కథ

                   హోమాయో ….

 

                        -బి.నర్సన్
         హోటల్ సుప్రియ గ్రాండ్ ముందు ఒకటే జన సందడి.
        క్లాసులకు బంక్ కొట్టి పగటి సినిమాలకు వెళ్లే బ్యాచులన్నీ హోటల్ ముందు చేరి సందడిని హై రేంజ్ కి పెంచాయి.
         హోటల్ అయిదో అంతస్తులోని బ్యాంకెట్ హాల్ లోని కిటికీలోంచి కింది దృశ్యాన్ని  చూసిన డాక్టర్ మోహన్ రావు గుండె నిండా ఊపిరి పీల్చుకొని సంతృప్తిగా వదిలాడు. మోహన్ రావు హెల్త్ క్యూర్ ఇంటర్నేషనల్    కు చైర్మన్ కమ్ మేనేజింగ్ డైరెక్టర్. ఆ సంస్థ దశమ వార్షిక పండుగను ఖరీదైన హోటల్ లో ప్లాన్ చేశాడు. ఈ రోజు అన్ని పేపర్లలో హెల్త్ క్యూర్ ఇంటర్నేషనల్ విజయోత్సవం తాలూకు ఫుల్ పేజి యాడ్స్ రంగురంగుల్లో వచ్చాయి.  పైసా ప్రచారంతో రూపాయి ఎలా సంపాదించాలో మోహన్ రావుకు పిల్లలు సెల్ ఫోనులో మేసేజ్ కొట్టినంత తేలికైన పని.
   ఫోన్ రింగ్ కావడంతో ఎత్తి ‘హలో’ అన్నాడు మోహన్ రావు.
    ‘సార్! వచ్చేస్తున్నాం!’ అని అవతలి వైపు గొంతు.
    దూరం నించి వస్తున్న తన లాండ్ రోవర్ కారును చూసి మోహన్ రావు లిఫ్ట్ వైపు నడిచాడు.
       కార్లో సినీ నటి అభిజ్ఞ పాండే వస్తోంది.
     ఈ మధ్యనే విడుదలై యువతరాన్ని ఉర్రూతలూగిస్తున్న సినిమాలో ఆమె హీరోయిన్ . మొదటి సినిమాలోనే పదిహేను ముద్దుల సీన్లలో నటించి యూత్ ఫాలోయింగ్ ను ఉదృతంగా పెంచుకుంది. ఖర్చు తక్కువ లాభమెక్కువని మోహన్ రావు ఉత్సవానికి ప్రత్యేక ఆకర్షణగా ఈమెను ఎంచుకున్నాడు.
    కారు హోటల్ గేటు దాటగానే పోలీసులు, హోటల్ సిబ్బంది జనం లోపలికి రాకుండా నియంత్రించారు.
  కారు దిగిన అభిజ్ఞ చేతిలో ఉన్న హెల్త్ క్యూర్ జెండాను ఊపుతూ ‘ ఐ లవ్ హెల్త్ క్యూర్..యూ టూ లవ్ హెల్త్ క్యూర్..’అంది నవ్వులొలుకబోస్తూ.
      అభిమానులు పట్టరాని ఆనందంతో ‘ఓ..’ అంటూ చేతులూపారు.
    ‘థాంక్యూ..’ అంటూ గాలిలోకి ముద్దులు విసురుతూ లోపలికి వెళ్లిపోయింది.
                                 **         **       **        **     **
     వేదిక వెనుకాల బ్యానర్ పై హెల్త్ క్యూర్ ఇంటర్నేషనల్ హోమియో హాస్పిటల్స్  అక్షరాలు బంగారు రంగులో మెరిసిపోతున్నాయి.
     ఆరోగ్య మంత్రి రాకతో సభ జ్యోతి వెలుగులతో ఆరంభమైంది.
