Featured ములాఖాత్

స్త్రీలు రాసేవన్నీ స్త్రీవాద రచనలు కావు……

ఇల్లలకగానే….అని అంటూనే గుర్తోచ్చే సత్యవతి గారు విలక్షణమైన కథకురాలు. మరీముఖ్యంగా పదునైన స్త్రీవాద రచయిత్రి. ఆరునవలలూ, అరవై దాకా కథలతో రాశిలో కంటే వాసిలో పేరెన్నికగన్న కథాశిల్పి. స్త్రీ వాద కథల్ని ఇంగ్లీషు లోకీ, యింగ్లీషు నుంచి యెంతో సాహిత్యాన్ని తెలుగు చేస్తున్న నాణ్యమైన అనువాదకురాలు. ముందు తరం రచయిత్రి గా యువరచయితలకూ/రచయిత్రులకూ స్ఫూర్తినిస్తూ మనసుకు వయసంటని సృజనకారిణి……..సత్యవతి గారితో రచయిత్రి ….కె. సుభాషిణి  అడుగు కోసం జరిపిన ప్రత్యేక  సంభాషణ.

1- నమస్కారం మేడమ్.  మీరు నవలను కాదని కథా ప్రక్రియనే ఎందుకు ఎంచుకున్నారు…?

మొదటి నుంచే కథే నాకు ఇష్టమైన ప్రక్రియ. నవలలైతే ఐదో నాలుగో వ్రాసాను . కానీ వాటి మీద బాగా శ్రద్ధ పెట్టి వ్రాయలేదనిపించింది. పైగా నేను నవలలు వ్రాసిన కాలం నవలాకాలం పాఠక రంజకంగా ఉత్కంఠ భరితంగా వ్రాయలేని కారణం కూడా ఒకటి . ఏమైనా కథే నా ప్రక్రియ అనుకున్నాను. నవల మీద దృష్టి పెట్టలేదు

 

2- రాజకీయ  ఆర్ధిక సామాజిక కోణాలలో జీవితాన్ని చిత్రంచదానికి నవలకే ఎక్కువ అవకాశం కదా?

అవును నవల కాన్వాస్ పెద్దదే వివిధ అంశాలను విశ్లేషించే అవకాశం ఎక్కువే కానీ అంత సమయమూ శ్రద్ధా అధ్యయనం లోపించిందని (నాకు) అనుకున్నాను, ఎప్పటికైనా నవల వ్రాయాలని వుండేది ,ఇప్పుడు లెదు.  వ్రాసే ఉద్దేశం లేదు.  నేను చెప్పాలనుకున్నది కథలో చెప్పగలిగితే చాలు అనుకుంటాను

 

3. అసలు సాహిత్యం లోకి ఎట్లా వచ్చారు ఏమిటి ఆ ప్రారంభ స్పూర్తి..?

