Featured కథ

నాతి చరామి

 

వేణు నక్షత్రం

 

 

 

కర్మన్ ఘాట్ ప్రాంతం లో ఒక ఖరీదయిన ఫంక్షన్ ప్యాలెస్,    అక్కడ సెలబ్రిటీస్ కి మాత్రమే ఫంక్షన్స్ జరుగుతాయి  అని పేరు.   బయట పెద్ద  సినిమా కటౌట్ల లాగ   వధూ వరుల నిలువెత్తు ఫోటోలు,  కింద తాటి కాయ అంత పేరు “పావని  (B.Sc  ) వెడ్స్ రమేష్  (USA )” అంగరంగ వైభవంగా జరిగింది పెళ్లి .   ఖరీదయిన హొటెల్ లో రిసెప్షన్.   పావని అదృష్టానికి  అక్కడ  సంతోషపడే వాళ్ళ కన్నా  తమ పిల్లలకి అలాంటి అవకాశం రాలేదు అనే ఈర్ష పడే వాళ్లే ఎక్కువ.  అందమయిన ఆరు అడుగుల  గ్రీన్ కార్డు పెళ్ళికొడుకు .    పెళ్లి కాగానే వారం రోజుల పాటు హనీ మూన్ కోసం దేశం లోని పలు ప్రాంతాలు తిరిగి వచ్చారు.  ఆ వారం రోజులు రమేష్ తో గడిపిన రోజులు ప్రతి క్షణం ఒక తీపి జ్ఞాపకం ,  తనకు మంచి భర్తని ప్రసాదించినందుకు కనపడ్డ దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకుంది.     ప్రతి నిమిషం కంటికి రెప్పలా చూసుకునే భర్త దొరికినందుకు చాల సంతోషంగా వుంది పావనికి, తన  సంతోషానికి అవధులు లేవు.

 

వెకేషన్  ముగియడం తో   అమెరికా కి వెళ్లి పోయాడు రమేష్.   పాస్పోర్ట్ వీసా కోసం ఒక నెల రోజులు ఆగాల్సి వచ్చింది పావనికి.  రమేష్ తో గడిపిన రోజుల్ని గుర్తు చేసుకుంటుంటే   క్షణమొక యుగంలా  గడుస్తుంది పావనికి, నిద్రను కూడా లెక్క చేయకుండా  రాత్రనకా  పగలనకా  ఫోన్ లో మాట్లాడుకోవడం,  ఎయిర్ పోర్ట్ ఇంస్ట్రక్షన్స్ ,  అమెరికాలో ఎలా ఉండాలి, జెట్ లాగ్గింగ్ , టైం చేంజ్ ,  ఇలా ఇన్నో విషయాలు చెప్పేవాడు.

 

ఎప్పుడెప్పుడు రమేష్ ని కలుస్తానా, ఎప్పుడు అతని  కౌగిలి లో నలిగి పోవాలా అని ఆత్రంగా వుంది పావనికి.   ఏమయితేనేం ఆ రోజు రానే వచ్చేసింది , పాస్పోర్ట్, వీసా తో ఎయిర్ పోర్ట్ కు వెళ్ళింది.  కొత్తగా అమెరికా వెళ్లే వాళ్లకి  ఎప్పుడెప్పుడు  ఆ  భూతల స్వర్గం అమెరికాలో కాలు పెడతామా, ఎప్పుడు ఆ అమెరికా అందాలు  తనివి తీరా చూస్తామా అన్న ఆతృత తో నే వుంటారు, కాని పావనికి అలాంటి  ఆలోచన  అసలే రావడం లేదు.   ఎప్పుడెప్పుడు రమేష్ ని కలుస్తానా   అన్న ఆశ తప్ప ఇంకేమీ పట్టించుకునే స్థాయి లో లేదు పావని.   అయితే ఈ మధ్య ఎన్నారై పెళ్లికొడుకుల మోసాలు రోజుకొక్కటిగా టివిలో చూపించడం ఒక వైపు భయం కూడా వుంది.   ప్రయాణం  రోజులు  దగ్గర పెడుతున్న  కొద్దీ    రమేష్  తనని  ఇక్కడ చూసుకున్నట్టే అక్కడ కూడా చూసుకుంటాడా అనే అనుమానాలు ఎక్కువ అవుతున్నాయి .   నన్ను వాడుకొని వదలి  పెట్టడు కదా  అనే భయం కూడా . ?    గర్ల్  ఫ్రెండ్ ఏమన్నా వుండి ఉండచ్చా ?    ఒక వేళ ఎయిర్ పోర్టుకి  రాక పోతే నా పరిస్థితి ఏంటి? దేశం కానీ దేశం లో  ఎక్కడికి పోగలను?  తమది  ఒక మామూలు మధ్యతరగతి కుటుంబం, ఒక వేళ  ఏదైనా తేడా జరిగితే  ఎదిరించే సత్తా వుందా ?     ఎన్నో  పిచ్చి పిచ్చి ఆలోచనలతో తన బుర్ర వేడిక్కి పోతుంది .

 

అమెరికాకి ప్రయాణించే  రోజు రానే వచ్చింది.    విమానం లో కూర్చుని సీట్ బెల్ట్ పెట్టుకుంది పావని.  అందరికి మొదటి సారి విమాన ప్రయాణం అంటే భయపడతారు, తనకు మాత్రం అసలు విమానం రన్ వే పై టేక్ ఆఫ్ తీసుకుంటున్నా  అసలు ఏమాత్రం పట్టించుకునే పరిస్థితిలో లేదు .  రమేష్ తో గడిపిన ఆ వారం రోజుల జ్ఞాపకాలు , ఎన్నో  చిలిపి మాటలు, తీయని కబుర్లు ఒక వైపు తనను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి, ఇంకో వైపు పాడు ఆలోచనలు వదలట్లేవు.   మొత్తానికి వాషింగ్టన్ డల్లస్ ఎయిర్ పోర్ట్ లో దిగడం, ఇమ్మిగ్రేషన్ పూర్తి చేసుకొని బయటకు రాగానే రమేష్ తన కండ్ల ముందే  ఉండడం చూసి అప్పటి వరకూ  భయాందోళనలతో వున్న తన మనసు కుదుటపడింది.  దేవతలకందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంది మనసులోనే.    రమేష్ ని చూడగానే పరుగెత్తి  గట్టిగా  హత్తుకుంది, అంత సంతోషం లో మాటలు కూడా రాలేదు, గట్టిగా ఏడ్చేసింది ఎన్నో ఏళ్ళ ఎడబాటు లా..  ఏదో  జరిగినట్టు!  సెక్యూరిటీ వాళ్లకు సర్ది చెప్పడం రమేష్ వంతు అయ్యింది.

