Featured కితాబ్

రాయలసీమ చరిత్ర ను చిత్రించిన శప్తభూమి

 

                                                                                                                              – జి.వెంకటకృష్ణ
ఇటీవల తానా బహుమతి అందుకున్న బండి నారాయణస్వామి గారి నవల శప్తభూమి.  18వ శతాబ్దం నాటి రాయలసీమ ను చిత్రించిన నవల శప్తభూమి. వర్తమాన రాయలసీమ ను అర్థం చేసుకోవడానికి అవసరమైన సామాజిక ఆర్ధిక రాజకీయ సాంస్కృతిక అంశాలన్నీ ఇందులో వివరించారు స్వామి.   ఏ పాళెగాళ్ళ వ్యవస్థ రాయలసీమ ను పట్టిపీడించిందో దాని మూలాలు 18వ శతాబ్దం నాటి రాయలసీమ చరిత్ర లో వున్నందున , వర్తమాన రాయలసీమ ను అర్థం చేసుకోవడానికి యీ నవల యెంతో వుపయోగపడుతుంది.  ఈ నవల కథా స్థలం అనంతపురం పట్టణమే అయినా అప్పటి కాలమాన పరిస్థితుల్లో రాయలసీమ అంతటా అవే పరిస్థితులు రాజ్యమేలివుండడం వల్ల ,ఒక పాళె గాని యితివృత్తంలో రాయలసీమ ను అర్థం చేయించే అన్ని అంశాలూ వొదిగి వున్నవనీ తెలుస్తుంది.
విజయనగర సామ్రాజ్య పతనం తర్వాత తళ్ళికోట యుద్ధం లో అళియ రామ రాయల మరణం తర్వాత సదాశివ రాయలు రాజధానిని చంద్రగిరి కి తరలించిన పరిస్థితుల్లో బళ్ళారి నుండి నందేల, అనంతపురం,ధర్మవరం,కొరగోడు,కణేకళ్ చుట్టుముట్టిన ప్రదేశం హండే వంశపు రాజుల చేత పరిపాలించిన బడింది.హండే హనుమప్ప నాయకుడు కురుబ సమూహానికి చెందిన వాడు.  ఆ వంశంలో చివరి నాయుడు హండే సిధ్ధరామప్పనాయుడు.  అతని యేలుబడిలో 1775 క్రీస్తుశకం నుండి 1788 దాకా జరిగిన పరిణామాలు యీ నవల యితివృత్తం.
 
  రచయిత నవలను శప్తభూమి గా పేర్కొనడంతోనే రాయలసీమ కఠిన వాస్తవాన్ని సూచించాడు.శప్తభూమి, అంటే శపించబడ్డ భూమి. శపించింది యెవరు, యెందుకు అనే ప్రశ్నలకు సమాధానం యీ నవల లో దొరుకుతాయి. ఇంతవరకూ యెక్కువ మంది నమ్ముతున్నది యీ నేల పకృతి శాపానికి గురైందని. ఈ నవల కూడా ఆ విషయం ను దృవపరుస్తూనే , అనేక యితర కోణాలను మన ముందుకు తెస్తుంది. కరువు చేత శపించబడుతున్న యీ నేలన కరువును జయించే దయాహృదయాలు కూడా కరువే ననీ యీ నవల చిత్రిస్తుంది. సాటివాడి పట్లా,సాటి కులం వాడి పట్ల,సాటి గ్రామం పట్లా ,నేల పట్లా యిసుమంతైనా దయాదాక్షిణ్యం,కరుణ, బాధ్యత,ప్రేమ లేనితనమనే శాపానికి యీ నేల గురైందని అర్థం అవుతుంది.
ఈ నవలా కాలంలో, అనంతపురం ను హండే సిధ్ధరామప్పనాయుడు పరిపాలిస్తున్న పెట్టుడు,అతని ఏలుబడిలో కొందరు అమరనాయకులూ, బ్రాహ్మణ అగ్రహారికులూ స్వతంత్ర గ్రామాలను పరిపాలిస్తూ సుంకాలను వసూలు చేసుకుంటూ,అవసరమైనప్పుడు హండే రాజుకు ఆర్థిక ,సైనిక సహాయాలు చేస్తుంటారు.అట్లాంటి వారిలో,చేనుమాన్యం కొత్తపల్లి కి పెమ్మసాని తిమ్మప్ప నాయుడు , ఎర్రకొండాపురం కు వీరనారాయణరెడ్డి,రాయలచెరువు కు సాకే చిత్రలింగడు (యితను బోయ వీరుడు)చెర్లోపల్లికి ఎల్లప్ప జెట్టి(యితను కురుబ వీరుడు)అమరనాయకులు.
