కథ

నేను..వసంత..సమాజం

                                                                                                                                                     శత పత్ర మంజరి

 

భయం వలనో, కంగారు వలనో తెలియదు కానీ వసంత వదులుతున్న వెచ్చటి ఊర్పులు నన్ను మరింత గందరగోళ పరుస్తున్నాయి. నిండుగా ఆకులతో అలుముకున్న జామతోట మధ్యనుండి అప్పుడప్పుడు, అక్కడక్కడా నక్షత్రాలు తొంగి చూస్తున్నాయి.


అదురుతున్న పెదాలను అతి ప్రయత్నం మీద పెకిలించి  ” మన విషయం నా భర్తకి, అత్తమామలకు తెలిసిపోయింది… ” అంటున్న ఆమె తన మాటల వెనక దుఃఖాన్ని అదిమి పెడుతుందని నేను గమనించకపోలేదు.


రాత్రి తెల్లవారే సరికి నీతో నా అనుబంధం కూడా తెల్లారిపోతుంది కృష్ణా” అంది బాధగా.

సన్నగా వణుకుతున్న ఆమె సున్నితమైన చేతిని నా చేతిలోకి తీసుకుని గట్టిగా నొక్కి పట్టుకున్నాను.  ఆమెలో ధైర్యం నింపే వ్యర్ధ ప్రయత్నమది.


ఆమె చప్పున నా మెడ చుట్టూ చేతులు వేసి అల్లుకుపోయింది. తీవ్రమైన కోరికతో నా నుదిటిపై కళ్ళపై పెదాలపై ముద్దాడింది.

నా చేతులు ఆతృతగా ఆమె శరీరంలో ఏదేదో వెతకసాగాయి.  నా దేహం నా ప్రమేయం లేకుండానే ఆమెను పెనవేసుకుపోతుంది.

భగ్గుమంటున్న కార్చిచ్చులో, చల్లని నీళ్లు పోసినట్లుగా తీవ్రమైన కోర్కెల జ్వాల చల్లారకుండానే వసంత నా నుండి దూరంగా జరిగింది.

మనుషులకు నా బాధెందుకు అర్థం కావడం లేదు కృష్ణా!


పుట్టుక చావు  ఆకలి దాహం పగలు రాత్రి రుతువులుఎంతటి ప్రకృతి సిద్ధమైన సహజ క్రియలో శారీరక సుఖం కూడా అంతే ప్రకృతి సహజమైనది. ప్రకృతి విధించే ప్రతి క్రియ జరగాలి. అప్పుడే ప్రాణానికి శాంతి.

అంతేకానీ నపుంసకుడైన భర్తతో సుఖం లేకపోయినా కేవలం ఇద్దరు చిన్నపిల్లల తల్లిగా,ముసలి అత్తమామలకు సేవలు చేస్తూ వారి అనుమాన పూరితమైన చూపులను అవమాన పూరితమైన మాటలను భరిస్తూఇంకా పాతిక కూడా దాటని నా వయసును నిర్దాక్షిణ్యంగా హత్య చేసినా ఆశలను ఇష్టాలను కోరికలను అసంతృప్తి బురదలో పూడ్చడానికి ప్రయత్నిస్తున్న వీళ్ళందరూ ఎంతటి పాపాత్ములో కదా!


నిజమే కృష్ణా!కాదనను! తను పనిచేసే చోట ప్రమాదవశాత్తుగానే ఆయన నిర్వీర్యుడయ్యాడనేది నిజమే. కానీ.. కానీజరిగినదాంట్లో నా నేరం ఏమిటి..? ఎంత కాలం వరకు నేను వయసు భారాన్ని మోయగలను…? ”

భావావేశం వలన అనుకుంటావసంత చాలా ఆయాసపడుతుంది.

నేను ఆమె పెదాలపై నా చూపుడు వేలుంచి కాసేపు ఆగమని సైగ చేసాను. మృదువుగా ఆమె తల నిమిరాను.

కొంత విరామనంతరం వసంత తిరిగి మాట్లాడడం ప్రారంభించింది.


