ములాఖాత్

“అగ్రవర్ణ స్త్రీలే …. మా దళిత స్త్రీలకు మా మగోళ్ల కంటే, పెద్ద మగోళ్లు”

మాదాసు మేరీ వినోదిని కడప యోగివేమన యూనివర్సిటీ లో తెలుగు శాఖలో అధ్యాపకురాలు. విమర్శకురాలిగా,కథారచయిత్రిగా పదునెక్కిన దళిత మేధావి వినోదిని. కవిత్వం, కథ, నాటక, విమర్శ, పరిశోధన, యిలా అన్ని రంగాల్లో, దళిత బహుజన వాదాన్ని వినిపిస్తోంది. సూటిగా కరుకుగా , నిష్కర్షగా నిష్ఠూరంగా, తను నమ్మిన సత్యాన్ని ప్రకటిస్తుందీ యువ మేధావి. దళిత క్రిస్టియన్ జన జీవితాలను , నిష్ఠుర నిజాలను వాస్తవికతా వాద శిల్పంలో అక్షరీకరిస్తున్న వినోదినితో వెంకటకృష్ణ జరిపిన ముఖాముఖి.

-స్త్రీ వాదం మీద పరిశోధనతో మీ సాహిత్య కృషి ప్రారంభమై, స్త్రీ వాదాన్ని దళిత కోణం నుండీ విమర్శంచే వైపుగా సాగుతున్నట్టునిపిస్తోంది.  ఆవైపుగా మీ కృషి యేమిటి..?

*పరిశోధన స్త్రీ వాదంతో మొదలైంది నిజమే. స్త్రీ వాదం ముమ్మరంగా వస్తున్నప్పుడు నేను హైజాక్ చేయబడ్డాను. అది కాలమహిమ. అయితే అందులోంచీ చాలా త్వరగా బయటపడ్డాను. అది తృటీలో తప్పిన ప్రమాదం.  అలాంటి ప్రమాదాలను తప్పించుకోవాల్సిన విషయాన్ని గుర్తించి రాసిన కథే తప్పిపోయిన కుమార్తె, అది ఫిక్షన్ వరకూ. నా విమర్శా ప్రయాణాన్ని చెప్పాల్సివస్తే, స్త్రీ వాద సాహిత్యం యెంత పరిమితమైందో, స్త్రీ వాద విమర్శ కూడా అంతే పరిమితమైంది. అందుకే విమర్శ కొత్తకోణంలో సాగాల్సివుంది. స్త్రీ వాద సాహిత్యం లో సత్యదూరమైన పాత్రల/యితివృత్తాల మీద రాసింది స్త్రీ వాద విమర్శగా చెలామణి అయ్యింది. Existing charecter s మీద రాసింది చాలాతక్కువగా వచ్చింది.  ఆ పరిమితి నేను దాటాలనుకుంటాను. వేమన స్త్రీ లను విమర్శించిన విషయాన్ని మన విమర్శకులు దాటి వేసి, చలం స్త్రీని నెత్తిన పెట్టుకున్నారు. వేమన విమర్శించింది అగ్రవర్ణస్త్రీని మరి. నాదీ అలాంటి దృష్టే విమర్శలో.

2.ఎందుకు దళిత కవిత్వం తక్కువగా వస్తోంది. మీరూ తక్కువే రాసారు.?

 • నిజమే, వూపూ/ వెల్లువా కొనసాగలేదు. updations జరగలేదు. కారణం, అంబేద్కర్ ఆలోచనావిధానం ఆధారంగా దళిత భావజాలం విస్తృతంగా వ్యాపించనందుకే ననుకుంటాను. గొప్ప శక్తి వంతులైన మద్దూరీ  కలేకూరిల వారసత్వాన్ని అందుకునేవాళ్ళు కరువయ్యారు. మంకెన పువ్వులూ మరిన్ని విరబూయడం లేదు. ఇటీవల కొందరు రాస్తున్నారుగానీ‌, ప్రధాన స్రవంతి లో కలిసిపోయారు.  దళిత భావజాల updationతో రాయడంలేదు. ఈ స్థితి మారుతుందనే నమ్ముతా.

3. ఇనాక్ గారి ఊరబావి కీ మీ నాటిక దాహం లోని నీళ్ళబావికీ వస్తుగతమైన వున్నతీకరణ యేమిటి?

