వ్యాసం

రాయలసీమ కథల్లో ప్రపంచీకరణ

                                                                                           -జి.వెంకటకృష్ణ
   ప్రపంచీకరణ ను అర్థం చేసుకోవడానికి,”ప్రపంచం ఒక కుగ్రామం అయిపోయింది”అనేది సులభమైన పాత వాక్యం. నిజానికదొక సామాజిక ఆర్ధిక పరివర్తన. ఆర్థికంగా సాంకేతికంగా, సామాజిక సాంస్కృతిక అంశాలన్నీ ప్రపంచవ్యాప్తంగా ఒక్కటై పోవడం. దేశాల్ని నేరుగా ఆక్రమించుకుని వలసలుగా మార్చడమనే పాతపద్దతి స్థానంలో,పెట్టుబడిని మాత్రమే తరలిస్తూ దేశాల సార్వభౌమత్వాలను తోలుబొమ్మల్ని చేసి ఆడించడమనే ఆర్థిక సామ్రాజ్యవాదం.
మన జీవితాలతో ముడిపడిన ప్రతి అంశమూ ప్రపంచీకరణ ప్రభావానికి గురయ్యింది. మన సంస్కృతి, విలువలూ సాంతం ప్రభావితమయ్యాయి. ప్రపంచీకరణ అనే యాంత్రిక వాదం, మనుషులకు అక్కరకొచ్చే వస్తువుల్ని తయారుచేయడమే కాకుండా, వస్తువులకు అక్కరకొచ్చే మనుషులనూ తయారుచేసింది. కంజూమరిజం తారా స్థాయికి చేరి, మనుషులను వస్తువులుగా మార్చింది. అక్షరం ముక్కరాని వారికి కూడా కన్స్యూమర్ విలువలు యింకేలా చేసింది. తాగడానికి పెప్సీలూ కోకాలుతో పాటు పాల్డాల్ లాంటి పురుగు మందులనూ రైతుల చేతుల్లో పెట్టింది. పిజ్జాలూ బర్గర్లూ వాటర్ బాటిల్స్ అందరి చేతుల్లో పెట్టింది. కంప్యూటర్లలో దేశ భవిష్యత్తూ, సెల్ ఫోన్లలో దేశ సంస్కృతీ పెట్టింది. యువకుల్ని డిజిటల్ కూలీలను చేసింది.
జీవితం కథగా ప్రతిఫలిస్తుంది. కథ జీవితాన్ని ప్రతిబింబిస్తుంది. సామాజిక చలనాలన్నీ సాహిత్యాన్ని ప్రభావితం చేస్తాయి. తెలుగు నేలమీద రచయితలు ప్రపంచీకరణ సామాజిక ప్రతిఫలనాలను ప్రతికూలంగా వున్న వాటినే కథలుగా చిత్రించారు. కుదేలైపోతున్న రైతులూ,వ్యవసాయరంగం,అవలక్షణాలు తో కునారిల్లుతున్న విద్యారంగం,చితికిపోయిన కులవృత్తులు,పెరిగిపోయిన వినియోగదారీ ప్రవృత్తి,పెచ్చరిల్లిన పాశ్చాత్య సంస్కృతీ అనుకరణా,అన్నింటినీ మించి రైతుల, కులవృత్తి శ్రామికుల, విద్యార్థుల ఆత్మహత్యలు యివీ యిట్లాంటివీ రచయితలకు కథావస్తువులయ్యాయి. ప్రపంచీకరణకు ప్రతిపక్షంగా రచయితలు వ్యవహరించారు. రాయలసీమ రచయితలకైనా అదే వర్తిస్తుంది.
90ల తర్వాత వచ్చిన చాలా రాయలసీమ కథల్లో వస్తువుతో నిమిత్తం లేకుండా ప్రపంచీకరణ ప్రతిఫలనాలు కన్పిస్తాయి. ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రపంచీకరణ సమాజంలో చూపిన నెగెటివ్ అంశాలు కథల్లోకి రచయితల దృష్టికోణం నుండీ తీసుకురాబడినాయి. అయితే అదంతా ప్రపంచీకరణ ను పనిగట్టుకొని చేసింది కాదు,చేస్తున్నదీ కాదు. ఆయా ప్రభావాలు సమాజంలోకి యింకిపోయి వున్నాయి కాబట్టి అంత సాధారణంగా వచ్చాయి. రాయలసీమలో జరిగే వలసలమీద అనేక కథలొచ్చాయి . ఈ వలస అనేది రాయలసీమ గ్రామాల మీద ప్రపంచీకరణ దుష్ప్రభావమే అయినా రచయిత ఆ యెరుక లేకుండానే కథను మలచివుంటాడు. అలాగే అన్నంగుడ్డ (దేవేంద్రాచారి) లాంటి కథల్లో కులవృత్తి కూడుబెట్టనితనం కథగా మారినప్పుడు రచయిత నేరుగా ప్రపంచీకరణ గురించి యేమీ చెప్పనవసరం లేదు. అయితే కొందరు రాయలసీమ రచయితలు ప్రపంచీకరణ ను ఆర్థిక రాజకీయ విషయం గా అర్థం చేసుకొని తమ పరిశీలనలను సామాజిక సాంస్కృతిక యితివృత్తాలుగా మార్చుకొని కథలుగా చెప్పారు. అలాంటి స్పృహ తో రాసిన కథలు కొన్నింటిని వివరించే ప్రయత్నం యిది.