చిన్నప్పటి నుంచీ పుస్తకాలు చదవడం అలవాటు  అమ్మ బాగా చదివేది .నాన్న కూడా చదివేవాడు.వార్తాపత్రికలూ వార మాస పత్రికలూ తెలుగువీ ఇంగ్లీష్ వి  కూడా కొన్ని కొనేవాళ్ళం చందమామ బాల సరే సరి.  కొన్ని  మావూరి లైబ్రరీ నుంచీ తెచ్చి చదువుకునే వాళ్ళం. అమ్మ విశ్వనాథ ,శరత్ అడవి బాపిరాజు నవలలు మాచేత లైబ్రరీ నుంచీ తెప్పించుకుని అవి పూర్తయ్యే వరకూ లాంతరు పెట్టుకుని చదివేది . అప్పుడు మాకు కరెంట్ లేదు.  నేను హైస్కూల్ పూర్తి చేసాకే కరెంట్ వచ్చింది. తరువాత కాలేజి చదువుకి హైదరాబాద్ వెళ్లాను మా మామయ్య ఇంట్లో వుండే దాన్నిఆయన ఇంగ్లీష్ అధ్యాపకుడు. సాహిత్య ప్రేమికుడు  వాళ్ళ ఇంట్లోనే నేను  మొదటి సారి మహా ప్రస్థానం, కృష్ణ పక్షం, త్వమేవాహం చదివాను. తరువాత మళ్ళీ చదివాననుకోండి.  అది వేరే సంగతి . మా చిన్న మామయ్య ఎంకి పాటలు పాడేవాడు .  అట్లా అమ్మ దగ్గర నుంచీ మేనమామల  దగ్గర్నుంచీ నాకు చదవడమూ సాహిత్యాన్ని ఇష్ట పడడమూ  వచ్చింది ,హైదరాబాద్ లో నా చదువు. మా మామయ్య సహవాసం నాకు  సాహిత్యాన్ని  ప్రేమించడం  నేర్పాయి. నేను చదివిన కోఠీ విమెన్స్ కాలేజీలో కూడా మంచి రీడింగ్ రూమ్ వుండేది. నేనూ నా స్నేహితురాలు జయలక్ష్మీ లంచ్ అవర్ లొ రోజూ అక్కడికి పోయేవాళ్ళం తెలుగు స్వతంత్ర దగ్గర్ణుంచీ  నేషనల్ జియోగ్రఫిక్  దాకా వుండేవి. అక్కడ  మొదట్లో    కీట్స్,  వర్డ్స్ వర్త్, విట్మన్  వీళ్ళందర్నీ మామయ్యే పరిచయం చేశాడు.  తరువాత ఆధునిక కవులను చదివాను.  నాకు సాహిత్యం పట్ల మక్కువ కలగడానికి దోహద పడ్డ వారిలో మాలతీ చందూర్ రెండో వారు . ఆవిడ పరిచయం చేసిన నవలలన్నీ తెచ్చుకు చదివేదాన్ని  . చేసే  ఉద్యోగానికి ఒక పదేళ్ళు కామా పెట్టి పిల్లల పెంపకంలో పడిపోయిన నాకు అక్షరాలతో సంబంధం తెగిపోకుండా ప్రపంచంతో సంబంధం తెగిపోకుండా కాపాడినవి పుస్తకాలే.  ముఖ్యంగా ఇంగ్లీష్ పుస్తకాలు.. మా మామయ్య ఇల్లు నాకు చాలా నేర్పింది.  సాహిత్యం పట్ల ప్రేమే కాదు స్త్రీ పురుష సంబంధాల గురించి కూడా.  ఆయన మా అత్తయ్యని ఒక స్నేహితురాలిలా చూసుకునేవాడు. ఒక మంచి ఇల్లు ఎలా వుంటుందో నేనక్కడ తెలుసుకున్నాను.  వ్యక్తిత్వ నిర్మాణ దశలో హైదరాబాద్ వంటి నగరంలోనూ మా మామయ్య దగ్గరా వుండడం నాకు చాలా గొప్ప  మేలు చేసింది.   తరువాత వ్రాయాలనే ఉత్సాహం  కలిగింది. ఇప్పటికైనా వ్రాయడం కన్నా చదవడమంటేనే మక్కువ .

 

4. మీ కథల్లో స్త్రీ వాదం ఎప్పటినించి  వచ్చింది?

స్త్రీ వాదం  ఎప్పటి నుంచీ వచ్చిందీ  అంటే కచ్చితంగా చెప్పలేను.  మొదటినుంచీ నాకు స్త్రీల పట్ల సహానుభూతి వుంది  నా చుట్టూ వున్న  నాకు తెలిసిన  మధ్య తరగతి స్త్రీల ఆర్ధిక స్వాతంత్ర లేమీ, నిర్ణయ స్వాతంత్ర లేమీ అధీనతా నన్ను కలవర పెట్టేవి. ముఖ్యంగా పెళ్లి విషయంలో మొత్తం తండ్రి పెత్తనమే వుండడం కనీసం తల్లికి కూడా మాట్లాడే వీలు లేకపోవడం,  కట్న కానుకలూ ఉద్యోగాలూ ఆస్తులూ చూసి తండ్రులే నిర్ణయాలు తీసుకోడం ఇవి నన్నెక్కువ బాధపెట్టేవి.  పితృస్వామ్య భావజాలం వంటి మాటలు తెలియవు.  అప్పటికి  కథలు వ్రాసే కొత్తలో మొదటినించీ పీడిత జన పక్షపాతం వుంది . అయితే స్త్రీ వాద సిద్దాంతాలు తెలియవు. నేను పుట్టి పెరిగిన ఇంట్లో ఆడపిల్లలకి అప్పట్లో వుండే ఆంక్షలు లేవు. నన్ను కాలేజీలో చదివించడం పెళ్లి విషయంలో స్వతంత్రం ఇవ్వడం మానాన్న చేసిన మంచి పనులు.  అప్పట్లో మా కుటుంబాలలో ఆడపిల్లలెవరూ కాలేజీకి పోలేదు. అయినప్పటికీ నాకొక్క దానికే ఈ సౌకర్యం ఉన్నందుకు సంతోషంగా వుండేది కాదు . అందరు ఆడవాళ్ళూ చదువుకోవాలనీ ఆర్థికంగా స్వతంత్రులై వుండాలనీ అనుకునేదాన్ని .  1980 ల తరువాతే నేను స్త్రీవాదాన్ని గురించిన పుస్తకాలు  ఆసక్తిగా చదివాను.  మాఘ సూర్య కాంతి , ఇల్లలకగానే… కథల నుంచీ  స్త్రీ కేంద్రకంగా వ్రాయడం మొదలై వుండొచ్చు. ఏది ఏమైనా వాదాన్ని చొప్పించడం కోసం వ్రాయలేదు. ప్రతి కథకీ ఒక మూలం వుంది.  నేను చూసిన ఒక జీవితం వుంది ఆవేదన వుంది. నా వ్యక్తిత్వ నిర్మాణ దశలో శ్రీ శ్రీ , కొడవటిగంటి రావిశాస్త్రి,  రంగనాయకమ్మ , చలం…లాంటి వారిని చాలా ఇష్టంగా చదివాను.  అట్లాగే డికెన్స్,  వర్జీనియా ఉల్ఫ్ కూడా..

