Featured కాలమ్స్

మొహమాటం వొద్దు

                                               హెచ్చార్కె సమయం

 

యేవేవో జరుగుతుంటాయి. అవి యెందుకు జరుగుతాయో తెలిసినట్టుంటుంది గాని తెలీదు. ‘యిలా యెందుకు?’ అని విచికిత్స పడతాం. బాధగా వుంటుంది. గట్టిగా నుదుర్రాసుకుని ‘విధి’ అనుకుంటూ వుంటాం. విధి అంటే యిక్కడ ‘ఛాన్స్’ అని. ‘అదృష్టం’ అని. ‘లక్’ అని. అలాంటిదేమైనా వున్నదా? వున్నదో యేమోగాని, అలా అనుకోడం నష్ట కరం. విధి అనుకోడం కన్న కారణాల్ని అన్వేషించడం మంచిది.

అన్వేషిస్తే కారణాలు దొరుకుతాయా యేమిటి, వదిలేస్తే పోలా అనే నిరాశ అర్థం లేనిది. కారణాలు అన్వేషించకుండా వుంటే బాధ పోతుందా? పోదు. సమస్య వుండే కదా, యింతగా  ఆలోచిస్తున్నాం. అలోచనే బాధ, అలోచించొద్దు అని చెలం మొత్తుకున్నాడు, యేదో మనోడు చెప్పేడు కదా అని మనం వింటామనుకోండీ, ఆ మాట మనస్సు వినదు. బాధ తప్పదు. బాధే సౌఖ్యమనుకోవడం పాట బాగుంటుంది. అలా ‘అనుకోడం’ జరగదు, వో సుక్కేసి నిర్ణీత సమయం కన్న ముందే సుక్కల్లో కలిసిపోవడమే అవుతుంది.

కారణాల అన్వేషణ అనేది ‘వస్తుగతమైన’ పని. ఆత్మాశ్రయం కాదు. కారణాలు బయట వుంటాయి మీలోపల వుండవు. దాని కోసం మీరు మీలోంచి బయటికి వెళ్లి ‘పని’ చేయాలి, క్షణం వూరుకోని మెదడుకు… అలా వొక పద్దతి ప్రకారం పని పడితే మేలు. యిక, అర్థమ్ము కాని తిమిర లోకాలలో దుఃఖ సంచారానికి దానికి తీరిక వుండదు. అన్వేషించడం తప్పక సరైనదే. యెప్పడూ సరైనదే. ఆ పనేదో…. వంట చేసినట్టు, లెక్కలు చేసినట్టు…. పద్ధతిగా చేయాలి. వూరక వొక చోట కూర్చుని జుట్టు పీక్కోవద్దు. ఘటనలోని యితర పాత్రధారులతో సంవాదానికి ప్రయత్నించాలి. ‘డీల్’ చేయాలి.

మాస్టారూ, మీరొక పని చేయండి: మీకు బాధ కలిగించిన ఘటన యేమిటో వొక కాగితం రాయండి. కాగితం మీద రాయడమంటే ‘అర్టిక్యులేట్’ చెయ్యడమే. ఘటన కళ్లల్లో కళ్లు పెట్టి చూడడమే. ఘటనను అర్టిక్యులేట్ చేయగలిగారంటే, ఆ మేరకది మీకు అర్థమయ్యిందన్న మాట. అసలేం జరిగిందో కూడా వొక పట్టాన అర్థం కాకపోతే? యేమి జరిగిందని మీరనుకుంటున్నారో ఆ వర్షన్స్ ని నంబర్లు వేసి రాయండి. వాటిల్లో మోస్ట్ ప్రాబబుల్ వర్షన్ యేమిటో యెంపిక చేయండి. అంటే, ఘటన స్వరూపాలలో అత్యంత సంభావ్యమైన దాన్నే యెంపిక చేయండి,. చాల సార్లు యీ స్టెప్ అవసరం వుండదు. మీ తక్షణ దిగులు కారక ఘటనను మీరు వెంటనే రాసేస్తారు.

