ములాఖాత్

హృదయాన్ని కల్లోల పరిచేది వస్తువు కాదు శిల్పమే: కాసుల ప్రతాప్ రెడ్డి

 

 

 

రచనల కన్నా సంభాషణల్లోనే రచయిత ప్రాపంచిక దృక్పథం మరింత స్పష్టమవుతుంది. ఆ రచయిత సత్యాన్ని మోసే జర్నలిస్టు కూడా అయినప్పుడు సామాజికంగాను-సాహిత్యపరంగాను సమకాలీన వాస్తవికత గురించి క్లుప్తంగా మాట్లాడగలడు. జర్నలిస్టు, సాహిత్యకారుడు కాసుల ప్రతాప్ రెడ్డితో అలాంటి ఓ ప్రయత్నం ఈ ఇంటర్వ్యూ..

 

1) సిద్దాంత స్థాయిని అందుకోలేకే మేధావుల ఇంటర్వ్యూల్లో అనవసరంగా నేపథ్యం గురించి ప్రశ్నిస్తారన్న విమర్శ ఉంది. దానిపై మీ అభిప్రాయం..

 

ఇప్పటి స్థితికి నేపథ్యానికి కచ్చితంగా సంబంధం ఉంటుంది. భవిష్యత్తులోను మనం ఎటువైపు ఉండబోతున్నామో నిర్ణయించేది నేపథ్యమే. పుట్టుక, ప్రాంతం, మన చుట్టూ ఉన్న సమాజం ప్రభావం కచ్చితంగా మన మీద ఉంటుంది.

 

పుట్టుకతో నేను రెడ్డిని.. కానీ గ్రామీణ స్ట్రక్చర్‌లో బొందుగుల అనే గ్రామంలో.. నేనూ ఒక అణచివేయబడ్డవాడినే. మా ఊళ్లో ఉన్న దొరల కుటుంబాల నుంచి వివక్షను అనుభవించినవాడినే.

 

దళితులతో పోలిస్తే అస్పృశ్యత తప్ప మిగతా వివక్ష రూపాలను నేను కూడా అనుభవించాను. బహుజనలతో పోలిస్తే వాళ్లతో సమానంగా వివక్షను ఎదుర్కొన్నా అనే చెప్పాలి. కాబట్టి నేను ప్రజాపక్షం తీసుకోవడానికి నా నేపథ్యమే కారణమైంది.

 

2) మీ కాలేజీ రోజుల్లో సాహిత్య అధ్యయనం, వామపక్ష రాజకీయాలు రెండు జోడు గుర్రాల్లా ఉండేవని చెబుతుంటారు.. వాటి ప్రభావం ఎలా ఉండేది?

 

ఇంటర్మీడియెట్ అయిపోయేంత వరకు నాకు రాజకీయాలు తెలియదు. ఒక అస్పష్టమైన అభిప్రాయం ఉండేది. బాగా ఉన్నవాళ్లే రాజకీయాల్లో ఉంటారన్నది ఆ తర్వాత అర్థమైంది. ఆ టైంలోనే అలియా కాలేజీ మ్యాగజైన్‌కు ధనవంతులను నిరసిస్తూ నా మొదటి కవిత రాసిన. సర్దార్ వల్లభాయ్ పటేల్ (ఎస్పీ) కాలేజీలో నేను బీఎస్సీ చదువుతున్న రోజుల్లో అదో రాజకీయ క్షేత్రం లాగా ఉండేది.

 

అలా.. ఓరోజు ఒక గ్రూపువాళ్లు నిర్వహించిన మీటింగ్‌కు హాజరైన. మరుసటి రోజు మరో గ్రూపువాళ్లు నిర్వహించిన మీటింగ్‌కు కూడా హాజరైన. అవి రెండు ఏబివిపీ, పీడీఎస్‌యూ అని ఆ తర్వాత తెలిసింది. క్రమ క్రమంగా రెండింటి మధ్య తేడా గమనిస్తూ వచ్చిన.

