Featured వ్యాసం

‘మా బతుకులు’ వినిపించే సముద్ర ఘోష  

                                                                  -కాత్యాయనీ  విద్మహే

ఒక పుస్తకం చదవటం అంటే ఒక కొత్త ప్రపంచాన్ని తెలుసుకొనటం. కొత్త ఆలోచనా ప్రపంచాలు ,అనుభవ ప్రపంచాలు ,ఆంతరిక ప్రపంచాలు తెలిసే కొద్దీ మనుషులు నేను నుండి  మేము గా, మనం గా విస్తరిస్తారు. మెత్తనవుతారు. ఎవరికి  ఏ కాస్త కష్టం కలిగించే వ్యవస్థలనైనా ,విధి నిషేధాలనైనా ప్రశ్నించి నిలిచే విలువల బీజావాపనకు ఇక సర్వం సిద్ధమైనట్లే.

1999 లో ఎండ్లూరి సుధాకర్ గారి ‘మల్లెమొగ్గల గొడుగు’ చదివిన్నప్పుడు ఇలా ఒక కొత్త ప్రపంచం గురించి తెలుసుకున్నట్లు అనిపించింది. ఆ పుస్తకం నాకు మాదిగ జన జీవిత సుఖ దుఃఖోద్వేగాలు ఎలా వుంటాయో తెలియ చేసింది.ఆ నాటికి నాకది కొత్త జ్ఞానం.అప్పుడప్పుడే స్త్రీవాదంపై దళిత కోణంనుండి వస్తున్న ప్రశ్నల సామంజస్యాన్ని అర్ధం చేసుకొనటానికి ఆ పుస్తకం చదివిన అనుభవం ,అది ఇచ్చిన అవగాహన నాకు ఉపకరించాయి.మళ్ళీ ఇప్పుడు బేబీ కాంబ్లే ఆత్మకథ “మాబతుకులు” మిరిమిట్లు గొలిపే కొత్త జ్ఞాన ప్రపంచం లోకి నన్ను మేల్కల్పింది.  దళిత మహిళల జీవితం గురించి ,దళిత పోరాట రాజకీయాల గురించి  దిగ్భ్రాంతికర వాస్తవాలు తెలియవచ్చాయి.అంబేద్కర్ నాయకత్వంలోని క్రియాశీల దళిత మహిళా ఉద్యమ శక్తి ని,పదును ను ఉపాంతీకరించి   భారతదేశ మహిళా ఉద్యమ చరిత్ర ఎంత  అసమగ్రంగా మిగిలిపోయిందో ఈ పుస్తకం చదివాక మరింత స్పష్టంగా తెలిసింది.దళిత ఉద్యమాన్ని గురించి ,ప్రత్యేకించి దళిత  మహిళా ఉద్యమ చరిత్ర గురించి ,దళిత జీవిత సాహిత్య అధ్యయనాల గురించి  ఆసక్తిని పురికొల్పిన   బేబీ కాంబ్లే  ఆత్మ కథ  గురించి మాట్లాడుకొనటం ఇప్పుడు చాల అవసరం.

బేబీ మహారాష్ట్ర మహిళ.1929 లో పూనా జిల్లాలో పురందర్ తాలూకా లోని అమ్మమ్మ గారి వూరు వీరగావ్ లో పుట్టింది. బాల్యం అక్కడే గడిచింది. ఏడెనిమిదేళ్ల వయసులో  సతారా జిల్లా ఫల్టన్ లో ఉంటూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నాయకత్వం లోని దళిత ఉద్యమ ప్రభావం లోకి వచ్చింది .బడికి వెళ్లి చదువుకొ న్నది.13 వ ఏట కొండిబా కాంబ్లే తో పెళ్లి జరిగినప్పటి నుండి ఆమె బేబీ కొండిబా కాంబ్లే అయింది.వాళ్ళ పెళ్లి కూడా సంప్రదాయ పద్ధతిలో కాకుండా అంబేద్కర్ చెప్పిన పద్ధతిలో జరిగింది. స్వబుద్ధితో ఆలోచించటం ,స్వంత కాళ్ళ మీద నిలుచోటం దళిత ఉద్యమ భాగస్వామ్యం వల్ల నేర్చుకొన్నది.ఆ క్రమం లోనే తన అనుభవాలను ఆలోచనలను కాగితం మీద పెట్టి చూసుకొనటం అలవాటైంది. ఆడవాళ్లకు మెదడు ఉంది ఆలోచించగలరు అన్న అవగాహన ఏర్పడని కౌటుంబిక సామాజిక పరిస్థితులు మప్పిన భయం నుండి  వాటిని రహస్యంగా దాచుకొనటం ఆమె కు కూడా అనివార్యమైంది.

షెడ్యూల్డ్ కులాల మీద పనిచేయటానికి  ఫల్టన్ కు  వచ్చిన సామాజిక శాస్త్ర  వేత్త మాక్సిన్ బెర్న స్టీన్ తో పరిచయం బేబీ కాంబ్లే ను దాచుకున్న కాగితాలను బయట పెట్టేట్టు చేసింది. ఆ రకంగా ఆమె ముప్ఫయి ఆరు ముప్ఫయి ఏడు సంవత్సరాల వయసులో (1966 )  రాసుకొన్న స్వీయ చరిత్ర పదహారేళ్ళ తరువాత  1982 లో ‘స్త్రీ’ అనే పత్రికలో సీరియల్ గా వచ్చి , ‘జీనా అమూచా’ అనే పేరుతో  1986 లో పుస్తక రూపం లో ప్రచురించబడి మరాఠీ చదువరులను విశేషంగా ఆకర్షించింది. ‘ది ప్రిజన్స్ వుయ్ బ్రోక్’  అనే శీర్షికతో మాయ పండిట్ చేసిన ఇంగ్లిష్ అనువాదం 2008 లో ప్రచురించ బడి దళిత స్త్రీవాద దృక్పధం నుండి వచ్చిన  ఆత్మ కథగా  జాతీయ స్థాయిలో మహిళా జీవిత అధ్యయన పరుల చర్చలోకి వచ్చింది.ఇప్పుడు ‘మా బతుకులు’ అనే శీర్షికతో  బి. అనురాధ ఆ పుస్తకానికి చేసిన తెలుగు అనువాదం మలుపు ప్రచురణగా (2016 నవంబర్ ) మనకు అందుబాటులోకి వచ్చింది.రాజకీయ అభిప్రాయాల కారణంగా లభించిన  జైలు జీవితంలో తోటి మహిళా ఖైదీల జీవితాలను దగ్గరగా పరిశీలిస్తూ , వాళ్ళ జీవితాలను  జండర్ కోణం నుండి  జైలు కథలుగా రాసిన బి.అనురాధ దళిత మహిళల ఆరాటపోరాటాల అనుభవ కధనమైన ‘ది ప్రిజన్స్ వుయి బ్రోక్’  పుస్తకాన్ని అనువదించటం ఒక  రాజకీయ మెటఫర్ అనిపిస్తుంది.

 

2

తరతరాల మహిళల మౌన వేదనల ఘోషను వినటానికి ,ఎక్కడా నమోదు కాని, ఎవరికీ పట్టని  ఆరాట పోరాటాల చరిత్ర నిర్మాణానికి మూల వనరుగా  సాహిత్యానికి  ఉన్న ప్రాధాన్యత మహిళా జన జీవన అధ్యయనం ఒక శాస్త్రంగా రూపొందే క్రమం లో ఆవిష్కరించబడింది. స్త్రీలు అసలు సాహిత్య రంగం లోకి ప్రవేశించిన వాళ్ళు ఎంతమంది ?వాళ్ళు రాసినదేమిటి ?వాళ్లకు సాహిత్య ప్రపంచంలో లభించిన గుర్తింపు ఎంత ? స్త్రీల సాహిత్య వస్తు శిల్ప నిర్వహణల పట్ల చిన్న చూపు, స్త్రీల సాహిత్యం పట్ల నిర్లక్ష్యం ఎందువల్ల?అన్న ప్రశ్నలతో   ఉపాంతీకరణకు గురి అయిన స్త్రీల సాహిత్యాన్ని సేకరించి సాహిత్య చరిత్రను సమగ్రం చెయ్యాలన్న లక్ష్యంతో అన్ని భాషలలోనూ  అధ్యయనాలు కొనసాగుతున్నాయి.స్త్రీల అంతరంగాల పరోక్ష ప్రతిఫలనం అయిన సృజన సాహిత్యం,ప్రత్యక్ష ప్రతిఫలనమైన స్వీయ చరిత్రలు,ఆలోచనా శక్తి కి ప్రాతినిధ్యం వహించే వ్యాసాలు ,విమర్శ రచనల మొత్తమే  స్త్రీల సాహిత్యం.స్త్రీల అనుభవాలకు , ఆలోచనలకు ,అభిప్రాయాలకు ,విమర్శనాత్మక దృక్పథానికి ,వాళ్ళు కలగంటున్న కొత్త లోకానికి ,అదే సమయంలో వాళ్ళ సృజనాత్మక ప్రతిభకు అద్దం పడుతుంది ఆ సాహిత్యం.

అసలు  స్త్రీల సాహిత్యమే ప్రవేట్ ప్రపంచం నుండి పబ్లిక్ ప్రపంచం తో ప్రారంభించిన సంభాషణ.ఇతివృత్తంలో భాగంగా స్త్రీలు కుటుంబం లో,సమాజంలో తమను  నిర్వచించి   నిర్దేశించిన  మూస పాత్రల జీవిత విధానం పట్ల చూపే విసుగు,కోపం ,నిస్సహాయ దుఃఖం  ఆయా వ్యవస్థలను ,పాత్రలను తాము ఎలా చూస్తున్నారో అవి  ఎలా పునర్నిర్మించబడాలని కోరు కుంటున్నారో చెప్పకనే చెప్తాయి. స్వీయ చరిత్ర ఆ ప్రయోజనాన్ని మరింత స్పష్టంగా ,సమర్ధవంతంగా సాధించగల  ప్రక్రియ.సామాజిక చారిత్రక వాస్తవికత వాటి సారం కనుక స్త్రీల కోణం నుండి చరిత్రను తిరిగి రాయటానికి స్వీయ చరిత్రలు  ప్రధాన వనరు అవుతాయి. ‘నేను’ అన్న ఒక ఏకైక వ్యక్తి చరిత్ర గా  ఆత్మకథ కు ఒక పరిమితి ఉన్నప్పటికీ   అంతిమంగా ఆ ‘నేను’  ఒక ప్రత్యేక దేశకాలలో జీవించే తన జాతి జనుల అనుభవాల, అవమానాల, దుఃఖాల,ఆశల, ఆకాంక్షల తో  సాధారణీకరణ చెందటం వల్ల తరచు సామాజిక సాంస్కృతిక డాక్యుమెంటరీ స్వభావాన్ని పొందుతుంది.

భారత దేశం లో ఆధునికీ కరణ, సంస్కరణోద్యమం  తమను తాము చూచు కొనటానికి ,తెలుసుకొనటానికి ,తమను తాము వ్యక్తీకరించుకొనటానికి లభించిన  వెసులుబాటు నేపథ్యంలో స్త్రీలు   స్వీయ చరిత్రలు రాయటం   ప్రారంభించారు. స్త్రీల హక్కుల కోసం, అభ్యుదయం కోసం పని చేసిన తొలి మహిళలలో ఒకరైన రమాబాయి రనడే స్వీయచరిత్ర ఆ వరుసలో మొదటిది (1910). అప్పటి నుండి మరాఠీ భాషలో స్వీయ చరిత్రలు విరివిగానే కనిపిస్తాయి. 1975 నాటికి 35 కు పైగా స్త్రీల స్వీయ చరిత్రలు ప్రచురించబడినట్లు  ఒక అంచనా.వీటిలో సగానికి పైగా 19వ శతాబ్ది చివర 20 వశతాబ్ది ప్రారంభంలో మధ్యతరగతి స్త్రీల జీవితానుభవాలు.ఎక్కువగా వీళ్ళు ప్రసిద్ధ పురుషుల భార్యలు. సంప్రదాయ వ్యవస్థలతో ఆధిపత్య వర్గాల స్త్రీల పోరాటం, ఆధునికతకు సంబంధించిన ఆకాంక్షలు ప్రధానంగా వీటిలో ప్రతిఫలించాయి.

అయితే మహారాష్ట్రలో  దళిత స్త్రీల ఆత్మకథల చరిత్ర కూడా తక్కువదేమీ కాదు. కానీ అవి వెలుగులోకి రావటం మాత్రం  కుల అస్తిత్వ చైతన్యం పెరిగి ,బ్రాహ్మణీయ స్త్రీవాదాన్నినిరాకరిస్తూ దళిత స్త్రీవాద రాజకీయాలు ఊపందుకొన్న1980 ల నాటి  చారిత్రక సందర్భంలో  కానీ సాధ్యం కాలేదు. అలా వచ్చిన వాటిలో బేబీ కాంబ్లే ఆత్మ కథ ఒకటి.

తెలుగు సమాజంలోనూ స్వీయ చరిత్రలు రాసుకున్న స్త్రీలు ఉన్నారు.1930 లలో సత్యవతి అనే మధ్యతరగతి గృహిణి రాసుకున్న ఆత్మకథ ఒకటి వుంది .  కమ్యూనిస్టు రాజకీయాలలో ఎదిగిన గోపరాజు (?) సీతాదేవి(కమ్యూనిస్ట్ పరకాల పట్టాభి రామారావు గారి సోదరి) ఆత్మకథ, జాతీయోద్యమ రాజకీయాలలో క్రియాశీల భాగస్వామి అయిన పొణకా కనకమ్మ ఆత్మకథ (‘కనకపుష్యరాగం’), శ్రీ రంగమ్మ(సాయుధ విప్లవ నాయకుడు దేవులపల్లి వెంకటేశ్వర రావు భార్య ), కొండపల్లి కోటేశ్వరమ్మ ఆత్మకథ (నిర్జన వారధి ) ఇలాంటివి.ఆ స్వీయ చరిత్రల ప్రాధాన్యతను, పరిమితులను,రచయితల  చైతన్య స్థాయిని అంచనా వేస్తూ లైంగిక రాజకీయాల కోణం నుండి ప్రధానంగా వీటిని అప్పుడు అధ్యయనం చేయటం జరిగింది. అయితే ఇప్పుడు తెలుగు మహిళ కాకపోయినా బేబీ కాంబ్లే స్వీయ చరిత్ర చదివాక స్త్రీల స్వీయ చరిత్రల అధ్యయననానికి  లైంగిక రాజకీయ కోణం ఒక్కటే సరిపోదని,  కుల రాజకీయాల కోణం ఆ అధ్యయనానికి మరింత విస్తృతిని, లోతును ఇస్తుందని అర్ధమైంది. దళిత స్త్రీవాద మూలలను  తెలుసుకొనటానికి ఈ పుస్తకం ఎంతైనా ఉపకరిస్తుంది.

