కథ చిన్న కథ

పాయా టీచర్‌

‘బాగా లేతవి, ఎనిమిది కాళ్లే దొరికాయి…’ అంటూ వేటకాళ్ల పాకెట్ ని తను కిచెన్‌ ప్లాట్ఫామ్‌పై పెట్టాడు. ఎలక్ట్రిక్ కుక్కర్‌లో అన్నం పడేసి, వేటకాళ్ళని గిన్నెలో వేశాను. కాల్చి, శుభ్రం చేసినవే, మళ్లీ టాప్‌ వాటర్‌ కింద రెండు, మూడు సార్లు కడిగి, పసుపు, ఉప్పు, కారం, అల్లం, వెల్లుల్లి, ఇంకా మసాలా దినుసులన్నీ కలిపి పక్కన పెట్టాను.
ఉల్లిపాయలు తరుగుతుండగా, కళ్ళలో నీటితో పాటు గుండెలో ‘పాయా టీచర్‌’ జ్ఞాపకాలు సుళ్ళు తిరిగాయి. నేను హైస్కూల్లో ఉండగా ఇంగ్లీష్‌ టీచర్‌ పాఠాలంటే చెవి కోసుకునేదాన్ని. నిత్యం ఆమెని అంటిపెట్టుకుని తిరిగి, తిరిగి ‘స్టూడెంట్’గా తన అభిమానాన్ని సంపాదించాను. స్కూల్లోనే కాకుండ తీరికున్నప్పుడల్లా వాళ్ళ ఇంట్లోనే నా మకాం.

ఇంగ్లీష్‌ టీచర్‌ వేటకాళ్ళ కూర వండడంలో అందె వేసిన చెయ్యి. వాళ్ళబ్బాయి కిష్టమని ఇంచు మించు ప్రతిరోజూ వాళ్లింట్లో ‘పాయా’ వండేదావిడ. భర్తని పోరి లేతకాళ్లు తెప్పించి మరీ కొడుక్కి ఇష్టంగా వండిపెట్టేది. అలా వండినప్పుడల్లా, ఒక చిన్న గిన్నెలో రెండు ముక్కలు, ఇంత పులుసు వేసి, మెరిసే కళ్ళతో ‘నా పిల్లలకి తప్ప ఎవరికీ నేను ఇలా పెట్టను తెలుసా!’ అంటూ వాళ్ళాయనకి తెలియకుండ నాకిస్తుండేది. ఆడపిల్లలు లేని లోటును నాలాంటి స్టూడెంట్స్ తో తీర్చుకునేదనుకుంటా ! ఆవిడ చేతి మహత్యమేమో కానీ, ఇలా నోట్లో వేసుకుంటే ముక్క అలా వెన్నలా కరిగిపోయేది. మరీ చిక్కగా కాకుండ, మరీ పలుచగా కాకుండ పాయా సమంగా గుమగుమలాడుతూ ఉండేది.
చుట్టుపక్కల వాళ్ళు కూడ పాయా వండాలంటే టీచరమ్మే వండాలనే వారు. అలా ఇంగ్లీష్‌ టీచర్‌ కాస్తా ‘పాయా టీచర్‌’ అయిందన్నమాట. నిజానికి నేను పాయా వండడాన్ని ఆమె దగ్గరే నేర్చుకున్నాను.

పాయా టీచర్‌ వాళ్ళబ్బాయి మంచి రంగూ, ఒడ్డూ పొడవుతో అందంగా ఉండేవాడు. ఇంచు, మించు నా ‘ఫస్ట్‌క్రష్‌’ అనే చెప్పాలి. ఈ ఊహలతో పచ్చిమిరపకాయలు తరుగుతున్న నా పెదావులపై తీయని నవ్వు తొంగిచూసింది. కొడుకంటే పాయా టీచర్‌ ప్రాణం పెడుతుంది. కానీ ఏం లాభం?! అతనొక దుడుకు మనిషి. ఈ మధ్యనే తెలిసింది…, జాన్‌ అబ్రహాంలా జుట్టు పొడవుగా పెంచుకుని తిరుగుతుంటే, ఎవరో ఎగతాళి చేశారట, ఇతను ఉక్రోషం పట్టలేక, ఎగతాళి చేసిన వాడింటికి వెళ్లి అందర్నీ కొట్టి, వాణ్ణి నరికి చంపేశాడట. కొడుకు జైలు పాలైన తరువాత ఆ బాధని పాయా టీచర్‌ ఎలా తట్టుకుందో పాపం, తలచుకుంటే జాలనిపించింది.
స్టవ్ మీదా ‘పాయా’ గుమగుమలాడుతోంది.