 

అదే సమయంలో ఎస్పీ కాలేజీ మేగజైన్‌ తెలుగు సెక్షన్ ఎడిటర్‌గా కూడా పనిచేసిన. అలా చాలామంది దృష్టి నా మీద పడింది. చాలామంది లాగడానికి ప్రయత్నించారు. కానీ నేను మాత్రం వామపక్ష ఉద్యమాల వైపు నిలబడ్డ.

 

ఉస్మానియాలో ఎంఏలో చేరినప్పుడు ఎటువైపు ఉండాలనే దానిపై ఇంకా స్పష్టత వచ్చింది. వామపక్ష భావజాలంతోనే పనిచేసినప్పటికీ.. ఎన్నడూ.. ఏ సంస్థలోనూ సభ్యుడిగా లేను. ఎంఏ మొదటి సంవత్సరంలో ఆర్ట్స్ కాలేజీ మేగజైన్ కు ఎడిటర్ గా పనిచేసిన. ఆ సమయంలో రైట్ వింగ్ ఫోర్స్  నా నుంచి ఎడిటర్ పోస్టు లాక్కోవడానికి చాలానే ప్రయత్నించింది. యూనివర్సిటీ అంతా అప్పటికే రైట్ వింగ్స్ చేతిలోకి వెళ్లిపోయింది.

 

నిజానికి ఎడిటర్ గా ఎవరినీ ప్రకటించవద్దని కూడా చాలా ఒత్తిడి తీసుకొచ్చిన్రు. దీంతో వ్యాస రచనల్లో పోటీల్లో ఎవరు ఫస్ట్ వచ్చారో చెప్పాలని మేము డిమాండ్ చేసినం. అట్లా మొత్తానికి ఎడిటర్ పోస్టు నాకు దక్కిన తర్వాత యూనివర్సిటీలో ఆధిపత్య గ్రూపుకు వ్యతిరేకంగా చాలా స్ట్రాంగ్ ఎడిటోరియల్స్ రాసిన.

 

యూనివర్సిటీలో చివరాఖరి వామపక్ష విజయం కూడా నాదే. ఏ-హాస్టల్ లిటరరీ సెక్రటరీగా గెలిచిన.

 

3)సుంకిరెడ్డి నారాయణ రెడ్డి, సంగిశెట్టి శ్రీనివాస్ లాంటి వాళ్లు తెలంగాణ సాహిత్యాన్ని వెలికితీసే పనిచేస్తుంటే.. మీరు మాత్రం విశ్లేషించే పనికి పూనుకున్నారు? దాని గురించి..

 

మన అస్తిత్వం చాటుకోవడానికి చరిత్ర ఉంటుంది. చరిత్ర అవసరం కూడా. తొలిరోజుల్లో నేనూ ఆ పని చేసిన. తర్వాత ఇక్కడ కథ ఉన్నది అని తొలిరోజుల్లో నేను గుర్తించగలిగిన.. రాసిన కూడా.

 

తెలంగాణలో సాహిత్య ప్రక్రియలు ఎదుగుతూ వచ్చినై. సాహిత్య ప్రక్రియల ఉద్దేశం, ప్రయోజనం వేరు. తెలంగాణ కథ దేవులాట పుస్తకం వేసినప్పుడు కథ ఎట్లా వివక్షకు గురైందో చెప్పిన. వివక్ష నేపథ్యంగా బి.ఎస్.రాములు, కె.శ్రీనివాస్, ఇంకా చాలామందితో సుప్రభాతంలో వ్యాసాలు రాయించిన.

 

తెలంగాణ సాహిత్యానికి, చరిత్రకు సరైన దృష్టి కోణం ఎలా ఉండాలో కూడా రాసిన. చరిత్ర, విమర్శ, అధ్యయనం, సాహిత్యం, సమాజం, రాజకీయాలకు ఎలాంటి సంబంధం ఉంటుంది?.. భౌగోళికత గుర్తు.. విడివిడిగా చూడటానికి గుర్తు.. ఇదంతా గమనించాక పరిశీలనలు మొదలయ్యాయి. అవి ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి పనికొస్తాయి.  కానీ నా ఉద్దేశం నీదైన దృష్టికోణం, వాదన ఉండాలన్నదే.. అందుకే విశ్లేషణ ఎంచుకున్న.

