కథ

నాగూర్‌ బీ

          – మన్నెం సింధు మాధురి

 

గుంటూరు ఎండలు ఎట్టా ఉండయ్యి అంటే పోలీసోడు బాగా తన్నిఆ గాయాల మీద కారపు నీళ్లు కళ్లాపిలాగా జల్లినట్టురాజధాని అమరావతిలో ఎకరం పొలం అమ్మినా యాడాది కరంటు బిల్లుకీ చాలదని తెలిసినా ధైర్యంగా మిట్ట మజ్జాన్నంఏసీ ఏసుకుని ఎండ అసహనాన్ని ఎవరిమీదా చూపిచ్చలేకసెల్‌ ఫోను పీక నొక్కి పొడుకున్నా. లెగిసి పోన్‌ చూత్తే..

బీబీ (ఏడు) మిస్‌ కాల్స్ ఉండయ్యి.

ఏంటబ్బా ఇన్నిసార్లు చేసిందిఇవ్వాళ సాయంత్రం కూడా బొచ్చెలు తోమటం ఎగ్గొట్టుద్దా. సోది మొకందిఇప్పుడు దీని ఫోనుకో రొండు రూపాయలు దండగఅయినా ఎందుకో ఊరుకో బుద్ధికాక తిరిగి ఫోన్‌ చేశా.

హలో ఏంటి బీబీ ఫోన్‌ చేశా

మా.. ఇయ్యాల నేను పనికిరానులక్ష్మిని పంపుతాఎట్టాగో సర్దుకో..

సరేలే తొందరగా రమ్మను

గుంటూరు ఎండ మంటకీఉప్పుఉస్సూ అంటా అడ్డమయిన కొవ్వులతో చేసే సబ్బులకీ ఎలర్జీ వచ్చి డాక్టరుకి ఓ ఇరవై వేలు పోసిసబ్బులుడిటర్జెంటులు చర్మానికి తగలొద్దని చెప్పినాక పనిమనిషి కోసం గాలిచ్చా. ఇద్దరు ముగ్గురిని అడిగితే మెట్లెక్కి మూడో అంతస్తుకి రాలేము అని మొకమాటం లేకుండా చెప్పారు. సాబిరా’ అని పక్కింటి వాళ్లకి చేసే పనిమనిషి తెచ్చింది ఈ బీబీని. గిన్నెలకి ఐదొందలే ఇస్తానన్నా నాలో ఏం నచ్చిందో ఏమో.. ఏమీ ఇవ్వకపోయినా పని చేత్తానమ్మా అని ఇంట్లో దూరింది. దానిష్టం వచ్చిన టయానికి వచ్చి గిన్నెలు తోమేది. అదిగో అప్పుడప్పుడూ నాగాలు (సెలవులు). ఒకసారి వరసనే రొండు రోజులు రాలా. మూడో నాడు క్రిష్ణానగరులో – అంటే మేం ఉండే ఏరియా- ఆ నాలుగు లైన్లలో పనిచేసే బీబీ చుట్టాలు రొండు జట్లుగా విడిపోయి ఏరీయుద్దంకొంగులూకుచ్చిళ్లూ ఎగదోపి తిట్లుబూతులుపక్కింటావిడ క ఇయ్యాల కూడా ఈ దూదేకుల గుంపు పనులకి సావరు. సాయంత్రం దాకా తన్నుకుంటారు. అయినా ఈళ్లని కాదు అనాల్సింది. న్యూసెన్సు కింద పిటిషను రాసి పోలీసులతో చెప్పి ఎల్లగొట్టిచ్చని కాలనీ మగాళ్లనీఈళ్లని వాకిటి ముందు కూచ్చోనిచ్చే మెంటలామె మొగుడ్నీ అనాలి. చెత్త గుంపుచెత్త మంద..’ అంటా ఢమఢమా గిన్నెలు తోముకుంటోంది.

తరవాత రోజు తీరిగ్గా పనికి వచ్చింది. మా బీబీ అనే నాగూర్‌బీ.

ఏవయ్యిందేనిన్నెందుకు అట్టా రంకెలూబొబ్బలూ పెట్టి పోట్టాడుకుని అరుసుకు చచ్చారు. బజారంతా యాకంపాకం చేశారు

అరవటమాచెప్పు తీశా దాన్ని తన్నుదామనుకున్నాగలీజుముండ. మా అక్క కూతురికి అత్తమ్మా ఆ కొట్లాడింది. పిల్లనిచ్చింది మా అక్క. కొడుక్కి చేసుకుంది ఇది. ఏమయ్యిందో ఏమో.. ఇద్దరూ ఇడిపోయారు. ఇది పిల్లిమీదానక్క మీదాఎలిక మీదా పెట్టి తిడతందమ్మా.. పగలంతా వచ్చేపోయే వాళ్లకి గాలం ఏత్తారుఏ మగాడ్నీ దారిన పోనియ్యరు అంటంది. అయినా మా గొడవలు ఎప్పుడూ ఉండేయే లేమ్మా. మా బతుకులు ఇంతే తన్నుకుంటాం సాయంత్రానికి కలుత్తాం. గోసాలు (గోషా) చాటున ఉండటానికి నవాబులమాఇంటో కూసుని తినటానికి కొత్త రాజదాని కట్టేకాడ పొలాలు ఉండయ్యా.. దూదేకులం గదా.. గాలికి పోయే ఏకుల బతుకులు మాయి. అమ్మా రేపు నువ్వోసారి బయటకి నాతో రావాల

బయటకా ఎందుకే

నువ్వు చదువుకున్న దానివి కదా. నాకు ఆధారం కారుడు (ఆధార్‌) లేక స్టోరు (రేషను) ఇయ్యటంలా. కంప్యూటర్‌లో తీయించి పెట్టు.బయట బియ్యం కేజీ నలబై పెట్టి కొనలేక సత్తన్నా

మరుసటి రోజు బయటికెల్లి ఆధార్‌ నెంబరు ఈ-సేవలో ఇస్తే చిన్నపిల్లలు దడుపు జరం వచ్చేలాంటి ఫొటోతో ఠావు (అదే కార్డు) వచ్చింది. ఇంటికే ఆధార్‌ పంపుతాంఒళ్లోనే ఏస్తాం అని అదికారులు చెప్పారు కదయ్యా మళ్లీ ఇట్టా నెట్‌ సెంటర్‌ల ఎనకాల పడి తీసుకోవటం ఏంటి?’