 

కోటి ఆశలతో రమేష్ తో  తన  జీవన ప్రస్థానాన్ని  ఊహిస్తూ కారులో  సీట్ బెల్ట్ పెట్టుకొని  కూర్చుంది పావని.   నిద్ర వస్తుందా అని అడిగి జెట్ లాగ్ గురించి వివరించాడు రమేష్  మరొక్క సారి.   టైం డిఫరెన్స్, వాక్ వే పై నడవడం, సిగ్నల్ వద్ద రోడ్ క్రాసింగ్ బటన్ నొక్కడం, ఏది కొనాలన్నా క్యూ లో నిలబడడం  ఇవన్నీ ఫోన్ లో చాలా సార్లు చెప్పాడు మళ్లీ ఇప్పుడు ప్రాక్టికల్గ చూపిస్తున్నాడు బయటకు చూపుతూ.  కారులో కూర్చున్న 20 నిమిషాల్లో వర్జీనియా లోని ఆష్బర్న్  చేరింది పావని.   ఎటు చూసినా ఇండియన్స్ , లుంగీలతో వాకింగ్ చేసే వాళ్ళు  కొందరు , నైటీలతో పక్కింటి వాళ్ళతో మాట్లాడుతూ కొందరు , పిల్లలను ఆడిపిస్తూ  ఇంకొందరు స్త్రీలు.  సైకిళ్ళు తొక్కుతూ పిల్లలు.   అంతా  ఇండియాలో లాగానే ..   విచిత్రంగా చూస్తుంది పావని.

 

ఏమిటి అంత విచిత్రంగా చూస్తున్నావ్ , ఇక్కడ  చాలా మంది ఇండియన్స్ వుంటారు, అందులో  నైంటీ పెర్సెంట్ తెలుగు వాళ్ళే .    నేను ఆఫీస్ కి వెళ్ళితే నీకు బోలెడంత కాలక్షేమం, నీకేమీ ప్రాబ్లెమ్ ఉండదు!  ఏమనాలో తెలియక తల మాత్రం ఊపింది పావని  ఏదో అర్థం అయ్యినట్టు.

 

అంతలోనే తానుంటున్న టౌన్ హౌస్ కి చేరుకున్నారు.  ఇల్లు పెద్దదే , ఇద్దరికీ ఇంత పెద్ద ఇళ్లా  అన్నట్టు చూసింది పావని, ఇక్కడన్నీ  ఇలాగే  ఉంటాయి అని చెపుతూ బాత్రూమ్ లో షవర్ ఎలా ఓపెన్ చేయాలో, ఎలా క్లోజ్ చెయ్యాలో అన్నీ చూపాడు.  స్నానం చేసి రాగానే నిద్ర ముంచుకు వచ్చింది,  ఆపు కోవడం తన వళ్ళ కాలేదు.  పావని స్నానం చేసి వచ్చే వరకు  ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ లో ముందుగానే  టైమర్ ఆన్ చేయడం వళ్ళ  వేడి వేడి అన్నము రెడీ అయ్యింది.   ఫ్రిడ్జ్ నుండి తీసిన కర్రీస్ ను మైక్రో ఓవెన్ లో వేడి చేసి ,  పచ్చడి, పెరుగు అన్నీ డైనింగ్ టేబుల్ మీద సిద్ధంగా ఉంచాడు రమేష్ .  కానీ పావని ఇలా వచ్చి అన్నీ  చూస్తూనే సోఫాలో కూర్చుని గాఢ  నిద్రలోకి వెళ్లి పోయింది.   రమేష్ మాత్రం భోజనం ముగించేసి టీవీ చూస్తూ నిద్ర పోయాడు.

 

రాత్రి  అంటే తెల్ల వారు జాము 3 గంటలు ,  రమేష్ గాఢ నిద్రలో వున్నాడు,  డైనింగ్ టేబుల్ మీద అన్నీ అలాగే తన కోసం వెయిట్ చేస్తున్నట్టుగా వున్నాయి.   కొంచెం అన్నం, పెరుగు తో నోరు ఎంగిలి చేసింది .   పాపం అంత కష్టపడి అన్నీ  ఆరెంజ్ చేస్తే ఏవీ తినకుండా అసలు నిద్రను కంట్రోల్ చేసుకోలేక పోవడం తనపై తనకే  సిగ్గుగా అనిపించింది, పాపం రమేష్ ఏమి అనుకున్నాడో అని మనసులోనే నొచ్చుకుంది.   అసలు ఫ్లైట్ లో నిద్ర పోతే కదా ఒక వైపు రమేష్ పక్కన తన భవిష్యత్తు ఎంత అందంగా ఉంటుందో అని ఊహించు కోవడం,  ఇంకోవైపు  “మరో ఎన్నారై మోసానికి తెలుగు  అమ్మాయి బలి  ”   అని పదే  పదే చెవుళ్ళో  మారు మ్రోగుతున్న టీవీ బ్రేకింగ్ న్యూస్  పాడు ఆలోచనలు.   తను భయపడ్డట్టు ఏమి జరగనందుకు  మరొక్క సారి దేవునికి మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకుంది.     మొట్ట మొదటి సారిగా కన్న వాళ్ళను, పుట్టినూరిని  వదలి  ఇలా  సప్త సముద్రాలు దాటి ఇంత దూరం రావడం కూడా భయానికి కారణం.  ఊహించినట్టు ఏమి జరగక పోవడం,  తన కోసం రమేష్  పడుతున్న తపన అన్నీ చూస్తూ  మెల్లి మెల్లిగా  తనలోని భయాన్ని దూరం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది.   దేవుడా నాకు ఇంత మంచి భర్తను ప్రసాదించినందుకు నేను ఏమిచ్చి  తీర్చగలను నీ ఋణం  అని మనసు లోనే అనుకుంటూ, తన అదృష్టానికి తానే మురిసి పోతూ హాయిగా నిద్ర పోయింది కొన్ని గంటల తర్వాత .