 • ఇనాక్ గారిది వైయక్తిక విజయం. గొప్పకథ, ఒక స్త్రీ వీరోచితంగా యెద్దుదట్టాన్ని సింగిల్ హాండెడ్ గా దించీ, కట్టీ వూరూ/వాడను సంచలనం చేస్తుంది. ఆ కాలంలో ఆ కథే రాయాలి. నా దాహం సామూహిక విజయం. వాడ వాడ వుమ్మడిగా నిలబడటం.యెదుర్కోవటం.

4. మరియ కథకూ,అత్త అంబేద్కర్ లా వుంది కథకూ పద్నాలుగేళ్ళ గ్యాప్ వుంది. యెందుకింత నిదానంగా రాస్తున్నారు?

*రాయటమైతే ఆపలేదు.అది నా బాధ్యత గా చూస్తాను.చాలా రాసాను గానీ ప్రచురణకు పంపడంలేదు.ఒకరకంగా చెప్పాలంటే కథలతో కెరీర్ ను నిర్మించుకోవాలని లేదు.ఆ వుబలాటమూ లేదు.అయితే నాదైన వస్తునిర్ధేశాన్ని పెట్టుకున్నా,తప్పకుండా రాస్తా.

5. కథలన్నీ కఠిన వాస్తవికతను చిత్రిస్తూ,వేదనతో ముగుస్తాయి, యీ స్థితి ని రద్దుచేయలేమేమోనన్న నిస్సహాయత కథలని నడిపిస్తోందా?

*అవును.వాస్తవికతే నా వస్తువు.సమకాలీన దళిత వాస్తవికతలో నిస్సహాయత రాజ్యమేలుతోంది.దళితుల పట్ల సమాజ దృక్పథం మారలేదు. Responsible సమాజం,ప్రజాస్వామ్య హామీ సమాజం యేర్పడనేలేదు.అందుకే నిస్సహాయత నే చిత్రిస్తూన్నా.మీరడిగిన ప్రశ్నలో,మార్క్సిస్టు దృక్పథం, అంటే కథలు పోరాటాన్ని చిత్రించాలికదా అనేది వుంది.నేనట్లా నమ్మట్లేదు.No promising events are happens to dalith society.అట్లా యేర్పడే వరకూ యిట్లానే కథ నిర్మాణం అవుతుంది. వాస్తవం కదా రాయాలి,అస్తిత్వం కదా చెప్పాలి.అందుకే యీ పద్దతిలో వున్నా.

6. ప్రియుడుకావాలి, కట్ట కథల్లో దళిత పురుషుల్ని కొంత విమర్శగా చూసినట్లుంది గానీ, దళిత పురుషున్నీ చూడటం మీ సాహిత్యం లో వుందా?

*పురుషాధిపత్యం దళితుల్లో లేదు.అది మా సమస్య కాదు.అందుకే దళితస్త్రీ వాద కవిత్వం తక్కువగా వస్తుంది. లేదా,ప్రభావవంతంగా రాదు. దళిత పురుషుడూ నిజానికి నిస్సహాయుడే.హిందూ అగ్రవర్ణాల కఠినత్వాన్ని యింకా అందుకోలేదు.అందుకోడనే నేననుకుంటాను.

7. మధ్య తరగతి లక్షణం దళిత పురుషుడిలోకి చొరబడలేదంటారా?

*మధ్యతరగతి లక్షణం దళిత పురుషుడిలోకి చొరబడలేదు.అట్లా classification చేయను,నాది castification.దళిత పురుషుడి కాస్టీఫికేషన్ లో కౄరత్వం లేదు.దళిత పురుషులంతా అంతకరెక్టా అనంటే,కాదనే అంటానుగానీ,మావాడిలోకి హిందూ అగ్రవర్ణాల మగాంశం అంతర్గతంగానే నిర్మాణం కాలేదు.వీళ్ళలో కన్పిస్తున్న negative things అన్నీ బ్రాహ్మనీయ మూలపు పైపై అంశాలే,అరువు తెచ్చుకున్నవి.అదికూడా కొందరే.