 

5. వస్తు శిల్పాల సమన్వయం గా మీ కథలు కనిపిస్తాయి. ఒక్కొక్క సారి శిల్పమే అద్భుతంగా ఉంటుంది . ఎలా..?

వస్తు శిల్పాల  సమన్వయము  అనేది కావాలని  కూర్చినది కాదు . ఏ వస్తువుకు ఎలాంటి శిల్పం బావుంటుందో ఆ వస్తువే నిర్ణయించు కుంటుంది.  అదొక సద్య స్పూర్తి . ఇల్లలకగానే కథ వేరు,  సూపర్ మాం కథ వేరు.  అట్లాగే దమయంతి కూతురు కథ వేరు. తన శిల్పాన్ని కథే నిర్ణయించు కుంటుంది.  కథకి spontaneity అవసరం అని నమ్ముతాను.  కథ వ్రాసేటపుడు సాఫీగా సాగిపోవాలి.  చదివించాలి . వస్తువుతో పాటూ చదివించే గుణం కూడా… వస్తువంత ముఖ్యం అనుకుంటాను.   కథలని పాఠ్య పుస్తకాల్లాగా చదవబుద్ది కాదు.

 

6. ఇప్పటి స్త్రీ వాద  దశ ఏమిటి ?  ఇటీవల మంచి స్త్రీ వాద కథలు ఏవి..?

ఇప్పటి స్త్రీవాదం సకల పీడిత జన సమస్యలతో మమేకం అయ్యే దశకు చేరింది. విదేశాలలో ఓటు హక్కులతో మొదలైన ఉద్యమం ఇప్పటికి మూడు దశలు దాటింది.  నాలుగవ దశలో ప్రవేశించింది.  మనకి కూడా ఇప్పుడు  స్త్రీవాదం అనేది ఏక శిలా సదృశ్యం కాదనీ ఏ వర్గపు , వర్ణపు స్త్రీల సమస్యలు వారికి ప్రత్యేకమైనవనే ఎరుక కలిగింది.

.మన దేశపు సమస్యలు  ప్రత్యేకమైనవి. ఏది ఏమైనా ఇప్పుడు అన్ని కథల్లోకి స్త్రీ వాదం ఇంకిపోయింది . స్త్రీ వాదం సాహిత్యం మీద బలమైన ముద్ర వేయగలిగింది . అందువలన నాఉద్దేశంలో ఇప్పుడు ఏ కథనీ ఇది ప్రత్యేక స్త్రీ వాద  కథ అనడానికి  స్త్రీల సమస్యలు – సమాజం సమస్యలు కనుక అన్ని కథలూ కొన్ని జీవితాలకు దర్పణాలే.  స్త్రీలు కూడా పౌరులే.  వారి సమస్యలు పౌర సమస్యలే . ఇంక ఇవి స్త్రీల ప్రత్యేక సమస్యల కథలు,   ఇవి దళిత కథలు,   ఇవి మైనారిటీ కథలు… అని సేగ్రగేట్ చెయ్యడం ఆయా రచయితలకు ముద్రలు వెయ్యడం నాకు నచ్చదు.   ఆయా సమూహాల ప్రత్యేకతలు సంస్కృతీ సమస్యలు చెప్పిన రచయితలందరూ సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన వాళ్ళే . కనుక స్త్రీల సమస్యలను ఆవేదనలనూ గురించి వ్రాసిన కథలను స్త్రీవాద కథలు అనక్కర్లేదు. అందులో మంచి కథలు అని వేరు పెట్టక్కర్లేదు.  స్త్రీ వాదం మొలకెత్తింది … విమర్శలను ఎదుర్కుని నిలబడి బలంగా ఎదిగింది. సాహితీ వనంలో  ఒక నిత్య పరిమళ పుష్పాల నిచ్చే వృక్షం అయింది. అనేకమంది రచయితల యువకుల దృక్పథాలను తన వైపుకు తిప్పుకోగలిగింది . నేను చెబుతున్న స్త్రీవాదం మధ్య తరగతి నగర అగ్రవర్ణ మహిళల స్త్రీవాదం గా కొందరు భావించే స్త్రీ వాదం గురించి కాదు.  అణచివేతకు అధీనతకు గురయ్యే సకల శ్రేణులపై సహానుభూతి కల ఒక తత్త్వం అది. సమాజపు అంచులలో ఉన్న వారందరితో కలిసి  ఆలోచన పంచుకుకునే తత్త్వం అది.

