. అట్లా ఆలోచించే ఒకటి రెండుసార్లు- ‘అతన్ని వదిలెయ్‌.. అవకాశమొస్తె ఇంకో పెళ్లి చేసుకోవచ్చు. నీ యిష్టమొచ్చినట్లు హాప్పీగ ఉండురా’ అని చెప్పిన. కాని సప్పుడు జెయ్యలేదు, సోంచాయించుకుంట ఉండిపొయ్యింది. మల్లొకసారి ‘ఎందుకు అతన్ని పట్టుకొని ఏలాడ్డం? ఏమాలోచిస్తున్నవ్‌ చెప్పు’ అని వదలకుంట అడిగితె, ‘..పిల్లలు ఇబ్బంది పడుతరు కదా బాబ్భాయ్‌! వాళ్ల గురించే ఏ నిర్ణయం తీసుకోలేకపోతున్నా. తండ్రికి దూరం చేసిందాన్నయితనేమో.. అనిపిస్తది. అదేగాక ఆయన మొండోడు కదా.. నాకు పిల్లలంటే షానా ప్రేమని నా నుంచి పిల్లల్ని విడదీసి కసి తీర్చుకోవాలనుకుంటడేమో నని భయం గుడ ఏస్తున్నది బాబ్భాయ్‌!’ అన్నది.. కళ్లల్ల నీల్లు తిరిగినయ్‌ ఇద్దరికీ!
అట్లా మాట్లాడుకున్నయన్నీ యాదికొస్తున్నయ్‌ నాకు. చెల్లెకు గుడా ఇగ ఇయాల నిద్ర ఎట్ల పడతది. రేపు స్కూలుకు గుడ పోతదో లేదో అని సోంచాయించుకుంట ఎప్పటికో నిద్ర పొయిన. 
పొద్దున్నె ‘బాబ్భాయ్‌!’ అనే పిలుపుకు లేషి చూస్తె చెల్లె తయారై తలుపు దగ్గర నిలబడి, 
‘నేను స్కూల్‌కు పోతున్న.. రెండ్రోజులు ఉండకపోయిన్రు.. ఇయాల్నె ఎల్త మన్నరంట’ అన్నది. 
‘లేదురా.. ఎల్లాలె..’ అన్న. 
‘సరే.. పొయి రారి. నేను స్కూల్‌కు పోతున్న.. బాయ్‌ మరి’ అన్నది. 
‘సరే.. బాయ్‌.. దేఖ్‌ సమజ్‌ కె’ అనుకుంట లేషి బైటి కొచ్చిన.
తను వెళ్లిపోతున్న దిక్కు చూస్కుంట అనుకున్న- ‘తప్పదు, మనసుల ఎన్ని గోసలున్నా, రాత్రి ఎంత వేదించినా పొద్దున్లేషి ఉరకాల్సిందే కదా..’ అని. తన ముఖంపై రాత్రి దుఃఖమేదీ కనిపించలేదు..! తప్పదు అన్నట్లు అన్నీ మర్చిపొయి పిల్లల్ని స్కూల్‌కు తయారు చేసి పంపి తను స్కూల్‌కు తయారైపోయి వెళ్తున్నది..
అప్పుడొక పెద్ద నిట్టూర్పు విడిచిన.
‘అక్కడె తప్పు జరిగిపొయ్యింది!’
     *
చెల్లెకు రకరకాలుగ ధైర్యం చెప్పి ఒక్కొక్కలం మల్ల ఎవలిండ్లకు వాళ్లం మల్లుతున్నం. ఆఖరికి నేను, షాజహానా తయారై వస్తుంటె- ‘అందరు వచ్చిన్రు.. ఒక్కొక్కరంత ఎల్లిపోతున్నరు..’ అన్నది చెల్లె విచారంగ మొఖం పెట్టి.
‘ఎల్లాలి గదరా.. మల్ల ఒస్తం షన్నూ!’ అన్న బుజ్జగిస్తు.
అంతా మంచిగనె ఉందనిపించింది. నాలుగు రోజుల్లనె తమ్ముడు ఫోన్‌ చేసి ‘ఎప్పట్లెక్కనే చేస్తుంది బాబ్భాయ్‌..! అమ్మను గానీ నాజియాను గానీ నిద్ర పోనిస్తలేదన్నా. ఊకె ఏదొ ఒకటి చెప్తున్నది. ఇంట్ల పని, ఆమె పనులు చేసి చేసి నాజియా కొద్దిగ రెస్టు తీసుకుందామన్నా తీసుకోనిస్తలేదంట. జర్ర పండుకోంగనే నాజియా అని వచ్చి ఏదేదో మాట్లాడుతుంటె, ఈమె ముందే సెన్సిటివ్ కదా.. జర భయపడుతున్నది’ అన్నడు.
‘ఏం కాదులేరా.. నువ్వు జర ధైర్యం చెప్తుండు.’
‘హాస్పిటల్‌ల చేరుద్దామేంది బాబ్భాయ్‌!’ అని సంశయంగ అడిగిండు షోని.
‘హాస్పిటల్‌ల చేరిస్తె ఏమొస్తదిరా.. అక్కడ నేను పేషంట్ ను అనుకుంటే ఇంకా ఇబ్బంది.. ఇంట్ల ఉన్నట్లు ఉండదు గదా.. హాస్పిటల్‌ల చేర్పించే జబ్బు కాదురా ఇది.. డిప్రెషన్‌ అంతే.. అలాగే ఉంటది.. కొద్దిగ ఓపిక పట్టాలె’ అన్నా.
వాడు సప్పుడు జెయ్యలె. వాడికేదొ డౌట్ ఉన్నట్లుంది. నాకు సరిగ చెప్పలేకపొయిండు. తర్వాత గుడ చెల్లె రకరకాలుగా పరేషాన్‌ చేస్తున్నదని, స్కూల్‌కు సెలవు పెట్టించినంక గుడ మల్ల స్కూల్‌కు పోవాల్నని  వేదిస్తున్నదని షోని మాట్లాడతనె ఉండు. ‘ఇంట్ల ఆమె వేదింపులకు ఇబ్బంది అవుతుందన్నా.. హాస్పిటల్‌ల చేరుద్దాం..’ అన్నడు మల్లొకసారి. నేను వచ్చి తోడుంటలేరా.. అని నేను పోయిన. నా తోడు అవసరం చెల్లెతోపాటు అందరికీ ఉందనిపించింది.
చెల్లె ఇంట్ల నేను, అమ్మ పడుకున్నం. సరిగ్గ ఒకటి రెండు ప్రాంతంల మెలకువొచ్చేసేది తనకు. బహుశా టాబ్లెట్స్ ప్రభావం అయిపోవడం, దానికన్న ఎక్కువ, తనలోని ఆరాటమేదో తనను లేపేసేది అనుకుంటా.. లేషి ఇగ తను పడుకోకుంట మమ్మల్ని పడుకోనిచ్చేది కాదు.
అమ్మ చెప్పింది- ‘సదిరిన బట్టలే మల్ల సదురుతుంటది.. ఉతికిన బట్టలు, మాసిన బట్టలు వేరు వేరుగా పెట్టినా మల్ల మల్ల కలిపేస్తుంటది. పిల్లలకు స్కూల్ డ్రెస్ లు ఉతికి లేవుగా అని టెన్షన్ పడుతుంటది..’
ఈ మధ్యకాలంలో మా చిన్నమ్మ బిడ్డ డాక్టర్- హనీఫ ను ఏ డౌట్ వచ్చినా కాల్ చేసి అడుగుతూ ఉండేవాళ్ళం.
ఇరవై రోజులకు మల్ల ఆ డాక్టర్‌ దగ్గరికి తీసుకెళ్లి చూపెట్టినం. మల్లేవో గోలీలు మార్చి ఇచ్చిండు. ఏం తేడా లేదేంది సర్‌ అని అడిగినం. ఏం కాదు, సెట్ అవుతదని అన్నడు డాక్టర్‌. ఏం చేస్తం.. రెండ్రోజులు మా ఇంటి దగ్గర ఉంచినం. రెండ్రోజులకె కొడుకును చూడాల్నని ఒకటె ఆత్రపడ్డది.
కారు మ్లాట్లాడుకొని నల్గొండకు పోతుంటె ఆ గంటన్నరలనె ఇంకా రాదేంది ఊరు అని, ఇంత లేట్ అవుతున్నదేందని అసహన పడ్డది. ఊర్లె కెల్లినంక జర్ర నిమ్మలపడ్డది.
ఈ మద్యకాలమంతా అమ్మ షానా పరేషానైంది. చెల్లె ఎంట చేసి చేసి తన గురించి పరేషానై అయ్యి కండ్లు పీక్కుపొయినయ్‌ అమ్మకు. రోజు రోజుకి చెల్లె ఆరోగ్యం ఇంకింత ఖరాబే అయితున్నదని సమజయితున్నది. ఏం చెయ్యాల్నొ తోస్తలేదు. అమ్మకు ఏవో నమ్మకాలు గుడ ఉన్నై. ఇదేదో చేతబడి అని.. ఎవరో మైసమ్మను లేపి ఈ ఇంటి మీద వదిలిన్రని, ఒకరోజు పొద్దున్నె మా ఇంటి గేటు కాడ పసుపు చల్లి ఉండెనని, అది చాలా డేంజరని వేదించడం మొదలుపెట్టింది. మొదట్లో ‘నువ్వు నమ్ముతున్నవారా?’ అని చెల్లెను అడిగితె ‘నేనేం నమ్ముతలేను’ అన్నది. తర్వాత్తర్వాత అమ్మ ఊకె చెప్తుండేసరికి అమ్మ ఇష్టమని ఊకున్నది. మనసుల ఈ మనాది పెట్టుకొని అమ్మ నిమ్మలపడేటట్లు లేదని నేను సంఘర్షణ పడ్డ. ‘..మీ ఇద్దరికి మనసుకు నిమ్మలమైతదనిపిస్తె ఏమన్న చేయించుకోరి. నేను వద్దనను. నేనయితె ఇవేవి నమ్మనని మీకు తెలుసు గదా’ అన్న. అమ్మ మొత్తానికి ఒక భూతవైద్యుడు బాబాను పిలిపించింది. వాడు వచ్చి చెల్లెను, ఇంటిని చూసి ఏదేదో చెప్పి ఏందేందో చేసి ఇంటి నిండా నిమ్మకాయలు, కొబ్బరి కాయలు, ఏంటేంటో ఏసి గుమ్మడికాయ పగులగొట్టి 10 వేలు తీసుకుపొయ్యిండు. నేను ఇంట్లకు పోయి చూసిన. ఇల్లంత యుద్ధభూమిలా ఉంది. చెల్లె నిశ్శబ్దంగా మంచంపైన పడుకొని చూస్తున్నది. మా చెల్లె నిస్సహాయతను చూస్తె మనసు తరుక్కుపోయింది. ఆ రాత్రి ఆ బాబాగాడు చెప్పినట్లు మా తమ్ముడు, ఆ బాబాను తోల్కొచ్చిన మా చిన్నమ్మ కొడుకు, అమ్మ కలిసి ఇంట్లో నాలుగు మూలలా తవ్వి బాబా ఇచ్చిన నాలుగు మూటలు పాతి పెట్టిన్రు. గనుమల కాడ బయట రెండు పాతిపెట్టిన్రు. ఆ రాత్రి ఆ ఇల్లు ఊడ్వకూడదంట. చీకటి మొఖాన లేషి ఊకి అదంతా తీసుకెళ్లి ఊరికి తూర్పున ఉన్న ప్రవహించే ఏట్లోనో, కాల్వలోనో ఏసి రావాలంట.