 

హ్యాపీ  అండ్  జాలీ గా లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారు రమేష్ పావని .   మంచి ఫ్రెండ్ సర్కిల్ ,  ఖరీదయిన ఇంపోర్టెడ్ కార్లు.   రీసన్ వున్నా లేకున్నా వీకెండ్ పార్టీలు.   ఇండియా కి వారం రోజులకోసారి తప్పని సరిగా ఫోన్ చేసే వాళ్ళు  ఇద్దరి తల్లి తండ్రులకి.  ఇంట్లో వూరికే కూర్చుండకుండా  తన  గ్రాడ్యుయేషన్  లో నేర్చుకున్న  ఇంటీరియర్ డిజైనింగ్ ఫ్రెండ్స్ కి  ఉచితంగా చేసేది,   ఇప్పుడు అందులో చాలా బిజీ అయ్యింది పావని.   రమేష్ కూడా తన ఆలోచనలకూ సరిపోయే విధంగా  నడచుకొనే భార్య దొరికింది అని చాలా  సంతోషించేవాడు , పొగిడేవాడు పావనిని.         గ్రీన్ కార్డు అప్లై చేయడం ,  వర్క్ పర్మిట్ రావడం కూడా జరిగి పోయింది.  జాబ్ ట్రయల్స్ కూడా మొదలు పెట్టింది, రమేష్ కూడా జాబ్ చేయమని ప్రోత్సహించాడు.  ఇంటీరియల్  డిజైన్ చేసే ఒక కంపెనీలో వుద్యోగం దొరికింది, మంచి జీతం .   ఇంటికి వచ్చాక వీకెండ్స్ కూడా అప్పుడప్పుడు చేసేది .  అంత బాగుంది అనుకునే లోగా   అప్పుడప్పుడు  పొత్తి కడుపులో నొప్పి  వస్తుంది,  ఆ నొప్పి చిన్నదే అని  తానే భరించింది కానీ  ఎప్పుడూ రమేష్ కి తెలుపలేదు.   ఒక రోజు మాత్రం చాల నొప్పి  చేసింది  భరించరానంత.    ఎమర్జెన్సీ కి తీసుక పోయాడు రమేష్,  కానీ విచిత్రం ఏమంటే హాస్పిటల్ కి వెళ్ళగానే నొప్పి తగ్గింది.    కొంచెం సేపు పరిశీలించిన  డాక్టర్ ఏమన్నా  సిస్ట్ ఉండవచ్చు,   అది అందరి లో కామన్  గానే ఉంటుంది, కానీ   కొందరిలో కొంత పెద్ద సైజ్ లో ఉంటుంది .   మళ్ళీ  ఎక్కువ నొప్పి వచ్చినప్పుడు స్కానింగ్ చేద్దాం అని చెప్పి నెక్స్ట్ డే పంపించేశారు హాస్పిటల్ నుండి.   ఈ మధ్యలో మల్లీ  ఎప్పుడూ రాలేదు కడుపు నొప్పి.   అలా కాల చక్రం ఒక సంవత్సరం  తిరిగి పోయింది.

 

ఇంతలో  ఫస్ట్ వెడ్డింగ్  ఆన్నివర్సరీ రానే వచ్చింది.  బహమాస్ క్రూజ్  సర్ప్రైజ్  ట్రిప్  ప్లాన్ చేసాడు  రమేష్ ,   ఎంతో  సంతోష పడింది పావని. టూర్ నుంచి రాగానే ఇండియా కి ఫోన్ చేసి తన  తల్లితండ్రులకి  బహమాస్ క్రూజ్ విశేషాలన్నీ  చెప్పింది.   రమేష్ గురించి తెగ పొగుడుతూ ఆ వారం లో చేసిన అడ్వెంచర్స్ అన్నీ   గొప్పగా చెప్పింది .  చాల సంతోష పడతారు అనుకుంది కానీ  తాను అనుకున్నంత  పెద్దగా స్పందన రాక పోవడం వళ్ళ  కొంత ఇబ్బందికి గురి అయ్యింది  పావని.   తన తల్లి కానీ , అత్త గానీ  ( రమేష్ తల్లి)   కానీ ఇప్పుడు వీళ్ళ ఎంజాయ్ ని వినే పరిస్థితిలో లేరు,  ఇప్పుడు కొత్తగా   ” పెళ్లి అయి సంవత్సరం అయి పోయింది ,, మరి గుడ్ న్యూస్ ఎప్పుడూ?”   అనే ఈ మాట ఫోన్ చేసిన ప్రతిసారి పావని గుండెలో గునపంలా గుచ్చు కుంటుంది.  డాక్టర్ దగ్గరికి  వెళ్లి నారా ?  ఒక సారి పోయి రండి అని అమ్మ చాలా సార్లు చెప్పింది ,  కానీ రమేష్  ఇప్పుడే పిల్లలకి  ఏమి తొందర,  కొద్ది  రోజులు ఆగుదాంలే అన్నాడు.     ఇంక  వాళ్ళ మాటలు వినలేక, రమేష్ ని  ఒప్పించి  ఇప్పుడు ఎలాంటి  ఫామిలీ ప్లానింగ్ పద్ధతులు పాటించడం లేదు పావని.  అలా  కొన్ని నెలలు జరిగి పోయాయి.  మళ్ళీ  అప్పుడప్పుడు   చిన్నగా  కడుపు  నొప్పి వస్తుంది .   ఇప్పుడు నిజంగానే పావనికి భయం పట్టుకుంది.

 

ఒక రోజు గైనకాలజిస్ట్  అప్పాయింట్మెంట్  తీసుకొని పోయివచ్చారు .    డాక్టర్ ఏవేవో పరీక్షలు చేసి మల్లీ రమ్మన్నారు.  కడుపు నొప్పి గుంరించి స్కానింగ్ అవసరం అన్నారు .    ఒక వారం రోజుల తర్వాత మల్లీ రమ్మన్నారు,    అప్పుడే ఒక పిడుగు లాంటి వార్త చెప్పింది డాక్టర్,   తను గర్భం దాల్చడం చాలా కష్టమన్నారు.   మెడికల్ భాషలో   పెల్విక్ అబ్సెస్.  ఎండోమెట్రియోసిస్  అనే ఒక పెద్ద సిస్ట్ తన కడుపులో పెరుగుతుంది,  దాన్ని లాపరోస్కోపీ ( చిన్న ఆపరేషన్ )  ద్వారా తొలగిస్తే  కొంత చాన్సు ఉంటుంది అన్నారు,  కడుపు నొప్పికి కూడా కారణం అదే అన్నారు.    ఆ విషయం విన్నప్పటి నుండి  పావని మనసు మనసులో  లేదు,  తల తిరిగి పడిపోయింది,  రమేష్ ఎలాగోలా ఇంటికి  చేర్చి  సర్ది   చెప్పాడు, భయ పడాల్సిన పని లేదు అన్నాడు.    ఆపరేషన్ చేస్తే ప్రాబ్లెమ్ సాల్వ్  అవుతుంది అని  బాగానే ధైర్యం చెప్పాడు .   వాళ్ళ అమ్మకి తనే  ఫోన్ చేసాడు ,  ఎప్పుడూ స్పీకర్ ఫోన్ లో మాట్లాడే వాడు  కొంచెం మెల్లిగా ఎవరికీ వినపడే నంత మెల్లిగా సరి చెపుతున్నాడు  ఏదో తప్పు జరిగినట్టు .    అమ్మకు చెప్పుకొని బోరుమని ఏడ్చింది  పావని .  చిన్న ఇంజక్షన్ అంటేనే ఆమడ దూరం పరుగెత్తే పావని , ఇప్పుడు   ఆపరేషన్ కి కూడా సిద్ధం అయ్యింది .