మేడమ్‌ రహస్యం ఆధార్‌ కార్డులన్నీ పోస్టాఫీసుల్లో గుట్టలుగుట్టలుగా పడి ఉండయ్యి. ఆళ్లకి డబ్బులు ఇవ్వక పంచటల్లాఅయ్యి వానకి తడుత్తన్నయ్యిఎండకి ఎండుతున్నయ్యి. ఈ సందులో మేం కూడా కార్డుకి ఓ అరవై లెక్కన మేం కూడా వసూలు చేత్తన్నాం(?) అంటా నవ్వాడు.

నాలుగు నెలల నించీ తిరుగుతున్నా ఇయ్యాల నువ్వొచ్చి నెంబరు చెప్పంగానే నిమసంలో వచ్చింది. చదువు లేనోళ్లంటే ఈ కుక్కలకి ఎంత పలసనో ప్రతిదీ అడిగి తెలుసుకోవటం ఏదయినా గొడవలయితే కథలుకథలుగా చెప్పేదిఒకసారి నాలుగు రోజులు ఎగ్గొట్టి ఐదోనాడు హాజరు అయ్యింది. కోపం వచ్చి తమాయించుకుని అడిగా.. ఏ దేశాలు ఏలటానికి పోయావేదుబాయ్‌ గానీ ఎల్లావా పని మడిసి ఉజ్జోగానికి..

మ్మో.. సాల్లే.. నువ్వొక్కదానివే ఈ మాట అనంది అనుకున్నా. నువ్వు అన్నావూ.. నాలుగో లైన్లో పెళ్లుందమ్మారోజుకి వెయ్యిడ్రస్సు (అందరికీ ఒకే రకం చీరలు) ఇచ్చి వచ్చే వాళ్లందరికీ మంచినీళ్లుకారు తలుపు తియ్యటంఎల్లేటప్పుడు మూసి దణ్ణం పెట్టడం చెయ్యాల. పిల్లల ఫీజులు పుస్తకాలకీ వత్తయ్యంటే ఎల్లా. నీతో కాబట్టి చెప్పా. మిగతా వాళ్లకి అస్సలు సమాధానం ఇవ్వను’.

మొత్తం ఎన్ని ఇళ్లు చేత్తావే

బయట పది నీతో పదకొండు

అమ్మో అన్నెట్టా చేత్తావే

బుఱ్ఱుండాలమ్మా. బుఱ్ఱుంటే చెయ్యొచ్చు

అదేంటే పని చేతులతో కాదా

పొద్దిన్నే అయిదింటికి లెగిసి పిల్లలకి ఇంత ఉడకేసి తలకి నున్నగా నూనె రాసుకుని (ఎంటికలు రాలితే అమ్మగార్లు ఊరుకోరు) తల దువ్వుకుని తానం చేసి బయటపడతా. రోజుకి రొండిళ్లు నాగా. ఆదివారం ఎలితేఎలతా లేకపోతే లేదు’.

సర్లే నీతో నాకెందుకు. గిన్నెలు తోమిపోఎగ్గొట్టే రోజు ఫోను చెయ్యి. పాసి గిన్నెల్లో పరవాణ్ణం’ వండుకునేటట్టు చెయ్యమాక’.

పని అయినాక చేతులు నొక్కుకుంటా వచ్చి.

మ్మా ఏసీ ఎయ్యి’ అని పావుగెంట చల్లగా నడుం వాల్చేది’.

గుంటూరు ఎండల దెబ్బకి భయపడి నాటిన చెట్లన్నీ మాయమయితే అన్నయ్య వాళ్లింట్లో ఒక వారం ఉందామని హైదరాబాద్‌ వచ్చా. బీబి రోజుకి ఒకసారన్నా ఫోన్‌ చేసేది. హైదరాబాదేవన్నా ఏసీ సినిమా హాలులాగా లేదుగానీఎనిక్కి రామ్మా.. మన గుంటూరే నయ్యం. సాయంత్రానికి సల్లటి గాలి కొట్టుద్ది

రొండు రోజుల్లో వస్తాలేవే

రొండు రోజులెందుకు తాత్కాలికం (తత్కాల్‌) టికెట్టు కొనుక్కుని రేపే రామ్మాచూడాలని ఉందివారం పయిన అయ్యింది.

దీని ప్రేమలు తగలబడ.. ఇదెక్కడిదా.. అని నవ్వుకున్నా. ఏది ఏవయినా అది నాకు అలవాటయిపోయింది. బూతులు మాట్లాడినా ఇసుక్కున్నాఇంట్లో మనిషిలాగే ఉండేది. పనికి రాకపోతే ఇల్లంతా ఖాళీగా ఉండేది.

మలమలలాడతన్న ఎండదోమలుఈగలుఆవులుమనుషులూ సమానంగాచాలా సమత్వంతో చస్తన్నయ్యి. చెమటతో మొకాలు కారతా ముగ్గురు ఆడాళ్లని ఏసుకొచ్చింది. తురక తెలుగూతెలుగు తురకం మాట్లాడతన్నారు. ఇంటి ఓనరు వాళ్లంకా నా వంకా మొకం చిట్టగిచ్చుకు చూత్తంది. ఇల్లు అద్దెకి ఇస్తే సమస్తమయిన హింసలూ అద్దెకి ఉండే వాళ్లు పడాలి అనే ఆమె పాలసీ.

ఏయ్‌ బీబీ ఏంటి ఇంతమందొచ్చారు. ఈ గోలేంటి?’

మాఅమ్మా.. నువ్వు మాతో బయటకి రావాలి. నువ్వు కాదంటే ఈ మోటి బీబి’ కూతురు సచ్చుద్ది.. ఆ కూతురు లేకపోతే ఇది బతకదు. నువ్వు మాతో రావాలమ్మా’.

విషయం చెప్పకుండా కాకులల్లే గోలా మీరూనువిషయం ఏంటి?’

ఈ మోటిబీ’ కూతుర్ని పోలీసులు పట్టుకు పోయారమ్మా.. మేం ఎలితే సమాధానం లేదు. టేసనులో (స్టేషను) ఏం జరుగుతుందో ఏమోఆ పిల్ల అంత తెలివైంది కూడా కాదమ్మా. ఎఱ్ఱి ముండమ్మానువ్వొచ్చి ఇడిపిచ్చాలమ్మాఅది నాకు సొంత చెల్లెకన్నా ఎక్కువమ్మా

ఇదిగో బీబీ మొన్నేకదే రోడ్డెక్కి తన్నుకున్నారు. ఇంతలోనే మళ్లీ చెల్లి కన్నా ఎక్కువ అంటన్నావు. అయినా అంత అమాయకురాలయితే స్టేషను దాకా ఎందుకెల్లుద్దే విషయం సరిగ్గా చెప్పు

విషయం ఆటోలో చెబుతా నువ్వు బయలుదేరు అమ్మా..