బేబీ కాంబ్లే ఆత్మకథ తో పాటు ,మరాఠీ భాషలోమరొక ఏడుగురు  దళిత స్త్రీలు రాసిన ఆత్మకథలు తెలియవస్తున్నాయి. అవి :-  1. శాంతాబాయి ధనాజీ డానీ (1919-2001) ఆత్మకథ  ‘రాత్రన్ దిన్ అమః (మాకు ఈ రాత్రిళ్ళు,పగళ్లు) (1990),

  1. ముక్తా సర్వగోడ్ (1922-2004) ఆత్మకథ ‘మిట్ లెలి కావాడే’ (మూసుకున్న తలుపులు 1983) 3. శాంతాబాయ్ కృష్ణాజీ కాంబ్లే(1923) ఆత్మకథ ‘మజ్యా జలమచి చిత్తార్ కథ’ ( నాజీవిత సంక్లిష్ట వర్ణ చిత్రం 1988) 4. కుముద్ పవాడే(1938) ఆత్మకథ ‘అంతస్ఫోట్’ (ఆలోచనల వెల్లువ ,1981) 5. ఊర్మిళా పవార్ (1945) ఆత్మకథ ‘ఐదాన్’(వెదురు అల్లిక ,2003),6. జానాబాయ్ కచ్ రు గిర్ హే(1958) ఆత్మకథ ‘మరణ కాల’(చచ్చే బాధ 1992) 7. విమల్ దాదాసాహెబ్ మోరే (1970) ఆత్మకథ ‘తీన్ డాగ్ దాచి చుల్’ (మూడురాళ్ల మధ్య రగులుతున్న మంట 2000) –ఇవి అన్నీ జ్యోతిబా పూలే ,సావిత్రి బాయ్ పూలే ల సంస్కరణోద్యమం నుండి అంబేద్కర్ నడిపిన దళిత ఉద్యమం మీదుగా ఆధునిక దళిత స్త్రీవాద ఉద్యమాన్ని కలుపుకొచ్చిన చరిత్రతో ముడిపడ్డవే. బేబీ కాంబ్లే ఆత్మకథ అంబేద్కర్ రాజకీయాల సంబంధంలో దళిత మహిళల జీవితంలో వచ్చిన పెనుమార్పును ప్రతిఫలిస్తుంది.వ్యాఖ్యానిస్తుంది.

 

3

1929 లో  బేబీ కాంబ్లే పుట్టటానికి వంద సంవత్సరాలకు ముందే (1827) మహారాష్ట్రలో సంస్కరణోద్యమ మూల పురుషుడైన  జ్యోతిబా ఫూలే  జన్మించాడు.  మహారాష్ట్ర లో  సంస్కరణోద్యమం నిచ్చెనమెట్ల కుల వ్యవస్థలో అణగారినకులాల కోణం నుండి నిర్మించబడటానికి బలమైన చోదక శక్తి అయినాడు.కుల అంతరాలు అసమానతలు  శూద్ర ,దళిత  వర్గాల జీవితాన్ని,మహిళల జీవితాన్ని దుర్భరం చేస్తున్నాయని గుర్తించి వాళ్ళ సంక్షేమం కోసం నిలబడ్డాడు. ఆయన తరువాత నాలుగేళ్లకు పుట్టి ,అతని జీవిత సహచరి అయింది సావిత్రీబాయి. జ్ఞానానికి ,శక్తికి మధ్యవున్న సంబంధం తెలిసి శూద్రులకు, స్త్రీలకూ  ఆ జ్ఞానాన్ని పొందే ప్రజాస్వామిక వెసులుబాటు కల్పించాలని గుర్తించి సావిత్రీ బాయి కి స్వయంగా చదువు చెప్పాడు జ్యోతిబా పూలే. 1948 లో భార్య తోడుగా ఆడపిల్లల బడిని పెట్టాడు.ఇద్దరూ కలిసి నిర్బంధ వైధవ్య సమస్యను సంబోధించి పని చేశారు. స్త్రీపునర్వివాహాన్ని, కులాంతర వివాహాలను సమర్ధించారు.అంటరాని తనాన్ని వ్యతిరేకించారు. మొత్తం మీద  బ్రాహ్మణీయ బానిసత్వం నుండి శూద్రులను, అతిశూద్రులను ,విముక్తంచేసే దిశగా సంస్కరణోద్యమాన్ని పదునెక్కించిన జంట జ్యోతిబాపూలే ,సావిత్రిబాయి పూలే.

ఆ క్రమం లో జ్యోతిబాఫులే   సత్య శోధక సమాజం(1873) ఏర్పరచాడు.కుల వ్యత్యాసాల సమాజ మూలాల శోధన ,అవమానాలు, కుల మత,స్త్రీ పురుష  అసమానతలు లేని జీవితం కోసం తపన -సత్య శోధక సమాజ రాజకీయాలను  రూపొందించాయి.వధువు కు సమాన హోదా కల్పించే విధంగా వివాహ విధులను సామాజికీ కరించటం  వంటి సంస్కరణలు జరిగాయి. సత్యశోధక సమాజ రాజకీయాల  ప్రచారానికి ‘జల్సా’ అనే ఒక కళా  రూపాన్ని తమాషా అనే జానపద గేయ రూపం నుండి రూపొందించుకొనటం కూడా జరిగింది.స్త్రీల సమస్యలను ప్రస్తావిస్తూ స్త్రీలను  సంబోధిస్తూ ,చదువుకొనమని ప్రబోధించటం ,వితంతు స్త్రీల పునర్వివాహా ఆకాంక్షలను వస్తువుగా చేసుకొనటం వీటిల్లో ప్రధానంగా కనిపిస్తుంది. స్త్రీలను శూద్రులుగా పరిగణించి వేదాలకు దూరం చేసిన బ్రాహ్మణీయ సంస్కృతి లో బ్రాహ్మణ స్త్రీలు కూడా అణచివేతకు ,అవమానాలకు  హింస కు గురి అవుతున్నారని గుర్తించి బ్రాహ్మణేతర సామాజిక వర్గాల అభ్యుదయం కోసమై చేపట్టిన సంస్కరణోద్యమ పరిధిలోకి బ్రాహ్మణ తదితర ఆధిపత్య కులాల స్త్రీలందరినీ కలుపుకొనటం జ్యోతిబా ఫూలే సమగ్ర ప్రజాస్వామిక దృష్టికి  గుర్తు.

1929 లో బేబీ కాంబ్లే పుట్టేనాటికి ఫూలే వారసత్వాన్ని మరింత రాజకీయ పదునుతో ముందుకు తీసుకువెళ్తున్న బాబాసాహెబ్ అంబేద్కర్ పుట్టి 38 ఏళ్ళు.(1891) ఆమె పుట్టటానికి 13 సంవత్సరాల ముందునుండే ఆయన కుల సమస్య గురించి మాట్లాడటం మొదలు పెట్టాడు. 1916 లో భిన్న వర్గాల మధ్య వివాహాలను నియంత్రించటానికి కులం ఏర్పడిందని చెప్తూ స్త్రీలను హీన పరిచే సంప్రదాయాలకు, కులానికి మధ్య వున్న సంబంధాన్ని గురించి చర్చించాడు.(Caste in India ;their mechanisam genecsis and development) నిచ్చెన మెట్ల కుల వ్యవస్థకు సంబంధించిన భావజాల పునాదులే హిందూ సమాజంలో స్త్రీలకు స్వేచ్ఛ,సమానత్వం, మానవ గౌరవం నిరాకరిస్తున్నాయి అని అభిప్రాయం పడ్డాడు.1919 నాటికే  అంటరాని తనం వల్ల కొందరు మనుషులు అవమానాలను ఎదుర్కొనవలసి రావటం అనుభవంలోకి వచ్చి ఆవేదన పడ్డాడు.దళితులకు ప్రత్యేక నియోజకవర్గాలు, రిజర్వేషన్స్ వంటి రాజకీయ పరిష్కారాలను గురించి ఆలోచించటం మొదలు పెట్టాడు. ‘బహిష్కృత హితకారిణి సమాజం’ ఏర్పరచి విద్య, సాంఘిక ఆర్ధిక అభివృద్ధి లక్ష్యంగా పని చేయటం మొదలు పెట్టాడు. ఉద్యమ ఆశయాల ప్రచారానికి ‘మూక నాయక్’(1920) బహిష్కృత్ భారత్(1927) వంటి పత్రికలను  స్థాపించాడు. అంబేద్కర్ ప్రయత్నాలు అన్నీ కలిసి దళితుల సర్వస్వతంత్ర సామాజిక జీవిత  స్థాయి లక్ష్యంగా ఉద్యమం 1927 లో గొప్ప మలుపు తీసుకున్నది.

1927  ప్రత్యేకత ఏమిటి? అంటరాని తనానికి వ్యతిరేకంగా అంబేద్కర్ పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాన్ని నిర్మించిన సంవత్సరం అది.ప్రజల ఉమ్మడి ఉపయోగంలో వున్న మంచినీళ్ల వనరుల పై దళితుల హక్కును  ,దేవాలయాయాలలోకి ప్రవేశించే హక్కును ఆచరణ వాస్తవం చేయటానికి రూపొందించిన ఉద్యమమది.ప్రభుత్వ నిర్వహణలో ఉన్న ప్రజోపయోగ సంస్థలలోకి అణగారిన వర్గాల ప్రజల ప్రవేశానికి 1923 లో బాంబే లెజిస్లేటివ్ కౌన్సిల్ చేసిన తీర్మానాన్ని  నాలుగేళ్లు గడిచినా ఆయా ప్రాంతాలలో అమలు కాకుండా అడ్డుకుంటున్న హిందూ ఆధిపత్య కులాల శక్తులను ఎదుర్కొనటానికి అంబేద్కర్  ‘మహద్’ వేదికగా వెయ్యికి పైగా దళిత జనాన్ని సమీకరించి మంచినీళ్ల చెరువుకు ఊరేగింపు గా వెళ్లి చెరువులో నీళ్లు తాగటానికి రూపొందించిన  కార్యక్రమాన్ని అమలు చేసిన సంవత్సరం 1927.

ఆ సంవత్సరంలోనే అంబేద్కర్  డిసెంబర్ 25 న మహద్ లోనే నిర్వహించిన  అణచివేయబడిన వర్గాల సదస్సులో మాట్లాడిన తరువాత  వర్ణవ్యవస్థను ,అంటరాని తనాన్ని వ్యవస్థీకరించిన మనుస్మృతి పట్ల క్రోధంతో దానిని తగులబెట్టాడు. 1928 లో అంబేద్కర్ సహచరి రమాబాయి అధ్యక్షతన దళిత ఉద్యమం లో భాగంగా మహిళా సంఘం ఏర్పడింది. ఈ విధంగా దళిత ప్రజా ఉద్యమం పటిష్టమవుతున్న  చారిత్రక దేశకాల పరిస్థితులలో  పుట్టింది బేబీ కాంబ్లే.

బేబీ కాంబ్లే పుట్టి పెరిగిన మొదటి పదేళ్లు దళిత ఉద్యచరిత్రలో ఉజ్వలఘట్టం. 1930 లో నాసిక్ లోని  కాలారామ్ గుడిలో దళితుల ప్రవేశానికి పెద్ద ఎత్తున సత్యాగ్రహం నిర్వహించ బడింది. అణచబడిన వర్గాలకు ప్రత్యేక నియోజక వర్గాలను కేటాయిస్తూ ప్రభుత్వం ప్రకటించిన  కమ్యూనల్ అవార్డు పట్ల గాంధీ అసంతృప్తి పరిణామం  తత్ఫలితమైన చర్చలు ,పూనా ఒడంబడిక  1932 నాటి ఘటనలు.  అంటరానివాళ్లుగా తమను సాధారణ జనజీవితానికి  పరాయీకరించిన  మతాన్నీ దేవుళ్లను మనం ఎందుకు వదిలెయ్య రాదని సవాల్ చేస్తూ మతం మార్చుకొనటం  గురించి  అంబేద్కర్ చేసిన  ఆలోచనలు ,బోధనలు ఈ దశాబ్దివే. స్త్రీలు సాధించిన అభివృద్ధే ఒక జాతి సాధించిన అభివృద్ధికి కొలమానం గా భావించే అంబేద్కర్ సహజంగానే అణగారిన వారిలో మరింత అణగారినవారైన దళిత మహిళలలో  సాంఘిక ఆర్ధిక హక్కుల పోరాట చైతన్యాన్నిరగుల్కొల్పే పని చేస్తూ వచ్చాడు. అది ఎంతో మంది మహిళలను దళిత ఉద్యమంలో చురుకుగా పాల్గొనేట్లు చేసింది. అట్లాంటి చురుకైన మహిళ బేబీ కాంబ్లే.

అటువంటి బేబీ కాంబ్లే  స్వీయ చరిత్రను చదివేటప్పుడు ఆమె తమ కుల సామాజిక స్థాయి గురించి ,మహిళగా  తమ సామాజిక హోదా  గురించి ఏమి చెప్పింది?  ఆధిపత్య వర్ణాల నిర్వచనాలను ఎలా ఎదుర్కొన్నది ? ఎలా పునర్నిర్వ చించింది?బ్రాహ్మణీయ ఆధిపత్యం పై నిరసన ఎట్లా వ్యక్తీకరించింది ? ఏ మేరకు రాజీ పడింది? తమ కులంలోనూ ,బయటా కూడా స్త్రీ సమస్యను ఆమె  అర్ధం  చేసుకొన్నతీరు ఏమిటి?ఎంచుకున్న  పరిష్కారాలు ఏమిటి? కుల నిర్మూలనకు ఎన్నుకొన్న పోరాట రూపాలేమిటి? తనకాలపు ఉద్యమాలను ఎలా చూసింది?ఉద్యమాలలో మహిళల భా గస్వామ్యాన్ని ఏ విధంగా సంభావించింది?మొదలైన ప్రశ్నలతో శోధించటం వర్తమానాన్ని అర్ధంచేసుకొనటానికి  అవసరం.

 

4

జ్ఞాపకాల నుండి అనుభవాల కథనం,చైతన్యంతో  వ్యాఖ్యానం పడుగు పేకలుగా  సాగే రచన ‘మా బతుకులు’. మహర్ కుల మానవుల సామాజిక జీవన సంస్కృతికి  ,సంవేదనలకు శక్తివంతమైన ప్రతినిధి రచన.

