కథ

“ప్రవహించే పాట” 

 

-దగ్గుమాటి పద్మాకర్

 

ఎవరో అన్నారట… “కథ రాయడం చేతకాని వాడు సబ్ ఎడిటర్ అవుతాడు” అని. అది నిజమేనేమో అనిపిస్తుంది.

చాలాసార్లు పత్రికల్లో కొన్ని కథలు చదివినప్పుడు నేనూ నాకథని రాయాలి అనుకుంటాను.  కానీ ఎలా రాయాలో, రాస్తే అది కథ అవుతుందో కాదో తెలీక నా ఆలోచనలన్నీ మళ్ళీ నిద్ర పుచ్చేస్తాను.  కానీ కొన్నిసార్లు కొన్ని కథలు చదివి ఆయా రచయితలు ఏం చెప్పడానికి ఆ ఇతివృత్తాన్ని ఎన్నుకున్నారో అని ఆ కథలని పోస్ట్ మార్టం చేసేవాడిని.  అయినా నాకు కథ రాయడం ఎలాగో అర్ధం కాలేదు.

ఇక ఈరోజు నిప్పులు కురిసే ఎండకాసిన సాయంత్రం హఠాత్తుగా మబ్బులు కమ్ముకుని మొదలైన సన్నని వర్షం ఒకనాటి వాన చినుకులని గుర్తు చేస్తున్నాయి.  ఇప్పుడైనా నాకథని మీకు చెప్పడానికి ప్రయత్నిస్తాను.

నా కథలో నా కూతురు చందనకి గానీ, చనిపోయిన నా భార్యకి గానీ, అనంతరం నాతొ ప్రేమలో పడిన సునీతకి గానీ, మా అమ్మకి గానీ ఎవరికీ అన్యాయం జరగకుండా నేను కథ రాయగలనా అనిపిస్తుంది.  కానీ ఇది కథ గదా. ఎవరేంటో మీరే చెప్పండి.

దిన పత్రికల్లోనో, టీవీల్లోనో, ఫేస్ బుక్ లోనో అమ్మ గురించిన కవితలో, మాటలో లేక అమ్మతనం గురించిన కథనాలో చూసినప్పుడంతా నాకు మా అమ్మ గుర్తుకు వస్తుంది. అప్పుడు చేతిలోంచి అపురూపమైన గాజుబొమ్మ జారిపడి భళ్ళున బద్దలైన జ్ఞాపకం శరీరాన్నీ, మనసునీ ముక్కలు చేస్తుంది.

రోడ్డుమీద ఎవరైనా స్త్రీలు జడలో మూరెడు పొడవున మల్లెలో, కదంబాలో తురుముకుని పోతుంటే సునీత జ్ఞాపకం వస్తుంది. మనసు పొరల్లోని ఆ పూల పరిమళం మళ్ళీ ముక్కు పుటాలను సోకినట్టు వుంటుంది.

రోడ్డు ప్రమాదం వార్తలు ఏవి చదివినా చందనకి మూడేళ్ళ వయసులోనే యాక్సిడెంట్ లో చనిపోయిన నా భార్య ప్రమీల గుర్తుకు వచ్చి శరీరం  నెత్తుటి ముద్దలా అయిపోతుంది.

ఏది జరిగినా జరక్క పోయినా తనకి నేనే ఆధారం అయిన నా కూతురు చందన మాత్రం నిరంతరం నా భుజాల మీదనే వున్నట్టు వుంటుంది.  అయినప్పటికీ అది నాకు  ఒక ‘తీయని బరువు’ మాత్రమే.

కథని బాగా చెబుతున్నానో లేదో తెలియదు గాని ….