 

4)జర్నలిజంలోకి వచ్చాక సాహిత్య విమర్శ మీకు అనివార్యమైందా? లేక అవసరం కొద్దీ చేస్తూ వచ్చారా?..

 

అనివార్యమే అయింది.. ఎప్పుడూ..

 

అర్థం చేసుకోవాల్సిన విషయానికి ఇంకేదో కోణం కూడా ఉంటుంది అనుకున్నప్పుడే నేను ఏదైనా రాస్తూ వచ్చాను. ఆ రకంగా విమర్శ నాకు అనివార్యంగా మారింది. విమర్శ జోలికి వెళ్లి ఉండకపోతే.. నిజానికి నేనో కథా రచయితగా ప్రసిద్ది పొంది ఉండాల్సినవాడిని.

 

5)భావుకత/సృజన/సిద్దాంతం/పరామర్శ.. వీటిల్లో దేన్ని మీ విమర్శల్లో ఎక్కువగా అనుసరించారు?

 

వస్తుగత విమర్శ. .

 

సామాజిక పరిణామ క్రమాన్ని విశ్లేషించే విమర్శ.. ఒకకంగా మార్క్సిస్ట్ ఫోక్ మోడర్నిస్ట్..

రాచమల్లు రామచంద్రారెడ్డి, కె.వి.ఆర్ తర్వాత అంత నిక్కచ్చిగా విమర్శ అందించానన్న అభిప్రాయం సుంకిరెడ్డి నారాయణ రెడ్డి వ్యక్తం చేసిండు.

 

నాకు కొలబద్ద ఏంటంటే ఒక రచనకు సంబంధించిన వస్తువు ప్రజా ప్రయోజనాలకు అనుగుణంగా ఉందా? లేదా?.. లేక వ్యతిరేకంగా ఉందా? అనేది. ఇది నిర్దిష్టమైంది కాకపోయినా.. నా పాయింట్ మాత్రం అదే.

 

విశ్లేషణకు సంబంధించి శిల్పం కూడా ముఖ్యం అనే చెబుతా.

ఒక సిద్దాంతాన్ని బలపరచడానికి సృజనాత్మక రచనను వాడుకోకూడదు.

మనం ఏ సిద్దాంతం నేపథ్యం మన దృక్పథానికి అనుగుణంగా రచన సాగాలి. మనం దేన్ని ఉద్దేశించి రచన చేస్తున్నామో అది పాఠకుడు ఫీలయ్యే లాగా చేయాలి.

సిద్దాంతం రచనకు ముఖ్యమే కానీ అదే వస్తువు కాదు. అది పాఠకులకు చెప్పాల్సిన పనిలేదు.

6)నింద-స్తుతి.. విమర్శలో ఈ రెండింటి మధ్య సమన్వయ దృష్టి గురించి..

 

రచన ఏదైనా ముందు ఒక పాఠకుడిగా దాన్ని చదువుతా. కొన్నింటిలో వస్తువు గొప్పదైనప్పుడు.. చదివించే గుణం ఉండకపోవచ్చు. లేదా చదివించే గుణం ఉండి సరైన వస్తువు ఉండకపోవచ్చు.

 

అది సామాజిక పరిస్థితులను ఎంతవరకు ప్రతిబింబిస్తుంది? అనేది గమనిస్తా. నిందలనేవి అవసరం లేదు. ఒక పుస్తకంపై రివ్యూ రాసినప్పుడు.. అందులో రెండు కథలు మంచిగున్నయి అని రాసిన. చెప్పేదేంటంటే.. వస్తు-శిల్పం బేధం మధ్య మిగతా కథలు ఎందుకు బాగాలేవు అని చెప్పడానికి మనకున్న మార్గం కథా నిర్మాణం, కథా వస్తువు.