బేబీ కాంబ్లే తల్లి వైపు తాత ఇంగ్లీష్ దొరల వద్ద బట్లర్లుగా పనిచేస్తూ పూనా , బొంబాయి వంటి పట్టణాలలో జీవించినా అమ్మమ్మ మకాం మాత్రం వీరగాంవ్ లో మహర్ వాడలోనే. తండ్రి కాంట్రాక్టర్ కావటం వలన ఒక చోట స్థిర జీవితం లేదు. అందువల్ల బేబీ కాంబ్లే బాల్యం అమ్మమ్మ గారింట గడిచింది. ఆ రకంగా మెహర్ వాడ జీవితం ఆమె బాల్యానికి సంబంధించిన జ్ఞాపకం.చాలా విలువైన ఆ జ్ఞాపకాల ఖని నుండి బేబీ కాంబ్లే  మహర్ల ఆర్ధిక  జీవనాన్ని ,ఆహార సంస్కృతిని ,వస్తుసంస్కృతిని సమగ్రంగా బొమ్మ కట్టించింది.

హిందూ వర్ణ వ్యవస్థలో  అట్టడుగు పొరకు చెందిన వాళ్ళుగా మహర్లు గ్రామానికి వెలిగా ప్రత్యేక వాడ లలో జీవించవలసిన వాళ్ళు. అంటరాని వాళ్ళు.  కానీ  వాళ్ళ శ్రమ కు అంటరాని తనం లేదు.యేస్క ర్ గా గ్రామానికి సర్వసేవలు అందించవలసిన వాళ్ళు వాళ్ళే.మహర్లలో గ్రామ ఆదాయంలో 16వ వాటా పొందే వారి సాంఘిక స్థాయి కాస్త ఎక్కువది. ఆ వాటా సాధారణంగా జొన్నరొట్టెలు మొదలైన ఆహార పదార్ధాల రూపంలో ఉంటుంది. చచ్చిన జంతువుల కళేబరాల లో వాటా రూపంలో ఉంటుంది.చచ్చిన పశువు మాంసంలో సగం వాటా వాళ్లదే.  ఈ వాటా పొందే మహర్ కుటుంబం ఆరు నెలలు  యేస్కర్ గా విధులు నిర్వర్తిస్తుంది. మిగిలిన ఆరు నెలలు యేస్కర్ విధి నిర్వహణ తక్కిన కుటుంబాల మధ్య వంతుల వారీగా మారుతుంటుంది.

యేస్కర్  రోజంతా గ్రామ పెద్ద పాటిల్ కార్యాలయం ముందు ఒదిగి నిల్చుని చెప్పిన పనులన్నీ చేస్తూ సాయంత్రం ఇల్లిల్లూ తిరిగి తెచ్చుకొనే జొన్నరొట్టెలు (వాటినే భాక్రీలు అంటారు )  మిగిలిన ఇతర ఆహారపదార్ధాలు ఆ పనికి దక్కే ప్రతిఫలం. కావటానికి అది వెట్టి చాకిరీ వంటిదే అయినా కులంలో అది తమకు ఇచ్చే గౌరవ హోదాల దృష్ట్యా మహర్ కుటుంబాలు ఆ పదవికై తహతహ లాడుతుంటాయి. ఒక కొసన చిన్న గంట తో యేస్కర్ చేతిలో  ఉండే కర్ర ఒక హోదా చిహ్నం. యేస్కర్ విధులు మారినప్పుడల్లా ఆ కర్ర  చేతులు మారుతుంది. ఆ కర్ర ధరించిన మహర్ కు తానేదో విశేషమైన వ్యక్తినన్న భావంతో ఛాతి ఉప్పొంగుతుందని, మీసం తిప్పుకొని గొంతు సవరించుకొని మహా ఆనందంగా కర్ర తాటించుకొంటూ గ్రామానికి బయలుదేరిన మహర్ కి  ఊళ్లోకి అడుగు పెట్టీ పెట్టకుండానే  ఉప్పొంగిన ఛాతి కుంచించుకు పోతుందని చెప్పటం ద్వారా బేబీ కాంబ్లే ఒక వైపు వెట్టి చాకిరీ చేసి జోలె పట్టి భిక్ష అడుక్కునే స్థితిలో ఉంచబడిన వాళ్ళు దానిని ఒక హక్కుగా, అధికారంగా భావించే కుల అంతర్గత భావజాల నిర్మాణం లోని విషాదాన్ని,మరొక వైపు ఆ మనుషులే  తమను తాము అల్పులుగా కుంచించుకొనేట్లు చేసే ప్రధాన స్రవంతి నిర్మాణ భావజాల ప్రభావాన్నిఏకకాలంలో చెప్పింది. అంతే కాదు ,మహర్ లలో  యేస్కర్ కర్ర రాజదండం లాంటిదేనన్నభ్రమ  కల్పించటం లోని   అగ్రకులాల ప్రయోజనపరత్వ కుట్రను కూడా ఆమె గుర్తించి చెప్పింది.

గ్రామాలలో పెద్దల పశువుల కొష్టాలు శుభ్రం చేస్తూనో ,అడవికి పోయి కట్టెలు కొట్టుకొచ్చి అమ్ముతూనో ,గడ్డి మోపులు తెచ్చి అమ్ముతూనో స్త్రీలు కుటుంబ ఆర్ధిక వ్యస్థకు తోడ్పడుతుంటారు. కోసిన చచ్చిన పశువుల మాంసాన్ని ఇంటికి చేరవేయటం  ప్రధానంగా స్త్రీల పనే.

మానవుల ప్రాధమిక అవసరాలు తిండి ,బట్ట ,వసతి. అవి మెహర్ లకు ఏ మాత్రం అందుబాటులో ఉన్నాయో వాటిని బట్టే వాళ్ళ  బతుకుల స్థాయి. మెహర్ ల ప్రధాన ఆహరం జొన్నలు.సాధారణం గా  యేస్కర్ విధి నిర్వహణకు ప్రతిఫలంగా గ్రామస్థుల నుండి ప్రతి సాయంత్రం ప్రతిఫలంగా వచ్చేజొన్నరొట్టెలు వాళ్ళ రోజువారీ ఆహరం. ఎండపెట్టి నిల్వ చేసుకొనే ఆ రొట్టెలను   ఉల్లిపాయలను నంజుకుంటూ  తింటారు. అవి నములుతుంటే ఫ్యాక్టరీలో మిషన్ నడుస్తున్నంత చప్పుడు వినవస్తుంది అంటుంది బేబీ కాంబ్లే.జొన్న సంకటి చేసుకొని తినటం పెద్ద అదృష్టం కింద లెక్క.జొన్నలు విసురుకొని రొట్టెలు చేసుకొని తినటం ఎక్కువ. గోధుమరొట్టెలు అరుదుగా తింటారు.

ఆషాఢ మాసం మహార్లకు పండగ నెల. ఆ నెలలో ,మంగళవారాలు,శుక్రవారాలలో  శనగపప్పు తో భక్ష్యాలు చేసుకొంటారు. అయితే గోధుమపిండితో చపాతీలు చేసి  వాటిని ముక్కలు చేసి బెల్లం నీళ్లలో బాగా కలిపి తినటమే ఎక్కువ.ఈ నెలలో జరిగే జాతరలో జొన్నసంకటి వడ్డించ బడుతుంది. పెళ్లిళ్లలో భక్ష్యాలు ,జొన్నరొట్టెలతో పాటు శనగపిండి కూర చేస్తారు. ప్రసవించిన స్త్రీకి దంచి మెత్తగా ఉడికించిన జొన్నగటకలో కొంచం నూనె ,బెల్లం కలిపి ఆహారంగా ఇస్తారు.

మహార్లలో అతిపేదలు గ్రామంలో అడుక్కొచ్చుకొనే మిగులు పదార్ధాలు పాచిపోయిన వాటితో సహా అన్నిటిని కుండలో పోసి ఎండిన జొన్న రొట్టెలతో కలిపి మరగ పెట్టి తయారు చేసుకొనే  ‘అంబురా’ ను తింటారు. గ్రామస్థుల దయాధర్మ భిక్షగా లభించే చపాతీలు  బెల్లం తో కలిపి తినటమూ వుంది. అవీ లేకపోతే బ్రహ్మ జెముడు చెట్టు చుట్టూ దట్టంగా అల్లుకొనే  అడవితీగెల ఆకులు ఉడకబెట్టుకొని తింటారు.  బ్రహ్మజెముడు కాయలు ఏరుకొచ్చుకొని తొక్క తీసి లోపలి గుజ్జు తింటారు. చిక్కుళ్ళతో కలిపి మాంసం వండుకొని తినటం గురించి కూడా బేబీ కాంబ్లే చెప్పింది.

ఊరిలో చచ్చిన జంతువుల మాంసం అయినా ,ఆషాడ మాసం జాతరలో బలి ఇచ్చే దున్నపోతు మాంసం అయినా,శుక్ర శనివారాలలో దేవత గుడికి గ్రామం నుండి వచ్చే అన్నప్రసాదాలను అయినా మహర్లందరికీ వాటాల వారీగా పంచుతారు.  గ్రామంలో జరిగే పెళ్లిళ్లు మొదలైన సందర్భాలలో దొరికే మిగులు ఆహరమైనా వాటాలు వేసుకొని తీసుకొంటారు.

ఒకే సారి ఎక్కువ మొత్తంలో దొరికే   మాంసాన్ని  చిన్న చిన్న ముక్కలుగా కొట్టి ఎండబెట్టి వెదురు బట్టలలో కానీ, కుండలలో కానీ నిల్వ చేసుకొంటారు.నిల్వ చేసుకొనటానికి వీలుగా మాంసాన్ని సాగగొట్టి చుట్టలుగా చుట్టి ఎండకు ఆరపెట్టే పద్దతకుల గురించి చాలా సమాచారమే ఇచ్చింది బేబీకాంబ్లే . కొవ్వు, ఎముకలు కూడా నిల్వ చేసుకొంటారు. ఇదంతా స్త్రీల శ్రమ వల్లనే సాధ్యమవుతుంది.  అయిదారు నెలలవరకు ఉల్లిపాయలతో , జొన్నరొట్టె  తో కలిపి కానీ ,కొవ్వులో వేయించుకొని కానీ వాటిని తింటారు. ఇవేవి లేకుండా ఆకలి కడుపులతో గడిపే కాలమే ఎక్కువ.

జాతరలు వంటి ఉమ్మడి ఉత్సవాలలో వలెనె పెళ్లిళ్ల వంటి వ్యక్తి కుటుంబ ఉత్సవాలలో కూడా వంటలు మొదలైన పనులలో అందరూ భాగస్వాములయ్యే సంస్కృతి మహర్ లలో కనిపిస్తుంది.

ఇక బట్ట విషయానికి వస్తే- ఒంటి మీద నూలు పోగు లేని బాల్యం పిల్లల అనుభవం.రజస్వల అయినప్పటి నుండి ఆడపిల్ల వంటిమీదికి చింపిరి గుడ్డలు, కాస్తవయసు వచ్చిన మగ పిల్లలకు గోచీ గుడ్డా అమరుతాయి. స్త్రీలకు కట్టా విడువ ఒకటే అనేక గుడ్డముక్కల అతుకుల చీరె. ప్రసవించిన స్త్రీ రక్తస్రావాన్ని ఆపగల పాతగుడ్డ పీలికలు కూడా లేని దుర్భర పరిస్థితి చాలామందింది. యేస్కర్ విధులు నిర్వహించే కుటుంబం  శవాలపై కప్పి దహనానికి ముందు తీసే పారేసే తెల్లగుడ్డ  బట్టలు కుట్టించుకొనటానికి ఉపయోగించుకొంటుంది అంటే  ఆ దారిద్ర్య స్థాయిని వూహించుకోవలసినదే.

మూడో ప్రాధమిక అవసరం వసతి. ఎండావానల నుండి తలదాచుకుని ఉండటానికి, వండుకొనటానికి ఇల్లు.రాళ్లను ఎత్తుగా నిలబెట్టి మట్టి మెత్తిన గోడల గుడిసెలు వాళ్ళ ఇళ్లు. గుడిసెలో ఒకమూల మట్టిపొయ్యి ,పొయ్యి మీదికి పై నుండి వేలాడే పొడుగు తాడు ,పొయ్యికి పక్కన మట్టిపాత్రలు పెట్టుకొనే చిన్న గట్టు ,మట్టి కుండలు ,ఒక తెడ్డు, ఒక పెనం , రొట్టెల కర్ర ,పెనం మీద రొట్టెను తిరగెయ్యటానికి ఒక పొడుగు రేకు ముక్క, మరొక మూల నూరుకొనే రాయి, రాళ్లతో మట్టితో చేసిన దేవుడి గద్దె ,పాతగుడ్డల పక్క బట్టలు -ఇదీ వాళ్ళ ఇళ్లల్లో వస్తు సామగ్రి. శవాలను మోసుకొచ్చిన పాడే కర్రలు గుడిసె వాసాలకు ఉపయోగించుకొనే దారిద్ర్య స్థితి వాళ్ళది. మహర్ కోడళ్ల కష్టాలను గురించి చెప్తూ బేబీ కాంబ్లే  ‘ఏమైనా కడగటానికి బండెడు అంట్లు కానీ ఉతకటానికి బట్టల కుప్పలు కానీ వుండవు. ఎందుకంటే ఇంట్లో అసలు అన్ని గిన్నెలు, బట్టలు వుంటేగా!’ అంటూ వాళ్లకు దారిద్య్రం తప్పించిన చాకిరీ గురించి వ్యాఖ్యానిస్తుంది.

5

 

మహర్ లలోని మతాచారా విశ్వాసాలను , దారిద్ర్యానికి తోడు అంటరానితనం కారణంగా మహార్లు ఎదుర్కొనే వివక్షను బేబీ కాంబ్లే  ‘మా బతుకులు’ లో విస్తృతంగా చర్చింది. ప్రతి ఇంట్లో చిన్నదో పెద్దదో దేవుని గద్దె ఉంటుంది. గంధంతో,కుంకుమతో అలంకరించబడిన  రెండుమూడు కిలోల బరువు వుండే గుండ్రటి రాళ్లను  దేవుడిగా పూజిస్తారు.దేవుడి ముందు ఎర్రబట్ట పరచి వేప కొమ్మలు, పచ్చనిగాజులు ఉంచుతారు. ఆషాఢం వారికీ పండగ మాసం.లక్ష్మి ఆయీ, మారీ ఆయీ దేవతల పేరున ఆ నెల మంగళ శుక్రవారాలు పున్నమి అమావాస్యలు పండుగలు జరుగుతాయి. ఆషాడం ప్రవేశించటంతోనే ఇళ్ళు అలుక్కుని, ఉన్న కుండలను కడుక్కొని కుండల కంతలకు అడ్డం పెట్టిన బట్టపేలికలతో సహా అన్నిటిని  ఉతికి ఆరవేయటం ,కుండలను ఒకదానిపై ఒకటి అమర్చివరుసగా పెట్టుకొనటం చేస్తారు. మర్నాడు ఇంటిల్లిపాదీ స్నానాలు చేస్తారు.బాగా నమిలిన ఎండు కొబ్బరి ముద్దను తలకు బాగా పట్టించి రుద్ది , రాతితో ఒళ్ళు రుద్ది వేడినీళ్ళతో తల్లి పిల్లలందరికీ స్నానాలు చేయిస్తుంది. తాను చేస్తుంది.