8, 9 తరగతులు చదివే ఆడపిల్లలు ఒంటరిగా ఎవరైనా యూనిఫాం లో కనిపిస్తే నాకు ఆనాటి వాన చినుకులు గురుకొస్తాయి. వాన చినుకుల్లో వాకిట్లో వ్యానులోంచి దిగి తడిసీ తడవకుండా పరుగులాంటి నడకతో వరండాలోకి వచ్చి స్కూల్ బ్యాగ్ భుజాన్నించి తీస్తూ చందన అన్న మాటలు గుర్తొస్తాయి.  కాళ్ళ మధ్యన తడిమి చూపిస్తూ, “నానా! నా డ్రాయర్ కి నెత్తురు అయింది నానా!” అంది.

ఏదో చదువుకుంటున్న నాకు క్షణం ఏమీ అర్ధం కాలేదు. నేను మామూలుగానే, “ఏం కాదులే గానీ, వెళ్లి స్నానం చేసిరా! బజ్జీలు చేసుకుందాం!” అన్నాను.  బజ్జీలు అంటే మా ఇద్దరికీ చాలా ఇష్టం. అయినా నాకు ఆలోచనలు ఒకే దిక్కుగా సాగిపోతున్నాయి.  ఎవరికి చెప్పాలి.  ఏ బంధువులున్నారని? శీను గుర్తుకొచ్చాడు.  ఫోన్ చేసి విషయం చెప్పి తనభార్య  వసంతని కూడా తీసుకుని అర్జంటుగా రమ్మన్నాను.

బజ్జీలు చేస్తుండగానే వాళ్ళూ వచ్చారు. నేరుగా వంట గదిలోకెళ్ళి వసంతకూడా సాయం చేస్తూ కాసేపు చందనతో మాట్లాడాల్సిన విషయాలేవో మాట్లాడినట్టుంది.  అందరం బజ్జీలు తిని సినిమా ప్రోగ్రాం పెట్టుకున్నాం.  ఆ మర్నాడు కూడా వాళ్ళు మా ఇంట్లోనే వున్నారు. వసంత వీలైనంత ఎక్కువ చందనతో ఏవేవో జాగ్రత్తలు, సూచనలు చెప్పింది.  ఆ రోజు సాయంత్రం దగ్గరలో వున్న బీచ్ కి వెళ్లి సముద్ర తీరంలో ఫోటోలతో సెలబ్రేట్ చేసుకున్నాం.  నాకు అప్పుడు చాలా సార్లు అనిపించింది, ‘ఈ రెండు రోజులు సునీత వుండివుంటే ఎంత బాగుండేదని’.  మీరు నన్ను క్షమించాలి. కన్నతల్లి ప్రమీల ఎందుకు గుర్తుకు రాలేదని మీరు అనుకోవచ్చు.  కానీ మూడేళ్ళ వయసునించీ చందన ఆలనా పాలనా అంతా నేనే భరించి ఉండబట్టి, మిగతా ఆశలు సునీత పరిచయం అయ్యాక తనమీదనే పెట్టుకున్నాను అనేది నిజం.

సునీత మా ఆఫీసులోనే కంప్యూటర్ ఆపరేటర్ గా చేసేది. నేనప్పుడు స్థానిక వార పత్రికలో బాధ్యతలన్నీ చూస్తూ ఉండే వాడిని.  సునీతది వేరే పల్లెటూరు.  తనకి ఇష్టం లేని బావతో పెళ్లి తప్పించుకోవడం కోసం నాలుగేళ్ళుగా నెల్లూరు వచ్చి ఇంటికి దూరంగా వుంటూ కంప్యూటర్ ట్రైనింగులు, ఉద్యోగాలు చేసుకుంటూ వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో ఉండేది.  అలా ఉద్యోగం మారి మూడు నెలల ముందు ఇక్కడ చేరింది.  ఇక్కడ ఎప్పుడైనా పండుగలు, సెలవులు ఉంటే రెండు మూడు రోజులు ఊరికెళ్ళి వస్తుంది.  అలాంటి సందర్భం ఒకటి ఇప్పుడు రానే వచ్చింది.  మీకు చెప్పనే లేదు కదా!  సునీత వాళ్ళు క్రిస్టియన్లు.  అంటే మాల క్రిస్టియన్లు. అయినా తను తలనిండా ఎప్పుడూ మూరెడు పూలు పెట్టుకుని వచ్చేది ఆఫీసుకి.  ఆదివారాలు చర్చికి వెళుతుంది.