తరువాత ఆ ఘటన మీకు కలిగించే నష్టాలు యేమిటో రాయండి. అవి నిజంగా నష్టాలు కాకపోవచ్చు. అవి పెద్ద నష్టాలు కావని మీకనిపిస్తే, రేపటెల్లుండికి వాటి రిలవెన్సు వుండదనిపిస్తే… యింకేం అంతవరకు మీరు బాధ పడడం అనవసరమని తేలిపోయింది. యిక బాద పడరు. దాన్నిక తేలిగ్గా వొదిలెయ్యగలుగుతారు.

లేదూ,  నష్టాలున్నాయని అనిపిస్తే తరువాత అడుగు వేయండి.

నష్టాల్ని నివారించడానికి వుపాయాల జాబితా రాసెయ్యండి. మొహమాటానికి పోవద్దు. భేషజాలకు పోవద్దు. ఆ మార్గాలన్నిటికీ… వాటి ‘సాధ్యాసాధ్యాల’ (అఛీవబిలిటీ) రీత్యా ప్రాధమ్యతల వరుసలో రాసి… యిక, వొక్కొక్క వుపాయాన్ని ప్రాధమ్యతను బట్టి అమలు జరపండి. నేను చెబుతున్నాను కదా. అందులో యేదో వొకటి క్లిక్ అవుతుంది. మొదటిది క్లిక్ అయ్యే అవకాశమే చాల యెక్కువ.

చిన్న వుదాహరణ. చాల చిన్నది. పెద్దవి చెప్పుకుంటే ప్రమాదాలెక్కువ. J

యిటీవల నేనొక సదస్సులో పాల్గొన్నాను. రెండు రోజుల సదస్సు. సాహిత్య సదస్సు కదా అని వాళ్లు పిలిచిన వెంటనే ఆనందంగా అంగీకరించాను. అక్కడ యింకా నేను చెయ్యగల పనుల గురించి నిర్వాహకులతో వుత్సాహంగా, కొంచెం యెక్కువగానే మాట్లాఢాను. వెళ్లాను. అంతా బాగుంది. హోటల్ రూం అవీ కూడా బాగున్నాయి, హోటల్లో రూమ్మేటు నా చిరకాల స్నేహితుడు, అది మరింత బాగుంది. సభా ప్రాంగణానికి వెళ్లాక రిజిస్ట్రేషన్లు అవీ అయ్యాక వాళ్లు ప్రోగ్రాం షీట్ యిచ్చారు. అది చూసుకునే సరికి నా వుత్సాహం సన్నబడింది. అందులో మాట్లాడే వారందరిలో, చివరాఖరి సెషన్లో చివరాఖరి ప్రసంగం నాది.

మనసుకు కష్టం వేసింది. మొదటి కష్టం ‘యిగో’ సమస్య. వక్తలలో చాల యెక్కువ మంది నా కన్న బాగానో, కొద్దిగానో చిన్న వాళ్లు. యెందుకిలా అని దిగులేసింది. పైన చెప్పిన యెక్సర్సైజు చేసేను. బహుశా, మిగతా వాళ్లు నిర్వాహకులకు బాగా తెలిసిన వారో, లేక వారెన్నుకున్న ప్రసంగాంశాలు నిర్వాహకులకు యెక్కువ నచ్చడం వల్లనో అలా జరిగి వుంటుంది. లేదా వాళ్లు పిలిచినప్పుడు గంభీరంగా వుండక నేను చూపిన అత్యుత్సాహం కూడా కారణం కావొచ్చు.

యీ విషయంలో నేను చేయాల్సింది యేమైనా వుందా? వుంది. మరోసారికి జాగర్తగా వుండడం. యెవరు నన్నెందుకు పిలుస్తున్నారో, అక్కడ సదస్సులో నా స్థానం, సమయం యేమిటో ముందస్తుగా అడిగి తెలుసుకోడం. అది నచ్చితే వెళ్లడం, లేకుంటే యింట్లో కూర్చుని నా కథలు కాకరకాయలేవో నేన్రాసుకుంటూ కూర్చోవడం.

