Featured కాలమ్స్

బహుజనుల బతుకు గోస మాదిరెడ్డి నవల ‘సుషుప్తి’

1956లో ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడిన తర్వాత ఆంధ్రా యాజమాన్యంలో తెలుగు పత్రికలు హైదరాబాద్‌లో నెలక్పొడం పెరిగింది. కర్నూలును రాజధానిగా వదిలేసి హైదరాబాద్‌లో కుదురుకున్న తర్వాత వాళ్ళకు ఇది మాది అనే ఒక భరోసా ఏర్పడింది. ఈ భరోసా పాలకులు ఆంధ్రా, రాయసీమ వారికి ఇవ్వగలిగిండ్రు. అదే సమయంలో తెలంగాణ వారికి తాము ఉన్నది కోల్పోయమనే భావన ఒకటి, రెండేండ్లకే వచ్చింది. ఇట్లాంటి సమయంలో అటు పత్రికలు, మరో వైపు సినిమాలు, వీటికి రచనలు చేసే వాండ్లంతా ఆంధ్రాప్రాంతం వారే ఉండేవారు. పత్రిక యజమానులతో పాటుగా, సంపాదకులు, సినిమా దర్శకులు అంతా ఆంధ్రాప్రాంతం వారే కావడంతో వారు తమ ప్రాంతం వారికే రచనావకాశాలు ఇచ్చేవారు. ఈ దశలోనే తెలంగాణకు చెందిన దాశరథి, సి.నారాయణరెడ్డిలు సినిమాల్లో అవకాశాలను చిక్కించుకున్నారు. అదీ కేవలం పాట రచన మేరకే! తెలంగాణ జానపద సౌందర్యాన్ని వీళ్లు తమ పాటల ద్వారా పాపులర్‌ చేసినారు. వీరిద్దరికి మాత్రమే తెలంగాణ నుంచి మంచి అవకాశాలు వచ్చినాయి. వీరి తర్వాత మళ్ళీ మాదిరెడ్డి సులోచనకు మాత్రమే సినిమాకు రాసే అవకాశం దక్కింది. ఈమె డజన్ కు పైగా సినిమాలకు కథను అందించింది.

Cover pages

మాదిరెడ్డి సులోచన 1965 ఆ ప్రాంతంలో రచనలు చేయడం ప్రారంభించారు. అయితే ఆమె తొలినాళ్లలోని రచనలెవ్వరూ అంతగా పట్టించుకోలేదు. 1969లో ప్రత్యేక తెంగాణ ఉద్యమం, ఆ తర్వాత 1972లో ప్రత్యేకాంధ్ర ఉద్యమం తర్వాతగానీ ఆమె రచను పాపులర్‌ కాలేదు.  అయితే ఈ ఉద్యమాలు సమసిపోయిన తర్వాత తెలంగాణ వారిని కూడా కలుపుకొని పోవాలె అనే ఉద్దేశ్యంతో ఒక వైపు సినిమాలు, మరోవైపు ప్రచురణ సంస్థలు తెలంగాణ వారి రచనలకు కూడా గుర్తింపునిచ్చాయి, ప్రచురణ చేశాయి. ముద్రించాయి. ఇందుకు మాదిరెడ్డి సులోచన, పోల్కంపల్లి శాంతాదేవి, పోల్కంపల్లి రాజ్యక్ష్మీదేవి, బొమ్మ హేమాదేవి తదితరుల రచనలున్నాయి. వీరందరిలో అగ్రతాంబూం మాదిరెడ్డిదే!

ఉన్నత విద్యావంతురాలైన మాదిరెడ్డి సులోచన దాదాపు 90 నవలలు 150కి పైగా కథలు రాసినారు. అయితే వీటిలో అప్పుడప్పుడే గ్రామీణ జీవితంలోకి చొరబడుతున్న మార్కెట్‌ మాయాజాలాన్ని, దాని మూలంగా నాశనమవుతున్న కుల వృత్తును, ఆ కారణంతో దిగజారుతున్న జీవన ప్రమాణాలు, సంబంధాలను ‘సుషుప్తి’ నవల్లో రచయిత్రి కళ్ళకు కట్టారు. తెలంగాణలో బహుజనుల జీవితాలను నవలగా మలిచిన వారిలో జి.రాములు, లోక మలహరి ఉన్నారు. జి.రాములు ‘పెరటి చెట్టు’ పేరిట గౌడ్‌ జీవితాను, లోక మలహరి ‘సంఘం’ నవల ద్వారా పద్మశాలీ జీవితాలను అక్షరబద్ధం చేసినారు. వీరికి కొనసాగింపుగా ‘సుషుప్తి’నవల ద్వారా కుమ్మరుల జీవితాలను, అదీ పట్టణంలో నివసిస్తున్న కుమ్మరుల జీవితాలను అక్షరాల్లో సాక్షాత్కరింపజేశారు మాదిరెడ్డి సులోచన.