    మంత్రి గారు మోహన్ రావుతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ, వైద్య రంగంలో ఆయన సేవలను, విజయాల్ని కొనియాడారు. యథావిధిగా తమ ప్రభుత్వం ప్రజల ఆరోగ్యం పట్ల తీసుకుంటున్న జాగ్రత్తలను, ముఖ్యమంత్రి ప్రకటించిన పథకాలను వల్లె వేసారు.
        ఇక మిగిలింది అసలైన వేడుక. అదే విజేతలకు బహుమతుల ప్రదానం.
      ఇద్దరు ప్రముఖుల చేతుల మీదుగా బహుమతులు అందుకుంటున్న సిబ్బందికి మహా ఆనందంగా ఉంది.
      చివరగా మోహన్ రావు బంపర్ బహుమతిని ప్రకటించాడు.
    స్టాండింగ్ ఒవేషన్ సందడిలో ఆరోగ్య మంత్రి, సినీనటి కలిసి డాక్టర్ సత్యంకు కారు తాళం చెవి ఆకారంలో ఉన్న పెద్ద అట్ట ముక్కను ప్రదానం చేశారు.
          గ్రూపు ఫోటోలు, సెల్ఫీలతో సక్సెస్ మీట్ ముగిసింది.
     అతిథులిద్దరిని సగౌరవంగా సాగనంపిన మోహన్ రావు విలేకరుల కోసం ఏర్పాటు చేసిన విందులో కూచొని రేపు పత్రికల్లో రావలసిన వార్తా విశేషాల గురించి వివరిస్తున్నాడు.
         సభా, మర్యాదలు ముగియడంతో  హాల్లోని ఉద్యోగులంతా ముచ్చట్లలో పడ్డారు.
         ‘సత్తిగా..నువ్ లక్కీరా ,వన్ ఇయర్ల ఐదు కోట్ల బిజినెస్ చేసి గిఫ్ట్ గా కార్ సంపాయించినవ్..’ అంటూ సత్యం భుజంపై గట్టిగా కొట్టాడు మహేష్.
          ‘అరె..కారెవనికిగావాలెర..దాంట్ల తిరిగె కెపాసిటీ మనకుందా.. టాపర్వి నువ్వే..కారు గిఫ్ట్ గ ఇస్తున్న అని ఎండీ సార్ చెప్పినపుడే అన్న.. కారద్దు, పైసలీయమని..ముందైతే అనౌన్స్ చేద్దాం..అటెనుక నీ ఇష్టం అన్నడు.పిల్లలకు స్కూల్ ఫీజు కట్టల్రా ఫస్ట్..’ అనుకుంట మహేష్ రెండు భుజాలపై చేతులు వేసాడు సత్యం ఇంకేం సంగతులు అన్నట్లు.
       మహేష్, సత్యం ఒక ఊరివాళ్లే, పైగా ఫ్రెండ్స్,క్లాస్ మేట్స్ కూడా. మెడిసిన్ కి ట్రై చేసి సత్యం బి హెచ్ ఎం ఎస్ తో తృప్తి పడగా, మహేష్ మాత్రం తండ్రి కోరికపై హోమియోపతి చదివాడు.. హాలులో ఉన్నవాళ్లంతా హోమియో గ్రాడ్యుయేట్లే. సొంతం ప్రాక్టీసు కుదరక కార్పొరేట్ హాస్పిటల్లో చేరిపోయారు.  నెలకు ఇరువై వేల జీతం, ఇరువై లక్షల బిజినెస్ టార్గెట్.  టార్గెట్ దాటితే బోనస్.
        లంచ్ అయినంక అందరూ వెల్లిపోగా ఎం డి తో కారు లెక్క తేల్చుకునేందుకు సత్యం ఒక్కడు మిగిలిపోయాడు. హోటల్ రిసెప్షన్ దగ్గర ఎండి కనబడ్డాడు. నాలుగు రాష్ట్రాల్లో ఉన్న ముప్పయి బ్రాంచిల్లో అనుకున్న దానికన్నా టార్గెట్స్ దాటడంతో సంతోషంతో కొద్దిగా పొంగినట్లున్నాడు.
          ‘సార్..’ అంటూ దగ్గరికి కెళ్లాడు సత్యం.