ముందు విషయం చెబితే ఆలోచిస్తా రావాలా వద్దా

దాని గాచారానికి (గ్రహచారం) ఒక సావాసగత్తె ఉంది. దానికో లవరు ఉండాడు. ఆళ్లిద్దరూ పార్కుకి పోతా దీన్ని ఏసుకుపోయారు. ఆళ్లిద్దరూ పొదల పక్కన ముద్దులు పెట్టుకుంటంటే ఇది రాయిమీద కాళ్లు ఆడిత్తా కూచ్చుంది. ఆ లవరుగాడి పెళ్లాం పోలీసుల్ని ఎమ్మట పెట్టుకొచ్చిటేసనుకి పట్టిచ్చింది. తోడెల్లినందుకు దీన్ని కూడా తన్ని తలంటుతున్నారు. అమ్మో ఒక ఆడపోలీసుంది. ఆమె అయితే ఎవురి మాటా ఇంల్లామాకే రోత పుట్టేట్టుగా బూతులు తిడతా రాకాసిగెద్ద గోళ్లతో గీరినట్టుగాలాఠీతోనూమాటలతోనూ కొడుతుంది. మాకు భయంగా ఉందమ్మా

ఒకపక్కన కోపంచిరాకు. ఈ మందంతా ఎక్కడి తద్దినందీన్ని ఒక్కదాన్ని పనిలో పెట్టుకుంటేతలకి మొత్తం గుంపంతా రోకలిలాగా చుట్టుకున్నారు ఉండవే సార్‌కి ఫోన్‌ కలుపుతా’ అని మా మగ మహారాజుకి ఫోన్‌ చేశా. బీబీ…. అని వస్తంది.. (పెళ్లాంకి తప్ప ప్రపంచంలో మగాడి ఫోన్‌ ప్రతి వాళ్లకీ అందుబాటులో ఉంటది)

అమ్మా నీకు పేపరు వాళ్లు (జర్నలిస్టులు) తెలుసు కదమ్మా.. ఆళ్లకి చెప్పు పాపం కొడతన్నారమ్మా.. చూడలేక పోతున్నాం

పోలీస్‌స్టేషను దాకా చచ్చారుతీసుకెళ్లిన పోలీసు ముడ్డి పగలగొట్టక సూర్యవంశపు రాజుల్లాగా మర్యాదలు చేత్తారాపనులు చేసే ముందు ఉండాలి.. ఆలోచన’.

మా ఆలోచన ఉంటే ఇళ్లల్లో పాసిపని ఎందుకు చేత్తాం.. నువ్వు మాత్రం ఎమ్మటే ఇడిపిచ్చాల. ఇప్పుడే నాలుగయ్యింది. ఏం చేత్తారో నాకు తెలవదమ్మా

ఇందులో వాళ్ల అమ్మ ఎవరు?’

ఏయ్‌ మోటిబీ నీ కూతురు ఎక్కడికెలతందో చూసుకోవటంలేకపోతే ఎమ్మట పెట్టుకు పనికి చావొచ్చు కదాపోలీసుల దెబ్బలంటే మాటలా

మో.. చేసి చేసి మా రెక్కలు సానరాళ్లులాగా అరుగుతున్నయ్యి. బిడ్డన్నా నీడన ఉంటదనిఎండ పాలిట ఎయ్యలేక తేలేదమ్మా. ఇట్టా అవ్వుద్దంటే జుట్టు పట్టుకుని లాక్కొచ్చేదాన్ని. పోలీసోడికి సందు పెట్టేదాన్నా’.

ఈటికేం తక్కువ లేదు. మాటకి మాట అప్పచెప్పటం వచ్చింది. ఇక చాల్లే ఆపండి’ అని సెల్‌ తీసి తెలిసిన ఎస్‌ఐ ఉంటే ఫోన్‌ చేశా.

నేను కనుక్కొని విషయం అరగంటలో చెబుతానమ్మా’ అని అన్నాడు.

అది స్పీకర్‌లో విని..

చూడమ్మా మేం ఎలితే లంజలుముండలులంబిడీలు అని అంటారు. నువ్వు పేరు చెప్పంగానే అమ్మా.. అమ్మా.. అని మాట్లాడతన్నారు’.

ఈ లోపల ఫోన్‌ మోగింది. మా ఇంటాయన. విషయం చెప్పా. అంతా వినిఏం చేస్తాంపొద్దిన లెగిస్తే పనికి వస్తారు. అందులో ఆడపిల్లవెళ్లి ఇడిపించువిషయం శృతి మించితే డిఎస్‌పి తెలిసినాయనేఆయన పేరు చెప్పు’.

ఆళ్ల మొకాల్లో కొద్దిగా ధైర్యం ఈ లోపల బీబి అందరికీ నీళ్లు ఇచ్చింది. నేను డ్రస్‌ మార్చుకుంటన్నా.

మళ్లీ ఫోన్‌ మోగింది.

మా ఫోన్‌ అని బీబి ఇచ్చింది

తెలిసిన యస్‌ఐ కొత్తగా ఉద్యోగంలో చేరాడు

ఈళ్లు పార్కులో అశ్లీలంగా ప్రవర్తిస్తంటే పట్టుకున్నారంటమ్మా. పెద్దగా కొట్టలేదంటమ్మా. లేడీ కానిస్టేబులు నాలుగు దెబ్బలే ఏసిందంట’.

అంటే ఒకొంద దెబ్బలు కొడతారా ఏంటినాలుగు దెబ్బలకే బొబ్బలు పెట్టి అరుత్తుందంటఇక పది దెబ్బలంటే మీ భాషలో అర్ధం చెప్పు బాబూ

నేను చెప్పాను లేమ్మా.. బైండోవర్‌ రాయించుకుని ఫైన్‌ కట్టిచ్చుకుని వదిలేస్తారంటమ్మా’.

పని చేసుకునే వాళ్లూఫైన్‌లకి డబ్బులు ఎక్కడ నించీ తెస్తారు. ఏ పూటకి ఆ పూటే కష్టం. పైగా కూచ్చుని ఉండే ఆడపిల్లని తెచ్చి.. ఇదంతా ఏంటి?’

అంత పేదాళ్లయితే నే చెబుతానమ్మా.. చాలా ఎండగా ఉంది. సిఎం ఈ రూట్‌లో వస్తన్నాడురోడ్డుపక్కన చెట్లు కూడా లేవమ్మా. ఉంటాను’ అని ఫోన్‌ పెట్టేశాడు.

