Uncategorized

           సీమ బహుజన బతుకు పుస్తకం రాసాని సాహిత్యం

–జి. లక్ష్మీ నరసయ్య

 సామాజిక వాస్తవికతని సాంస్కృతిక కోణం నుంచి ఆవిష్కరించే అతి తక్కువ మంది తెలుగు సాహితీవేత్తలలో వి.ఆర్. రాసానిది అందెవేసిన చెయ్యి. బహుశా అన్ని సాహిత్య ప్రక్రియల్లో చెయ్యి తిరిగిన తక్కువమంది సృజనకారుల్లో కూడా ఈయనది ప్రత్యేక స్థానం. కవిత్వం, కథ, నవల, నాటకం ప్రక్రియల్ని తనదైన ముద్రతో సుసంపన్నం చేసాడీ మేటి రచయిత. వాస్తవికతను సాహిత్యంగా మలచటంలో వ్యక్తమైన ఈ రచయిత కథన నైపుణ్యం, వర్ణనా చాతుర్యం, వాతావరణ చిత్రణ, వస్తు నిర్వహణ, శైలీ విన్యాసం, ప్రాంతీయ భాషా సొబగుల నిర్మాణం. తనది మాత్రమె అయిన సొంత ముద్రను కలిగి ఉండడం ఈయనకు సంబంధించిన ఘనత. సిద్ధాంతాల్ని బట్టి జీవితాన్ని చూడడం కాక జీవిత దారినుంచి సిద్ధాంతాలను పరీక్షకు గురి చేయడం ఈయనకిష్టం. ఈ ధోరణి సృజనీకరణకు ఈయన మొదటి వాడూ చివరి వాడూ కానప్పటికీ ఒక మైలురాయి అనదగినవాడు.

 

స్వామీ అన్నట్లు “ప్రాదేశిక వాదమూ దళిత బహుజన వాదమూ రాయలసీమ నవలను గొప్పగా ప్రభావితం చేసిన రెండు ప్రత్యామ్నాయభావ జాలాలు”. నామిని, కేసవరెడ్డి, స్వామీ,సన్నపరెడ్డి, శాంతి నారాయణ, మధురాంతకం నరేంద్ర, దేవేంద్రాచారి, పలమనేరు బాలాజీ వేరంతా వీటిలో ఎదో ఒక వాదాన్ని కానీ రెండిటినీ కానీ నవలగా మలిచిన వాళ్ళు. ఈ రెండు వాదాల్నీ సాంఘిక, సాంస్కృతిక కోణాల నుంచి సృజనీకరించిన వాళ్ళు చిలుకూరి దేవపుత్ర, వి.ఆర్. రాసాని, పినాక పాణి, పిళ్ళైలు విప్లవోద్యమ దృక్పధం నుంచి వీటిని చిత్రించారు.

 

రాసాని సృష్టించిన రాయలసీమ దళిత బహుజన ప్రపంచం విస్తృతి లోతు ఎక్కువ. ఇందులో కనిపించే ఆర్ధిక రాజకీయ సాంస్కృతిక విశ్లేషణ అనితరసాధ్యం. చిత్తూరు జిల్లా పల్లెటూరి వాస్తవికత ఆధారంగా దళిత బహుజన వేదనని విశ్వజనీన స్థాయికి తీసుకెళ్ళాడు రాసాని. కింది కులాల ఐక్యత ప్రాతిపదికగా ఉద్యమాలు జరగాలనే సూచనను ఆయా పాత్రల కులాల మూలాలలోకి వెళ్లి వాటి సాంస్కృతిక స్వరూపాన్ని పాఠకుల అనుభవంలోకి తర్జుమా చేయడం ద్వారా వ్యక్తీకరిస్తాడు. భారతీయ సమాజంలో దోపిడీ పాత్రను పోషిస్తున్న కులాలేమిటో దోపిడీకి గురవుతున్న కులాలేమిటో కుండ బద్దలు కొట్టినట్టు స్పష్టం చేస్తాడు. ఈ అంతరాల కుల వ్యవస్తలో బతకడం అడుగుజనానికి ఎంత దయనీయంగా ఉంటుందో ఎన్ని బీభత్స అనుభవాలతో కూడుకుని ఉంటుందో అత్యంత కళాత్మకంగా చూపిస్తాడు. ఇంకా ముందుకెళ్ళి సమాజం అంతా పట్టించుకోని గిరిజన సంచార యాచక కులాల దైనందిన దయనీయతనీ, అనివార్యమయిన వారి అభద్రతనీ కదిలించే రీతిలో చిత్రిస్తాడు రచయిత.