తెల్లారక ముందే నాకు మెలకువొచ్చింది. చలి! తప్పదు.. అమ్మను లేపి గుర్తు చేసిన. అదేదో వాడు చెప్పినట్లు చెయ్యకపోతె మల్ల అమ్మ మనసు కుదుటపడదని! అమ్మ ఎక్కడ భయపడుతదో నని తనకు తోడు ఎల్లి నిలబడ్డ. ఊడ్చిందంత మూటగట్టి రెడీ చేసింది. తమ్ముడిని లేపిన. వాడు, ఆ మూటను బండి ముందల పెట్టుకొని నన్ను తోడుగ ఎనక కూసొబెట్టుకొన్నడు. ఆ చీకట్ల, ఆ చలిల రెండు కిలోమీటర్ల దూరంల ఉన్న ఏటికి తీస్కెల్లిండు. అందుల ఆ మూటను పడేసి వచ్చినం.
ఇప్పుడన్న అమ్మకు, ఆమెతోి ఏకీభవిస్తున్న వాళ్లకు జరంత నిమ్మలమైతది లెమ్మని అనుకున్న మనసుల. మూలం ఎక్కడుందో వీళ్లకు ఎట్ల సమ్జాయించడం.. 
తప్పు అక్కడే జరిగిపోయింది!
***
మా చెల్లె మ్యారేజ్‌ చాన్నాళ్ల వరకు కాకపోవడానికి కారణాల్లో ఒకటి మేం కట్నం సరిపోయేంత ఇచ్చే పరిస్థితి లేకపోవడం. మజ్జెలో ఒకబ్బాయిని చేసుకుంటానన్నది. వాడు ఆఖర్లో వాళ్లమ్మకు భయపడ్డడు. బాధపడ్డది. నాకు చెబితే ఓదార్చిన. మా ఇండ్లల్లో మా అబ్బాజాన్‌ వైపు గాని, అమ్మీజాన్‌ వైపు గాని డిగ్రీ చదివిన మొదటి ఆడపిల్ల  మా చెల్లెనే. డిగ్రీ పాసయి, ఇటు హిందీ రాసి హిందీ టీచర్‌ ట్రైనింగ్‌ చేసింది. టీచర్‌ ట్రైనింగ్‌కి 20 వేలు కట్టాల్సి వచ్చింది. అప్పుడు ఆ ఇరవై వేలు మా దగ్గర లేక ఎన్ని ఇబ్బందులు పడ్డమో.. పెద్ద అమౌంట్ దగ్గర నించి ఫ్రెండ్స్‌ దగ్గర వంద రెండొందల దాక జమ చేసి 20 వేలు కట్టినం. ట్రైనింగ్‌ పూర్తి చేసి టీచర్‌గా జాబ్‌ సంపాదించుకుంది. అప్పుడు నేను, షాజహానా హైదరాబాద్‌లో ఎమ్‌ఎస్‌ మఖ్తాలో ఉంటున్నం. తనకు టీచర్‌ జాబ్‌ వచ్చిందని ఫోన్‌ చేసింది. 2003లో. ముబారక్‌లు చెప్పుకున్నం. హాపీగా మాట్లాడుకున్నం. చెల్లె ఫోన్‌ పెట్టేసినంక నేను షానాసేపు ఏడ్చిన. మా ఇంట్ల ఒక్క గవర్నమెంటు జాబ్‌ కూడ లేక పడుతున్న ఇబ్బందులన్నీ గుర్తు చేసుకుంటుంటె షానా ఏడ్పొచ్చింది. ఎందుకంటె మా అబ్బా జాబ్‌ మా తమ్ముడికి రాయించినం. కాని ఎంత తిరిగినా కూడ ఆ జాబ్‌ తమ్ముడికి రాలేదు.
సరె, చెల్లెకు జాబ్‌ వచ్చినంక చిట్యాల దగ్గర శివనేనిగూడెం అనే ఊరిలో ఫస్ట్‌ అపాయింటుమెంట్. కొన్నాళ్లు మా ఊరి నుంచి వెళ్లింది కాని కష్టమవుతుండడంతో చిట్యాలలో ఒక రూం కిరాయికి తీసుకొని ఉన్నది. మా నానిమా చాన్నాళ్లు తన దగ్గర ఉంది. సంబంధాలు చూస్తున్నం గనీ నచ్చడం లేదు. వాల్లకు గుడ మా చెల్లె నచ్చకపోవడం గుడ ఉన్నది. చెల్లె మొఖం అప్పటికి పరేషాన్లతోని బక్కగై అంత ఎట్రాక్టివ్‌గ ఉండకపొయ్యేది. ముందు పళ్లు కాస్త ఎత్తు ఉండడంతోి ఫోటోలు దిగేటప్పుడు పై పెదవితో కప్పి ఉంచేది. ‘అట్లా అవసరం లేదురా, మామూలుగా ఉంటేనే బావుంటవు’ అంటే వినకపోయేది. బహుశా ఈ పాడు లోకం విధించిన శిక్ష ఆ గిల్టీ ఫీలింగ్‌! అందం అనే భావం చుట్టూ ఎన్ని హింసలో!
ఒక సంబంధం వచ్చింది. అతనూ టీచరే.. కాని మరీ నల్లగున్నడనుకుంది. తను తెల్లగుండేది. ఇంకొన్నాళ్లు చూడాల్సుండెనేమో టీచర్‌ సంబంధాలు రాడానికి. అంతలో మాకు దగ్గర్లోని ఒక  ఊరి నుంచి ఒక సంబంధం వచ్చింది. పిలగాడు హైదరాబాద్‌ల ఉంటడు. గ్రేడ్‌ వన్‌ కాంట్రాక్టరు. రాజకీయ నాయకులతోని గుడ సంబంధాలు ఉండే స్థాయి. అవసరమైతే హైదరాబాదు వైపు ట్రాన్స్‌ఫర్‌ కూడ చేయించుకుంటడు. అన్నింటి కన్నా ముఖ్యమైన విషయం కట్నం అవసరం లేదు. ఇవ్వగలిగినంతే ఇవ్వచ్చు. రెండవది అతని అన్న భార్య కూడ టీచరే. ఇంకేంది, అర్ధం చేసుకుంటరు.. జాబ్‌ విషయంలో సహకరిస్తరు…
వాల్లు వచ్చిన్రు చూసుకుంటానికి. చెల్లె నచ్చుతదో లేదో నని ఒక భయం ఉండె మా మనసుల్లో. చెల్లెను తయారుచేసి చూపెట్టినం. చెల్లెను తల ఎత్తమన్నప్పుడు మాత్రం ఆ ఒక్కసారె పిలగాన్ని చూసింది. సరె, వాళ్లు బయటకు పోయి మాట్లాడుకుంటుంటె ఏమంటరో నని ఎదురుచూసినం. నచ్చిండా అని చెల్లెను అడిగిన. ఓకే చెప్పింది. నేను బయటికి పోయి మాట్లాడిన.
షాదీ ఒకే అయ్యింది. షాదీ కోసం నేను ఇంట్లో వాళ్లతోని అన్నీ మాట్లాడుకుంట ప్లాన్లు వేసినం. అప్పులు ఇచ్చేటోల్లను, సాయం చేసెటోల్లను అందరిని టచ్‌ చేసినం. అమ్మ ఎక్కువ ఆ పని చూసింది. వాళ్ల తమ్ముళ్లను, చెల్లెళ్లను కదిలించింది. చెల్లె లెక్కలన్నీ ఒక కాపీల రాయమంటె రాస్తున్నది. మొత్తానికి షాదీ వీలైనంత తక్కువ ఖర్చులో ఎల్లేటట్లు చూసుకున్నం. అప్పటికీ కొంత అప్పు చేసినం. పెళ్లికి వీడియో మాత్రం తీయించినం.
ఆ వీడియో ఇప్పుడు చూస్తే అనిపిస్తుంటది- చెల్లె, మా అమ్మ, మిగతా అందరం గుడ ఎంతో బక్కగ, పరేషాన్‌గ ఉన్నం అందుల. చెల్లెను తీస్కొని ఎల్లిపోతుంటె పెరాలిసిస్‌తోటి ఉన్న మా అబ్బా చూపు.. మా అందరి పరేషాని.. కండ్లనీళ్లు కుమ్మరిస్తది.
***
షాదీ ఐనంక కొన్ని నెలలకు అనుకుంట, చెల్లె లెక్కలు రాసిన ఆ నోట్బుక్‌ చూస్తుంటె అందుల జంట కమ్మల ఒక కాగితం మడిచిపెట్టి కనిపించింది. చూస్తె చిన్న కథ. చెల్లె బుర్ఖా ధరించడం మీద రాసుకున్నది. ఆ సమయంల నేను ‘వతన్‌’ ముస్లిం కథల పుస్తకం వేసే పనిల ఉన్న. ఆ కథకు బుర్ఖా అని పేరు పెట్టి యాస్‌ ఇట్ ఈజ్‌ గా ‘వతన్‌’లో వేసిన.
నాకు మొదట్లో కథకుడిగా మంచి పేరు తెచ్చిన ‘ఛోటీ బహెన్‌’ కథలో సగం పైన కథ మా యాస్మీన్‌ జీవితమే!
బుర్ఖా గురించి మొదట్లో షానా మాటలే పడ్డది చెల్లె.. మొదట్లో నేను, తరువాత టీచర్ జాబ్ తనను బుర్ఖా నుంచి తప్పించుకోడానికి సహారా..
***
షాదీ అయినంక చెల్లె కష్టాలు ఇంకో మలుపు తీసుకున్నయ్‌. 
గొడవలే గొడవలు. బావ బాగ సతాయించడం మొదలుపెట్టిండు. చెల్లెకు అతని మీద ఒక అనుమానం బలపడిపోయింది. ఒకామె ఇతన్ని బుట్టలో వేసుకొని తనను ఇబ్బందులు పెడుతున్నదని, ఆమె చెప్పినట్లే నడుచుకుంటున్నడని, ఆమె ముందు తనను బాగ తక్కువ చేస్తున్నడని గొడవ పెట్టింది.
అందరం కలిసి ఒకసారి పంచాయితి పెట్టి మరీ అడిగినం. అదేం లేదన్నడు. చెల్లె చెప్పిందే నిజమని మా అందర్కి సమజైంది. ఒకసారి అలా పంచాయితి పెట్టడం వల్ల కాస్త తగ్గుతడని ఆ పనిచేసినం. మా మామలు గ ట్టిగనె అడిగిన్రు. ఇద్దర్ని కలిపేసి పంపినం. మల్లొకసారి ఏదో గొడవ. మల్ల నేను, మా అమ్మ, వాళ్ల అమ్మ, అన్న, తమ్ముడు కలిసినం. ఏంటి ప్రాబ్లం అంటే ‘యాస్మీన్‌ నా మాట ఇంటలేదు. జాబ్‌ మానేసి ఇంట్ల ఉంటె చాలు’ అన్నడు.
‘జాబ్‌ మానెయ్యమంటె కుదరదు, ఆ విషయం షాదీ అప్పుడు అనుకోలేదు కదా!’ అన్న నేను.
సెల్లు ఇసిరికొట్టిండు. ఏందో బూతులు తిడుతున్నడు. 
నోరు సంబాలించుకొని మ్లాడు. నేను గుడ అంతకన్నా ఎక్కువ మాట్లాడగలను’ అన్న నేను గట్టిగ.
వాళ్ల వాళ్లు ఊకోబెట్టిన్రు. ఇక జాబ్‌ వదిలించేలా లేరు అని కాస్త ఊకున్నడు. మల ఇద్దర్ని కలిపినం.
జాబ్‌కు పోవడం, ఇంటికి రావడం, ఇద్దరు పిల్లలు కలగడం.. ఓహ్‌ా.. ఆడాళ్లకు ఇన్ని కష్టాలేందిరా నాయనా అనిపించేది నాకు చెల్లె జిందగీ సఫర్‌ ని చూస్తె.