i

7. Extra marital relations ను వివరించే దశలోకి ఇటీవలి కొన్ని కథల వలన స్త్రీ వాద కథ చేరిందని అంటున్నారు.  దీన్ని ఎట్లా చూస్తారు?

వివాహేతర సంబంధాలను చిత్రించే కథలు స్త్రీవాద కథలు అని  ఎలా అంటారు..?  రచయిత్రులు వ్రాసారు కనుకనా…? సామాజిక జేవితంలో పరిణమించే వివిధ సందర్భాలలో వివాహేతర సంబంధం కూడా ఒకటి. ఆ సంబంధాన్ని సమర్ధిస్తూనో విభేదిస్తూనో ఎవరైనా వ్రాయొచ్చు , లేదా దానికి దారితీసిన పరిస్థితులు పరిణామాలు వ్రాయొచ్చు.  అలా వ్రాసిన కథలన్నీ స్త్రీవాద కథలు అనడం సరికాదు. అది  స్త్రీవాద కథకు ఎవరెవరు ఇచ్చుకునే నిర్వచనాన్నిబట్టి  వుంటుంది .  వివేహేతర సంబంధాలు ఒక్క స్త్రీల సమస్యలే కాదు.  స్త్రీ పురుషులిద్దరివీ . ఆ సంబంధాన్ని సమర్థిస్తే అది స్త్రీ వాద కథ అనీ నిరసిస్తే కాదనీ అనే వాళ్లకి సమాధానం చెప్పక్కర్లేదు.  ఎందుకంటే వాళ్లకి స్త్రీ వాదం అంటే అవగాహన లేదు అని తెలిసిపోయింది.  సామాజిక పరిణామాలను బట్టి ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క విషయం  రచయితలను కలవర పరస్తుంది.  అప్పుడు అనుకోకుండా అలాటి కథలే ఎక్కువ వస్తాయి. అంత మాత్రం చేత స్త్రీవాద కథ వివాహేతర సంబంధాల దగ్గరకు చేరి ఆగిపోయిందనో అక్కడ ఇరుక్కు  పోయిందనో  కాదు.

 

8. మీ కథల్లో పురుషుడిని బ్యాలన్స్ చేసుకునే అంశం కనిపిస్తుందని ఒక విశ్లేషణ వచ్చింది. దీని మీద మీ కామెంట్ ..?

పురుషుడు నా శత్రువు కాదు . పితృస్వామ్యం ,పురుషాధిక్యత శత్రువులు . నాన్న అన్న తమ్ముడు మామయ్య, స్నేహితుడు అంతా పురుషులే.  నిత్య జీవితంలో కలిసి నవ్వి కలిసి ఏడ్చే  మంచి స్నేహితులు గా వాళ్ళు వుండాలని ప్రేమను పంఛాలనీ  కోరుకుంటాము . అట్లాగే భర్త అని పిలిపించుకునే పురుషుడు..   ఆ పేరు వదిలేసి నిజమైన జీవన సహచరుడుగా  వుండేలా స్త్రీలే వాళ్ళను ఎడ్యుకేట్ చెయ్యాలని , తల్లులు మగపిల్లల్ని అట్లా పెంచాలనీ అనుకుంటాను . స్త్రీ పురుష సంబంధాలు అధికార అనుచర సంబంధాలుగా కాక స్నేహ సంబంధాలుగా వుండాలని అనుకుంటాను

 

9. అగ్ర వర్ణ స్త్రీల మధ్య తరగతి ఉద్యోగినుల భావధారగా స్త్రీ వాదానికి ఒక అపవాదు వుంది. దళిత స్త్రీ కోణాన్ని మరిచారనీ విమర్శ వుంది.  ఈ విమర్శ మీ మీద ఎలాంటి ప్రభావం చూపింది. ?