అగ్రహారమనే గ్రామానికి దేవారపు నాగప్ప ప్రెగడా అధిపతి. ఈ పాత్రలు కొన్ని చారిత్రక మైనవి. మరి కొన్ని చారిత్రక సంఘటనల నుండి రూపుదిద్దుకున్న పాత్రలు. ఈ పాత్రల అంతస్సఘర్షణా ,కలహాలూ ,పరస్పర దోపిడీ లూ,ఆయా గ్రామాల్లో వీళ్ళు చేసే దౌష్ఠ్యాలూ యీ నవలను నడిపిస్తాయి.  ఈ నవలంతా సామాన్య ప్రజలను పకృతి కరువుకాటకాలు తో పీడించినట్లే వీళ్ళు వీళ్ళ దౌర్జన్యంతోనూ పీడిస్తారు. హండే రాజు బలహీనుడు కావడం,అతడు కూడా మైసూర్ హైదరాలీకీ,మరాఠాలకూ కప్పం కట్టాల్సివుండడమూ వల్ల ధనం కోసం హండేరాజు యీ స్థానిక నాయకులు మీద ఆధారపడి వుండడం వల్ల,వీళ్ళు ఆయా గ్రామాల్లో ఆడింది ఆటగా పాడింది పాటగా వుంటుంది.
ప్రజలు అనేక రకాల పన్నులు,ఇల్లరి,పుల్లరి,మగ్గరి,గానుగరి,ఈడిగ సిధ్ధాయం,పంటపన్ను(మెట్ట పంట మీద మూడింట ఒక భాగం,మాగాణి పంట మీద మూడింట రెండు భాగాలు)పెండ్లిపన్ను,సంత సుంకం,లంజ కట్నం మొదలైనవాటిని కట్టాల్సివున్నింది. వీటికి తోడు అప్పుడప్పుడూ గ్రామాల మీద పడి దొంగలూ దొరలూ దోచుకోవడమూ వుండేది. ఈ నవలంతా ప్రజలు అనుభవించే యెన్నో హింసలను వివరించడం ద్వారా ప్రజల స్వభావంలో యింకిపోయిన హింసాస్వభావాన్ని రూపుకట్టిస్తాడు రచయిత.
పదమూడు సంవత్సరాల కథా కాలంలో రెండు భయంకరమైన కరువులు చిత్రితమైవున్నాయి. మూడు సంవత్సరాలు వరుసగా వానలు రాక పంటలు పండక ప్రజలు వలసదారి పెట్టడం కరువనుకుంటే అలాంటి స్థితి పద్మూడేళ్ళలో రెండు సార్లు. ఎంతటి కరువంటే తిండి కోసం పసిపిల్లలను అమ్ముకొనేంత కరువు.  ఇంతటి కరువులోనూ యెంతో సంపద కలిగిన కుటుంబాలు ప్రస్థావనా యీ నవలలో వుంది. బయ్యన్నగారి అనంతయ్య శెట్టి యెంతటి ధనవంతుడంటే ,హండేరాజుకే అప్పు యిచ్చేంతటి ధనవంతుడు. ఒక్కోసారి రాజును పగతో తొలగించి కొత్త రాజును గద్దెనెక్కించేంత ప్రబలవంతుడు.
కరువును మించి యీ నవల, యీ నేల మీద మనుషులు అనుభవించిన దుఖ్ఖానికి వేరే కారణం వుందనీ,అది మానవదౌష్ఠ్యం అనీ చెబుతుంది.  మానవ ద్వేషం, ఆధిపత్యం,విలువల పతనం,ఇవన్నింటినీ గర్భీకరించుకున్న అరాచకం రాజ్యమేలింది యీ నేల మీద. ఇది అసలైన శాపమనీ అందుకిది శప్తభూమి గా మారిందంటుంది యీ నవల.