 

భయపడుతూనే  హాస్పిటాల్  కి  వెళ్ళింది.    రమేష్ ఎంతో ధైర్యం చెప్పాడు . లాపరోస్కోపీ జరిగింది, అందులో సిస్ట్   పెద్దదే అని  తేలింది.   పెద్ద ఆపరేషన్ చేస్తే కానీ తీయలేము అన్నారు.     తన ఇంటీరియర్ డిజైన్  పని బాగానే జరుగుతుంది  కానీ ఇంతకు ముందు లాగ ఉత్సాహం లేదు.     ఎప్పుడూ  సంతోషంగా మాట్లాడే అత్తగారు  కనీసం మాట వరసకి కూడా ఎలా జరిగింది అనకపోవడం  చాల  బాధేసింది ,  పొడి పొడి మాటలతోనే సరిపెట్టడం మరింత బాధకు గురిచేసింది పావనికి, కొత్త అనుమానాలకి  తావు ఇస్తుంది.      ఇంకా ఆలస్యం ఎందుకని ఎండోమెట్రియోసిస్  ఆపరేషన్ కోసం   భయపడుతూనే  సిద్ధం అయింది పావని.

 

అది మెటర్నిటీ వార్డు,  ఎటు  చూసినా  నెలలు నిండిన గర్భవతులు, లేదా  బొడ్డు కూడా ఊడని  పసి కూనల ముద్దు మురిపాలతో తల్లులు.   కన్న బిడ్డలపై ఆ  ప్రేమ ముందు,   ప్రసవ వేదన  వారి ముఖం లో అసలు కనపడడం  లేదు .    అందరి  కడుపులోనో,  ఒళ్ళోనో  ఒక  బిడ్డ,   తన కడుపులో మాత్రం  ఒక  మాంసపు గడ్డ .    ఆ పరిస్థితిని చూసి జీర్ణించుకోలేల పోయింది,  పుట్టెడు దుఃఖం వచ్చింది.    అక్కడి నుండి పారిపోవాలి అన్నంత బాధ,    రమేష్ దగ్గరుండి ఓదార్చాడు!     మొత్తానికి ఆపరేషన్ చేసి ఒక క్రికెట్ బంతి అంత సైజ్ వున్న సిస్ట్(గడ్డ) ని తీయగలిగారు డాక్టర్లు.     ఆలా మూడు రోజులు  ఎందరో పసి కూనల  ముద్దు ముద్దు సందడుల మధ్య,  కేర్ కేర్ మని ఏడుపులు మధ్య ,   బాలింతల  సంతోషాల మధ్య  అసలు తనకు తల్లి అయ్యే ప్రాప్తం ఉందా లేదా  అని మనసులోనే  వేల   కొలది  ప్రశ్నలు  తలెత్తుతూ  ఉంటే అంత కంటే నరకం మరోటి లేదు అనిపించింది,  క్షణమొక యుగంలా తోచింది.  రమేష్ మాత్రం  ఆఫీసుకి సెలవు పెట్టి చాల సపోర్టివ్ గా వున్నాడు ఈ మూడురోజులు.    కొన్ని నెలలు ఆగి పిల్లలకోసం ట్రై చెయ్యమన్నారు డాక్టర్లు, కానీ ఛాన్సెస్ చాల తక్కువ అన్నారు,  ఆల్మోస్ట్ నిల్  అని కూడా అన్నారు.    ఇప్పుడు పావని ఇంతకు ముందులా  సంతోషంగా లేదు,   అత్తగారు  ఎప్పుడన్నా ఫోన్ చేస్తే  మాట్లాడం  లేదు, పలకరిస్తే ముక్తసరిగా ఊ , హా అంటుంది .    కాలచక్రంలో మరో సంవత్సరం తిరిగింది,    వూరికే ఎందుకు దిగులుగా కూర్చుంటావ్,   నీ బిజినెస్  మళ్ళీ  స్టార్ట్ చెయ్యమని  రమేష్   అంటే  కొన్ని నెలల గ్యాబ్  తర్వాత స్టార్ట్ చేసింది .    ఈ పని వల్ల మనసు కొంత కుదుట పడింది,  పనిలో ఇప్పుడు  బాగా బిజీ అయ్యింది,  కానీ మానసికంగా చాలా వీక్ అయ్యింది .     ఇప్పుడు  ఏ ఫోన్  మ్రోగినా   భయపడే పరిస్థితికి వచ్చింది .     రమేష్ కూడా ఈ మధ్య వాళ్ళ అమ్మతో  చాటుగా మాట్లాడుతున్నాడు .

 