అప్పుడప్పుడూ స్కూలుకి సెలవు గనక వుంటే ఏడెనిమిదేళ్ళ చందనని ఇంట్లో ఒక్కటే ఉండలేదని నాతోపాటు ఆఫీసుకి తీసుకుని వెళ్ళే వాడిని. ఆఫీసులో చందన, సునీత ఇద్దరూ బాగా కలిసిపోయేవాళ్ళు.  ఎదో సందర్భంలో ఒకసారి సునీత అడిగింది నన్ను, “చందన కి దసరా సెలవులు వస్తే నాతోపాటు ఊరికి పంపండి సార్.  మూడు నాలుగు రోజులుండి వచ్చేస్తాం” అంది.

నేను, “అదంతా కుదరదులే సునీతా” అన్నాను.

రెండు మూడు రోజుల తరవాత మళ్ళీ అడిగింది. నేను ఒప్పుకోలేదు. కాస్త అవమానంగా ఫీలయింది.

“నాకు తెలుసులే సార్! మీరు రెడ్డీస్ కదా! మేము క్రిస్టియన్స్ అని పంపడం లేదులే మీరు” అంది.

అంతకు ముందు జరిగిన ఒక విషయం చెప్పాలి మీకు.  సునీత ఇంటర్వ్యూ సమయంలో ఒక ప్రశ్నవేశాను, “నీ ప్రత్యేకత ఏంటని?”

“నాకు కోపం రాదు సార్” అనింది నవ్వుతూ.  సహజంగా అందంగా ఉండే  సునీత అప్పుడు మరింత అందంగా కనిపించింది నాకు ఆ సమయంలో.  సరే… అదలా ఉంచుదాం.

సునీత నన్నలా అగ్రకుల అహంభావిని చేసి మాట్లాడడం నాకు నచ్చలేదు. నిజానికి నేను జర్నలిజం నేర్చుకున్నాక వీలైనంతగా నాలోవున్న కులతత్వం తగ్గించుకోసాగాను.  ఇక నన్ను నేను డిఫెండ్ చేసుకోవడానికి ఒక మాట అనేశాను.

“చందన తల్లి లేని పిల్ల.  ఏడెనిమిదేళ్ళ వయసుది.  నేను ఒక్కడినే ఏదో రెండుపాత్రలూ  పోషిస్తూ చాక్కుంటున్నాను.  నేను లేకుండా నీతో తాను నాలుగురోజులు గడిపితే ఆతర్వాత తనకి, ‘నీలాంటి తల్లి కావాలని అనిపిస్తే’ అని అడిగేశాను.

“ఇంట్లో మీ అమ్మ ఉందిగదా సార్” అంది.

“మా అమ్మ చందనకి కలిగే అమ్మ భావనలకి ప్రత్యామ్నాయం కాలేదు!” అన్నాను.

ఇక అంతే! మూగబోయిన పిల్లనగ్రోవిలా అయిపొయింది తను.  ఆఫీసులోనే ఉన్నా అరగంట పైన మేమిద్దరం ఏమీ మాట్లాడుకోలేదు.

నిజానికి నేను అలా హఠాత్తుగా అన్నానా లేక నా సబ్ కాన్షస్ లో సునీతని నాకేమైనా తోడుగా కోరుకుంటున్నానా అనే  ఆలోచన వచ్చింది.  చందనకి తల్లి అనేది కేవలం ఒక సాకేనా?  సాకు కాదులే అని వాళ్ళిద్దరూ సఖ్యతగా ఉండడం (చందనని ఆఫీసుకు తీసుకుని వచ్చినప్పుడు) గుర్తు చేసుకుని నాకు నేను సర్ది చెప్పుకున్నాను.