తరతరాలుగా కులవృత్తులకు అంతగాతిత్న విలువలు బహుజనుల సంపాదనా స్థాయినీ నిర్ణయిస్తున్న వాస్తవాన్ని ‘చావుకూడు’ కథలో దృశ్యీకరిస్తాడు. శవాలకు అంత్యక్రియలు నిర్వర్తించే దాసప్ప కులస్థులు తమ వృత్తి ద్వారా ఎంత పేదరికంలో మగ్గాల్సి వస్తుందో , ఎంత మురికినీ మాలిన్యాన్ని మోయాల్సివస్తుందో చూపిస్తుందీ కథ. ‘సురసాగ్ర మధనం’ చాకలి కుల వాస్తవికతను పట్టిస్తుంది. హోమం, వీరజాతి, మిన్నేరు కథల్లో దళిత కులాల ప్రత్యేక చారిత్రక వారసత్వాన్ని, దళిత ఉపకులాల వృత్తి సంస్క్రతుల్నీ చూపించి పాఠకుల్ని అబ్బురపరుస్తాడు. మాదిగలకంటే తక్కువగా చూడబడుతున్న మొండోళ్ళ కుల వాస్తవికతను మిన్నేరు కథ ప్రవేశ పెడుతుంది. మాదిగలు తాకటానికి నిరాకరించే ఈ కులం సంస్కృతిని కళ్ళకు కడతాడు రచయిత. యానాదుల జీవితాన్ని ఇతివృత్తంగా తీసుకుని ‘వేట’, ‘ఎన్కౌంటర్’ కథలు రాశాడు. ‘వేట’లో యానాది వెంకట స్వామీ ఉడుతను పట్టే పద్ధతినీ ఇసుళ్ళు సేకరించే నేర్పరితనాన్నీ వర్ణిస్తాడు. అభివృద్ధి పేరుతో అగ్రకుల ప్రభుత్వం యానాదుల గుడిసెల్ని బుల్డోజర్లతో కూల్చడాన్ని చూపిస్తాడు.  ‘ఎన్కౌంటర్’ కథలో యానాది గంగజ్జు తన కులవృత్తి పనిముట్టుగా నాటు తుపాకీ కలిగి ఉన్నాడని ఊరి చౌదరి పోలీసులతో ఎన్కౌంటర్ చేయిస్తాడు. ‘కుబుసాలు’ కథ పాములోళ్ళ జీవితాన్ని దృశ్యమానం చేస్తుంది. ‘నల్లపూసలు’ కథలో పిల్లలు పుట్టని కారణంగా ముగ్గురు భర్తల చేత వదిలేయబడిన ఎరుకల నాంచారి పాత్ర ద్వారా ఎరుకుల వివాహ వ్యవస్తని పరిచయం చేసాడు. ఇంకాసుగా లీల గురించిన కథ ‘నేరం’.

 

ఇట్లా విస్తృతంగా పరుచుకున్న రాసాని సాహిత్య ప్రపంచాన్ని దృష్టిలో ఉంచుకున్నప్పుడే ‘వలస’ నవల ప్రత్యేకత అర్ధమయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు ‘వలస’ వైపుకొద్దాం. ‘వలస’ నవల కంటే ముందే రాసాని రాసిన ‘చీకటి రాజ్యం (౧౯౯౪), ‘ముద్ర’ (౨౦౧౨) నవలలు మంచి గుర్తింపు పొంది తెలుగు నెలలో రాసానికి ఎంతోమంది అభిమానుల్ని సంపాదించి పెట్టిన మాట నిజం. చిత్తూర్ జిల్లా పల్లె వాస్తవికతని కేంద్రంగా చేసుకుని రూపొందిన ఈ రచయిత కథలూ, నవలలూ కేవలం జీవిత చిత్రణతో ఆగకుండా ఒక ప్రత్యామ్నాయ ప్రపంచాన్ని నిర్మించుకోవాల్సిన అవసరాన్ని సూచిస్తాయి.

John Fowles   అన్నట్టు  “there are many reasons why novelists write, but they all have one thing in common- a need to create an alternative world”

పల్లెల్లో అగ్రకుల ఆధిపత్యంతో దోపిడితో తలపడడానికి దిగువ కులాల ఐక్యత ఎంత అనివార్యమో చూపించిన నవల ‘చీకటి రాజ్యం’. కుల వ్యవస్త దుర్మార్గమైన బసివిని వ్యవస్తను దళిత సమాజం మీద రుద్దిన కారణంగా ఎంత విషాద బీభత్సo దళిత జీవితాల్లో చోటు చేసుకుంటుందో చిత్రించిన నవల ‘ముద్ర’. కరువులూ, వలసలూ రాయలసీమ పేద బహుజన రైతు కుటుంబాల్ని మూలాలనుంచి పెళ్ళగించి అనాధత్వానికి గురి చేసిన తీరు ‘వలస’ నవలలో వ్యక్తమవుతుంది. ఇంతటి విశాల ఇతివృత్తాన్ని నడుపుతూనే కులం, మతం, ప్రాంతీయ తత్త్వం, స్వార్ధం, ఆధిపత్య భావం లాంటి వాస్తవాలు సంబంధింత సాంస్కృతిక వాతావరణం నుంచి చిత్రిస్తుంది ఈ నవల.