ఎల్లి పిల్లని తెచ్చుకోండికొంపకెల్లి మళ్లీ ఆళ్లూ మీరూ తన్నుకు చావమాకండి

అందరూ అంగలుపంగలు ఏసుకుంటా బయటకి పోయారు.

రొండు రోజుల్నించీ బీబీ పనికి రావట్లా. మూలమీద చెట్టు కింద దూదేకుల బీబీలు అందరూ చేరారు. అటు ఎలతా..

నాగూర్‌ బీ రాలారొండు రోజుల్నించి అంటు గిన్నెలు అట్టానే ఉండయ్యి’ అని అడిగా.

ఏమోనమ్మా మాకు తెలవదు. ఆ లేచిపోయిన దాని గురించి మా దగ్గిర ఎత్తమాకదాని సంగతి మాకేం తెలుసు’ అంది బక్క బీబీ.

ఓసి మీ టెక్కులు మండమీ పార్టీలూమీ పగలూ ఎంతసేపో మాకు తెలవదా’ అనుకున్నా.

మూడో రోజుకి దిగింది ఎల్లవకి (వరదకి) కొట్టుకొచ్చిన పిల్లికి మల్లే.

ఏమయ్యింది అట్టా అయిపోయావు

నాకేమో ఎండలకి ఇరోసనాలు (విరోచనాలు) వాంతులురవికి జరం అమ్మా

బిళ్లలు వేసుకున్నావా నీల్లు ఎక్కువగా తాగు. ఉండు చిన్న చెంబుతో మజ్జిగ చేసి ఇస్తాతాగి గిన్నెలు కడుగు. ఇంతకీ ఈ రవి ఎవరే

అమా.. నిన్న నా గురించి ఆ పోరంబోకు నా సవుతులు లేసిపోయిన దాన్ని అని అన్నయ్యంట గదానీకు చెబుతాచేసిందీ జరిగింది తప్పయితే ఇడిసిన చెప్పు తీసి కొట్టు.. లేకపోతే మాట్లాడే నా లంజల్ని తన్ను’.

ఒకళ్ల మాటెందుకునీ గురించి నాకెవరన్నా చిలకశాస్త్రం చెప్పాలా. నువ్వు చెబితే నేను ఇంటాను నమ్ముతాను కదే

మీ ఇంటికాణ్నించి తిన్నగా రోడ్డమ్మిట పడిపోతే కోబాల్టుపేట వచ్చుది. అక్కడే మా గుడిసెలు ఉండేయి. మమ్మల్ని తరిమి వేరే వాళ్లకి జాగా ఇచ్చారు. ఇప్పుడు మూసేసిన జూట్‌మిల్లులో మా అయ్యకి పని. మేం ఇద్దరం అక్క చెల్లెళ్లంఒక తమ్ముడు. మా నానకి జూట్‌ మిల్లులో ఉజ్జోగం జూసి తాగటానికి సారాయి అప్పు దొరికేది. జీతం మొత్తం సారాయి కొట్టుకే. ఇంటికి వచ్చి రోజూ మా అమ్మని చితకతన్నుడే. కొట్టగాకొట్టగా బండరాయి అయినా పగులుద్దని.. ఆ దెబ్బలకి మా అమ్మ పీర్ల దేవుళ్లలో కలిసిపోయింది.

అప్పటిదాకా ఎక్కడ తెచ్చి మా కడుపులు నింపేదోఒక్కసారిగా మా అమ్మ లేక ఆకలి అనే కొత్త సంగతి గుర్తుకొచ్చింది. మా అయ్యకి తాగుడు తప్ప  కని బజారులకి వాటాలేసిన పిల్లలు అస్సలు గెమనం (జ్ఞాపకం)లోకే లేదు.

అదుగో అప్పుడు దిగాను పాసిపనుల్లోకి. ఇదిగోనమ్మా.. ఈ దిక్కుమాలిన చేతులతో ఏరోజు చీపురు పుచ్చుకున్నానో ఆరోజు నించీ మొదలయ్యింది మురికి వదిలిచ్చే బతుకు. మొదట్టో వాకిళ్లు చిమ్మటంముగ్గులు పెట్టే పనే ఇచ్చేవాళ్లు. ఆళ్లు వాకిళ్లు ఊడుత్తుంటే అయ్యగార్ల చూపులు వొంగినప్పుడు ఎండిపోయిన అందాలు చూసేయి. ఇళ్లు ఖాళీచేసి కొత్తవాళ్లు అద్దెకి వచ్చినప్పుడల్లామేం ఆ కొత్త అయ్యగార్ల తిమ్మిర్లు కొత్త కొత్తగా అలవాటు పడాలి. అమ్మగార్లు లేనపుడు ఆ చేతులు ఎన్ని కావాలంటే అన్ని పనులు చేత్తయ్యి. మేం తోలు ఉండ కండ ముద్దలంఊరుకుంటే పనమ్మాయి మంచిది. వందారొండొందలూ మొకాల మీద ఇదిలిత్తారు. లేకపోతే జేబుల్లో డబ్బులకీవెండి గిన్నెలకీబియ్యానికీకందిపప్పుకీ కాళ్లుచేతులు వచ్చి నడుతయ్యి. అట్టా రోజులు గడిచేటప్పుడు పెద్దమడిసిని అయ్యా. నేను పెద్దమడిసి అవ్వటం నా తప్పు అలనేట్టుగా దేశంలో ఎవరూ పెద్ద మడుసులు అవ్వనట్టుగా నలుగురు అమ్మగార్లు పనులు మానిపించారు. అందులో ఒకమ్మగారయితే తను చేసింది గొప్ప పని అన్నట్టుగా బజారంతా పని మానిపిచ్చిన విషయం చెప్పింది. నేను మాత్రం పెద్దగా పడి పడి నవ్వుకున్నా.

ఎందుకంటే.. వద్దులే అమ్మా

కాదు.. చెప్పు

ఆమె మొగుడు పక్క బజారులో ఒకామెతో స్నేహం.. ఆవిడనీ బంగారం అంటాడుపెళ్లాన్నీ బంగారం అంటాడుఆఫీసులో పనిచేసే అమ్మాయినీ బంగారం అంటాడు. ఆఖరికి చెల్లెళ్లనూఎవరన్నా ఆడవాళ్లు ఫోన్‌ చేసినా బంగారం అంటాడు. కాకపోతే గాని సాగదీసి ఎట్టా పిలుత్తాడో నాకే తెలుసు.