8. దేశవ్యాప్తంగా రైతు ఆత్మహత్యలపై వాళ్ళని సానుభూతి తో చిత్రిస్తూ కథలోచ్చాయి. అంత దుఃఖాంశంలోనూ అంత వ్యవస్థీకృత దుర్మార్గంలోనూ దళిత స్త్రీ వైపు నుండీ రైతును విలన్ గానే చిత్రించారు. యెందుకంత కఠినత్వం?

*ఆ కథ upper cast మగవాడూ వర్సెస్స్ దళిత స్త్రీ కథగా మాత్రమే చూడాలి.నేను అంతమాత్రంగానే చూసాను.మొత్తం రైతు ఆత్మల గురించి నా పరిధి కాదు.నేను చూస్తున్న దృశ్యం లోంచే నా దృక్పథం యేర్పడుతుందిగదా?అంతమాత్రంగానే చూస్తా.వాస్తవం అదే.నిస్సహాయ రైతు అయినంతమాత్రాన దళిత స్త్రీ ని వుదారంగా యేమీ చూడడు.అందులో ఆత్మహత్య చేసుకోబోయే రైతైనా విలనే.I count my expirience.

9. దళితుల మధ్యా ఇంటర్నల్ కాంట్రడిక్షన్ రాజ్యమేలుతోంది గదా, అదీ మీ కథావస్తువు కాలేదే?

*అది మాల-మాదిగల సమస్య.కేవలం రిజర్వేషన్ల సమస్య.అది కూడా నాకు సంబంధం లేదు. యెందుకంటే అది మాలమాదిగ మగవాళ్ళది. అందులో దళిత స్త్రీలున్నారని నేననుకోను. ఇంకో విషయమేమిటంటే నేను దళిత క్రిస్టియన్ ను, నాది రిజర్వేషన్ రీత్యా BC-c. నాది వాళ్ళకంటే పెద్ద సమస్య. వివక్షేమో SC గా యెదుర్కోవాలీ, ఫలితాలేమో BC గా పొందాలి. సాహిత్య పరంగా నాది క్రైస్తవ బోర్డర్ అందులోనే నాకథ. అలాంటప్పుడు మాలమాదిగల కాంట్రడిక్షన్ నాకథా వస్తువు కాలేదు.

10. అస్తిత్వవాదం గురించి, దళిత స్త్రీ వాద దశ గురించి యేమంటారు. ?

*అస్తిత్వవాద దశలగురించి మాట్లాడను.అది ఆయా సమూహాల జీవితానుభవాల్నుంచీ వొక్కోసారి ముమ్మరంగా, మందకొడిగా ప్రభావితం అవుతూండవచ్చు.దళిత వాదం మాత్రం యిప్పటివరకూ మాలమాదిగల కుల అస్తిత్వమం మాత్రమే.యింకా వూసులోకే రాని వందలాది sc వుప కులాల మాటేమిటీ.అది చర్చలోకే రావడంలేదు. ఇక దళిత స్త్రీ వాదం బలంగా రావడానికి దళిత పురుషుడిలో కౄరత్వమే లేదుకదా.

11. రాయలసీమ లో వుండబట్టి పదేళ్లు పైబడుతోందిగదా. రాయలసీమ యేమనిపిస్తోంది, మిమ్మల్ని యేమడుగుతోంది?

*రాయలసీమ చాలా వెనుకబడిన ప్రాంతం, చైతన్యం లో కూడా. యిక్కడ జనాలు రెండు రకాలు, రెడ్లూ, నాన్ రెడ్లూ-స్వభావంలో కూడా.  అంటే స్వభావంలో యిక్కడి మనుషులు ఫ్యూడల్ అవశేషానికి  Live examples. వీళ్ళలో ఆధిపత్యం యెంత వుందో, బానిసత్వం అంత వుంది. ప్రజాస్వామిక లక్షణాలు లేని యీగాలి నన్ను సఫకేట్ చేస్తోంది.

        ఇక సాహిత్య పరంగా చూస్తే చాలా అంశాలు రికార్డ్ కాలేదు. ఇక్కడి సాహిత్య-తెల్లపంచె కట్టుకొనీ, ముల్లుగర్ర పట్టుకొనీ పొలంగట్ల మీద తిరుగుతోంది లేదా వేటకొడవళ్ళు పట్టుకొని వెంటబడుతోంది. పొలంగట్ల లోపలా, వేటకొడవళ్ళ  అంచుల వెలుపలా తండ్లాడే మట్టిమనుషుల పాట్లు తక్కువగా రికార్డ్ అయ్యాయి. స్వామీ, వెంకటకృష్ణ లాంటి కొందరు రికార్డ్ చేసున్నా, రెండు గడ్రగొడ్డళ్ళ, వేటకొడవళ్ళ మధ్యా నలిగి తెగిపడిన కాళ్ళూచేతుల సాక్ష్యం సేకరించాలని నా ఆశ.