౧౯౬౨ నుంచి దరిదాపు ముప్పయి ముప్పై ఐదు సంవత్సరాల వ్యవధిలో జరిగిన కథ ‘వలస’. చిత్తూరుని ఆనుకొని ఉన్న పల్లెటూళ్ళలో కరువు కారణంగా చిద్రమయిన బహుజన రైతు కుటుంబాల గాధ ఈ నవల. కురవ కులానికి చెందిన బలభద్రి కరువు ధాటికి తాళలేక అప్పులు పాలై పొలం పుట్ర అమ్ముకుని భార్యాబిడ్డలనెంట పెట్టుకుని కర్ణాటక రాష్ట్రంలోని భద్రావతికి తనలాంటి కొంతమంది ఇతర రైతు కుటుంబాలతో కలిసి వలస వెళతాడు. దారిలో చచ్చీ చెడీ కష్ట సాధ్యమైన ప్రయాణంలో అడవులను ఆనుకునున్న గుడ్డ దనీర్లకెర చేరతారు. అక్కడ వానలకి నీటికి పచ్చదనైకి ఆశ్చర్యపోయి సంతోషంగా పొలాలను కవులకు చేసుకుంటూ ఉంటారు. గొల్ల దాసేగౌడ్ ఇంట్లో అద్దేకుంటూ అతన్తో స్నేహాని పెంచుకుంటాడు బలభద్రి. దాసే గౌడ్ సహకారంతో అడవిని నరికి ఒక ఎకరం పొలంకూడా సంపాదించుకుంటాడు.

బతుకు గాడిలో పడినట్టే అనుకుంటున్న సమయంతోనే అక్కడ జీవితం గడపడం అంత తేలిక కాదని అర్ధమవుతుంది. ఆ ప్రాంత భూస్వామి బసవరాయలు తమలోనే ఒకడిగా ఉంటున్న అగస్త్యులు కుమ్మక్కలు చేస్తున్న మోసాలవల్ల తిండికీ ఖర్చులకూ పోను పైసా కూడా మిగలని పరిస్థితి వలసదారులది. దీనికి తోడు స్థానిక ప్రజలతో వస్తున్నా కుల మత ఘర్షణలు. ప్రకృతి అనుకూలత ఎప్పుడు బడితే అప్పుడు ఊళ్లమీద పది బీభత్సాన్ని సృష్టించే ఏనుగులూ మేకల్ని దూడల్ని మిగే కొండచిలువలూ. ఒక గొడవ తరువాత ఒక గొడవ. విపత్తు వెంట విపత్తు. ఈ క్రమంలో తన ఇద్దరు కొడుకుల్ని మిత్రుడు దాసేగౌడనీ పోగొట్టుకుంటాడు బలభద్రి. ఇక అక్కడ ఉండలేక సొంతూరెల్లటానికి మొహం చెల్లక భార్యైద్దరు కూతుళ్ళతో పీలేరు చేరుకుంటాడు. పెద్దకూతురు జయమ్మను బావమరిది కిష్టప్పకిచ్చి పెళ్లి చేస్తాడు. అల్లుడి ప్రవర్తనా తిరుగుబోతుతనం, పనీ పటాలేని సోమరితనంతో కూతురుతో పాటూ తామూ తామూ క్షోభతో బ్రతుకుతుంటారు. అల్లుడితో రోజు కొట్లాటే. కిష్టప్ప కారణంగానే చిన్న కూతుర్నీ పోగొట్టుకుంటారు. ఉండటానికి ఇల్లులేక, ఆదరించేవాళ్ళూ లేక పెద్ద కూతురు వద్దంటున్నా వినకుండా తిరిగి తమ సొంతూరికి ప్రయాణమౌతారు వృద్ధ దంపతులు. క్లుప్తంగా ఇది కథ.

జి.కె.చెస్టర్ టన్ ప్రకారం “ A good novel tells us truth about its hero, but a bad novel tells us truth abouth its author”. ఈ దృష్టితో చూస్తే ఈ నవల మొదటి కోవకు చెందుతుంది. బలభద్రికి సంబంధించిన సత్యాన్ని కళాత్మకంగా ఏకరువు పెడుతుంది. అతని జీవన వాస్తవికత ఆధారంగా కరువు రక్కసి కోరల్లో చిక్కుకుని అతలాకుతలమయిన రైతు జీవన వాస్తవికతనీ, తద్వారా రాయసీమ వాస్తవికతనీ బయటపెడుతుంది. ఇందులోనే కుల, మత, వర్గ సమస్యలనీ ట్రీట్ చేస్తూ పోతుంది.

One thought on “           సీమ బహుజన బతుకు పుస్తకం రాసాని సాహిత్యం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


   Type Comments in Indian languages (Press Ctrl+g to toggle between English and Hindi OR just Click on the letter)