రమేష్ వాళ్ళింట్లో ఏకైక పురుషుడు, తనకో అక్క వుంది, ఎప్పుడో పెళ్లి అయ్యింది పిల్లలు కూడా .   మాట మాట్లాడితే అల్లున్ని  ఎప్పుడు ఇస్తావ్ అంటుంది  రమేష్ అక్క .    వారసుని కోసం రమేష్ తల్లి పోరుకూడా యిప్పుడు ఎక్కువయింది.     రమేష్ చాలా మౌనంగా ఉంటున్నాడు .   పక్కనే వున్నా ఏదీ మాట్లాడడు పావనితో  .    ఆ మౌనం  ఎంత భయంకరంగా ఉంటుందో  ఒక్క పావనికే తెలుసు.     మళ్ళీ కొన్ని రోజుల తర్వాత  డాక్టర్ని సంప్రదించారు పావని రమేష్ .   పిల్లలు పుట్టడం కష్టం అన్నారు డాక్టర్లు , పెల్విక్ అబ్సెస్  వళ్ళ పిల్లలు పుట్టడం అనేది అసాధ్యం అన్నారు.   ప్రపంచం తలక్రిందులు అయ్యిందని పించింది పావనికి,  తన కాళ్ళ కింది నేల  కరిగి పోతున్నటుగా అనిపిస్తుంది.    రమేష్ కూడా ఇప్పుడు ఆలోచనల్లో పడ్డాడు.  రిపోర్ట్స్ అన్నీ  తెలిసిన ఇంకొక  డాక్టర్ కి  కూడా చూపారు,  ఆయన చెప్పిన విషయం కూడా అంతే,  ఏ మిరాకిలో జరిగితే తప్ప   పిల్లలు పుట్టడమనేది  సాధ్యం కాదు అన్నాడు.     రమేష్ కూడా ఇప్పుడు చాల వరకు పావనికి దూరంగా ఉంటున్నాడు,   పావని మాత్రం తన పని తాను చేసుకుపోతుంది .   ఏదో విధంగా మాట్లాడడానికి ట్రై చేస్తుంది పావని,  కానీ రమేష్ ఇంతకు ముందు లాగా అసలు మాట్లాడడం లేదు .   రోజు రోజుకీ  వాళ్ళ మధ్య దూరం  పెరుగుతుంది.     చాటు చాటు గా  ఫోన్ లు,  వాళ్ళ అమ్మ  లేదా  అక్కతో మాట్లాడుతున్నట్టు   తెలిసి పోతుంది వాలకాన్ని బట్టి.    పావనికి  విషయం అర్థం అవుతుంది.   వాళ్ళ అమ్మతో ఇంకో ఇద్దరు ఫ్రెండ్స్ తో అప్పుడప్పుడూ చెప్పుకొని చాలా బాధ పడుతుంది .

 

ఎందుకు సరిగ్గా మాట్లాడడం లేదు, ఇందులో నా తప్పేముంది అని ఒక రోజు గట్టిగ నిలదీసింది పావని రమేష్ ని.   అమ్మ వారసుని కోసం అడుగుతుంది , లేకుంటే రెండో పెళ్లి చేసుకొమ్మని అంటుంది.  అక్క కూడా వినడం లేదు.    కుండ బ్రద్దలు కొట్టినట్టు అసలు విషయం బయటపెట్టాడు రమేష్.   అంతే,  దుఃఖం ఆగలేదు పావనికి, తన తలమీద పిడుగు పడ్డట్టు అనిపించింది,   రెండు మూడు నిమిషాల వరకు ఏమి మాట్లాడలేక పోయింది,   ఆగని కనీళ్ళని తుడుచుకోవడం తప్ప.   ఈ పరిస్థితి రాబోతుందని ఎప్పుడో ఊహించింది, కానీ ఇంత త్వరగా వస్తుందని ఊహించ లేదు.   ఇన్ని రోజులు  తన వాడు అనుకున్న వాడే దూరం అయ్యే పరిస్థితి వచ్చింది,  ఏ సందేహం వచ్చినా,  ఏ  ప్రశ్న తలెత్తినా రమేష్ ఇది బాగుందా? రమేష్ ఇది సరి పోయిందా?  అని అయిన దానికీ, కాని దానికీ   రమేష్..  రమేష్ !    తన సర్జరీ జరిగినప్పుడు,  చుట్టూ పసిపిల్లలు, గర్భిణులతో మూడు రోజులు గడపడం,  అందరు బిడ్డలతో డిశ్చార్జ్ అవుతుంటే,    తాను తన కడుపులో గడ్డను అక్కడ వదిలేసి వచ్చినప్పుడే తన గుండె రాయి అయ్యింది.      ఇప్పుడు   తన జీవితం తన చేతుల్లో వుంది,  చేజారి పోతున్న దాన్ని  నిలుపు కోవడమనేది  తన  ప్రస్తుత కర్తవ్యం.    దుఃఖాన్ని అదుపులో పెట్టుకోవడానికి ప్రయత్నిస్తుంది,  మనసును  కుదుట పరుచుకుంది .

 

“రెండో పెళ్లి … ఎంత ఈజీగా చెప్పావ్ రమేష్..  ఇన్ని రోజుల మన పరిచయం, స్నేహం , కాపురం .. అంతా వట్టిదేనా ? అంత మోసమేనా? అయినా నేనేమన్నా నా  లోపాన్ని దాచాన్నా?    తల్లి కావాల్సిన ఆ కోరిక నాకు మాత్రం ఉండదా?     పిల్లలు పుట్టనంత మాత్రనా రెండో పెళ్లే  మార్గమా?” బాగానే నిలదీసింది రమేష్ ని.

“అది కాదు పావని,  నేను సర్ది చెప్పాను  కానీ వాళ్ళు వినడం లేదు?”  సంజాయిషీ ఇచ్చుకున్నాడు రమేష్.

” మీ  అక్కకు కూడా ఈ పరిస్థితి వచ్చి ఉంటే మీ అమ్మ ఇదే పరిష్కారం చెప్పేదా?   సాటి ఆడదే ఇంకో ఆడదాని పరిస్థితి అర్థం చేసుకోకుండా ఈ విధంగా తన కన్న కొడుకులని ప్రేరేపించడం దేనికి నాంది? ”

“పావని , నీకు అన్యాయం చేస్తానని చెప్పలేదే ? ” కొంచెం స్వరం పెంచాడు రమేష్ .

” అంటే .. నేను ఇంకో స్త్రీ తో నిన్ను పంచుకోవాలా ?

” తప్పేముంది ? ఎంత మంది రెండో పెళ్లి చేసుకోవడం లేదు?

“తప్పు నాది కానప్పుడు ఇంతటి దారుణ మైన శిక్ష నేను  ఎందుకు అనుభవించాలి?   ఎంత మంది పిల్లలు పుట్టని వాళ్ళు  పిల్లలని దత్తత తీసుకోవడం లేదు?   ఇలా ఎందుకు ఆలోచించవు ?

మన కాపురం మనది రమేష్ .. నీకు నేను .. నాకు నువ్వు … ఏదైయినా మనం నిర్ణయించుకోవాలి.  నీతో కలకాలం నడవడానికే  ఆ రోజు ఏడడుగులు నడిచాను.