మద్య మద్యలో గొడవలు పెట్టుకొని బావ కొడితె నాకు ఫోన్‌ చేసేది చెల్లె. నన్ను వెంటనె బయల్దేరి రమ్మనేది. ఒకసారి మా ఎడిటర్‌ పుస్తకావిష్కరణలో ఉన్న. ఫోన్‌ వచ్చింది. ‘నేనిప్పుడు రాలేను రా! వస్తున్న అని చెప్పి మానేజ్‌ చెయ్‌రా..’ అన్న. అట్లనే చేసింది. పొద్దున్నె లేషి చింతల్‌బస్తి నుంచి ఎల్‌బి నగర్‌ తర్వాత ఉన్న చింతల్‌కుంటకు పొయ్‌న. కాని బావ ఇంక లేవలేదు. ఇంట్ల వెయిట్ చేసుకుంట కూసున్న. అతను లేషి బాత్‌రూమ్‌కు పోయిండు. బయిటి కొచ్చి తయారై నన్నసలు పట్టించుకోకుంటనె బయటి కెల్లిపోతున్నడు.
‘పోతున్నవేంది? రమ్మన్నవంట కదా!’ అన్న గట్టిగ. ‘పని ఉంది నాకు’ అనుకుంట పోతున్నడు. నేను బయటికెళ్లి గట్టిగ అన్నా- ‘చెల్లెను కొట్టడం, తిట్టడం షానా చేస్తున్నవంట. చెల్లె కేమన్న అయ్యిందో.. నిన్ను జీవితాంతం వెంటాడుతా.. నిన్ను నిద్ర కూడ పోనివ్వను ఏమనుకుంటున్నవో’ అన్న. 
‘నువ్వేం చెయ్యలేవు నన్ను’ అనుకుంట ఎల్లిపొయ్యిండు.
మల్లొకరోజు నేను ఊర్లో సాయమాన్ల పడుకొని ఉన్న. కల్లు తాగి ఉంటి. అమ్మ, అమ్మమ్మ బయట మంచాలేసుకొని పడుకొని మాట్లాడుకుంటున్నరు. తమ్ముడు ఫోన్‌ తెచ్చి ‘బాబ్భాయ్‌! పడుకున్నవా? ఇదిగో.. చిన్నాపా ఫోన్‌’ అని ఇచ్చిండు. అవతల్నుంచి చెల్లె ఏడుస్తున్నది. ‘తాగి వచ్చిండు. కొడ్తున్నడన్నా’ అన్నది. ‘కొడ్తున్నడా..! ఏదీ ఫోన్‌ అతనికివ్వు. నువ్వు బెడ్‌రూంలో కెళ్లి తలుపు పెట్టుకో.. అస్సలు తియ్యకు ఈ రాత్రి’ అని చెప్పిన! ఫోన్‌ ఇచ్చింది.. ‘ఏందీ ఆయనతో మాట్లాడేది’ అనుకుంటనె ఫోన్‌ తీస్కొని, ‘తీస్కపో మీ చెల్లెను. చెప్పినట్లు ఇంటలేదు’ అంటున్నడు. ‘కొడ్తున్నవంట ఎందుకు? కొట్టడమేంది?’ అన్న. తిట్టడం మొదలుపెట్టిండు. నేను గుడ మాటకు మాట అంటున్న. ఇక ఇద్దరం పెద్ద పెద్దగా తిట్టుకున్నం. మా ఇంటి చుట్టుపక్కలోల్లంతా లేషేటట్లు గట్టిగ మాట్లాడిన. మా అమ్మ దగ్గరికి ఉరికొచ్చి ‘అట్ల తిట్టకురా.. మన పిల్ల అక్కడున్నదాయె.. ఏమన్న చెయ్యగాలె’ అంటున్నది వణికిపోతున్నంత భయంగ.. ‘ఏంది వాడు చేసేది.. ఏమన్న చేస్తే ఊకుంటమా’ అని నేను. కాని అమ్మ అంతగ ఎందుకు భయపడుతున్నదొ అవాళ నాకు సమజ్‌ కాలె.
ఆ రాత్రి ఎంతోసేపు ముచ్చట బెట్టుకుంట అనుకున్నం అందరం- ‘తప్పు అక్కడే జరిగిపోయింది!’ అని.
        ***
50 కిలోమీటర్ల దూరం నుంచి 140 కిలోమీటర్ల దూరానికి ట్రాన్స్ ఫర్ అయి ఉండె చెల్లెకు.  బస్సుల్ల 140 కిలోమీటర్ల దూరం పోవుడు 140 కిలోమీటర్లు రావుడు. దాంతోటి నడుము నొప్పి. ఎక్కడ లేని స్ట్రెయిన్. గ్రేడ్ వన్ కాంట్రాక్టర్ కదా ట్రాన్ఫర్ చేయించుకుంటడు కదా అనే మా అందరి ఆశ అడియాశే అయ్యింది. ఆ విషయం అతడు పెద్దగా పట్టించుకున్నదే లేదు. ఇద్దరికీ గొడవలే సరిపోయేవి. ఒకసారి ఇట్లనె గొడవై ఇంటికి రావద్దన్నడట.. పిల్లల స్కూల్ ఇక్కడ.. తను అక్కడ.. శనివారం ఈవినింగ్ హైదరాబాద్ వచ్చి సాలెహా ఇంట్ల ఉండి పిల్లల్ని పిలిపించుకునేదంట. మల్ల సోమవారం పొద్దున్నె స్కూల్ కు తయారై ఎల్లిపొయ్యేదట.. ఈ సంగతంత నాకు చెప్పనే లేదు!
***
4 జనవరి 2017
మల్లొక పదిరోజులకే తనకు తను ఒక్కోసారి లేవడం గుడ చాత కాకుంటయ్యింది చెల్లెకు. లేవబోయి పడిపోతున్నది. మూత్రం ఆమెకు తెలియకుంటనె ఎల్లిపోతున్నది. మల్ల డాక్టర్‌కు ఫోన్‌ చేసినం. ‘సర్‌, ఇట్ల లేవలేకపోతున్నది. మూత్రం తనకు తెలియకుంటనె పోసుకుంటున్నది’ అంటె అప్పుడా డాక్టర్‌ ‘న్యూరాలజీ ప్రాబ్లమ్‌ ఉన్నట్లుంది. న్యూరాలజిస్టుకు చూపెట్టండి’ అన్నడు. నేను ఆలోచనల పడ్డ.. అంటే ఏమై ఉంటుంది?! మరి ఇన్నాళ్లు ఈ డాక్టర్‌కు ఎందుకు డౌట్ రాలేదు? అప్పటికి తమ్ముడు, మా చిన్నమ్మ బిడ్డ డాక్టర్‌- హనీఫా డౌట్ పడుతున్నా నేనే పట్టించుకోకుండా తప్పు చేశానా?
వెంటనె నల్గొండలో ఉన్న ఒక న్యూరాలజీ డాక్టర్‌ దగ్గరికి తీసుకెల్లినం. తోడు మా ఊరి మాజీ సర్పంచ్‌, నా జిగ్రీ దోస్తు జనార్దన్‌ గుడ వచ్చిండు. ఆ రోజు నేను, మా అమ్మ, మా తమ్ముడు గుడ చెల్లెను సంభాళించలేకపోయినం- ఒక్క దగ్గర కూర్చోకపోవడం, ఊర్కె కుడి చేయి తనకు తెలియకుండనె కదులుతుండడం, ఆ చేతిని మేము పట్టుకొని కూర్చోవాల్సి రావడం, ఇక వెళ్దామనో, ఇంకెంత సేపనో, పిల్లల గురించో.. ఏదో ఒకటి అంటున్నది. మొత్తానికి ఆ డాక్టర్‌ చూసి సిటీ స్కాన్‌ చేయించుకు రమ్మని చెప్పిండు. ఏవేవో రక్త పరీక్షలు గుడ. పక్కన మరో గల్లీల ఉన్న స్కాన్‌ సెంటర్‌కి ఆటోలో తీస్కెల్లినం. స్కాన్‌ చేయించుకోడానికి సతాయించింది. స్కాన్‌ అయిపోయినంక ఆ రిపోర్టు తీసుకెల్లి డాక్టర్‌కి చూపెట్టినం.
స్కాన్‌ రిపోర్టు లైటు బోర్డుపై అంటించి డాక్టర్‌ వివరించి చెప్పిండు- ‘ఇలా చూడండి, మెదడు ఒక్క భాగంలో కాకుండా చుట్టూరా తెల్లగా ఏదో ఆవరించి ఉంది. బహుశా ఇదేదో మెదడు వాపులా కనిపిస్తోంది. లేదా మరేదైనా కావచ్చు. ముందు వెంటనె ఈమెను హైదరాబాద్‌ తీస్కెల్లండి. న్యూరాలజీ స్పెషలిస్టుకు చూపెట్టండి. ఆ తర్వాత వాళ్ల సజెషన్‌ ప్రకారమే నేను ట్రీట్మెంట్ చేయగలను.’ అన్నడు.
నోట మాట రాలేదు నాకు. మరికొన్ని డౌట్స్ అడిగి తెలుసుకున్నం. బైటి కొచ్చినం. అమ్మకు ఏం చెప్పాల్నో సమజ్  కాలేదు. మందులు రాషిండు, ఏం కాదంట లెమ్మని ముందొక అబద్ధం చెప్పినం.
ఇంటికి తెచ్చినం. మెల్లగ చెప్పినం అమ్మకు. లోపల గుబులు పడ్డట్లుంది. పైకి అవునా అన్నది పరేషాన్‌గ. పైసలు కావాలె నని చెబితే మా చిన్నమ్మ, చిన్నమ్మ కొడుకు జానిబాబ యాడనొ కష్టపడి 40 వేలదాంక అప్పు తీసుకొని వచ్చిన్రు సాయంత్రానికి. ఎల్‌బి నగర్‌ల ఉండే మా రెండో బావను అడిగితె ఎవరిదో కారు తీసుకొని వచ్చిండు. ఆ రాత్రి నేను, మా తమ్ముడు మా రెండో బావతో చెప్పుకుంటూ ఏడ్చినం. ‘ఏడుస్తున్నరేంది? ఈదానికే..! ఇప్పుడేమైందని..?!’ అని ఆయన అంటే ‘ప్రాబ్లం షానా పెద్దదేనని సమజైపొయ్యింది బావ..’ అంటూ నేను బాగ ఏడ్చిన. తమ్ముడు గుడ బోరుబోరున ఏడ్చిండు.
***
చెల్లె చదువుతున్న రోజులు. ఒకరోజు నేను నల్గొండ నుంచి వచ్చేసరికి నా కోసమే ఎదురుచూస్తున్నట్లుంది. నేను సైకిల్‌ స్టాండ్‌ ఏసి చూస్తె ఇంకో లేడీస్‌ సైకిల్‌ స్టాండ్‌ ఏసి ఉంది.
‘ఇదెక్కడిది?’ అన్న యాస్మీన్‌ దిక్కు చూసి.
‘నేనే తెచ్చిన’ అన్నది నవ్వు మొఖంతోి.
‘అంటే?! ఎవరిది?’ అన్న.
‘స్కూల్‌లో సైకిల్లు పెట్టే కాడ ఉండె. తాళం ఏసి లేదు. తీస్కొచ్చిన. తీస్కురానయితె వచ్చిన గని, భయమేస్తున్నది బాబ్భాయ్‌!’ అన్నది.
నేను ఆశ్చర్యపోయిన. నవ్వొచ్చింది.. బాధేసింది.
సైకిల్‌ దిక్కు సూషిన. పాతబడ్డ సైకిల్‌.
‘ఏం చేద్దామని తెచ్చినవురా!?’ అన్న నవ్వుకుంట.