ఆఫీసులో అమ్మాయినీ బంగారం అంటాడని.. నీకెట్టా తెలుసే?’

ఆఫీసు కూడా నేనే ఊడుత్తా. అమ్మగారు ఇంటి పనిలో పీకితే అయ్యగారు ఆఫీసు పనిలో పెట్టుకున్నారు’ అని నవ్వుతా ఉంది.

సరేలే సచ్చావు నీ జోకులునువ్వూను. ఊ.. చెప్పు

చెడతాగే అయ్య. బూతులు తిట్టే అక్క మొగుడురాక్షసుల్లాంటి అయ్యగార్లువాళ్ల మొగుళ్లు పత్తిత్తులనుకుని కాపలా కాసే పిచ్చి అమ్మగార్లు. జూటు మిల్లులో పని ఉండరోజు చేత్తా. రౌడీలతో వసూళ్లు చేత్తా తిరిగే మునీరు పరిచయం అయ్యాడు. ఆడికో రొండు రిక్షాలు ఉండేయిఅయ్యి అద్దెకి తిప్పేవాడు. అప్పుడప్పుడూ రిక్షాలో కూచ్చొబెట్టుకు తిప్పేవాడు. కొన్నాళ్లకి ఆడితో ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నా. పదారేళ్లకే నీకు పెళ్లి కావాల్సి వచ్చిందే అని అయ్యగార్లు సాగదీసి మాట్టాడే వాళ్లు. ఈ మునీరు తాగి గొడవలు పడికొట్టుకొనిఎవురినయినా డబ్బుల కోసం బెదిరిచ్చి పదేపదే పోలీస్‌స్టేషనుకి ఎల్లేవాడు. ఎవరో ఒకరు అమ్మగార్నోఅయ్యగార్నో కాళ్లు గెడ్డాలు పట్టుకోటం స్టేషను నించీ ఇడిపిచ్చటంమళ్లీ నాలుగు రోజులకి మొదలుమునీరుని భరిత్తా ఇద్దరిని కన్నాను. ఇపుడు పెంచే వాళ్లు పెరిగారు. పగలంతా పనిచేసి వత్తే సాయంత్రానికి ఎక్కడన్నా అడుక్కోతాగుడికి డబ్బులు ఇయ్యాలి లేదా మరురోజు లెగవటానికి కూడా రాకుండా తన్నేవాడు. కూచ్చోబెట్టి కూడెయ్యకపోయినా కూసాలు ఇరిగేటట్టుగా తన్నేవాడు. మూడో వాడు కూడా కడుపులో పడ్డాడు. అందరికీ తిండి తెచ్చిపెట్టటం బలే కష్టం అమ్మా.. ఎన్ని ఇళ్లల్లో పాసి కూడయితే నలుగురికి వచ్చుద్ది. అదీ మూడు పూటలాఏంటోలే అమ్మా నా బతుకే రోతనేను పనికి పోయి వచ్చేటప్పటికి పెద్ద పిలగాడిని కుక్క కరిచింది. పాపం దానికీ ఎవరూ కూడు ఏసి ఉండరు. మావోడి కాలి పిక్క పట్టి పీకింది. ఎవుర్ని డబ్బులు అడిగినా రూపాయి పుట్టలా. మా అత్త దగ్గిరికి ఎలితే యాభై రూపాయిలు అప్పన్నా ఇచ్చుద్దని రిక్షా మీద మునీరుని దింపమన్నా. కడుపుతో ఉండదాన్నని కూడా చూడకుండా కిరాయి డబ్బులు ఎవడిత్తాడు. ఇయ్యాల రిక్షా కిరాయి కట్టు దించుతా అని రిక్షాని వేరే వాళ్లకి అద్దెకి ఇచ్చాడు. చెప్పటం ఆపి సన్నటి నీటిపొర కన్నులతో నా వంక చూసింది.

ఆ కళ్లు భూభాగాన్ని బాధలాగా సుడులు తిప్పుకుంటన్నట్టుగాఏ లోకాలూ ఆడాళ్లని సుఖపెట్టటానికి లేవా అని అడుగుతున్నయ్యి. ఎమ్మటే సర్దుకుని దాని ఎంక (వైపు) చూసి…

బీబీ నీకు కాఫీ ఇష్టం కదా కాసిని కాఫీ తాగి మాట్లాడుకుందాం

అమ్మా కాఫీలో చాక్లెట్‌ పాకం (సిరప్‌) కలుపు

కాఫీ తాగి గిన్నెలు తోమి నా మంచం పక్కనే నేలమీద వాలింది.

మా.. ఇయ్యాల పనికి పోను

అందరూ తిట్టుకోరూ

ఎందుకు తిట్టుకోవటంమొకం మీదే తిడతారు. నోరు ఉంది పప్పు తిన్న ముడ్డిలాగ వాగటానికేగాచక్రాలు అడ్డం ఏత్తాగా

చచ్చేటట్టుగా నవ్వుతా చక్రం ఏంటే

వద్దులేమ్మా మళ్లీ ఇయ్యన్నీ ఒక గెంట పడతయ్యి

కానీయ్యి నువ్వూనేనూ చేసే కలెక్టరు గిరీకి భంగమంటలే చెప్పు

ఒకమ్మగారు లావుగా పొత్రం రోడ్డుమీద దొర్లుతున్నట్టుగా ఉంటది. రోజూ సన్నగా అవ్వాలనుకుంటది. గేదె గడ్డి తిన్నట్టుగారైలు ఇంజనికి పాతకాలంలో బొగ్గేసినట్టుగా తింటది. ఆ అమ్మగారు కోపం వచ్చి తిట్లు మొదలు పెట్టంగానే ఏంటమ్మా సన్నపడి పోయా అంటాఅంతే నిజం చెప్పు అని అన్నీ మరిసిపోద్ది’. ఇంకొక అమ్మ..