చారిత్రక నవల అన్నప్పుడు, రాయలసీమ ను పాలించిన పాళెగాళ్ళ ,అతడి అనుచరులు నడిపించిన ఘటనలే ప్రధానంగా వచ్చినా,ఆయా ఘటనల్లో అనివార్యంగా కన్పించే ప్రజలూ,యీ నవలలో ప్రధాన భూమిక పోషించారు. రచయితకున్న దృక్పధం కూడా యిందుకు దోహదం చేసింది. ఈ నవల కథాక్రమంలో సామాజికంగా వెనుక బడిన సమూహాల నుండి కొందరు వ్యక్తిగత ప్రతిభతో యెదగడం కన్పిస్తుంది. ఆ కాలం వీరత్వానికి పట్టంగట్టే కాలం కావడం,అనేక ఆటవిక తెగలు వాటి వీరత్వం వల్ల ప్రధాన సామాజిక రంగం మీదకు ప్రవేశం పొందుతున్న కాలం. సైనికులుగా మారుతున్న కాలం.
ఎల్లప్ప  గొర్రెలు,మేకలూ కాచుకునే యువకుడు.ఒక రాత్రి అనంతపురం చెరువుకట్టను తెగ్గొట్టి అనంతపురం ను ధ్వంసం చేయాలని కుట్ర పన్నిన తాడిమర్రు సంస్థానం వీరులను యీ ఎల్లప్ప సాహసంతో యెదుర్కొంటాడు,వాళ్ళ పన్నాగాన్ని భగ్నం చేసి హండే సిధ్ధరామప్ప నాయుడి మెప్పుపొంది,కోటలో జెట్టి(సైనికుడు)గా, ఆతరువాత ఒక పెద్ద గ్రామానికి అమరనాయకుడుగా యెదుగుతాడు.  కురబ సామాజిక సమూహం దయనీయమైన పేదరికం లో వున్నా,యిదే సమూహం నుండి కొందరు పరిపాలకులు గా యెదగడమూ నవలలో కన్పిస్తుంది. అలాగే,బోయ సమూహం నుండీ కూడా రాయలచెరువు ప్రాంతంలో సాకే చిత్రలింగడూ,అతని కుమార్తె హరియక్క అమరనాయకులుగా వున్నారు తండ్రీకూతళ్ళిద్దరూ పెమ్మసాని తిమ్మప్ప నాయుడిని యెదురించి పోరాడిన వాళ్ళు. హరిరక్క యీ నవలలో గొప్ప యోధురాలు,ఆమె ద్వంద్వ యుధ్ధంలో తిమ్మప్ప నాయుడిని సంహరించి రణంకూడు కుడుస్తుంది. ఆ కాలంలో బోయ వీరులు రాయలసీమలో పాలెగాళ్లు గా వున్నట్టు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ఈ రెండు సమూహాలూ సైనికులుగా మధ్యయుగ చరిత్ర లో కన్పిస్తారు.
ఈ నవలలో కురబ ఎల్లప్ప జెట్టి జీవితం నవల ఆద్యంతమూ కన్పిస్తుంది.నిజానికి అతడే యీ నవల ప్రధాన పాత్ర. ఇమ్ముడమ్మ తో అతని ఏకపక్ష ప్రేమా,ఆమె ప్రేమించిన కోడె నీలడుతో అతని స్పర్ధా,వైరమూ వివరించబడింది . అతడి దేహత్యాగం తో నవల ముగుస్తుంది.గొళ్ళ,కురుబ,బోయ సమూహాల కు అవకాశమున్న (అంతోయింతో) సామాజిక ఊర్ధ్వ చలనం,మాల మాదిగలకు లేకపోవడం కూడా యీ నవలలో కన్పిస్తుంది.మాదిగ కంబళిశరభుడికి యెంతో బలమున్నా అతనికి గుర్తింపే లేకుండా అణచివేయబడతాడు. ఆటవిక వీరత్వాన్ని వుపయోగించుకొనేవాళ్ళే,ఆ వీరత్వాలకు అంతోయింతో గుర్తింపు యివ్వాల్సివస్తున్నప్పుడు మిన్నకుండేవాళ్ళే, అంతర్గతంగా వాళ్ళ వాళ్ళ సమూహాలలోని బలహీనులని ముఖ్యంగా స్త్రీలను నిర్ధాక్షిణ్యంగా అణిచివేయడం కన్పిస్తుంది. ఈ లక్షణం పై కులాలనుంచీ కింది దాకా వ్యాపించిన గుణం.