” అయినా
కృష్ణా! సమాజపు ధోరణి ఎప్పటికీ మారదా? బ్రతికున్నా వారికి అన్ని దారులు మూసేసి చావు వైపు తరుముతుంది. చనిపోయిన వారిని సానుభూతి వంకతో ఎన్నో రకాలుగా అవమానిస్తుంది. శవం పడిన చోట రాబందుల్లా తిరుగాడే మనోభావాలు ఎన్నటికీ మారుతాయి కృష్ణా!

నైతికత అనే మాటకు విలువుంటే, నిజంగా సమాజంలో స్త్రీ స్థానం ఎంతటి అనైతికమో కదా! ఒక్కసారి పెళ్లి అనే కట్టుబాటును ఒప్పుకుంటే స్త్రీ పురుషుడి తాలూకు వస్తువులా మారిపోతుందా..

ఆ భర్త ఎలాంటి వాడైనా సరే, అతని వలన సుఖసంతోషాలు దొరకకపోనీ, మనిషి కానీ,మనిషిరూపంలోని మృగం కానీ,ఇక చచ్చే వరకు అతని కనుసన్నలలోనే జీవితం కడతేర్చాలా..?

ఇంత దుర్మార్గంగా వాదించే  సమాజం స్త్రీ తనకు ఏం కావాలో ఆలోచించి, నిర్ణయించుకుని పొందాలనుకుంటే మాత్రం పాపమంటుంది. ఘోర నేరమంటుంది.” 

ఆమె తన ముఖాన్ని నా గుండెల్లో దాచుకుని ఏడుస్తుందనడానికి నిదర్శనం తన కన్నీళ్ళతో తడిచి ముద్దై వంటికి అంటుకు పోతున్న నా చొక్కానే

 

పది నిమిషాల అనంతరం తానంతట తానే తమాయించుకుని  ” ఛీనాది బ్రతుకేనా కృష్ణా! ఇది బ్రతుకు కాదు నెమ్మది నెమ్మదిగా నన్ను చంపేసే విషం. నా భర్తకి అత్తమామలకు తల్లిదండ్రులకు, ఇరుగుపొరుగుకుఇప్పుడు నేనో వ్యభిచారిణిని,పాపాత్మురాలిని

వారి అసహ్యమైన చూపుల్ని తట్టుకోగల మనోస్థైర్యం నాకు లేదు. అందుకే నన్ను నా పిల్లలను ఎక్కడికైనా తీసుకెళ్ళిపో కృష్ణా…” స్థిరమైన నిర్ణయమేదో వసంత మొహంలో కొట్టొచ్చినట్లుగా కనపడుతుంది.

ఏం చెప్పాలో పాలుపోకఅయోమయంగానే సరేనన్నట్లు తలూపాను.

అంతసేపటి వరకు అణచబడి వున్న మోహావేశం దౌత్యాధికారాన్ని పొందినట్లు వసంత నన్ను గాఢంగా హత్తుకుపోతుంది.

తన వెచ్చటి ఊర్పులు, నిట్టూర్పులతో నన్ను కరిగించి తనలో కలుపుకుంటుందామె.

తన నగ్న వృక్షస్థలంపై నా తలనుంచుకుని…

” నాకు తెలుసు కృష్ణా! నువ్వు నా పాలిట దేవుడు పంపిన దూతవని. మా ఊరి గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్ గా నిన్ను మొదటిసారి చూసినప్పుడే అనిపించింది. నన్ను ఊబిలో నుండి బయటికి లాగడానికి వచ్చావని నాకు తెలుసు…” అంది ఆనందంగా.


“మళ్ళీ
తనే నేను మొదటి బస్సు సమయానికి పిల్లలను తీసుకుని వచ్చేస్తానునువ్వు వచ్చేస్తావు కదా! ” అంది.


వస్తానన్నట్లుగా తలాడించాను.


అప్పుడు ఆమె ముఖంలో విలక్షణమైన నవ్వు తెర!


అది సోకాల్డ్ సమాజాన్ని మొత్తం నిలబెట్టి సవాల్ విసురుతున్నట్లుగా ఉంది

ఇక త్వరగా వెళదామని నా చేతిని పట్టుకుని ముందుకు నడిపించసాగింది.