అది సరేలే. యిక ముందు అలాగే చేస్తాన్లే గాని. యిప్పుడు నాకు జరిగే నష్టం యేమిటి? నేనేల వగచుచుంటిని? భలే వారే. నేను మాట్లాడబోయేది యిష్టపడే వాళ్లుంటారు. నచ్చని వాళ్లుంటారు. నేనెలా మాట్లాడానో నాకెలా తెలుస్తుంది. సదస్సులో చిట్ట చివరి వాడిని. యిళ్లకు వెళ్లిపోయే వాళ్లు వినీ వినక విని హడావిడిగా వెళ్లిపోతారు. నా ‘పర్పార్మెన్స్’ తరువాత నేరుగానో, చాటుగానో, ప్రతిస్పందనగానో, ప్రతీకారంగానో మాట్లాడే మాటలను వినాలనే కుతూహలం యెప్పటికీ ఆరని అగ్నిగుండమై వుండిపోదూ?!

యిదొక నష్టమే. దీన్ని నివారించే మార్గాలేమిటి? సాయంత్రం కార్లలో తిరుగుతున్నప్పుడు, యితర్లతో యిష్టాగోష్ఠిగా మట్లాడుతున్నప్పుడు… కపాల పేటికలో  పురుగు తిరుగుతూనే వుంది. పురుగు మీసాల్లా కదుల్తూ యింకేవేవో రిగ్రెట్స్. యిక నుంచైనా ‘తెలివైన’ వాడిగా వుండాలని బడా బడా నిర్ణయాలు, దిగులు.

అవన్నీ పక్కన పెట్టి, నష్ట నివారణోపాయాల లిస్టు రాశాను. పని చిటికెలో అయిపోయింది. లిస్టు .మొదటి నంబరునే అమలు చేశాను.

మొత్తంగా నా బాధకు అసలు కారణం… మొహమాటం.

దాన్ని వొదులుకోవడమే నివారణోపాయం.

ఆ మహా ‘త్యాగ’మేదో  యిప్పటికైనా చేయాలి. వొదలదే. మొహమాటం వొదలడం కూడా వొక ప్రాసెస్. మొదట సదస్సు నిర్వాహకులలో వొకరి దగ్గరికి వెళ్లి…. ‘యావండీ నన్ను మరీ చివరికి వేశారు’… అని గుణిశాను.. ‘నేనెరగ నేనెరగ…. ఆ మూల నుంచున్న పెద్దాయన్ని అడుగు’ అన్నారు ‘చిన్నా’యన. నిజానికా పెద్ధాయనే మొదట నాకు ఫోన్ చేసి సదస్సుకు పిలిచారు. చాల మంచి మనిషి కూడా. ఆయన దగ్గరికి వెళ్లి మాట్లాడ్డానికి నాకు  మొహమాటం. యిపుడా మొహమాటం పక్కన పెట్టి వెళ్లి, ‘నేను కాస్తా ముందుగా వెళ్లాల్సి వుంది నన్ను ముందు సదస్సులలో వుంచండి’ అని యీసారి నవ్వు మొహంతోనే, కాకపోతే గంభీరంగా చెప్పాను….. మార్చకపోతే నా అమూల్య వాక్కులు వినే మహద్భాగ్యం శ్రోతలకు వుండదనే  బెదిరింపును మాటల్లో రంగరించి. ‘ఆలాగేనండీ, అలాగే మార్చేద్దాం’ అనేశారాయన. మార్చేశారు. యింకేం నేను బాగా ముందుగా వేదిక మీదికి పిలవబడి, నా సమయాన్ని పూర్తిగా వుపయోగించుకుని, సభలో కొందరిని వూగించి, మరి కొందరిని కోపంతో తూగించి వచ్చి… తరువాత దానికి ప్రతిస్పందనలన్నిటినీ వాఛ్యంగా, ముఖ కవళికలుగా విని, కని తరించితిని. మొహమాటం లేని ఆ వొక్క పని చేయకపోయి వుంటే, యిప్పటికీ నిష్ఫలంగా దిగులు పడుతూ వుండే వాడిని. నా మానసికోద్రేకాల శక్తిని… అది కథో. కవిత్వమో కాకుండా…. వ్యర్థం చేసుకునే వాడిని.