‘రోజు స్కూల్‌కు పోవడం కష్టమైతుంది గద బాబ్భాయ్‌! ఇక్కడ రోడ్డు మీద ఎల్లి బస్సు కోసం నిలబడాల్నాయె. నల్గొండల టెలిఫోన్‌ ఎక్సేంజి కాడ దిగి ఆణ్నించి స్కూల్‌ దాంక నడవాల్నాయె. మల్ల వచ్చేటప్పుడు కూడ అంతేనాయె..’
‘అది కరెక్టే గాని ఇప్పుడు ఈ సైకిల్‌ ఏసుకొని మల్ల మీ స్కూల్‌కే పోవాలె కదా..!’
‘అదే.. ఏం చెయ్యాల్నొ సమజైత లేదు.’
‘కొట్టుకొచ్చిందేదో కొత్త సైకిలన్న కాదు కదరా.. ఇప్పుడీ సైకిల్‌ను స్కూల్‌కు ఏస్కుపోతె ఈ సైకిలోల్లు గుర్తు పడతరు కదా..’ అన్న నవ్వుకుంటనె.
చెల్లె నవ్వలేదు.. చేతులు నలుపుకుంట ఆందోళనగ నిలబడ్డది.
ప్చ్‌..! పేదరికం ఎంతటి పనులు చేయిస్తదో.. ఇప్పుడెట్ల.. అని నేను గుడ సోంచాయించుకుంట ఎల్లి కాల్లు చేతులు కడుక్కొనొచ్చి తుడుసుకుంట నిలబడ్డ.
చెల్లె అట్లనె నిలబడి ఉంది.
అనవసరంగ ఆందోళన పడుతున్నట్లున్నదని, ‘వద్దులే షన్ను.. తెచ్చిందేదో తెచ్చినవ్‌.. రేపు మల్ల తీస్కుపొయి ఎక్కడ పెట్టి ఉండెనొ అక్కణ్ణె పెట్టెయ్‌.. వాళ్లు తీస్కెల్లిపోతరు. ఇట్ల దొంగతనం సొమ్ము మనకెందుకులేరా..’ అన్న.
‘సరె’ అన్నది నీరసంగ.
రెండోరోజు తీస్కెల్లి భయం భయంగ జల్ది జల్ది అక్కడ పెట్టేసి క్లాసుకు ఎల్లిపొయిందట. స్కూల్‌ అయిపొయినంక చూస్తె అక్కన్నె ఉన్నదంట సైకిల్‌. అందరు పొయిందాంక చూసిందంట. ఆ సైకిల్నెవరు తీస్కెల్లలె. మల్ల తీస్కొని ఇంటి కొచ్చింది. నాకోసం ఎదురుచూసుకుంట ఉన్నది.
‘ఏమైందిరా!’ అన్న నవ్వుకుంట. తను గుడ హాయిగ నవ్వేసి ‘ఎవరు తీస్కుపోలె బాబ్భాయ్‌! వాళ్లు నిన్ననె వెతికి ఆశ వదులుకున్నరేమొ’ అన్నది.
‘సరేలే’ అని ఇగ అయాల దాని రూపురేఖలు కాస్త మార్చిపడేసినం.
ఐదారేళ్లు ఆ పాత సైకిల్‌ మీదనె స్కూల్‌కు, తర్వాత కాలేజుకు వెళ్లింది చెల్లె.
*
‘చెల్లా! ఇప్పుడు గుడ ఈ గండంల నుంచి ఏ దొంగతనమో చేసి బైటపడి పోరాదురా..!’ అనుకున్న గుడ్లనీల్లు కమ్ముకుంటుండంగ.
***
5 జనవరి 2017
తెల్లారి రెండో బావ మాట్లాడుకొచ్చిన కార్‌లో చెల్లెను హైదరాబాద్‌ తీస్కొచ్చినం- షోని, అమ్మ, నేను.
దారిలోనే మంచి న్యూరాలజిస్టు డాక్టరెవరో కనుక్కోబట్టిన. ఒక దోస్తుకు, మరొక డాక్టర్‌ దోస్తుకి ఫోన్లు చేసి మలక్‌పేటలో ఒక డాక్టర్‌ దగ్గరికి పోవాలని నిర్ణయించినం. దగ్గరికి పోతుంటె చెల్లెకు పెద్ద వాంతి అయ్యింది. హమ్మో అనుకున్న. ఇంకా సీరియస్‌ అవుతున్నట్లు అనిపించింది. తను కూర్చున్న చోటు నుంచి లేవలేకపోతున్నది. కార్ల నుంచి డాక్టర్‌ దగ్గరికి తీస్కెల్లడానికి కష్టమైంది. ఆ డాక్టర్‌ చూసి సిటీ స్కాన్‌ టేబుల్‌పై విసిరేస్తు కసురుకున్నడు. ఇందులో ఏం తెలుస్తుంది. ఎమ్మారై టెస్టు, మల్లొక సిటీ స్కాన్‌ చేయించుకుని రండి అని పంపేసిండు. వాడిపై కోపమొచ్చింది. కసురుకొనడ మేందని.
మలక్‌పేట్ విజయా డయాగ్నస్టిక్‌ సెంటర్‌కి పోతె స్కాన్‌ మెషీన్‌ రిపేర్‌లో ఉందన్నరు. బైటి కొచ్చి ఎక్కడికెళ్లాలని తర్జనభర్జన పడుతుంటె తమ్ముడు విసిగిపోయి ‘బాబ్భాయ్‌! ఇదంతా కాదు, కామినేనిలో జాయిన్‌ చేసేద్దాం’ అన్నడు. అమ్మ ఏమంటదో అని అడిగితె అంతే చేద్దామన్నది. ఇక తీస్కెల్లిపోయి జాయిన్‌ చేసేసినం. అక్కడ  ఒక కవిమిత్రుడు డాక్టర్‌గ పనిచేస్తున్నడు. ఆయన వచ్చి జాయిన్‌ చేయించి పోయిండు.
ఎమర్జెన్సీలో ఉంచితే ఒక్కో డాక్టరు, జూనియర్‌ డాక్టర్లు రావడం, రకరకాల ప్రశ్నలు అడగడం, చెల్లెను ఇటు చూడమని, అటు చూడమని, చేయి లేపమని, కాలు లేపమని నానా రకాల హింస. ‘అరె, ఆమెకు అసలే బాలేదు, ఇంతమంది ఇలా వేరు వేరుగా అడగడమేంద’ని నేను.
మొత్తానికి ఆ సాయంత్రానికి ఒక స్పెషల్‌ రూంలోకి మార్చిన్రు.
ఈలోపు మా బావకు కాల్స్‌ చేస్తే లేపడం లేదు. మెసేజులు పెడుతున్నా. బావకు ఇంత సీరియస్‌ అని సమజయ్యే చాన్స్‌ లేదు.
డిప్రెషన్‌ అని చెప్పినప్పుడు ఒకరోజు వచ్చిండు బావ. నేను పోయి కూర్చొని విషయం చెప్పిన. చెల్లెను దగ్గరికి తీస్కొని ‘నేనున్న గదా.. పరేషాన్‌ ఎందుకైతున్నవ్‌’ అని దైర్యం చెప్పిండు చెల్లెకు. ‘నువ్వు అన్ని పట్టించుకుంటె ఇట్లెందుకైత నేను’ అననే అన్నది చెల్లె. నేను గుడ మనసుల అదే అనుకుంట అతని దిక్కు చూస్తున్న. తడబాటుగ నా దిక్కు సూషిండు. నేను లేషి వచ్చేసిన. ఆ రాత్రి ఉన్నడు అతను. అతనున్నందుకు మా అమ్మ మా ఇంట్లనె పడుకుంది. ఆ రాత్రి అతను పరేషాన్‌ అయినట్లుంది. ఎల్లినంక ఒకరోజు కాల్‌ చేస్తే ‘నేను వస్తే మామి (అత్తమ్మ) ఇక్కడ పడుకోదు కదా.. యాస్మీన్‌ మధ్యరాత్రే లేషి తిరుగుతున్నది. నేనేమో నిద్రల ఉంటున్న. అందుకే వస్త లేను’ అన్నడు.
***
కామినేని హాస్పిటల్‌లో ఆ రాత్రి స్పెషల్‌ రూంలో చెల్లెతో పాటు నేను, రెండో చెల్లె పడుకున్నం. మమ్మల్ని ఒకటె మాట్లాడిస్తుంది చెల్లె. ఒకటె మాట్లాడుతనే ఉంది. పడుకోడం లేదు. పక్కన కూసున్నం. కుడి చేయి పట్టుకొని. పడుకోమ్మా.. ఎందుకిలా చేస్తున్నవ్‌. బాడీకి రెస్ట్‌ అవసరం కదా.. అని ఎన్నెన్నో రకాలుగా సమ్జాయిస్తున్న నేను.
ఊర్కె ఏదేదో మాట్లాడుతుందని మా సాలెహా ‘లాయిలాహ ఇల్లల్లాహ.. మహమ్మదుర్‌ రసూలిల్లహ్‌’ అని చదివించడం మొదలుపెట్టింది. సాలెహాకు రెస్ట్‌ ఇద్దామని, పడుకొమ్మని చెప్పి నేను పక్కన కూసున్న చెల్లె చేయి పట్టుకొని. పడుకొమ్మని బుజ్జగిస్తె కాసేపు పడుకున్నట్లు చేసి ఒక్కసారిగ, ‘పడో బాబ్భాయ్‌ పడో..’ అంటు నన్ను చదవమని స్కూల్లో పిల్లల్ని గదమాయించినట్లు అంటున్నది. నాతోని ‘లాయిలాహ ఇల్లల్లాహ..’ చదివించబట్టింది. కాసేపటి తరువాత నాకై చూడకుంటనె అన్నది- ‘నువ్వు నన్ను ఏదైనా రాయమని అనేటోడివి కదా బాబ్భాయ్‌! రాయలేకపోయిన. ఇక రాయలేనేమో బాబ్భాయ్‌! ఇక రాయలేను..’ అన్నది.. 
‘నీకేం కాదురా.. మల్ల మంచిగైనంక రాద్దువు లే’ అన్న.
‘లేదు బాబ్భాయ్‌! నేను షానా అలిసిపోయిన బాబ్భాయ్‌! షానా అలసిపోయిన.. ఇక నా వల్ల కాదు..’ అంటుంటె నా కళ్లల్లో నీళ్లు. ఏదో సమ్జాయిస్తున్న. కనీ, అది నిజమేనా ఏందని అనిపించబట్టింది.
మళ్లీ మళ్లీ అనుకున్న.. అక్కడె తప్పు జరిగిపోయింది!
‘నేను రాయలేనిక.. నువ్వు రాయి బాబ్భాయ్‌! తుమె లిఖో.. తుమేచ్‌ లిఖ్‌నా..’ అంటున్నది గట్టిగ చెల్లె !
ఆ రాత్రి నిద్దర లేదు మా ఇద్దరికి. తెల్లారగట్ల పక్క ఏదొ తడిగా అనిపిస్తున్నది సూడమంటె సాలెహా చూసి నెలసరి కూడా వచ్చింది కదన్నా! అన్నది. పోయి డిస్పెన్సరి వాడిని లేపి డైపర్స్‌ తెచ్చి యిచ్చిన, రెండు రకాలుగా పనికొస్తయని. నేను పోయి వచ్చినంతల సాలెహాను పరేశాన్‌ పరేశాన్‌ చేసిందంట. ‘బాబ్భాయ్‌ ఏడి? ఎక్కడికి పొయిండు? ఇక్కడే ఉండాలె బాబ్భాయ్‌! ఎక్కడికి పోవొద్దు’ అనుకుంట.