ఇవ్వాళ విస్తృతంగా ప్రచారంలో ఉన్న ‘ప్రపంచీకరణ’అనే పదం ప్రచారంలోకి రాక మునుపే ‘ప్లాస్టిక్‌’ సామాన్లు ఎట్లా కుమ్మరి వాములో దుమ్ము పేరేలా చేసిందో రాసింది. గోరటి ఎంకన్న పాట ద్వారా కుమ్మరి వాముల గోస అందరికీ తెలిసిందే! అయితే ఎంకన్న కన్నా ముందే వృత్తి జీవితాలు ఎట్లా దెబ్బతిన్నాయో ‘ఎమర్జెన్సీ’ సమయంలో వెలువడ్డ ఈ నవల్లో రచయిత్రి చెప్పినారు. కుమ్మరి వృత్తి కేంద్రంగా కథ నడిచినా దానితో పాటుగా కమ్మర్లు, గాజు అమ్మేవారు, దర్జీలు, మిరపకాయ బజ్జీలు అమ్ముకునే వారు, ఇట్లా ప్రతి ఒక్క కులం వారు ‘మార్కెట్‌ మాయాజాలంలో’ చిక్కుకొని నష్టపోతున్నారో చెప్పింది. కుమ్మరి వృత్తితో పాటుగా ఈ నవల్లో ధనిక, పేద తేడాను ఎత్తి చూపిస్తూ ఒకరు తిండిలేక ఒకరు బాధపడుతా ఉంటే మరొకరు (ధనవంతులు) విందు, వినోదాల్లో ఎట్లా దుబారా చేస్తున్నారో అని బాధపడుతూ రాసినది.

21 విభాగాలుగా విభజింపబడ్డ ఈ నవలలో ప్రతి పేజీలోనూ అట్టడుగు ప్రజల జీవితాల్లో కన్పిస్తాయి. దోపిడీ కులాల గురించి కూడా ఆమె వివరంగానే రాసినది.     భూమి యొక్క విలువను కరెక్ట్‌గానే గుర్తించింది. అంతేకాదు వ్యవసాయం చేయడానికి కావలసిన పెట్టుబడులు, పంట గురించి కూడా ఈమె గ్రామీణ జీవితాన్ని దగ్గరగా చూసి రాసింది. నిజానికి ఈ నవలను చాలా దగ్గరగా చూసి, అబ్జర్వ్‌ చేస్తేగానీ పదాలు, పదబంధాలు ఇంత పకడ్బందీగా కుదురవు. కుమ్మరి వృత్తి పదాలను, అవసరమైనప్పుడు వివరణలతో సహా వివరించారు.

స్త్రీ లైంగిక స్వేచ్ఛను గౌరవించింది. చదువుకోక పోవడం మూలంగా జరిగే నష్టాలను, చదువుకుంటే జరిగే మంచిని కూడా నవలలోని కథానాయకుడు ‘గోవిందు’ ద్వారా చెప్పించింది. గోవిందు ప్రేమించిన టీచరు పాత్ర ద్వారా చదువు గురించి పెళ్ళి, ప్రేమ, వివాహం, సమాజం గురించి అందరికీ బోధపడేలా చెప్పింది. బహుశా మాదిరెడ్డి సులోచన వృత్తి రీత్యా టీచర్‌ కావడం కూడా ఆ విషయాన్ని హృద్యంగా చెప్పడానికి వీలు కల్పించిందని చెప్పవచ్చు. ఇప్పటి వరకూ తెలంగాణ సాహిత్య చరిత్రలో ఇంత గొప్ప ఆణిముత్యం వెలువడిందనే విషయం చాలా తక్కువ మందికి తెలుసు. ఏ విశ్వవిద్యాలయంలోనూ ఈ నవలపై చర్చ, విశ్లేషణ జరగలేదు. భవిష్యత్‌లో అట్లాంటి చర్చకు ఈ పుస్తక ప్రచురణ దారి తీయాలని కోరుకుంటున్న.                                                             

                                                                                     – సంగిశెట్టి శ్రీనివాస్‌

2 thoughts on “బహుజనుల బతుకు గోస మాదిరెడ్డి నవల ‘సుషుప్తి’

  1. సంగిశెట్టి గారూ .. మీ ఆర్టికల్ చాలా ఆలస్యంగా చదివాను. నాకు ఎంతో ఇష్టమైన రచయిత్రి మాదిరెడ్డి సులోచన గారు. నేను కాలేజీలో ఉండగా మా హాస్టల్ రూముల్లో ఆమె నవలలు ఎక్కువగా కనిపించేవి. “న్యాయం నిదురబోయింది” అప్పట్లో మా అభిమాన నవల. అగ్నిపరీక్ష, ప్రేమలూ పెళ్ళిళ్ళు .., అంతం చూసిన అసూయ వంటివి బాగా గుర్తు. కళ్యాణి (జయసుధ ) , ఈ తరం మనిషి (శోభన్ బాబు ), తరం మారింది (సింగీతం దర్శకత్వం), ప్రేమలూ పెళ్ళిళ్ళు (అక్కినేని) ఇంకా అంతం చూసిన అసూయ నవల (సినిమా పేరు గుర్తు లేదు) మాదిరెడ్డి నవలల ఆధారంగా వచ్చిన సిన్మాలు అనుకుంటా. 83 లో ఆమె భర్తతో పాటు ఒకేసారి మరణించడం ఇంకా మరవలేదు. మాదిరెడ్డి గారిని మళ్ళీ గుర్తుచేశారు – ధన్యవాదాలు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


   Type Comments in Indian languages (Press Ctrl+g to toggle between English and Hindi OR just Click on the letter)