       యూనివర్సిటీ టీచర్ గా పిల్లలకు యీ విషయాల్ని అవగతం చేయించి, బానిసత్వ స్వభావం/ఆధిపత్య స్వభావం రెండూ వదిలింపజేయాలని నా ఆకాంక్ష.

                                                          

12.మీ కథలు బ్లాక్, కట్ట ల నేపథ్యం లోంచీ,యిప్పుడు దేశవ్యాప్తంగా వూదరగొడుతున్న స్వఛ్ఛభారత్ ను యెట్లా చూస్తారు?

*అదొక ఫార్సువ్యవహారం. సెలబ్రిటీలంతా చీపుర్లు పట్టుకొని ఫోటో ఫోజివ్వడం తప్ప యేమీ మార్పు తేదు. దీనివెనుక వున్న అసలు కుట్రేమిటంటే consciousగా మనమందరం జనాలకు తిరిగి కులం పుట్టుకను గుర్తు చేయించడమే. ఒక్క మ్యాన్ హోల్ ను యే సెలబ్రిటీ అయినా క్లీన్ చేసాడా, ఫోటో దిగాడా. మున్సిపాలిటీ, పంచాయతీ సఫాయీ చేస్తోంది ఒక కులంవాళ్ళే గదా,  దాన్నేమన్నా మారుస్తుందా యీ స్వఛ్ఛభారత్.

13 వినోదిని పూర్వదశలో స్త్రీ సమస్యల మీద యాక్టివిస్ట్ కదా యిప్పటి అకడమిక్ దశకూ ,పూర్వదశకూ తేడా యేమైనా గమనిస్తుందా?

*యాక్టివిస్ట్ దశకు చాలా లిమిటేషన్స్ వుంటాయి.యూనివర్శిటీ అకెడమిక్ దశ ఒక ప్రణాళిక తో నిర్మాణాత్మకంగా పనిచేయవచ్చు.యాక్టవిస్ట్ దశలో చాలా ఎమోషనల్ గా పూర్తీస్వేఛ్ఛగా చేసింది. యూనివర్శిటీ టీచర్ గా పిల్లలతో చైతన్య వంతంగా కొన్ని లిమిటేషన్స్ తో పనిచేయవచ్చనిపిస్తుంది.

14 హిందూత్వ రాజకీయాల పార్లమెంటరీ దశలో,ఆ స్పేస్ లో నమ్మకమున్నవాళ్ళ,ముఖ్యంగా దళితుల కార్యాచరణ యేమిటి ?

*దళితుల చైతన్యం సంఘటనాత్మక నేపథ్యంలో వుంటూ అంబేద్కరిజం ను లిమిటేషన్లోకి నెడుతోందని మీ ప్రశ్నలోని సారాంశం కావచ్చు,నిజానికి అంబేడ్కర్ ను మనసా వాచా నమ్మి ఆచరించే పార్టీపాలటిక్స్ కావాలి.నిజానికి నాకంత ఆశ లేదు.అది చలా సుదూర ప్రయాణం. యిప్పటి దళిత రాజకీయాల పరిస్థితి చూస్తే అది మరింత దూరప్రయాణమే.ఆ కార్యాచరణ కూడా యిప్పుడు నాకు లేదు.

15 కథా వస్తురీత్యా,భావజాలరీత్యా మీకూ చాసోకూ చాలా వ్యత్యాసముంది కదా ,చాసోఅవార్డ్ అందుకోవడంలో ఘర్షణేమీ లేదా ?

*ఏంలేదు.చాసోతో విభేదాలు వున్నాయిగానీ,చాలా దూరమైనవాడు కాదు.

16 మీ సాహిత్య స్ఫూర్తి, ప్రభావాల గురించి చెప్పండి..?