ఆ రోజు ఎన్నో టెస్టులు.. అన్నింటికీ నేను తోడున్న. నేనుంటె జర నిమ్మలంగుంటున్నది.. వేరే ఎవరున్నా వాళ్ల మాట వింటలేదు. వాళ్లను సతాయిస్తున్నది అడిగిందే అడిగి..
***
తమ్ముడు ఊర్లో చెల్లె బీరువాలు వెతికి దొరికిన సొమ్ములు బ్యాంకుల రహను బెట్టడానికి తిరుగుతుండు.  మా దోస్తు జనార్దన్‌ ఆ పని చూస్తున్నడు.
అప్పటికి నా దగ్గర పెట్టిన పైసలు కొన్ని కట్టిన హాస్పిటల్‌ల. టీచర్ అయినప్పటికీ హెల్త్ కార్డు నడవలేదా హాస్పిటల్ల.
చెల్లెను ఎమ్మారై స్కాన్‌కు తీస్కుపోతె ఎంట ఎల్లిన. లోపల చెల్లెను కదలకుంట పట్టుకొమ్మన్నరు. పెద్ద సౌండ్‌. మద్యల చికాకు పడుకుంట కదులుతున్నది. నేను పట్టుకొని నిలబడ్డ. ‘షన్నూ! కొద్దిసేపు కదలకుంట ఉండాలె’ అని మల్ల మల్ల అనుకుంట నిలబడ్డ. వింటలేదు, తల అటు ఇటు కదిలించబోతున్నది. గడ్డం పట్టుకున్న. ఎంతోసేపటికి ఆ స్కాన్‌ అయ్యింది..
మా బావకు ఫోన్‌ల మీద ఫోన్లు చేస్తున్న. అతను ఇంకా రాకపోవడం నాకు ఆశ్చర్యంగ అనిపిస్తున్నది. ఇప్పుడన్న అతన్ని రప్పించి అన్నీ అతనికి తెలిసేలా చేయాల్నని నా పట్టుదల.
మల్ల ఎమ్మారై స్కాన్‌.. ఏదో అంటరు దాన్ని.. అప్పుడు మత్తుమందు ఇచ్చి చేసిన్రు. కదులుతుందని. స్కాన్‌ అయ్యాక రూంకి తీసుకొచ్చిన్రు. చాలా ఎక్కువసేపు స్పృహలోకి రాలేదు. ఆ మత్తు ఎక్కువసేపు ఉండింది. ఎడమ చేయి పనిచేయడం మానేసింది! కదిలిస్తేనే కదులుతున్నది. కుడిచేయేమో ఆగకుండా ఊర్కె ఆడుతూనే ఉంది.
       ***
7 జనవరి 2017 శనివారం
బయాప్సి చేయాలని అందుకు 70 వేలవుతాయని చెప్పిండు డాక్టర్‌. మరొక విషయం చెప్పిండు, పరేషానైనం- నిన్న ఎమ్మారై స్కాన్‌కు మత్తు ఇస్తేనే చాలా ఎక్కువసేపు స్పృహలోకి రాలేదు. ఎడమ చేయి పనిచేయడం మానేసింది. బయాప్సికి కాస్త ఎక్కువ మోతాదులో ఇనెస్తీషియా ఇవ్వాల్సి ఉంటుంది. మరి మల్లి స్పృహలోకి వస్తుందా.. కోమాలోకి వెళ్లిపోతుందా.. చెప్పలేమన్నడు. బైటి కొచ్చి మా బావ, అతని ఫ్రెండ్స్‌తో చెప్పిన, పిల్లలను పిలిపించమని, మల్లి ఇక చెల్లె స్పృహలోకి వస్తుందో లేదోనని అనుకుంట పెద్దగ ఏడ్చిన.
స్పృహలోకి వస్తుందో రాదో ఏంటని మా బావ అతని ఫ్రెండ్స్‌, అతని అన్న, తమ్ముడు వేరే హాస్పిటల్‌కి మార్చుదామని, అక్కడైతే హెల్త్‌ కార్డు నడుస్తుందని తర్జనభర్జనలు పడుతున్నారు. అవాళ శనివారం. ఏదో ఒకటి చెప్పమని డాక్టర్ల నుంచి వత్తిడి. 70 వేలు కట్టాలి. మా బావ వాళ్లు ఎటూ తేల్చుకోలేకపోతున్నరు. ఫలానా హాస్పిటల్‌.. ఫలానా హాస్పిటల్‌ అంటూ చర్చలు చేస్తున్నరు. ఈలోపు డాక్టర్‌ నన్ను పట్టుకొని ‘పేషంట్ పరిస్థితి విషమంగ ఉంటే మీరు మరో హాస్పిటల్‌కి మార్చాలని ఆలోచిస్తున్నారట ఏమిటి? మా మీద నమ్మకం లేదా?’ అని అడిగాడు. ‘అలా కాదు సర్‌, హెల్త్‌కార్డు నడుస్తుందేమోనని వాళ్లాయన ఆలోచిస్తున్నాడు సర్‌’ అన్నాను. ‘త్వరగా నిర్ణయం తీసుకోండి, 5 గం.ల లోపల చెబితే రేపు పొద్దునకి అరేంజ్‌ చేస్తాం. లేదంటే సోమవారమే’ అన్నడు. ఆ విషయం మా బావ వాళ్లకు చెప్పిన. ‘ఎక్కడికి మార్చినా మల్లి మొదటి నుంచి టెస్టులు చేస్తరు బావా! ఇంకా లేట్ అవుతుంది. మనం లేట్ చేస్తే రేపు ఆదివారం, ఎక్కడా ఏ పనులూ జరగవు’ అని. చివరికి బయాప్సికి ఓకే చెప్పమన్నరు. నేను పరుగెత్తుకుంట పోయి నర్సులకు ఓకే చెప్పిన. ఆ హాస్పిటల్‌లో తిరిగి తిరిగి, నడిచి, పరుగెత్తి నా పాదాల భాగం నొప్పి పెడుతూ నడవనీయడం లేదు. నీరసంగా ఉంది. దుఃఖంగా ఉంది.
ఆ రోజు ఫేస్‌బుక్‌లో ఒక పోస్టు పెట్టిన. తల్లిని చూడడానికి పిల్లలకు అనుమతినివ్వండి సార్ అని దీనంగా డాక్టర్‌ను అడిగానని. అది చూసి నా దోస్తులంతా పరేషానయిన్రు. ఒక తమ్ముడు ఫోన్‌ చేసి ఆ రాత్రి నన్ను కలవడానికి వచ్చిండు మందు తీస్కొని. తట్టుకోలేక బాగ తాగేసిన ఆరోజు.
***
8 జనవరి 2017 ఆదివారం
చెల్లెకు బయాప్సికి తీసుకెళ్లాలి. పిల్లలు వచ్చిన్రు. మమ్మల్ని గుర్తుపట్టడానికి ఇబ్బంది పడుతున్నట్లు అనిపించింది గాని పిల్లలను సూడంగనె దగ్గరికి తీసుకొని వారి ముఖాలు తడుముతుంటే ఏడుపొచ్చింది. తర్వాత వారిని పంపేసినం. 
చెల్లెకు గుండు చేసిన్రు. ఎన్నడూ చేయించినట్లు గుర్తులేదు. అలా చూడలేక తలచుట్టూ ఒక చున్నీ చుట్టినం. రంగులు రంగులుగ బాగుంది. అట్ల ఒక ఫోటో తీసి ఫేస్బుక్ ల పెట్టిన. బయాప్సికి తీసుకెల్లిన్రు. నేను వెంట పొయిన. ఒక హాల్‌లోకి తీసుకుపొయి తన తలకు ఏవేవో బిగిస్తుంటే అద్దంలోంచి చూసుకుంట బయట నిలబడిపోయిన. ఎహె అని విసుక్కున్నది ఒకసారి. లోపలికి తీసుకెళ్లిపోయిన్రు.
తమ్ముడికి జాగ్రత్తలు చెప్పి నేను నల్గొండల బహుజన రచయితల సంఘం మీటింగుంటె పోయి వచ్చిన. సాయంత్రమైంది. హాస్పిటల్‌ వెళ్లి చెల్లె దగ్గరికి పొయిన. నన్ను చూడంగనె మొఖంపై ఒక్కసారిగ నవ్వు వచ్చేసింది, కాని.. ‘ఎట్లున్నవు రా…!’ అన్నది పెద్దగ. నేను షాక్‌ అయిన. అంటే నన్ను గుర్తుపట్టడం కూడా లేదా..! అని. స్కూల్లో పిల్లల్ని పలకరించే పలకరింపు అది. దగ్గరికెళ్లి ఎట్లున్నవని నేనే అడిగిన. ఏం మాట్లాడలేదు. సైలెంటయిపోయింది. కుడిచేయి గింజుకుంటున్నది. ఆ చేతిని బెడ్‌కి కట్టేసిన్రు సిస్టర్స్‌. ఎంతోసేపు నిలబడిపోయిన చెల్లెను చూసుకుంట. చేయి అలా ఊరికె అనకురా.. నొప్పి లేస్తదన్న. ఆ విషయం పట్టించుకోడం లేదు చెల్లె. తనకు, సిస్టర్స్‌కు జాగ్రత్తలు చెప్పి బయికొచ్చిన. దుఃఖమొచ్చింది.
‘డాక్టర్‌ కలిసిండు. నార్మల్‌ ఇనెస్తీషియానే ఇచ్చి బయాప్సి చేశారు. త్వరగానే స్పృహలోకి వచ్చింది. పరవాలేదు, అబ్జర్వేషన్‌లో పెట్టాం. చూద్దాం రేపు’ అన్నాడు. సరేనని సాలెహా ఇంటికొచ్చిన.
అద్దరాతిరి హాస్పిటల్‌ నుంచి ఫోన్‌ వచ్చింది. ఒకసారి రమ్మని. ఎవరినీ లేపకుండ సాలెహా కొడుకును రమ్మని బండి మీద పొయిన. డాక్టర్స్‌ కౌన్సిలింగ్‌ రూంలోకి పిలిచిన్రు. నలుగురు జూనియర్‌ డాక్టర్లు వచ్చిన్రు. నన్ను కూర్చొబెట్టి చెప్పిన్రు. ‘మీ సిస్టర్‌ కండిషన్‌ వెరీ సీరియస్‌. ఐసీయూలో పెట్టాల్సి ఉంటుంది. మీరు పెట్టమంటే పెడతాం’ అన్నారు. ‘ఏంటి పరిస్థితి’ అడిగిన. ’కష్టమే’ అని చెప్పిన్రు. మనసుకి కష్టమైంది. డిస్టర్బ్ అయిన. కాసేపటికి సంభాళించుకొని డౌట్స్  అడిగిన. వాళ్లు ఓపికగా చెప్పిన్రు. ఐసీయూలో పెట్టమని చెప్పి బయటికొచ్చిన. దుఃఖం తన్నుకొచ్చింది. ఏడుస్తూ సాలెహా ఇంటి కొచ్చిన. అమ్మ, తమ్ముడు, తమ్ముడి పిల్లలు, మరదలు, రెండో చెల్లె, బావ, వాళ్ల పిల్లలు అందరూ పండుకొని ఉన్నరు. ఎవరినీ లేపలేదు. బావగాడికి ఫోన్‌ చేసి చెప్పుదునా.. బాగ తాగి పండుకొని ఉంటడు. నిద్రపోనీ -అనుకున్న. నాకు నిద్దర పట్టలేదు…
తెల్లారితే ఏం వినాల్సి వస్తుందో.. నని టెన్షన్‌గ ఉన్నది. ఎట్లాంటి నా చిట్టితల్లికి ఎట్లాంటి కష్టమొచ్చిందీ.. పోయి పోయి మెదడుకే ఇలా జరగాల్నా.. మెదడు క్యాన్సర్‌ కాకపోతె ఎట్లనన్న తప్పించుకునేది కదా.. ఇప్పుడెట్ల..