పిల్లలను దేవుడికి అర్పించటం ,దానిని గర్వకారకమైన వారసత్వంగా భావించటం మహర్లలో ఉంది.  మొదట పుట్టిన మగపిల్లవాడిని ఖండోబా దేవుడికి అర్పిస్తారు. అలా అర్పించిన వాడిని వ్యాఘ్య అని వ్యవహరిస్తారు.లామన్ పఠాన్, పిచ్చి మల్హారి దేవుడు వాళ్ళ వంటికి పూనుతుంటారు.  అలాగే మగపిల్లలను పోతరాజుని చేసే సంప్రదాయం మరొకటి వుంది.దేవుని పేరు మీద గ్రామంలో ఇల్లిల్లు తిరిగి బిచ్చమెత్తుకొనే హక్కు వాళ్లకు సంక్రమిస్తుంది. అట్లాగే మొదటి ఆడపిల్లను ఖండేరాయ దేవుని కి భార్యగా సమర్పిస్తారు. అలా సమర్పించిన ఆడపిల్లను మురళి అంటారు. అంబాబాయి దేవతకు అర్పించే స్త్రీ జోగిని అవుతుంది.

ఆషాఢమాస పండుగల సందర్భంలో ,జాతరల సందర్భంలో స్త్రీలకు పూనకాలు వస్తాయి.మామూలప్పుడు ’మంచి కుటుంబాల నుంచి వచ్చిన ఆడాళ్ళేనా?గాడిదలా?’ అంటూ మగవాళ్ల  చేత తిట్లూ చీవాట్లు తినే ఆడవాళ్లు ఆ సమయంలో అధికార స్థానం చేరతారు. వాళ్ళ కోరికలు తీర్చటానికి ,వాళ్ళ దయను అర్ధించటానికి మగవాళ్ళు భర్తలు కావచ్చు ,కుల పెద్దలు కావచ్చు తలపాగాలు తీసి వాళ్ళ కాళ్ళ ముందు పెట్టి వందనాలు చేయవలసిందే.దేవత పూనిన ఆవేశం లో ఆగ్రహ ప్రకటనో అనుగ్రహ భాషణో చేస్తూ వూగిపోయే స్త్రీలను పసుపు కుంకుమలు రాసి శాంతిప చేయటం అందులో అంతిమ ఘట్టం.

మహర్లు   ఆషాఢ అమావాస్య నాటి జాతర ,మాఘ పౌర్ణమికి   మాస్కోబా దేవుడి జాతర  జరుపుకుంటారు. నాగ పంచమి నాడు మట్టితో పామును చేసి పూజలు చేసి ఏటిలో నిమజ్జనం చేస్తారు. హడల్ వంటి దయ్యాల భయం కూడా మహార్లలో ఉంది.

మహార్ల జీవితంలో మరో ఇద్దరు దేవుళ్ళు  బ్రహ్మ ,సత్వాయి. పురిటి శిశువుకు ఐదోరోజు అర్ధ రాత్రి వాళ్ళు వచ్చి నుదుటిరాత రాస్తారని ఒక విశ్వాసం ఉంది. బ్రహ్మ దగ్గర ఒక కలం ఉంటుందని సత్వాయి కి ఆ కలం ఇచ్చి నుదుటి రాత రాయిస్తాడని బ్రహ్మ వాక్కును ,సత్వాయి రాతను ఎవ్వరూ తుడిపెయ్య లేరని మహార్లు నమ్ముతారు.

ఈ విషయాన్నీ చెబుతూ బేబీ కాంబ్లే మహర్ వాడలోని పిల్లలందరి ఖర్మ(ఆకలితో, దరిద్రంతో ,అంటరాని వాళ్ళుగా పడే అవమానాలతో) ఒకే రకంగా ఉంటుంది కదా వీళ్ళు వచ్చి రాసేదేమిటి అన్న సందేహాన్ని వ్యక్తపరుస్తుంది. బ్రహ్మ,సత్వాయి మహర్ వాడకు రావటమైనా ఎగ్గొడుతూ ఉండవచ్చు లేదా అందరికి ఒక స్టాంప్ తయారుచేసి పెట్టుకొని వచ్చి గుద్ది పోతుండవచ్చు అని అనుమానిస్తుంది. తరతరాలుగా మహార్ల రాతను ఇలా రాయటానికి మతం వాళ్లకు బాగా లంచం ఇచ్చి ఉంటుందన్నది  ఆమె ఆరోపణ.

ఆషాఢ మాస వేడుకలను ,పోతరాజులను చేసే పద్దతులను ,స్త్రీలకు వచ్చే పూనకాలను,ఉపశమన కార్యకలాపాలను ,జాతర కార్యక్రామాలను ,ఆచార వ్యవహారాలను ‘మా బతుకులు’ లో  అనేక వివరాలతో సమగ్రంగా వర్ణించింది బేబీ కాంబ్లే.తమ  బతుకులలో విడదీయరాని భాగంగా వున్న సమస్తాంశాల గురించి తాను చెప్పక పోతే మరెవరికీ తెలియవు,కనుక చెప్పి తీరాలి అని అనుకొనటం  అందుకు కారణం కావచ్చు. అదే సమయంలో  హిందూ మత రీతి రివాజులే అనుసరించిన  మహర్ లను పల్లె శివార్లలోని పెంటకుప్పల మీదకు విసిరేసిన హిందూత్వం పై విమర్శ పెట్టటం  బేబీ కాంబ్లే  అదనంగా సాధించిన ప్రయోజనం.

మతాచార విశ్వాసాల గురించి మాట్లాడేటప్పుడు వివక్షముల్లై గుచ్చుకొనటం, వివక్ష గురించి మాట్లాడినప్పుడల్లా మతవిధానాలపై ఆగ్రహం ఈ రచనలో అంతటా పరచుకొని కనిపిస్తాయి. ‘ మాకు అందుబాటులోకి ఎంత మేరకు హిందూ సంస్కృతి వచ్చినా దానిని కాపాడటానికి విశ్వ ప్రయత్నం చేసాం. అయినా ఎవరూ మమ్మల్ని అర్ధం చేసుకోటానికి ప్రయత్నించలేదు’ అంటుంది కాంబ్లే. హిందూ మతాన్ని విశ్వసించి, హిందూ ధర్మం ఆదేశించిన సూత్రాలన్నీ పాటించిన మమ్మల్ని ఎందుకు వెలివేశారు అన్నది ఆమె హిందూ మతం మీద సంధించిన ప్రశ్న.

వీధులలో ,ఇళ్లలో ,దుకాణాల దగ్గర ఎక్కడపడితే అక్కడ అంటరానివారుగా మహర్లు ఎదుర్కొనే అమానుషమూ అవమానకరమూ అయిన వివక్షను ఈ పుస్తకంలో  నమోదు చేసింది బేబీ కాంబ్లే. కుంకుడు కాయలు ,కొబ్బరి … ఇలా ఏ వస్తువు కొనుక్కొనటానికి అయినా దుకాణానికి వెళ్లే మహర్ స్త్రీ చీరె చెంగుతో మొహం కప్పుకొని దూరంగా నిలబడి దౌర్భాగ్య మహర్ స్త్రీగా తనను తాను పరిచయం చేసుకొంటూ కావలసిన వస్తువులగురించి అభ్యర్ధించాలి.  ఆ మహర్ స్త్రీని ముట్టుకోవద్దని దూరంగా జరగమని ఇంటి బయటకు వస్తున్న తన పిల్లలను దుకాణం యజమాని హెచ్చరిస్తుంటే మహర్ స్త్రీ ఒంటి మీది బట్టలను దగ్గరకు లాక్కుంటూ తాను మరింత ముడుచుకు పోతూ దగ్గరకు రాకండి మైల పడతారు అని ఆపిల్లలకు జాగ్రత్తలు చెప్పాలి. దుకాణం బయటకు వచ్చి యజమాని ఆమె అడిగిన సామాను చాపిన కొంగులో పై నుండి ఎత్తివేస్తే ఆమె డబ్బులు గడప మీద పెట్టి వెళ్ళాలి.

కట్టెలు ,గడ్డి లాంటివి అమ్ముకొనటానికో ,ఇతర సేవలకో గ్రామంలోకి వెళ్లే  మహర్ స్త్రీలు రోడ్డుకు ఒక చివర అత్యంత వినయంగా,ఎవరినీ నొప్పించకుండా నడుస్తారు. వాళ్ళు తమని తాము అందరినుంచి దాచుకుంటూ వీలైనంతగా ఉనికే లేనట్టు కనబడటానికి ప్రయత్నిస్తారు. అని చెప్పి స్వయం నియంత్రణ వాళ్ల వంటికి, మెదడుకు పట్టిచ్చిన భావజాల దుర్మార్గం వైపు వేలెత్తి చూపుతుంది కాంబ్లే.    అగ్రవర్ణాల వాళ్ళు ఎదురైతే కాలి  బాటలు వదిలి పక్కన తుప్పల్లోకి తప్పుకోవటం , మగవాళ్ళు ఎదురుపడితే   కొంగుతో మొహం కప్పుకొని మహర్ దాన్ని ,నీ కాల్మొక్కుతా సామీ అనటం అవన్నీ ఆ భావజాలం మప్పిన సామాజిక ప్రవర్తనా పాఠ ఫలితమే . కొత్త కోడళ్ళు ఎవరైనా తెలియక ఈ ఆచారాన్ని పాటించక పోతే అగ్రవర్ణ పురుషులు ఆగ్రహోదగ్రులు అవుతారు. ఆ పిల్ల మామగారు ,కుల పెద్దలు కాళ్ళ మీద పడి తప్పు కాయమని ప్రార్ధించే పర్యంతం విచారణ సాగుతుంది. అంతిమంగా అది మహర్లు  ఇంట్లో కోడలికి బుద్ధి చెప్పేకార్యక్రంతో ముగుస్తుంది.

మనుషులందరూ పుట్టుకతో సమానులే .. కానీ సామాజిక ప్రవర్తనా రీతుల శిక్షణ  కొందరిని  అంటరానివాళ్లమన్న న్యూనత లోకి నెడితే ,మరి కొందరిని  అధికులము పవిత్రులము,అధికారులము అనే అహం లో నిలబెడుతున్నది. ఈ అవగాహన బేబీ కాంబ్లే రచనలో సర్వత్రా వ్యాపించి ఉంది.కట్టెలు అమ్ముకొనటానికి వచ్చిన మహర్ స్త్రీలు పెద్దింటివారి బేరసారాలలో వాళ్ళు నిర్ణయించిన ధరకే కట్టెల మోపు అమ్మాల్సి రావటమే కాదు ,కట్టెలను వెనకవైపు ఆవరణలోకి తీసుకుపోయి కట్టిన తాడును విప్పి కట్టె కట్టె  ను వేరుచేసి ఒక దారపు పోగు కూడా లేదని చూపించి పెట్టి రావాలి. ఒక్క నూలుపోగు ఏ కట్టె కయినా అంటుకొని ఉన్నా ఇల్లు మైల పడుతుందని , ఇల్లంతా ఆవు పేడతో అలుక్కుని గుడ్డలన్నీ ఉతుక్కోవాల్సి వస్తుందని యజమానురాలు లబలబ లాడుతుంది. అలాగే ఆ కట్టెలమ్మే స్త్రీల వెంబడి వచ్చిన పిల్లలు దొడ్లో ఏది ముట్టుకొని మైల చేస్తారోనని వాళ్ళ మీద వాళ్ళను తీసుకొని వచ్చినందుకు ఆ స్త్రీల మీద అరుస్తూనే ఉంటుంది… ఇక్కడ కాంబ్లే హిందూ ధర్మపు అమానుషత్వాన్ని ఏవగించుకొంటుంది. నూలు పోగుల తొలగింపు గురించి అంత పట్టింపు ఉన్నదే … మహర్ స్త్రీల శ్రమ లేనిదే ఆ కట్టెలు లేవు కదా!మరి వాటికి  అంటి వున్నమహర్ స్త్రీల చెమట మాట  రక్తం మాట ఏమిటి అంటుంది. వాటికి లేని మైల వారు అంటిన నూలుపొగుకు మాత్రమే ఎందుకు ఉన్నదన్నది ఆమె ప్రశ్న.

అలాగే మహర్ ల పెళ్లి చేయటానికి వచ్చే బ్రాహ్మణ పురోహితుడు అంటు పడకుండా దూరంగా కూర్చొని కార్యక్రమం నడిపిస్తాడని చెప్పి బేబీ కాంబ్లే మహర్ల నుండి దక్షిణ తీసుకొనటానికి గానీ పప్పు,బియ్యం ,గోధుమలు ,బెల్లం వంటి ఎండు సరుకులు సంభావనగా తీసుకొనటానికి గానీ అంటు  అడ్డు రాక పోవటాన్నిగురించి వెక్కిరిస్తుంది. అంటరానితనం హిందూ వర్ణ వ్యవస్థ   ఆర్ధిక అధికార ప్రయోజనాల కూట సృష్టి తప్ప మరేమీ కాదన్నకాంబ్లే అవగాహనకు అద్దం పడుతుంది ఆ వెక్కిరింత.

గ్రామంలో ఎవరైనా సరే భోజనం చేస్తున్నప్పుడు మహర్ ల మాటలు వినబడ కూడదు.వినబడితే వారు అపవిత్రులవుతారు. అప్పుడిక  తినటానికి వీలు లేదు.  తింటున్నతిండి వదిలేసి లేవవలసిందే.  యేస్కర్ విధులు నిర్వహించే మహర్ చేతిలో ఎప్పుడూ వుండే కర్ర చివర కట్టే చిన్న గంట ఆ ప్రమాదాన్ని పరిహరించటానికే. సాయంత్రం తన పనికి ప్రతిఫలం తెచ్చుకొనటానికి  ఇల్లిల్లూ తిరుగుతున్నప్పుడు యే స్కర్ యింటివారిని నోరెత్తి పిలవకూడదు. మూడుసార్లు ఆ కర్రను నేలకు తాటించాలి. ఆ గంట చేసే చప్పుడు వినబడ్డా  దోషం లేదు. భోజనాలు కొనసాగించవచ్చు.

ఇది చదువుతున్నప్పుడు   నా చిన్నతనంలో బ్రాహ్మణ కుటుంబాలలో ఆడపిల్లలను ముట్టు  మూడునాళ్లు ఎవరినీ అంటుకోకుండా దూరంగా ఉంచి, నాలుగవ రోజు ఉదయం స్నానం సమయంలో పై నీళ్లు పోసి దోసిట్లో నీళ్లతో  సూర్యుడికి అర్ఘ్యం ఇప్పిస్తూ ఆ పిల్లలచేత  వల్లె వేయించే  మాటలు   గుర్తుకు వచ్చాయి. “ముట్టు కలిపినా పాపం /అంటూ కలిపినా పాపం /అశ్వత్థ నారాయణ చెట్టు తొక్కినా పాపం /బ్రాహ్మడు భోంచేస్తుంటే  మాట్లాడినా పాపం /బ్రహ్మ చారి భోంచేస్తుంటే మాట్లాడినా పాపం /ఈ పాపాలన్నీపరిహరించు ,సూర్యనారాయణమూర్తీ ,తండ్రీ”. స్త్రీలు నెలకు ఆ మూడురోజులు అస్పృశ్యులు . పాపులు. మహర్లవలెనే బ్రాహ్మలు భోజనం చేసే సమయంలో మాట నిషేధింప బడిన వాళ్ళు.