ప్రకృతి మీద ఆధారపడి సంప్రదాయంగా జరిగే వుత్పత్తికి భారతీయ వ్యవసాయం వుదాహరణగా నిలుస్తుంది. హరితవిప్లవాల వల్ల వ్యవసాయ వుత్పత్తి యిబ్బడిముమ్మడిగా పెరిగింది నిజమే గానీ,అది వ్యవసాయ పెట్టుబడిని విపరీతంగా పెంచింది. మరోవైపు ప్రపంచబ్యాంకు ఆదేశాలతో ప్రభుత్వాలు వ్యవసాయం పై యిచ్చే అంతోయింతో రాయితీలు ఆగిపోయాయి. రైతులు పంటలపై పెట్టుబడులు పెట్టలేక ,చేతికి వచ్చిన పంటకు సరైన గిట్టుబాటు ధర నిచ్చే మార్కెట్లు లేక, అప్పులు పెరిగి దిక్కుతోచక ఆత్మహత్యలపాలయ్యారు. భారతదేశంలో జరిగిన రైతు ఆత్మహత్యలన్నీ ప్రపంచీకరణ నేపథ్యంలో జరిగినవే. ఈ విషయాలను ప్రతిఫలిస్తూ తెలుగు లో అనేక కథలొచ్చాయి. అన్నింటిలో రాయలసీమ రచయితలు రాసిన తెల్లదయ్యం (స్వామి)నిశ్శబ్ధ విప్లవం (జి.ఉమామహేశ్వర్)కథలు యెంతో చర్చను రేకెత్తించాయి. విశిష్టకథలుగానూ నిలిచాయి.
తెల్లదయ్యం కథ శిల్పపరంగా వైవిధ్యం వున్న కథ. మాజిక్ రియలిజం శిల్పంతో యీకథ ప్రపంచీకరణ ప్రభావం వ్యవసాయంపై , మరీ ముఖ్యంగా పల్లెలను యెట్లా పట్టిపీడిస్తోందో వివరిస్తుంది. రచయితకు ప్రపంచీకరణ పట్ల యెరుక వున్నందువల్ల ,ఆ కథ పేరులోనే పాశ్చాత్య తత్వాన్ని సంకేతించాడు. ప్రపంచీకరణ పాశ్చాత్య భావజాలపు ఫలం కాబట్టి దాన్ని తెల్లదయ్యం అన్నాడు. తెల్లవాళ్ళ ఆత్మ అయిన ఆ దుష్ట శక్తి మన గ్రామాలపైబడి కొందరిని లొంగదీసుకొని తన దళారులుగా మలచుకొని చేస్తున్న విధ్వంసాన్ని కథగా మలిచాడు. అలాగే నిశ్శబ్ధ విప్లవం కథలో ,ప్రపంచీకరణ వల్ల అనేక గ్లోబల్ కంపెనీలు దేశంలోకి వచ్చి కొందరు విద్యావంతులను అధిక జీతాలతో సంపన్నులను చేస్తుంటే,రైతులకు మాత్రం జీవిక లేకుండా చేస్తున్న విషయాన్ని గమనించిన ఒక యువ రైతు ఆక్రోశంతో కంప్యూటర్లు  పగలగొడతాడు. కొత్తగా వచ్చిన ఒక ఆర్థికభావజాలం, సాంకేతికంగా కొందరికి మెరుగైన జీవితాన్ని యెరగా వేసి, మెజారిటీ ప్రజలున్న గ్రామాల్ని నాశనంచేస్తోందనీ దాన్ని అడ్డుకునేందుకు నిశ్శబ్ధ విప్లవం రావాలనీ కథకుడు వ్యక్తపరిచారు. కంప్యూటర్ను బద్దలుకొట్టడం ఒక నెగెటివ్ ధోరణి గా కన్పించినా, జీవితాలను దారుణంగా ప్రభావితం చేసిన యాంత్రీకరణ మీద కడుపుమండినవాళ్ళ నిరసన యిలాగే చూపడం ప్రారంభకథల్లో జరిగింది.