పిల్లలంటె ఎంత ఆరాటపడ్డవురా చెల్లా.. సనా! పండూ! అంటు అనుక్షణం నీ నోటి నుంచి ఇవే పేర్లు.. ఇప్పుడు వాళ్లను ఏం చేయబోతున్నవ్‌ రా.. తల్లి లేని పిల్లల్ని చేస్తవా! అయ్యో.. చెల్లా!
పదిరోజుల కిందనుకుంట- టీవీ చూస్తున్న పిల్లల్ని వార్తలు పెట్టమన్నవట- ‘ఆఁ.. నీకేమర్ధమైతది’ అని కసురుకున్నడట నీ కొడుకు! నువ్వు మౌనమైపొయినవంట. ప్చ్‌! అది విని నా మనసు ఎంత తల్లడిల్లిపొయ్యిందో..
పిల్లలు పిల్లలు అని నీ మెదడును ఇంతగా పాడు చేసుకుంటి వేందిరా చెల్లా.. ప్చ్‌.. తండ్రి ఉంటాడో ఊడతాడో తెలియదని వాళ్లకు వీలైనంత సంపాయించి పెట్టాల్నని ఎంత పీసుగా మారావో.. ఆ పీసుతనంతోటి గుడ ఇంతదాక తెచ్చుకున్నవు.. ఎప్పట్నుంచొ తలనొప్పి వస్తుంటె సరిగ చూపెట్టుకోకపోతివి. సిటీ స్కాన్‌కి ఎక్కువ పైసలైతయని వాయిదా వేస్తివి.. తోడు బావ ఉంటె.. అతను ఈ విషయాల్ని పట్టించుకొని ఉంటే పరిస్థితి వేరుగ ఉండేది. కాని …
***
తెల్లారి హాస్పిటల్‌కి తయారయ్యేలోపు హాస్పిటల్‌ నుంచి ఫోన్‌. జల్ది జల్ది పొయ్‌న. డాక్టర్‌ వెయిటింగ్‌ అన్నరు. ఆయన చాంబర్‌లోకి వెళ్లిన.
‘రాత్రి యాస్మీన్‌ కండిషన్‌ సీరియస్‌ అయిపోయింది. రాత్రి మీరు ఓకే అన్నాక ఐసీయూ లోకి మార్చారు. కాని లాభం లేదు. సారీ.. హోప్స్‌ లేవు. అలా ఉంచితే రోజుకు ఐసీయూ ఖర్చు తప్ప మరే లాభం లేదు. ఒకటి రెండు రోజులు తప్ప తను బతకదు. ఇంటికి తీసుకెళ్లడం మంచిది’ అన్నడు.
నాకు ఏం మాట్లాడాలో సమజ్‌ కాలే. ‘బతికే అవకాశం ఎంత పర్సెంటేజీ ఉంది సార్‌ ఇంకా?’ అన్న. ‘జీరో పర్సెంటేజీ కూడా లేదు. లిమ్ఫోమా అనుకుంటున్నాం. చాలా బ్యాడ్‌ క్యాన్సర్‌. అది చిన్న మెదడులోకి కూడా స్ప్రెడ్‌ అయిపోయింది. ఇక నో చాన్స్‌’ అన్నడు.
నాకు మాటలు రాలేదు. స్తబ్దుగ కూసున్న. కాసేపటికి సంభాళించుకొని ‘ఇలాంటి పరిస్థితుల్లో ఎంత శాతం మంది ఇంటికి తీసుకెళ్లిపోతారు సర్‌?’ అని అడిగిన.
ఇలాంటి ప్రశ్న ఆ డాక్టర్‌ని ఎవరూ అడిగి ఉండరేమో.. కాసేపు ఆలోచించి ‘ఒక 30 పర్సెంటేజీ తీసుకెళ్తారు. వారిలో డాక్టర్స్‌ ఫ్యామిలీస్‌, ఎడ్యుకేటర్స్‌ ఉంటారు. 70 పర్సెంటేజీ తీసుకెళ్లరు’ అన్నడు. బయటికొచ్చేసిన. బావకు ఫోన్‌ చేసి చెప్పిన. ‘అదేంది, అట్లెట్లా.. నేను వస్తున్నా’ అన్నడు.
నేను చెల్లె దగ్గరికి పొయిన. ఆక్సిజన్‌ పెట్టి ఉంది. ఊపిరి కాస్త కష్టంగా తీసుకుంటున్నట్లుగా ఉంది. కండ్లు అరమోడ్పుల్లా ఉన్నై. దగ్గరికి పోయి నుదుటిపై చేయి వేసి నిమిరి కండ్లనిండ నీళ్లు నిండంగ అట్లనె చూసుకుంట ఎంతోసేపు నిలబడ్డ. ‘బయటికి వెళ్లాలి సర్‌’ అని సిస్టర్స్‌ అంటే కదిలి వెనక్కి మల్లి చూసుకుంట చూసుకుంట బయటికొచ్చిన.
కాసేపటికి బావ వచ్చిండు. మల్ల డాక్టర్‌ దగ్గరికి తీసుకెల్లిండు. డాక్టర్‌ నుంచి అదే జవాబు. తీసుకెళ్లడం మంచిదని.
బయట మా బావ ఫ్రెండ్స్‌, అన్న, తమ్ముడు ఎన్నెన్నో చెప్తున్నరు. వేరే హాస్పిటల్‌కు మారుద్దామని. నేను దేనికీ రెస్పాండ్‌ కాలేదు. ఏమంటవ్‌ నువ్వు అని వాళ్ల అన్న అడిగిండు నన్ను. ఇంటికి తీసుకెల్లిపోదాం అన్న నిర్వేదంగ. అందరు నిశ్చేష్టులుగా ఉండిపోయిన్రు కాసేపు.
ఈలోపు మా బావ మా చెల్లె దగ్గరికి పోయి వచ్చిండు. ‘కదలిక ఉంది. చూస్తుంది. మల్లొకసారి అడిగివద్దాం పద డాక్టర్‌ను’ అని మల్లీ తీసుకెల్లిండు. మల్లీ సేమ్‌.
‘కదలిక ఉంటుంది. చూస్తుంది. కాని ఒకటి రెండు రోజుల కన్నా ఎక్కువ బతికే అవకాశం లేదు. మహా అయితే మరొక రోజు’ అన్నడు డాక్టర్‌. ‘అవసరమైతే వెళ్లి మీ డౌట్స్ నివృత్తి చేసుకోడానికి రేడియేషన్‌ స్పెషలిస్ట్‌ ను కలిసి అడగండి’ అన్నాడు.
వెళ్లాం. చాలాసేపటికి దొరికిండు. పిలిచి మా బావను కూర్చోబెట్టి చెప్పిండు- ‘ఆమె పరిస్థితి వెరీ సెన్సిటివ్‌. మెదడంతా క్యాన్సర్‌ కణాలు ఆవరించాయి. అంటే మెదడు మొత్తానికి రేడియేషన్‌ ఇవ్వాల్సి ఉంటుంది. కాని రేడియేషన్‌కి తట్టుకునే స్టేజ్‌లో ఆమె లేదు. రేడియేషన్‌ చాలా పవర్‌ఫుల్‌. రేడియేషన్‌ గదిలో పేషంట్ ఒక్కరినే ఉంచి ఎవరూ ఉండకుండా తలుపు పెట్టేస్తాం. ఆమె తట్టుకునే స్టేజ్‌లో లేదు. బతికే అవకాశం అస్సలు లేదు. తీసుకెళ్లిపోండి ఇంటికి. తీసుకెళ్లే ముందు మాట్లాడుకోండి. మీ ఇటువైపు, అటువైపు పెద్దలకు ఈ విషయం అర్ధం చేయించి తీసుకెళ్లండి. లేదంటే డబ్బులు పెట్టలేక ఇంటికి తీసుకొచ్చేశారు అనే పేరు రావచ్చు. తర్వాత ఎవరైనా గొడవ చెయ్యొచ్చు..’ అంటూ వివరించిండు ఆ డాక్టర్‌. నీరసంగా బైటి కొచ్చినం.
వాళ్లెటూ తేల్చుకోలేకపోతున్నరు. నేను వాల్ల నిర్ణయం కోసం చూస్తున్నా. మా తమ్ముడికి ముందే చెప్పిన ఫోన్‌ చేసి. వాడికి నోట మాట రాలేదు. వాడు ఇక హాస్పిటల్‌ వైపు కూడా రాలేదు. సాలెహా ఇంట్లనె ఉండిపొయ్యిండు. మా అమ్మకు విషయం ఎలా చెప్పాలో అర్దం కాట్లేదు. పెద్ద చెల్లెకు కాల్‌ చేసి చెప్పిన. పరిస్థితి ఇదిరా.. ఎట్ల చేద్దాం అని. తను షాక్‌ అయింది. తయారైతున్నదంట రాడానికి. ఇద్దరం ఏడ్చుకున్నం. తేరుకున్నంక అమ్మను ఇంటికి ముందే పంపేయడం మంచిదని అనుకున్నం. అమ్మకు భూతవైద్యుడి దగ్గరికి పోవాలని ఉంది ఆ రోజు. కాబట్టి ‘నువ్వు నల్గొండకు వెళ్లు.. పోతూ పోతూ అతని దగ్గరికి వెళ్లి ఇంటికెళ్లు. మల్ల రేపు వద్దువు లే’ అని చెప్పమని చెప్పింది పెద్ద చెల్లె. ఇట్ల చెప్పడమే కరెక్టని అమ్మకు అట్లనే చెప్పిన. సరేనన్నది. మా అల్లుడిని ఇచ్చి ఆమెను బస్సెక్కిస్తానికి పంపించేసిన.
మా బావ వాళ్ల బ్యాచి నన్ను చాయ్‌ తాగడానికి తీస్కపొయిన్రు. వద్దని కూర్చున్న. వాళ్లు తర్జనభర్జన పడుకుంట, మరేమంటవని నన్ను మల్ల అడిగిండు వాళ్ల అన్న. ‘నా నిర్ణయమైతే ఇంటికి తీసుకెళ్లడం. ఇక మీ ఇష్టం’ అన్న. వాళ్లు చివరికి సరే అన్నరు. మరి నేను వెళ్లి డిశ్చార్జి చేయమని చెప్పాల్నా అని అడిగిన. ఓకే అన్నంక కదిలిన. పోయి డాక్టర్‌కి చెప్పేసిన. డబ్బులవీ కట్టి బయటపడేసరికి రాత్రయ్యింది.
ఒక అంబులెన్స్‌లో చెల్లెను పడుకోబెట్టిన్రు. పైసలిచ్చి హాస్పిటల్‌ తెల్లని బెడ్‌షీట్లనే ఉంచేసినం. ఆక్సిజన్‌ బుగ్గ ఒకటి రెండు చేతులతో వత్తుకుంట ఒకరు కూర్చోవాలి. నేను కూర్చున్న. కాళ్ల కింద ఆక్సిజన్‌ సిలండర్‌. షాహీన్ ముందు కూర్చున్నది. సాలెహా ఇంటికి పోనిచ్చి అక్కడ తమ్ముడిని వెంట తీసుకొని కేశరాజుపల్లి బయలుదేరినం. తమ్ముడు ఆక్సిజన్ బుగ్గ వత్తుకుంట కూసున్నడు. సాలెహాకు గాని, నాజియాకు గాని విషయం చెప్పలేదు.
ఆ నిశ్శబ్దపు చీకిని చీలుస్తూ అంబులెన్స్‌ వెళ్తున్నది. అందులో బలహీనంగా కొట్టుకుంటున్న చెల్లె గుండె.. వేగంగా కొట్టుకొంటున్న మా అన్నాదమ్ముల గుండెలు.. షాహీన్ గుండె. 