*పుస్తకాలు ప్రభావితం చేసిందానికంటే జీవితానుభవం నన్ను ప్రభావితం చేస్తుంది. పుస్తకాలు చదివి కథలు రాసామంటే నేను నమ్మను. మాయింట్లో అట్లాంటిట్లాంటి వాతావరణం వుండేది, అట్లాంటి గొప్ప సాహిత్య చర్చల్లోంచీ నేను రచయితనైనాను, అని యెవరైనా అంటే, కులాందో, కుటుంబాందో, వంశానిదో గొప్పలు చెప్పుకోవడమే. అస్తిత్వవాద సాహిత్యం రాయడానికి యెప్పటికీ జీవితమే స్ఫూర్తి.  సాహిత్యం చదవడం మనల్ని రచయితల్ని చేయదు, సాహిత్యం చదవడం మనకు మంచిచెడ్డల స్పృహనిస్తుందంతే.

17. మరి మీరు యిష్టపడే రచయితలూ, రచనలూ ?

*అందరూ యిష్టమే. నాదృష్ఠిలో అస్తిత్వవాద రచయితలందరూ యిష్టమే. అట్లా అని, అస్తిత్వవాద రచయితలని ముద్రపడినవాళ్ళంతా కాదు. ఏ రచనలిష్టమంటే, వేటికైతే Truthfully face వుంటుందో, originality వుంటుందో అవిష్టం. మాయాఏంజిలో, టోనీమారిసన్, తెలుగు పేర్లు చెప్పలేదే అనద్దండి. చాలామంది వున్నారు, యెవరివైతే గాఢపరిమళం పరివ్యాప్తం చేసే రచనలో అవి.

18. కవి ఖాజా ప్రభావం యేమాత్రముంది మీమీద ?

*ఫత్వా రాసిన ఖాజా అంటే చాలా చాలా ఆకర్షణ నాకు.

19. మనలోమనం కూ మట్టిపూలకూ వున్న వైరుధ్యమేమిటి?

*ఈ ‘మనం’ ఎవరు.మనం అనేది ‘ఎంతమనం’.ఆ పదమే వైరుధ్యం.కులపరంగా ‘మనం’ టీవరకూ తాగొచ్చు,మనం-కలిసి జీవితాన్ని పంచుకోగలమా అన్నంతగా…

20.  మనలోమనం,వాళ్ళలోవాళ్ళే అయినా,ప్ర.ర.వే గా మారి నిర్మాణాత్మక కృషి చేస్తూ,దళిత రచయిత్రుల సృజనను యెత్తిపడుతోంది కదా అలాంటప్పుడు వ్యతిరేకించడానికేముంది?

*అసలు నిర్మాణాత్మకత అంటేయేమిటి.కృషిని యెత్తిపడుతోంది అన్నారుగదా,హరిజనోధ్ధరణ గురించి గాంధీ మాట్లాడాడు,అదేసమయంలో అంబేద్కరూ మాట్లాడాడు,తారతమ్యం లేదంటారా.అదే తారతమ్యం ప్రరవే చేసే దళిత కృషిలోనూవుంది.అందులోకూడా ఆధిపత్యంవుంది.’వాళ్ళు బాగారాస్తారు’అనడంలోనే ఆధిపత్యం వుంది.వాళ్ళ నిర్మాణం లోకి కొన్ని essentials (ఎస్సెంషియల్స్)ను తెచ్చి నిర్మాణానికి వుపయోగించుకున్నంత మాత్రాన అది నిర్మాణం కాదు. వాళ్ళింటికి మమ్మల్ని పిలిచి మాట్లాడమన్నప్పుడు కండీషనయ్యే మాట్లాడతామా లేదా.వాళ్ళలో కొందరు వ్యక్తులుండవచ్చు-మాపట్ల కోర్ కన్సర్న్ తో వున్నవాళ్శు వున్నారు .అంతవరకే గానీ అది సంస్థ కాదు.
వాళ్ళు స్త్రీ సమస్యల మీద యే సారాంశాన్ని తీస్తున్నారు, పురుషాధిపత్యం ప్రధాన మనే సారాంశం. దాన్నే దళిత స్త్రీ లకూ ఆపాదిస్తున్నారు. నాది దానికి పూర్తిగా వ్యతిరేకమైన దృక్పథం.  దళిత స్త్రీ , స్త్రీ లలో భాగం కాదు, జెండర్ లో భాగం కాదు.  దళిత స్త్రీ, దళితుల్లో భాగం, దళిత పురుషుడితో పాటు అగ్రవర్ణ స్త్రీలే మా దళిత  స్త్రీ లకూ, మా మగోళ్శ కంటే పెద్ద మగోళ్ళు. కులం తాను ముక్కలం మేం, జెండర్ తాను ముక్కలం కాము.

