కితాబ్

మన మెడని చుట్టుకునేది (అంగారస్వప్నం)

తూనీగల గుంపొకటి చెప్పాపెట్టకుండా మబ్బుల్లా మనముందు ముసురుకొస్తే వాన పడుతున్నట్టే ఆశను ధ్వనిస్తాయి వాటి రెక్కలు . ఇంత సౌందర్య పాతముల మనస్సు పుట్టినప్పుడల్లా పదాలు దొర్లుకురావడం… అబ్బే… సాధ్యం కాదు.. అని నాలాంటి పాఠకులు తరచూ భావిస్తుంటారేమో, కాని తమసా నదీ తీరంలో పదాల కోసం తిప్పలు పడకుండానే ఆది కవికి పద్య పాదం  లాగ యథేచ్చగా   పుట్టుకొచ్చిన నాటిననుంచి నిన్న సాయంత్రం ఊర్మిళ వంటి అతికొద్ది మందికి అప్రయత్నంగా కవితలు ధార కట్టి ఉట్టి పడడం చూస్తే కవి చింతనో, స్వాభావమో ఎంత సహజ సిద్దంగా వల లేకుండా పదాల్ని కట్టుకుంటాయో  తెలిసినంత వరకు అర్ధం అవుతుంది మనకు.

కవులెందరో చిరదీక్షతో ఆలోచనావస్థలు దాటుకొచ్చి కవితలు రాయడం భావం కలిగినంత అనాయాసంగా జరుగుతుందా మరి ?! ఊర్మిళ సంగతో ? ఆవిడ ముందు సాధనా  సామగ్రి ఉన్నట్టుగాని, అనుభూతికి , పదాలకి మధ్య శ్రమ జరిగిన తీరు గాని, వారెవా.. కనపడనే కనపడదు.

నా వరకు నేను చదువుతోంటే ఊర్మిళ అసలు అప్పుడెప్పుడో మొదటి కవిత రాసిన నాటినుంచి ఇందాకటి వరకు సాగిన కవితల్లో అవి నింపాదిగా, క్రమంగా మెరుగవ్వడం అనే ముచ్చటే లేదు . అల కనపడనే లేదు . అదేవిటో , అవన్నీ ఒకేసారి రివ్వున గూటికి చేరినా గాని తలచినప్పుడే ఫలించే వరంలా ఈ కవితలు విచ్చుకున్నట్టు అనిపించింది. నాలాంటి పాఠకుడు అనితర సాధ్య విమర్శనా దర్శంతో కంచు ఢక్కలేవో పగలేసే జోలికి పోనవసరం లేదుగా… కవితలంటే మురిసి పుస్తకం పట్టే వారికి కవితలు విదేశీ పక్షుల్లా సముద్రాలు దాటి మన భుజం మీద వాలినట్టు వాటి పని అవి చేసుకుపోతే చాలదా ఏం ?!… ఇది కొంత ఆశ కాను వచ్చు.

అంగారస్వప్నలోకపు కవితలు సాహిత్యాంతర్గత సూత్రాలు తెలిసి దాటి గబుక్కున అవతరించాయా? అన్నది ఊర్మిళ నుదుటి బొట్టుకో , కంటికో విస్పష్టమయ్యే ఉండాలి. నిజానికి సాధారణ జీవితంలో నగర వీదుల్లో సంభ్రమమో , విషాదమో ఇచ్చే కోకొల్లల దృశ్యాలు ఎప్పటికప్పుడు సరికొత్త పదాలకోసం సరికొత్త చేతనావస్థ ఒకటి కలం చుట్టూ  తచ్చాడుతుందాకవికి ? లేకపోతె అన్నేసి కవితలు ప్రతిధ్వనించే సుక్ష్మ రహస్యం భలేగా పాదాలను అమర్చినా ఎక్కడ దారి తప్పినట్టు లేకపోవడం … అరెరే … మహా మర్మం ఈ సంకలనం లో .