నా మాట బీజకణంగా మారి సునీత మనసులో గర్భం దాల్చిందని తన ప్రవర్తనలో తేడాను బట్టి వారంలోనే గ్రహించగలిగాను.  సునీత క్రమంగా ఆప్యాయత చూపించడం, నవ్వటం, కళ్ళు కలపటం, అప్పుడప్పుడు పట్టింపు లేకుండా నన్ను తాకటం చేయసాగింది.

ప్రమీల పోయిన నాలుగేళ్ళ నుంచి రాయలసీమలా ఆవిరవుతున్న నాబతుక్కి నల్ల మేఘాలు, వాన చినుకులు ఎలా ఉంటాయో చెప్పాలా?  సునీత సాన్నిహిత్యం నన్ను క్రమంగా ఓదార్చసాగింది.  ఒకళ్ళ గురించి ఒకళ్ళు చెప్పుకోవడం ప్రారంభించాం.  అనంతరం వచ్చిన దసరా సెలవులకి చందనని వాళ్ళ ఊరికి తీసుకెళ్ళింది సునీత.  ఇంట్లో వాళ్ళకి, ఇరుగు పొరుక్కి ఆఫీసులో మా సార్ కూతురని పరిచయం చేసింది.

అయితే మా అమ్మ వాళ్ళ కులం వివరాలు అడిగి సునీతతో చందనని పంపడానికి బాగా నసిగింది.  కానీ నా నిర్ణయానికి అడ్డు చెప్పలేక పోయింది.  ఇంట్లో అప్పుడప్పుడు చందన సునీత ప్రస్తావన తెస్తుండడంతో మాఅమ్మకి ఎక్కడో అనుమానం…. ఈ కులం తక్కువదాన్ని ఎక్కడ ఇంటికి తెస్తాడోనని…. (కులం తక్కువది అన్న అభిప్రాయం మా అమ్మదేగాని నాదికాదని మనవి)

క్రమంగా సునీత నేను కొన్నిసార్లు, మాతో చందనని తీసుకొని కొన్నిసార్లు ఐస్ క్రీమ్ పార్లర్లు, జ్యూస్ షాపులకి వెళ్ళడం మొదలయింది.  అలా ఓరోజు అంటే చందన పుట్టినరోజు నాడు సునీత మాఇంటికి వచ్చింది.  సాధారణ ఫంక్షనే అయినా ఓ పదిమందిలో జరిగింది గనక మాఅమ్మ నలుగురిలో నారాయణ అని సునీత పై అక్కసును కక్కలేక సర్దుకుపోయింది.  ఆ తర్వాత ఒకరోజు దేనికో టవున్లో బంద్ జరిగింది.  ఆఫీసు మూసేసి మధ్యాహ్నం భోజనానికి సునీతని ఇంటికి రమ్మన్నాను. వచ్చింది.

ఆ రోజు సాయంత్రం ఏడు వరకు సునీత మా ఇంట్లోనే గడిపింది.  నేను ఉన్నప్పుడు పెద్దగా బయటపడక పోయినా నేను పక్కనలేని సందర్భాలలో మాఅమ్మ సూటిపోటి రాళ్ళను సునీత పై అవకాశం వచ్చినప్పుడంతా వదిలింది.  అయితే అవేవీ నాతో సునీత చెప్పనేలేదు.  (ఆ తర్వాత ఎప్పుడో చందనకి చెప్పింది)

మా అమ్మకి బ్రామ్మలంటే బాగా ఇష్టం.  రెడ్లంటే కూడా బాగాఇష్టం.  ఇరుగు పొరుగు వాళ్ళు వేరేకులాలు అయితే వాళ్ళ ఇళ్ళకు పోదు.  మాటా మంతీ దేనికైనా పదిళ్ళకి అవతల ఉన్నాసరే బ్రామ్మలు, రెడ్ల ఇళ్ళకే పోయి స్నేహంచేసి ఇంటికి వస్తుంటుంది.