‘చెల్లా! ఏమాలోచిస్తున్నవ్‌ రా..’
చెల్లె దిక్కు చూస్కుంట మనసుతో చెల్లెతో మాట్లాడుతున్న- 
‘..ఏం జరిగింది నాకు.. నా ఇన్నాళ్ల పోరాటం.. ఆరాటం అన్నీ ముగిసిపోతున్నాయా.. ఏం లాభం ఇంతగా తన్లాడి..’ అనుకుంటున్నవా చెల్లా! నువ్వు చదువుకుంటా నంటు చేసిన పోరాటంలో నీకు తోడున్నా..  కష్టం.. దుఃఖం.. సుఖం.. సంతోషం.. నీ ప్రతీ మలుపు దగ్గరా నాతో అన్నీ చెప్పుకునేదానివి.. అన్నీ వింటుండేవాడిని గదా.. ఇయాల ఏం చెప్పలేకపోతున్నవేందిరా..
చదువు.. ఉద్యోగం.. ప్రేమా.. పెళ్లి.. ప్రేమ లేమి.. పిల్లలు.. వాళ్ల భవిష్యత్తు భయం.. ఎన్ని అగాధాలు దాటినవో.. ఎన్నెన్ని హింసలు పడ్డవో.. నీ మనసేం వేదించేదో.. ఎన్ని దీర్ఘరాత్రుల చీకటో నీ దేహం నిండా.. ఒక్కదానివే ఆలోచించీ ఆలోచించీ మనసుకు ఎంత పెద్ద గాయం చేసుకున్నవేందిరా..
***
ఇంటికి తీసుకొచ్చినం. వచ్చే ముందే తమ్ముడు మా చిన్న మామకు విషయం సమ్జాయించిండు. ఆయన వచ్చి ఉన్నడు. మా చిన్నమ్మ కొడుకు, చిన్నమ్మ ఉన్నరు. చెల్లెను తన ఇంట్లకు చేర్చినం. మా బావ అతని ఫ్రెండ్స్‌ వచ్చిన్రు. పొయిన్రు. నేను తమ్ముడు, మా చిన్నమామ కూసున్నం. తెల్లారబోతున్నదాంక మా చిన్నమామ ఆక్సిజన్‌ బుగ్గ వత్తుకుంట కూసున్నడు. తెల్లారగట్ల వచ్చి నన్ను లేపి తను పండుకున్నడు. నేను ఎల్లి కూసున్న. 
ఆ తెల్లారి రోజంతా మా ఊరు ఊరంతా కదిలి వస్తనే ఉంది చూసి పోడానికి. చెల్లె స్కూల్‌ టీచర్లు, పిల్లలు వచ్చిన్రు. పిల్లలు చెల్లెను చూసి ఒకటే ఏడుపు.. టీచర్ల ఏడుపు… ఆ టీచర్లు ‘యాస్మీన్‌! యాస్మీన్‌! మేడమ్‌! మేడమ్‌! యాస్మీన్‌ మేడమ్‌!’ అని పిలుస్తుంటె వాళ్లవైపు చూస్తున్నది చెల్లె. కండ్ల చివరల నుంచి కన్నీళ్లు కారిపోయాయ్‌! అది చూసి కదిలిపోయినం అందరం..!
***
ఆ ఇద్దరు వచ్చినప్పుడు మాత్రం లోపల మంటగా ఉండింది నాకు-
ఒకామె చూసి వెళ్తూ కండ్లనీల్లు పెట్టుకొని- ‘ఆఖరి ఘడియల్లో ఉంది బేటా! ఇట్లయితదనుకోలే.. ఎంత గట్టి పిల్ల.. ఇట్లయిపాయె..’ అన్నది.
నేనట్లా ఆమెకై చూస్తూ ఉండిపొయిన- ‘నీ ఇంటిదాంక వచ్చి నిన్ను నిలదీసి అడిగింది కదా.. అప్పుడు ఏమేం చెప్పి తప్పించావో గుర్తు రాట్లేదా తల్లీ నీకు..!? నీ కొడుకు నా చెల్లెను ఇష్టపడ్డా నువ్వు అడ్డంపడి నీ అన్నబిడ్డకు ఇచ్చి చెయ్యాల్నని నా చెల్లెకు అన్యాయం చేశావే.. ఈ పాపంలో నీకూ భాగం ఉంది.. ఆ పాపం నువ్వు చచ్చిందాంక నిన్ను వెంటాడుతుంది లే!’
రెండో ఆమె మొగుడితోపాటు కార్లో వచ్చి, చెల్లెను చూసి వెళ్లింది. ఆమెను చెల్లెను చూడనివ్వకుంట ఎనక్కు పంపించేయాలనిపించింది.. ఉగ్గబట్టుకున్న. ఈమె గురించే పెళ్లయిన కొత్తల్ల పంచాయితీ పెట్టించింది! పెళ్లయినంక గుడ మా బావగాన్ని తన కనుసన్నల్లో నడిపిస్తు చెల్లెను ఎంతగనం సతాయించిందో ఈ మహాతల్లి.. ‘చెల్లెను వేపుకు తినీ తినీ సగం తన మనసును పాడు చేసింది నువ్వే కదా తల్లీ! చెల్లె ఇట్లా సగంలోనే జిందగీ ముగించాల్సి రావడంలో నీ వంతు పాపం నిన్ను మరవనివ్వదులే!’ అనుకున్న.
***
నాకొక గిల్టీ మిగిలిపొయింది.. డిప్రెషన్‌ అనుకొని తల స్కాన్‌ తీయకుండానే సైకియాట్రిస్ట్‌ దగ్గరికి తీసుకెళ్లడం..! తలనొప్పి విపరీతంగా వస్తుందన్న విషయం చెల్లె చెప్పకపోవడం, ఆ విషయాన్ని మేము గ్రహించక స్కూల్‌కు 30 కిలోమీటర్లు టూవీలర్‌ మీద పోయి వస్తుండడం వల్లనో, బావగాడి నిర్వాకం వల్లనో ఎక్కువగా ఆలోచించడం వల్ల కావొచ్చులే అనుకున్నం. సైకియాట్రిస్ట్‌ కూడా ఆ విషయం గ్రహించకుండా నెల రోజులు టైం వేస్టు చేసె. కాకపోతె మనసుకు సర్ది చెప్పుకునేందుకు ఒక్కటే మిగిలింది- చిన్న మెదడులోకి కూడా పాకేదాంక వెళ్లిపోయిన ఆ క్యాన్సర్‌ ఆరునెలల ముందు బయటపడ్డా రేడియేషన్‌ అని తలంతా మాడ్చేసి నల్లగా కమిలిపోయిన మొఖాన్ని చూడలేక అదొక భయంకర దృశ్యంగా యాదిలో పెట్టుకోవడం ఇంకా హింసగా ఉండేది.. డాక్టర్లు అలా చంపిందాక ఊరుకోరు కదా.. ఇలా తొందరగా.. తను మమ్మల్ని తనను మేము చూసుకుంటూనే ఆ మామూలు రూపంతోనే వెళ్లిపోవడమే మంచిదయిందేమో!
***
ఆ రాత్రి భారంగా గడిచిపోయింది. పొద్దున మా బావ, వాళ్ల తమ్ముడు నల్గొండలో ఏదైనా హాస్పిటల్‌కి తీసుకువెళ్దామని, హైదరాబాద్‌ మల్లా తీసుకువెళదామని చర్చ పెట్టిన్రు. నేను ‘వద్దు.. అవసరం లేదు. అక్కడ స్పెషలిస్ట్‌ డాక్టరే అన్నీ విప్పి చెప్పినంక ఇంక వేరే ప్రయత్నాలు వేస్టు’ అన్నా.
ఈ లోపు ఒక సాహితీ మిత్రురాలు ఫేస్‌బుక్‌లో చూసి కాల్‌ చేసి ఉండె. మరో మిత్రుడికి కాల్‌ చేయమని వారి కుటుంబంలోను ఎవరికో ఇలాంటి ప్రాబ్లమ్‌ జరిగిందని, ఏమైనా మార్గం తెలుస్తుందని చెప్పింది. చేశాను. అతను మరొకరి నంబర్‌ ఇచ్చిండు. అతనికి ఇలాంటివాటి పట్ల అవగాహన ఉంటుంది, ఒకసారి మాట్లాడమన్నడు. మాట్లాడిన. తనకు నేను తెలుసంటు మాట్లాడిండు. పరిస్థితి ఏంటో అంతా విని అన్నడు- ‘అన్నా! ఆమె చివరి స్టేజ్‌లో ఉంది. ఇక మీరు ఎలాంటి ప్రయత్నాలు చేయొద్దు. ఇంకా ఆమెను హింసించవద్దు.. వీలైనంత ఈజీగా ఆమెను వెళ్లిపోనివ్వండి! ఇలా అంటున్నానని ఏమనుకోవద్దు. మీరు అర్థం చేసుకోండి. మీ ఇంట్లోవాళ్లకు అర్ధం చేయించండి!’ అన్నడు. ‘నాకు అర్ధమైందన్నా.. ఇంట్లో వాళ్లకి అందరికీ ఈ విషయం చెప్పేలా ఉండదు. ప్రయత్నిస్తూనే ఉన్నా అన్నా! థ్యాంక్యూ!’ అని చెప్పిన.
వచ్చేవాళ్లు వస్తున్నరు. పోయేటోల్లు పోతున్నరు. మధ్యాహ్నం దాటింది. మల్లి మల్లి వెల్లి చెల్లెను చూసి మల్లా మా ఇంటి సాయమాన్లో వచ్చి ఒరుగుతున్నా. చెల్లెలో చివరి నిముషాలు.. అర్ధమవుతున్నది. గుండె తట్టుకోవడం కష్టంగా ఉంది. మంచం మీద పడుకొని కప్పుకేసి చూస్తు ఆలోచిస్తున్న.. అమ్మ వచ్చి దుఃఖం ఆపుకోలేకుండా ‘మేరీ బేటీ లో కదలిక లేదమ్మా! నా బిడ్డ నాకు లేకుంట పోతున్నట్లుందయ్యా!’ అని ఏడుస్తున్నది. లేషి చెల్లె ఇంట్లకు పోయిన. ఊపిరి కష్టంగా ఆడుతున్నట్లుంది. మా అల్లుడు, మా రెండో చెల్లె ఆక్సిజన్‌ బుగ్గ వత్తుకుంట కూసొనే ఉన్నరు. మళ్లీ సాయమాన్లోకి వచ్చేసిన. చెల్లె పిల్లలను వాళ్ల పెదనాన్న ఇంటికి తీసుకెళ్లిన్రు. వాళ్లుంటే బాగుండు, ఒకసారి చూపెడితె బావుండు ననిపించింది. కాలు ఒక్కదగ్గర నిలుస్తలేదు. అంతల తమ్ముడు వచ్చి ఏడ్చుకుంట ‘అక్క నాడీ కొట్టుకోడం ఆగిపోయిందన్నా’ అన్నడు. పరుగెత్తుకెళ్లిన. 
11 జనవరి 2017 
మధ్యాహ్నం 3.30కు చెల్లె యాస్మీన్‌ తన కష్టాల జీవితాన్ని ముగించింది!
చెల్లె చనిపోయిందన్న వార్త పాకిపోయింది. మా మామలు ఎప్పుడు చేద్దాం అన్నరు. ఈ రోజు కుదరదు. వాళ్ల స్కూల్‌ వాళ్లు, దోస్తులు అందరికీ ఇన్‌ఫామ్‌ చేయాలి. వాళ్లంతా వచ్చి చూసుకోవాలి. రేపు మధ్యాహ్నం జొహర్‌ నమాజ్‌లో కలుపుదామని చెప్పిన.