నాతిచరామి అని చేసిన ఆ ప్రమాణం కూడా  అదే.. కష్టాల్లో , సుఖాల్లో   కలిసే  ఉంటా  అని  నువ్వు చేసిన ప్రమాణం!  అంతే కానీ ఇలా మధ్యలో వదిలేసి వెళ్ళడానికి కాదు”

 

“ఆ …  ఎవడికో పుట్టిన వాళ్ళను తీసుకొచ్చి డాడీ అని పిలుపించుకునే స్థితిలో లేను నేను,  మా అమ్మ కూడా అసలే ఒప్పు కోవడం  లేదు?”

” అమ్మ .. అమ్మ .. అమ్మ .. సాటి ఆడదాని పరిస్థితి ఆలోచించనిది  అమ్మ.    నీతో చివరి వరకు నడవాల్సింది నేను కానీ మీ అమ్మ కాదు!    ఏ నిర్ణయం అయినా  తీసుకోవాల్సింది  మనమే కానీ మీ అమ్మ కాదు. ఇంట్లో ఈ గోడకి ఏ రంగు వేద్దాం అని అడిగిన వాడివి, సూపర్ మార్కెట్ కెళ్ళి ఏ కూరగాయలు తేవాలి అని అడిగిన వాడివి,  కానీ  నీ లైఫ్ పార్టనర్ ని మార్చుకోవాలనుకున్నప్పుడు  నాతో ఒక్క సారి మాట్లాడాలనిపించ లేదా రమేష్?  అంత  గట్టి  నిర్ణయం తీసుకోవడానికి మాత్రం ఒక్క మాట నన్ను అడగలనిపించ లేదా?   ఆ రోజు  పెళ్లి చేసుకొని భయపడుతూ  కాపురానికి  వచ్చిన నాకు, నీవు చూపిన ప్రేమ, ఆప్యాయత, ఎన్ని జన్మలకయినా నీవే నా భర్త కావాలని కనపడ్డ దేవుళ్లనల్లా కోరుకున్నా !  ఇప్పుడు అదంతా నటనేనా? అంత వట్టి ట్రాషేనా? ”

 

” పావని .. నన్ను ఎందుకు అర్థం చేసుకోవు.. ? ” రమేష్  ఏదో సర్ది చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు.

“అర్థం చేసుకున్న రమేష్ .. నీ దృష్టిలో  జీవితం అంటే, ఇంటి పేరు నిలబెట్టడానికి వారసులు .. అంతేనా ?  వారసుల కోసం  .. ఎంతటి అనుబంధాన్నయినా పుల్లను విరిచినట్టు విరిచేస్తావ్?  అయినా ఎంత మంది వారసులు తమ ఇంటి పేరుని నిలబెడుతున్నారు ?   అసలు మనమే పోయిన తర్వాత మన వారసత్వం  మనకు ఎక్కడ కనపడుతుంది?    బ్రతికి వున్నప్పుడు దగ్గరికి రానీయని కొడుకులు కూతర్లని ఎంత మందిని చూస్తున్నాం? ఎంత మంది తల్లి తండ్రులు వృద్దాశ్రమాల్లో తమ శేష జీవితం గడపడం లేదు.    రేపు నీ వారసులు నిన్ను ఆదరిస్తారని గ్యారంటీ ఏమిటి? ”

 

గొంతు పూడ్చుకో పోయింది .. మల్లీ  సముదాయించుకొని  ..  “రేపు రెండో పెళ్లి చేసుకున్నా  పిల్లలు పుడతారో పుట్టరో తెలియదు,  పుట్టినా   ఎలా వుంటారో కూడా  తెలియని వాళ్ళ  కోసం..  నిన్నే నమ్మి,  నీవే లోకమని,  కలకాలం నీతో నడవడానికి వచ్చిన నన్ను  దూరం చేసుకుంటావా?   ఇదేనా నీవు ఇక్కడ  చదువుకున్న  చదువు ? ఇదేనా ఇంత అభివృద్ధి చెందిన దేశం లో నీవు నేర్చుకుంది ?   ఏది రియాల్టీ యో , ఏదో ఫాంటసీ యో తెలుసు కో రమేష్,  ఐ నో,  యు కన్  అండర్ స్టాండ్ మచ్ బెటర్ దన్ మి!  నీ స్వంత నిర్ణయం తీసుకో ”   ఎప్పుడూ  ఇన్ని మాటలు మాట్లాడలేదు పావని.    అసలు అంత  మాట్లాడవలసిన  అవసరం  కూడా ఎప్పుడూ రాలేదు,  ఏడుస్తూ బెడ్ రూమ్ లోకి వెళ్లి తలుపు  వేసుకొని పడుకుంది .

 

పడుకుందే  కానీ  ఎన్నో ఆలోచనలు సుడులు తిరుగుతున్నాయి.   సర్జరీకి వెళ్లిన  రోజు హాస్పిటల్ లో ఆ రాత్రి ఇలాగే  ఏడుస్తుంటే రమేష్ మరీ తాను దగ్గరికి తీసుకుని  కళ్ళు తుడిచాడు.  కళ్ళల్లో నీరు చెంపల మీదుగా వరదలా ప్రవహిస్తున్నాయి,  కానీ ఇప్పుడు తుడిచే వారు వున్నా లేనట్టే !  ఆ ఆప్యాయత,   ప్రేమ ఇప్పుడేమయ్యింది?  నేను చేసిన తప్పెంటి ?   ఎందుకు నాకీ శిక్ష ?

 

మెల్లిగా బెడురూమ్ తలుపు తెరుచుకుంది,   రమేష్ వచ్చి బెడ్ పైన దూరంగా కూర్చున్నాడు ఆంటీ  ముట్ట నట్టు .

“పావనీ .. ఇంతకు ముందు నీవు అన్నావ్, గోడకి రంగు నన్నే అడిగే  వాడికి, ఇంకా ఏవో, ఏవో ..  ఇప్పుడు కూడా నేను అదే అంటున్నాను, నీ ఇష్ట ప్రకారమే నీకు నచ్చిన అమ్మాయినే  పెళ్లి  చేసుకుంటాను, మొత్తం ఫైనాన్సియల్ రెస్పాన్సిబిలిటీస్, ప్రాపెర్టీస్ అన్నీ  నీ పేరు మీదే రాస్తాను, నీవే దగ్గరుండి పెళ్లి చేయి,  ఇంకా ఏదో ఏదో చెపుతున్నాడు,  ఆ తర్వాత వినలేక పోయింది.    “రమేష్ .. క్యాన్ యు స్టాప్ ..? ” అరిచింది గట్టిగా .. ఇంత గట్టిగా ఎప్పుడూ అరవలేదు తనకు గుర్తున్నంత వరకు .  అంతే వెంటనే బయటకి వెళ్ళాడు రమేష్ .

