Featured కథ

                                          అస్త్రసన్యాసం

– మన్నె ఏలియా

ఒకప్పుడు ఈ బంగాళా ఊరికి దవుకాన , బడి , గుడి , పంచాయతి , బాటసారులకు ఆశ్రయం .అన్ని ఇదే . ఎప్పుడు చూసిన మందితో కళకళాడుతుండేది . మా ఊరిలో పెద్ద బంగ్లా .రెండంతస్తుల మేడ .ఎన్నోఏండ్లు ఊరికి ఉపకారం చేసింది .

పెద్దబాపుకు పిల్లలు లేరు .చిన్న బాపు పిల్లలు విదేశాల్లో వుంటున్నారు .ఈ ఊరంతా వారికి జీవితాంతం రుణ పడివుంది.

పెద్ద బాపు ,చిన్న బాపు అన్నదమ్ములు . వీళ్ళను పేరుపెట్టి ఎవరు పిలువరు . వాళ్ళ అసలు పేర్లు చాలమందికి తెలియదంటే నమ్మండి. ఆ ఇద్దరు మా ఉరికి పెద్ద దిక్కు .  ఆ కాలం లో చదువుకున్నోల్లు వీళ్ళే . ఊరంతా వీళ్ళమీద ఆధార పడ్డది.

దట్టమైన అడవి మధ్యలో ఉన్నది  మా ఊరు. మాకు  దవుఖాన లేదు . ఇప్పడికి రోడ్ లేదు. చుట్టూ ఎత్తైన గుట్టలు ,ఏండ్లనాటి చెట్లు ,గల గల పారే  సెలయేర్లు ఎటుచూసినా అడివే. ఏ మొక్కనుచూసిన అది ఏదో రోగానికి ఔషదం .

చలి కాలం విపరీతమైన చలి . ఎన్ని బొంతలు కప్పుకున్న చలి తట్టుకోవడం కస్టమే.

చిన్న బాపు జ్యోతిశాస్త్రంలో దిట్ట. ఆయన ముహూర్తమ్ నిర్ణయిస్తే తిరుగే వుండదు .

పెద్ద బాపు ఆయుర్వేద విద్యలో అందెవేసిన చెయ్యి . ఏ రోగమచ్చిన మేము ఎక్కడికి వెళ్ళేవాళ్ళం కాదు . నయా పైసా ఖర్చు అయ్యేదికాదు . పాము కాటుకు ఎందరో బలి కావల్సినవాళ్ళను కాపాడిన పుణ్యాత్ముడు. అందుకే ఎంత పనివున్నా వూరిడ్సిపోరు .ఏ రాత్రి తలుపు తట్టిన లేస్తరు .. వాళ్ళ మాటకు ఎదురుండదు .అలాగని ఏనాడూ పెద్దరికం చలాయించినట్టు ఎవ్వలనంగా వినలేదు. ఇద్దరు దేవుల్లూ మాకు .

ఊరికి పర్లాంగు  దూరంగున్నా  చేనులో  నిన్నటి రోజు భోజన్నపటేల్  పనిజేస్తుండగా  పాము కుట్టింది. జీతగాడు పరుగెత్తుకుంటు వచ్చి, పెద్ద బాపుకు చెప్పిండు . “నేను మందు తయారీ చేసుకొని వస్తా ..వాగు దాటి రావద్దు విషమెక్కువైతది . అరేయ్ నువ్వు జల్ది పోయి ఇటు తీసుక రావద్దని చెప్పు”అన్నాడు  .  జీతగాడు వెళ్లి పోయాడు .

మిద్దె మీదెక్కి మందుల సంచి లోని ఆకులను, వేర్లను  వెదికి గబా గబా తీసి మందు తాయారుచేసుకొని దిగిండు  . వాకిట్ల   చూరుకిందున్న చెప్పులు తొడుక్కుంటున్నాడు.

బయటనుండి అప్పుడే ఇంటికి వస్తున్నా తమ్ముడు చిన్న బాపు అడ్గిండు “బొప్పా !  ఏటో బయలు దేరినవు ?”. విషయం చెప్పిండు . “వద్దు . నువ్వెల్లద్దు”  అని కళ్ళు మూసుకొని చెప్పిండు .

“అదెట్లా కుదురుతది .నీకేమన్నా పిసపట్టిందా ?నేను పోక పొతే వాడు సచ్చి పోతడు ” అనుకుంటూనే  మందుల సంచి భుజం మీదేసుకొని వాకిలి దాటిండు .

“నా మాట విను . నేనెందుకు చెపుతున్ననో ఆలోచించుకో”  చిన్నబాపు వారించిండు.

“అంత ఆలోంచే వెళ్తున్న, నేనుండగా మనూర్లె ఎవ్వలికి ఏమి కావద్దు’’. వేగంగా నడచుకుంటూ ఊరు దాటిండు .            చెరువు గట్టు ఎక్కినడుస్తుండు . అంత దూరం నుండే ఎడ్లబండి కనిపించింది . పటేల్ను ఎడ్ల బండిలో పండుకో బెట్టుకొని వస్తున్నాడు జీతగాడు. చెరువు గట్టు దిగేలోపు బండి రానే వచ్చింది . పెద్ద బాపు “ఏమైందిరా ?నేనే వస్తానని చెప్పిన గదరా . ఇటెందుకు తెస్తున్నావు ?” అని అడ్గిండు.