స్త్రీ జాతి అస్తిత్వ విషయం కావచ్చు, ఉద్యమకాలపు నీడలా స్పర్శ కావచ్చు అవేవి వట్టి ఊహా చేలాంచలాల కొనమేరుపులు కావని ‘మధురవాణి నవ్వు ‘ తాకి చెపుతుంది. అసలోక్కక్కసారి పాఠకుడు కవిత్వపు రుచి మరిగే లాగ కవితలు మన చుట్టూ పరిభ్రమిస్తాయి. ఇందుకు ఒక చిన్న నిదర్శనం ఒక పద చిత్రమనే కాదు- కవితావేశపు ఊహా రూపం .. చూడండి .. ‘విరిగిన ఇంద్రధనుస్సు కోకిల గొంతు చుట్టుకుంది’ – పైగా ఇతివృత్తం ‘జీవితం’ ! (but I see no guided dream love … sir).

చాలా కవితలు చివరి పాదాల్లో అనుసంధానం చెయ్యడమో అంతరార్థ వివరణ కూర్చటమో చక్కని కవనయానం , శైలి కొత్తగా ఆధునిక కవిత్వం కోసం వెతికే వారికి పరిచయం చేసినట్టు అదనపు విలువ స్పురిస్తుంది. ‘వశమా’ చదివితే ఎదో గజల్ ఒకటి ఎక్కడో సూఫినంత సారాన్ని వలువరించినట్టనిపించి సుఖపెట్టింది. ‘అద్వైతం’ యావత్తు ఒక ‘స్థితి’ని తాకించింది. స్థితే సంగతంలాగా ‘ఉపరితలం’ చూస్తె పొడవాటి అనేక కవితా పాదాలు మాత్రలేక్కడ అక్కరలేని హైకూ ఒకటి మంచు తెరకవతల వినిపించినట్టనిపించింది. కవన ‘ధ్వని’కి ప్రతిరూపం లాంటి ‘రహస్యవాన’ ఊర్మిళ కవన చేతనావస్థ పలికింది.

ఇక ఆశా మొహాలు, సందిగ్ధ నైరాశ్యాలు, అనుమానపు చీకటి స్వరాలూ పలికిన ప్రతి పాదం ఎదో నిబద్దత కోసం కనబడినట్టే ఉండవచ్చు గాక కవిత్వ బాష కదిలించే వేళ కవన చైతన్యమే ముందు నిలిచి ‘సారం’, ‘భావం’ పదిలంగా బయట పెట్టడంలో ఊర్మిళనంత సహజయానం చేసిందో ‘శీర్షాసనం’ నిటారునా నిలువెత్తున చెబుతుంది చాలు ‘ ఎకదేక్కడి ఊహలో, అనుభావరహిత్యలో అంతచ్చెతనలో తుఫాను కన్ను లక్ష్యం వైపే చూడడం ‘ అనాశ్రిత’ ధ్వనిస్తుంది .

గుల్జార్ అనుకుంటా … ‘ఆమె గొంతు శీతాకాలపు సాయంత్రం వేడిగా రొట్టెలు కాలుతున్న పరిమళం మనకు చేరుస్తుంది’ అని అబిదా పర్వీన్ గజల్ పాడే తీరు గురించి అన్నాడు. (సరిగ్గానే కోట్ చేసానా సిద్ధార్థ ?) ఊర్మిళ తన కవితలన్నిటా ఇదే సాధించింది. ఒక రకం జెన్ వని సూచనగా నిప్పు కలికెని అరిటాకులో చుట్టి మన చేతికి ఇచ్చినట్టుంది . ఊర్మిళకు నమస్కారం … ఎంత పెద్ద కవిని కడుపుల పెట్టుకున్నావు రా నాయిన !

 

-శివాజీ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


   Type Comments in Indian languages (Press Ctrl+g to toggle between English and Hindi OR just Click on the letter)