21 మట్టి పూలు యెందుకు నిర్మాణాత్మక కృషి చేయట్లేదు?

* టైం పడుతుంది. టైం తీసుకోవడం అనివార్యం. నిర్మాణమే స్టీరియోటైప్ అయినప్పుడు దాన్ని మేం సాధించడం అవసరమా.

22 “వాళ్ళ”లో కొందరైనా ‘వ్యక్తు’లున్నారని గుర్తిస్తున్నారుగదా ,వాళ్ళనుండీ యేమాశిస్తున్నారు?

*వాళ్ళ మధ్యా internal discourse అవసరమనుకుంటాను. వ్యక్తులు పెరగాల్సిన అవసరాన్ని గుర్తిస్తాను. దళిత స్త్రీ ని అధ్యక్షురాల్ని చేసి ఆమెమీదుగా నిర్మాణం చేసామని గప్పాలుకొట్టుకొని , ఫోటోలు ప్రచురించుకొనే ఆధిపత్యాల్ని ఆపి, స్వఛ్ఛందంగా  హృదయాల్లోంచీ దళిత స్త్రీ ని చూడలేరా (అందుకు మీ కులాధిపత్యం అడ్డుకుంటుంది కదా) అని నా విమర్శ.
ప్రజాస్వామిక రచయిత్రులు కదా,అందులోంచీ కొందరు బయటికొచ్చేసారు,ఎందుకు వెళ్ళిపోయారో చర్చ యెందుకు చేయట్లేదు? నల్లని,కరుడుగట్టిన ఆ చీకటి రహస్యమేమిటీ? ప్రజాస్వామ్యమంటే అలాంటివి బయటపెట్టకుండా వుండటమేనా?మన చిన్నప్పుడు,మనల్ని వొంగోబెట్టి మనమీదయెక్కీ మన మిత్రులు జామకాయలు కోసుకోనేవాళ్ళు.అది గుర్తొస్తుంది వీళ్ళని గురించి ఆలోచిస్తే.అలాంటి ఆటలు ఆడకుంటే చాలంటాను.

                                                               

23 వినోదిని స్త్రీ వేదికలమీద అగ్రవర్ణ స్త్రీ లపై నిప్పులు చెరుగుతుందంటారు, రాజ్యమే లుతున్న పురుషస్వామ్య నేపధ్యంలో అగ్రవర్ణస్త్రీనీ సానుభూతి చూపాల్సిన అవసరం లేదంటారా ?

*వాళ్ళకీ సమస్యలున్నాయి.కుటుంబపరంగా,సామాజికంగా వాళ్శ సమస్యలు వాళ్ళకున్నాయి.వాటిమీద నాకు సానుభూతి వుంది.వాటిమీద పోరాటాలు రావాల,దాన్ని నేను ఆహ్వానిస్తాను. ఒక అస్తిత్వం లో వున్న వాళ్ళకి పక్క అస్తిత్వం లో వున్నవాళ్ళను సానుభూతిగా చూసే గుణం ఆ స్తితి  నేర్పుతుంది. అయితే కులం దాన్ని రద్దు చేస్తుంది.వాళ్ళు అంత పెద్ద సంస్థ నడుపుతున్నామంటారు గదా,వాళ్ళకి మైనారిటీ స్పృహ వుందా? వాళ్ళ ఫంక్షన్లను హిందూ పండగలతో రిలేట్ చేసుకుంటారు, అట్లా చేసుకునేప్పుడు అక్కడ వుండే మైనారిటీలు గుర్తొస్తారా? రారు. వాళ్ళది మెజారిటేరియన్ దృక్పథం. నా సమస్యలోంచీ చూసినప్పుడు వాళ్ల మీద సానుభూతి అవసరం లేదనుకుంటాను.

24. మీకథా సంపుటీ బ్లాక్ ఇంక్ బాగా ప్రచారమైంది, మీ కథా నిర్మాణాల రహస్యమేమిటి?

