Featured కాలమ్స్

సీమ బహుజన పుస్తకం… రాసాని సాహిత్యం-2

(గత వారం తరువాయి..)

ఈ క్రమంలో తన  ఇద్దరు కొడుకుల్నీ, మిత్రుడు దాసెగౌడనీ పోగొట్టుకుంటాడు బలభద్రి. ఇక అక్కడ ఉండలేక సొంతూరెళ్ళడానికి  మొహం చెల్లక భార్యా  ఇద్దరు కూతుళ్ళతో పీలేరు చేరుకుంటాడు. పెద్ద కూతురు జయమ్మను బావమరిది కిష్టప్పకిచ్చి పెళ్ళి చేస్తాడు. అల్లుడి ప్రవర్తనా తిరుగుబోతుతనం, పనీబాటాలేని సోమరితనంతో కూతురితో పాటూ తామూ క్షోభతో బ్రతుకుతుంటారు. అల్లుడితో రోజు కొట్లాటే. కిష్టప్ప కారణంగానే చిన్న కూతుర్నీ పొగొట్టుకుంటారు. ఉండటానికి  ఇల్లులేక,  ఆదరించేవాళ్ళూ లేక పెద్ద కూతురు వద్దంటున్నా వినకుండా తిరిగి తమ సొంతూరికి ప్రయాణమౌతారు వ్రుద్ధ దంపతులు. క్లుప్తంగా  ఇది కథ.

జి.కె. చెస్టర్ టన్ ప్రకారం ‘A good novel tells us truth about it’s hero, but a bad novel tells us truth about it’s author.’ ఈ ద్రుష్టితో చూస్తే ఈ నవల మొదటి కోవకు చెందుతుంది. బలభద్రికి సంబంధించిన సత్యాన్ని కళాత్మకంగా  ఏకరువు పెడుతుంది. అతని జీవన వాస్తవికత ఆధారంగా కరువు రక్కసి కోరల్లో చిక్కుకుని అతలాకుతలమైన  రైతు జీవన వాస్తవికతనీ, తద్వారా రాయలసీమ వాస్తవికతనీ బయట పెడుతుంది.  ఇందులోనే కుల, మత, వర్గ, సమస్యల్ని ట్రీట్ చేస్తూ పోతుంది. ‘Thinking means connecting things’ అని ఎవరో అన్న మాట ‘వలస’ నవలలో భౌతిక రూపు తీసుకుంటుంది.

 

రాయలసీమ కరువు క్రూరత్వం కేవలం పేదరికంలోనే లేదు. ఇది మనుషుల్ని నిర్ మూల వాసిత్వంకి గురిచేస్తుంది. ఒక సాంస్క్రుతిక న్యూనతకు గురిచేస్తుంది. బలభద్రికి గానీ అలాంటి సంచారత్వానికి గురయిన  ఎవరికి గానీ ఎదురవుతున్న ఈ సమస్యని రచయిత చక్కగా పట్టుకొచ్చాడు. బలభద్రి మాటల ద్వారానే రూట్ లెస్ నెస్ స్రుష్టించిన న్యూనతని వ్యక్తం చేస్తాడు రచయిత:

‘నేను పుట్టినప్పుడు మా నాయన బలభద్రి  అని పేరు బెట్టె. ఆ పుట్టి పెరిగిన ఊరి నొదిలేసి భద్రావతికి బోతే నన్ను సిత్తూరాయనా అండ్రి. దాన్నొదిలేసి ఈ ఊరికొస్తే… ఈడ భద్రావతాయనంట పిల్చిరి. యిప్పుడు  ఆ పేరే స్థిరమైపోయిండాది. రేపు మనం ఏ ఊరికి బొయినా పీలేరాయనా అంటారు. లోకం  నా అసలు పేరే మరిసిపోయింది, దాంతోబాటు నేనూ నా అసలు పేరు మర్చిపోతి గదా… అంతే  ఒకసారి పుట్టిన ఊరు వదిలేస్తే….. వోడి బతుకు గూడొదిలేసిన పచ్చే…’