 

పాఠకుడిని రచన వెంట నడిపించడానికి రచయిత అనుసరించిన మార్గం ఎటువంటిది?.. పాఠకుడు అందులో లీనమై తాదాత్మ్యం పొందాడా?..  అనేది మొదటిది.., సృజనాత్మకత అనేది రెండో దశలో ఆలోచిస్తా.

 

అయితే పాఠకుడి హృదయాన్ని కల్లోల పరిచే లక్షణం వస్తువులో కాదు శిల్పంలో ఉంటుంది. కొత్త అనుభవాలు రచనలోకి వచ్చినప్పుడు దానికదే శిల్పంగా రూపుదిద్దుకుంటుంది. దానికి ప్రత్యేకమైన శిల్పం అవసరం లేదు. నేను కథలు రాసిన విధానం కూడా అదే. నా కథలకు ప్రత్యేకమైన పాఠకులు ఉన్నారనేది నా అనుభవంలోకి రావడం నాకో పెద్ద అవార్డు.

 

7) సాహిత్యాన్ని జర్నలిజం నుంచి వేరు చేసేది సృజన. సాహిత్య కారుడిగా.. జర్నలిస్టుగా.. ఈ తేడా మీకు ఇంకా స్పష్టంగా తెలిసి ఉంటుంది కదా!.. దాని గురించి..?

 

జర్నలిజం సృజనాత్మకతను చంపేస్తుంది. ఒక జర్నలిస్టు.. వార్తను వర్తమాన చరిత్రగా రచించడానికి, దాని వెనుక ఉన్న నేపథ్యం చెప్పడానికి ప్రయత్నిస్తాడు. అయితే ఇట్లా కొన్ని సందర్భాల్లో వీలు కాదు.

 

సమాజం పట్ల నిబద్దత ఉండి, మంచి-చెడు విచక్షణ తెలిసి, నిరంతరం కల్లోల పడే వ్యక్తి జర్నలిస్టుగా కొనసాగుతూనే.. సృజనాత్మకతను రక్షించుకోవడానికి కవిత్వమో, ఇతర సాహితీ రూపాన్నో ఎంచుకుంటాడు.

 

ప్రపంచ సాహిత్యంలో ప్రజాపక్షం వహించి ఉత్తమ రచనలు వెలువరించినవారంతా జర్నలిస్టులే. భౌతిక కారణాలు కాకుండా, లోపలి వ్యక్తుల అవగాహన సృజనాత్మక జర్నలిస్టులకు దక్కుతుంది. ఇన్సిడెంట్‌కు మొదటి వ్యక్తిగా ఉంటాడు కాబట్టి అది సాధ్యపడుతుంది.

 

8)సాహిత్య విమర్శకు సంబంధించి మానవవాదమే దానికి సమగ్రతను చేకూరుస్తుందన్న అభిప్రాయం ఉంది. ఏమంటారు…?

 

ఏది సంపూర్ణం కాదు.. ఏది సమగ్రం కాదు..

 

సంపూర్ణ సత్యమంటూ ఉండదు. సత్యం అనేది శకలాలు శకలాలుగా ఉంటుంది. ప్రాంతాలు, కులాలు, జాతులు, న్యాయ-అన్యాయాలు నిర్దారితం అవుతాయి. విశ్వజనీనం అనేది సర్వసాధారణం సార్వజనీనం అనేది వట్టి మాటే. Particularity అనేది ఉంటుంది. ఈరోజు సత్యం అయింది రేపు అసత్యం కావచ్చు.

 

9) రూప భద్రతే సాహిత్య రచన అనుకునే ఆలోచన కూడా ఇప్పటి తరంలో బాగా నాటుకుపోయినట్టుంది..?