ఒకావిడ ఎవరన్నా అపార్టుమెంటులో కొత్త నగ చేయించుకుంటే చాలుబీరువాలో నగలన్నీ ముందేసి మన నగల ముందు అయ్యి దిగతుడుపు అని మొదలెత్తుద్ది. ఆమెని చూడంగానే సినిమాలో హీరోయిన్‌ నగలు మోడళ్ల గురించి ఎత్తుతా

ఇంకో తల్లి…

ప్రపంచం మొత్తానికీ పనేమీ లేనట్టుతన కుటుంబానికే లోకం అంతా దిష్టి పెడతానికే ఉండట్టూసంసారం కూడా తిథులూవారాలు చూసి చేసిమైలపడి ఇంటిని కడుక్కోటం,నిమ్మకాయలు దిష్టి తీసుకోవటం పనిగా బతుకుద్ది. ఆ అందర్ని చూడంగానే ఏంటమ్మా మొకం వాడిపోయిందినిన్న ఇంటికి ఎవరన్నా వచ్చి ఎల్లారానీకు దిష్టి పెట్టినట్టుగా ఉండారు. ఓ పాతిక నిమ్మకాయలు తీసి పారెయ్‌. నేను కోసి (పచ్చడికి) నాలుగు రోడ్ల మజ్జలో యాత్తా అని అంటా

అమ్మా ఈళ్లంతా పిచ్చి మా తల్లులువీళ్లు కాకుండా ఇంకో తల్లి ఉందమ్మా. రోజూ మొగుడు తెచ్చే మల్లెపూలు తల్లో పెట్టుకుని అయి రాలితే పొద్దినే గది ఊడుత్తానికెల్లినపుడు ఆ అమ్మగారి మురిపెం చూడాలి. ఎపుడన్నా పనిలోకి ఎగ్గొట్టి మరుసటి రోజు ఎల్లి ఏంటమ్మా అయ్యగారు నిన్న మల్లెపూలు ఇంకా రొండు మూరలు ఎక్కువ తెచ్చారా వాడిపోయిన కాగడా మల్లె దండలాగా అయ్యావు అని చక్రాలు తిప్పుతాఈ అన్ని కుళ్లులూచూత్తామోత్తాకడుగుతా బతకాలి కదమ్మా

నీ తప్పేమీ లేదే లోకం నీకు చదువు చెబుతుందిమిగతా విషయం చెప్పు

యాబై రూపాయిల కోసం ఐదు మైళ్లు కడుపుతో నడుత్తా ఎల్లాను. అన్నం తిన్నావా అని కూడా అడక్కుండాసాయంత్రానికి డబ్బులు లేవు అనే కబురు చెప్పింది. రోడ్డు మీనకొచ్చి నడక మొదలుపెట్టానేను పనిచేసే ఇళ్లల్లో అయ్యగారు కారేసుకుని పోతా ఉండాడు.

ఏంటి బూబమ్మా (ఆయన అట్టాగే అంటాడు) ఇక్కడుండా అని పలకరిచ్చి నిలబడ్డాడు.

ఇషయం చెప్పి ఏడిశాను. మార్వాడీబట్టలకొట్టుంది. ముందు రొట్టె తినిపిచ్చిటీ తాగిచ్చాడుకొద్దిగా గొంతులో ప్రాణం లెగిసొచ్చింది. వంద రూపాయలు చేతిలో ఉంచి కారెక్కిచ్చుకున్నాడు. వందకీ ఒక వరం అడిగాడు. ఏం చేత్తాం ఇన్నాను. మా కాలనీ చివర దించాడు. తొందర లేదు టైం తీసుకుని నిదానంగా పని మొదలుపెట్టు ఇంకో వంద ఇత్తాను అన్నాడు. వందలో యాభై గవుర్మెంటాసుపత్రిలో ఇచ్చి పిల్లాడికి సూదేపిచ్చిమిగతా యాబైకి సొసైటీ బియ్యం బ్యాకులో (బ్లాకు) కొని పిల్లలకు అన్నం వొండి పెట్టాను. ఇన్ని బాదలూ పడతన్నా సాయంత్రానికి సీసాకి డబ్బులు ఇవ్వాలి. లేదా తన్నులుఇంట్లో సామాను తాకట్టు పెట్టేవాడు. మా మేనత్త ఇత్తడి దబరా గిన్నె మా ఇంట్లో దాసిందిపనికెల్లి వచ్చేటప్పటికి దాన్ని తాకట్టుపెట్టి దిగ తాగాడు. నెప్పులొచ్చి ఆస్పత్రికి తీసుకెళ్లే వాళ్లు లేక నేను ఏడుత్తుంటేఇత్తడి దబరా కోసం మా అత్త గోల. కన్న తరవాత కొనిత్తానుకడుపులో బిడ్డ మీద ఒట్టుకాత్తి తోడుగా ఆస్పత్రికి రా అని బతిమాలా. ఎట్టనో వచ్చింది. కని ఆపరేషను చేయించుకుని బయటపడ్డా. ఇంటికొచ్చేటప్పటికి ఇంటో సామానంతా తాకట్టయిపోయింది. రిక్షాలు కూడా తాకట్టు పెట్టి తాగడంతిట్టటందొర్లటంకాసేపు ఆపి మా’ అంది.

ఏంటి

తినటానికి ఏవయినా ఉంటే పెట్టు

అన్నం కోడిగుడ్డు పులుసూపప్పూ తింటావా

మో.. గురువారం నీసా.. అస్సలు ముట్టను. తీసి తీసి వేలు చేతిలో పోసినా తినను మా

అదేంటి నువ్వు సాయిబాబా పూజ చేత్తావా

ఎందుకు చెయ్యం. పూలుపెట్టి అగరొత్తులు ఎలిగిత్తా. ప్రతి సంవత్సరం షిరిడీకిగుడదల మరియమ్మ కొండకీ ఎల్లొత్తా

అన్నం పప్పూఅవకాయీ గిన్నెకి ఏసి ఇచ్చా’.

ఇంతకీ మారువాడీ వాడి కోరికేంటో చెప్పలాఆ వరం ఏంటే

మంచి ఆంటీని పరిచయం చెయ్యాలంటమ్మాఅదే మీలాంటి ఆళ్ల దగ్గిర మాట్లాడితే కోసి ఉప్పూకారం రాసే వాళ్లు

ఎంత చెట్టుకి అంతకి రొండింతలు గాలిలేవేఒకటి ఇంటో మొగుడి గాలిరొండు బయట మొగాళ్ల సుడిగాలులుమేం మీలా చెప్పుకోలేంపిసుక్కుని చావటం తప్ప

ఆ మారువాడీకి బట్టల కొట్టుందిచీకిపోయిన లంగాలుజాకీటు ముక్కలు నాలుగు మొకాన పడేసి ఇక కనపడ్డ దగ్గిరల్లా నస- మంచి ఆంటీని పరిచయం చెయ్యమని. ఈయన మాట్లాడతంటే చూసి ఆయన పెళ్లాం పని చేయించుకుని డబ్బులు ఎగ్గొట్టింది. నలుగురు ఆడాళ్లని ఏసుకెల్లి కడిగి వసూలు చేశా.