-నవల చివర్లో ఈ మాటలు మాట్లాడిన బలభద్రి తన భౌతిక వాస్తవికతనే గాదు మానసిక వాస్తవికతని కూడా ప్రవేశపెడతాడు. కరువు, వలస గౌరవంగా బతికిన అడుగు రైతుల్నీ వారి కుటుంబ సభ్యుల్నీ ఇలా మూల రహితులుగా, అనాథలుగా చేస్తున్న దానికి బలభద్రి జీవితమే ఉదాహరణ. విపత్తుల్తో కలిసి జీవించే మామూలు మనషుల జీవితాల్లో రోజు దొర్లటానికి వాళ్ళు ఎన్ని సాహసాలు చెయ్యాల్సుంటుందో సూచించటమూ ఈ నవలలో ఉంది. భద్రావతిలో బలభద్రి కానీ,  ఆయన సహచరులుకానీ, ఇంకా గంగొజ్జు లాంటి వాళ్ళు కానీ  ఎలాంటి సవాళ్ళను  ఎదుర్కొంటూ తమ అస్తిత్వాన్ని నెట్టుకుంటూ వెళ్లారో నవల చిత్రిస్తుంది. ఈ క్రమంలో రచయితకున్న ఊహాశక్తి, కింది జనంతో ముడివేసుకుపోయిన పేగుబంధం అరుదయిన స్థాయిలో చదవరుల అనుభవంలోకి వస్తాయి. అన్ని బంధాల్నీ తెంచుకుని సువిశాల ప్రపంచంలోకి అడుగులు వేస్తూ బలభద్రీ, రాజమ్మ ముందుకు పోతూనే  ఉన్న చివరి ద్రుశ్యం బతుకు పట్ల  ఒక ఆశావహ ద్రుక్పథాన్నిస్తుంది.

ఒక నవలలో కల్పన అనేది కేవలం కథకి మాత్రమే చెందింది కాదు.  ఆలోచన చర్యగా అభివ్రుద్ధయిన పద్ధతిలోనే కల్పన ఎక్కువగా ఇమిడి ఉంటుంది. రోజువారీ జీవితంలో కనిపించని ఈ  పద్ధతే నవలను నవలగా రూపొందిస్తుంది. ఈ పద్ధతి ‘వలస’ నవలంతా పరుచుకుంది. నవలలోని ఎన్నో ఘటనలు అందుకు సాక్ష్యాలు. నవల తెరుచుకోవటమే అల్లుడితో బలభద్రి దంపతులు పడుతున్న గొడవతో మొదలవుతుంది.

ఈ చర్యకు  కారణమయిన   ఆలోచనలోకి  అక్కడినుంచి పాఠకుల్ని పట్టుకుపోతాడు రచయిత.. సొంతూరు నుంచి భద్రావతి వెళ్ళటానికీ, అక్కడి నుంచీ మళ్ళీ పీలేరు రావడానికి– చివరికి అక్కడా తెగతెంపులు చేసుకుని పయనమవ్వటానికీ– ఈ చర్యలన్నిటికీ సరయిన కారణాల్ని చూపించటంలోనే రచయిత ఊహ, కళావ్యూహం గోచరిస్తాయి.

 

తను వ్యక్తం చేస్తున్న జీవితం తాలూకు రంగునీ, రుచినీ, వాసననీ పట్టిచ్చే సాంస్క్రుతిక చిత్రణలో రాసాని దెప్పుడూ ముందడుగే. చేలల్లో కురవలు, గొల్లలు పాడుకునే జానపద గేయాలు, ఆయా స్థలాలకు చెందిన చిన్న చిన్న పురాణాలూ, ఆయా కులాల మూలాలకు చెందిన కథలూ నవలను సాంస్క్రుతిక పరిమళంతో నింపుతాయి. తాళ్లు పేనే పని, బొద్దులు కట్టడం, బావి మోకులు తయారు చెయ్యడం, సజ్జ అంబల్ని తయారు చెయ్యటం– వీటన్నింటినీ వాటికి చెందిన లోతయిన సమాచారంతో వర్ణిస్తాడు రచయిత. ఈ ధోరణే చిత్రితమయిన జీవితం సజీవంగా, సాధికారికంగా పాఠకుల్ని చేరడానికి కారణం. ఒక పక్క తాము వెనకబడిన జీవితాన్ని గడుపుతూనే మాలల పట్ల, మాదిగల పట్ల ఈ బహుజనులు పాటించే వివక్షను కూడా రచయిత చూపిస్తాడు. ”ఏమన్నో… మా యింటి కాడికి మాలోన్ని పంపిస్తినే… నలుగుర్లో బగిశీనం జేస్తివే నన్ను” అని వస్తున్న కోపాన్నణుచుకుంటూ బలభద్రి మడ్డినాయుడుతో అనడం  పట్టించేది ఈ సాంస్క్రుతిక వాస్తవికతనే. అలాగే తమని చూసి తోటి ఆడకూలీలు మాలోళ్ళనుకుంటున్నారని రాజమ్మ బాధపడటమూ ఇందుకు ఉదాహరణే. ఎంత పేదరికంలో ఉన్నా బీసీలు యస్సీల కంటే పైనున్నామనుకునే వారి మానసిక స్థితిని రచయిత నిర్మొహమాటంగా పట్టవ్వడం  ఇక్కడ గమనించొచ్చు. నిచ్చెనమెట్ల అసమానత్వం, శ్రేణీక్రుత  సంస్కృతి  ఇంత బలంగా వేళ్ళూనుకు పోయిన వ్యవస్థలో ఉమ్మడి ప్రయోజనాలు  దెబ్బతినే సందర్భంలో తమకు తెలియకుండానే అందరూ కలిసి ఐక్యంగా నిలబడిన సందర్భాలను కూడా రచయిత నవలలో చూపించాడు.