ఒక రోజు సునీతకీ నాకూ పెరిగిన దగ్గరితనం గురించి, పెళ్లి ఆలోచన గురించి చెప్పాను.

ఆరోజు నుంచీ మూడు రోజులు అన్నం తినలేదు మా అమ్మ.  కేవలం టీ కాఫీలతోనే వారం గడిపింది.  దూరంగా వున్న చెల్లెలిని పిలిపించుకొని ఒక రోజంతా ఏడుపులు.

ఓరాత్రి పంచాయితీ జరిగింది మాయింట్లో.  నేను, మా అమ్మ, మా చిన్నమ్మ, మా తమ్ముడు. (చిన్నమ్మ కొడుకు) చందన నిద్రపోతున్న సమయం.

నేను మా అమ్మకి అర్ధం  చేయించడానికి నావేపున వున్న వాస్తవ పరిస్తితులు అన్ని వెళ్ళగక్కాను.

“సొంత ఇల్లు లేదు; గవర్నమెంట్ ఉద్యోగం లేదు; పొలం లేదు; ఎదిగొస్తున్న ఎనిమిదేళ్ళ ఆడపిల్ల; ముప్పై మూడేళ్ళ వయసులో నేను…. ఏ ఇంట్లోంచి పెళ్ళికాని పిల్లని ఎవరిస్తారు? అసలు నా వయసుకి తగ్గ పెళ్ళికాని పిల్ల అదీ మన కులంలో ఉండాలిగదా? ఉన్నా బిడ్డను చూసుకోవడానికి ఎవరు సిద్దపడుతారు? ఇలా పెళ్లి లేకుండా మిగిలి పోదామన్నా ఈ ఎదిగే పిల్లకి మంచి చెడు ఎవరు నేర్పాలి? ఎదో ఒక కులం…. నన్నూ పిల్లనీ అర్ధం చేసుకునింది…. మనసు పడ్డాం….” అని అన్నీ విడమర్చి చెప్పాను. నా మాటల్లో చివరి అవకాశమనో ఏమోగాని ఎప్పుడూరాని కళ్ళనీళ్ళు వచ్చేసాయి ఆ సమయంలో.

మా అమ్మ కరగలేదు.  అమ్మ మనసు అంటారు కదా అదేమైందో తెలీదుగాని; చివరికి తానొక రాజీ ఫార్ములా ప్రతిపాదించింది చెల్లెలి వేపు తిరిగి.

“తీసుకొచ్చుకొమ్మను…. ఐతే నాతిండి నేను వొండుకుంటాను” అంది.

నేను ఆశ్చర్యపోయి చూడసాగాను.

“ఈ సంసారం నడవడానికేనా పెదమ్మా ?” అన్నాడు తమ్ముడు మా అమ్మతో.

“ఏదైనా ఆశ్రమానికైనా  పోతాను గాని – ఇంకొకరు ఒండితే నేను తినలేనమ్మా! నన్ను మాత్రం తప్పు పట్టబాకoడి” అనింది చెల్లెలితో.

తెల్లవారితే నేనూ వస్తానంటూ చెల్లెలి ఇంటికి పోయి – అటునుంచి ఏర్పేడు ఆశ్రమానికి వెళ్ళిపోయింది మా అమ్మ. అంతే!  ఆ తర్వాత తన చెల్లెలితోనే …. చెల్లెలి ద్వారానే మాటా మంతీ అన్నీ….

*****

 

ఇది జరిగిన నెలకల్లా సునీత ఉద్యోగం మానేస్తానంది ఒక రోజు హటాత్తుగా !

కారణం అడిగాను.

ఏం లేదంది సునీత.