“కత్తిరింపులకు గురైన వత్తులే దేదీప్యమానంగా వెలుగుతాయట కృష్ణా! ఎన్ని వత్తులేసి వెలిగిస్తే మాత్రం అనంతమైన చీకటిని పారద్రోలగలమా? తోటలో వున్నప్పుడు చెట్లు వెలుతురుని మింగేస్తే, బయటికి వచ్చాక నల్లని మబ్బొకటి వెలుతురుకి అడ్డొచ్చింది. చివరి వరకు రాత్రి మనకు చీకటినే మిగిల్చింది కదా కృష్ణా!”

ఆమె మాటల్లో అదోరకం తాత్వికత. 

“ఈ చిక్కటి నిషీధిలో మనమిద్దరం ప్రేతాల్లా వున్నాము కదూ….” అంటూ ఆమె గలగల నవ్వుతుంటే నాకు ఆశ్చర్యమేసింది.

వసంత తన ఇంటి మలుపులోకి తిరుగుతూ, వెనక్కి తిరిగి …”తప్పక వస్తావు కదూఅంది.

సారి అడగడంలో ఏదో దైన్యత కనపడుతుంది.
వస్తానని…”చెప్పాను.


***

ఇంటి ఆవరణలోకి ప్రవేశించగానే గాలికి దండెం మీది బట్టలు దెయ్యం పట్టినట్లుగా ఊగిపోతున్నాయి

బట్టలన్నీ లాక్కొచ్చి గబగబ బ్యాగ్ లోకి సర్ధాను. బయట మెల్లిగా వర్షం మొదలైందనడానికి గుర్తుగా రేకుల మీద టప్ టప్ మనే చప్పుడు వినబడుతుంది.

గడియారం రెండవుతున్నట్లుగా చూపిస్తుంది. ఇంకొన్ని వస్తువులు తీస్తుంటే …ఏదో వస్తువు చేతి చివర నుండి దఢేల్మని జారి టంగుమన్న శబ్దం చేస్తూ మంచం కిందికి పడిపోయింది.

ఏమిటన్నట్లుగా మోకాళ్ళ మీద వంగి కూర్చొని బయటికి తీసాను. రిస్ట్ వాచ్ అద్దం పగిలి వెలవెలబోతుంది

ఇంటర్పాసయినప్పుడు అమ్మ కొనిచ్చింది. అది కొనిచ్చిన నెల రోజులకే మా నాన్న చెరువులో పడి చనిపోయాడు

ప్రమాదవశాత్తనికొందరన్నారు. రాజకీయ హత్య అని ఇంకొందరన్నారు. మన నుదిటిరాతని అమ్మ అక్కలు అన్నారు

ఒక్కసారిగాఅమ్మ ఙ్ఞాపకాలు చుట్టు ముట్టాయి. కాటన్ మిల్లులో పని చేసి చేసి చెడిపోయిన ఊపిరితిత్తులతో నిత్యం ఖంగ్ ఖంగ్ మనే ఆమె దగ్గు గుర్తొచ్చింది. సగం ఊడిపోయి సగం నెరసిన ఆమె జుట్టు గుర్తొచ్చింది.

ఉన్నూరి సంబంధమని, సంబరంగా పెళ్ళి చేస్తే,రోజు తాగి తందనాలాడి, అమ్మ నా బూతులు తిడుతూ, చావబాదే భర్తతో అతి కష్టం మీద బ్రతుకెళ్ళదీస్తున్న అక్క గుర్తొచ్చింది.

పెద్దమామ పెద్ద పొల్లను పెళ్ళాడితే వచ్చే కట్నంపై అమ్మ,అక్కలు పెట్టుకున్న ఆశలు గుర్తొచ్చాయి.

పేరుకే డాక్టర్ గానీ, ఎమ్.ఆర్.పి గా నా చాలీచాలని జీతం గుర్తొచ్చింది.


మంచానానుకుని చాలా సేపు అలాగే కూర్చుండిపోయాను. మనసంతా గందరగోళంగా ఉంది. ఏ ఆలోచన రెండు నిమిషాలకు మించి స్థిరంగా ఉండడం లేదు

సమయం మూడవుతుంది.