మనకి మొదట్లో వచ్చిన స్త్రీ వాదం మధ్య తరగతి ఉద్యోగినుల గృహిణుల జీవితాల మీదుగా వచ్చిన  మాట నిజమే . విమర్శలో నిజం వుంది .  నేనుకూడా మధ్య తరగతి స్త్రీల కథలే వ్రాసాను.  నాకు తెలిసిన నేను నిత్యం మసలే మనుషుల జీవితాలు అవి జీవితానుభావాల్లో నించీ మంచి కథలు పుడతాయి.  నేను దళిత స్త్రీ కోణం నుంచీ వ్రాయ ప్రయత్నించినా వినోదిని వ్రాసిన… “బాలేదు జరమొచ్చింది “ అనే కథో,  మరియా అనే కథో వ్రాయలేక పోయేదాన్నేమో!  జీవితాలను ఊహించి  వ్రాయలేము.  దగ్గర్నుంచీ చూసినా వ్రాయగలమేమొ!

10. ఇంగ్లీష్ లొ విస్తృతంగా చదువుతారని విన్నాము.  ఇంగ్లీష్ సాహిత్య ప్రభావం మీ మీద వుందా.. ? ఇప్పుడేం చదువు తున్నారు ?

చదువుతాను కానీ నా మీద ఎవరి ప్రభావమూ ఉందనుకోను.  నా కథ నా పద్ధతిలో వ్రాసుకుంటూ పోతాను.  అప్పుడెవరూ గుర్తు రారు.   ప్రస్తుతం Sapience అనే పుస్తకం చదువుతున్నాను.  మానవ జీవిత పరిణామ దశల గురించి .

11. మీ  అనువాద కృషి గురించి చెప్పండి

హైదరాబాద్ బుక్ ట్రస్ట్ కోసం మహమ్మద్ ప్రవక్త జీవితం, అడవితల్లి,  ఇస్మత్ చుగ్తాయ్ కథలు , మా నాయన బాలయ్య , ఒక రేవతి జీవితం.. అనువాదం చేసాను. మానాయన బాలయ్య చాలా ఇష్టంగా చేసాను . బాగా వచ్చింది కూడా . కొన్ని వ్యక్తిత్వ వికాసం పుస్తకాలు కూడా చేసాను.  అవి ఫక్తు కమ్మర్షియ ల్ ….పాలా రిచ్మన్ సంకలనం చేసిన  Many Ramayanas.. సగం అయింది . పూర్తి చెయ్యాలి.

 

12. కథ యువకుల ప్రక్రియ వయసు పై బడితే కథ రాయలేరంటారు. మీరు, వివిన మూర్తి గారు రెగ్యులర్ గా వ్రాస్తూనే వున్నారు కదా..?

వయస్సు పై బడిందని అనుకోకుండా వుండడమే.

13. మీ కథా నిర్మాణ రహస్యాలు చెప్పండి మీరు కథలు ఎట్లా వ్రాస్తారు ?

పూర్వం తెల్ల కాగితాలు తెచ్చి బాల్ పెన్ పెన్ తొ వ్రాసేదాన్ని.  తప్పు లోస్తే కాగితాలు ఉండచుట్టి పడేసే దాన్ని.  నచ్చకపోతే చింపేసే దాన్ని . ఇప్పుడు గూగుల్ టూల్స్ ధర్మమా అని… నచ్చక పొతే చెరిపేయడం …మళ్ళీ మొదలు . అంతకు తప్ప రహస్యాలేం లేవు . కథలు ఇలా వ్రాయాలి.  అలా వ్రాయాలి అని పెద్ద పెద్ద రచయితల్ని కోట్ చెయ్యలేను .నాకు నచ్చితేనే నా కథ. గబా గబా వ్రాయలేను చాలా స్లో రైటర్ని. ఇన్నే ళ్ళ మీద నేను వ్రాసినవి అరవై కథలు . ముందు చెప్పానుగా spontaneity ,వుండాలి చదివించాలి ఎదో ఒక విషయం వుందని  చదువరికి తెలియాలి  మనం చెప్పాలనుకున్న దాని మీదమనకి   sincerity వుండాలి .

 

 1. మీరు ఈ వయస్సులో కూడా చురుగ్గా కనిపిస్తారు.  చురుకైన కథలు వ్రాస్తారు.  వ్యంగ్యం పండిస్తారు.  వీటి అన్నిటికీ మధ్య వున్న లంకె ఏమిటి..?

చురుకు జీవలక్షణం వ్యగ్యం వుంటే హాస్యం వుంటుంది.  హాస్యం వుంటే నవ్వు వుంటుంది.  ఎప్పుడైనా నవ్వక పొతే ఎండిపోయిన మొక్క అయిపోతాం కదా.   నాకైతే  బ్రతికివున్నంతకాలం జీవించాలని వుంటుంది.