హండే రాజుల, వాళ్ళ అనుచరుల దౌష్ఠ్యాలు చారిత్రకంగా యీ నేలకు యిచ్చిన హింసా వారసత్వం యీ నవల చిత్రిస్తుంది.హింసా ప్రవృత్తి కి వున్న చారిత్రక మూలాలూ,హింసా ప్రవృత్తి కీ వెనుకబాటుతనానికున్న సంబంధం కూడా యీ నవల అందిస్తుంది. రాచకుటుంబాల మధ్యా అధికారం కోసం,సంపదకోసం,ఒకరి గొంతు లోకరు కోసుకోవడం, రాజకీయ శాపంగా మారింది.
అనంతపురం దొరైన సిధ్ధరామప్పనాయుడికి, బళ్ళారి ని పాలించే పెద్ద సిధ్ధరామప్పనాయుడు స్వయానా అన్నవరుసే అయినా, ఈర్ష్యా అసూయలు ద్వేషాలు వాళ్ళని స్థిమితంగా వుంచవు. అలాగే అనంతపురం నాయుడికి తాడిమర్రు నాయుడు సోదరుడే అయినా యుధ్ధాలు జరుగుతూనే వుంటాయి. అనంతపురం చెరువు నిండి పంటలు పండడం నచ్చని తాడిమర్రు వాళ్ళు అనంతపురం చెరువు గట్టు తెంపాలని చూడటం యీర్ష్య వల్లనే.ఈ ఈర్ష్యా ద్వేషాలు వాళ్ళ అనుచరుల్లో నూ పొంగిపొర్లుతూ రాజ్యం నిత్యం యెన్నో కుట్రలు కుతంత్రాలకు లోనవుతూవుంటుంది.ఈ స్థితి ప్రజాజీవితాన్ని ప్రభావితం చేస్తుంది. చారిత్రికంగా ఆ స్థితి కొనసాగింది కూడా.
ఈ నవలలో ప్రజలు యెన్నో దురదృష్టాలకు గురవుతారు. యెంత దురదృష్టం అంటే,కరువుకు పసిబిడ్డను అమ్ముకునేంత. యెంత దురదృష్టం అంటే తండ్రి చేసిన పని తప్పుగా పంచాయతీ తీర్పుతో నిర్ణయించి,అతడి బిడ్డను బసివిని చేసేంత. యెప్పుడో పెద్దలు చేసిన ఒక పనికి వాళ్ళ తరతరాల వాళ్ళూ (పెళ్ళైన జంటలు ) గుండ్లుకొట్టించుకొని సున్నంబొట్లు పెట్టుకోవాల్సి రావడం. మాదిగగా పుట్టినందుకు ఎంతో బలాఢ్యుడై,పాళెగాడి కొడుకు యెత్తలేకపోయిన బరువును యెత్తినందుకు, దాన్ని గుర్తించకుండా వూరికోట దాటి వచ్చాడనే నెపంతో మండలంనుండీ సమూహం నుండీ బహిష్కరణ పొందేంత. అందమైన ఆడదానిగా పుట్టి పాళెగాడి కళ్ళల్లో పడినందుకు శీలంపోగొట్టుకొనేంత,ప్రాణం పోగొట్టుకొనేంత.
యెన్నో దుర్మార్గాలు యీ నవలలో ఆస్తి కోసం, ఆధిపత్యం కోసం అన్నదమ్ముల గొంతు కోయడం. ఆస్తికోసం, ఆధిపత్యం కోసం బిడ్డలనూ కోడళ్ళు నూ సతిలో దహనం చేసేయడం. ఆధిపత్యం కోసం గ్రామాల మీద పడి దోచుకోవడం.
ఇన్ని దురదృష్టాలూ, దుర్మార్గాలు వున్నా, సమాజంలో త్యాగాలూ వున్నాయి. నచ్చినవాళ్ళ కోసం,యజమానికి కృతజ్ఞత చూపించాలని అనిపించినప్పుడు యెంతటి త్యాగమైనా,చివరకు బలిదానమైనా యిచ్చేంత ఆటవిక తనమూ కన్పిస్తుంది.భర్తగా యెంచుకున్న కోడెనీలుడి కోసం సిడిమాను యెక్కి కొక్కానికి శరీరాన్ని వేలాడదీసుకునే హరిరక్క గొప్ప వీరత్వాన్ని ప్రదర్శిస్తుంది. గాలిదేవర ఫలితం తన గ్రామానికి యెత్తుకుపోవడానికి ప్రాణాలు పణంగా పెట్టే కోడెనీలడు,చివరకు ప్రాణం వదులుతాడు.