మళ్ళీ మళ్ళీ అడగ్గా;  “నావల్ల మీ అమ్మ వెళ్ళిపోయింది సార్.  మనం పెళ్లి చేసుకుంటే మీ బంధువులు కూడా ఎవరూ నన్ను కలుపుకోరు. కొడుకు నుంచి తల్లిని దూరం చేసానన్ననింద కూడా నేను మొయ్యలేను సార్” అనింది. మళ్ళీ తనే “ఎదో ఒక రోజు మీ అమ్మ తిరిగిరావచ్చులే సార్. వస్తుంది” అంది మళ్ళీ.

ముంజేతిపై వాలబోయిన సీతాకోక చిలుక వాలకుండానే చక్కర్లు కొట్టి ఎగిరిపోయినట్టు అయింది నా పరిస్తితి.  ఇప్పుడు ఇంత ఈజీగా  చెప్తున్నానుగాని ఆ విషాద సన్నివేశ ఫలితం నేను చాలాకాలం మోయలేక పోయాను.  ఎనిమిదేళ్ళ బిడ్డ చందన నన్ను వెన్నంటి ఉండకపోతే ఇప్పటికి ఏమై వుండేవాడినో ? ఎక్కడ తేలే వాడినో ఇప్పుడు చెప్పలేను.

ఆటలాడుతూ,  అన్నం తినిపిస్తూ, స్నానం చేయిస్తూ, జడ వేస్తూ, యూనిఫాం ఉతుకుతూ, హోమ్ వర్క్ చేయిస్తూ నిద్ర పోయేముందు ‘ఏ తల్లి పాడేను జోలా’ అని పాడుతూ …. అలా అలా మనసుకూ కాలానికీ ఒకరికొకరం కట్టేసుకుని నేను చందనా కలసి జీవిస్తూ వస్తున్నాం ఇప్పటి వరకూ.

ఇప్పటి విషయానికి వస్తే, ఇన్నాళ్లూ తల్లి చేసేవి చెయ్యగలిగాను గాని ఇకపై తల్లి మాత్రమే చెప్పవలసినవి చెప్పలేను గదా! రెక్కలు మొలిచే వయసు, రంగు రంగుల్లో కనిపించే ప్రపంచం చందనది ఇప్పుడు.

               *****

ఎక్కడో మొదలుపెట్టి  ఇక్కడి వరకూ చెప్పాను.

ఆరోజు శీను, వసంత  ఇద్దరూ బీచ్ నుండి అటే వెళ్ళిపోయారు.  చందనా  నేను ఇంటికి తిరిగొచ్చాం.

ఆరాత్రి పడుకున్నాక,  “నానా…. చెయ్యి వేసుకుని పడుకోవా?” అని అలవాటుగా అడిగింది చందన

నాకు కొత్తగా మింగుడు పడని సందర్భం.

“వద్దులేమ్మా! నువ్వు దూరంగా పడుకోవాలి” అన్నాను.

“సరే పాటన్నా పాడునానా” అంది.

మళ్ళీ అదే పాట…. నా గొంతులో నుండి చందన వేపుగా అలవాటుగా ప్రవహిస్తుంది.

ఏ తల్లి పాడేను జోలా….  

          ఈ నాన్న ఊపేను ఊయల…. 

          ఈ తల్లి మాచిట్టి తల్లీ….

          ఈ తల్లి మాబుజ్జి తల్లీ….

          ఈ తల్లి బంగారు తల్లీ….

          ఈ తల్లి మా కల్పవల్లీ…

                                                    *****

15 thoughts on ““ప్రవహించే పాట” 

 1. చాలా బాగుంది కధ సర్! మనసు కొంత భారమయ్యింది. మాతృస్థానంలో ఉండి కొడుకుకి ఏది మంచిదో అది దక్కనివ్వని తల్లి నేటి సామాజిక వ్యవస్థకు ప్రతినిధి. ఒక ఎదుగుతున్న ఆడపిల్లకు తండ్రిగా, బాధ్యతలు సంభాళించవలసిన పరిస్థితి అతనిది. కులంలో ఇమడలేనని తప్పుకున్న ప్రేమికిరాలు…. ఇలా ప్రతీ పాత్రనూ క్లుప్తంగా చెప్తూ కధని చక్కగా నడిపారు.