        ‘ఆ.. గుడ్ సత్యం.. కార్ రిటర్న్ చేస్తామంటే డీలర్ కొంత అమౌంట్ కట్ చేస్తానంటున్నడు..ఏం చేయాలో ఆలోచిస్తున్నా.’ అంటూ గదవ నిమురుకుంటూ దీర్ఘాలోచనలో పడ్డట్టు ఎం డి కాసేపు నటించి, ‘ఓ కే .. మంత్లీ నీ సాలరీ డబుల్ పేమెంట్ చేస్తా..కారు డబ్బుకు సరిపోయేదాకా..’ అంటూ జడ్జిమెంట్ ఇచ్చాడు.
          ఎన్ని నెలలు సార్ ‘ మొత్తం ఎంతస్తుందో లెక్కేసుకోడానికి.
        ‘ ముందో ఆర్నెల్లైతే తీసుకో..’ అని టాపిక్ కట్ చేయమన్నట్లు కొంత అసహనంగా అన్నాడు.
        ‘సరే..సరే..సర్ ‘ సత్యం కన్విన్స్ అయినట్లు తల ఊపాడు.
       ”మరో విషయం సార్..’అన్నాడు గాని చెప్పాలా వద్దా అని సత్యం మనసు తటపటాయిస్తున్నది.
       ఏమిటీ అన్నట్లు కనుబొమ్మలు ఎగిరేశాడు మోహన్ రావు.
      ‘సార్.. మన వెబ్ సైట్ల అన్ని నెగెటివ్ కామెంట్స్ వస్తున్నై’ తల దించుతూ మెల్లగా  అన్నాడు.
     మోహన్ రావు ముఖం రంగు మారింది. ఈ మాట తనతో అనడానికి వీడికెంత ధైర్యం అనుకున్నాడు. వెన్వెంటనే మనసు మార్చుకొని,సత్యం భుజంపై చేయి వేసి దగ్గర్లో ఉన్న సోఫా వైపు నడిచాడు.
     పక్కన కూచోబెట్టుకొని ‘ మీ ఫ్రెండ్స్ తో మన ట్రీట్ మెంట్ బాగుందంటూ కామెంట్స్ రాయించాలి’ అన్నాడు.
     ‘ఊర్కే ఎవరు రాస్తరు సార్.. ఏమైనా పేమెంట్ చేస్తే..’ అన్నాడు సత్యం.
     ‘ ఓకే .. దీని సంగతి నువు చూడు ‘ అంటూ మళ్లీ రిసెప్షన్ వైపు వెళ్లిపోయాడు మోహన్ రావు.
       మర్నాడే తనకు నిజామాబాద్ ట్రాన్స్ ఫర్ అయినట్లు సత్యం కు మెయిల్ వచ్చింది. ఏడాది క్రితం వరంగల్ లో బ్రాంచ్ తెరిసినట్లే ఇప్పుడు నిజామాబాద్ లో. బిజినెస్ పీక్ స్టేజికి చేరంగనే బదిలీ చేయడం ఎం డి కి అలవాటే.  బ్రాంచీల సంఖ్య తగ్గకుండా, బిజినెస్ లెవల్స్ కాపాడుకుంటూ, పాత బ్రాంచీలు మూసేస్తూ కొత్తవి తెరవడం గత నాలుగేళ్లుగా జరుగుతున్నదే.
        తన ట్రాన్స్ ఫర్ గురించి చెప్పేందుకు మహేష్ కు ఫోన్ కలిపాడు సత్యం.
             ‘మహిగా.. నాకు మల్లా ట్రాన్స్ ఫర్.. నిజాంబాద్ కు..’
            ‘మల్లో కార్ సంపాదియి.. ఎండి సార్ ఇగ నిన్ను ఊకోనియ్యడురా…’
             ‘ బ్రాంచ్ ఇనాగిరేషన్ కు ఫోన్ చేస్త.. రారా..’
             ‘అరె..నీకు చెప్పలే గదా..జాబ్ కు రిజైన్ చేస్తున్నరా..’