యేస్కర్ పాటిల్ కార్యాలయం ముందు విధులు నిర్వర్తించేటప్పుడు చావడికి దూరంగా ఒకమూలన వినయపూర్వకంగా వంగి నిలబడాలి. దారి వెంట  పోయే వాళ్లకు చిన్న పెద్ద తేడా లేకుండా మోకాళ్ళ వరకూ వంగి చేతులు జోడించి మూడుసార్లు నమస్కరించాలి. తరువాత చేతులు నుదిటికి తాకించుకొని నమస్కరించాలి. ఈ వివరాలన్నీ ఇయ్యటం ద్వారా  మహర్లను బానిసలుగా చేసిన హిందూ మత  కుల ఆధిపత్య  రాజకీయాల గురించి ఆలోచించటానికి ప్రేరణ ఇస్తుంది బేబీ కాంబ్లే.

 

6

 

బేబీ కాంబ్లే ‘మా బతుకులు’ లో మా  అన్న మొదటి అక్షరం మహర్ కులాన్ని ఎంత సంకేతిస్తుందో అంతగా మహర్ కుల స్త్రీలనూ సంకేతిస్తుంది.నిజానికి మహర్ మహిళగా బేబీ కాంబ్లే ఈ స్వీయ చరిత్రలో మహర్ మహిళల గురించే ఎక్కువ చెప్పింది.మహర్ మహిళ కుటుంబంలో ఎదుర్కొనే హింసను ఒక వైపు చిత్రిస్తూనే మరొక వైపు అగ్రవర్ణ మహిళల తో  పోల్చి వాళ్లెదుర్కొంటున్న వివక్షను ఎత్తి చూపటంలో ఆమె విజయం సాధించిందని చెప్పాలి.

దౌర్భాగ్యులలోకెల్ల దౌర్భాగ్యులు గా కుటుంబంలో మహర్ మహిళల దుస్థితిని చూపించటానికి కాంబ్లే రెండు సందర్భాలను వాడుకున్నది. ఒకటి పెళ్లి ,రెండు ప్రసవం.

మహర్ లలోని పెళ్లి తంతును వివరంగా పరిచయం చేయటం ఇన్నాళ్లు ఎవరికీ పట్టని, ఏ కావ్యాలకు ఎక్కని తమ సంస్కృతిని ఒకచోట నమోదు చేయటానికే అనుకున్నా అదే సమయంలో ఆమె పెళ్లి స్త్రీలకు ఎంత పీడాకరమో స్పష్టంగానే చెప్పింది.పెళ్ళిలో స్త్రీ పురుషులు సమానులు కాదు అన్న వాస్తవాన్ని పెళ్ళికి ముందురోజు జరిగే పసుపు వేసే కార్యక్రమాన్ని వివరించే సందర్భంలోనే  సూచిస్తుంది. పెళ్లి కూతురిని ,పెళ్ళికొడుకుని ఒక వేదిక మీద కూర్చోపెట్టి మంగళస్నానాలు చేయించే కార్యక్రమం అది. అందులో పెళ్లికూతురు పెళ్ళికొడుకు తలకు రెండు చేతులతో నూనె రాసి తలమీద అయిదు చెంబుల నీళ్లు పోయాలి. అబ్బాయి కూడా అమ్మాయి తలమీద నీళ్లు పోస్తాడు. అయితే అమ్మాయి అబ్బాయికి నిల్చుని నీళ్లు పోయాలి. అబ్బాయి మాత్రం నిలబడ నక్కరలేదు. కూర్చునే పోస్తాడు.అన్ని కులాలలోనూ దండలు మార్చుకొనటం  మొదలైన సందర్భాలలో పెళ్లి కూతురిని  నిలబడి వేయమనటం ,పెళ్ళికొడుకుని కూర్చొనే వేయమనటం నిన్నమొన్నటివరకూ ఉంది. పెళ్లి ఇద్దరు సమాన వ్యక్తుల మధ్య జరగటం లేదన్నది వాస్తవం. మహర్ లలోనూ అదే లోక రీతి.

ఏదేమైనా అమ్మాయికి మాత్రం పెళ్లి అనేది ఒక ఉపద్రవం తప్ప మరొకటి కాదు అంటుంది బేబీ కాంబ్లే. తక్కిన ప్రపంచం మహర్లను బానిస సంకెళ్లలో బందీలుగా చేస్తే ఆ బానిసలు తయారు చేసుకొన్న బానిసలు ఇంటి కోడళ్ళు అని ఒక్క ముక్కలో చెప్పింది. ఆధిపత్యం వహించాలని శక్తి ప్రదర్శించాలని మహర్లకు వుండే  కోరికను వాస్తవీకరించుకొనే అవకాశం  బయట లేకపోవటం వల్ల లోపల నుండే కోడళ్లను బానిసలుగా చేసి అధికారం చెలాయించే వ్యవస్థ రూపొందించుకొనటం జరిగింది అని ఒక కార్యకారణ సంబంధాన్ని కూడా వూహించింది కాంబ్లే.

ఏడెనిమిదేళ్లకే జరిగే పెళ్లిళ్ల గురించి ,కొద్దిరోజులకే అత్తగారింటికి వెళ్లి అత్త శిక్షణలో ,పెద్ద శిక్షగా సాగే కాపురాల గురించి ఆమె చాలా సమాచారమే ఇచ్చింది.ఎనిమిది తొమ్మిదేళ్ల చిన్నపిల్లలు ఉదయాన్నే లేచి జొన్నలు విసరటం, యేటి నుండి నీరు తేవటం ,జొన్నరొట్టెలు చేయటం ,పని సరిగా చెయ్యటం లేదని అత్తచేత తిట్లు ,దెబ్బలు తినటం -మొదలైనవి చెప్తూ  ఆ కోడలికి కడగటానికి బండెడు అంట్లు గానీ ,ఉతకటానికి బట్టల కుప్పలు గానీ ఉండవు అని ఆమెకు తప్పిన పనుల గురించి  ప్రత్యేకంగా చెప్తుంది.ఎందుకంటే ఇంట్లో అసలు అన్ని గిన్నెలు బట్టలు ఉంటేగా అని దానికి వివరణ కూడా ఇస్తుంది. తద్వారా మహర్ స్త్రీల ఆర్ధిక దుస్థితిని, కుడువా కట్టా బాగా ఉన్న కుటుంబాల స్త్రీల కన్నాభిన్నమైన వాళ్ళ అస్థితను ఏక కాలంలో చెప్పగలిగింది.

పెద్దమనిషి అయ్యాక మహర్ స్త్రీ కష్టాలు మరింత ఎక్కువ అవుతాయి అంటుంది బేబీ కాంబ్లే. కొడుకును తన నుండి దూరం చేసే శత్రువుగా కోడలిని భావించి అత్త  చేసే యుద్ధం ఎన్ని నీచ వ్యూహాలతో ఉంటుందో చూపిస్తుంది. మొత్తం కుటుంబాన్ని పొట్టన పెట్టుకొనే దుష్ట శక్తిగా కోడలి గురించి కొడుకుకు నూరిపోస్తుంది. ఆ పిల్లను కన్న తల్లి దండ్రులను తిట్టి పోస్తుంటుంది. అత్త తోపాటు మామ కూడా కోడలిని కొడతాడు.భర్త సరేసరి. గొడ్డును బాదినట్లు కర్రలు విరిగేట్లు కొడతాడు.  ఉన్న తిండిలో చివరి వాటా కోడలిది. ఆ వాటాకు తరచు దక్కేది అడుగూ బొడుగూ అతితక్కువ ఆహారం. కోడళ్ల ప్రవర్తనలో తప్పులను ఎంచటం లో భాగంగా వాళ్ళ పుట్టింటి మంచి మీద అపనమ్మకం ప్రదర్శించటం సర్వ సాధారణం.తాము మంచి కుటుంబాల నుండే వచ్చామని నిరూపించుకొనటం ఇక కోడళ్ల  బాధ్యతే. ఈ అంతులేని హింసను భరించలేక పారిపోవటానికి ప్రయత్నించే కోడళ్లను పట్టి తెచ్చికాళ్లకు  బరువైన చెక్క బందాలు తగిలించి ఇనుపగొలుసులతో బంధించటం ,ముక్కు కొయ్యటం వంటి శిక్షలతో కక్ష  తీర్చుకొనటం 1940 ల వరకు ఉండేదని అంటుంది బేబీ కాంబ్లే .

మహర్ కులంలో  సైతం స్త్రీలకు భర్తే సర్వస్వo.ఆ సంస్కృతే  స్త్రీల కు కుంకుమ బొట్టును ప్రధాన ఆభరణం  చేసింది.మహర్ స్త్రీలకైతే అది ఏకైక ఆభరణం. ఆ విషయం చెప్తూనే కాంబ్లే  “ఈ కుంకుమ యజమానులు మాకు సాధారణం గా ప్రసాదించేది బాధలూ, కష్టాలనేది వేరేవిషయం” అని భర్తల అధికారాన్ని,ఆధిపత్యాన్ని  వ్యంగ్య మానం చేస్తుంది. చీర కట్టులో  నెత్తిమీద నుండి కొంగు వేసుకొని ముఖం మీదికి లాక్కొనటం మహర్ స్త్రీలకు సంప్రదాయం నేర్పింది. గృహిణులుగా వారి గౌరవానికి చిహ్నం అది. మొహం మీద కొంగు తప్పిందంటే  గౌరవం కోల్పోయిందన్నమాటే. కోడళ్లను సాధించటానికి అత్తలకు ఇదొక మిష. నెత్తి మీద మేకు దిగ్గొడితే తప్ప మొహం మీద కొంగు నిలవదని అత్తలు కోడళ్ల మీద కసిని వెళ్ళ గక్కుతుంటారు.

ఇక ప్రసవ కాల ఆచారవ్యవహారాల ను విస్తృతంగా కథనం చేసే క్రమంలో బేబీ కాంబ్లే మహర్ స్త్రీ సమస్యను చర్చింది. మొదటి ప్రసవానికి తల్లిగారింటికి వెళ్ళటం గురించి చెప్తూ పుట్టింటికి మెట్టింటికి తేడా ఉంటుందనికాదు .. ఎక్కడైనా దుర్భర దారిద్ర్యమే .. కానీ అదొక రివాజు..  అంతే ,అని అభిప్రాయం పడుతుంది. బాల్య వివాహాలు కనుక మొదటి ప్రసవ సమయానికి శరీరం ఇంకా పూర్తిగా తయారై ఉండదు కనుక ప్రసవం కష్టం అవుతుంటుందని ,మూడు నాలుగు రోజులు కూడా నెప్పులు తీస్తూ యాతన పడవలసి వస్తుందని, మంత్ర సానుల  పర్యవేక్షణలో జరిగే ఆ పురుళ్ళు ఆడపిల్లలకు  మృత్యువుతో పోరాటం వంటివని అంటుంది కాంబ్లే. ప్రతి పదిమందిలో ఒకరు ప్రసవ సమయంలో మరణిస్తారని ,ప్రసవానంతరం తగిన వైద్యం కానీ ,ఆహరం కానీ,కనీసం రక్తస్రావాన్ని ఆపటానికి సరైన పాతగుడ్డలు వంటి వసతులు కానీ  లేని పరిస్థితులలో  జీవిత ప్రధమాంకంలోనే  అకాల మరణానికి గురి అయ్యేవారూ ఉంటారని  ‘మా బతుకులు’ చెప్తుంది. అట్లాగే శిశు మరణాలు కూడా ఎక్కువే. ఒక నూతన శిశూదయ వేళ ఉండవలసిన  ఉత్సాహం,ఉత్సవ వాతావరణం , మాతృత్వ గర్వం వంటివి ఏవీ అనుభవానికి రాని బతుకులు మహర్ మహిళలవి.

మొత్తం మీద మహర్లను మనువాద సంస్కృతి  ఎంతగా వివక్షకు ,అవమానాలకు గురిచేసిందో మహర్ మహిళలను పితృస్వామ్యం అంతగా వివక్షకు గురిచేసింది. మహిళలను గడప దాటనియ్యకపోవటమే గౌరవకరంగా భావించ బడుతుండేది. తన తల్లి ఆ రకమైన వివక్షకు గురైందని కాంబ్లే గుర్తించింది. తండ్రి అంటే తనకెంత ఇష్టం వున్నా ఈ వాస్తవాన్ని అంగీకరించటానికి ఆమె జంక లేదు. మహిళామండలి కి తండ్రి తల్లిని పంపక పోవటం గురించి చెప్తుంది. అదే తన విషయంలోఅన్న తో పాటు అంబేద్కర్ ఉద్యమంలో పనిచేయటానికి తండ్రి  అభ్యంతర పెట్టలేదు. అట్లాగే తన భర్త కు మహిళల పట్ల ఉన్న చిన్న చూపును ఆమె బాగానే గుర్తించ గలిగింది.భర్తగా అతను చాలావిషయాల్లో మంచివాడే కానీ  తాను తన జీవితానుభవాలు రాస్తున్న సంగతి తెలిస్తే సహించగలిగే వాడు  మాత్రం కాదని ఆమెకు తెలుసు. కనుకనే   వాటిని తాను దాచుకోవలసి వచ్చిందని ఆమె చెప్తుంది.

పితృస్వామ్యం అందరికీ సమానమైన విషయమే కనుక స్త్రీలందరూ ఒక్కటే అంటారు కానీ అది పాక్షిక సత్యం అన్న అవగాహన బేబీ కాంబ్లే రచనలో కనిపిస్తుంది. మహర్ మహిళల సంప్రదాయ చీర కట్టును గురించి చెబుతూ అందులోనూ  మహర్ స్త్రీలకు నిర్దేశింప బడిన చీర కట్టు పద్దతిలో ఉన్న వివక్షను పాఠకుల దృష్టికి తెస్తుంది. అంచులు కనబడకుండా  కుచ్చుపోసి వెనకవైపు  దోపుకొనే గోచి కట్టుచీరె పద్ధతి మహర్ మహిళలది. చీరె కింద అంచులు కనబడేలా కుచ్చిళ్ళు పెట్టుకొని చీర కట్టే పద్ధతి అగ్రవర్ణాలవారిది. మహర్ మహిళలు అలా అంచులు కనబడేటట్లు చీర కడితే అది అగ్ర కులాల పట్ల నేరం చెయ్యటమే అని చెప్పింది కాంబ్లే. ఈ ఉదంతం ఒక్కటి చాలు మహిళలందరూ ఒకటి కాదు ,కులం వాళ్ళ మధ్య మళ్ళీ ఎక్కువ తక్కువలు సృష్టించి అసమ సంబంధాలలో నిలబెడుతుంది అని చెప్పటానికి.కట్టెలు అమ్ముకొనటానికో ,గడ్డి అమ్ముకొనటానికో, వచ్చే మహర్ మహిళలను  అంటరాని వాళ్ళు, మైల పరచేవాళ్ళు అంటూ పదేపదే  గుర్తుచేస్తూ అవమానిస్తూ  తమ ఆధిక్య తను ,పవిత్రతను అడుగడుగునా ప్రదర్శించే అగ్రవర్ణ మహిళలను మహిళలు గా అంతా ఒక్కటే అని కలుపుకొని మాట్లాడటం బాధిత స్త్రీలకు కష్టంగానే ఉంటుంది మరి.