 

దు:ఖ సన్నివేశాలు రక్తి కట్టించటంలో రాసానిది అందెవేసిన చెయ్యి. సొంత పొలాన్ని అమ్ముకున్నాక బలభద్రి అనుభవించిన దు:ఖాన్ని అద్భుతంగా ఒడిసి పట్టుకున్నాడు. ”దు:ఖంతో అతని డొక్కలు  ఎగిరెగిరి పడుతున్నాయి” అన్న చిన్న వర్ణనతో బలభద్రి బాధ తీవ్రతని పట్టిస్తాడు. ఇదే నైపుణ్యం సంభాషణని నడపడంలనూ చూపిస్తాడు రచయిత. సంభాషణ పెద్దదయినా, చిన్నదయినా చదివే వాళ్ళు పూర్తిగా అందులో ఇమిడి పోగలిగే శైలి రచయిత సొంతం. చిత్తూరు జిల్లా పల్లె యాస, నుడికారం వాటి దిగంబర సౌందర్యంతో పాఠకుల్ని పలకరించి పలవరింపజేస్తాయి. ఏ పాత్ర ఆ పాత్ర బతుకును ముందుకు తీసుకెళ్ళగలగడమే పాత్రచిత్రణలో ఉండే ఔచిత్యం. తన స్వభావానికి భిన్నంగా ప్రవర్తించే ప్రమాదాన్ని తప్పుకునే మార్గమిదే. ఒక పాత్రలో మార్పు చోటు చేసుకున్న ప్రతిసారీ దానికున్న తప్పించుకోలేని కారణాన్ని చూపించగలగాలి. మార్పు వచ్చిన తరువాత కూడా వెనుకటి స్వభావం తాలూకూ నీడలు అన్నీ ఒకేసారి తొలిగిపోవు. ఈ స్ర్పుహ ఉన్న కారణంగానే  కెంపన్నలో వచ్చిన మార్పుకు బలమయిన కారణం చూపించగలిగాడు. కానీ కిష్టప్ప పశ్చాత్తాపంతో కళ్ళు తెరిచినా దాని తాలూకు మార్పు అతనిలో కనవడదు. వెళ్ళిపోయే అత్తామామల్ని  ఆపడు. రాజమ్మ ‘మాయ తెరలు’ తొలిగి పోయిన క్రమం అత్యంత సహజం. గంగొజ్జు పాత్రలో వచ్చిన మార్పుకూ ఈ సూత్రం వర్తిస్తుంది.

 

అనవసరమయిన నాటకీయత కోసం అర్రులు చాచకుండా జీవిత చిత్రణలో భాగంగానే క్రమానుగత ఉత్కంఠను రూపొందిస్తాడు రాసాని. నవలలో కనిపించే తిరుగుబాటు సన్నివేశాలు అందుకే అసహజంగా కనిపించవు. చూపిస్తున్న జీవిత విస్తృతి వెనక నీడలా నడిచే విశాల నేపథ్యం పాఠకుల స్పృహలోకి పోవడంతోనే రచయిత విజయం ఎక్కువ పాళ్ళు ఆధారపడి ఉంది. కనుక రాసాని ఇక్కడ సంపూర్ణ విజయం సాధించాడని చెబుతున్నా. ఈ నవల చదువుతూంటే  ఒక వైపు నుంచి నామిని ‘మునికన్నడి సేద్యం’ మరోవైపునుంచి Steinbeck ”The Grapes of Wrath” మదిలో మెదలినా వాటినుంచి మానసికంగా, సాంస్కృతికంగా  ఇది భిన్నమయిన కళాఖండం. తాత్వికంగా మాత్రం వాటితో ఈ నవలకు ఆశక్తి దాయకమయిన పోలిక పోటీ రెండూ కనిపిస్తాయి. విశాల అర్ధంలో ఇదొక సీమ బహుజన బతుకు పుస్తకం.

-జి. లక్ష్మి నరసయ్య

 

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


   Type Comments in Indian languages (Press Ctrl+g to toggle between English and Hindi OR just Click on the letter)