వాళ్ళ అమ్మతో ఫోన్ లో మాట్లాడుతున్నాడు,  చాల రోజుల తర్వాత  ఇప్పుడు తన ముందే .. అదీ  స్పీకర్ ఫోన్ పై ..    “వింటలేదు  అమ్మా .. ”   కొంచెం భయంగా .. లోగుంతులో చెప్పాడు రమేష్ ..

“వినక పోతే విడాకులు పంపేయ్ .. దానితో బతిమిలాడేది ఏమిటి?  హాయిగా  తిని కూర్చుండి  కృష్ణా … రామా ..  అనుకోక!   దాని బతుకేదో బతుకని .. చెపితే వినక పోతే చెడంగా చూడాలి!   మీ నాన్న మాత్రం  వారసుడు  కావాల్సిందే అంటున్నాడు,  ఆ  గజ్వెల్  సంబంధం  వాళ్ళు రెడీగా వున్నారు,   దేనికి తగ్గేది లేదు ”  ఆవేశంగా చెపుతూనే వుంది వాళ్ళ అమ్మ.

ఫోన్ కట్ చేసి సోఫాలో అలాగే ఒరిగాడు రమేష్ ..

 

రాత్రి పన్నెండు దాటి పోయింది … నిద్ర పట్టడంలేదు పావనికి,  పైగా ఆకలి కూడా అవుతుంది  కానీ తినాలనిపించడం లేదు.   మనసులో మాత్రం వాళ్ళ అమ్మ మాటలు “వినక  పోతే విడాకులు పంపేయ్”    ఇంకో వైపు రమేష్ మాటలు  “మొత్తం ప్రాపెర్టీస్ అన్నీ నీ  పేరు మీదే రాస్తాను”  సుడులు తిరుగుతున్నాయి.

ప్రాపర్టీస్, లోన్లో తీసుకున్న అపార్ట్మెంట్ అండ్ లోన్ లో తీసుకున్న ఇల్లు అమెరికాలో.  ఈ మధ్య తన ఇంటీరియల్ డిజైనింగ్ లో రమేష్ కన్నా తానే ఎక్కువ సంపాదిస్తుంది.

 

వేద మంత్రాల మధ్య, వేల మంది సమక్షంలో దేవుని సాక్షిగా ప్రమాణం చేస్తూ  జరిగిన  పెళ్లి,   ఇంత ఈజీగా విడాకులు అంటున్నారే!   అనుబంధాలకి, ఆప్యాయతలకి అర్థమే లేదా?    వీళ్ళు మనుషులేనా ..?   మొదటి సారిగా అసహ్యం వేసింది వాళ్ళ మీద.    పెళ్లి తంతు గుర్తుకు వచ్చింది .   ” ధర్మేచ అర్ధేచ కామేచ ..  నాతిచరామి ”  పండితుడు చదువుతున్నాడు తన తండ్రి చేతిలో నా చేతి .. తర్వాత రమేష్ చేతిలో పెడుతూ ..  … నాతిచరామి ..   అంటే ..  తండ్రి తన  కూతుర్ని అల్ల్లుడికి దానం చేయడమా ?    ధర్మ అర్ధ కామములలో కలసి నడవండీ  అని పెళ్లి కూతురు తండ్రి చెప్పడం,  దానికి అల్లుడు సరే అనడం!  కానీ ఎంత మంది అల్లుళ్ళు   సరే  అన్నారో కాని, అల్లుని బుద్ది  మారి ఇలాంటి నీచమయిన  ఆలోచనలతో వస్తే దానికి పెళ్ళిలో  చేసిన ఏ ప్రమాణం వర్తిస్తుంది?

అంటే కూతురు .. అదే పెళ్లి కూతురు ఒక జడ పదార్థం.  దానికి మనసు , కోరికలు, ఆశలు, ఆశయాలు ఏవీ ఉండవా? పెళ్ళిలో తండ్రి  కన్యాదానం చేస్తాడు..  ఆ తర్వాత పెళ్లి కొడుకు ఆమె చేసే పనులకి రోజూ ఇంత తిండి పెడ్తాడు .. వాడికి  కామం తీర్చుకోవడానికి రాత్రి పక్క పైకి వస్తాడు.  దీనికి తోడు మనువు కూడా అన్నాడు కదా ‘ కార్యేషు దాసీ, శయనేషు రంభా  ..     ఇదేనా  స్త్రీ జీవితం?   ఇప్పుడు తన మనసు చాల తీవ్రంగా ఆలోచిస్తుంది .    ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సని సమయం వచ్చింది అనిపించింది .    సమాజం, పెళ్లి,  వేద మంత్రాలు ..  ప్రతీ దానికీ సరయిన అర్థం వెతుకుతుంది .

 

తను    గ్రాడ్యుయేషన్  లో ఉండగా  “ఇండియన్  హెరిటేజ్  అండ్ కల్చర్ ”  అనే క్లాస్ లో  మేడం  ఏదో సందర్బంగా చెప్పిన  పద్యం గుర్తుకు వచ్చింది   “కార్యేషు యోగీ, కరణేషు దక్షః     రూపేచ కృష్ణః క్షమయాతు రామః    భోజ్యేషు తృప్తః  సుఖదుఃఖ మిత్రం” .   స్త్రీ ఎలా ఉండాలో చెప్పిన శాస్త్రం ,  సమాజంలో  పురుషుడు కూడా ఎలా ఉండాలో చెప్పింది ,  కానీ  దీన్ని మాత్రం   తొక్కి పెట్టింది ఈ సమాజం.    ఈ పురుషాధిక్య ప్రపంచంలో అంతకన్నా ఎక్కువ ఏమి ఆశిస్తాము?   కనీళ్ళు ఎప్పుడో ఆగిపోయాయి.   ఎస్,   ఇప్పుడు కన్నీళ్లతో  పనిలేదు.  ఒకప్పుడు స్త్రీ  ప్రతీ దానికి  భర్త పై ఆధారపడి ఉండాల్సొచ్చేది .. ఎప్పుడు అయితే స్త్రీ కూడా ఆర్థికంగా నిలదొక్కు కో గలుగుతుందో అప్పుడే స్త్రీకి నిజమైన స్వతంత్రం వచ్చినట్టు అని ఎక్కడో చదివినట్టు గురుతు.    అంటే ఇప్పుడు తన  ఇంటిరీయర్ డిజైనింగ్ పని బాగా నడుస్తుంది ,  రమేష్ కన్నా తనకే సమాజం లో పేరు వుంది, ఫ్రెండ్స్ కూడా ఎక్కువే.  మంచి  బ్యాంకు బాలన్స్ కూడా వుంది .     మూడు  సంవత్సరాలుగా చేసిన కాపురం , ఎన్నో మధుర స్మృతులు, చిలిపి చేష్టలు, అల్లరి పనులు  ఇలా   ఎన్నో గుర్తుకు వచ్చాయి.     ఇవన్నీ ఎలా  మరిచాడు రమేష్?    తన మనసుతో పని లేనప్పుడు, తన ఫీలింగ్స్ తో పని లేనప్పుడు,  ఆ మధుర  జ్ఞాపకాలన్నీ   నీటి పైన రాసిన రాతలే !     కొంచెం సేపు ప్రశాంతంగా అలోచించి  ఒక నిర్ణయానికి వచ్చి ఎప్పుడో  నిద్రలోకి జారుకుంది.