అంబేద్కర్ ఉద్యమ ప్రభావంలోకి వచ్చిన తరువాత అనుభవ క్రమంలో బేబీ కాంబ్లే లో అభివృద్ధి చెందిన అవగాహన ఇది.అంబేద్కర్ బోధనల ప్రభావంతో తండ్రి బేబీ కాంబ్లే ని చదువుకు పాఠశాలకు పంపాడు. అగ్రకులస్థులే ఎక్కువమంది ఉన్న ఆ పాఠశాలలో అస్పృశ్యత ,అవమానాలు ఆమె ఎదుర్కోవలసి వచ్చింది. తరగతి గదిలో గుమ్మం దగ్గర ఒకమూలన కేటాయించిన కాస్త స్థలంలో కూర్చొనవలసి రావటం ,అగ్రకుల సహ విద్యార్థులు ముక్కులు మూసుకొని ఛీ ఛీ అంటూ దూరం,దూరం  తొలగి పోవటం ,తాకి ఎక్కడ అపవిత్రం చేస్తారేమోనని నిరంతరం ఆందోళన పడుతూ తామేదో వాళ్ళ శత్రువులన్నట్లు ప్రవర్తించటం ,స్కూల్ నుండి ఇంటికి పోయాక స్నానం చేయాలి అంటూ  తమ గాలి సోకినందుకు ఏవగించుకొనటం ,స్కూల్ పంపులో నీళ్లు తాగినందుకు తిట్టటం ,సాధించటం ,రాళ్లు విసరటం ,తాము తెచ్చిన ఆహారపదార్ధాలు ఏవీ వాళ్ళు తినకపోవడం వంటివి ఆమెకు ఎదురైన అనుభవాలు. ఈ వివక్షను ధిక్కరిస్తూ  మహర్ వాడల నుండి చదువుకు వచ్చిన పిల్లలు ఒక జట్టుగా చేసిన పనులు ఆసక్తి కరమైనవి. అగ్రకులాల విద్యార్థుల గుంపులోకి చొచ్చుకుపోయి తమను తాకుతారేమోనన్న భయంతో వాళ్ళుచెల్లాచెదురై  పరుగులు పెడుతుంటే వినోదించటం, జడలు  పట్టుకొని గుంజి కొట్టటం వంటివి  ఆత్మ గౌరవం దెబ్బతిన్న బాధనుండి వాళ్ళు చేసినట్లు అర్ధమవుతుంది. అట్లా కొట్టినందుకు టీచర్లు శిక్షించినా భరించటం మేల్కొన్న కుల చైతన్యం వల్లనే.

బేబీ కాంబ్లే మొదలైన మహర్ విద్యార్థుల ఆత్మ గౌరవ చైతన్యం ,ధిక్కార స్వభావం భరించలేనిది అయి అగ్రకుల విద్యార్థులు అంబేద్కర్ ను నిందించటం ద్వారా వాళ్ళ నైతిక ధృతిని దెబ్బ తీసే ప్రయత్నం చేసినప్పుడు దానిని వాళ్ళు తిప్పి కొట్టిన తీరు ఆశర్యం కలిగిస్తుంది. అంబేద్కర్ చదువుకున్నాడని ఈ మురికి మహర్లు ఫోజులు కొడుతున్నారు ,అతను చచ్చిన గొడ్డును తినే మహర్ అని హేళనగా మాట్లాడితే దానికి సమాధానంగా వీళ్ళు  గుండ్లు గీయించుకొనే వెధవముండలకి అంబేద్కర్ పేరు ఎత్తే అర్హత లేదని ప్రారంభించేవాళ్ళు. అగ్రవర్ణాల నుండి వితంతు బాలికలను స్వీయ పోషణ శక్తిని పొందటానికి పాఠశాలకు పంపే అలవాటు అప్పటికి బాగా బలపడింది. దానిని హేళన చేసి అక్కడ ఆగక మీ గాంధీది కూడా గుండే ,ఆ గుండు మా అంబేద్కరే గీశాడు ,మీ గాంధీకి నోట్లో పళ్ళు లేవు ,మా అంబేద్కరే రాల గొట్టాడు,మీ గాంధీకి చేతిలో కర్ర ,ముసిలాడు కనుక ఉంది ,మా అంబేద్కర్ మీ గాంధీలాగా ముసలోడు అనుకుంటున్నారా … అని ఎంత హేళన చేయాల్నో అంత చేసేవాళ్ళు.

ప్రశ్న అనేది లేకుండా కుల ఆధిపత్య శక్తులకు తలవొగ్గి జీవించిన స్థితి నుండి అమ్మమ్మ ,అమ్మలతరం దాటి వచ్చిన బేబీ కాంబ్లే తరం ధిక్కార ప్రకటన చెయ్యగలగటం బాబాసాహెబ్ అంబేద్కర్ నిర్మించి నడిపిన సామాజిక విప్లవ పరిణామమే అని చెప్పాలి.

 

7

 

‘మా బతుకులు’  కథానాయకుడు అంబేద్కర్.తమ బతుకుల గురించి చెప్పే ప్రతి సందర్భంలోనూ గౌరవంతోనో  ,అభిమానంతోనో ,కృతఙ్ఞతగానో  అంబేద్కర్ ను  ప్రస్తావిస్తూనే ఉంటుంది బేబీ కాంబ్లే. తనకు స్ఫూర్తి భీం అనే అగ్ని అంటుందామె.

మొదటి అధ్యాయం లో మహర్ ల ఇళ్ళు వాకిళ్లు ,స్థితిగతుల గురించి ,మత విశ్వాసాల గురించి చెప్పి చివర లో అర్ధంలేని పూజలతోనూ  ,దుర్భర దారిద్య్రం లోనూ మహర్ల జీవితం తరతరాలుగా వృధా అయిపోవటం గురించి దిగులును వ్యక్తం చేసి ,అయినా వాళ్ళ చిన్ని హృదయాలలో ఒక ఆశ అంకురించింది అని ,అది దృఢంగా పొడవుగా పెరిగి పెద్దదయింది  అని బేబీ కాంబ్లే చెప్పిన మాటలు అంబేద్కర్ రాకడను  సూచించేవే.

మళ్ళీ మూడవ అధ్యాయంలో స్త్రీలకు వచ్చే పూనకాల గురించి చెప్పి ముగింపులో తమ కుల నిమ్నత్వానికైనా ,మూఢవిశ్వాసాలతో కూడిన జీవన విధానానికైనా అగ్రకుల విధానమే కారణమని చెప్తూ ,వాళ్ళు అంత చేసినా,తమ బతుకులు అంత అధ్వాన్నంగా ఉన్నా ‘మా చీకటి కలలకు మెరుపు అంచుల్ని ప్రసాదించే ఒక్క ఆశా కిరణం ఎప్పటికైనా రాకపోతుందా అని కలలు కన్నామని’ చెప్పటంలోనూ అంబేద్కర్ కోసం ఎదురుచూపులే ధ్వనిస్తాయి.

అయిదవ అధ్యాయంలో అస్పృశ్యత గురించి చెప్తూ హిందూమతం తమకు పనికి రానిదన్న జ్ఞానాన్ని ఇచ్చిన మహనీయుడుగా అంబేద్కర్ ను వాచ్యంగానే చెప్తుంది. ఇక ఆరు ,తొమ్మిది ,పది ,పదకొండు ,పన్నెండు అధ్యాయాలు  అంబేద్కర్ ఉద్యమం, ప్రభావాలు ,ప్రతిఘటనల కథనంగానే సాగుతాయి. వేలాది తరాల కోట్లమంది మహర్లు నశించినా వారి నీతి ,సత్యం వారు జీవించిన నేలలో ఇంకిపోయి సారవంతం చేశాయని చెప్తూ ఆ సారవంతమైన  నేల లోంచి పైకి లేచిన వటవృక్షంగా అంబేద్కర్ ను పేర్కొన్నది. ఆ వట వృక్షం యాతనలు భరిస్తున్న ఎందరికో నీడనిచ్చిందని ,  పశువులను మనుషులుగా మార్చిందని గౌరవంతో పేర్కొన్నది. మా వాడు ,మా బుద్ధుడు అని ఆత్మీయంగా చెప్పింది. ‘1930 నుంచీ అతని పేరు మా పల్లెల మీద నిప్పులు చెరిగే ఎండలో ఒక చల్లని పిల్ల తమ్మెర లా వీయటం మొదలు పెట్టింది’ అని చెప్పిన బేబీ కాంబ్లే వీలయినప్పుడల్లా  అంబేద్కర్ ఉద్యమం లోని భిన్నఘట్టాలను వివరించటానికి స్వీయ చరిత్రను చక్కగా ఉపయోగించుకొన్నది.

అలా ఆమె పేర్కొన్న వాటిలో తన తాతయ్య ,పెద్ద అమ్మమ్మ హాజరైన సమావేశం ఒకటి.అది జేజూరీ లో చైత్రమాసపు పున్నమి రాత్రి జరిగిన సమావేశం. జేజూరి పూనా దగ్గర ఒక వూరు. ఆ వూళ్ళో ఖండోబా మహార్ల కులదైవం. చైత్రమాసంలో పున్నమిరాత్రి ఆ దేవుడికి  జాతర చేస్తారు. ఆ జాతర రోజు జరిగిన సమావేశం అది.

శివరాం జనబ్ కాంబ్లే అనే మహర్ కులానికి చెందిన సంస్కరణ వాది  1910 లో జేజూరిలో మహార్ల తో ఒక సభ జరిపినట్లు తెలుస్తున్నది. 1903 లో సస్వాద్ లోనూ అతను ఇటువంటి సమావేశం ఒకటి జరిపాడు. ప్రభుత్వ ఉద్యోగాలలో ,పబ్లిక్ పాఠ శాలలో పోలీస్,ఆర్మీ వంటి సంస్థలలోనూ మహార్లకు ప్రవేశం కల్పించాలని ప్రభుత్వానికి మహజర్లు పంపటం ఆ సభల ద్వారా జరిగింది. బేబీ కాంబ్లే పేర్కొన్న జేజూరి సమావేశం 1910 నాటిది మాత్రం కాదు. ఆనాటికి అంబేద్కర్ చదువు కొంటు న్నాడే కానీ ఇంకా సామాజిక ఉద్యమ రంగంలోకి ప్రవేశించలేదు. అంటరాని వారి సముద్ధరణకు బోధన ,ఆందోళన ,సమీకరణ లక్ష్యాలుగా 1924 జులై లో  బహిష్కృత హితకారిణీ సభ ను ఏర్పరచిన తరువాతనే  అంబేద్కర్ సామాజిక కార్యాచరణ ప్రారంభం అయింది. ఆ క్రమం లో  జరిగిన తొలి సమావేశాలలో జేజూరి సమావేశం ఒకటి.1926 ఏప్రిల్ లో నిర్వహించబడిన ఆ సమావేశం గురించే బేబీ కాంబ్లే ఇక్కడ ప్రస్తావించిందనుకొనవచ్చు .

అంబేద్కర్ ఉద్యమాన్ని జనబాహుళ్యంలోకి తీసుకువెళ్ళటానికి జాతర సమయాలలో సమేవేశాల నిర్వహణ ఒక వ్యూహంగా ముందుకు వచ్చింది. అందులో భాగం గానే జేజూరిలో ఏర్పాటైన సభ అది. ఆ జాతర జరిగే చైత్రమాసానికి సరి అయిన ఇంగ్లీష్ నెల ఏప్రిల్. కనుక ఇది 1926 లో జరిగిన సమావేశమే అయివుంటుంది. తాతయ్య ,పెద్ద అమ్మమ్మ హాజరైన ఆ సమేవేశ వివరాలు వాళ్ళ ద్వారానే బేబీ కాంబ్లే  విని ఉంటుంది.

ఆ నాటి సభలో ప్రధానమైనది అంబేద్కర్ ఉపన్యాసం. అందులో ఆయన ముందుగా చేసిన పని దేవుడి మీద విశ్వాసాలను బద్దలు కొట్టటం  -మీ కష్టాలు తీర్చని దేవుడికోసం మీరెందుకు కష్టపడుతున్నారు అని మహర్ లను  ప్రశ్నించి ‘దిక్కు లేని వాడికి దేవుడే దిక్కు’ అన్న వాదాన్ని తిప్పి కొట్టాడు. మీ పిల్లల్ని ఆ దేవుడి నుంచి విముక్తం చేయండి అని పిలుపును ఇచ్చాడు. పిల్లలను చదివించమని,మూఢ విశ్వాసాలు ,ఆచారాలు వదిలించు కొనమని చెప్పాడు. చచ్చిన జంతువులను తినవద్దని ,పల్లెల్లో మురికిని శుభ్రం చేయవద్దని ,ఎవరి మురికి వాళ్ళే శుభ్రం చేసుకుంటారని  బోధించాడు. ఆ ఉపన్యాసం విని ఉత్తేజితులైన  తాత ,పెద్ద అమ్మమ్మ అంబేద్కర్ భావాల ప్రచారకులు అయినారు.తద్వారా  మహర్ జాతిలో కలిగించిన ప్రేరణలు ,సంఘర్షణలు ,సమాధానాలు బేబీ కాంబ్లే కథనంలో కనబడతాయి. సనాతన మతాచార విశ్వాసాల సంకెళ్లను తెంచుకొంటూ మహర్ లు చదువులలోకి ప్రవేశిస్తూ సంస్కారాభిముఖంగా మారుతున్న దృశ్యాన్ని సత్య సుందరంగా రూపు కట్టించింది.