జీతగాడు బండి ఆపేసిండు . కండ్లల్ల నీళ్ళు మెరిస్తున్నాయి . “బాపు !బోజన్న పటేలు చచ్చి పోయిండు .” అని బోరున  ఏడుస్తున్నాడు .

పెద్ద బాపు గట్టిగా కండ్లు మూసుకుండు . దీర్ఘ శ్వాస పీల్చి వదిలిండు .  కండ్లల్ల నీరు చెలిమె లాగా వూరుతున్నాయి .జల జల రాలి కింద పడ్డాయి .

జీతగాడు “అయ్యా ! తమరేమిజేస్తరు .అయన ఆయుస్సు గంతే రాసుంది” . అంటూ బండి కదిలింది.      చిన్న బాపు చెప్పింది యాదికచ్చింది .గుండెల్లో గునపం పెట్టి పోడ్చినట్టయ్యింది . వెనుకకు తిర్గి చెరువు గట్టేక్కిండు .

జీతగాడు వెనక్కి తిరిగి చూసేసరికి చేతిలోని సంచిని  ఒకసారి నొసలుకు ఆనించుకొని , కుడి చేతితో గిర గిర తిప్పి   చేర్లోకి విసిరేసిండు . అయోమయంగా జీతగాడు కొద్దిసేపు బండి ఆపి చూసిండు.

చెరువు తూము కింద మొఖం కాళ్ళు చేతులు కడుక్కొన్నాడు . దోసిట్ల నీళ్ళు తీసుకొని తల మీద జిలకరించుకున్నాడు . సర్వం కోల్పోయినోడిలాగా తల కిందికేసుకొని మెల్లగా నడుసుకుంటూ వస్తున్నాడు . గట్టుమీది నుండి ఊరును ఒక్కసారి చూసిండు .గట్టు దిగి కట్టా మైసమ్మ గుడి దాటిండు.ఇంటికి వెళ్ళాలనిపించడం లేదు .వూరు చొరుదలకు రెండు చింత చెట్లున్నాయి . వాటి కింద కూర్చున్నాడు . ఏమి ఆలోచించిన …తను తీసుకున్న నిర్ణయమే సరియైనదని పిస్తోంది . ఎండకు చెట్టు కింద నీడ చల్లగుంది .మనసు అల్లకల్లోలంగుంది.  చల్లని గాలికి నిద్ర ముంచుకొచ్చింది. తలమీది రుమాలు తీసి తలగడగా పెట్టుకొని ఒరిగిండు .క్షణాల్లో నిదుర ఆవరించింది .

****

బోజన్న శవం ఇంటికి చేరింది .

ఊర్లె అందరిది ఒక్కటే చర్చ “ఇన్నెండ్లల్ల పాము కుట్టినోల్లు ఎవరు చావలేదు . అదంతా పెద్ద బాపు పుణ్యమే .ఇయ్యల్ల ఏమైందో ఏమో మరి …భోజన్న తల రాత . గట్లున్నది . ఎవలేమి జేస్తరు ?”.

ఊర్లె అందరు  వ్యవసాయదారులే  .పాములు సహజమే .పెద్ద బాపు బతికిస్తడనే దీమా . ఎటు విన్న చని పోయిన ఆయన కంటే పెద్ద బాపును గురించిన  చర్చనే ఎక్కువ జరుగుతుంది .

****

భోజన్న ఆఖరి చూపు కోసం చిన్న బాపు వచ్చిండు .

పందిరి కింద పడుకోబెట్టిండ్రు భోజన్నను. అందరు ఏడుస్తున్నారు .గొడ్డు లాగ కష్టపడి ఆరుగాలం పనిచేసేటోడు . ఇయాలటి తోని ఈ బూమికి ఋణం తీరింది .ఓ  పెద్ద మనిషన్నాడు .

చిన్న బాపు అటు ఇటు చూసి దూరంగా నిల్చున్న జీతగాడిని పెద్ద బాపు గురించి  అడిగిండు . వాడు జరిగింది చూసింది వివరంగా చెప్పిండు .

చిన్న బాపులో ఆందోళన మొదలైయ్యింది .భోజన్న చేను వైపు బయలు దేరిండు .మధ్యల కల్సిన వాళ్ళను అడ్గిండు . తెల్వదన్నారు .ఇంకొద్ది దూరం నడ్చిన తర్వాత …. వూరు చివరనున్న చింతలకింద పడుకొని కనబడ్డాడు .