                 ‘అయ్యో..గట్ల..’
             ‘మా నాయ్న సంగతి నీకు తెల్సుగదర..టీచర్ గ చేస్కుంటనే పుస్తకాలు సదివి హోమియో వైద్యం నేర్సుకున్నడు. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలకు మందులు ఇచ్చి ఊర్లె పేరు కూడ సంపాయించిండు. ఇంట్ల ఒక్కల్లన్న క్వాలిఫైడ్ హోమియో డాక్టరుండాల్నని  ఖాయిష్ తోటి నన్ను ఈ కోర్సు చదువమన్నడు.   మొదట్ల హెల్త్ క్యూర్ లో చేరుడు ఆయనకు సుత ఇష్టమే ఉండె. మన హాస్పిటల్ ఎప్పుడైతే బట్టగుండు మీద ఎంటికలస్తయని..తెల్ల మచ్చలు పోతయని ప్రచారం మొదలువెట్టిందో ఆయనకు ఏదో డౌట్ అచ్చింది. ఆ నౌకరి ఇడిసిపెట్టి ఇంట్లనే ప్రాక్టీసు చెయ్యమని నా ఎనుక వడ్డడు.’ ఇదీ కత అన్నట్లు ముచ్చట ఆపిండు మహేష్.
         ‘సరేరాబై..నాకాచాన్సు లేదు..ఎండి ఫోన్ చేస్తున్నడు.. మల్ల చేస్త.’అంటూ కాల్ కట్ చేసాడు సత్యం.
        లోకల్ ఎమ్మెల్యే నిజాంబాద్ లో బ్రాంచి రిబ్బన్ కట్ చేసి రెండు వారాలే అయింది. బిజినెస్ బిజినెస్ అంటూ మోహన్ రావు సత్యం ను ఆగం పట్టిస్తున్నాడు.
       సత్యం ఫోన్ రింగయ్యింది.
      ‘గుడ్ మార్నింగ్ సార్..’ అన్నాడు ఎండి కాల్ రిసేవ్ చేసుకొని.
      ‘సత్యం.. నీ బ్రాంచి బిజినెస్ అబ్జర్వ్ చేస్తున్నా..ఇంకా ఇంప్రువ్ కావాలి..ఈ యేడాది నీకు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తాను..అక్కడి సినిమా హాళ్లలో కూడా యాడ్స్ వేయిస్తున్నా..’
    కుక్కలకు బొక్కలు వేసుట్ల మా సార్ ఫస్ట్ అనుకుంటూ సత్యం  ‘సరే సార్.. మన సైట్ చూశారా..మా ఫ్రెండ్స్ తో థర్టీ దాకా రివ్యూస్ పెట్టించాను. వాళ్ల్లకు పేమెంట్ చూడండి..’ అన్నాడు.
      ‘ఒకే..ఒకే..’ అవతలి వైపు ఫోన్ కట్ అయింది.
     దోస్తుల ముందు ఇజ్జత్ పోయేటట్టే ఉన్నదీ కథ అనుకున్నాడు సత్యం.
                             *   *   *   *  *
          రాంగోపాల్ కు ఇరువైఐదేండ్లు. పుట్టి పెరిగిన నిజాంబాద్ లనే ఉంటూ పక్క ఊర్లె టీచర్ గా పని చేస్తున్నాడు. ఇగ పెండ్లి చేసుకొమ్మని అన్ని దిక్కులనించి ఫోర్స్ మొదలైంది. రంగు రూపులున్నా రోజు రోజుకు పలుచబడుతున్న జుట్టు ఆయనను నిద్ర పోనీయడం లేదు. ఊర్లె  ‘చికిత్సకు ముందు చికిత్సకు తర్వాత ‘ అని హెల్త్ క్యూర్ హోర్డింగ్స్ చూసేసరికి ప్రాణం లేసచ్చింది.