15. నాన్న , దమయంతి కూతురు… ఒకే ఇతివృత్తానికి రెండు పార్శ్వాలు వున్నా కథలు వాసారు.  ప్లాన్ చేసి వ్రాసిన కథలేనా ?

ప్లాన్ చేసి వ్రాయలేదు నాన్న కథలో మహాలక్ష్మి నాకు బాగా తెలుసు.   ఆమె మీద ఒక కథ వ్రాయాలని అనుకునేదాన్ని /అట్లాగే దమయంతి కూతురు  ఈ రెండు  కథల మధ్య  చాలా గ్యాప్ వుంది రెంటికీ సంబంధం లెదు.

 

 1. స్త్రీవాద కథలు వ్రాశారు సరే!  స్త్రీవాద ఉద్యమాల్లో మీ మీ భాగస్వామ్యం ఏమిటి… ?

నేను అందరి మధ్య తరగతి ఉద్యోగినుల్లాగానే నా ఇల్లు నా ఉద్యోగం చక్క బెట్టానే కానే ఏ ఉద్యమం లోనూ పాల్గొన లేదు.  కార్య కర్త ను కాదు కేవలం ఒక రచయితనే .

 

17 . ఏ  రచయితల సంఘాలలో కనపడరు ఎందుకని …?

కనపడ కూడదనె  నియమం ఏమీ లేదు .

 

18.  కోస్తా ఆధిపత్యం తెలుగు సమాజాన్ని నిలువునా విభజించింది .  ఏ ఆధిపత్య మైనా సూక్ష్మ స్థాయిలో, కథా, నవలా రచయితలే పట్టుకోవాలి.   మీ ఆజాదీ భాగం కథల్లో ఆ చాయలు కనిపిస్తాయి… కానీ సమగ్రంగా ఆ పరిణామాలను పట్టుకోలేక పోయారు ఎందు చేత..?

కొంచెం పరిశోధన పరిశీలన చేస్తే పట్టుకుని వుండొచ్చు .  కానీ చెయ్యలేదు.  చేస్తే బావుండేది నా బద్దకాన్ని కర్తవ్యం నిర్వహణ లోపాన్నీ ఒప్పుకుంటున్నాను.

19. కోస్తా గ్రామీణ,  స్త్రీ సంఘర్షణ మీ కథల్లో కనిపించదు.  గ్రామాల నుంచీ నగరాలకు వచ్చిన స్త్రీల కథలు చెప్పారు. కానీ గ్రామాలలోని ఆమె కథచెప్పలేదు ఎందుకని..?

నేను గ్రామానికి వెళ్లి చాలా కాలం అయింది . నేను నాకు పదిహేను సంవత్సరాల వయస్సు వచ్చే వరకే మా వూళ్ళో వున్నాను.  అప్పటి గ్రామం వేరు ఇప్పుడు వేరు నేను చూడనిదీ నాకు బాగా తెలియనిదీ వ్రాయాలనిపించదు. గ్రామాలనుంచీ  వలసలు ఎక్కువయ్యాయి.  వాళ్ళతో నా పరిచయాలు కూడా పెంచుకున్నాను. గ్రామంలో ఒక ఇల్లు వుంటుంది.  ఒక కాలవ వుంటుంది.  ఆరుబయలు వుంటుంది.   నగరంలో వీధి వుంటుంది.  వీధిలో అపాయం కాచుకుని వుంటుంది. వొంటి చేతిమీద సంసారాలు లాగుతున్న తల్లులు, చదువులు ఆగిపోయి చిన్నచిన్న పను లు చేసుకు బ్రతుకుతున్న పదిహేను పదహారేళ్ళ ఆడపిల్లలు  వీళ్ళు బాగా కలవర పెడతారు నన్ను.

 

18 . మీ తొలిదశ కథల్లో పెట్టుబడి దారీ విధానాలలోని అవలక్షణాలను గురించి వ్రాశారు.  తరువాత పురుషుడు చెడగొట్టిన ఈ ప్రపంచాన్ని స్త్రీ శక్తి సరిచేసుకోవాలని చెప్పే కథలు వ్రాసారు.   ఇటీవల అణగారిన స్త్రీల జీవితాలను  నగర కేంద్రంగా వ్రాసారు.  ఇన్ని వైరుధ్యాల వెనుక వున్నా భావధార ఏమిటి..?

