షాయరీ

THE BLACK HOLOCAUST

 

(బొమ్మ- అక్బర్)

 

బక్కపల్చని నల్లని నోటు
వయసుడిగి రక్తం చెడి….
శాపమోచనం చెంది
ముసలోని ముసలమ్మ లాగా….
ATMల ముందు తల బాదుకుని
దుఃఖిస్తూంది….
సంతోషంగా వుండి ఉంటాడు
రాముడు.

పురుగుల మందుకు కూడా
కార్డే కావాల్నా గణజన నాథుడా…
ఓటేసిన నా చెయ్యి
ఐదో కాలు అయిపోయిందా
పార్లమెంటు గేటు ముందు తెగిపడిందా
నా నల్లని పేగు
నల్లని కరెన్సీ లాగ
కనబడుతుందా
తెగ్గొట్టండయ్యా
సంతోషంగా ఉంటాడు రాముడు

జీవ రైతువా నాయనా నువ్వు
సన్నకారు సోనా మసూరి బియ్యానివా
జొన్న అంబలివా
బెల్లం బట్టీలో నలిగే నల్లని ఈగవా
నలిపి తీసేయండి
సంతృప్తినిస్తాడు
తండ్రీ …
రాముడు

దేశ భక్తి నా అంతరంగ యోగం
అడ్డా మీద నిలబడి ఉన్నాను
నాకూ….
చీమలకు దోమలకు ఎలుకలకు
నల్లని సకల జీవరాసులకూ
IDలూ RTGS లూ సేవింగ్స్ ఖాతాలూ లేవు
నాకు కూడా
బతికే హక్కు లేదు.
చంపెయ్యండి….
రాముడు హాయిగా నిద్రపోతాడు.

దేశ భక్తి నా రక్త ప్రవాహం
బయటకి కనబడదు చిదానంద సూక్తి
నా శోకాలల్ల కములుతూనే వుంటుంది
నా కాయకష్టంగా
నల్లగా కారు చీకటిగా
సూనృతంగా
నేను ప్రదర్శనకు పనికిరాను
రాముడికి తెలిసే ఉంటుంది.

జన మేధాలకు అన్ అకౌంటబుల్
అయినోడికి
జెండా చేతికి ఇచ్చిన చేతులు
అవి చేసిన నల్లని యుద్ధాలు
కొట్టుకు పోయే అవయవాలు
నల్లగా నల్లమందలుగా
నల్లని కోటి కనుగుడ్ల
చిన్ముద్రలు
కనబడుతూనే ఉంటాయి
నా సకల జన రాముడికి
ఆద్యంత వాసి రాముడికి……

-సిద్ధార్థ
19-12-2016

(ఫోన్.నం–73306 21563)

One thought on “THE BLACK HOLOCAUST

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


   Type Comments in Indian languages (Press Ctrl+g to toggle between English and Hindi OR just Click on the letter)