దేవదాసి గా హండే రాజుల కు శీలాన్ని అర్పించిన పద్మసాని తన సంపదనంతా ఖర్చు చేసి తన తల్లి పేరు తో జక్కుల చెరువు తవ్వించి ఒక గ్రామాన్ని నిలుపుతుంది. ఎల్లప్ప జెట్టి తన ప్రభువు కోసం,అతని రాచరికం నిలవడం కోసం (వానలు పడి పంటలు పండి ప్రజలనుండీ సుంకం వసూలై,గుత్తి సుబేదారుకు కప్పం చెల్లిస్తేనే రాజ్యం నిలబడుతుందనే హెచ్చరికలు నేపథ్యంలో)వానలు పడాలనే కోర్కె తో శ్రీశైలం పాదయాత్ర చేసి,వీరమండపం యెక్కి, దేహంలోని ఒక్కో అంగాన్ని ఖండించుకుంటూ,ఒక్క వానకోసం దేహత్యాగం చేస్తాడు.
ఇన్ని,శాపగ్రస్త జీవితాల చిత్రణగా నిలిచిన యీ నవలలో, శాంతి ని కల్గించే, మార్గం, జనసామాన్యం కు విముక్తి మార్గం యేదీ రచయిత సూచించలేదా, అంటే, రచయిత ప్రాపంచిక దృక్పథం మేరకు తనదైనశైలిలో తాత్వికత ను ప్రతిపాదించాడు. అది తిక్కస్వామి చెప్పే, ‘రెండు లేవు వున్నది ఒకటే’,అనేది.ఇన్ని దుర్మార్గాల పాలుబడ్డ నేలమీద మానవుడు అనుభవించే, సుఖం-దుఖ్ఖం,కలిమి-లేమి,చెడు-మంచి, లాంటి ద్వంద్వాలు కేవలం అనుభవాలు మాత్రమే ననీ , శరీరానికి చెందినవి మాత్రమే ననీ,”ఆత్మ”అనేదాన్ని అంటవనీ , దుఃఖం లో సంతోషాన్ని,కష్టంలో సుఖాన్ని,చెడులో మంచినీ సాధన చేయాలనే అద్వైతాన్ని చెబుతాడు.  ఈ తిక్క స్వామి కాలికి పెద్ద కురుపు అయివుండి, అందులో పురుగులు పడి శరీరాన్ని తినేస్తుంటాయి, యెన్నో మహిమలు గల యీ స్వామి, కిందికి రాలిపోయిన  పురుగుల్ని తిరిగి కురుపు లోకే వేసుకుంటూ, పురుగులు కూడా బతకాల గదా,అనుకుంటుంటాడు.  హింసలో కూడా జీవితాన్ని చూడమనీ,శిథిలతలో పునర్నిర్మాణం చూడమనీ రచయిత చెబుతున్నట్లు ఉంటుంది.
శిథిలమూ,నిర్మాణమూ అనే రెండు లేవు వున్నది ఒకటే’ జీవిత నిర్మాణమన్నట్లు వుంటుంది. మొత్తానికి యిన్ని దుర్మార్గ, సామాజిక సాంస్కృతిక చలనాలు,దౌష్ఠ్యాల,పరాభవాల,స్వయంహననాల తర్వాత కూడా యీ నేల మీద మనుషులు యెలా బతుకుతున్నారనే ప్రశ్నకు ,యీ లాంటి తిక్కస్వాముల,నిర్వికల్ప సమాధి తనం యిచ్చిన శక్తియేదో జనాల్లో వుందని రచయిత సూచించివుండవచ్చు.  మనుషుల్లోని బండి బారిన తనం దాని ఫలితమేనని భౌతిక వాదులైన మేధావుల పరిగణించనూవచ్చు.