వ్యక్తిగా నా ఆలోచనల పరిణామం , సమాజంలో మార్పులు ఒక్కొక్క సమయంలో మనని ఆలోచింప జేసే విషయాలు కలవర పెట్టే  విషయాలు కథల్లో కొస్తాయి.   కథలు వ్రాసే కొత్తలో రావిశాస్త్రి , డికెన్స్  ఎక్కువ చదివేదాన్ని బాగా ప్రభావితం చేసిన రచయితలు తరువాత స్త్రీ వాదాన్ని చదివాను . ఇప్పుడు నా చుట్టూ వున్న ఈ చిట్టి తల్లులే ఎక్కువ కలవర పెడుతున్నారు నన్ను

 1. మీ కథల్లో యువతకు సంబంధించిన ఇతివృత్తాలు ఎక్కువగా కనిపిస్తాయి. writer గా update గా  వుండడం ఎట్లా సాధ్య మైంది. ?

యువతే కదా ముఖ్యం !  నాకు చాలామంది యువ స్నేహితులున్నారు.  interaction ఎక్కువ వాళ్లతో… నా వయస్సు వాళ్ళు (రచయితలు కాదు) ఎక్కువ నొప్పుల గురించీ పిల్లల గొప్పల గురించీ మాట్లాడతారు. update గా వుండడం అంటే అన్నీ గమనిస్తూ వుండడమే తెలుసుకుంటూ వుండడమే ఈరోజుల్లో సమాచారానికేం తక్కువ !

 

20. మీ కళ్ళముందు అనేక సామాజిక ఉద్యమాలు జరిగాయి కదా ..? అవి మీ మీద చూపించిన ప్రభావం ఏమిటి..? వాటి మీద ఏమైనా వ్యాసా లు వ్రాసారా..?

వ్యాసాలు వ్రాయలేదు కానీ నా ఆలోచనల  మీద ఉద్యమాల ప్రభావం తప్పకుందా  వుంటుంది .

 

21.  రచయిత్రిగా ఉద్యోగినిగా కుటుంబం మీ మీద చూపిన ప్రభావం ఏమిటి ?

కుటుంబ బాధ్యతల వలన కొన్ని పనులు  చెయ్యలేక పోయానేమొ కానీ కుటుంబం నన్ను ఎప్పుడూ అణిచిపెట్టడానికి ప్రయత్నించలేదు ఆత్మ గౌరవానికి అడ్డు రాలేదు . I thank them for letting me be

 

22.  మీ రచనలు మీ కుటుంబ సభ్యుల మీద చూపిన ప్రభావం ఏమిటి?

నన్ను చూసి  సంతోష  పడతారు. నా ఆలోచనలని ఒప్పుకుంటారు.  అమలులో కూడా పెడతారు.  మంచివాళ్లే పాపం.!

13 thoughts on “స్త్రీలు రాసేవన్నీ స్త్రీవాద రచనలు కావు……

 1. మేల్ ప్రివిలేజ్ గూర్చి నాకు సంపూర్ణ అవగాహన వుంది అనే గర్వం వుండేది. కానీ “ఇల్లు అలకగానే” కధ చదివిన తరువాత అది ముక్కలైంది. దానితో సత్యవతి గారు కదల పుస్తకం చదవడం(విశాలాంధ్ర ప్ర్రచురణ), ఫోన్ నెంబర్ తెలుసుకుని మాట్లాడడం చకచక జరిగిపోయాయి. సత్యవతి గారి గురించి విన్నది “ప్ర ర వె” వారి “యువతరం తో నవతరం” కార్యక్రమo లో “కాత్యాయని విద్మేహే” గారి నోటి నుండి. ఆ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్ధులు నా నుండి ఏమి నేర్చుకున్నారో తెలియదు కానీ నాకు ఒక గొప్ప రచయిత్రి గురించి తెలిసింది. అందుకు జాజి మల్లి గారికి ధన్యవాదాలు తెలియజెయ్యాలి. సత్యవతి గారిని అర్ధం చేసుకోవడానికి ఈ ఇంటర్వ్యూ చాలా ఉపయోగపడింది. సంపాదకులకు ధన్యవాదాలు.