ప్రపంచీకరణ సుఖాలు మన సమాజంలో వ్యక్తమైన తీరును కన్సూమరిజంగా పేర్కొంటారు. సాహిత్యంలో కన్సూమరిజం ఒక నెగెటివ్ ధోరణిగా చిత్రింబడింది. మూడవ ప్రపంచదేశాల్లో విస్తృతమైన మార్కెట్లను పెట్టుబడితోనూ వస్తువులతోనూ నింపేయడానికి, అదికూడా స్వేచ్ఛ గా యే నియంత్రణలు లేకుండా నింపెయ్యడానికి ప్రపంచీకరణ వల్ల పాశ్చాత్య దేశాలకు గొప్ప అవకాశం దొరికింది.వస్తువుల్ని కొనే సంస్కృతి పెంచిపోషింపబడటానికి వ్యక్తివాదపు ధోరణులను ప్రభుత్వాల సాయంతో ప్రచారాల ద్వారా చేయడం జరిగింది.ప్రచారమాధ్యమాల ద్వారా ప్రసారమవుతున్న అడ్వర్టైజ్ మెంట్లు వస్తువులను కొనే మనుషుల్ని తయారుచేయడం చూస్తూనే వున్నాం. పెరిగిపోయిన వస్తువినిమయత్వం మీద తెలుగు లో యెన్నో కథలొచ్చాయి.
ప్రపంచీకరణ వల్ల నీరు లాంటి నిత్యావసరాలు , మార్కెట్ వస్తువులయితాయనీ,వాటి చుట్టూ ఘర్షణలు జరుగుతాయనీ వూహించి, భవిష్యత్తు కథగా ,వాటర్ అనే కథను రాయలసీమ రచయిత జి.ఉమామహేశ్వర్ రాసాడు. మనం యీ రోజు చూస్తున్న వాటర్ బాటిల్స్ కల్చర్ ను చాలా ముందే వూహించి రాసిన కథ యిది. అలాగే వస్తువినిమయత యువతలో బలంగా పొడచూపి కొత్త కొత్త వస్తువులు వైపూ, నిరంతరం అనుభవించడమనే తనం వైపూ ,సులభ సుఖాలు వైపూ తోసి,కుటుంబాల్లో నలుగుడుకు కారణమవుతుందని చెప్పిన కథ అమూల్య (కె.సుభాషిణి). ప్రపంచీకరణ వస్తుతత్వాన్ని కుటుంబ నేపథ్యంలో చెప్పిన కథ.
భారతీయ సమాజంలో, మరీ ముఖ్యంగా తెలుగు సమాజంలో గత ఇరవ్వయ్యేళ్ళుగా మధ్యతరగతి ని నడిపిస్తున్న యేకైక విషయం,తమ పిల్లలను అమెరికా సంయుక్త రాష్ట్రాల కు పంపడమనే కల. ఆ కల యిక్కడి ప్రభుత్వాల ఓటు ప్రాధాన్యత గా మారి ,విద్యను ప్రైవేటీకరించాలనే వాళ్ళ ప్రాధాన్యతలో తమ లబ్ధీ కనిపించీ, యిక్కడి విద్యా విధానాన్నే మార్చివేసింది. ఎంసెట్ అనే ప్రక్రియ ద్వారా అనేక కార్పొరేట్ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీ లూ పుట్టగొడుగుల్లా మొలిచి ఇంజనీర్లను తయారు చేయడమే దేశాభివృద్ధి గా పెట్టుకున్నాయి. డాక్టర్లూ,ఇంజనీర్లూ కావడమే జీవిత లక్ష్యం గా తలిదండ్రులు భావిస్తుంటే ,ఆ వొత్తిడి తట్టుకోలేక అనేకమంది విద్యార్థులు ఆత్మహత్యల పాలవుతున్నారు. రాయలసీమ రచయిత్రి కె.సుభాషిణి రాసిన ,చిదిమేచదువులు, ఏనుగు అడవిలోకే పారిపోతుంది, లాంటివి తలిదండ్రుల వేదననూ,పిల్లల స్వేఛ్ఛా ప్రియత్వాన్నీ చిత్రిచాయి. రాయలసీమ నుండీ ప్రతిభాసంపన్నమైన కథలు రాస్తున్న హరికిషన్, ఒక చల్లని మేఘం, కథలో కార్పొరేట్ కాలేజీల్లోని
హింసనూ ,ఆత్మహత్యల వైపు పురిగొల్పుతున్న పరిస్థితులనూ ఆర్ద్రంగా చిత్రించాడు. ఇటీవలి కాలంలో కథలు రాస్తున్న రాయలసీమ రచయిత్రి కళ్యాణదుర్గం స్వర్ణలత బోగన్ విలియా అనే కథలో కార్పొరేట్ కాలేజీల్లోని వొత్తిడి గురించి వివరించారు.