బ్యాగ్ లో సర్దిన ఒక్కో వస్తువు తీసి వాటి యథాస్థానంలో పెట్టాను.

బట్టలన్నీ తీసి అల్మారాలో ఉంచాను.
వర్షం ఉధృతి పెంచింది. సిగరెట్ కావాలని బలంగా అనిపించి రూమంతా వెతికినా ఎక్కడ దొరకలేదు. మంచం మీద వెల్లకిలా పడుకున్నాను.

మనసంతా నిర్వికారంగా ఉంది.”తప్పక వస్తావు కదూవసంత మాటలు వదేపదే గుర్తొస్తున్నాయి.


లేచి కూర్చొని ఎదురుగా వున్న నిలువుటద్దం వంక తీక్షణంగా చూసాను.

పేషెంట్ గా పరిచయమైన వసంత మొదటి చూపులోనే నచ్చడం, ఆ తరువాత మెల్లిమెల్లిగా నేనే చొరవ తీసుకుని ఆమెను మాట్లాడించడం, ఆమె తన కష్టాలన్నింటిని నాతో పంచుకోగలిగేంత ఆత్మీయునిగా మారడం, ఆమెను ఓదార్చడంలో భాగంగా ఇద్దరం ఒకటైపోవడం అన్నీ గుర్తొచ్చాయి.

గడియారం వంక చూసాను.

నాలుగవ్వడానికి మరో పదిహేను నిమిషాలు మాత్రమే ఉంది. సరిగ్గా నాలుగ్గంటలకు వసంత నా కోసం బస్టాప్ లో  ఎదురు చూస్తుందేమో అన్న ఆలోచన రాగానే మనసు కలుక్కుమనిపించి, ఒళ్ళంతా జలదరింపులాంటిది ఆవహించింది

ఆదరబాదరగా బ్యాగ్ లాగి తీసిపెట్టిన వస్తువులు, బట్టలు చిందరవందరగా కుక్కేసి గుమ్మం దాటానో లేదో ఖంగ్ ఖంగుమనే దగ్గు తెరలుతెరలుగా వినపడుతుంది.

పక్కింట్లో ముసలావిడనుకుంటా! …

మళ్ళీ ఏదో శక్తి చేయి పట్టి ఆపినట్లుగా గుమ్మం దగ్గరే నిలబడిపోయాను.

నిరుత్సాహంగా వెనక్కి తిరిగొచ్చి, బ్యాగ్ మంచం మీద పారేసి ముఖాన్ని రెండు చేతుల మధ్య ఉంచుకుని ఉన్మత్తుడిలా వెక్కివెక్కి ఏడ్చాను

ఏడ్చి ఏడ్చి నిర్ణయానికి వచ్చిన వాడిలా ఒక్క ఉదాటున లేచెల్లి, అల్మారాలో నుండి నిద్రమాత్రల సీసా తీసీ మూడుబిళ్ళలు గబగబ మింగి మంచం మీద పడుకున్నానురెండు రోజుల తరువాత సృహ వచ్చింది.

***


వసంత కనపడడం లేదన్న వార్త ఊరంతా దావానంలా వ్యాపించింది. పిల్లలతో సహా ఎవరితోనో లేచిపోయిందని కథనం. లేదు అత్తమామలే చంపి గుట్టు చప్పుడు కాకుండా పాతేసారని కథనం. ఆత్మహత్య చేసుకుందని మరో కథనంఇలా రకరకాల కథనాలు ప్రచారంలోకి వచ్చాయి. ఏది నిజమో ఏది అబద్దమో తెలుసుకోలేని సందిగ్దత.

” వసంతా..! ఎవరితో ప్రమేయం లేకుండా కాలం దానిపాటికది సాగిపోతుంది. ఇప్పుడు నాకు ఉద్యోగం లేదు. ఆలోచించడానికి అమ్మే లేదు. అక్క ఒకతి బ్రతికి ఉందన్న ధ్యాసే లేదు. ప్రేమ, పెళ్ళి అన్న మాటలు విన్నప్పుడల్లా నువ్వే గుర్తొస్తున్నావు.”

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


   Type Comments in Indian languages (Press Ctrl+g to toggle between English and Hindi OR just Click on the letter)