 

కొత్త అనుభవాలు వాటంతటవే శిల్పంగా ఆదరణ పొందుతాయి. ఆ కొత్తవి చాలా సందర్భాల్లో అకవిత్వంగా వచ్చి కూడా కవిత్వంగా చలామణి అవుతాయి. కాబట్టి కొత్త అనుభవాలకు కొనసాగింపునిచ్చే క్రమంలో తప్పకుండా శిల్పం గురించి ఆలోచించాల్సి ఉంటుంది.

 

విప్లవ, దళిత, తెలంగాణ, మైనారిటీ కవిత్వం విషయంలో ఇది నిర్దారణ అయింది. తిట్లు, శాపనార్థాలు, అరుపులు, కేకలు కూడా కవిత్వం అయ్యాయి. వస్తువు శిల్పాన్ని నిర్ణయిస్తుందనేది రొడ్డకొట్టుడు వ్యవహారం.

 

ఒక రచనను పఠనయోగ్యంగా చెప్పగలిగేది శిల్పం మాత్రమే కానీ వస్తువు కాదు. కొత్త అనుభవం అయినప్పుడు వస్తువు దానంతట అదే పఠనయోగ్యం.

 

10) సాహిత్యాన్ని కేవలం ఉద్యమాల కోణంలోనే చూడవద్దు.. అది జీవితమంత విస్తృతమైనదని బాలగోపాల్ చెప్పారు. పతంజలి లాంటి వాళ్లు నిబద్దత నష్టం చేస్తుందన్నారు. ఈ రెండు అభిప్రాయాలు దగ్గరిగా ఉన్నట్టు అనిపిస్తుంటాయి. మీరు ఏకీభవిస్తారా?…

 

ఏకీభవిస్తా..

 

సృజనాత్మక రచన అనేది హృదయానికి తాకాలె..

హృదయానికి తాకడమనేది పాఠకుడిని ఆలోచనలోకి నెట్టుతుంది. ఉత్తమ రచయితకు ఇదే గీటురాయి.

 

నిబద్దత-నిమగ్నత మధ్య తేడా ఉంది. నిమగ్నత అనేది అనుభవానికి సంబంధించింది. మోడర్న్ ట్రెండ్. ఎవరి అనుభవాలను వారు వ్యక్తీకరించగలరు. ఆ రకంగా నిబద్దత సంఘీభావం లేదా సానుభూతి వ్యవహారమే.

 

నిమగ్నతకు ఉన్నంత బలం సృజనాత్మకత నిబద్దతకు ఉండదు. ఉద్యమాలు, సిద్దాంతాలు, విశ్వాసాలకు మించిన జీవితాన్ని సృజనాత్మక అందిస్తుంది. సృజనాత్మక అనేది రాజకీయాల కన్నా విస్తృతమైనది. రచయిత అనేవాడు అక్కడ జీవితాన్ని ప్రతిఫలిస్తాడు తప్ప సిద్దాంతాల గురించి మాట్లాడడు.

 

11) కథను ఒక పథకం, ప్రణాళిక పెట్టుకుని రాయనని త్రిపుర అన్నారు. కథలు రాసిన వ్యక్తిగా.. కథ పట్ల మీ అనుసరణ ఎలా ఉండేది..

 

త్రిపుర నాకు చాలా ఇష్టమైన రచయిత..

 

మానవ జీవిత అంతర్గత కల్లోలాలకు ఒక నియతి ఉండదు. ఒక క్రమం ఉండదు. అలా సాగిపోతుంటుంది. ఆ సాగుతున్న క్రమంలో.. ఏదో ఒక దగ్గర కథను మొదలుపెడుతాం.  మన ప్రమేయం లేకుండానే ఏదో ఒక దగ్గర కథకు ముగింపు ఉంటుంది.

 

బహుశా.. త్రిపుర లాగే నేను రాసిన వాటికి కూడా ముగింపు లేదు.

అంతర్గత కల్లోలాలు, కొన్ని సంఘటనలు ఆధారంగా వాటికి రూపం ఇవ్వడం కష్టమైన పని. ఆ పని త్రిపుర చేసిండు. దాంట్లో కొరత లేదు. అందుకే త్రిపుర కథలు గానీ నా కథలు గానీ సిద్దాంతానికి వాదానికి అనుగుణంగా ఉండవు. అన్ని సిద్దాంతాలు, అన్ని అనుభవాలు ఉంటాయి.