              ఓ రోజు స్కూల్ నుంచి ఇంటికి పోతున్న రాంగోపాల్ ను హెల్త్ క్యూర్ గ్లో సైన్ బోర్డ్ రారమ్మని పిలిచింది. బైక్ పార్క్ చేసి మెట్లు ఎక్కంగనే డోర్ పక్కకు జరిగింది. లోపలున్న రిసెప్షనిస్ట్ ‘గుడ్ ఈవినింగ్ సర్.. వెల్కం టు హెల్త్ క్యూర్..’ అని స్వాగతం పలికింది. ఆమె రాంగోపాల్ వివరాలు రాసుకొని ‘ ‘డాక్టర్ తో మీ అపాయింట్ మెంట్ ట్వంటీ ఫిఫ్త్ ఈవినింగ్’ అంది.
        రోజులు లెక్క పెట్టుకుంటున్న రాంగోపాల్ కు ఉదయమే అపాయింట్ మెంట్ వివరాలతో మెసేజ్ వచ్చింది. స్కూల్ నుంచి వస్తూ దార్లోనే ఉన్న క్లినిక్కి వెళ్లాడు.
         వెయిటింగ్ రూంలో పది మంది దాక ఉన్నారు. అందరిదీ అదే సమస్య. గోడకున్న టీవీల హెల్త్ క్యూర్ విజయ గాథల పరంపర సాగుతోంది. కొత్తవాళ్లు ఆసక్తిగా చూస్తున్నరు. తెరపై దయాకర్ రెడ్డి బొమ్మ రాంగనే చూస్తున్న వారిలో ఓ కదలిక వచ్చింది.
           ‘ అరె.. మనూరి దయాకర్ రెడ్డే.. హైదరాబాద్ వోయి సినిమా యాక్టరైండు,ఈ నడుమ సీన్మాలు గూడ తీస్తున్నదట .’ అని ఒకరు అనంగనే ‘ఔనౌను ‘ అని అందరూ వంతు పాడినారు. దయాకర్ రెడ్డి హెల్త్ క్యూర్ వైద్య సేవలను మెచ్చుకుంటూ ‘హెల్త్ క్యూర్ ను నేను నమ్ముతాను, మీరూ నమ్మండి ‘ అని ఆగకుంట చెబుతూనే ఉన్నాడు.
             గంట తర్వాత రాంగోపాల్ కు డాక్టర్ దర్శనం దొరికింది.
            ‘ అయామ్ డాక్టర్ సత్యం.. థాంక్స్ ఫర్ ఆప్టింగ్ అవర్ ట్రీట్ మెంట్.. గుడ్ డిసిషన్ రాంగోపాల్ గారూ.. కూర్చోండి ‘ అని ఉపోద్ఘాతం చదివాడు డాక్టర్.
           రాంగోపాల్ ఆశగా, ఉద్వేగంగా చెబుతున్నదంతా సీరియస్ గా నోట్ చేసుకుంటూ డాక్టర్, పక్కనున్న బ్లాటింగ్ పేపర్ ను రాంగోపాల్ కు ఇచ్చి తలపై రుద్ది ఈయమన్నాడు.  కొద్దిసేపు రుద్ది ఆ కాగితాన్ని డాక్టర్ చేతిలో పెట్టాడు  రాంగోపాల్. కాగితానికి కొన్ని వెంట్రుకలు అంటుకొని ఉన్నాయి.  డాక్టర్ కాగితాన్ని, తన తలను అటూ ఇటూ తిప్పుతూ వాటిని పరిశీలించాడు. కొంతసేపు ఆ కాగితాన్ని మైక్రోస్కోప్ కింద పెట్టాడు. టేబుల్ మీదున్న సిస్టం మానిటర్ కెమెరాతో  ఆ కాగితంవి కొన్ని ఫోటోలు తీశాడు.