ఏడుపులు.. ఓదార్పులు.. 
ఎక్కడలేని జనం వచ్చిన్రు. ఎవరికీ మింగుడు పడని వార్త అయ్యింది. మా బావను తన్నాల్సుండె నని కొందరు.. కనీసం తిట్టి పోయాల్సుండెనని కొందరు.. నేను, తమ్ముడు, అమ్మ ఓపిక పట్టినం. ఎవరినీ ఏమీ అనలేదు. ఇద్దరు పిల్లలున్నరు. వారికి తల్లి లేకుంట అయ్యింది. తండ్రి నయినా మిగలనివ్వాలి, వాడు ఎలాంటి వాడన్నా కానివ్వు అనుకున్నాం.. అంతే!
ఆ రాత్రి మా చెల్లె నిర్జీవంగా ఆమె ఇంట్లో పడుకుని ఉన్నది. తను ఇష్టంగ కట్టుకున్న ఇంట్లో.. ఇంకా అస్త్రకారి కూడ పూర్తి కాని తన కొత్త ఇంట్లో..
కళ్ల మీద కన్నీళ్లు సుడిగుండాలై తిరుగుతూ ఎగిసిపడుతుంటే నా మనసులో మెలితిరుగుతున్నది ఒక్కటే మాట-
అక్కడే తప్పు జరిగిపొయ్యింది..
ఇక ఇప్పుడనుకొని ఏం లాభం. చెల్లె తన భర్త వల్ల ఎన్ని కష్టాలు పడ్డదో.. ఎన్నో విషయాలు నాకు గానీ, తమ్ముడికి గానీ తెలియనివ్వలేదు. చెబితే, తెలిస్తే గొడవలవుతాయనుకుంది. భరించింది. భార్య జాబ్‌ చేయడం అస్సలు ఇష్టంలేని సగటు మగాడు వాడు. అనుమానించేవాడంట. ఒక స్కూల్‌ సార్‌ మీద అనుమానపడ్డడట.. ఇంకెవరెవరి మీదో అనుమానపడేటోడంట! చాలాసార్లు కొట్టేదంట. తాగి వచ్చి నానా యాగీ చేసేదంట. తల మీంచి తల మీంచి కొట్టేవాడంట. ఒకసారి ముక్కులోంచి రక్తమొచ్చిందంట.. ఒకసారి తలను గొడకేసి కొట్టిండంట. అవన్నీ వింటుంటే గుండె రగిలిపొయ్యింది.. వాడు చెల్లెకు ఏమన్న కావాలనే అట్ల తల మీంచి తల మీంచి కొట్టేవాడా.. అందుకె తలలో ఎక్కడైన గాయమై అది క్యాన్సర్‌గ మారిందా? అమ్మ ఒక విషయం చెప్పింది- చెల్లె హైదరాబాద్‌లో ఉండేటప్పుడు ఒకసారి తన ఎదురుగనె చెల్లెను కొట్టిండంట. గొడవైందట. నేనట్లనె కొడత. చేతికేది దొరికితె అది తీసుకొని కొడత. తర్వాత మీ ఇష్టమని. అందుకె అమ్మ భయపడుతుండేది.. 
అసలు వాడెందుకట్లా ఉన్నడు, కనీస కనికరం లేకుండా.. వాళ్లు ముగ్గురూ అన్నదమ్ములే.. అక్కా చెల్లెల్లు లేరు. వాడు ఇంట్లో పెరిగినోడు కూడా కాదంట. అంటే ఇంట్లో పెరగనోడికి కుటుంబం మీద ప్రేమాభిమానాలు తక్కువుంటాయా! కఠినంగా తయారవుతారా! ఈ మొత్తం అనుభవంలోంచి ఒక్క పాఠం మాత్రం బాగా తెలిసివచ్చింది- 
చెల్లె లేనోడికి మాత్రం పిల్లనివ్వకూడదు!
అక్కడే తప్పు జరిగిపోయింది!

14 thoughts on “చెల్లె లేనోడు 

 1. మనసు మూగబోయి, గుండె బరువెక్కి, కన్నీళ్ళొస్తున్నాయి. యాస్మిన్ నిను మరువలేము రా….

 2. చెల్లె కథ చాలా దారుణం .. ఇలాంటివి ఎన్నికథలో మన సమాజంలో కనుమరుగవుతున్నాయి కదా ..

 3. ధారుణం. అవును పోలీసుల దెబ్బలు కనపడవంటరు కని మొగుడు వెధవ కొట్టే దెబ్బలు కనపడవు చూపించలేరు చెల్లెళ్ళు.సాక్షాలుండవ్ ఉన్నా ఈ వ్వవస్థ పట్టించుకోదు. టీచర్లు మరీ మానసిక సంఘర్షణకు లోనవుతారు. భర్త ప్రేమకు నోచుకోని వారు పడగ నీడ బతుకులు.

  1. నిజం చెప్పారు జ్వలిత గారూ!
   టీచర్ల బతుకులు కడు దీనంగా ఉన్నాయి..
   మొగుళ్ల దెబ్బలకు సాక్ష్యాలుండవు..
   భర్త ప్రేమ లేకుంటే జీవితమే లేకుండా చేస్తున్నది ఈ వ్యవస్థ!

 4. యాస్మిన్ అక్క గురించి మీకు అన్ని విషయాలు. ఆమె స్వర్గాస్తురాలు అయ్యాక తెలిశాయ అన్న. అంటే అంతకుముందే మీరు అక్క ఫ్యామిలీ సమస్యలు తెలుసుకొని ఉంటే ఈరోజు ఈ పుస్తకం మరోలా ఉండేమో కదా అన్న…
  మీ రషీద్ ఓయూ

 5. కథ, వాస్తవానికీ కల్పనకూ మధ్యా తేలియాడుతోంది.ఇది పాఠకుల్ని కథతో వుండేలా చేసే autobiographical narration.నిజానికిది రెండంచుల కత్తి.దీని మీద సాము చేయడంలో స్కై చాలా వరకూ సఫలీకృతులయ్యారు.అభినందనలు.

 6. సాహితి గారూ!
  ఈ కథలో కల్పన ఏమీ లేకుండా వాస్తవాలు మాత్రమే రాసాను.. అయినా ఆగకుండా చదివిస్తుందని అంటున్నారంతా..
  బాగా దుఃఖానికి లోనైన వారు కామెంట్ ఏం పెట్టాలో తెలియని స్థితిలో ఉండిపోయామన్నారు..

 7. అక్క చెల్లెలున్న లేకున్నా భర్త అనేవాడు ఎప్పుడు పశువుగా మారతాడో తెల్చుకోలేని విషయం సగటు భార్యలకి, బట్ టూ sad అలాంటి మూరుకుని వల్ల ఇద్దరు పిల్లలు తల్లిని కోల్పోయారు , అందుకే అంటారేమో మనో వెధనన్ని మించినా అదోపాతళం లేదు మనో ఆనందాన్ని మించినా స్వర్గం లేదు …. ఆ టీచర్ లాంటి ఆడలేదరో ఈ సమాజం లో ..చాలా బాగా రాశారు జి,దుఃఖాన్ని మాత్రం ఆపుకోలేక పోయా చదువుతున్నంతా సెపు

 8. చదవాటానికి ఆలస్యం అయింది స్కై బాబా గారు , చదవటం పూర్తయ్యాక కసేపటిదాక ఒకరకమైన నిస్సత్తువ ఆవరించింది.దుఃఖంతో ఏం పాలుపోలేదు.అసలు ఏం చెప్పాలనుకుంటున్నానో, అడిచెప్పలేని అయోమయం గా ఉంది.చదువుతున్నంతసేపు మీ దుఖం,బాధ,అన్నికళ్ళకు కనిపిస్తున్నాయ్.ఏదో కధ చదువుతున్నట్టు కాకుండా,అక్కడ మేము కూడా ఉన్నట్టు చెల్లెలి ఫీలింగ్స్ మా కళ్ళతో చూస్తున్నట్టు అనిపించింది.భర్త ఆదరణ కరువైన స్రీ జీవితం ఎంతదుర్భరమో ,ఆమెపడే మానసిక వ్యధ ఏ కవి వర్ణించలేడు.తనబాధలు బయటకు చెప్పుకోలేక ,అలాని ఒంటరిగా బాధలు భరించలేక ,వృత్తి పరంగా ఉండే వత్తిళ్లను తట్టుకుంటూ ,కుటుంబ జీవితాన్ని సమన్వయ పరచుకోలేక ఎంత బాధ అనుభవిస్తుందో కదా .ఏదో చెప్పాలనుకున్న ,కానీ చెప్పలేక పోతున్న ,ప్రతి అక్షరంలో చెల్లి మీద మీకున్న ప్రేమ కనిపిస్తుంది .ప్రతి ఆడపిల్లకి మీలాంటి ఒక అన్న ఉంటె చాలు .మీలాటి అన్నలు ఉన్న ప్రతి చెల్లి నిజం గా అదృష్టవంతురాలు

 9. సగటు చెల్లెల్ల జీవితాలన్నీ అలాగే ఉన్నాయోమో….

 10. ఈ కథ వెనక ఉండే సెన్సిటివిటీస్ అలాంటివి!
  – – – – – – – – – – – – – – – – – – –
  చెల్లె కథ చదివి చలించని వారు లేరు.. దుఃఖం.. దుఃఖం.. ఎడతెగని దుఃఖం.. ఏమని కామెంట్ పెట్టాలో కూడా తోయని వారు నా ఇన్బాక్స్ లో వారి ఫీలింగ్స్ పంచుకున్నారు. బాధ పడ్డారు. నన్నూ ఓదార్చారు.. భుజం తట్టారు.
  సరే, ఈ కథ చదివిన చాలా మంది అమ్మాయిలకు, స్త్రీలకు కొన్ని విషయాల్లో స్పష్టత వస్తుంది. అణిగిమణిగి ఎందుకుండకూడదో కూడా తెలిసి వస్తుంది. ఒక తెగింపు కలుగుతుంది. ఒక మెలకువను కలిగించడం కూడా కథ చేసే మేలు.
  కథలో కొనసాగే సస్పెన్స్ పాయింట్ విషయంలో కొంత మందికి అభ్యంతరం ఉండొచ్చు.. కానీ దాని వెనక ఉండే నిజాలు, సున్నితత్వాలు, అది కలిగించే, నేర్పించే అనుభూతులు, పాఠాలు, ఆత్మీయతలు లోతుగా ఆలోచిస్తే తప్ప అర్ధం కావు. ఎవరు ఒప్పుకున్నా, ఒప్పుకోకున్నా అదొక వాస్తవం. అలా లేనివారి కాఠిన్యం ఎక్కడో ఒక చోట బయట పడిపోతుంటుంది.
  ఈ కథ ఎక్కువగా అమ్మాయిలకు, స్త్రీలకు నచ్చడానికి, వారు కదిలిపోడానికి ప్రత్యేక కారణాలున్నాయి. దాని వెనక తరాల నుంచి నేటికీ కొనసాగుతున్న వారి దుఃఖం ఉంది. పురుషస్వామ్యపు కాఠిన్యం ఉంది..
  ఎవరైనా చదవకుంటే ఒకసారి చదివి చూడండి!

 11. ఇది చాలా బాధాకరం
  చదువుతుంటే కళ్ళముందే మెదిలినట్టయ్యింది అన్న
  చాలా మంది జీవితాలు ఇలాగే ఉన్నవి
  మీరన్నట్టు తప్పు అక్కడే జరిగింది
  చెల్లి విలువ తల్లి విలువ తెలిసినోడు చెయ్యి ఎత్తడు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


   Type Comments in Indian languages (Press Ctrl+g to toggle between English and Hindi OR just Click on the letter)