కనుక మొహమాటపడొద్దు. మీక్కావలసింది మీరు అడిగి తీసుకోండి. అడిగే ముందు మీరు దానికి లెజిటిమేట్గా అర్హులో కాదో మీరే నిర్ణయించుకోండి. ఆ కీలక సమయంలో యెవరి మహత్తర వొపీనియనూ అడక్కండి. తరువాత. నేరుగా, సూటిగా, సుత్తి లేకుండా అడిగి తీసుకోండి, అప్పటికీ…. లెజిటిమేట్ గా మీకు సరైనదాన్ని మీకు నిరాకరిస్తే, యిప్పుడు విషయం స్పష్టం కనుక, తిరిగి మరోసారి అలాంటి స్థితిలోనికి వెళ్లకుండా వుండగలుగుతారు.  లేకుంటే అలా యెందుకు జరిగిందబ్బా, యెప్పుడూ నాకే యెందుకిలా జరుగుతుందబ్బా అని కణతలు నొక్కుకుంటూ కూర్చుంటారు.

నేను చెబుతున్నాను కదా.

దిగువ మధ్య తరగతిలో పుట్టి, పల్లెటూరి బైతు తనంతో పెరిగి, నేను తెలుసుకున్న ప్రతి దాన్నీ తప్పొప్పుల నిప్పుల మీద నడవడం ద్వారా తెలుసుకున్న వాడిని కావడమే యిలాంటివేమైనా చెప్పడానికి నాకున్న అర్హత.

యిది నా సమయం.

నెల నెలా… యిలాగే మీతో గడుపుతాను, ‘అడుగు’ పత్రిక నిర్వాహకులకు కృతజ్ఞతలతో….

-హెచ్చార్కె

6 thoughts on “మొహమాటం వొద్దు

 1. యీ కాలమ్ లో చేర్చుదామని నేను మరిచిపోయిన వొక ఫుట్ నోట్: యిందులో ప్రాబ్లెమ్ పోజింగ్, ప్రాబ్లెమ్ సాల్వింగ్ లకు గాను నేను వాడుకున్న ‘టెక్నిక్’ను డేల్ కార్నీ గారి ‘హౌ టు స్టాప్ వర్రీయింగ్ అండ్ స్టార్టింగ్ లివింగ్’ అనే పుస్తకం లోనిది. వ్యాసం చివర వొక ఫుట్ నోట్ గా ఆ మాట చెప్పాల్సింది నేను.

 2. చేరదీసిన యజమానినే కరిచే(కరుస్తూ ఉండే) పెంపుడుకుక్క లాంటిది మొహమాటం. వదిలేసుకోవడం చాలా ఉత్తమం. వ్యక్తికే కాదు. సమాజానికి కూడా. ప్రతిభ బయటకు వస్తుంది. సమయం ఆదాఅవుతుంది.

  చాలా ఉపయోగకరమయిన ఆర్టికల్. డ్రై ఫిలాసఫీలా చెప్పకుండా, లేటెస్ట్ ఉదాహరణతో , లోలోపలి ఆలోచనలను మిక్స్ చేసి చెప్పడం చాలా బావుంది.

 3. అనుకున్నంత సులువు కాదుగా, వదులుకోవాలనుకున్నవి.. వదులుకోవడం. చాలా బావుంది మీ కాలమ్.

 4. చాలా నిర్మొహమాటంగా తన స్థానాన్ని ఖచ్చితంగా తేల్చుకుంటేనే గానీ సభకు రాని వాళ్ళు చాలామంది నాకు తెలుసు. అది తప్పు కాదని ఇప్పుడు తెలిసింది హెచ్చార్కె గారూ

 5. మీరు చెప్పిన టెక్నిక్ బాగుంది
  యి వ్యవస్థ లో అడగడం -ప్రశ్నించడం —గళం ఎత్తడం అవసరం
  ====
  Reddy

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


   Type Comments in Indian languages (Press Ctrl+g to toggle between English and Hindi OR just Click on the letter)