దగ్గరికెళ్ళి “బొప్పా ! బొప్ప ఏమైందే గీడ పన్నవు?పా …లెవ్వు ఇంటికి పోదాం పదా” అని దండ పట్టి లేపిండు. మెల్లగా లేచిండు . చిన్న బాపు మొఖం చూస్త లేడు. కండ్లల్ల నీల్లను రెప్పలు మూసి బయటకు కనబడ నీయలేదు .కండ్లు ఎర్ర బడ్డాయి . మళ్ళి అడ్గిండు చిన్న బాపు . “ఏమైంది .” సమాధానం మౌనమే . ఏమి లేదన్నట్టు తల అడ్డంగా ఊపిండు . తలకు రుమాలు  చుట్టుకొన్నాడు . ఇద్దరు మౌనంగానే ఇంటికి చేరుకున్నారు .

రాత్రి పక్క పక్క మంచాలనే పడుకున్నా ఎవరు ఎప్పటి లాగ మాట్లాడుకోవడం లేదు.

తెల్ల వారింది .

వుండ బట్ట లేక “ బొప్పా ! నిన్న ఏమైందే ! మందుల సంచి చెర్ల పడేసినవట .ఎందుకట్లా చేసినావు?” అడ్గిండు చిన్న బాపు.

“ఇంకా అదెందుకు రా ?ఇన్నేండ్ల నా అనుభవంలో ఇట్ల ఎన్నడు జరుగలేదు . నన్ను ఊర్లె అందరు నమ్ముకొన్నారు . నువ్వద్దన్నప్పుడన్నా ఆగేదుండే .ఆగ లేదు .ఇక ముందు దాని అవసరం  లేదు . ఇంకెపుడు రాదు . నిన్నటితోని మునుపటి పెద్ద బాపు సచ్చి పోయిండు . నన్ను  ఎవలు గూడా నమ్ముకోవద్దు . జీవితంలో ఏ మందులు పోయనని నిర్ణయించుకున్నా” తన నిర్ణయాన్ని గట్టిగ తెలియజేసిండు .

ఆ నిర్ణయం చిన్న బాపును కదిలించింది . “నా జ్యోతిష్యానికి తిరుగు లేదని నమ్మకంతొ చెప్పాను .కాని ఇంతటి కఠిన పరిస్థితి వస్తుందని వూహించలేక పోయాను .మరి అదెందుకు తెల్సుకోలేక పోయాను? .నా వల్ల ఊరికి ఇంతటి ప్రమాదం సంభవిస్తుందని ఆలోచించలేదు . నేను చెప్పక పోయుంటే ఎంతో మంది ప్రాణాలకు భరోసా వుండేది .ఇదంతా నా వల్లనే జర్గింది . నా వల్ల జరిగిన ఘోరమే ఇది  . నా జ్యోతిష్యం ఎవరి ప్రాణాలను కాపాడ లేదు . ప్రాణాలు కాపాడే బొప్పని చేతులు కట్టేసింది.

ఇదంతా పాములు తిరిగే ప్రాంతమే. ఈ నష్టాన్ని ఎలా పూరించేది . అన్న మాటమీదా నిలబడే మనిషి . ఇప్పుడేమి చేయ్యాలి ? ఇన్ని రోజులు ఎవరికోసం పనికి వచ్చిందో వాళ్ళకే శాపంగా మారింది .ఇంకో వ్యక్తీ లేడు. ప్రజల ప్రాణాలు కాపాడడానికి .నా జ్యోతిష్యం ఏవేని బతికించదు ” మనసులోన మదన పడ్డాడు .

“బొప్ప వూరి బాగుకోసం మల్లోకసారి ఆలోచించు నీ నిర్ణయాన్ని వాయిదా వేసుకో ” అని రెండు చేతులు జోడించి ప్రాదేయ పడ్డాడు .

“వీల్లేదు ” అంటూ ఇంట్లోకెళ్ళి ఆరాం కుర్చీలో కండ్లు మూసుకొని కూర్చున్నాడు .

చిన్న బాపు తన గదిలోకి వెళ్లి బట్ట ముల్లెలో కట్టున్న  జ్యోతిష్యాస్త్ర గ్రంథాల్ని , పంచాగాన్ని తన దగ్గరున్న  అన్నింటిని  తడిమి చూసి ఒక్కొక్కటి తీసి గుండెలకత్తుకొని అలాగే పట్టుకొన్నాడు.

***

కుర్చీలో మౌనంగా కండ్లు మూసుకున్న పెద్ద బాపుకు బావిలో ఏదో పడ్డ చప్పుడు వినిపించింది . ఉలిక్కి పడి కండ్లు తెర్చి పరుగు పరుగున ఇంటి ముందున్న బావి వద్దకు వెళ్ళాడు .

ఏదో పడేసి వస్తున్నా చిన్న బాపు కనబడ్డాడు .

“ఏమైందిరా చిన్నోడా” అడ్గిండు .

తల కింది కేసుకొని ఇంట్లోకి వెళ్ళిండు చిన్న బాపు . బావిలోకి తొంగి చూసిన పెద్ద బాపుకు నీళ్ళమీద తేలుతున్న కాగితాలు వెక్కిరిస్తు ప్రశ్నిస్తన్నట్టుగా దర్శన మిచ్చాయి .

 

 

One thought on “                                          అస్త్రసన్యాసం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


   Type Comments in Indian languages (Press Ctrl+g to toggle between English and Hindi OR just Click on the letter)