            అన్ని పరిశీలనల తర్వాత, పరిష్కారం దొరికినట్లు మొహం పెట్టి-  ‘ మీకు ముందుగా హేర్ ఫాల్ ఆపాలి. అది స్టేబుల్ అయినాక రాలిన జుట్టు స్థానంలో కొత్త వెంట్రుకలు వచ్చేలా ట్రీట్ మెంట్ చేయాలి. రాలిన వాటిలో ఫిఫ్టీ పర్సెంట్ వచ్చినా మీ ప్రాబ్లం సాల్వ్ అయినట్లే.’ అని డాక్టర్ రాంగోపాల్ కళ్లలో మెరుపును పసి గట్టాడు. మరోమాట మా ట్రీట్ మెంట్ వల్ల సెవెంటీ టు యైటీ పర్సెంట్ పేషంట్స్ బెనిఫిట్ పొందారు. ఐ స్ట్రాంగ్లీ హోప్ యు విల్ బి వన్ ఆఫ్ దెమ్ మిస్టర్ రాంగోపాల్..’ అంటూ డాక్తర్ మాటలతోనే వెంట్రుకలు మొలిపించాడు.
          ఇంకా చెప్పండీ అన్నట్లు చూస్తున్న రాంగోపాల్ తో డాక్టర్ ‘మీరు రెడీ అయితే మనం మిగితా ఫార్మలిటీస్ మాట్లాడుకోవచ్చు.’ అని డాక్టర్ అంతదాకా చిత్రంగా ఆడించిన చేతులని బల్లపై ఉంచాడు.
                         ఆ మాట కోసమే ఎదురు చూస్తున్నట్లు ‘ నేను రెడీయే’ అన్నాడు రాంగోపాల్  ఏమాత్రం తడుముకోకుండా.
                ‘ ఓకే ..గుడ్.. ట్రీట్ మెంట్ డ్యురేషన్ వన్ ఇయర్ ఉంటుంది.మీ కోసం ప్రత్యేకంగా మందులు తయారవుతాయి. ఒకరి మందులు మరొకరికి పని చేయవు. నెల నెలా మెడిసిన్స్ ఇస్తాము. వన్ ఇయర్ ట్రీట్ మెంట్ కి ట్వెంటీ తౌజెండ్ అవుతుంది.  సెపరేట్ మెడిసిన్ ప్రెపేర్ చేస్తారు కాబట్టి టోటల్ అమౌంట్ ఒకేసారి పే చెయ్యలి.’ అని ఆగాడు డాక్టర్.
          ఇరువై వేలతో జుట్టు సమస్య తీరబోవడం మహదానందంగా ఉంది రాంగోపాల్ కు.
                ‘సరే’ అంటూ డాక్టర్ రాసిచ్చిన స్లిప్ తీసుకొని రిసెప్షన్ లో కార్డ్ ద్వారా మొత్తం పేమెంట్ చేసి వచ్చాడు.  అప్పటికే డాక్టర్ ఒక నెల కోసం మందులు సిధ్ధంగా ఉంచాడు. మరో చీటిపై హెయిర్ ఆయిల్, షాంపూ, కండిషనర్ల వివరాలు రాసిచ్చి ‘ కౌంటర్ లో పే చేస్తే ఇస్తారు. ఆల్ ద బెస్ట్’ అంటూ చేయి కలిపి మరో పేషంట్ కోసం బజర్ నొక్కాడు.
                మూడు నెలలుగా టైం ప్రకారం మందులు వాడుతున్నాడు రాంగోపాల్. జుట్టు రాలడం యథావిధిగానే ఉంది. అదే విషయం డాక్టర్ కు చెప్పాడు.
             ‘ డస్ట్ ప్రాబ్లం అయివుంటుంది ‘ అంటూ మరోసారి జుట్టు షాంపిల్ తీసుకొని మైక్రోస్కోప్ కింద పరీక్షించి  ‘కొత్త మందులివి. వీటితో ప్రయత్నిద్దాం.’ అని ముక్తసరి సమాధానం ఇచ్చాడు డాక్టర్.
             మరో మూడు నెలలు గడిచిపోయాయి. రాంగోపాల్ సమస్యకు ఈ మందులతో పైసా ప్రయోజనం కనబడలేదు.