 

కేశవరెడ్డి విషయంలో నాకిది నిర్దారణ అయింది. కేశవరెడ్డి మేధావి వర్గానికి సంబంధించినవారు అనుకున్న సమయంలో.. ఓ మామూలు పాఠకుడికి అతను తెలుసన్న విషయం నా దృష్టికి వచ్చి ఆశ్చర్యం కలిగింది.

 

ఒక రచయిత తన రచనలను ఏ స్థాయిలో బేరీజు వేసుకుంటాడు? ఒక ఎలైట్ లేదా వోకల్ గ్రూపు నుంచి ప్రశంసలు కోరుతున్నాడా?.. ప్రతిస్పందన ఆశించకుండా రచన చేస్తున్నాడా? అన్నది ఆలోచించాలి. ఇతరులతో సంభాషణ చేయాల్సి వచ్చినప్పుడు చేసే రచన మాత్రమే మిగులుతుంది.

 

12)సాహిత్య ప్రయోజనం చైతన్యపరచడంగానో.. లేదా సమీకరించడం, బోధించడంగానో ఉండాలా?.. అసలు సాహిత్యానికి ప్రయోజనం ఉండాలా?..

 

సాహిత్యం చేయాల్సిన పని ఉద్బోధించడం కాదు.

చైతన్యపరచడం అనేది వేరే మాట. సమీకరించడం అనేది సృజనాత్మక సాహిత్యానికి సంబంధం లేనిది. అవగాహన కల్పించడం కూడా సాహిత్యానికి ప్రధానం కాదు.

 

సమస్యల పట్ల తాదాత్మ్యం, అనుభవాన్ని ఫీలయ్యేటట్టుగాచేస్తుంది. ఆ భావన సమాజం ఇంత దుర్భరంగా ఎందుకున్న ఆలోచనను పాఠకుడికి కలిగిస్తుంది. ఇది బోధన కాదు. అయితే సమస్యలకు గల కారణాలను అన్వేషించే ఆలోచన కలిగిస్తుంది. ఇది ఉత్తమ సాహిత్య ప్రపయోజనం.

 

పాఠకులు, ప్రజలు ఆ మానసిక అనుభవం పొందాక సరైన గురువులను ఎంచుకుంటారు. అదే బోధన-సమీకరణ వ్యవహారం. పరిస్థితి పట్ల, సమస్యల పట్ల ఎమోషనల్ ఫీలింగ్స్ కలిగించడమే సృజనాత్మక సాహిత్యం చేసే పని. ఒక రకంగా మేల్కొల్పడం. నిద్ర నుంచి మేల్కొల్పడం మాత్రమే.

 

మన రచనలు ఎవరికి చేరుతున్నాయి? మనమేం ఆశిస్తున్నాం అనేది ప్రధానం. కొన్నిసార్లు మన రచనలు ఎవరికి చేరుతున్నాయో కూడా తెలియని పరిస్థితి ఉంటుంది. కానీ ప్రభావమయ్యే పాఠకులు ఉంటారు. మనం సమూహాల్లో ఉన్న సంబంధాలను చూస్తున్నామా?..  దాని పరిధిని దాటుతున్నామా?.. రచయితకు తెలియకుండా పాఠకులు ఉండవచ్చు.

 

13)మీడియాలో అతివాద ధోరణులు ఈమధ్య కాలంలో మరింత విస్తరించినట్టు కనిపిస్తున్నాయి. ఇటీవల గౌరీ లంకేష్ హత్య కావచ్చు… రోహిణి సింగ్ పై 100కోట్ల పరువు నష్టం దావా కావచ్చు.. వీటన్నింటిని ఎలా అర్థం చేసుకోవాలి..?