*నా దృష్టిలో ఆత్మకథ కథైంది. కథ ఆత్మకథైంది. నా అనుభవాల్లోంచీ యెన్నో పాత్రలొచ్చి నా ముందు నిలబడతాయి. నేను అక్షరీకరించేప్పుడు అవన్నీ నేనే అవుతాను. కథానిర్మాణమనేది సంప్రదాయ ఫ్రేమ్ కు సంబంధించింది ,కళాత్మక వ్యక్తులు గుర్తించేది. నాకథా రచన అందులోకి వొదగదు. మా అమ్మ మాట్లాడినట్లు నా వచనం సాగడమే నా కథాసంవిధానం. నేను కథ చెప్పడం ఒక దళిత తల్లి మాట్లాడే సంవిధానం.

                                                                                                    *@*

8 thoughts on ““అగ్రవర్ణ స్త్రీలే …. మా దళిత స్త్రీలకు మా మగోళ్ల కంటే, పెద్ద మగోళ్లు”

 1. వినోదిని గారితో చర్చ ఆవిడ దళిత సాహిత్య దృక్పధాన్ని బాగా తెలిపారు . ప్రరవే కు సంబంధించి మంచి అవగాహనే చూపించారు. ప్రరవే స్పందించవలసిన అవసరముందని నా అభిప్రాయం . ఇలాంటి చర్చ మిగిలిన అస్తిత్వ రచయిత్రుల తో కూడా చేయవలసిన అవసరం ఉంది.

 2. వినోదిని గారి ముఖాముఖిలో అస్థిత్వ చైతన్యాన్ని ఆత్మవిశ్వాసంతో ప్రకటించింది. కృతజ్ఞతలు

 3. వినోదిని గారి వ్యక్తిత్వాన్ని ఆమె ఆలోచన విధానా
  న్ని ఈ ముఖాముఖి ఆవిష్కరించింది.ఆమె ఆలోచన విధానం సరైనదే.

  ఆమె అన్నట్లు అగ్రవర్ణ స్త్రీలు ఆ దళిత మగోళ్ళ కన్నా మొగ దురహాంకారస్తులు.వైభిన్న శిల్పం ఆమె కథల్లో..చైతన్యం విచ్చుకున్న పువ్వు వినోదిని

 4. మంచి ఇంట‌ర్యూ కాని క‌ట్టె కొట్టె తెచ్చె అనే విధంగా ఉంది .. వినోదిని గారి డెప్త్‌ను పూర్తిగా ఆవిష్క‌రించ‌లేక పోయారు

 5. దళిత స్త్రీవాదానికి
  అగ్రవర్ణ స్త్రీవాదానికీ మధ్య విభజనకు స్పష్ణమైన నిర్వచనమిచ్చారు వినోదినిగారు
  Good interview

 6. వినోదిని గారు వ్యక్తపరిచిన అభిప్రాయాలు తెలుగు సామాజిక రాజకీయ సాంస్కృతిక రంగానికి చెందినవి.ఆయారంగాల మేధోజీవులు దీనిపై స్పందిస్తారని ఆశించడం అత్యాశేమీకాదు.అయితే ఆశ్చర్యంగా,స్పందించాల్సిన వాళ్లు స్పందించకుండా,వుండడం,అనేక విషయాల్ని సూచిస్తోంది.1.స్త్రీవాదుల డొల్లతనం.2.వర్గీకరణ డిమాండ్ లోని పాక్షికతనం 3.దళిత క్రైస్తవ రచయియితల/రచయిత్రుల క్రియారాహిత్యం 4. ప్ర.ర.వే అనబడే అగ్రవర్ణ రచయిత్రుల అహంకారం 5.ప్రరవేలో బోమ్మలైన యితర రచయిత్రుల నిస్సహాయత.
  మోత్తానకి యీ ముఖాముఖి తెలుగు సాహిత్యంలో ని చాలా విషయాల్ని బహిర్గతం చేసింది.వినోదిని యెవరు మా గురించి మాట్లాడ్డానికి అని ప్రరవే బాధ్యులు అనుకోవచ్చుగానీ ,వాళ్ళింతవరకూ చేసిన కార్యక్రమాల్లో యితరుల సహాయం వున్నప్పుడు,విమర్శ యితరులెందుకు చేయకూడదూ?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


   Type Comments in Indian languages (Press Ctrl+g to toggle between English and Hindi OR just Click on the letter)