చచ్చిన గొడ్డు మాంసం తినవద్దు అన్న అంబేద్కర్ బోధను వీరగాంవ్ లో ఆచరణ వాస్తవం చేయటంలో  తక్షణ ప్రేరణ బేబీ కాంబ్లే అమ్మమ్మ మాట అయితే విద్య గురించిన అంబేద్కర్ బోధన ను స్వయంగా ఆచరించిన వాడు ఆమె తండ్రి. ఆయన తనకొడుకుని ,కూతురిని కూడా చదువులకై బడికి పంపాడు. బేబీ కాంబ్లే బడి అనుభవాలు ఆసక్తి కరమైనవి. బడిలో చదువుకొనటం ,బడి అయిపోగానే చావడికి వచ్చి అక్కడ  అంబేద్కర్ ఉద్యమం గురించి జరిగే చర్చలు వినటం ,వార్తా పత్రికలను బిగ్గరగా చదివి వినిపించే తండ్రి వల్ల  అంబేద్కర్ సభా ప్రసంగాల సమాచారాన్నితెలుసుకొనటం బేబీ కాంబ్లే దినసరి కార్యక్రమం. సుశీల ,హాసా, శాంతా భగద్,బేగం,సావు,ఉల్కా,గులేబకావళి,శకు,ఆశా -బేబీ కాంబ్లే తో పాటు చదువు కున్న మహర్ బాలికలు. వీళ్ళందరూ ఒక జట్టుగా బడిలో  తమను అపవిత్రులుగా చూస్తూ దూరం పెడుతూ అవమానిస్తూ హింసించే అగ్ర కులాల ఆడపిల్లల వెంటపడి దొరికిన వాళ్ళను చితక్కొట్టిన వైనాన్ని బేబీ కాంబ్లే కుల చైతన్యం మేల్కొన్న లక్షణంగా పేర్కొన్నది. బడిలో అగ్రవర్ణ బాలికల పట్ల వుండే పక్షపాతం,మహర్ బాలికలు ఎదుర్కొనే వివక్ష కలిగించిన ఆగ్రహానికి ప్రతిచర్య అది. వాగ్యుద్ధం కూడా అందులో భాగమే. అగ్రవర్ణ బాలికలు బేబీ కాంబ్లే వంటి దళిత బాలికలను న్యూన పరచటానికి వాళ్లకు నైతిక బలం అయిన అంబేద్కర్ ను చచ్చిన గొడ్డు మాంసం తినే వాడని తక్కువ చేసి మాట్లేడే వాళ్ళు. దానికి దీటుగా వీళ్ళు గాంధీ ని చులకన చేసి మాట్లాడేవాళ్ళు. ‘మా కొట్లాటలంటే ఇరుపక్షాల నాయకుల గురించి అవహేళనగా మాట్లాడటం తప్ప మరేం ఉండేవి కావు’ అంటుంది బేబీ కాంబ్లే.

అంతే కాదు. మురికి మహర్లు అని అగ్రవర్ణాల పిల్లలు దూషిస్తే వాళ్ళను గుండ్లు గీయించుకొనే వెధవముండలు అని బేబీకాంబ్లే జట్టు కక్ష తీర్చుకొనేది. “హే !ఈ బాపనోళ్ళకి సిగ్గులేదు /ఆడోళ్లు మంగలోళ్ళ ముందు /గుండు గీయించుకోడానికి మోకరిల్లుతారు”-అంటూ అరిచి గోల చేసేవాళ్ళు. అందరూ ఆడపిల్లలే అయినా ఒకటి కాలేక పోవటానికి,శత్రుస్థానాలలో నిలబడటానికి  కులం వల్ల వచ్చిన వైరుధ్యాలే కారణం అన్నది స్పష్టం.

ఈ సందర్భంలో  1940  నాటి   ‘పరిణామం’ నవల గుర్తుకు వస్తుంది.జాతీయోద్యమ నేపథ్యంలో ఒక బ్రాహ్మణ వితంతు స్వతంత్ర వ్యక్తిగా ఎదిగి వైద్యురాలై క్రైస్తవం తీసుకొన్న దళిత యువకుడిని పెళ్లాడిన కథ ఇందులో ఉంది. ఈ నవలలో అంతకన్నా ముఖ్యాంశం కుల చైతన్యం. అచ్చం  బేబీ కాంబ్లే చైతన్యం వంటిదే. కులాన్ని తక్కువ చేసి మాట్లాడేవాళ్ళ పట్ల దళితులలో పెరుగుతున్న న్యాయమైన వ్యతిరేకతను ‘పరిణామం’ నవల ప్రతిఫలించినట్లు సమకాలపు ఏ తెలుగు నవల ప్రతిఫలించలేదు. విచిత్రంగా ఆ నవలలోనూ బ్రాహ్మణ దళిత స్త్రీల మధ్య సంఘర్షణ కనిపిస్తుంది.అదికూడా విద్యారంగంలోనే .బ్రాహ్మణ స్త్రీలు దళితుల కులాన్ని ,స్థితి గతులను ,తెలివితేటలను చులకన చేసి మాట్లాడితే దళిత బాలికలు  బ్రాహ్మణ స్త్రీల వితంతు దుస్థితిని ముఖ్యంగా తల జుట్టు తీసేసే పద్దతిని ఒక అవమానకర అంశంగా వేలెత్తి వెక్కిరించటం రెండింటిలోనూ సామాన్యమే . పరిణామం నవలలో ఒక పంతులమ్మ  లెక్కలు రాని ఒక విద్యార్థిని  గడ్డిమోపులు తలను మోసి అమ్ముకోవల్సిన బతుకులకు లెక్కలు ఏమి వస్తాయిలే అని ఎద్దేవా చేస్తుంది. దానిని గురించి ఆ విద్యార్థి స్నేహితురాలు ఎమిలీకి చెప్పుకొంటుంది. అప్పుడామె ‘బుర్ర గొరిగించుకొని పాచిపనులు చేయవలసినవాళ్లకు చదువులు ,షోకులు వస్తే గడ్డిమోపులవాళ్ళకి మాత్రం రాదూ’ అని తిరుగు సమాధానం చెప్పవలసింది నువ్వు అని అంటుంది. 1940 నాటికి  మాటపడని ఆత్మ గౌరవ చైతన్యం మేల్కొంటున్న దళిత యువత ఎదురుదాడికి సన్నద్ధం అవుతున్న సందర్భాన్ని ఇది సూచిస్తుంది. ఆ నవల రాసినది కూడా ఒక స్త్రీయే కావటం విశేషం. ఆ నవల రాసిన హవాయీ కావేరీ బాయి పై  అంబేద్కర్ ఉద్యమ ప్రభావం ఉన్నదని బేబీ కాంబ్లే ని చదివాక మరింత దృఢ పడింది. ఆ దిశగా ఆమె జీవిత విశేషాలను శోధించవలసి ఉంది.

ఈ ఆత్మకథలో బేబీ కాంబ్లే కథనం చేసిన మరొక ఘటన దేవాలయ ప్రవేశానికి సంబంధించినది.అంబేద్కర్ దేవాలయాలలోకి ,హోటళ్ల లోకి ప్రవేశించటం మహర్ ల ప్రాధమిక హక్కు అని ప్రబోధించి కార్యాచరణకు ప్రేరేపించాడు. 1930 మార్చ్ 2 న నాశిక్ లోని కాలారామ్ గుడిలోనికిప్రవేశించటానికి జరిగిన భారీ ప్రదర్శన తో కూడిన సత్యాగ్రహం తో ప్రారంభమైన ఈ ఉద్యమ స్ఫూర్తి మహారాష్ట్ర అంతటా ప్రసరించింది. అందులో భాగంగా  ఫల్టన్ లో హరిజన హాస్టల్ విద్యార్థులు విఠల్ గుడిలో ప్రవేశానికి చేసిన ప్రయత్నం గురించి బేబీకాంబ్లే ప్రస్తావించింది. ఇది 1937-38 నాటి ఘటన . అంతే కాదు. తాను తనతోటి ఏడుగురు సావాసులు రామాలయంలోకి ప్రవేశించటానికి చేసిన ప్రయత్నం గురించి కూడా చెప్పింది.అదికూడా తమతో పాటు చదువుకొనే బ్రాహ్మణ పిల్లల మీద పోటీగా తీసుకొన్న కార్యక్రమమే. దేవుడి విగ్రహాన్ని అపవిత్రం చేసే పనికి పూనుకోవద్దన్న భిన్నాభిప్రాయం వినబడ్డా ఎక్కువ మంది దానిని లక్ష్య పెట్టలేదు. రాముడు ఎట్లా ఉంటాడో చూడాలన్న కుతూహలం ,రాముడిని అపవిత్రం చేసి వినోదం చూడాలన్న ఉద్యమ చైతన్యం రెండూ పెనవేసుకొని దేవాలయ ప్రవేశానికి వాళ్ళను పురికొల్పాయి.ఆలోచన ,చర్చ సాగుతూనే వున్నా మరి రెండేళ్లకుగానీ తాము కార్యాచరణకు దిగలేదు అని చెప్పింది బేబీ కాంబ్లే .ఆరుగురు పిల్లలు మరొక ఆరుగురిని కాపలాగా పెట్టి ఎవరైనా వస్తుంటే హెచ్చరించమని చెప్పి దేవాలయంలోకి ప్రవేశించి ,చీకటికి ,చీకట్లో భీకరంగా కనబడ్డ ద్వారపాలక విగ్రహాలకు బెదిరి బెంబేలెత్తి రాముడిని చూడకుండానే వచ్చిన ఘటనను బేబీ కాంబ్లే వివరించిన తీరు హాస్య విషాదాల సమ్మేళనం లాగా ఉంటుంది. అగ్రవర్ణ బాలికల వలె గుడిలోకి వెళ్లి బుక్కా చుక్క పెట్టుకోలేక పోయామే అని బాధ పడిన ఒక నేస్తురాలి మాటను తిరస్కరిస్తూ బేబీకాంబ్లే “ఇంక మనకాదేవుడు వద్దే వద్దు. పసుపూ వద్దూ,కుంకుమా వద్దు ,బుక్కా అంతకన్నా వద్దు ,అన్నీ ఆయన్నే ఉంచుకోనీ” అని దేవుడి మీద తిరుగుబాటు ప్రకటిస్తుంది. అంబేద్కర్ మార్గంలో బౌద్ధం వైపు ప్రయాణించింది.

1938 లో అంబేద్కర్ జయంతిని ఉత్సవంగా జరుపుకొన్న విషయాన్ని కూడా బేబీకాంబ్లే ఇందులో పేర్కొన్నది. తమను అపవిత్రులుగా పేర్కొని అస్పృస్యులుగా బహిష్కరించిన హిందూ మతానికి ఎడంగా జరిగే ప్రక్రియలో భాగంగానే ఇది జరిగింది.

హిందువులు జరుపుకొనే ఉగాదికి బదులు  అంబేద్కర్ జయంతితోనే నూతన సంవత్సరం పండుగ జరుపుకోవాలన్న  ప్రత్యామ్నాయ సంస్కృతికి ఇది ప్రారంభం. ఫల్టన్ పాలనా పరిధిలోని 84 గ్రామాల నుండి బంధువులను ఆహ్వానించి కొత్త బట్టలు,పిండివంటలు ,సమావేశాలు ,వూరేగింపులతో జరిగిన ఆ పండుగ అంబేద్కర్ ఉద్యమపు పదునెక్కుతున్నతీరును వ్యక్తీకరిస్తుంది.ఆ నాటి సాయంత్రపు సమావేశం మొదట్లో దేవుడిని నిరాకరిస్తూ తొమ్మిదేళ్ల వయసులో ఉన్న బేబీ కాంబ్లే పాట పాడటం విశేషం.

బాబాసాహెబ్ అంబేద్కర్ సంప్రదాయ పద్దతిలో జరిగే పెళ్ళిళ్ళను కాదని  పురోహితుడితో అవసరంలేని ఒక పూత తక్కువ ఖర్చుతో చేసుకొనే గాంధర్వ పద్ధతి వివాహాలను ప్రోత్సహించాడు . బేబీకాంబ్లే వివాహం ఆ పద్దతిలోనే జరిగింది. అంతే కాదు,ఉద్యోగాలు కోసం చూడకుండా ఇంటి చుట్టుపక్కలలోనే చిన్నవ్యాపారాలు చేసుకొనమని అంబేద్కర్ ఇచ్చిన పిలుపును కూడా అందిపుచ్చుకొని బేబీకాంబ్లే ద్రాక్షపళ్ళవ్యాపారం ప్రారంభించి ఎదిగింది.

 

8

 

బేబీకాంబ్లే స్వీయ చరిత్ర అంతా అంబేద్కర్ ఉద్యమ చరిత్రే. ముంబాయి కేంద్రంగా నడచిన ఉద్యమం ,వ్యూహాలు ,కథనం చేస్తూనే బేబీకాంబ్లే పేర్కొన్న ఉద్యమ కార్యకర్తలు ఎందరో ఉన్నారు.ఆమె తండ్రి పండరినాధ్ మిస్త్రీ అంబేద్కర్ అభిమాని. అన్న బాబు పండరినాధ్ కాకడే అంబేద్కర్ ఉద్యమ ఆశయాల సాధనకు నడుం బిగించిన యువశక్తి ప్రతీక. పెద్ద అమ్మమ్మసమావేశాలలో ప్రసంగించగల దిట్ట.ఫల్టన్ లో అంబేద్కర్ జన్మదినం,దేవాలయ ప్రవేశం  వంటి వివిధ ఉద్యమాల నిర్వహణలో  చొరవగా పనిచేసిన నానామెంబర్ ,కేశవ్ మెంబర్, కాలాదాదూ ,లక్ష్మణ్ దలాల్ ,లక్ష్మణ్ మాస్టారు ,దాజీరామ్ కాకడే ,శ్రీరంగ్ అప్పా , గోవింద్ తొంబ్రే ,రామచంద్ర శంకర్,హేరమ్ ,బాబూరావు అహివాలె ,పాపా అహివాలె , ఆనంద్ అహివాలె మొదలైన కార్యకర్తల ను పేర్కొన్నది బేబీకాంబ్లే. చచ్చిన గొడ్డు మాంసం తినకుండా వదిలెయ్యటానికి  ,దేవుడిని  ,మతానికి సంబంధించిన మూఢ విశ్వాసాలను వదుల్చుకొనటానికి మహార్లు అంతర్గతంగా ఎదుర్కొన్న సంఘర్షణను బేబీ కాంబ్లే సున్నితంగా ఇందులో భాగం చేసింది.  భ్రమలకు వాస్తవానికి ,విశ్వాసానికి హేతువుకు, సంప్రదాయానికి ఆధునికతకు మధ్య ఘర్షణగా అది భిన్న కోణాల నుండి ప్రదర్శితమవటం ఇందులో చూస్తాం. అంతకంటే ఆసక్తి కరమైనది మహిళా ఉద్యమం గురించి ఆమె ఇచ్చిన సమాచారం.