 

ప్రధాన స్రవంతి మీడియా గానీ, ప్రధాన స్రవంతి మేధావి వర్గం గానీ వెనుకబడిన ప్రాంతాలకు, వెనుకబడిన కులాలకు, గిరిజనులకు, దళితులకు వ్యతిరేకంగా ఉంటుంది. జర్నలిస్టుల పాత్ర కొన్నింటిని నర్మగర్భంగా చెప్పడానికి అవకాశం ఇస్తుంది. ఒక ప్రత్యామ్నాయ మీడియా అనేది దేశంలో ఇప్పటివరకు రూపుదిద్దుకోలేదు. ప్రగతిశీల శక్తులు కూడా ప్రజా వ్యతిరేక శక్తుల మీద విమర్శ పెట్టడం తప్ప ప్రత్యామ్నాయ విధానం చూపించడంలో విఫలమయ్యాయి. ఇది అన్ని రంగాలకు వర్తిస్తుంది.

 

14)మైనారిటీ రచయితలు కావచ్చు.. లేదా తెలంగాణ ముస్లింలు కావచ్చు.. ఇక్కడి బహుజనులతో బలమైన సంబంధాలను కలిగి ఉన్నారు.. ఈ సఖ్యత వెనుక?

 

ఊరికి పోతే ముస్లిం అయినా సరే.. అదొక కులం కిందే లెక్క.

సమాజం అనేది కులాలతో కూడినది. గ్రామీణ వ్యవస్థను అది అంగీకరిస్తూ వస్తోంది. ముస్లిం కులాల్లోను ఉమ్మడి సంస్కృతి ఉంది. ఒక సారాంశంలో తెలంగాణలో గ్రామీణ ప్రజలకు అది ఒక కులమే తప్ప మతం కాదు.

 

వాళ్ల ఆరాధన విధానాలను బహుజన సమాజం ఆమోదించింది. ఈ క్రమంలో సంస్కృతికి సంబంధించి ఆదానప్రదానాలు కూడా ఉంటాయన్నది గమనించాలి. పరస్పర ప్రభావితమయ్యే అంశాలు ఉంటాయి. అది శూద్ర కులాలు ఆచరించినప్పుడు దాని పూర్వ రూపం కూడా మారుతుంది.

 

సమాజం-కులం-మతం మమేకమైనప్పుడు పరస్పర ప్రభావానికి లోనవడంలో పరస్పరం కలిసిపోతారు. పరస్పరం కలిసిపోయిన సమాజం తెలంగాణలో మనుగడలో ఉంది. ఆ మనుగడను విచ్చిన్నం చేయడానికి రాజకీయాలు ప్రయత్నిస్తున్నాయి.

 

Interview by- శ్రీనివాస్ సాహి, నరేష్కుమార్ సూఫీ

 

 

5 thoughts on “హృదయాన్ని కల్లోల పరిచేది వస్తువు కాదు శిల్పమే: కాసుల ప్రతాప్ రెడ్డి

  1. ఇంటర్వ్యూ బాగుంది కాసుల ప్రతాప రెడ్డి గారి సమాధానాలు బాగున్నాయి వారికి అభినందనలు మరియు adugu కు అభినందనలు

  2. చాలా విలువైన విషయాలు మాట్లాడారు.నిబద్ధత గురించి, సాహిత్య ప్రయోజనం గురించి, తెలంగాణ ముస్లిం సమాజం గురించి …. మంచి ములాఖాత్.అభినందనలు , అడుగు టీం…

  3. ” ముస్లింలను తెలంగాణా సమాజం మతస్తులుగా చూడదు, ఒక కులస్తులుగానే చూస్తుంది”
    Goid interview .

  4. ఒక ప్రత్యామ్నాయ మీడియా అనేది ఇప్పటి వరకు రూపుదిద్దుకోలేదు. అవును ఈ విషయాన్ని సీరియస్గా అందరూ ఆలోచించాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


   Type Comments in Indian languages (Press Ctrl+g to toggle between English and Hindi OR just Click on the letter)