వేసవి సెలవులకి ఈసారి మావూరికి ప్రయాణం పెట్టుకున్నాం. చాన్నాళ్ళయింది అటువేపు వెళ్ళక, మా అమ్మా, నాన్నా పోయింతరువాత ఇంత వరకూ ఊరిమొహమే చూడలేదు. ఇన్నాళ్ళకు మళ్ళీ ప్రయాణం. పన్నెండు గంటల ప్రయాణం తరువాత నారాయణాద్రి ప్లాట్ఫామ్‌పై ఆగింది. లగేజీ తను దించాడు. నా భుజాల మీదా కూడ లగేజీ ఉంది… మా ‘బుల్లికింకరుడే’.. ప్లాట్ఫామ్‌పై దిగీదిగగానే వాడు పరుగులంకించుకున్నాడు. రైలు దిగే జనం, ఎక్కే జనం, పోర్టర్లతో కంగాళీగా ఉంది. పిల్లవాడెక్కడ తప్పిపోతాడోనన్న బెంగ నాది. చేతికందితేనా, ఆటో కోసం వెళ్ళిన తను ఇంకా రానే లేదు. దూరంగా బెంచీ దగ్గర మా కింకరుడు కనిపించాడు. ఎవరో ఏదో పెడుతుంటే లొట్టలేసుకు తింటున్నాడు. ఎవరేం పెట్టినా తినేయడమేనా, భయంతోనూ, కోపంతోనూ కంపించి పోయాను. దగ్గరికి వెళ్ళి జబ్బ పట్టుకుని పక్కకి లాగి, చెంప మీదా ఒక్కటిచ్చాను.

‘అయ్యయ్యో, కొట్టకమ్మా, పాయాలో ముక్క నేనే ఇచ్చా… మా అబ్బాయి రావలసి ఉంది. వాడికోసం పాయా పట్టుకొచ్చా, ఎందుకనో ఇవాళ కూడ వాడు రాలేదు. కన్న కడుపెవరిదైనా బిడ్డ బిడ్డే కదా. అందుకే వీడి నోట్లో ఒక ముక్క వేశా.. ఎంత చక్కగా తింటున్నాడో చూడు…’ పలచబారి, తెల్లబడిన కనుబొమలతో, వడలిన దేహంతో ముతక చీరెలోని ఒక ముసలావిడ నన్ను అడ్డుకుంది. ఆమె వైపు తిరిగి చూసిన నా కళ్ళు అప్రయత్నంగా కరిగి నీరయ్యాయి. ‘ఏయ్‌ ముసల్దానా, నీకిదే పనా…’ అంటూ ఓ పోర్టర్‌ ఆమెను గద్దించి, నా వైపు తిరిగి, ‘భయపడకండమ్మా, కొడుకు జైలుకెళ్ళడంతో ఈ ముసల్దానికి కాస్త మతి తప్పింది. పిచ్చిది కాదు కానీ ఇదిగో ఇలా కొడుకెప్పుడొస్తాడా అని రోజూ పాయా వండుకొచ్చి స్టేషన్లో పిల్లలకి పెట్టి, మురిసిపోతుంటుంది. ఎప్పటికైనా కొడుకు తిరిగొస్తాడని దీని ఆశ….’ అన్నాడు.

పాయా టీచర్‌ టిఫిన్‌ కేరియర్‌ సర్దుకుని, చేతికర్ర ఊతంతో నెమ్మదిగా లేచి ముందుకు వెళ్ళింది. ‘స్వర్గం తల్లి పాదాల కింద ఉంటుందన్న’ ఖురాన్‌ సూక్తి జ్ఞాపకం వచ్చింది. మా పిల్లవాడి చొక్కా మీదా ఎర్రటి పాయా మరకలుగా స్వర్గం నా కళ్ళకి కట్టింది.

-పసుపులేటి గీత

10 thoughts on “పాయా టీచర్‌

  1. కథ బాగుంది కానీ ,ముగింపు వేరేవిధంగా ఉంటే ఇంకా బాగుండేదేమో..

  2. చిన్న కథయినా పాయా లో వున్నంత అమ్మ తనం.
    అభినందనలు

  3. గీతగారు కథ చాలా బాగా రాసారు
    హృదయాన్ని కదిలించింది .

  4. చాల బాగుంది టీచర్ … నిజం బాధ గా …. అబద్ధము తీయగా ఉంటాది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


   Type Comments in Indian languages (Press Ctrl+g to toggle between English and Hindi OR just Click on the letter)