  1. ఇల్లలకగానే కథ కొత్తగా స్త్రీ వాదం గురించి తెలుసుకునే వాళ్లకి కరదీపిక. చక్రి అంటే సమాలోచన చక్రధర్ గారా? థాంక్యూ

 2. నిర్మొహమాటంగా ఖచ్చితంగా సూటిగా అడిగిన ప్రశ్నలు.
  అనుభవసారం నుంచి మానవీయంగా చెప్పిన సమాధానాలు.
  మంచి ఇంటర్వ్యూ. ఇది సాధ్యం చేసిన వారందరికీ అభినందనలు

 3. సత్యవతి గారి ముఖాముఖీ నిర్మొహమాటంగా సాగింది.తెలీనీ వాటిని గురించి అంతె నిర్మొహమాటంగా తెలీదని చెప్పడం, తెలీని అంశాలగురించి ఊహించి రాయనని చెప్పడం ఆమె గొప్ప వ్యక్తిత్వాన్ని సూచించాయి.నేను చదివే కథకుల్లో సత్యవతి గారొకరు.వారి ఇంటర్వ్యూ..చదివింపచేసిన అడుగు కు ధన్యవాదాలు

 4. సత్యవతి గారి మనసు కోణాన్ని చక్కగా రాబట్టిన సుభాషిణి కి అభినందనలు..అలాగే అడుగు పత్రిక సంపాదకులు ధన్యవాదాలు

 5. చాలా మంచి ఇంటర్వ్యూ . సుభాషిణి గారి ప్రశ్నల క్రమమూ ప్రశ్నలూ కూడా సత్యవతి గారిని ఆవిడా కధల గురించి స్త్రీవాదం గురించి , సామాజిక పరిస్థుతులగురించి, రచయిత్రుల సంఘాల గురించి మంచి జవాబులు చెప్పించాయి . “వ్యక్తిగా నా ఆలోచనల పరిణామం , సమాజంలో మార్పులు ఒక్కొక్క సమయంలో మనని ఆలోచింప జేసే విషయాలు కలవర పెట్టే విషయాలు కథల్లో కొస్తాయి. కథలు వ్రాసే కొత్తలో రావిశాస్త్రి , డికెన్స్ ఎక్కువ చదివేదాన్ని బాగా ప్రభావితం చేసిన రచయితలు తరువాత స్త్రీ వాదాన్ని చదివాను . ఇప్పుడు నా చుట్టూ వున్న ఈ చిట్టి తల్లులే ఎక్కువ కలవర పెడుతున్నారు నన్ను” చాలా మంచి జవాబు. నిజమే రచయిత (త్రి)లు ఈ విషయాన్నీ ఆలోచించవలసిన అవసరం ఎంతయినా ఉంది, ఇప్పుడు జరుగుతున్న మత వాద, దేవుడుచుట్టూ జరుగుతున్న పాత మూఢ ఆచారాల ప్రచారంలో ఈ చిట్టి తల్లులకు ఘోర ఇబ్బంది వచ్చే రాజ్యాంగం లో ఉన్నాము. ఇందాక ఫేసుబుక్ లో సాయి పద్మ చెప్పినట్టు ” రేపటి శ్రావణ శుక్రవారం కన్నా చేసే ఖర్చు కన్నా స్త్రీలు, ఆ స్త్రీలను ప్రేమించే(!) పురుషులూ వాళ్లకు మంచి పుస్తకాల్లాంటివే ఇవ్వగలిగితే ఎంత బావుంటుంది. అలాగే ఈ దేశం లో స్త్రీలు చేసే అన్ని పూజలు భర్త కోసమే. భార్య కోసం భర్త చేసే పూజా లేకపోవడం ఎందుకో ఎక్కడా కనపడదు . సత్యవతి గారు ఈ విషయం పై కూడా కధలు రాస్తే బావుంటుంది..

 6. ధిక్కారమైన అనుభవాన్ని చూపించిన సుభాషిని గారికి ధన్యవాదాలు!

 7. మంచి ఇంటర్వ్యూసుభాషిణి గారికి. అడుగు పత్రిక సంపాదకులు ధన్యవాదాలు

 8. కె.సుభాషిణి

  సత్యవతిగారి ఆరు నవలలు, నాలుగు కథా సంపుటాలూ , అనువాదాలు , కాలమ్స్ అన్నీ కూడా ఒకటికి రెండు సార్లు చదివాను. ఆమె తన రచనల్లో స్త్రీలపై ప్రపంచీకరణ ప్రభావం , వర్గ దృక్పథం ద్వారా స్త్రీల సమస్యలను చర్చించటం లాంటి అంశాలు ఈ ఇంటర్యూకు ప్రేరణ. ప్రాంతీయ అసమానతలను అధ్యయనం చేసే క్రమంలో కోస్తా ప్రాంత రచయితుల రచనలు చదివినప్పుడు కొన్ని గ్యాప్స్ కనిపించాయి. వీటన్నిటి సమాహారమే ఈ ప్రశ్నావళి. ఈ ప్రశ్నావళి తయారీలో వెంకట కృష్ణ భాగస్వామ్యం చాలా వుంది. ఇది మా యిద్దరిది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


   Type Comments in Indian languages (Press Ctrl+g to toggle between English and Hindi OR just Click on the letter)