 2. సర్..నమస్తే..పాత్రల చిత్రణ,కథకుని నరేషన్..క్లుప్తత..అన్నీ బావున్నాయి.కానీ..చివరి లో..రచయిత conclusion..ఏమిటో..నా మట్టిబుర్రకు తట్టలేదు..రచయిత కథ మధ్యలో రాయడం ఆపేసినట్టు అనిపించింది..

 3. <>ఈ వివరణ అవసరం లేదేమో అనిపించింది సర్.కృత్రిమంగా కనిపించింది నాకు.

  ముగింపు మాత్రం చాలా బాగుంది, అలా ఏ ముగింపూ ఇవ్వకుండా మా ఊహలకి వదిలెయ్యడం. 🙂

 4. కథాకథనం ఆద్యంతం చదివించింది. వాస్తవ సమాజాన్ని ఆవిష్కరించింది. రచయితకు అభినందనలు.

 5. బావుంది సర్. ముగింపు ఏమిటో మమ్మల్నే ఊహించమంటూ.

 6. చాలా బాగుంధి సర్.. నాకు ఇలాంటి కధనాలు చాలా ఇష్టం … (స్వగతంలా … ఇంగ్లీష్ లో ఫస్ట్ పర్సన్ narrative అంటారు …తెలుగు లో ఏమంటారో తెలియదు 🙂 )

 7. కథనం గురించి చెప్పేదేం లేదు..యాజ్ యూజువల్ గా సూపర్బ్..కథిట్లా చెప్పాలన్న మీమాంస లేకుండా సూటిగా జరిగినట్లుగా(అంటే కథలా లేదని..చూసినట్లుందని) చెప్పడం బాగుంది.మానసిక వైరుధ్యాలనేవి తరం, తరానికి మారుతుంటాయ్..అమ్మ పాత్రలో అదే కనిపించింది..కథైనా అమ్మ కన్విన్స్ కావొచ్చు(చేయొచ్చు కదా) అనుకోలేం..సజీవ పాత్రల్లా కథ సాగడం..నడపడం..మీకు వెన్నతో పెట్టిన విద్య..కులాలను అధిగమించే దశలో సమాజం కొంత కొంత ముందుకు పోతుందనేదీ సత్యమే..కథ కు..రాసిన మీకూ అభినందనలు పద్మాకర్ సర్

 8. ప్రగతి కి అడ్డు పడే వాల్లను సహజంగా నే విలన్లగా భావించు కుంటాము. ఈ సంఘర్షణ లేకపోతే కథకు బలం చేకూరదు. సామాజిక సంఘర్షణ కూడా తప్పని సరి! ఆమధ్య మీ ” లక్ష” కథ ( కథ పేరు గుర్తు లేదు) ని విమర్శచించి నందుకు ఇద్దరు స్త్రీలు ఆ పేస్ బుక్ గ్రూప్ నుండి వెల్ల గొట్టారు. కథ చెప్పిన తీరు చాలా బాగుంది సర్!

 9. ఒలికిన విషాదాశ్రులు కాసిన్నే. లోపల గడ్డ కట్టుకుపోయింది చాలా ఉంది. అది బైటకి వస్తే భరించే ఓపిక లోకానికి ఉందా? కళ్ళు చెమర్చాయి పద్మాకర్.

 10. మనసుకు హత్తుకునేలా చెప్పడమే రచన అంటే .. బాగుంది అనే కంటే బావురుమనిపించింది అనాలేమో..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


   Type Comments in Indian languages (Press Ctrl+g to toggle between English and Hindi OR just Click on the letter)