బుధ్ధి జీవులకు యీ నవలలో వెదికితే యింత ఆటవికతనాల,ఫ్యూడల్ దుర్నీతి లోనూ, ఆధునికత పొడసూపడానికి నెర్రులు చీల్చింది మాత్రం, ఇంగ్లీష్ విద్యా,క్రైస్తవ మత వ్యాప్తి కారణాలుగా కనిపిస్తున్నాయి. పద్మసాని-హండే సిధ్ధరామప్ప నాయుడులకు పుట్టిన మన్నారుస్వామి,తల్లి వృత్తి నీ అది చేసే అవమానాన్నీ భరించలేక పోతే,అసహనంతో ఆత్మన్యునతతో కృశించి పోతూంటే,పద్మసాని గర్తించి మద్రాసు పంపి, ఇంగ్లీష్ విద్యలోకి ప్రవేశపెడుతుంది. అతడు,చదివీ,క్రైస్తవం స్వీకరించి కంపెనీ వుద్యోగిగా మారుతాడు.18వ శతాబ్దపు శిథిలభావాల రాయలసీమ కు యిలాంటి వాళ్ళు కొంతైనా వెలుగు చూపివుండవచ్చు. అయితే, దీనికి సమాంతరంగా గురవడు లాంటి దళిత సన్యాసులు దళిత సమూహాలకు స్వయం సంస్కరణ దిశగా మార్గం వేసినట్లు,యీ నవలలో రచయిత సూచించడం కూడా కన్పిస్తుంది. పద్మసానీ,గురవడూ,చేసిన స్థానిక ప్రయత్నాలు రూపం లో యిది కన్పిస్తుంది.
శాపగ్రస్త భూమి కి విముక్తి యీలాంటి వారివళ్ళ సాధ్యమైనా,చరిత్రను ప్రజాచరిత్రగా మలిచే క్రమంలో మనకు కొన్ని సంకేతాలను వదిలినా,ఈ నవలా రచయిత వాస్తవితావాది.
రాయలసీమ భవిష్యత్తు శప్తభూమి గా మిగిలిపోవడానికీ, దాన్ని అంతోయింతో ఆపడానికి శక్తి కలిగినవారు నామ మాత్రంగా మిగిలిపోవడానికీ కారణమైన భౌతిక వాస్తవికతనే చిత్రించి,ముగించాడు. ఈ నవల చివరి యెనిమిది వాక్యాలూ,18వ శతాబ్దం ,రాయలసీమ భవితవ్యాన్ని యెలా నియంత్రించిందీ,యెలా మిగిల్చిందీ సూచించాయి. వదిలించుకున్న భూమిగా, రాయలసీమ యెలా మారిందో చెబుతాయి.ఈ నవల చివరి యెనిమిది వాక్యాలూ దుర్మార్గమైన వర్తమాన చరిత్ర ను సంకేతిస్తూ,ముగించాడు. రాయలసీమలో రెండు లేవు ఒకటే వుంది. మానవజీవిత ధ్వంసం మాత్రమే వుంది.పకృతీ, ఆధునిక పాలెగాళ్లు కలిసి రాయలసీమలో హింసను మాత్రమే రచించారనీ,శాపం ముగియలేదనీ ప్రకటించాడు.

2 thoughts on “రాయలసీమ చరిత్ర ను చిత్రించిన శప్తభూమి

  1. మైసూరు ప్రాంత్యంలో హైదర్ అలీ, టిప్పు సుల్తాన్ లు అక్కడి పాలెగాళ్ళ నడుం విరగ్గొట్టి, పన్నులు నేరుగా రాజుకు అందే వ్యవస్థను
    ఏర్పరచడంవల్ల ఆ ప్రాత్యంలో తెలుగునాట మన కంటికి రాచేంత హింస కనిపించదు అని సాకేత రాజన్ తన మేకింగ్ ఆఫ్ హిస్టరీ లో వివరిస్తాడు. అన్ని రాజకీయ హింసలనూ ప్రక్రుతి-అధికారస్థానాలు కలిసే నిర్మిస్తాయి. ఇందుకు లండన్ కుడా అపవాదం కాదు…

  2. శప్తభూమి ని మరి కొన్ని సార్లు చదివించే సమీక్ష ఇది .
    శప్తభూమి లో స్త్రీ పాత్రలన్నీ అచ్చెరువు చెందేలా ఉన్నాయండీ. స్వేచ్ఛ ని కాపాడుకోవడంలో, హృదయవైశాల్యంలో,ధిక్కారం ప్రదర్శించడంలో,త్యాగంలో అన్నీ .. నచ్చాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


   Type Comments in Indian languages (Press Ctrl+g to toggle between English and Hindi OR just Click on the letter)