ఏవని కడిగావే

తినండమ్మా బాగా తినండిమా రెక్కలన్నీ అరిగేదాకా తోమిచ్చుకునిమాకిచ్చే ఎయ్యి రూపాయలే మీ మేడలూమిద్దెలకి తక్కువ పడ్డయ్యి. ఒకసారి జరం అని ఆస్పత్రికి ఎలితే పదేలు వదిలిచ్చావు. మా డబ్బులు నీ వచ్చేసారి రోగం ఖర్చులకి ఉంచుకోమన్నా అంతే ఎమ్మటే తీసి డబ్బులిచ్చింది’.

మరి దాని మొగుడు ఏమీ అనలేదా

ఆనా.. చెపాతీ గాడికి అనే దమ్ముందాఊళ్లో ఆడాళ్లని అడిగే గాడిద..నన్నేం అంటాడుబండి ఏసుకుని బయటకి పరుగో పరుగు

చాలాసేపు నవ్వుకున్నానుకసితీరా నవ్వాను

ఎందుకమ్మా అదోలా నవ్వుతున్నావు

ఏ బడిలో నేర్పుతారు ఈ తెలివితేటలుఒక్క మగాడు తప్ప

మర్నాడు మజ్జాన్నం పన్నెండు గంటలకి దిగింది.

ఏంటి బీబి పొద్దిన ఎనిమిది నించీ మజ్జాన్నం పన్నెండుకి దేకావు

టీలు (స్టీలు) సామానం కొట్టాయన తగిలాడు

ఆడితో నీకు పనేంటి’ అన్నా కోపంగా.

మో బజారులో ఆడా మగాకి నాతో పనిగానీనాకు ఆళ్లతో పని లేదు. ఆళ్లేసే సద్దికూటికోఇదిలిచ్చే చిల్లరతో నా బతుక్కే పనమ్మా. ఆయనది ఒక రకం భజనకట్టుకున్న పెళ్లానికి ఎన్నుపూస అరిగిపోయిందంట. ఎవ్వరయినా తెలిసినాళ్లుంటే చెబితే ఇల్లు కూడా ఇచ్చి పరిమినెంటుగా ఉంచుకుంటాడంట. ఈళ్ల కోరికలు వేరే వాళ్ల దగ్గిరయితే చెప్పు తెగేదాకా తంతారు. పనమ్మాయి నోరు ఎత్తదు కదమ్మా. అందుకని లంచంగా పప్పు ఒండుకునే చిన్న కుక్కరిఅన్నం కుక్కరి (కుక్కర్‌) ఇత్తాడంట. నేను రేపు మజ్జానం ఆడి కొట్టుకి రావాలంట. ఈనా బట్టల కోసం ఆడాళ్లు రడీగా ఉండారా అమ్మా… కుండలు పెట్టి బిందెలు ఎత్తకపోయే మాటలు.. పో.. పోరా గజ్జి కుక్కా అనుకుని వచ్చేశా’.

సరే మిగతా కథ చెప్పు…

ఎక్కడ దాకా నడిసిందమా

కుక్కదాకా

కదా

పిల్లోడికి నాలుగు రోజులకి ఒకనాడు కానీ మూత్రం వచ్చేది కాదు. గవుర్మెంటు ఆస్పత్రికి తీసుకెల్లా తీసుకురాను. కిడ్డినీల జబ్బంటపొట్ట పొడుసుకొచ్చి నరాలన్నీ ఉబ్బి సచ్చిపోయాడు. పోతాపోతా ఒంటరిగా పోకుండా ఆరు నెలలకి వాళ్ల అబ్బని కూడా తీసుకుపోయాడు. బతకటమే చర అనుకుంటే ఇంటో ఎవురు సత్తే ఇంకా యమ చరమ్మా. సావు చెయ్యటానికి నానా సావు సచ్చిఅప్పులు చేసి నలభై రోజుల దినం చేశా. మెడలో నల్లలుకాళ్లమెట్టెలూ పీకి మళ్లీ మురికి గిన్నెలు తోముడు మొదులు. ఈసారి ఇంకా రొండిళ్లు ఎక్కువ. సాయంత్రానికి కాళ్లు పాసి జివజివలాడేయి. పసుపుఉప్పు పెట్టుకొని పనుకునేది. ఇద్దరి పిల్లలని ఏసుకొని పనికి ఎలతా మా అత్తకి డబల్‌ బరువుది ఇత్తడి బిందె ఇచ్చి కాళ్లు మొక్కా. నేను పనికి ఎల్లలేకపోతే నా సావాసగత్తె ఇజయ రొండు మూడిళ్లు చేసి ఎట్టనో నడిపేది’.

ఈ ఇజయ ఎవరే కొత్తపేరు

ఉందిలే శికాకుళం (శ్రీకాకుళం) లాంటి కంత్రీది కాదు

అదేంటే పాపం ఆళ్లేం చేశారు. అట్టా అన్నావు ఒకేసారి

ఈ శికాకుళం వాళ్లు అమరావతి రైలెక్కి వచ్చి తక్కువకి పనిచేత్తా పొట్టలు కొడతన్నారమ్మాఒక గోతానికి వంట గిన్నెలు ఏసుకొని తెగ వత్తారు’.

మరి ఆళ్లూ బతకాలి కదాఅక్కడ బతుకు బాగుంటే ఇక్కడ ఊడిగం చెయ్యటానికి ఎందుకొత్తారే

మరి మేం ఇక్కడ ఆళ్లం ఏమవ్వాల అడక్క తినాలాఒక్క దూదేకుల సాయిబయినా బాగా బతకటం చూశా. అసలే మా మొగోళ్లు పొగులు బస్టాండుల్లో చెవుల్లో గుబిలి తియ్యటంసదువులాఉజ్జోగాలాదో అమ్మగార్లిచ్చిన పాత పాలిస్టరు చీరలూలంగాలుమళ్లీ ఆటికి ఈళ్లు వాటాలునాకు తెలిసి మా బంధువుల్లో చుట్టాల్లో ఏ దూదేకుల సాయిబన్నా కారులో తిరగటం చూడలా.. సరేలేమ్మా ఇషయం కొరిటపాడు నించీ శ్యామలానగరం చేరతంది.. ఇజయ పదమూడేళ్లకే ప్రేమలో పడింది. ఆడు ఒరిస్సా ఓడు. సామి (స్వామి) సినిమా హాలు సెంటర్లో టిఫిను కొట్టు పెట్టాడు. ఇది మైనార్టీ తీరకుండానేఆడి మీద బలవంతం చేశాడని కేసుపెట్టింది. సరే మైనార్టీ తీరేదాకా ఆడు ఆగి దీన్ని పెళ్లి చేసుకోవాలని పెద్దలూపోలీసులూ తీర్పు చెప్పారు. పెళ్లయినాక దీని మోజులో పడి సరిగ్గా పనిచెయ్యకఆ హటలుని ముప్పై ఏలుకి అమ్ముకున్నాడు. ఒకాడ పిల్ల పుట్టినాక ఇద్దరకీ డబ్బులు దగ్గిర గొడవలొచ్చి సంపాదన లేనోడితో నాకెందుకని ఒదులుకుంది. ఆ కూతురిని కూడా దాని బాబుతో మాట్లాడనియ్యదు

