షాయరీ

రొండు కయితలు

                                                                                                             -బా ల సు ధా క ర్   మౌ ళి
°°°
గుడ్డెవ్వ పాట
°
మా గుడ్డెవ్వ సేతిలోని
దీపం సెమ్మి ఆకాశం
యియ్యేళ పున్నమి సెంద్రుడు
ఇల్లంతా వెలుగులీనె దీపం ముద్ద
ఆలన లేని ఇల్లు
పిల్లాజెల్లా పిట్టాపిచ్చుక
వూరొదిలి
గుడ్డెవ్వ సెయ్యొదిలి
ఏ ఆకాశం వెలుతురుముక్క ఎనకో
బతుకును మూటగట్టుకుని
వొక పొద్దేళ దారి తీసేరు
గుడ్డెవ్వ నిజింగా గుడ్డిది కాదు
వొక్కోలూ దారితీసేక
గుడ్డిది కాకుండానూ పోదు
గుడ్డెవ్వ పాడుతది
పాట కాదది ఏడుపు
ఏడుపు కాదది పేగు గోస
ఏడ సత్తరో ఏడ బతుకుతరో
రే పగలూ
కళ్లని వొత్తుల్లా యెలిగించుకుని
పాడుతది
జీరజీరగా పాడుతది
ఎర్ర ఎర్రగా పాడుతది
పాటిని ఆలెలిపొచ్చీనట్టు పాడుతది
పాడుతది
పాడుతది
గుడ్డెవ్వ పాడుతది
గొంతారిపోనీ గూట్లో పిట్టెగిరిపోనీ
గూలు పుటుక్కు పుటుక్కుమని ఇరిగిపోనీ
గుడ్డెవ్వ
భూవుఁన్నంతవొరకూ పాడుతది
గుడ్డెవ్వ పాట
ఆకాశం వున్నంతవొరకూ
వినిపిత్తది
                                                                  ***
అచ్చియ్యి తాత
పైమీద తుండేసుకుని
కింద గాఁవంచ కట్టుకుని
బుజాల వొరకు జారిన కొప్పుని
ఎనక సిగగట్టుకుని
అడా అడా బయలెల్లుతండు అచ్చియ్యితాత
కండ్లల్ల మెసిలితండు
ఎఁవుకుల గూడుని వొళ్లంత సుట్టుకుండు
గంపడు సంసారాన్ని
అతగాడెన్నాళ్లనించి ఈదుతండో
వంగి వంగి వంగిన ఎన్నుముకనే
దాపుకర్రగా మలుసుకుని
బతుకు సెట్టెక్కుతండు
సెట్టు సిగుర్లేస్తది వొక పాల
ఏడో బుట్టి ఈడకొచ్చిన దెయ్యం గాలి ఇసిరికొడ్తే
వున్నసోట వొరుగుతది వొక పాల
తాత ఎవులనుకున్రు
అతగాని ముందు  నంగనాచి ఇరగబాటుతనాలు సెల్లవు
సెట్టు పూత రాల్తానే వుంటది
తాత కాపు కాస్తానే వుంటడు
బతుకుని నెట్టుకురావాలంటే
బతుకు మర్మం తెలిసిరావాలిరా అంటడు
కల్లంలో పేడకల్లెత్తి
మెరకల్లో గొడ్లు మేపి
ఏ సంజేళకో ఇంటి దారిబట్టె అచ్చియ్యితాతకి
అదో అదో అదో
సీతమ్మ తల్లి ఎదురొత్తంది
పొద్దుపోయి ఇంగో పొద్దు తీరవౌతుంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


   Type Comments in Indian languages (Press Ctrl+g to toggle between English and Hindi OR just Click on the letter)