ప్రపంచీకరణ వల్ల భారత్ లాంటి దేశాల్లో చౌక కూలీలు , అందులోనూ సాంకేతిక పరిజ్ఞానం గల కూలీలు దొరకడం వల్ల పాశ్చాత్యుల దైనందిన అవసరాలు ఆన్ లైన్లో తీర్చడానికి , కాల్ సెంటర్లనేవి పుట్టుకొచ్చాయి. వాటిలో రాత్రీపగలూ తేడాలేకుండా పనిగంటలు. వాటిల్లో పనిచేసే అమ్మాయిలు యెదుర్కొనే యిబ్బందుల గురించి  తెలుగు లో చాలా కథలొచ్చాయి.ఈ విషయం మీద,కె.సుభాషిణి,దీపం పురుగులు అనేకథ రాసింది. ఈ కార్పొరేట్ సంస్థల లో ఎనిమిది గంటల పని అనే కార్మికులు హక్కు రద్దైన స్థితిని కూడా సుభాషిణి తన కథలో (ఒకటి ఇంటూ రెండు ఈజ్ ఈక్వల్ టు నాలుగు) తెలియజేస్తుంది.
ప్రపంచీకరణ వల్ల విదేశీ పెట్టుబడులు, దేశీయ వనరులను దోచుకోవడానికి యధేచ్ఛగా యే మూలకైనా వెళ్ళడానికి మౌలిక సౌకర్యాలు అవసరమవుతాయి. వాటిని కల్పించడానికి నిరుపేదలనూ ,బలహీనులనూ నిరాశ్రయుల్ని చేస్తారు. యిదంతా ప్రభుత్వాల ఆధ్వర్యంలో నే జరుగుతుంది. ఈ విషయం మీద జి.వెంకటకృష్ణ దారి కాచిన దృశ్యం అనే కథ రాసాడు. పాణి రాసిన కార్పొరేటమ్మ-రాజకుమారుడు,అనే కథ వనరుల విధ్వంసం లో అనేక కోణాలను శిల్ప నైపుణ్యంతో వెల్లడించిన కథ.
ప్రపంచీకరణపు రాజకీయ తాత్వికత యెక్కడుంటుందంటే, అది తన చర్యలను దేశాల సరిహద్దులను చెరిపి నిర్వహించుకోవడం లో వుంటుంది. దేశాల సార్వభౌమాధికారం అనేది ప్రపంచీకరణ తో ప్రశ్నార్థకంగా మారుతుంది.పౌరులలోని దేశభక్తి పలుచనయి కార్పొరేట్ భక్తిగా మారుతుంది.ఇలాంటి,అరుదైన, సున్నితమైన,తీక్షణమైన అంశాన్ని గూడా తెలుగు కథకులు, మరీ ముఖ్యంగా రాయలసీమ కథకులు పట్టుకున్నారు.
జి.ఉమామహేశ్వర్ రాసిన,’నేను నా దేశమును…..’అనే కథ ఆ కోవకు చెందినదే.
ప్రపంచీకరణ వల్ల వెల్లువలా పుట్టిన కార్పొరేట్ సంస్థలు సమాజాన్ని యెన్నో రూపాల్లో విధ్వంసం చేస్తూ,పాప పరిహారంగా ఆయా సమాజాలపట్ల
దాతృత్వం తో వ్యవహరించడం, సాంఘిక సేవాకార్యక్రమాలు చేయడం మనం చూస్తూంటాం. దాన్ని, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ గా కీర్తిస్తుంటాము.
ఈ విషయం మీద కూడా జి.ఉమామహేశ్వర్ ,వృక్షోపాఖ్యానం అనే కథ ను రాసాడు.
ప్రపంచీకరణ భారతీయ సమాజంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా నూ సానుకూలంగా, విధ్వంసంగానూ పనిచేస్తోంది. భారతదేశంలోనే అత్యంత వెనుకబడిన ప్రాంతమైన రాయలసీమ లో కూడా దాని ప్రతిఫలనాలు కన్పించేంతగా ప్రపంచీకరణ పనిచేస్తోంది. అందుకు వుదాహరణగా పైన పేర్కొన్న కథలు నిలుస్తున్నాయి. పాఠకుల హృదయాల్లో సమాజ అవసరాల మేరకు చర్యలకు అవి ప్రేరేపిస్తాయి.
                                                                 ***

One thought on “రాయలసీమ కథల్లో ప్రపంచీకరణ

  1. చాలా కథలని పరిచయం చేసారు . కొన్ని కథలు చదవలేదు వెంకట కృష్ణ గారూ ..
    మంచి పరిచయ వ్యాసం . ధన్యవాదాలు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


   Type Comments in Indian languages (Press Ctrl+g to toggle between English and Hindi OR just Click on the letter)