దాని కతాదాని బాధలు మనకెందుకునీ విషయం చెప్పు

చపాతీ హోటలు నడిపే ఒకాయన పక్కిల్లు అద్దెకి తీసుకున్నాడు. అందులో చపాతీ చెయ్యటానికి వచ్చిన రవి అనేవాణ్ణి ఉంచాడు. అందరూ చపాతీ మాస్టరు అనే వాళ్లు. రోజూ నా బాధలన్నీ ఆడితో చెప్పుకునే దాన్ని. ఆడూ ఒంఠి సొంఠి కొమ్మల్లే ఒక్కడే చచ్చేవాడు. నాలాల మీద మూతలు కూడా లేకుండా మురికి కాలవ పక్కన ఇళ్లుదోమలుకుట్టీ కుట్టీ ఆడికి జరం వచ్చింది. టీకాసి పోసి జరం బిళ్ల ఇచ్చి నేను పనికి ఎల్లిపోయా. పదకొండింటికి పనికానిచ్చి బయటపడ్డా. గేటు దగ్గిర దుప్పటి కప్పుకుని గజగజా వనుకుతా నిలబడ్డాడు రవి.

ఏందయ్యా అట్టా వనుకుతున్నావు

నాకు జరం ఎక్కువయ్యిందేనీర్సంనేను బతకనుఆకలి..

మా పక్కనే గవుర్మెంటు ఆస్పత్రిల్లో రిటైరు అయ్యి పేదోళ్లకి చూసే టాట్టరు ఫయాజు అహమదు ఉంటాడు. ఆయన దగ్గిరకి తీసుకెల్లా

రక్తపరీక్ష చేసి మలేరియా అని బిళ్లలిచ్చాడు. అదేం సైతాను జరమో మనిషిని నిలువునా ఊపేసింది. అదుగోనమ్మా.. ఆ కనపడే పారీగోడ పక్కనే మూడు రోజులు ఆడు మూసిన కన్ను తెరవలానేను తెరిసిన కన్ను ముయ్యలా. ఇంటాయన నీళ్లిత్తే తాగటంహోటల్లో ఇడ్లీతెచ్చి తినిపిచ్చటంనాలుగో నాటికి కొద్దిగా లెగిశాడు. నేను కూడా ఇంటికొచ్చి తానం చేసి రొండు రోజులు దెయ్యంలా అయిపోయా. ఇద్దరి మనసులూ (?) కలిసిపోయినయ్యి. వారం రోజులు పనికి రానందుకు నలుగురైదుగురు పనిలోనించి పీకి ఇసిరికొట్టారు. సరేలే అయినా బతకాలిగావాడు హిందువులుమేం దూదేకుల వాళ్లంఇక్కడ ఉంటే జాతుల గొడవలు తలకాయి నెప్పులని హైదరాబాద్‌ పారిపోయాం. పాస్టు ఫుడ్డు బండి పెట్టుకొని రొండేళ్లు ఉండి ఈ గొడవలుఇక్కడాళ్ల కోపాలు తగ్గినాక వచ్చాం. ఇది తప్పా… చెప్పమ్మా.. తప్పయితే చెప్పుతో కొట్టు.

ఎవరన్నారే తప్పనినీ బతుకు నీ ఇష్టం. రేపు ఇళ్లు బూజులు దులపాలిఇంకెవరనన్నా తోడు తీసుకురా

సరేనమ్మా పోతన్నా’ అని ఎల్లింది.

పొద్దున్నే వాకింగ్‌ నించీ వత్తంటే టీ కొట్టు దగ్గిర బీబి ఉంది.

ఏంటి బీబిఎవరి కోసం చూత్తన్నా

టీ సుక్కలకి డబ్బులు లేవుఎవరో ఒకరు దొరక్కపోతారాఅని చూత్తన్నా

నేనిస్తా తీసుకో’ అని జేబులో చెయ్యి పెట్టబోయా.

ఎందుకమ్మా నువ్విచ్చేదిఅదుగో ఎండుమిఇరగాయలు బోకరు వత్తన్నాడుతాలుకాయలకి రంగేసి అమ్ముతాడువయసు తెలియకుండా తలకి కూడా తారుకి మల్లే రంగు పూత్తాడుపెళ్లాన్ని చూత్తే ఉచ్చ. బయట మా దగ్గిరే ఈడి చేస్టలు. ఈడి పెళ్లాం నోటికి వారానికి ఒక పనిమనిషి పరార్‌. మా కాళ్లూచేతులూ పట్టుకుని ఎవరో ఒకళ్లని పనికి తీసుకెలతాడు. లేదా ఈడికి ఆరోజు పళ్లెంలో పాసికూడు కూడా గతిలేదు

నా దారిన నేను వచ్చేశా.

మజ్జానం ఒక కొత్త అమ్మాయిని తీసుకుని బూజులు దులపటానికొచ్చింది.

ఇదెవరుమళ్లీ కొత్త పిల్లని తెచ్చావు

‘నా సావాసగత్తె ఇజయ (విజయ) అని చెప్పానే, అదేనమ్మా ఇది. వదిలేసినాడి పేరే రవి. ఆడే దాని మొగుడు. ఇది నా సవితి. మేం ఇద్దరం చిన్నప్పటి నించీ సావాసం. నా దారి నాదే, మా సావాసం మాదే. దానోడుని అది ఎతుక్కుంది. చాలా మంచిదమ్మా. దానికేందో నచ్చలేదు తెంచుకుంది, నాకు నచ్చాడు పంచుకున్నా. ఒకళ్లకి ఓపిక లేకపోతే ఇంకొకళ్లం ఇంటి పని పంచుకుంటామమ్మా.. అంది.

నేను కూడా మా బీబితో చూపుతో చిరునవ్వు పంచుకున్నా.

 

రచన: మన్నం సింధుమాధురి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


   Type Comments in Indian languages (Press Ctrl+g to toggle between English and Hindi OR just Click on the letter)