షాయరీ

మట్టిపొరల్లోంచి

సారెపై
నానిన మట్టిముద్దని వేసి
కర్రతో తిప్పుతున్నప్పుడే
నిద్రలేచింది
ఆకాశం
తడి తడి
కుండ ఆకారంలోకి
పోతపోయబడి
నేలమీదికొచ్చాడు
సూర్యుడు
వూరి చివర
వొంటరి వూరుమ్మడి యిల్లు
ముంగిలిని
కుతితో నాకుతూ
పొద్దుటి కాంతి
ఒట్టి మట్టి పిడత – ఇల్లు
మిణుకుమిణుకుమంటూ
ఇంటిళ్లపాది కళ్లు
వొక్క జల్లు రాలితే
మట్టిపొరల్లోంచి ఉబికే వాసన
అదిరే ముక్కుపుటాలు
ఆరుబయలు
తళతళ మిలమిల
కుండల వరస
మట్టితో
నిర్మించబడిన వూరిని
దాటి వచ్చాను
ii
‘ఆకలేస్తుందే అమ్మా’
పిర్రలపైకి జారిపోతున్న నిక్కరుని
పైకి లాక్కుంటూ
వచ్చి నిల్చొన్నాడా బుడ్డోడు
వొంటినిండా మట్టి
పిక్కలపైకి గుండార లాక్కుని
పొగబట్టిన పొయిలోకి
వొకటి వొకటి
పేడులు దూరుస్తుందా తల్లి
ఎల్తి ఎల్తి బతుకు
కూటికుండలోంచి ఎసర
నేలరాలి
సురసురమని
ఆకలి కడుపులో
ఆకలి
దాకలోకి
మిరగాయలు చిక్కి
కుసింత నూనె పోసిందా అమ్మ
రొండు వుల్లిరెమ్మలు లాగి
కరేపాకు జల్లింది
ఆకలేస్తుంది
ఆకలి
iii
అరికాళ్ల కింద మంట
బొబ్బలెక్కుతూ పాదాలు
వీధివీధి తిరుగుతుందా
మట్టిపొయ్యి
గడపగడప దిగుతుందా
మట్టికుండ
చెల్లని పెంకైపోయిందా
మట్టిదాక
ఆకలేస్తుందే అమ్మా
బతుకుల్లో
మబ్బు ముసురుకుందిరా నాయనా
ఆకలేస్తుందే తల్లీ
కండ్లల్లో
వొక్క సినుకు పిసర
పడతలేదురా బావూ
బావురుమంది
ఇల్లు
iv
సారెపై
మట్టిముద్దలు లేని సారె
ఎండి చిదిగిన పెళ్లలతో
గుమ్మం
పెంకులు పెంకులైన
మట్టిబొమ్మలు
v
ఒక్కసారి మాట్లాడవా
వూరికి ఆలంబనగా నిల్చిన
మట్టికేకని
వొకేవొక్కసారి
ఇంటిగుమ్మాలు దాటి
లోపలికి వినిపించేట్టు
పాడవా
ఆవంలో ఎర్రగా మండి మండి
వూరువూరంతటినీ
వొకే దారంతో నేసిన
మట్టికుండల దరువు
శిరసెత్తుకుని వినిపించవా
vi
వూరి గ్నాపకాల్లోంచి
గ్నాపకాల మట్టివాసనల్లోంచి
వూరిని దాటి వచ్చాను
మట్టితో నిర్మించబడిన
వూరిని దాటి వచ్చాను
                                            -బాల సుధాకర మౌళి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


   Type Comments in Indian languages (Press Ctrl+g to toggle between English and Hindi OR just Click on the letter)