 

ఉదయం నిద్ర నుండి  లేచి  చూసింది పావని, కళ్ళు బాగా ఉబ్బి వున్నాయి.  ఎంత మనసును అదుపులో పెట్టుకుందామనుకున్నా  ఆగని దుఃఖం రాత్రంతా..  అంత ఈజీగా తెంపుకుంటే తెగే   బంధమా  అది ?    రమేష్ వర్క్ కి వెళ్లినట్టున్నాడు , బయట కారు లేదు.   తనూ రెడీ అయ్యి ముందు స్ట్రెయిట్ గా బ్యాంకు కి వెళ్ళింది,  జాయింట్ అకౌంట్ లో  వున్న తన  డబ్బంతా విత్ డ్రా  చేసుకొని,  సపరేట్ అకౌంట్ ఓపెన్ చేసింది.  పోలీస్ స్టేషన్ కి వెళ్లి డొమెస్టిక్  వాయిలెన్స్  కేసు పెడదామనుకుంది  కానీ ఎందుకో తన “ఆడ”  మనసు  అడ్డు పడింది .   ఆ తర్వాత లాయర్ ని కలిసి డివోర్స్ ఫైల్ చేయించింది, ఒక వైపు చాల బాధగా  వుంది  ఇన్నేళ్ల కాపురం  కూలిపోతున్నందుకు.     ఇంకొక  వైపు  చాల  గర్వముగా  వుంది ,  నీవిచ్చేదేంది , ఇదిగో  నేనే ఇచ్చాను తీసుకో అని రమేష్ ముఖం పై పడేసింది  డివోర్స్ పేపర్  ఈ పురుషాధిక్య ప్రపంచానికి సవాలు విసిరినట్టుగా!     తను అందంగా అలంకరించిన ఆ   గోడలు, కర్టైన్స్, పెయింటింగ్స్   మాత్రం తనను ఆప్యాయతగా,  జాలిగా  చూస్తున్నాయనిపించింది.  చివరి సారిగా ప్రేమగా తాకిందివాటన్నిటిని,  అంతలోనే తేరుకుని  మనుషులకు లేని ఈ బంధాలు,  ప్రేమలు, ఆప్యాయతలు  వీటితో  ఎందుకు అని మనసు కఠినంగా చేసుకుని అడుగు పెట్టింది  కొత్త ఊహల రెక్కలతో    తన స్వేచ్చా ప్రపంచంలోకి !

13 thoughts on “నాతి చరామి

  1. Excellent Venu…..Very heart touching story…….You have a great writer in you….ఈ కథ సినిమా తీస్తే…అద్భుతంగా ఉంటుంది. చూడండి…మరిన్ని కథలు మీ నుండి ఆశిస్తున్నా…

   1. ధన్యవాదములు పూర్ణ చంద్ర . మీరన్నట్టుగానే చాల మంది సినిమాగా తీయాలని నన్ను కోరడం జరిగింది , ఆలోచిస్తున్నాను . మార్చ్ లోగా ఒక కథల పుస్తకం ప్రచురణకు సిద్ధం అవుతుంది .
    నేను ఇంతకు ముందు కొన్ని షార్ట్ ఫిలిమ్స్ తీసాను, యూట్యూబ్ లో “venu nakshathram short films” అని సెర్చ్ చేసి చూడొచ్చు .

    1. Many congratulations venu garu for wonderful scripting the most happening issue, as world advancing people are still in foolish thoughts. Elders have double standards to daughter in laws & daughters & very well explained marital relationship. If ramesh had the health issue what would be his behavior or fate. Thanks for penning a burning fact.

 1. Venu gaaru,

  Starting lo andhamaina anuboothi

  Madhya lo heart touching फीलिंग

  And

  Final ga aadadhi abala kaadhu sabhala ani , thanu thaluchukunte edhanna sadhinchadaniki sidhhapaduthundhani super ga chepparu .

  Hatsup to nathicharami.

 2. कहानी तो बहुत अच्छा है. समाज में होने वाली स्थिति गति का अच्छा प्रतिबिम्ब किया!

 3. మంచి కథ. వారసత్వాల మీద వ్యామోహం బంధాలని పలుచన చేస్తుంది.

  1. వేణు గారు ,
   మీరు రాసిన ఈ స్టోరీ చాలా ఉద్వేగ భరితంగా ఉన్నది. స్త్రీ మనో భావాలను చాలా చక్కగా వర్ణించారు. అవసరం వచ్చినప్పుడు స్త్రీ సభలగా మారగల ఆలోచన శక్తి సామర్త్యాలను చాలా చక్కగా చెప్పారు. మూర్కులైన మనుషుల చేత అణచివేయ బడ్డ స్త్రీ మనో దైర్యం తో స్వేచ్గగా , స్వంత భావాలతో ఎలా జీవితం లో ముందుకు సాగాలో చెప్పిన విధానము చాలా హర్షణీయం.
   You penned a great story with inherent message.
   Cogratulations!! Great Job Venugaru!! We expect more stories from you.

   1. ప్రభాకర్ గారు, .

    నా కథ మిమ్మల్ని అంతగా ప్రభావితం చేయడం .. చాలా సంతోషం . ఇంత చక్కటి ఫీడ్ బ్యాక్ ఇచ్చి నాకు మరింత ఉత్సాహం కలిగించి నందుకు చాల ధన్యవాదములు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


   Type Comments in Indian languages (Press Ctrl+g to toggle between English and Hindi OR just Click on the letter)