          ఈ ట్రీట్ మెంట్ సంగతేందో సీదా దయాకర్ రెడ్డినే అడుగుదామనిపించింది రాం గోపాల్ కు. దయాకర్ రెడ్డితో రాంగోపాల్ కు పరిచయం ఉంది. పైగా ఆయన బావమరిది రాంగోపాల్ కొలీగ్. నెంబర్ తీసుకొని ఫోన్ చేశాడు. ఫోన్ ఎత్తిన దయాకర్ రెడ్డి ‘ నేను షూటింగ్ లో ఉన్న. రాత్రికి ఫోన్ చేస్తా..’ అని కట్ చేశాడు.
 రాత్రి పది తర్వాత రాం గోపాల్ ఫోన్ రింగయ్యింది.
   కాల్ రిసీవ్ చేసుకోగానే ‘ ఆ.. మంచిగున్నవా రాంగోపాల్.. ఏం సంగతి.. నేను గుర్తుకచ్చిన..’ అనాడు దయాకర్ రెడ్డి ఆప్యాయంగా.
   ‘ఏం లేదు..మనూర్లె హెల్త్ క్యూర్ క్లినిక్ పెట్టిండ్రు గదా..అండ్ల నీ వీడియో చూయిస్తున్నరు. నువు దేనికి ట్రీట్ మెంట్ తీసుకున్నవని..’అని ఆగాడు రాంగోపాల్.
     ‘ఏహె..నేనేం ట్రీట్ మెంట్ తీస్కోలె..దాని ఎండి ఓసారచ్చి మీ ఊర్లె బ్రాంచి ఓపెన్ చేస్తున్నం రావాలె అన్నడు. అబ్రాడ్ షూటింగ్ ఉంది కుదురదు అన్న. ఓ రెండు మాటలు మాట్లాడాలె అన్నడు. సరే అన్న. అప్పడిదప్పుడు ఎనుక పెద్ద బ్యానర్ కట్టి ఓ స్లిప్ ఇచ్చిండు మాట్లాడుమని. ఏం మాట్లాడిన్నో గుర్తు లేదు.’ అని ఆలోచనల పడిన దయాకర్ రెడ్డి మళ్లీ మాట్లాడుతూ ‘రోజుకెంత మంది వస్తున్నరు.. ఎంత ఫీజు వసూలు చేస్తున్నరు అని వివరాలు తెలుసుకున్నాడు.
      ఫోన్ పెట్టేసిన దయాకర్ రెడ్డి తన ఊర్లో హెల్త్ క్యూర్ సంపాదనను మనసులోనే లెక్కేసుకున్నాడు. ఆదాయం కోట్లలో ఉందనిపించింది. రాంగోపాల్ ఫోన్ చేసి మంచి పని చేసాడనుకుంటూ దయాకర్ రెడ్డి ట్రేలో మోహన్ రావు విజిటింగ్ కార్డ్ ను వెతికి వెతికి పట్టుకున్నాడు.
      కార్డ్ లోని నెంబర్ కు ఫోను కలిపి తన గురించి చెప్పాడు.
      కొద్దిసేపటికి  ‘బాగున్నారా సార్ ‘ అంటూ మోహన్ రావు గొంతు వినిపించింది.
     ‘ నా వీడియో క్లిప్పింగ్ వాడుతున్నారట..ఒక్క మాటైనా చెప్పలేదూ..’ విసుగ్గా అన్నాడు దయాకర్ రెడ్డి.
     ‘మీ ఊర్లో మీకే పబ్లిసిటి కద సార్..’ అన్నాడు మోహన్ రావు మర్యాదపూర్వక గొంతుతో.
     ‘నాకెందుకయ్యా నీ పబ్లిసిటి.. ముందు దాన్ని ఆపేయ్..’ అనగానే మోహన్ రావు దార్లోకచ్చాడు.
     ‘కొంత పే చేస్తాం సార్ ‘ అన్నాడు మరో దారి లేక.
   ‘నాకు ట్వెంటీ ఫైవ్ లాక్స్ కావాలి ‘ అంటూ ఫోన్ పెట్టేశాడు దయాకర్ రెడ్డి.