బేబీకాంబ్లే నివసించే ఫల్టన్ నింబాల్కర్ కుటుంబ పాలనలో ఉన్న చిన్న రాజ్యం. అందులో 84 గ్రామాలు ఉన్నాయి. అప్పటి రాజు 4వ మలోజి రావు . రాజుగారి కార్యదర్శి సచిన్ గాడ్ భోలే ఫల్టన్ లో జరిగిన అంబేద్కర్ జయంతి ఉత్సవాలకు హాజరైన వాళ్లలో ఉన్నాడు. మలోజి రాజు భార్య రాణి లక్ష్మీబాయి మహిళామండలి స్థాపించిన  ఉదంతాన్ని చెప్పింది బేబీకాంబ్లే. దళిత మహిళలను కూడా అందులో చేర్చుకోవాలని ఆశించి ఆమె బేబీకాంబ్లే తండ్రితో పాటు శ్రీరంగ్ అప్పాను ,నానా మెంబర్ ను సమావేశానికి పిలిచి మాట్లాడిందని, ఫలితం గా అంబేద్కర్ ఉద్యమ కార్యకర్తలంతా తమ తమ మహిళలను మహిళామండలిలో చేర్పించారని ,రాణి సాహెబా ఏర్పాటు చేసే సమావేశాలన్నిటికీ తమకు ఆహ్వానం వచ్చేదని ,అన్ని ఇళ్ల నుండి మహిళలను పిలుచుకొని మహిళా కార్యకర్తలు  బాధ్యతగా  ఆ సమావేశాలకు తీసుకుపోయే వాళ్ళని బేబీకాంబ్లే పేర్కొన్నది. ఆమె ప్రస్తావించిన మహిళా కార్యకర్తలు ఠాకూబాయి కాకడే,మాతూబాయి మోరే ,ఫత్తాబాయి కాకడే ,విధాబాయి కాకడే . వాళ్లంతా మంచి ఉపన్యాసకులని,  తొమ్మిది గజాల తెల్ల చీరెలు కట్టుకొని, అంబేద్కర్ ఫోటోని పిన్నుతో చీరకు పెట్టుకొనే వాళ్ళని వాళ్ళ  గురించి  గొప్ప ఆరాధనాభావంతో చెప్పింది.

ఆ సందర్భంలో ఆమె పేర్కొన్న ఒక ఘటనకు చాలా ప్రాముఖ్యత ఉంది. లక్ష్మీ బాయి ఏర్పాటు చేసే మహిళా మండలి సదస్సుకు వెళ్లిన దళిత మహిళల అనుభవానికి సంబంధించినది అది.బేబీకాంబ్లే కూడా వాళ్లలో ఉన్నది. భోజనాల గదిలో ఏర్పాటు చేసిన ఆ సమావేశం లో కుర్చీలన్నిటిలో బ్రాహ్మణ మరాఠా మహిళలు కూర్చున్నారు.ఏమీ చెయ్యలేక  మహర్ మహిళలుఒక పక్కన నిలబడ్డారు. వాళ్ళు  తమ ముందు నిలబడి ఉండటమే బ్రాహ్మణ మహిళలకు  తెలిసిన సామాజిక మర్యాద. అందువల్ల మహర్ మహిళలంతా ఒకపక్కన నిలబడి ఉండటం వాళ్ళనేమీ ఇబ్బంది పెట్టలేదు. కానీ అంబేద్కర్ ఉద్యమ ప్రభావంలో ఆత్మగౌరవ చైతన్యం పదునెక్కుతున్న మహర్ మహిళలకు ఒకే సమావేశానికి వచ్చిన మహిళలలో కులం వల్ల కొందరు కుర్చీలలో కూర్చొని ఉంటే మరి కొందరు నిలబడవలసి రావటం లోని అన్యాయం భరించరానిది అయింది. అందువల్లనే  ఠాకూబాయి అనే కార్యకర్త వేదిక పైకి వెళ్తున్న రాణిని భుజం పట్టుకొని ఆపి ‘మీ మహిళలు మా వాళ్ళను కుర్చీలపైన కూర్చోనివ్వటంలేదు. ఆ అంబేడ్కర్ మా హక్కుల కోసం అడగమని చెప్పాడు. మీ మహిళలను ఆ కుర్చీల మీద నుంచి బలవంతంగా లాగేసి మా వాళ్ళని కూర్చోబెడతాను’ అని స్పష్టంగా తాను ఎంచుకున్న కార్యక్రమాన్ని చెప్పింది. ఒక్కక్షణం నిర్ఘాంత పోయినా మరుక్షణం తేరుకొని రాణీ తమ కోసం  మొదటి వరుసలో కుర్చీలు వేయించిన ఘటన గురించి బేబీ కాంబ్లే చెప్పింది.

మానవ జాతి స్త్రీపురుష వర్గాలుగా విడిపోయిందని పితృస్వామ్యం వాళ్ళను అధీన అధికార వర్గాలుగా తయారు చేసిందని చెప్పే  ఫెమినిస్టు సిద్ధాంతం పట్ల బేబీ కాంబ్లే  విమర్శనాత్మక అవగాహన ఇక్కడ స్పష్టమవుతుంది.  స్వీయ జీవితానుభవం నుండి జాతి వల్ల  స్త్రీలందరూ ఒకటి కాదు, కులం వల్ల  వాళ్ళలోనూ అధికార అధీన వర్గ భావనలు కొనసాగుతూనే ఉంటాయి కనుక దళిత స్త్రీలకు నిచ్చనమెట్ల కుల వ్యవస్థ ,అధికార స్థానంలో ఉన్న అగ్రవర్ణ మహిళలు కూడా  శత్రువులేనన్న స్పృహ ఇందులో ఉన్నది.దళిత ఫెమినిజం అంబేద్కర్  ఆలోచనల నుండి ఆచరణ నుండి పురుడు పోసుకున్నచారిత్రక వాస్తవాన్ని నిరూపించటం దీని ప్రయోజనం.

బేబీకాంబ్లే చెప్పిన ఈ ఘటన 16 వ శతాబ్ది వాడైన పింగళి సూరన రాసిన ‘ప్రభావతీ ప్రద్యుమ్నము’ లోని ఒక ఘట్టాన్ని గుర్తుచేస్తుంది. తండ్రి ఒకడే కశ్యపుడు . తల్లులు వేరు. దితి సంతానం దైత్యులు … రాక్షసులు . అదితి సంతానం దేవతలు. ఇంద్ర లోక సౌఖ్యాలు దేవతలవై తాము ఆ దేశం ఈ దేశం పట్టుకు తిరగవలసి వచ్చిన ఖర్మ గురించిన ప్రశ్న దైత్యులలో కలిగిన ఒక సందర్భంలో వజ్రనాభుడు స్వర్గం  మీదికి దాడి వెడలి కానుకలతో ,రాయితీలతో కొంతకాలం గడిపి ఇక ఇట్లా కాదని ఇంద్రసభను ఆక్రమించటానికి వెళ్లిన ఘట్టం అది. ఇక్కడ ఠాకూబాయి బ్రాహ్మణ మరాఠా స్త్రీలను కుర్చీల మీదినించి లాగేసి మావాళ్లను కూర్చబడతానని ఏ మాట  చెప్పిందో దానిని ఆ ఘట్టంలో వాళ్ళు  చేసి చూపారు. రాక్షసులు సభాప్రాంగణంలోకి ప్రవేశిస్తూనే ఋషులను ఆసనాలమీది నుండి లాగేసి తాము కూర్చున్నారని పింగళి సూరన రాసాడు. అంతే కాదు వజ్రనాభుడు ఇంద్రుడిని స్వర్గం వదిలివెళ్లమని ఆదేశించాడు. స్వర్గాన్ని ఎన్ని ఏళ్లుగా మీరు  ఏలుతున్నారో  అన్ని ఏళ్ళు ఇప్పటి నుండి మేము ఏలవలసిందే.. ఆ తరువాత చూసుకుందాం మిగిలినవి అని రాజ్యాధికారంలో న్యాయమైన వాటా కోసం నిలబడ్డాడు. అలా నిలబడ్డ వాడిని పడగొట్టటానికే ఇంద్రుడు శ్రీ కృష్ణుడి సహాయాన్ని కోరటం ,అతని వ్యూహ రచనలో భాగంగానే ప్రద్యుమ్నుడు ఆ విధిని నిర్వర్తించటం జరిగాయి.ఆనాడు దేవతల మీద రాక్షసుల తిరుగుబాటుకు ,ఈ నాడు అగ్రవర్ణ ఆధిపత్యం మీద దళితుల తిరుగుబాటుకు ఉన్న దగ్గరి పోలిక ఇక్కడ స్పష్టం అవుతుంది.  దేవదానవ యుద్ధాలను దేవుళ్లు శూద్రులను అణచివేయడానికి చేసినవిగా బేబీకాంబ్లే అర్ధం చేసుకొన్నతీరు లోని  సామంజస్యం కూడా బోధ పడే సందర్భం ఇది.

9

 

దళిత రాజకీయ ఉద్యమంలో సగానికి పైగా మహిళలు ఉన్నారని చెప్పింది బేబీకాంబ్లే. వూళ్ళో చావడి దగ్గర జరిగే సభలలో పాల్గొనటమే కాక దూరప్రాంతాలలో సభలు జరిగినప్పుడు కూడా నాలుగైదు రోజులకు సరిపడా ఖాక్రీలు  తీసుకొని బయలుదేరేవారని ఇంట్లో వాళ్ళ మద్దతు పూర్తిగా ఉండేదని అంటుంది ఆమె. సాధారణంగా మగవాళ్లు ఉద్యమ కార్యకర్తలు  అయినప్పుడు వాళ్ళ స్త్రీల కు  కూడా ఆ ఉద్యమ కార్యకలాపాలలో పాల్గొనేందుకు అవకాశం లభించేది. కానీ బేబీ కాంబ్లే  తండ్రి అంబేద్కర్ అనుయాయి అయినా అతను భార్యను గడప దాటనిచ్చేవాడు కాదు. కానీ కూతురికి  మాత్రం ఆ నిషేధాలేవీ పెట్టలేదు.

బేబీ కాంబ్లే అన్న బాబు దళిత రాజకీయ ఉద్యమంలో క్రియాశీల కార్య కర్త. విద్యార్థి  యువజనులను కూడగట్టుకొని అంబేద్కర్ పిలుపునిచ్చిన పనులన్నిటినీ స్థానికంగా అమలు పరిచేవాడు. పదకొండు పన్నేడేళ్ల వయసు నుండి అన్న వల్ల  అనేక కార్యక్రామలలో పాల్గొనే అవకాశం బేబీ కాంబ్లేకి దక్కింది.భర్త కూడా ఉద్యమ కార్యకర్త కావటం వల్ల ఆమె దళిత సామాజిక రాజకీయ ఉద్యమ జీవితం కడవరకు ఎదో ఒక స్థాయిలో కొనసాగింది.భార్యను గడప దాటనివ్వని సంస్కృతి ఎట్లా మహర్ మహిళను  ఉద్యమం లోకి రానీయని అవరోధం అయిందో ,భర్తల చైతన్య స్థాయి పరిమితులు ,పరిధులు కూడా మహర్ మహిళా వికాసానికి ఎదో ఒక మేరకు అవరోధమే అవుతాయని బేబీకాంబ్లే గుర్తించి చెప్పటం గమనించవచ్చు.

ఇలాంటి అనుభవాలు దళిత పితృస్వామ్యం ప్రజాస్వామికమైనదనే భ్రమను పటాపంచలు చేస్తాయి.అయినా అంతర్గత కౌటుంబిక పితృస్వామ్యం తోఎదో ఒక స్థాయిలో  రాజీ పడిందేమో కానీ బేబీ కాంబ్లే ఎక్కడా అగ్రకుల ఆధిపత్యంతో రాజీ పడలేదు. “పర్వతాలను సైతం తనలో దాచుకోగలిగే అనంత సముద్రంలాగా అగ్రకుల పాపాల పర్వతాలను కప్పివుంచే సముద్రాలవంటి వారం మేము. అందుకే సముద్రానికి దక్కినట్లే ప్రపంచపు మొత్తం ఆరాధన మాకు దక్కాలి” అని ప్రకటించటం లో ఆ   స్వాభిమాన పోరాట పటిమే కీలకమైనది. బేబీ కాంబ్లే అనుభవం ,ఆవేదన ,ఆరాటం, పోరాటం వదిలించుకోవలసిన కుల ఆధిపత్య అహంకారాల గురించిన ఎరుకను ఆశిస్తాయి. హెచ్చరికగా పనిచేస్తాయి.

3 thoughts on “‘మా బతుకులు’ వినిపించే సముద్ర ఘోష  

  1. గొప్ప జీవితంను చారిత్రక పరిణామక్రమాన్ని, అణిచివేతల వెతల్ని చక్కగా వివరించారు.

  2. స్త్రీల సమస్యలన్నీ ఒక్కటి కావు. దళిత స్త్రీల చరిత్రను స్త్రీవాదం ప్రత్యేకంగా అధ్యయనం చెయ్యాలి. ఈ విషయంలో ఇప్పటికీ పూర్తి స్థాయి చర్చ జరగలేదు. దళిత స్త్రీలు తమ హక్కుల కోసం మళ్లీ అగ్రవర్ణ స్త్రీలతో ఘర్షణ పడాల్సి పరిస్థితి ఇప్పటికీ ఉంది. ఈ విషయాన్ని బేబీ కాబ్లీ తన పుస్తకంలో.. కాత్యాయినీ గారు ఈ వ్యాసంలో ఎంతోో వివరంగా చెప్పుకొచ్చారు. చదవడానికి కాస్త సమయం పట్టిగా తప్పక చదివి ఎన్నో వాక్యాలను ఎప్పటికీ గుర్తు పెట్టుకోవాల్సిన వ్యాసం ఇది. కాత్యాయిని విద్మహే గారికి కృతజ్ఞతలు.

  3. ప్రముఖ మరాటి రచయిత అన్నాబావు సాటే చెప్పినట్లు ఈ భూమి దళిత మహిళల వీపుల మీద వుంది.భారత్ లో ఫెమినిస్టులంటే ఆదిపత్య కులాల స్త్రీలే.ఏ ఫెమినిస్ట్ సంగం చూసినా ఒక్క దళిత మహిళా లీడర్ కనిపించదు.దలిత మహిళా caste gender politicsమీద చర్చ జరగాలి.బేబీ కాంబ్లే ,కుటుంబ మొగోళ్లతో అంతంత హింసలు faceచేసి చివరికి కుల హింస, అవమానాలు అన్యాయాల ముందు మామగస్వామ్యాలు చిన్నవే అని తీర్పిచ్చింది.ఈ కోణాలు ఈ బిన్నత్వాల రాజకీయాల్ని చర్చింఛాలి,మాట్లాడాలి, కానీ ఆ వైపు నుంచి మాట్లాడక పోగా దళిత మహిళలు అంటే బావిలో కప్పలని “నూకమ్మ జ్ఞానాలు’ అని క్రూరంగా అవమానిస్తున్నాయి ఆదిపత్యకులాల మహిళలు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


   Type Comments in Indian languages (Press Ctrl+g to toggle between English and Hindi OR just Click on the letter)