                ***        ***      ***      ***
       ఆర్నెల్లయినా అలాంటి ఫలితం కనబడకపోయేసరికి రాంగోపాల్ కు నమ్మకం సన్నగిల్లింది.  ‘ఇరువై వేలు నీళ్లల్ల పోసినట్లేనా!’ అంటూ డాక్టర్ తో కొంత అసహనంగా మాట్లాడాడు. ఆయన మాటల్ని ఓపికగా విన్న డాక్టర్-  ‘నేను మొదటి రోజే చెప్పాను కదా.. సక్సెస్ రేట్ సెవెంటీ టు యైటీ పర్సెంట్ ఉంటుందని..’ అన్నాడు అప్పుడే అర్థం చేసుకొని ఉండాల్సిందిరా వెధవా అన్నట్లు మొకం పెడుతూ.
         గొణుక్కుంటూ విసురుగా వెల్తున్న రాంగోపాల్ వైపు డాక్టర్ సత్యం నిస్సహాయంగా చూస్తుండగా  ఫోన్ మోగింది. ఎండి సర్ అని గోల చేస్తోంది మొబైల్. ఫోనెత్తి ‘గుడ్ ఇవినింగ్ సర్ ‘ అన్నాడు ఓ చేత్తో నుదురు రాసుకుంటూ.
          ‘హాయ్ సత్యం.. బిజినెస్ తగ్గుతోంది..వాటీజ్ ద ప్రాబ్లం.?.’
           ‘ఔను సర్.. పేషంట్లు కొంత తగ్గారు..’ అని నసిగాడు సత్యం.
        ‘అయితే హోర్డింగ్స్ మార్చేద్దాం.. ఫెర్టిలిటి సెంటర్ అంటూ గర్భిణి స్త్రీల బొమ్మలతో ప్రచారం మొదలు పెడదాం.. సరేనా.. బి రెడి ఫర్ దట్ బిజినెస్..’ అంటూ ఫోన్ కట్ చేసాడు మోహన్ రావు.
         సరే అని తనలోనే గొణుక్కున్నాడు సత్యం .
        తల బరువెక్కి రిలాక్స్ కోసం మహేష్ కు ఫోన్ చేసాడు.
              ‘ఆ..మహిగా.. ఎట్లున్నవ్రా. .ఇక్కడ నా సావు దినాలు ఐతున్నయి’
             ‘ మంచిగున్నరా.. ఓన్ క్లినిక్ సక్సెస్ అయినట్లే..రోజూ కరీం నగర్ల చూసుకుంటూ శని, ఆది వారాలు జగిత్యాల పోతున్న. అక్కడ కూడ మంచి రెస్పాన్స్ ఉంది, వీక్ లాంగ్ క్లినిక్ కూడ నడుపచ్చు.’ అన్నాడు మహేష్ ఉత్సాహంగా.
               చటుక్కున మెరుపులాంటి ఆలోచన వచ్చింది సత్యంకు.
             ‘ అరేయ్ మహి..ఒక్కమాటరా..ఆ జగిత్యాల్ క్లినిక్ వీక్ లాంగ్ నేను రన్ చేస్తా.. ప్రాఫిట్ షేర్ చేసుకుందాం. .ప్లీజ్ రా..’
              ‘సరే..దాందేముందిరా..వచ్చేయ్..’ అని ఆహ్వానించాడు మహేష్.
      మరుక్షణమే ఎం డి పేరిట రిజిగ్నేషన్ లెటర్ టైప్ చేసేందుకు డాక్టర్ సత్యం కీ బోర్డ్ ను ముందుకు జరుపుకున్నాడు.
                                                                        ***

5 thoughts on “                   హోమాయో ….

  1. ఈ కథ హోమియో పేరిట జరుగుతున్న మోసాల్ని చక్కగా చెప్పింది. వినూత్న సామాజిక అంశంపై కథ రాసిన రచయితకు అభినందనలు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


   Type Comments in Indian languages (Press Ctrl+g to toggle between English and Hindi OR just Click on the letter)